Nadichedevudu   Chapters  

 

56. మహాపురుష సంశ్రయం

వేదశాస్త్రాభివృద్ధికై జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారతదేశంలో శ్రీకౌతా సూర్యనారాయణరావుపంతులుగారు అగ్రగణ్యులు. వేదవిజ్ఞానాభివృద్ధి ప్రచారం కోసం నేటికి 98 సంవత్సరముల ముందు శ్రీ దేవీ శరన్నవరాత్ర వేదశాస్త్రసభను స్థాపించి, అవిచ్ఛిన్నంగా వేదాధ్యాపకులను, విద్యార్థులను సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నది కౌతావారి వంశం. శాస్త్రార్థచర్చలు జరిపి, శాస్త్రపండితులను సత్కరించిన భాగ్యం కూడా వీరికే దక్కింది.

శ్రీ సూర్యనారాయణరావుగారి పౌత్రులు శ్రీ లలితామనోహర్‌గారు తాత తండ్రుల గుణసంపదను పుణికి పుచ్చుకుని వారి సత్సంకల్పాలను సఫలం చేయడానికి కృషి సల్పుతున్నారు. మూడవతరంలో కూడా వేదసభలకు క్రమం తప్పకుండా వీరు నడిపించడం మెచ్చదగ్గ విషయం.

* * *

శ్రీ శంకరభగవత్పాదులు వివేకచూడామణిలో

''దుర్లభం త్రయమేవైతత్‌ దైవానుగ్రహహేతుకం|

మనుష్యత్వం మముక్షుత్వం మహాపురుషసంశ్రయః'' అని చెప్పినారు.

మానవజన్మ లభించుట, మనిషిగా జన్మించిన తర్వాత కేవలము విషయసుఖములచే మోహింపబడుచు. జీవితమును వ్యర్థము చేసికకొనకుండా జ్ఞానమును సంపాదించి, క్రమముగా మోక్షసామ్రాజ్యమును పొందగోరుట (ముముక్షుత్వము), మహాపురుషుల ఆశ్రయమును పొందుట అను నీ మూడును చాలా దుర్లభములు. ఈ మూడు వైభవములు కేవలము దైవానుగ్రహము వల్లనే కలుగును.

శ్రీ శంకరభగవత్పాదులు సూచించిన ''మహాపురుష'' శబ్దమునకు సర్వాత్మనా లక్ష్యభూతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిసంయమీంద్రులు. వారు సంచరించుచున్న కాలంలో జన్మను పొంది, వారి సాన్నిధ్యములో కొంత కాలమైనను గడపిన వ్యక్తులు ధన్యజీవులు. ''తత్పశ్యన్తిచధామనాభిపతతో యచ్ఛార్మణ చక్షుషి.'' ''ఈ చర్మ చక్షువునకు గోచరముగాని విషయములను జ్ఞాననేత్రము తో జూచెదరు'' అని మురారికవి ఇటు వంటి త్రికాలజ్ఞులను గురించి వ్రాసినాడు. ''తద్దృష్టి గోచరా స్సర్వేముచ్యన్తే సర్వకిల్బిషైః,'' అనగా ''అటువంటి మహనీయుల దృష్టి పడినంత మాత్రముననే సమస్త పాపములు నశించును.'' అని శాస్త్రవచనము. సంయమధనులైన శ్రీ స్వామివారితో యావద్భారతమునందు అనేక మహనీయులకు పలువిధములైన అనుభూతులు గలవనుటకు సంశయము లేదు.

ఈ మహనీయునితో అతిసన్నిహితముగా సుమారు. నాలుగుమాసములు గడువు భాగ్యము నాకు కలిగినది. 1968 సంవత్సరములో శ్రీవారు తమ పీఠముతో సికింద్రాబాదు నందలి మా ఆవరణలో ''శంకరజయంతి'' సందర్భముగా రెండుమాసములు, తర్వాత ''చాతుర్మాస్యదీక్ష'' సందర్భముగా రెండు మాసములు గడుపుట మా భాగ్యవిశేషము. ఆ తర్వాత వారు విజయవాడలో మా గృహమున పీఠముతో నుండుట, తదుపరి సుమారు 5 రోజులు రామవరప్పాడులో నున్న మా ''భాస్కర వనము'' నకు ప్రతిరోజు వెళ్లి రోజంతా అచ్చట గడుపుట, ఒక రాత్రి అక్కడే ఉండుట ఒక విచిత్ర సంఘటన.

