Nadichedevudu   Chapters  

 

58. అడుగడుగునా స్వామి అనుగ్రహం

శిల్పకళానిధి, శిల్పకళా విద్వన్మణి, పద్మశ్రీ

గణపతి స్థపతి

కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన అశేషశిష్యకోటిలో నేను కూడా ఒకడిని. శిల్పకళారంగంలో నాకు గుర్తింపు రావడం వెనుక అడుగడుగునా వారిప్రేరణ, ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖలో శిల్పిగా నేను ప్రవేశించడం వారి ఆశీః ఫలితమే. తదాదిగా, దేశవిదేశాలలో శిల్పకళామతల్లి వైశిష్ట్యాన్ని చాటిచెప్పే అవకాశం నాకు లభించింది.

స్వామివారి సన్నిధిలో నా అనుభూతులను గురించి వ్రాయవలసి వస్తే ఒక ఉద్గ్రంధమవుతుంది. కొన్ని సన్నివేశాలను మాత్రం మీకు నివేదించుకుంటాను.

విద్వత్‌ సదస్సు

శ్రీవారు ఆంధ్రదేశపర్యటనలో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఆగమశిల్ప సదస్సును నిర్వహింపజేశారు. ఆ సదస్సుకు నాకూ పిలుపు వచ్చింది. బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి, పెద్దస్వామివారు స్వయంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తున్నారు. అప్పుడు ఆ తాపసమూర్తిలో కనిపించిన వెలుగు ఇప్పటికీ నాకళ్ళకు కడుతున్నది. నిశ్శబ్దంగా నమస్కరించి అక్కడినుంచి కదలివెళ్ళి శ్రీజయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకున్నాను. కుశలప్రశ్నలు అయిన తర్వాత మరునాటి ఉదయం ఎనిమిది గంటలకు శిల్పసదస్సు ప్రారంభమవుతుందని, అప్పటికి రమ్మని స్వామివారు అన్నారు. సదస్సుకు ప్రధాన పర్యవేక్షకులైన బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారిని కలిశాను. వారు - ''స్థపతిగారూ, పుస్తకాలేమైనా తెచ్చారా?'' అని అడిగారు. ''లేదండీ. పదిపదిహేను నిముషాలు మాట్లాడడానికి కొన్ని అంశాలు వ్రాసుకొని వచ్చాను'' అన్నాను. ''అదేమిటి? ఇక్కడి పండితులంతా నిన్ను పరీక్షించాలని చాలా ప్రశ్నలు తయారు చేసుకొని వచ్చారు. ఎలా సమాధానం చెబుతావు?'' అన్నారు శాస్త్రిగారు. ''ఏదో నాకు తెలిసినది చెబుతాను. ఆపైన గురుకటాక్షం'' అని ఊరుకొన్నాను.

మరునాటి ఉదయం సదస్సు ప్రారంభ##మైంది. శైవ, వైఖానస, పాంచరాత్ర, స్మార్త, ఆగమ, శిల్ప విద్వాంసులంతా సభలో ఆసీనులై ఉన్నారు. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి సభకు అధ్యక్షులు. రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ కె.వి. రత్నం గారు ముందు మాట్లాడారు. ఇంతలో - గణపతి స్థపతి మాట్లాడాలంటూ సభలో కలకలం వినిపించింది. తదుపరి, నేను లేచి ప్రార్థనచేసి ప్రసంగం ప్రారంభించాను.

ప్రశ్నల వర్షం

ప్రసంగం ముగించిన తర్వాత పరంపరగా ప్రశ్నలు సంధించారు పండితులు. వాటన్నింటికీ నాకు కంఠస్థంగా ఉన్నశ్లోకాలతోనే, శ్రీవారి అనుగ్రహంలో సమాధానాలు చెప్పాను. పదకొండుగంటలయ్యే సరికి ప్రశ్నలవర్షం కొంత వరకు ఆగింది. తర్వాత ఆగమపండితుల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేటప్పటికి మధ్యాహ్నం పన్నెండున్నరగంటలు అయింది.

