Nadichedevudu   Chapters  

 

51. నిరాడంబర దాత రాచూరి రంగదాసు

శ్రీరాచూరి రంగదాసుగారి పూర్వీకులు మూడు దశాబ్దాలకుపైగా హైదరాబాదులో స్థిరపడిన వారు.

రాచూరివారు వైష్ణవ సంప్రదాయానికి చెందిన సూర్యవంశ క్షత్రియులు.

రంగదాసుగారి తండ్రి శ్రీ రాచూరి శాయన్న కంట్రాక్టుపనులు చేసే వారు. కుమారుడు రంగదాసు పదవ తరగతి వరకు చదివి, తండ్రి అడుగుజాడలలో నిపుణుడైన కంట్రాక్టరుగా రూపొందాడు.

1968లో భద్రాచలంలో శ్రీ సీతారామాలయ కుంభాభిషేక మహోత్సవ సందర్భంలో శ్రీ రంగదాసు ప్రప్రథమంగా శ్రీ కంచి కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించడం తటస్థించింది.

''అంతకు ముందు నాలో లేశమాత్రంగా ఉన్న దైవభక్తి కంచి స్వామివారిని సందర్శించిన తదుపరి ఇనుమడించింది'' అంటారు శ్రీ రంగదాసుగారు. ''అటు పిమ్మట శ్రీ జయేంద్ర సరస్వతిస్వామితో నాకు సాన్నిహిత్యం పెరిగింది. ఇరువురు స్వాముల అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కంట్రాక్టుపనులు నన్ను వరించి వచ్చినవి. నా ఆదాయం వృద్ధి అయింది.''

శ్రీ రంగదాసుగారు తన స్వానుభవాన్ని ఇంకా ఇలా వివరించారు. పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కర్ణాటక రాష్ట్రంలోని గోకల్‌ అనే గ్రామంలో మకాం చేస్తూ ఉన్నప్పుడు ''వెంటనే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసి వెళ్లవలసిందంటూ'' హైదరాబాదులో నాకు వర్తమానం అందింది. స్వామి ఆజ్ఞ మేరకు నేను గోకక్‌ వెళ్లాను. స్వామివారు నాతో ఇలా అన్నారు: ''అహోబిలం మఠాధిపతి శ్రీ శఠకోప వేదాంత మహాదేశికులవారి వద్దనుంచి నాకొక జాబువచ్చింది. శ్రీరంగక్షేత్రం రంగనాధస్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి, అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ జియ్యర్‌స్వామిని ఆజ్ఞాపించాడట. అందుకు ఆర్థిక సహాయం కోరుతూ వారు నాకు జాబు రాశారు.''

''నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణం అంతా రాతితోనే జరగాలి అనివున్నది. నీవు కంట్రాక్టరువు కాబట్టి, శ్రీరంగంవెళ్లి, అసంపూర్తిగా ఉన్న ఆ కట్టడాన్ని పరిశీలించి, రాతితో కట్టడం ఎంతవరకు సాధ్యమో, అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూచి నీ అభిప్రాయం నాకు చెప్పాలి.''

''ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజలనుండి విరాళాలు కోరుతూ నేనూ శ్రీ శఠగోపయతీంద్రులవారూ ఇరువురం కలిసి ఒక విజ్ఞాపన చేస్తాము.''

''ఇకపోతే, గోపుర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఒక రిటైరైన ఐ.ఏ.యస్‌. అధికారిని అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగానూ, రిటైర్‌ అయిన అకౌంటెంట్‌ జనరల్‌ను జమాఖర్చులు చూడడానికీ, అలాగే ఉద్యోగం నుంచి విరమించుకున్న ఒక ఛీఫ్‌ ఇంజనీరును గోపుర నిర్మాణ పర్యవేక్షణకు నియమిస్తాము.

ఈ పనులన్నిటికీ వృద్ధులైన శ్రీ యతీంద్రులవారు (అప్పటికి వారి వయస్సు సుమారు 85) శ్రమపడవలసిన పనిలేదు. ఈ విషయాలన్నీ అహోబిలం పీఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయమేమో తిరిగి వచ్చి నాకు చెప్పవలసింది'' అని స్వామి ఆజ్ఞాపించారు.

శిల్పశాస్త్ర ప్రవీణుడు శ్రీ గణపతి స్థపతినీ, శ్రీసౌందరరాజన్‌నూ, హైదరాబాద్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసులో ఉద్యోగి శ్రీ. కె. కృష్ణ మూర్తిగారినీ, పునాదులు పరీక్షచేయడానికి సూపరింటెండింగ్‌ ఇంజనీరు శ్రీ డి. శ్రీరామమూర్తిగారినీ, మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్‌గారినీ వీరందరినీ వెంటబెట్టుకుని నేను శ్రీరంగం బయలుదేరాను.