సికింద్రాబాదు మా ప్రాంగణములో ఒక ఆదివారము నాడు మధ్యాహ్నము నాకు కబురు పంపినారు. వెళ్లి వందనము చేయగానే ''ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతున్నది. రేపు సమాప్తి. నాకు ఆరు కాశ్మీరు పండితశాలువాలు వెంటనే కావాలి. రాత్రి విమానములో ఢిల్లీకి పంపవలయును'' అన్నారు. దానికి నేను ''ఈ రోజు ఆదివారము. దుకాణములు ఉండవు. ఇవి దొరుకుట సాధ్యమా!'' అని అంటే ''అందుకే నీకు చెబుతున్నాను. ప్రయత్నము చెయ్యి'' అని మందహాసము చేసినారు. 1968వ సంవత్సరములో హైదరాబాదులో మన సంస్కృతి, సంప్రదాయములు ఇంకా విస్తరించలేదు. కొంచెము బాధపడుతూ ఒక కొట్టుయజమాని ఇంటికి ఫోను చేసినాను. అతను కొట్టు తెరచుట కంగీకరించి నన్ను రమ్మనినాడు. వెళ్లి ఆ కొట్లో శాలువాలు పెట్టు బీరువాను తెరచి, కట్టను తీసి విప్పి చూడగా శ్రీవారు కోరిన శాలువలు సరిగ్గా ఆరు మాత్రమే అందులో ఉన్నవి. చాలా ఆశ్చర్యము వేసినది. సంబరపడుతూ తెచ్చి శ్రీవారికి చూపించినాను. ''నేను అనుకొన్నవి దొరికినవి గదా'' అన్నారు. వెంటనే ఆ రాత్రి విమానములో వాటిని ఢిల్లీకి పంపుట, అవి మరునాడు సకాలములో యాగశాలకు చేరుట జరిగినది. శ్రీవారు సంకల్పసిద్ధులు కదా!

1968లో సికింద్రాబాదులో శ్రీవారు చాతుర్మాస్యం చేయుచున్న సమయముననే నాకు ప్రథమసంతానము, ఒక పుత్రిక 13-7-1968న కలిగినది. శిశువు గ్రహణమొరికతో పుట్టనదని గుంటూరునుంచి నాకు టెలిగ్రాం వచ్చింది. జాతములో వారిని దర్శించవచ్చునో లేదో అని వారి దగ్గరకు వెళ్లలేదు. సాయంత్రము వారు కబురు చేసినారు. వారి దగ్గరకు వెళ్లాను. వందనము చేయగూడదుగాని దర్శనము చేసికొనుటకు అభ్యంతరము లేదు. జాతమునకు వృద్ధి అంటారు. ''నేను పూజ చేయుచున్న అమ్మ నీ ఇంటికి నడచివచ్చింది'' అన్నారు. నాకు బోధపడలేదు. ఆరాత్రి స్వప్నములో వారు దర్శన మిచ్చి ''నేను పూజచేయు తల్లి ''త్రిపుర సుందరి'', నీ తల్లి పేరు కూడా అదే. ఈ శిశువుకు ఆ పేరు పెట్టు'' అని చెప్పినారు. తర్వాత నేను గుంటూరు వెళ్లి పిల్లను చూసి వచ్చినాను. శుద్ధి అయిన తర్వాత ప్రొద్దున శ్రీవారిని చూచుటకు వెళ్లాను. ''తల్లీ పిల్లా కులాసానే కదా! పిల్ల ఎలా ఉంది?'' అని ప్రశ్నించారు శ్రీవారు. నేను కొంచెము బాధతో, ''మీకు చేయుచున్న సేవలకు మంచి ఫలితమే లభించినది'' అని కొంత నిష్టురముగా అన్నాను. వారు వెంటనే లేచి పీఠము దగ్గరకు నన్ను తీసికొని వెళ్లి ఏకాంతములో సుమారు 40 నిముషములు ధ్యానములో గడపి మందహాసము జేయుచు, ''ఈ పిల్లకు ఎటువంటి లోపము ఉండదని అమ్మ అంటున్నది'' అని వారు చెప్పేసరికి నా ఒడలు పులకించి ఆనందాశ్రువులు ధారగా పడుతుండగా వారికి సాష్టాంగప్రణామము చేసినాను. అప్పుడు వారు ప్రసాదము తెప్పించి ''నీవు గుంటూరు వెళ్లి ప్రసాదమును తల్లికి, శిశువునకు పెట్టి వెంటనే చికిత్సకు ఏర్పాటు చేయుము'' అన్నారు. తర్వాత ఆ చికిత్స చేయబోవు డాక్టరును తమ వద్దకు పంపమని చెప్పగా, ఆ వైద్యుడు వారిని దర్శించినారు. ఆయనతో శ్రీవారు సుమారు 45 నిముషములసేపు ఆపరేషను విధానమును చర్చించి ప్రసాదము ఇచ్చి ''నీవు ఆపరేషను చేయునపుడు ఈ కుంకుమ పెట్టుకుని శ్రీ కామాక్షిని ధ్యానము చేసికొని చేయుము'' అని ఆదేశించినారట. ఆ విధముగనే జరిగినది. ఇప్పుడు నా కుమార్తె డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణురాలైనది. సంగీతము బాగా పాడుతుంది. ఈ అమ్మాయి నామకరణమునకు శ్రీవారు విజమవాడ మా ఇంట్లో ఉండి అనుగ్రహించినారు. ఎప్పుడు శ్రీవారిని దర్శించినా ''సుందరి బాగుందా'' అని కుశలప్రశ్న వేస్తారు. శ్రీవారి అవ్యాజకరుణకు ఇది ప్రత్యక్ష నిదర్శనము.

