Nadichedevudu   Chapters  

 

60. 'సాక్షాత్తు భగవంతుడే!'

-- శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు

(కంచిస్వామివారిచే ప్రభావితులైన శ్రీ వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్‌ నగరంలో రెండు దేవాలయాలను నిర్మించి, వాటిని సక్రమంగా పరిపాలించడమే గాక, ఎన్నో పుణ్యకార్యాలకు సహాయం చేస్తున్నారు. ఎందరో పండితులను సత్కరిస్తున్నారు.

అన్నిటిని మించి, స్వామివారి ఆదేశానుసారం 18 పురాణాలకు తెలుగు అనువాదాలు చేయడమనే మహత్కార్యాన్ని సాధిస్తున్నారు. ఇంతవరకు ఏ దాతగాని, ఏ సంస్థగాని తలపెట్టని బృహత్ప్రణాళిక ఇది. ఇది ఒక్కటి చాలు శ్రీ వెంకటేశ్వర్లుగారి పేరు చిరస్థాయిగా చేయడానికి.)

పూజ్యశ్రీ కంచికామకోటిపీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం నాకు 1962 సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాంగుడిలో లభించింది.

''భవిష్యత్తులో నీవు ఉన్నతస్థితికి రాగలవు'' అని శ్రీవారు న న్నప్పుడు ఆశీర్వదించారు. అది మొదలుకుని నేటి వరకు స్వామి వారే నన్ను కంటికి రెప్పవలె కాపాడుతున్నారు. అంతేకాదు, నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టిపునాది వేశారు.

భక్తులను అనుగ్రహించుటలో శ్రీవారి ప్రభావ మెట్టిదో సూచించే నా అనుభవాలను కొన్నిటిని ఈ సందర్భంలో పేర్కొంటాను.

1968లో స్వామివారు హైదరాబాద్‌ మకాంలో ఉన్నప్పుడు స్కందగిరి, పద్మరావునగరులో, కంచికామకోటిపీఠం పక్షాన శంకరమఠ మొకదానిని నిర్మించడానికి సంకల్పించారు. హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పేరుగల కంట్రాక్టరులు ఎందరో ఉన్నారు. అయినా, స్వామివారు నన్ను పిలిపించి, ఒకనెలరోజులలో మఠం నిర్మాణం పూర్తికావాలనీ, వెంటనే ప్రతిష్ఠ జరగాలనీ ఆదేశించారు.

ఆ మరుదినమే శ్రీవారి కరకమలములతో మందిరానికి శంకుస్థాపన జరిగింది. నెలరోజులు కాదు సరికదా, 21 రోజులలోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపు దాల్చింది. అంత స్వల్పవ్యవధిలో అంత నేత్ర పర్వంగా ఆ మందిరం పూర్తి కావడం ఆశ్చర్యకరం. స్వామివారే అందరి హృదయాలలో ప్రవేశించి, నన్ను కేవలం నిమిత్తమాత్రంగా ఉంచి, అందరిచేతా అన్ని పనులూ తామే చేయంచారనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.

అనంతరం, కొద్దిరోజులకే శ్రీ వెంకటేశ్వరస్వామిఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నేలమట్టానికి కట్టుబడిచేసిన, తరువాత దానిని పూర్తి చేయలేక ఆపివేశారు. గత్యంతరం లేక, ధర్మకర్తలు శ్రీ కంచికామకోటిస్వామికి తమ పరిస్థితులు నివేదించుకుని తమ పని సానుకూలమయ్యే ఉపాయం అర్థించారు. వెంటనే శ్రీవారు నన్ను పిలిపించి, 15 రోజులలో తాము హైదరాబాదు నుండి బయలుదేరుతున్నామని, అంతకు లోపల ఆలయనిర్మాణం పూర్తికావాలనీ ఆజ్ఞాపించారు. స్వామి ఆదేశం అనుసరించి పదునాల్గవ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తి కావడం, విగ్రహప్రతిష్ఠ జరగడం తటస్థించింది. శ్రీవారి సంకల్పసిద్ధికి ఇది మరొక నిదర్శనం.

* * *

1981 సంవత్సరంలో స్వామివారి మహదాశీర్వాదంతో నల్లగొండజిల్లాలో కాకతీయ సిమెంటుఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించాను. 1983 ఫిబ్రవరిలో ఆ పని పూర్తి అయింది.

