Nadichedevudu   Chapters  

 

37. ''ప్రాణదాత స్వామి''

''శేషయ్యగారూ, ఆ ఆనందాన్ని నేను అనుభవించగలనేగాని, వివరించలేను. అది చాలు నా జీవితానికి'' అంటూ, అతిథిసత్కారాలతో తృప్తి పరచడానికి యత్నిస్తారే గాని, కామకోటిస్వామివారితో విలువైన తన అనుభవాలు మూట విప్పరు 'చావలి శాస్త్రిగారు' (పూర్తి పేరు శ్రీ చావలి సుబ్రహ్మణ్యశాస్త్రి.)

కంచిస్వామి సూచనలపై శ్రీ శాస్త్రిగారు చేసిన దానధర్మాల, కట్టించిన గుళ్లు గోపురాల విలువ కోట్ల సంఖ్యలో పడింది.

శ్రీ శాస్తిగారు దివంగతులైనందున తన తండ్రిగారి అనుభవాలను వారి కుమారులు శ్రీ చావలి శ్రీకృష్ణగారు సప్రామాణికంగా నాకు అందజేశారు!....

కీర్తిశేషులైన మా తండ్రి గారు చావలి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి, కంచికామకోటిపీఠం పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిమహాస్వామికి గల పరిచయం దాదాపు 45 సంవత్సరాలు.

1943 లో ఒకమారు మా నాన్నగారూ, మా అమ్మగారూ, నేనూ, మా కుటుంబంలో మరి కొందరూ కలిసి, కంచిపీఠానికి స్వామివారి దర్శనం కోసం వెళ్ళాము. స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరులకు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తూ చేస్తూ శ్రీవారు మా నాన్న గారిని దగ్గరకు రమ్మని సౌంజ్ఞ చేశారు. మా నాన్నగారు స్వామివారి దగ్గరకు వెళ్ళారు.

''కొంచెం సేపు ఉండి ప్రసాదం తీసుకువెళ్లు. మదరాసులో మీటింగు పని రేపు చూసుకోవచ్చు''

మా నాన్నగారికీ, అమ్మగారికీ ప్రసాదం ఇస్తూ ''తరచుగా వచ్చి అమ్మ వారి దర్శనం చేసుకుని వెళుతూ ఉండండి. మీకు మేలు కలుగుతుంది'' అన్నారు శ్రీవారు.

అంతకు పూర్వం మా నాన్నగారు అప్పుడప్పుడు తిరువన్నామలైలో శ్రీరమణమహర్షి వద్దకూ, పాండిచేరిలో శ్రీ అరవిందయోగి దర్శనానికి వెళుతుండేవారు.

శ్రీ రమణులు సిద్ధి పొందిన తరువాత కామకోటిపరమాచార్యులే తరచూ తమ కళ్లకు కట్టుతుండేవారని మా నాన్నగారు అనేవారు.

అనంతరం 1952లో కంచిస్వామివారు మదరాసు వచ్చి మైలాపూరు సంస్కృత కళాశాలలో ఉండగా మా అన్నగారికీ, నాకూ ఉపనయనం జరిగింది. మా నాన్న గారు మా అన్నదమ్ములను వెంట బెట్టుకుని సంస్కృతకళాశాలలో స్వామివారి దర్శనం చేయించారు. స్వామి మమ్మల్ని ఆశీర్వదించి, ''అమ్మవారి కటాక్షం వల్ల ఇకమీదట మీకు అంతా వైభవంగా జరుగుతుంది'' అని దీవించారు.

మా నాన్నగారి అనారోగ్యం

1978 లో ఒకసారి ఉన్నట్టుండి మా నాన్నగారికి తీవ్రంగా జబ్బు చేసింది, స్పృహ తప్పిపోయిన స్థితిలో వారిని హాస్పిటల్‌లో చేర్పించాము. స్వామివారప్పుడు హంపి మకాంలో ఉన్నారు. నా సోదరుడు శ్రీ రామ్‌ హంపి వెళ్లి మా నాన్నగారి జబ్బు సంగతి శ్రీవారికి విన్నవించాడు. ఆ వార్త వింటూనె శ్రీవారు తన వంటికి విభూతి రాసుకుని, దాని నొక విస్తరిలోకి విదిలించి, దానిని పట్టుకువెళ్లి నీళ్లలో కలిపి మా నాన్నగారి చేత తాగించ మన్నారు. మా తమ్ముడు విభూతి తేగానే శ్రీవారు చెప్పినట్లు చేశాము. పదిరోజుల నుండి స్పృహ లేకుండా ఉన్న మా నాన్నగారు ఆ భస్మపునీరు గొంతులోకి పోగానే కళ్ళు తెరిచి నిద్రనుంచి లేచినట్లు లేచి కూర్చున్నారు. డాక్టరులంతా ఆశ్చర్యపోయినారు. అది మొదలుకొని 1982 వరకూ మా తల్లితండ్రు లెవ్వరికీ ఏ అనారోగ్యం లేకుండా చక్కగా జరిగింది.

