Nadichedevudu   Chapters  

 

67. 'నన్ను నిజంగా గుర్తించావా?''

- శ్రీ నుదురుమాటి వెంకటరమణశర్మ

శ్రీ చల్లాశేషాచల శర్మగారు కృష్ణాజిల్లా గురజాడ గ్రామవాసులు. వీరి ధర్మపత్ని సావిత్రమ్మగారు. శ్రీ శర్మగారి పూర్వులు శ్రీవిద్యోపాసకులు.

శర్మగారు ఉయ్యూరులో కె.సి.పి.షుగర్‌ ఫ్యాక్టరీలో కో ఆపరేటివ్‌ స్టోర్సులో బిజినెస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 1960 శ్రీ శర్మగారు సకుటుంబంగా కంచికి వెళ్లి, సమీపగ్రామమైన 'అంబి'లో కామకోటిపీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారిని సందర్శించారు.

అంతకు పూర్వం శ్రీమతి సావిత్రమ్మగారు చాలాకాలం నుండి అకారణంగానే మానసికంగా భయభ్రాంతి నొందుతుండేవారు. ఒకనాటి స్వప్నంలో ఆమెకొక యతీశ్వరులు దర్శనమిచ్చి, అభయముద్రను చూపి, అంతర్థానమైనారు. ఆ స్వామి ఎవ్వరో అంతకుపూర్వం ఆమెకు తెలియదు. నాటి నుండి ఆమెకు ఆ మానసిక భయం పోయింది. 'అంబి' గ్రామంలో తాను దర్శించిన కామకోటిపీఠాధిపతులే, లోగడ తాను స్వప్నంలో చూచిన యతీశ్వరుడుగా ఆమె గుర్తించి, ఆ విషయమంతా శ్రీవారికి నివేదించుకున్నది.

'నన్ను నిజంగా గుర్తించావా?' అంటూ శ్రీ స్వామివారు చిరునవ్వుతో రెండు మూడు మారులు ఆమెను ప్రశ్నించారు. నాటి నుండి వీరి కుటుంబం శ్రీవారి చరణారవిందాల శరణు పొందింది. 1967-1968 ఆంధ్రదేశపర్యటన సందర్భంగా శ్రీ స్వామివారు సపరివారంగా గురజాడ వచ్చి శ్రీ శర్మగారి ఇంటిలోనే నివసించారు.

1970 ప్రాంతంలో శ్రీ శేషాచలశర్మగారికి మశూచికం వచ్చి, జ్వరంతో చాలా బాధపడ్డారు. ఒక రోజు తీవ్రమైన బాధకు లోనై, శ్రీ స్వామి వారి చిత్ర పటం ముందుంచుకొని శ్రీ లలితాసహస్రనామపారాయణ చేయవలసిందని భార్యతో చెపుతూ, ఆపస్మారక స్థితిని పొందారు. శర్మగారి శరీరం చలవలు కమ్మింది. బంధుమిత్రులంతా వచ్చి ఆందోళన చెందారు. ఇంతలో చిత్తరువులో ఉన్న స్వామివారు నిజస్వరూపంతో బయటికి వచ్చి ఆ దంపతుల ననుగ్రహించారు. వెంటనే శ్రీ శర్మగారికి స్పృహ వచ్చింది. కొలది కాలంలోనే వారు సంపూర్ణ ఆరోగ్యవంతు లైనారు.

శ్రీ శర్మదంపతులు ఇలాంటి దివ్య విభూతుల నెన్నిటినో దర్శించారు.



క్రైస్తవమతంలో జన్మ ఒక్కటే

క్రైస్తవమతం పాపానికి, దుఃఖానికీ కార్యకారణ సంబంధాన్ని ప్రతిపాదించదు. అందరూ పాపులే అనీ, క్రీస్తును నమ్మడం ద్వారా వారు తమ పాపాలను క్షాళనం చేసుకొనవచ్చుననీ ఆ మతం చెబుతున్నది.

క్రైస్తవ మతం ప్రకారం ప్రస్తుత జన్మ ఒక్కటే మానవులకు లభించింది. ఈ జన్మలో ముక్తివస్తే వచ్చినట్టు, లేకపోతే అధోగతే. పూర్వ జన్మగాని, పునర్జన్మగాని లేవు.

Nadichedevudu   Chapters