యన్‌.జె.యఫ్‌. కంపెనీ (ప్రభుత్వ సంస్థ, బెంగుళూరు) వారి వద్ద 600 హార్సు పవర్‌ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. పన్నెండు లక్షల రూపాయలు చెల్లించి డెలివరీ తీసుకొనవలసిందిగా ఆ కంపెనీ వారు నాకు తెలియజేశారు. కాని, నా వద్ద అంత మొత్తం లేదు. ''ఫ్యాక్టరీ మొదలుపెట్టిన తరువాత నెలరోజులలో మొత్తమంతా చెల్లించగలను, మోటార్లు సరఫరా చేయవలసిందని'' కోరుతూ వారికి లేఖ వ్రాశాను. అందుకు వారు సమ్మతించలేదు.

ఏమి చేయడానికి నాకు పాలు పోలేదు. మార్చి 1వ తేదీన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించాము.

ఇలాంటి క్లిష్టపరిస్థతిలో ''శ్రీవారే నన్ను కాపాడాలి'' అంటూ స్వామి వారిని గట్టిగా ప్రార్థించాను. రెండురోజులు గడిచినవో, లేదో, బెంగుళూరు ప్రభుత్వ సంస్థవారు తమ మనస్సు మార్చుకుని, బాడుగకు లారీలు మాట్లాడి, బాడుగ తామే చెల్లించి, మేము ముందుగా 12 లక్షల పైకం చెల్లించవలసిన షరతు రద్దుచేసి, మోటార్లు రెండూ మా ఫ్యాక్టరీలో డెలివరు చేశారు. అటు తరువాత మూడు నెలలకు తమ బాకీమొత్తం మా వద్ద వసూలు చేసుకున్నారు.

అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు, తమ్ము ఆశ్రయించిన భక్తులను శ్రీవారు తోడునీడయై ఎట్లా రక్షిస్తారో తెలుసుకోడానికి!

స్వామివారు భూతభవిష్యత్‌ వర్తమానాలు తెలిసికోజాలిన సర్వజ్ఞులనీ, సర్వశక్తిమంతులనీ నా దృఢ విశ్వాసం, స్వామిదయ అపారం.

మరొక తార్కాణం:

1968లో, హైదరాబాద్‌ అశోకనగరంలో శ్రీ సత్యనారాయణస్వామిదేవాలయ నిర్మాణానికి నేను పూనుకున్నాను. శ్రీవారి చేతనే ఆలయశంకుస్థాపన జరిగింది.

కాని, అశోకనగరు కాలనీ వాస్తవ్యులు కొందరు ఆ మరునాడు స్వామి వారిని సందర్శించి, ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడిగంటల మోతవల్ల చుట్టుపక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందనీ, ఆలయం చుట్టూ భిక్షకులు చేరుతారనీ, కాబట్టి ఆలయనిర్మాణం ఆపి వేయవలసినదిగా సలహా చెప్పవలసిందనీ, అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్లగలమనీ కడు నిష్ఠూరంగా స్వామివారిని బెదిరించారు.

స్వామివా రీ ధోరణి చూచి నవ్వి, మౌనంగా ఊరుకున్నారు. వారి కేమీ బదులు చెప్పలేదు.

ఆ తరువాత, అనుకున్న ప్రకారం అదే స్థలంలో సర్వాంగసంపన్నంగా ఆలయం పూర్తి అయింది. అది మొదలుకొని, నిత్యప్రవచనమూ, సత్యనారాయణస్వామి వ్రతమూ నిరంతరాయంగా జరుగుతున్నవి. తెంపు లేకుండా అనుదినం ఆలయం భక్తులను ఆకర్షిస్తున్నది.

[విశేషమేమంటే, ఆలయనిర్మాణానికి అడ్డుపడి శ్రీవారిపట్ల నిష్ఠురంగా మాట్లాడిన అశోకనగర వాస్తవ్యులు ముగ్గురూ తమ కర్మఫలం అనుభవించక తప్పలేదు!]

శ్రీ కామకోటిమహాస్వామి సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణసుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను.

ఇంతకుమించి నేను చెప్పవలసిన దేమున్నది?

* * *





Nadichedevudu   Chapters