Nadichedevudu   Chapters  

 

61. 'నా యోగక్షేమాలు శ్రీవారే తీర్చి దిద్దుతున్నారు'

-- శ్రీ మాగంటి మధుసూదనరావు

కీర్తిశేషులైన మా తండ్రి శ్రీ మాగంటి శ్రీరాములుగారు పూర్వం విజయవాడ, రాజమండ్రి పట్టణాలలో కలప వ్యాపారంచేసి లాభాలు గడించారు. విజయవాడలో దక్కన్‌ టింబర్‌ డిపో మా వ్యాపారకేంద్రం.

నేను విజయవాడ, మద్రాసు, బొంబాయి పట్టణాలలో చదివి పట్టభద్రుణ్ణి అయాను. ఎల్‌.ఎల్‌.బి పట్టా కూడా సంపాదించాను. కాని న్యాయవాద వృత్తిలో ప్రవేశించాలనే అభిలాష ఎన్నడూ నాకు లేదు.

చిన్ననాటి మిత్రులు గోపి, మురళి ద్వారా కంచిస్వామి వారి సంగతి విని, వారిని దర్శించాలని అనుకున్నాను.

1962 లో ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు నా సహాధ్యాయి, శ్రీ వెంకటేశ్వర్లును తోడుతీసుకుని, తంజావూరు దగ్గర కావేరినది తీరంలో కల్యాణపురంలో మకాం చేస్తున్న స్వామివారిని దర్శించడానికి వెళ్ళాను.

నేను మాగంటి వంశీకుడనని, మేము కమ్మవారమనిచెప్పగా, ''కమ్మ వారిని చౌదరులని కూడా అంటారు. తెలుసా?'' అని అడిగారు శ్రీవారు.

నేను వారి వద్ద సెలవు తీసుకుంటున్న తరుణంలో, శ్రీవారు హిందీలో ''దిల్‌ కోలాహై'' ( నీ హృదయం తెరుచుకుంది) అన్నమాటలు మరపురానివి.

ఆ పిమ్మట దాదాపు పదిసంవత్సరాలు నేను కాంట్రాక్ట్‌ వ్యాపారం చేశాను. పెద్దగా లాభించలేదు.

విజయవాడలో మా తండ్రిగారి కలపవ్యాపారం కూడా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో బీహార్‌ రాష్ట్రంలో గనుల త్రవ్వకంలో నిమగ్నమైన ఒక మిత్రుడు తనతో నన్ను భాగస్వామి కమ్మని ఆహ్వానించాడు.

బీహార్‌కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, కంచి వెళ్ళాను.

శ్రీవారితో ఏకాంతంగా అర్థగంట సంభాషించే అవకాశం లభించింది.

నేను బీహార్‌లో మైకా గనుల వ్యాపారం చేయబోతున్నానని చెప్పగా స్వామివారు ఖండితంగా ''బీహార్‌ వెళ్ళవద్దు, సొంతంగా ఏదన్నా చేసుకో'' అని అన్నారు.

కొంతకాలం గడిచిన తరువాత శ్రీవారిని చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో దర్శించాను. ఎల్‌.ఎల్‌.బి పట్టా ఉంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ప్రవేశిద్దామని అనుకుంటున్నానని శ్రీవారితో చెప్పాను. ''ఎల్‌.ఎల్‌.బి. ఎప్పుడో పాస్‌ అయావుకదా?'' అని అంటూ ''పిల్లలు ఎంతమంది నీకు?'' అని అడిగారు శ్రీవారు.

నాకు ముగ్గురు కుమారులు అని చెప్పగానే, శ్రీవారు, ''ముగ్గురూ ప్రయోజకులవుతారు. అందరూ క్షేమంగా ఉంటారు.''అని సెలవిచ్చారు.

గత మూడు దశాబ్ధాల నా జీవితంలో, నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, స్వామివారు నా పట్ల కనబరిచిన వాత్సల్యాన్ని, వారి అనుగ్రహాన్ని స్మరించి ముగ్ధుణ్ణి అవుతుంటాను.

నా యోగక్షేమాలు శ్రీవారే తీర్చిదిద్దుతున్నారన్న విశ్వాసం నాకు కుదిరింది. ఇదొక జన్మాంతరం విశేష ఫలానుభవప్రాప్తి అని తలుస్తాను.

Nadichedevudu   Chapters