మా కుటుంబములో, వ్యవహారములో కొన్ని చికాకులు బయలుదేరినవి. కర్తవ్యతా మూఢుడనై శ్రీవారిని సతారాలో దర్శనము జేసికొనుటకు వెళ్లినాను. ఆరోజు శ్రీవారి గుర్వారాధన. భిక్ష చాలా ఆలస్య మయినది. నేను వందనము చేసి లేవగానే ''చాలా శ్రమగా నున్నది. రేపు ఉదయం 7 గం||లకు కలుద్దాము. ముందు లోపలికి వెళ్లి గురు ప్రసాదము తీసికో''అని చెప్పారు. నేను గురుప్రసాదము తీసికొని ఆ రాత్రి పూజను చూసి మరునాడు అనగా 8-3-1981 ఉదయము శ్రీవారి దర్శనమునకు వెళ్లాను. వందనము చేసి లేవగానే నా సమస్యల నన్నింటిని వారు గ్రహించారా అన్నట్లు నన్ను వారు మూడు ప్రశ్నలు, చాలా భావగర్భితమైనవి వేసినారు. నాకు దేహము పులకించి గద్గద స్వరముతో ''నేను తమకు చెబుదామనుకున్న విషయములన్నిటికీ తమ ఈ మూడు ప్రశ్నలలో సమాధానములు వచ్చినవి. ఇక నేను చెప్పుటకేమియులే''దన్నాను. ఇప్పుడు నీవు ఇంత దూరము ఎందుకు వచ్చావో చెప్పాలి'' అని ఆదేశించి నా బాధ లన్నీ చాలా విపులముగ విని, ''ధర్మమార్గమును వదలవద్దు, అమ్మని నమ్ముకొని జయాపజయములను లెక్క చేయక నీ విధిని నిర్వర్తించు'' అని ఉపదేశము చేసినారు. ''ఇది చాలా శ్రమ సాధ్యము, కష్టము, సుఖముగనున్న జీవితమును ఎందుకు కష్టపెట్టుకోవాలి'' అని ప్రశ్నించాను. ''ధర్మాచరణ, ధర్మరక్షణ ఎప్పుడూ కష్టసాధ్యములే. అలాగ ధర్మమును విడచి నడచుట తగదు. గీతలో శ్రీకృష్ణుడు అర్జునున కుపదేశమిచ్చినది అదియే గదా, మరచితివా?'' అని ప్రశ్నించారు. తర్వాత, ధర్మరక్షణకు నిరంతరము ప్రతివ్యక్తి కృషి చేయవలయుననియు, దాని వలన వచ్చు పుణ్యము అనంతమనియు ఉపదేశించారు.

24-11-1985 న శ్రీవారి దర్శనమునకు కంచి వెళ్లాను. ఆరోజు మధ్యాహ్నము వారితో సుమారు 2 గంటలు గడిపినాను. మాట్లాడుతూ వారు ''వ్యవహారము లెంతలో ఉన్నాయి? ఈ కోర్టు విషయములు, ధర్మ సంస్థల విషయములు చూచినావు కదా. నీ అభిప్రాయము, మనోభావము ఏమిటి'' అని ప్రశ్నించారు. ''యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః'' అను వాల్మీకివచనమును నా సమాధానముగా చెప్పాను. ''మిగిలిన రెండు పాదములు కూడ వచ్చునా, చెప్పు'' అన్నారు. ''మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా! యది సీతాసి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః'' అని చదివాను. ''దీనిలో విశేషమేమిటి?'' ప్రశ్నించారు. ''స్వామీ! ఆ శ్లోకములో అంత తిరుగుడు లేకుండా ''రామప్రియా'' అనిగాని ''రాఘవప్రియా'' అని గాని చెప్పుటకు వాల్మీకికి ఏమీ శ్రమ ఉండేదికాదు.'' నవ్వారు శ్రీవారు. వారి చరణములను చూచుచు ధ్యానించుచున్నాను. అర్థము స్ఫురణకు వచ్చినది. ''ఈ శ్లోకమునందు గురుభక్తి ఉత్కృష్టతను చెప్పినట్లు స్ఫురించుచున్నది.'' అన్నాను. ఆ శ్లోకమును ఇంకా రెండుసార్లు చదవమన్నారు. చదివాను. ''ఈ అర్థము నీకు ఎవరు చెప్పారు?'' అని అడిగారు. ''శ్రీవారి పాదపద్మములే'' అని సమాధాన మిచ్చాను. ''చాలా బాగుంది'' అని అంటూ ప్రక్కన ఉన్న ఒక విద్వాంసుని అరవములో ''ఈ శ్లోక మెప్పుడైనా విన్నావా?'' అని ప్రశ్నించి అరవములో వివరణ చేసారు. అంతవరకు తోచని అర్థము వారి చరణధ్యానము చేయగానే స్ఫురించుట ''గురుకటాక్షము''నకు నిదర్శనము