మధ్యాహ్నం సభలో మళ్ళీ నేనే ప్రసంగించాను. ఆనాటి సదస్సంతా, నా సమాధానాలతో, ప్రసంగాలతోనే జరిగిపోయింది. శ్రీ జయేంద్రసరస్వతి స్వామి అనుగ్రహభాషణంతో నాటి సదస్సు పూర్తయింది.

అచటినుండి అరకులోయ వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వచ్చాను. ''పెద్ద స్వామి భద్రాచలం వెడుతున్నారు. నీవూ వెడతావా?'' అని శ్రీ జయేంద్ర సరస్వతి అడిగారు. దేవాదాయశాఖ కమిషనర్‌ గారి అనుమతితో నేనుకూడా భద్రాచలం వెళ్ళాను.

''పూర్వ శిల్పుల కన్నా నీ శిల్పం మిన్న''

భద్రాచలం చేరిన మరునాటి ఉదయం పెద్దస్వామి గోదావరి స్నానానికి వెడుతున్నారు. నేను రంగనాయకుల గట్టుమీద నుంచి శ్రీవారు ప్రయాణం కావడం చూశాను. వారున్న స్నానఘట్టానికి పరుగెడుతూ వెళ్లాను. అప్పటికి ఉదయం ఆరుగంటలయింది. స్వామివారు స్నానం ముగించి తిరిగి వస్తున్నారు. నేనూ స్నానం చేసి తడిబట్టల తోనే వారికి నమస్కరించాను. శ్రీవారు కల్యాణమంటపానికి విచ్చేశారు. వారి వెంట నడుస్తూ ఒక్కొక్క శిల్పం గురించి వివరించే భాగ్యం నాకు కలిగింది. వారు చాలా సంతోషించారు. బ్రహ్మను, సరస్వతీదేవినీ చూసి ఆ ప్రక్కనున్న వారు ఎవరని అడిగారు. సావిత్రీదేవి అని చెప్పాను. వెంటనే వారి ముఖారవిందం పై మందహాసం చిందులాడింది. శిల్పాలన్నీ చూసి, మధ్యలో ఉన్న ప్రపుల్ల పద్మాసనం - కల్యాణపీఠం మీద ఆసీను లయ్యారు. చిరునవ్వు తొణికిసలాడుతూండగా - ''నీవు చోళ, పల్లవ, పాండ్య, నాయకరాజుల కాలంలో వెలసిన శిల్పకళారీతుల కంటె మిన్నగా శ్రీరామునికి దేవాలయ మంటపాదులు కల్పించావు''అని, తమ మెడలో ఉన్న మారేడు మాలను తీసి, దానిని నాకు వేయమని ఆజ్ఞాపించారు. దానిని అందుకొని నేను వారికి సాష్టాంగపడ్డాను. ప్రక్కనే ఉన్న 'ఆంధ్రప్రభ' సిబ్బంది ఆ సన్నివేశాలు ఫోటో తీసి నా కెంతో సాయం చేశారు. అది ఒక మధురస్మృతిగా ఆజన్మాంతం నా మనస్సులో నిలిచిపోయింది. ఆ ఫోటోలను అప్పటి 'ఆంధ్రప్రభ' సంపాదకులైన సుకృతి శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు 'ప్రభ'లో ప్రచురించారు.

''నదిలో పడిన నవరత్నమాల''

భద్రాచలంలో కుంభాభిషేకం జరుగుతోంది. స్వామివారు స్నానం చేస్తున్న సమయానికే నేనూ గోదావరిలో స్నానానికి వెళ్ళాను. నా మెడలో ఉండే నవరత్నమాల నదిలో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అంతలో స్వామి స్నానం పూర్తిచేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను కూడా స్నానం ముగించి స్వామిని అనుసరించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కుర్రవాడిని మాల వెతకమని నదివద్దకు పంపించాను. వాడు వెళ్ళి కాసేపటికి మాలతో ఆనందంగా తిరిగివచ్చి ''ఏమాత్రం కష్టం లేకుండా వెంటనే దొరికింది'' అంటూ మాలను నా చేతిలో ఉంచాడు. అది శ్రీవారి కటాక్షం కాక మరేమిటి!

