Nadichedevudu   Chapters  

 

49. ''శ్రీవారే ప్రమాణం''

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ చరణుల 70వ జయంతి సందర్భంగా, నాప్రార్థనపై శ్రీ మండలీక వేంకటశాస్త్రి మహోదయులు ఆనాడు 'ఆంధ్రప్రభ'కు వ్రాసిన అమూల్య వ్యాసం.

అజ్ఞానాంతర్గహనపతితా నాత్మవిద్యోపదేశైః

త్రాతుం లోకాన్‌ భువదవశిఖా తాపపాపచ్యమానాన్‌

ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతన్తీ

శంభో ర్మూర్తిః చరతి భువనే శంకరాచార్యరూపా.

1937 సం. ప్రాంతంలో శ్రీవారు కాశీయాత్రను పూర్తిచేసికొని, ఆంధ్రప్రదేశమునకు విచ్చేసి, గంగానదివలె ప్రవహించు పవిత్రగోదావరీ తీరమునందలి గ్రామములను తమ సంచారముచే పవిత్రముచేయుచు, అచటనుండు ప్రజానీకమును తమ సహజగంభీరమగు దివ్యోపదేశములచేతను, కృపాపూరితమగు కటాక్షములచేతను అనుగ్రహించుచు, క్రమముగా గోదావరిజిల్లాలో కోనసీమయని ప్రసిద్ధిచెందిన గ్రామములో నొకటియై అనేకవిద్వాంసులకు స్థానమగు ముక్కామల యను గ్రామమునకు విచ్చేసిరి. అచట కీ.శే.శ్రీ దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు, కీ.శే.దువ్వూరి వెంకటేశ్వర్లుగారు, కీ.శే. భమిడిపాటి సోమనాధశాస్త్రిగారు మొదలగు భక్తులు పూర్ణకుంభములు గైకొని శ్రీవారికి మంగళవాద్యములతో ఎదురేగి పుష్పమాలాలంకృతులనుగావించి, స్వస్తివాచనములతో గ్రామములో ప్రవేశ##పెట్టిరి. ఆ సమయమున శ్రీ శంకరభగవత్పాదుల జయంతీ మహోత్సవ మగుటచే కీ.శే. దువ్వూరి బాలకృష్ణ మూర్తిగారు ''శ్రీవారి అధ్యక్షతను 9 రోజుల బ్రహ్మసత్రమును జరుపవలయునని యున్నది-అనుగ్రహపూర్వకముగా జరిపింపగలందులకు శ్రీవారిని ప్రార్థించుచున్నాను'' అని కోరిరి. దానికి పరమానుగ్రహముతో శ్రీవారు ఆమోదించిరి. ఆ సమయమున కీ.శే. దువ్వూరి బాలకృష్ణ మూర్తిగారు శ్రీవారి కరుణాకటాక్షమునకు బ్రహ్మానందభరితులై దేశములో నుండు పండితులకు, చాలమంది గృహస్థులకు ఈ క్రతుమహోత్సవమునకు రావలసినదిగా ఆహ్వానములను పంపిరి. పలుతావులనుండి అనేక మంది వచ్చిరి. ఆనాడు ముక్కామల అనేకమంది యతులతో, పండితులతో, గృహస్థులతో నిండి అతిరమ్యముగా భాసిల్లినది.

ఆ సమయమున నేను నెల్లూరులో ఉన్నాను. నాకుగూడ శ్రీ బాలకృష్ణ మూర్తిగారు ఆహ్వానము పంపిరి. అది మహాభాగ్యముగా నెంచి ముక్కామలకు వెళ్ళినాను. ఆ రోజున శ్రీవారి ప్రథమసందర్శనభాగ్యము నాకు లభించినది. ఆ పిమ్మట క్రతుసమాప్తి వరకు నేనచ్చటనేయుండి, శ్రీవారి అధ్యక్షతను జరుగుతున్న, బ్రహ్మసభవలె విరాజిల్లుతున్న సభను గాంచుచు శ్రీవారి ఆజ్ఞానుసారమున నేనుగూడ సభలో పాల్గొని శ్రీవారి అనుగ్రహపాత్రుడనై ప్రతిదినము శ్రీవారిదర్శనము చేసికొనుచు తీర్థప్రసాదములను గైకొని తిరిగి నెల్లూరు చేరినాను.