15-1-1988న నా తండ్రిగారు ''బ్రహ్మవిద్యాలంకార'' శ్రీ కౌతారామమోహన శాస్త్రిగారు విదేహకైవల్యమును పొందిరి. శ్రీవారికి తంతి ద్వారా తెలియజేసాను. శుభస్వీకార సమయమునకు వారు ఒక పండితునిచే శాలువ, ప్రసాదము పంపి తర్వాత వచ్చి నన్ను కలువమని వర్తమానము చేసారు. 29-3-1988 కంచి వెళ్లి శ్రీవారి దర్శనము చేసికొన్నాను. నాతో మాట్లాడుతూ ఒక శాలువను తెప్పించి, దానిని కప్పుకొని ఒక అరగంట సేపు సమాధిలోకి వెళ్లారు. తర్వాత నన్ను నిలబడమని ''ఆంధ్రదేశములో ధర్మమును కాపాడుటలోను, ధర్మమార్గములో నడచుటలోను ఆదర్శకుటుంబము నీది. నీ పితామహులు వెళ్లి పోయారు. ఇప్పుడు ఒక ఉత్తమజీవియైన నీ తండ్రిగారు కూడా వెళ్లిపోయారు. ఆ భారము నీ భుజములమీదకి వచ్చినది. అవిచ్ఛిన్నముగా ఈ ధర్మము జరుగవలయునని నా కోరిక'' అని అంటూ శాలువను తీసి నాకు కప్పించినారు. వారి అనుగ్రహమునకు నా కుటుంబము జన్మజన్మలకు ఋణపడి ఉన్నది.

శ్రీ లలితాసహస్రనామములో ''అవ్యాజకరుణామూర్తిః అజ్ఞానధ్వాంతదీపికా, ఆబాలగోపవిదితా'' అని మూడు నామములు ఉన్నాయి. ఏమియు నెపము లేకుండానే కరుణను చిందించుమూర్తి, అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకాంతి, అందరికీ తెలిసినది (ప్రకృతి) యని వీటి కర్థములు. శ్రీ త్రిపురసుందరీస్వరూపులైన శ్రీవారికి కూడ ఈ మూడులక్షణములు పరిపూర్ణముగ వర్తించు ననుట అతిశయోక్తి కాదు.

ఈ విధముగ శ్రీవారిని గురించి చెప్పవలెనంటే అనేక సంఘటనలు చిత్ర విచిత్రములు, ఆశ్చర్యభరితములు చాల గలవు. వారు కేవలము ఈశ్వరావతారమని గ్రహించుట సముచితము. ''శంకర శ్శంకర స్సాక్షాత్‌'' అను వచనమునకు శ్రీవారు లక్ష్యభూతులు. వారిని స్మరించుచూ, వారి ఉపదేశమును గ్రహించి సన్మార్గములో నడచుట ప్రతి ఒక్కరి కర్తవ్యము, ఇహ, పర సాధకము.



స్వకర్మానుష్ఠానం

స్వకర్మానుష్ఠానానికి మించిన ఈశ్వరపూజా, ఈశ్వరారాధనమూ లేదు. ఎవరి వంతుకు వచ్చిన కర్మలను వారనుష్ఠిస్తూ తద్వారా ఈశ్వరార్చనపరులై శ్రేయం సంపాదించుకోవాలి.

తనను ఉద్ధరించుకున్న వాడే ఎదుటి వారిని ఉద్ధరించగలడు.

దుస్సాంగత్యమనే వ్యాధికి చికిత్స సత్సాంగత్యం.

ప్రతి కర్మకూ ప్రత్యేకమైన కాలమూ, మంత్రమూ, దేవతా, ద్రవ్యమూ ఉన్నాయి. అన్నిటికీ పరమతాత్పర్యం పరమేశ్వరార్పణం.



Nadichedevudu   Chapters