తరువాత కుంభాభిషేక సమయంలో శ్రీవారు కల్యాణ మంటపానికి విచ్చేశారు. అందరూ పూజలు చేసి శ్రీవారికి పట్టువస్త్రం కప్పి ఎదురుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రిగారిచే నన్ను పిలిపించి తమకు కప్పిన పట్టువస్త్రాన్ని నాకు కప్పి నాచేతిలో ఒక పండు ఉంచారు శ్రీవారు.

''కాశీ ఆలయంలో శివుని విగ్రహం''

శ్రీవారు బూర్గుంపాడు దగ్గర ఉన్నప్పుడు, భారత్‌మోటార్సు అధిపతి రామచంద్ర అయ్యర్‌ అనే భక్తునకు కాశీలో పంచాయతనంగా కామ కోటీశ్వరస్వామి దేవాలయం నిర్మించడానికి అనుగ్రహం చేశారు. ఆ పని పూర్తవుతోంది. ఇంతలో శ్రీవారు శివాస్థానంలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళాను. ''సురుటిపల్లి (చిత్తూరుజిల్లా) వెళ్ళావా?'' అని శ్రీవారు అడిగారు. నేను వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ విలక్షణమైన శివుని మూర్తిని - హాలాహలభక్షణానంతరం శయనించి ఉన్న మూర్తిని - చూసివచ్చినట్టు శ్రీవారికి నివేదించాను. అటువంటి మూర్తిని కాశీలోని కామకోటీశ్వరాలయంలో వెనుకవైపు కోష్ఠంలో నిర్మించమని వారు ఆదేశించారు. కాశీలోని ఆలయాన్ని చూడకుండానే స్థలనిర్థేశం చేయడం వారి సర్వజ్ఞతకు తార్కాణ. అట్లే ఆ శిల్పం నిబంధించాను. తదుపరి ఆ దేవాలయ కుంభాభిషేక సమయంలో ''శిల్పకళానిధి'' అనే బిరుదుతో నన్ను సన్మానించి, నవరత్నమాలిక బహుకరణం చేశారు.

ఆ తర్వాత నేనూ దేవాదాయశాఖలోని ఇంజినీర్‌ శ్రీ ఆర్‌. రఘురామాచారి గారు కలిసి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకొన్నాం. కుంభాభిషేక విషయం తెలియబరిచాం. చాలా సంతోషించారు. కంచికి వెళ్ళి ఒక వసతిగృహంలో విశ్రాంతి తీసుకొంటున్నాం. అర్థరాత్రివేళ స్వామివారు పిలిపించారు. నమస్కరించి కూర్చున్నాం. హరిద్వారంలో ''హరకీవేడీ''లో ఒక స్తంభం కట్టి దానిపై ఆదిశంకరుల విగ్రహం నిలపమని శ్రీవారు ఆజ్ఞ ఇచ్చారు. స్తంభంమీద 'గంగాష్టకం'లోని ఈ శ్లోకం చెక్కించమన్నారు.

తరళతర తరంగే దేవి గంగేప్రసీద శంభోర్జటా విభూషణ మణిః

జహ్నూర్మహర్షేరియం కన్యా కల్మష నాశినీ భగవతీ భాగీరథీ పాతుమాం

అలాగే చేశాము. శ్రీవారికి దివారాత్రులు అనే భేదం లేదు. వారు సంకల్పించిన మాత్రాన్నే పనులు నెరవేరిపోతాయి.

బాధా నివారణ

హైదరాబాద్‌లో ఒకసారి నేను స్కూటర్‌ మీద వెడుతూ ప్రమాదవశాత్తు క్రిందపడిపోయాను. తలకు గాయమైంది. మెదడుకు దెబ్బతగిలింది. చికిత్స చేయించు కొంటున్నాను. మిత్రులు శ్రీ తల్పశాయి గారు వచ్చి, పెద్దవారిని దర్శిస్తే బాధా నివారణ అవుతుందని చెప్పి శ్రీవారి చరణప్రసాదం ఇచ్చారు. అది తీసుకొన్న తక్షణం తలనుంచి ఎంతో భారం తొలగి పోయినట్లు అనిపించింది. ఇంట్లోనివారు ఎంత వారిస్తున్నా వినకుండా ఆ స్థితిలోనే శ్రీవారి దర్శనానికి కంచికి ప్రయాణమై వెళ్ళాను.