శ్రీవారు గుంటూరులో 1938 వ సం.లో చాతుర్మాస్యవ్రతానుష్ఠానమును పూర్తిచేసుకొని మార్కాపురంలో శారదానవరాత్ర మహాత్సవముల జరిపి, క్రమముగా మార్గశీర్ష ప్రాంతంలో నెల్లూరు (సింహపురి) నగరమునకు వేంచేసిరి. రమారమి 3 మాసములు గ్రామస్థుల ప్రార్థనానుసారము అచట నివసించిరి. ఒకానొకరోజున శ్రీవారి సమక్షములో అనేకమంది భక్తులు కూర్చుని యుండగా, ప్రసంగవశమున నేను చరమవృత్తి అని ఏదో చెప్పబోతుండగా, శ్రీవారు 'శాస్త్రీ! చరమవృత్తి యనగా నేమి?' అని ప్రశ్నించిరి. అప్పుడు 'మరణకాలీనమగు వృత్తి' అని చెప్పితిని. పిమ్మట శ్రీవారు 'ధ్యానపరిపాకావస్థయందు అనగా ధ్యానము చేయగా, చేయగా దాని పరిపాకావస్థ యందు కల్గు అఖండబ్రహ్మాకారవృత్తికి చరమవృత్తి అనిపేరు' అని సెలవిచ్చినారు. నేను అప్పుడు శ్రీవారు చెప్పినది పరమసిద్ధాంతమని నిర్ణయించుకొని నేను చెప్పినది కూడా ఎక్కడనో చదివినట్లు గుర్తుండి, అది చూచిచెబుదామను నుద్దేశముతో 'రేపు ఈ విషయమునుగూర్చి మనవిచేస్తా'ననిచెప్పి, ఆరాత్రి అద్వైతసిద్ధి అను గ్రంథమును చూడగా, అందులో 3 స్థలములలో 'చరమవృత్తిఃమరణకాలీనా అఖండబ్రహ్మాకారావృత్తిః' అని ఉన్నది. ఆ మూడుస్థలములను గుర్తుఉంచుకొని మరుసటి రోజున శ్రీవారిసన్నిధికి వెళ్ళితిని.

వెళ్ళీవెళ్ళగానే, దానినిగూర్చి ఏమయినా కనబడినదా అని అడిగినారు. అప్పడు నేను ఒక స్థలమున చదివి వినిపింపగా, 'ఇంకా రెండుస్థలములయందు చదివి వినిపిస్తావా?' అని వారే నన్నడిగారు. 3 స్థలములయందు గుర్తుఉంచుకొని ఒక స్థలము చదివినవెంటనే వారు ఈమాట అనేటప్పటికి ఆశ్చర్యచకితుడనై శ్రీవారిసన్నిధిలో ఇక నేమియు చదువ నవసరములేదని చెప్పితిని. పిమ్మట 'నీదానికి నీవు ప్రమాణముచూపితివి, నేను చెప్పినదానికి ప్రమాణమేమి?' అని ఛలోక్తిగా నన్ను ప్రశ్నించిరి. అప్పుడు 'నేను మానవమాత్రుడనుగాన, నా వాక్యమునకు ప్రమాణపేక్ష కలదు. కాని, భగవంతునిముఖనిర్గతమగు వేదమునకువలె శ్రీవారి ముఖనిర్గతమగు వాక్యమునకు ఇతర ప్రమాణాపేక్ష లేదు' అని బదులు చెప్పితిని. అప్పుడు శ్రీవారు ఉదారముగా నన్ను చూచి, 'నీకు వకాల్తనామా ఇచ్చుచుంటిని. నేను చెప్పిన వాక్యమునకు గూడ ప్రమాణమును విచారించి చూడవలసిన' దని పరమానుగ్రహముతో ఆజ్ఞ ఇచ్చిరి.