శ్రీరంగంలో నేను శ్రీ ఆచార్యులవారిని దర్శించడం అదే తొలిసారి. కంచిస్వామి వారు చెప్పినదంతా శ్రీ జియ్యరు స్వామికి వివరంగా వినిపించాను. అంతావిని, అందుకు వారిలా అన్నారు. ''శ్రీ కంచి శంకరాచార్యులవారూ, నేనూ ఉభయులం కలిసి విరాళాలకై విజ్ఞప్తి చెయ్యడం సాధ్యంకానిపని.''

పోతే, రిటైరైన ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ క్రింద నిర్మాణం జరగాలన్న శ్రీవారి సూచనను కూడా వారు అంగీకరించలేదు.

కట్టడమంతా రాతితోనే జరగాలన్న విషయంలో శ్రీ జియ్యర్‌ స్వామి ఇలా అన్నారు: ''సిమెంటుతో, ఇటుకతో గోపురం కట్టడానికే ఒకటిన్నర కోట్ల రూపాయల అంచనా వేశారు. ఆ ద్రవ్యమే ఇంతవరకు లభ్యంకానప్పుడు, పదికోట్లు ఖర్చు అయ్యే రాతిపని ఎలా చేపడతాము?'' అని ప్రశ్నించారు.

పైగా, అప్పటికి తన వయస్సు 85 దాటిందనీ, ఈ గోపుర నిర్మాణం పూర్తయితే చూచి ఆనందించాలని తనకు ఉన్నదనీ, ఇటుక కాకుండా, రాతికట్టడమైన పక్షంలో పది సంవత్సరాలకుగాని పని పూర్తి కాకపోవచ్చని శ్రీ జియ్యర్‌స్వామి అన్నారు.

ఏతావతా, జియ్యర్‌గారు తమ కోరిక ఇలా చెప్పారు: ''శ్రీరంగనాథుడు నాకు స్వప్నంలో కనుపించి ఈ పని నీవు పూర్తి చేయవలసిందని ఆజ్ఞాపించాడు. సాధ్యమైతే, నాకు ఈ నిర్మాణానికి డబ్బు సాయంచేయవలసిందని శ్రీ శంకరాచార్యులవారితో చెప్పండి. అంతకు మించి నేను చెప్పవలసింది ఏమీ లేదు'' అన్నారు.

హైద్రాబాద్‌లో శ్రీ అహోబిలమఠానికి కార్యదర్శిగా ఉన్న శ్రీ సౌందరరాజన్‌ గారితో కలసి తిరిగి మేమంతా గోకక్‌లో శ్రీవారి వద్దకు వచ్చి, శ్రీరంగంలో జరిగిన విషయమంతా స్వామివారికి నివేదించాము.

స్వామివారు మేము చెప్పినదంతా సావకాశంగా విని, ముక్తసరిగా ''అలాగే, జీయర్‌గారికి ఎలా ఉచితమని తోస్తే అలా చెయ్యమను'' అని సెలవిచ్చారు.

తరువాత శ్రీజయేంద్ర సరస్వతిని పిలిచి, ''మఠంలో నిలవ ఎంత ఉన్నది?'' అని శ్రీవారు అడిగారు. దాదాపు పదిలక్షలు ఉన్నదని శ్రీ జయేంద్రుల వారన్నారు.

''అయితే, ఒక లక్షరూపాయలు వెంటనే అహోబిలం మఠాధిపతులకు పంపే ఏర్పాటుచెయ్యి'' అన్నారు పెద్దలు.

కొన్ని నెలలు గడిచాయి. శ్రీవారు మహారాష్ట్రలోని సతారాలో ఉండి, తిరిగి నాకు కబురు పెట్టారు. నేను సతారా వెళ్లి స్వామిని కలుసుకున్నాను. ''నీవు మళ్లా శ్రీరంగం వెళ్లి వస్తారా?'' అని అడిగారు.

శ్రీ జియ్యర్‌గారు గోపుర నిర్మాణం ప్రారంభం చేశారనీ, గోపురంలో కనీసం ఒక అంతస్థు కట్టడానికి తమ సహాయం అడుగుతున్నారని, ఒక అంతస్థుతో గోపురం పూర్తికాదు కదా, మిగిలిన అంతస్థులను వారు ఎలా ఏర్పాటు చేస్తారో, వారి ప్రణాళిక ఏమిటో అన్ని విషయాలు వివరంగా వారితో మాట్లాడి తెలుసుకుని రావలసిందిగా నన్ను స్వామివారు ఆదేశించారు.

