Nadichedevudu   Chapters  

53. 'స్వామిని స్మరించి శస్త్రచికిత్స'

1967 సంవత్సరంలో విజయవాడ నుంచి వెలువడే 'ఆంధ్రప్రభ' లో వారంవారం శ్రీ కంచికామకోటిపీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారి ఉపన్యాసాలు ప్రకటిస్తూండేవారు. మే మా ఉపన్యాసాలు చదువుతూ వచ్చాము.

ఈ తరుణంలో మా కుమార్తె అకాలమరణం, మా రెండవ కుమారుని అనారోగ్యకారణంగా మా దంపతులకు మనశ్శాంతి లేకపోయింది. కుమారుని జాడ్యం ఫలానా అని నిర్ణయించలేకపోయినాము. అందుచేత ఢిల్లీలో 'ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌'లో రోగ నిర్ణయం చేయించుదామనుకున్నాము.

ఢిల్లీ వెళ్ళేముందు శ్రీ కంచిశంకారచార్యులవారి దర్శనంచేదామని మాకు కోరిక కలిగింది. నరసారావుపేట సమీపంలో శ్రీ స్వామి వారిని దర్శించాము. సుమారు 45 నిమిషాలు శ్రీవారితో గడిపాము. వైద్యపరీక్షకై కుమారుని ఢిల్లీకి తీసుకు వెళుతున్నామని చెప్పగానే, కురుక్షేత్రం వెళ్లి దేవుని దర్శించండి అని స్వామివారు ఆదేశించారు. అదేవిధంగా కురుక్షేత్రం పోయి దేవుని దర్శించాము.

ఆ తరువాత ఢిల్లీ 'మెడికల్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌'లో పిల్లవాడిని పరీక్షచేయించాము. మా కుమారునికి ఏ జబ్బు లేదని ఇన్‌స్టిట్యూట్‌ వారు నిర్ణయించారు. కొండంత బరువుతో కుంగిపోతూ ఢిల్లీకి వెళ్లిన మాకు ఎంతో మనశ్శాంతి కలిగింది. అది మొదలుకుని మా కుమారుడు నేటి వరకు ఆరోగ్యంగా ఉంటున్నాడు.

మాకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా శ్రీవారి దర్శనం చేస్తాము. వారి దర్శనం వల్ల మాకు కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

ఇప్పుడు మేము ప్రతిదినం అధమం ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి అయినా స్వామిని స్మరించకుండా ఉండలేము.

అంతేకాదు, తదాది నేను ఏ రోగికి శస్త్రచికిత్స చేసినా, స్వామిని సంస్మరించి చికిత్స ప్రారంభిస్తాను.



ఆత్మస్తుతి

ఒకడొక పుణ్యకార్యం చేసి, అందుకు ఇతరులు తనను స్తుతిస్తుంటే విన్నా, లేక తనను తాను పొగడుకున్నా, వాని పుణ్యఫలం కొంత తగ్గుతుంది.

అందుచేత, ఎవరినైనా మనం మెచ్చుకోవాలనుకుంటే, పరోక్షంగా మెచ్చుకొనడం మంచిది.



నుతి మంజరి

శ్రీశంకర శ్రీరామారావు

వెలుగులు చిమ్ము నెమ్మొగము, విచ్చిన పూవులవంటి కన్నులున్‌,

పొలుపగు లేత చిర్నగవు పుత్తడి తళ్కులమేని చందమున్‌,

లలితవిభూతిరేఖల కళాపరిపూర్ణత జూపు ఫాలమున్‌

వెలయగ కామకోటి గురుపీఠమునందొక మూర్తి వెల్గెడున్‌.

అతడు మహామహోన్నత విహాయస వీధుల తాకివచ్చి శి

ష్యతతికి జ్ఞానపాయస మొసంగును నిత్యము సావధానుడై

పతితజనాళికై తపఃఫలమంతయు ధారపోయు భా

రతహృదయంబు వాక్యమకరందపుసోనల గ్రుమ్మరించుచున్‌.

పలుకులముత్తెముల్‌ చిలుకు పండితు లెందరు లేరు? చిత్తసం

చలన మడంచి, జ్ఞానకలశమ్మును పొంది, తదాత్మభావనో

జ్వల పరమానుభూతి తమభక్తుల కీగలవార లెందరీ

కలియుగమందు నేటి మతకర్తలలో పరికించి చూడగన్‌.

విన్నా నా మహనీయకీర్తి సహజ ప్రేమస్వరూపుండటం

చన్నా రెందరొ, మానవాభ్యుదయకార్యారంభసంరంభియై

యెన్నో జీవితముల్‌ స్పృజించి సుధ లందించెన్‌ కృపాసాగరో

త్పన్నంబై నవనీతకోమలమునై పాలించు చిత్తమ్ముతో.

హైందవ సంస్కృతీవిభవమంతయు, ఆత్మవివేకమంతయున్‌

సుందరమందహాస పరిశోభితమౌ ముఖమండలమ్మునన్‌

విందొనరింప శిష్యపరివేష్ఠితుడైన యతీంద్రునేత్రని

ష్యందమరందపానము మదాత్మకు శాంతి యొసంగు గావుతన్‌.



Nadichedevudu   Chapters