Nadichedevudu   Chapters  

 

63. ఇదంతా స్వామి కటాక్షం

- శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి

జగతీ మవితుం కవితాకృతయో

విచరన్తి మహా మహసశ్ఛలతః.

'గురుదేవులు జగద్రక్షణకై ఒక ఆకారం ధరించి ఏదోఒక నెపంతో ప్రపంచం అంతటా తిరుగుతుంటారట.'

అదేవిధంగా శ్రీ కామకోటి పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీ చరణులు దేశసంచారం చేస్తూ లక్షలాది భక్తులను అనుగ్రహించారు.

1952లో ఒకనాడు స్వప్నంలో స్వామివారు నాకు దర్శనమిచ్చారు. స్వయంగా మా యింటికి దయచేశారు. గురుపాదుకలను అందజేసి నన్ను బ్రహ్మానందభరితుణ్ణి చేశారు. నాడు మొదలు నేటి వరకూ నన్ను కంటికి రెప్పవలె కాపాడుతున్నారు.

* * *

పూర్వాచారాన్ని అనుసరించి నా కుమార్తెకు కన్యావివాహం చెయ్యాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. కాని, అట్టి సంకల్పం కలవారు ఈ కాలంలో అరుదుగా ఉండడంచేత వెంటనే కార్యసిద్ధిగాక, ఆలస్యం జరుగుతూ వచ్చింది. అప్పుడు నేను శ్రీవారి అనుగ్రహం వల్లనే ఈ కార్యం నెరవేరాలని తలచి వారినిగట్టిగా స్మరించాను.

స్వామివారు మా వియ్యాలవారికి స్వప్నంలో కనిపించారు. నా కుమార్తెను వారికి చూపించి, ఈ సంబంధం చేసుకోవలసిందిగా సూచించారు. అంతేగాక, తమ సమక్షంలో కన్యాదానం జరిగినట్టుగా కూడా స్వప్నంలోనే ఉభయులనూ అనుగ్రహించారు.

ఇది జరిగి వారంరోజులు గడవకుండానే, మా వియ్యాలవారూ మేమూ వివాహం శుభప్రదంగా జరుపుకున్నాము.

ఇది స్వామివారి అవ్యాజకరుణ తప్ప వేరొకటి కాదు.

ఇదే విధంగా నా రెండవకుమార్తె వివాహ సందర్భంలో కూడా, తమ పిల్లవానికి మా పిల్లను చేసుకుంటామని వాగ్దానాలు చేసినవారు కాలవిలంబం చేయసాగారు. నేను శ్రీవారి అనుగ్రహం పైనే ఆధారపడ్డాను.

మా వియ్యంకుని వేరొక వ్యాజంపైన మా యింటికి వచ్చేటట్టు చేసి, వారంరోజుల లోపల మా రెండవఅమ్మాయి పెళ్లి జరిగేటట్టు స్వామివారు అనుగ్రహించారు.

ఇదంతా స్వామి కటాక్షమే!

* * *

అనంతానికి చిహ్నమేది?

అంతంలేని వాడు అనంతుడు. ఒకటి, రెండు, మూడు అంటూ సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది. మరి, అనంతానికి చిహ్నమేది? పారార్థ్యాన్ని (Infinity) ఏ సంఖ్యతో చూపడం?

Nadichedevudu   Chapters