శ్రీరంగంవెళ్లి నేను శ్రీ జియ్యర్‌ స్వామిని కలిసికొన్నప్పుడు వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ''అందరూ వస్తున్నారు, పోతున్నారు ఎవరూ డబ్బు ఇవ్వడం లేదు'' అన్నారు.

జియ్యర్‌గారి మాటవిని నేనెంతో కష్టపడ్డాను. వెంటనే నేను స్వయంగా 25,000/- రూపాయలకు చెక్కురాసి వారికి సమర్పించాను.

''ఈ సొమ్ము ఎవరు ఇచ్చినట్టు రాయమంటారు?'' అడిగారు శ్రీ జియ్యర్‌స్వామి.

''నేను కంచి మఠం నుంచి వస్తున్నాను కాబట్టి కంచిమఠం ఇచ్చినట్టు జమ రాసుకోండి'' అన్నాను.

సతారాకు తిరిగివచ్చి, స్వామివారితో పరిస్థితి అంతా చెప్పాను.

స్వామివారిలా అన్నారు: ''గోపుర నిర్మాణం పూర్తికాకుండా శ్రీ జియ్యర్‌స్వామి దివంగతులయ్యే ప్రమాదంలేదు. ఆ పని పూర్తి అయ్యేవరకు వారు సజీవులై ఉంటారు.''

నేను మరల శ్రీ జియ్యర్‌గారి వద్దకు వెళ్లినప్పుడు శ్రీవారన్న మాటలను శ్రీ జియ్యర్‌ స్వామికి వినిపించగా, వారు ఇలా అన్నారు:

''శ్రీ చంద్రశేఖర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతులు ఇరువురూ నాకు సుపరితులే. నాపూర్వాశ్రమంలో నేను వారుభయులనూ ఎరుగుదును. గోపుర నిర్మాణం పూర్తయ్యే వరకూ నేను జీవించివుంటానని పెద్దస్వామి వారు అన్నారంటే అదివారి ఆశీర్వాదం. అంతమాత్రంచేత నేను అంతవరకు జీవించి ఉంటానని గ్యారంటి ఏమున్నది?''

ఇదంతా చెప్పి తరువాత, శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వాము లిరువురూ హైద్రాబాదులో ఉన్నప్పుడు తన గృహానికి దయచేసి, తననూ, తన కుటుంబాన్ని అనుగ్రహించారనీ, అది మహద్భాగ్యంగా భావిస్తున్నాననీ శ్రీరంగదాసుగారన్నారు.

తనంతట తాను చెప్పలేదుగాని, కొన్ని పత్రికలలో ప్రచురించబడిన వార్తలననుసరించి శ్రీ రంగం గోపుర నిర్మాణానికి మొత్తం ఎంత ద్రవ్యం సమర్పించారని శ్రీరంగదాసుగారిని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన తరువాత, మొత్తం లక్ష రూపాయలు ఇచ్చామని, అయితే అది కంచిమఠం పేరిట సమర్పించామని అంగీకరించారు. అది శ్రీరంగదాసుగారి నమ్రతనూ, నిరాడంబరతనూ సూచిస్తుంది.

అంతేకాదు. శ్రీరంగదాసుగారు తన ఇంటి సమీపంలోవున్న రామాలయ ఆవరణలో శ్రీజ్ఞాన సరస్వతి ఆలయాన్ని, శ్రీ ఆదిశంకరుల మందిరాన్ని కూడా నిర్మించారు.

ఇలాగే కంచిస్వామివారి భక్తులలో ఒకరు, సేలంలో ఆడిటరు, తన పేరు ప్రకటించుకోకుండా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు సేకరించి కంచిమఠంద్వారా శ్రీరంగనాధుని గోపుర నిర్మాణానికి సమర్పించారు.

ఇందులో ముఖ్యంగా చెప్పదగిన విశేషమేమంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన వైష్ణవాలయ గోపుర నిర్మాణానికై అద్వైత, విశిష్ఠాద్వైత సంప్రదాయాలకు చెందిన ఇరువురు పీఠాధిపతులు ఏకమై, 232 అడుగుల ఎత్తున ఉన్నతోన్నతమైన ఒక మహానిర్మాణాన్ని పూర్తిచేయడం చరిత్రలో అపూర్వం.

మరొక విశేషం. రంగనాధుని గాలి గోపుర నిర్మాణాన్ని గురించి అహోబిలంమఠాధిపతి శ్రీ శఠకోపయతి గారినడిగితే ''అంతటికీ కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రులవారే కారకులు'' అంటారు. కంచిస్వామి వారు, ''నాదేమున్నది? అంతా అహోబిలం వారికృషే'' నంటారు. ఉదార చరితుల ఔదార్యానికి, స్వార్థరాహిత్యానికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది?

Nadichedevudu   Chapters