Nadichedevudu   Chapters  

 

68. ప్రస్తుతులు

''అపర శంకరులు''

కంచికామకోటిపీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీస్వాములవారు దివ్యజ్ఞాన సంపన్నులు. భూతభవిష్యద్వర్తమానజ్ఞులు. విజ్ఞులు. అపరశంకర స్వాములు. ఒకప్పుడు నా అకాలమృత్యువును పోగొట్టినవారు. వారికి నేను ప్రత్యహము వ్యాసునకు వలె మానసికారాధనను చేస్తూ ఉంటాను. వారి పాదయుగ్మం సర్వదా నా శీర్షాన ధరిస్తారు.

కవిసార్వభౌమ, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి

''నిరంతర సిద్ధులు''

శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీస్వామివారు నిరంతరసిద్ధులు. జగత్ప్రసిద్ధులు. జగత్కుటుంబులు. కంచికామకోటిపీఠాధ్యక్షులు. వారి ప్రవర్తన మనం అర్థం చేసికోడం కష్టం.

శ్రీ స్వామివారు రామకృష్ణాద్యవతారములవలె, ఆదిశంకరుల వలె అపూర్వమైన తేజోవిశేషమని నేను నమ్ముతున్నాను.

ఇది నా సంగృహీతమైన అభిప్రాయము.

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి

'స్వామి జీవిస్తున్న కాలంలోవున్న మనం ధన్యులం'

మనలను కటాక్షించడానికి స్వామి మన దగ్గరకే రానక్కరలేదు. కోటానుకోట్ల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు కమలాన్ని వికసింపచెయ్యడా? అలాగే స్వామికూడా.

రాముడూ, కృష్ణుడూ జన్మించిన కాలంలో జీవించినవారు పుణ్యాత్ము లంటారు. అలాగే, స్వామి జీవిస్తూ ఉన్న ఈ కాలంలో ఉన్న మనమంతా ధన్యులం!

- శ్రీ కృపానంద వారియర్‌

''బహుముఖులు''

శ్రీచరణులు చమత్కృతి ప్రధాన సంభాషణచతురులుగా, చారిత్రక పరిశోధకులుగా, వివిధభాషాతత్వవిదులుగా, న్యాయవేత్తగా, రాజకీయ విశారదులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తగా, మహోపాసకులుగా, మంత్రశాస్త్ర మర్మజ్ఞులుగా, యోగీశ్వరులుగా, ధర్మదేవతగా, ఆధ్యాత్మవిదులుగా, దేశికులుగా, ఆప్తబంధువులుగా, వాచంయమిగా, - వివిధరూపాలతో గోచరిస్తూ ఉంటారు.

- శ్రీ హరి సాంబశివ శాస్త్రి

''స్వామి అనుగ్రహమహత్త్వం అపారం''

స్వామి కరుణా విశేషం వలన అనిర్వాచ్యానుభవం పొందాము.

వారి చూపుతో జీవుని అహంకార బంధాలు తొలగినవి. వారి కన్నుల యందలి ఆత్మచైతన్యమే మాలో భాసించింది. ఈ చర్మచక్షువులతో అనిర్వచనీయమైన ఆ సౌందర్యం దర్శించడానికి సాధ్యమవుతుందా?...వారి అనుగ్రహ మహత్త్వ మపారం.

- గ్రీసురాణిమాత రాణీ ఫ్రెడరికా

''అందరి సమిష్టి రూపమే స్వామి''

వయోధికుడైన ఈ వ్యక్తి ఎవరు? ఈయన కొక పేరూ, ఊరూ, ఉండవచ్చు. ఈయన వయస్సు ఇంత అని మనం లెక్కకట్టవచ్చు. కాని, ఆయన అందరి సమిష్టి రూపంగా కనిపిస్తున్నారు. ఇక, ఆయన వయస్సా? మనిషి ఏనాటి నుండి భావనాకాశంలో విహరించడం ఆరంభించాడో, అప్పటినుంచి గణించాలి ఆయన వయస్సును. తన విశ్వాసం కొరకై సర్వమూ త్యజించిన త్యాగధనుడాయన!''