''పడ్డావా?'' అని వారే నన్ను అడిగారు. అప్పుడు వివరాలన్నీ చెప్పాను. రెండురోజులు అక్కడే ఉంటానని అన్నాను. నా బాధ పూర్తిగా మాయమైపోయింది.

శ్రీవారి అనుజ్ఞతో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాను.

స్వగృహ నిర్మాణ సంకల్పం

హైదరాబాద్‌లో సొంతయిల్లు కట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాను. లాభం లేకపోయింది. విసిగిపోయి ఆ ప్రయత్నం మానుకొన్నాను. ఒక రోజు స్వామి కలలో దర్శనం ఇచ్చారు. సుబ్రహ్మణ్యస్వామి కోవెల వద్దకు వెళ్లమన్నారు. తెల్లవారింది. ఉదయం మామూలుగా ఆఫీసుకు వెళ్ళాను. మధ్యాహ్నం యాక్టింగ్‌ కమిషనర్‌ శ్రీ ఆనందరావుగారు అకస్మాత్తుగా నన్ను పిలిపించారు. ''బూర్గువారి ప్లాట్లు ఉన్నాయట. మీరు కూడా తీసుకోకూడదా'' అన్నారు. వారే నన్ను తీసుకొని వెళ్లి స్థలం ఇప్పించారు. శ్రీ కామకోటి గురుకృపావిశేషంగానే దీనిని భావించి ఆ స్థలంలో ఇల్లు కట్టుకొన్నాను.

ఒకపర్యాయం నేను మద్రాసు నుంచి హైదరాబాదు వస్తున్నాను. శ్రీవారు శివాస్థానంలో ఉన్నారు. మాస్వగ్రామం లో సుమారు పాతికేండ్ల క్రితం అమ్మవారి ఉత్సవం జరిగింది. మళ్ళీ జరగలేదు. ఆ ఉత్సవాన్ని నాలుగైదు గ్రామాల వారు కలసి చేస్తారు. అందులో విభూతి వితరణలో మొదటి స్థానాలు ఎవరు పొందాలి అనే స్పర్థ ఉంది. మేము బండి దిగగానే అక్కడ ఉత్సవం జరగదని వార్తవచ్చింది. అందుకు నేనే కారణమనే వదంతికూడా వినిపించింది. శ్రీవారిని దర్శించి అనుగ్రహం పొందుదామని సంకల్పించుకొని కాంచీపురం వెళ్ళాను. రాత్రి 9 గంటలయింది. అంతా నిద్రిస్తున్నారు. నేను ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసుకొంటున్నాను. అర్థరాత్రి ఒంటిగంటకు శ్రీవారు బావిదగ్గరకు వచ్చారు. కౌపీనంతో ఉన్నారు...నేను వారిని సమీపించాను. ''ఎప్పుడు వచ్చావు?'' అని ప్రశ్నించారు స్వామి. ఆ తర్వాత మళ్ళివారే, ''ఊళ్ళో ఏదో వడకై (ఉత్తరంలో ఉన్న,) దేవికా ఉత్సవం?... ఫరవాలేదు. వెళ్ళిపో, అన్ని సవ్యంగానే జరుగుతాయి, పో'' అన్నారు.

అనంతరం, ''అలహాబాద్‌లో ప్రతిష్ఠకు నీవు సహస్రలింగం చేయాలని నిర్ణయం చేశాము'' అన్నారు. ''మావాళ్ళు ఎవరూ ఇంతకుముందు అలాంటిది చేయలేదు. కనుక అది పెద్దవారి సన్నిధిలోనే చేయాలి. వేదఘోష వినిపిస్తున్నప్పుడే పని జరుగుతుంది. పని పూర్తయ్యేవరకు శ్రీవారు అక్కడే ఉండాలి'' అని మూడు కోర్కెలు కోరుకొన్నారు.