అంతవరకు ఆ మాదిరి పక్ష మున్నదని గుర్తించని నేను ఎక్కడ వెతకవలయునో అను సంగతి నాకు తెలియకపోయినప్పటికీ, శ్రీవారి ఆజ్ఞ అయినది కాబట్టి, గ్రంథములను చూచి, ఆ విషయమును నిర్ణయించవలయునని ఇంటికి చేరితిని. పిమ్మట ఏమీ శ్రమలేకుండా శ్రీవారి అనుగ్రహమువల్ల ఒక చిత్రమయిన సంఘటన జరిగినది. అదేమన నేను నా పుస్తకముల బీరువాతీసి ఒకపుస్తకమును బైటికి తీసినాను. అది భగవద్గీతకు శ్రీ మధుసూదనసరస్వతీ స్వాములవారు రచించిన గూఢార్థదీపిక యను వ్యాఖ్యానము. ఆ పుస్తకమును తెరచినాను. 18వ అధ్యాయము వచ్చినది. దానిలో ఒక ఘట్టము చదువుతూ ఉండగా, ఒక విచారము కనబడినది. అద్వైతమతములో సమస్త ప్రపంచము అజ్ఞానకృత మగుటచేత బ్రహ్మజ్ఞానకృతమగు దేహము, కర్మ మొదలగునవి నశించును గాన, బ్రహ్మవేత్తకు దేహాదులస్థితి ఎట్లా సమకూడును అని ప్రశ్నించుకొని దానికి రెండు విధములుగా సమాధానములు వ్రాసినారు.

1. సాధకునికి మొదట బ్రహ్మజ్ఞానము కలుగగానే అజ్ఞానము పరిపూర్ణముగా నశించదు. కొద్ది లేశము మిగులును. ఆ లేశము ననుసరించి వానికి దేహాదులు ఉపపన్నములు కావచ్చునుకాని, ఆ లేశముకూడ ఎప్పుడు పోవుననగా, మరణకాలమున అఖండబ్రహ్మాకారవృత్తి మరల కలిగి దానిని నశింపజేయును. అప్పుడు సంపూర్ణాజ్ఞానము నాశనమై విదేహముక్తి సిద్ధించును. ఈ విధముగా అజ్ఞానలేశము మిగులును అనే పక్షమొకదానిని వర్ణించినారు.... ఈ పక్షమున చరమవృత్తి యనగా మరణకాలీనాఖండ బ్రహ్మాకారమని అర్ధము. ఈ పక్షమున రెండుసార్లు అఖండబ్రహ్మాకారవృత్తిని అంగీకరించవలసియున్నది. ఈ పక్షములో నిరవయవమయిన అజ్ఞానమునకు లేశము మిగులుట అసంభవమని యెంచి, అజ్ఞాన సంస్కారానువృత్తి పక్షమును పిమ్మట వర్ణించినారు.