- డాక్టర్‌ ఆల్బర్టు బి. ఫ్రాంక్లిన్‌. (అమెరికన్‌ కాన్సల్‌ జనరల్‌)

''ఏమా వశీకరణశక్తి!''

స్వామి ప్రశాంతత, ఆయన నవ్వూ నన్ను ఆకర్షించాయి. అట్టి అమాయకమైన నవ్వును నా జీవితంలో నే నెన్నడూ చూచి ఎరుగను. ఆ నవ్వులో ఏదో సమ్మోహనం, ఏదో ప్రేమశక్తి ఓతప్రోతంగా ఉన్నాయి.

ఆయన ముఖమండలంలో ఒక దైవత్వం స్ఫురిస్తుంది. అఖండమైన జాలీ, అనురాగమూ ఉట్టిపడే ఏసుక్రీస్తు ముఖాన్ని చిత్రాల్లో చూచి ఆశ్చర్యపడ్డాను. కాని, ఈ వశీకరణశక్తి వాటిలో ఉన్నదా?

స్వామి పెదవులపై ఒక చిరునవ్వు మొలిచింది. దానితో ఆయన ముఖం శిశువదనంగా మారింది. ఆ మందస్మితం ఇంత వరకు నే నెక్కడా చూడలేదు. అసాధారణమైన మాధుర్యం, ఆ సమ్మోహనం ఏమని చెప్పగలను?

వర్తమానకాలంలో ఆధ్యాత్మికమార్గంలో కామకోటిపీఠాధీశ్వరుని ప్రభావం అనుపమానం.

- ఆర్థర్‌ కోయిస్లర్‌. ' Lotus and the Robot' 'గ్రంథకర్త'

''మానవులలో మహోన్నతులు''

మనదేశంలో జన్మించిన ఎందరో మహాపురుషులను గురించీ, జ్ఞానులూ, భక్తులూ, సిద్ధులను గురించీ మనం విన్నాము. చదివాము. కాని, అట్టి మహనీయులు ఒకప్పుడు జీవించి ఉన్నారని నేటి ఆధునికులలో అనేకులు నమ్మరు. మనం విన్నవీ, మనం చదివినవీ అతిశయోక్తులనీ, కల్పనాకథలనీ వారు భావిస్తారు.

అయితే, అట్టి మహానుభావులు మనదేశంలో జన్మించారని రుజువు కావాలంటే, ఆదిశంకరులు స్థాపించిన కంచికామకోటిపీఠంలోని 68వ ఆచార్య పురుషులు, అదృష్టవశంచే మన కళ్ల ఎదట నేడు ప్రత్యక్షంగా కానవస్తున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారిని చూడవచ్చు.

ఈకాలంలో మన మతానికి వాటిల్లుతున్న ప్రమాదం పరమతాల వల్లకాదు. హిందూమతంలో ఉన్న వివిధ శాఖల వల్లనూ కాదు. పాశ్చత్యనాగరికతా వ్యామోహితులై, భారతీయసంస్కృతిని కోలుపోయి, అవిశ్వాసంతో సతమతమవుతున్న ఈనాటి యువతరం కారణంగానే ఈ ప్రమాదం సంభవిస్తున్నది.

ఇంకా సర్వవ్యాప్తం కాకుండా ఈ ఆపదను అరికట్టి, ఆధునికసంఘాన్ని సక్రమపథంలో సంస్కరించి, వేదమతాన్ని పునరుద్ధరించడానికై పరమేశ్వరుడు ఆదిశంకరులను మరొక రూపంలో - శ్రీ కామకోటిపీఠం అరవైఎనిమిదవ ఆచార్యుని రూపంలో అవతరింపచేశా రనడానికి అనుమానం లేదు.

ఈ మహనీయుడు నేటి మానవులలో మహోన్నతుడు.

- టి.యం. నారాయణ స్వామి పిళ్లె

(అన్నామలై విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు)



Nadichedevudu   Chapters