''నీ ఊళ్ళో పని పూర్తయిన తర్వాత తిరుచునాపల్లిలో 'తాయుమానవర్‌' (మాతృభూతేశ్వర స్వామి) స్వామిని చూచి ఆ కొలతలు తీసుకొని వచ్చి నాకు చెప్పిపోవాలి'' అన్నారు స్వామి. ఆ తర్వాత ప్రసాదం అనుగ్రహించి పంపివేశారు.

అక్కడి నుంచి మా స్వగ్రామం 'ఎళువంకోట్టియ్‌' వెళ్ళాను. ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. నేను అమ్మవారి దేవాలయం దగ్గర కూర్చొన్నాను. ప్రతిపక్షం వారు కోర్టుకు వెళ్ళారు. స్వామి కృప వల్ల కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. ఉత్సవం చాలా బాగా జరిగింది.

తర్వాత నేను తిరుచునాపల్లి వెళ్ళి మాతృభూతేశ్వరస్వామి కొలతలు అడిగాను. మొదట పూజారులు నిరాకరించారు. శ్రీవారి ఆదేశమని చెప్పాను. అప్పుడు వారు అంగీకరించారు. అనూరాధ శ్రీవారి జన్మనక్షత్రం. అప్పుడే రాయితీయాలని ముహూర్త నిర్ణయం జరిగింది. అంతా వెళ్ళాము. రాత్రి జోరున వర్షం కురుస్తోంది. అంతా తడుస్తూ నిలబడ్డాం. సురక్షితంగా లారీ నుంచి రాయి దింపారు. రాత్రి పదిగంటలైంది. గణపతికి కొబ్బరికాయ కొట్టాను. వర్షం వెంటనే ఆగిపోయింది. రాయి దింపినప్పుడు అది సరిగ్గా ఆమ్రవృక్షం దగ్గరే పడింది. రాత్రి 12 గంటలకు అందరం వెళ్ళిపోయాము. శ్రీవారు తెల్లవారు జామున 4 గంటలకే వచ్చి రాతికి ప్రదక్షిణం చేసి లోనికి వెళ్ళి కూర్చున్నారు. నేను కూడా వెళ్ళాను. మూహూర్తం సమీపించింది. ఎవరూ రాలేదేమని అనుకొంటుండగానే కారులో వేదపండితులు వచ్చారు. సరిగ్గా సమయానికి కార్యక్రమం ప్రారంభ##మైంది. ప్రతిరోజూ అలాగే జరిగింది. శివలింగం పూర్తయింది.

శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేకానికి రెండున్నర మాసాలు అక్కడే ఉన్నాను. దేవి దగ్గరకు గర్భాలయంలోకి వెళ్ళాలంటే భయం. శ్రీవారికి నివేదించు కొన్నాను. బంగారు కామాక్షి చరణాల దగ్గర కొంచెం బంగారం సమర్పించి పని ప్రారంభించమన్నారు.

ఆస్ట్రేలియాఖండంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం కట్టడానికి నాకు పిలుపు వచ్చింది. అప్పుడు శ్రీవారు పండర్‌పూర్‌లో ఉన్నారు. వెళ్ళి ఈ సంగతి చెప్పి అనుజ్ఞ కోరాను. అది లభించలేదు. తిరిగివచ్చాను. అది నేటివరకూ నెరవేరలేదు. వారి సంకల్పం లేనిదే ఏదీ జరగదని నాకు అర్థమైంది.

ఇది జరిగిన నెలరోజులకే చికాగోలో శ్రీరామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి నాకు ఆహ్వానం వచ్చింది. శ్రీవారు పండర్‌పూర్‌లోనే ఉన్నారు. వెళ్ళి విన్నవించాను. వెంటనే వెళ్ళి రమ్మని అనుగ్రహించారు. చికాగోలో దేవాలయనిర్మాణం విజయవంతంగా పూర్తిచేసి తిరిగి వచ్చాను.

శిల్పకళారంగంలో నా అభివృద్ధి వెనుక అడుగడుగునా శ్రీవారి అనుగ్రహం ఉంది. వారి సన్నిధిలో నేను పొందిన ఆనందానుభూతిని మాటలలో వర్ణించేశక్తి నాకులేదు.

Nadichedevudu   Chapters