(2) ఈపక్షములో ముఖ్యమయిన అభిప్రాయమేమనగా విద్యుచ్ఛక్తి సంయోగమువలన వాయుయంత్రము (ఫ్యాన్‌) తిరుగుచూవుండగా, దాని నాపినప్పుడు విద్యుచ్ఛక్తి సంపర్కము తొలగినప్పటికి కూడా ఆ సంస్కారమువలన కొంతకాలమువరకు ఆ యంత్రము తిరిగి ఇంకో ప్రయత్నములేకుండగనే సంస్కారనాశనము కాగానే ఆగిపోవును. అదేవిధమున బ్రహ్మవేత్తకు ధ్యానపరిపాకాంతిమ క్షణమున కల్గిన అఖండబ్రహ్మాకారవృత్తి రూపజ్ఞానమువలన దేహేంద్రియప్రవర్తకమగు అజ్ఞానము సంపూర్ణముగా నశించిపోవును. విద్యుచ్ఛక్తి సంబంధములేని వాయుయంత్రమువలె సంస్కారవశమున ఈ దేహేంద్రియాదికము కొంతకాలము తిరుగును. పిమ్మట సంస్కారనాశనమువలన మరణకాలమున బ్రహ్మజ్ఞాన మక్కరలేకయే స్వయముగా దేహేంద్రియాదికము పోవును. ఈ పక్షమున చరమవృత్తియనగా ధ్యానపరిపాకాంతిమక్షణమున కల్గు వృత్తి యని అర్థము వ్రాయబడియున్నది.

అదిచూచి మరుసటిరోజున శ్రీవారిసన్నధికేగి ఇది చూపించితిని. ఇది చూడగనే నన్ను వారొక ప్రశ్న అడిగినారు: 'ఈ పుస్తకము చూడవలయునని నీకు ఎలా తోచినది?' అప్పుడు నేను 'నాకు తెలియకుండా, నాకు కనిపించకుండా ఎవరో నా కీ సహాయము చేసినారు. అంతకంటే నేను వేరే చెప్పలేను' అని మనవి చేసితిని. ఈ విధముగా వారితో సంభాషించుచున్నప్పుడు ఎన్నియో సిద్ధాంత రహస్యములు పండితులకు సైతము వ్యక్తమగుచుండును. ఈ కలికాలమున అనేకమంది ప్రజలు విచిత్రమగు బాధలతో సంశయములతో శ్రీవారి సన్నిధికరుదెంచి, కొందరు వారి సాన్నిధ్యబలముచేతను, కొందరు వారి దివ్యమూర్తి దర్శనముచేతను, కొందరు వారి దివ్యోపదేశామృతసేచనము చేతను శాంతిని పొంది తృప్తులై వెళ్ళుచున్నారు. అట్టి భగవదవతారభూతులగు శ్రీ వారిపై (70 సప్తతిజయన్తి మహోత్సవమున) ఈ వ్యాసము వ్రాయుభాగ్యము కల్గినందుకు సంతసించుచున్నాను.



ప్రేమలేని బ్రతుకు ఎడారి

విశ్వప్రేమకు బాహ్యరూపం అహింస. తోడి మానవులనే కాదు; పశుపక్ష్యాదులను కూడా మనం ప్రేమించాలి. ప్రేమలేని బ్రతుకు ఎడారి వంటిది.



నమోవాకము

--శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు

శ్రీ మద్‌ భారతకాంచీ దామాయిత కాంచినగరధామునకు నవి

ద్యామయ హరణ సుధాకలశీమంజుల దర్శనునకు సిద్ధపదునకున్‌.

స్మయదూరునకున్‌ నతసంశయ దళనున కనుపమాన శాంతినిధికి వి

స్మయకారి బోధమతి కవ్యయపద వితరణ సమర్థ పాదాబ్జునకున్‌.

దూరీకృత నతచింతాభారునకు ముముక్షు సేవ్య భవ్య మహోవి

స్తారున కద్వయ పద సంచారణ శిక్షాపదాన సంవిన్మతికిన్‌.

నతమస్తక తల సంయోజిత కరతల మాత్రధూత చిరతాపునకున్‌

ప్రతివాది ముఖపిధానా ప్రతిమా ద్వయ వాదవికచ వాగ్వల్లరికిన్‌.

పరమశమ నిరతునకు శంకరదేశిక కామకోటి కల్పిత పీఠ

స్థిర మంగళ దీపశ్రీచరణునకున్‌ మాదృశప్రసన్న శివునకున్‌.

* * *

Nadichedevudu   Chapters