శ్రీవారికీ మానాన్నగారికి ఎడతెగని సంబంధం ఏర్పడింది. శ్రీవారి భక్తులలో ఎవరికైనా వివాహాలు, చదువులు తదితర సహాయాలు ఏవి కావలసి వచ్చినా వారిని స్వామి వారు మా నాన్నగారి దగ్గరకు పంపించే వారు. శ్రీవారి వాక్కులు అమ్మవారి వాక్కులుగా భావించి మా నాన్నగారు తన దగ్గరకు వచ్చిన వారిని సర్వవిధాలా సత్కరించి సంతృప్తి పరిచే వారు. అయినా సహాయం చేసినట్టు తన పేరు వ్రాయనిచ్చేవారు కారు.

1981-82లో తిరువాలూరులో బృహదీశ్వర ఆలయానికి రెండు గాలి గోపురాలకు మా నాన్నగారు పదిలక్షలరూపాయలు ఎవరికీ తెలియకుండా విరాళంగా ఇచ్చారు. ఆలయాధికారులు మా నాన్నగారి పేరు వ్రాస్తానంటే అందుకు అంగీకరించక, కంచిస్వామి వారి పేరు వ్రాయవలసిందన్నారు.

అమ్మగారికి ప్రాణదానం

1982లో మా తండ్రిగారికి శతాభిషేకం జరిగింది. శతాభిషేకానికి జరపవలసిన ప్రక్రియ యావత్తు శ్రీవారే వ్రాయించి పంపారు. యధావిధిగా జపాలు, హోమాలు వగైరా జరుగుతూ ఉన్నవి. రెండవ రోజున మా అమ్మగారికి హఠాత్తుగా జబ్బు చేసింది. ఆమెకు మధుమేహం ఉన్నందు వల్ల కోమాలోకి వెళ్లింది. ఆమె స్థితిని చూసి మేమందరమూ ఆందోళన పడ్డాము. మా తండ్రిగారు మాత్రం చలించలేదు. అప్పుడు స్వామి వారు దేశసంచారం చేస్తూ ఉగార్‌ అనే గ్రామంలో ఉన్నారు.

వెంటనే నేను మద్రాసునుండి విమానంలో హైదరాబాదుకు వచ్చి, అక్కడి నుంచి కారులో బయలుదేరి రాత్రి 2 గంటలకు ఉగార్‌ చేరుకున్నారు. స్వామి వా రప్పుడు నిద్రలో ఉన్నారు. చూడడానికి వీలులేదని శిష్యులన్నారు. వేకువజాము నాలుగున్నర గంటల వరకు నేను కారులోనే ఉండి, అప్పుడు స్వామిని చూడడానికి వెళ్లాను. నేను ఫలానా అని చెప్పగానే శ్రీవారు నన్ను పిలిచి ఈ రాత్రివేళ హఠాత్తుగా రావడానికి కారణమేమి అని అడిగారు. మా నాన్నగారికి శతాభిషేకం సందర్భంగా జపాలు ప్రారంభించామని, ఉన్నట్టుండి రెండోరోజున మా అమ్మగారికి జబ్బుచేసి కోమాలో ఉన్నదనీ, ఆసుపత్రిలో చేర్చామని, ఏమి చెయ్యడానికి తోచక తమ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చానని స్వామికి విన్నవించాను.

స్వామి కళ్లు మూసుకుని కొన్ని నిముషాలు ధ్యానం చేసి ''ఏమీ ఫరవాలేదు. మీ అమ్మగారికి భయం లేదు. మీ నాన్నగారు చేసిన దానాలు, ఘనకార్యాల వల్ల కొంత దృష్టి వచ్చింది. ఇక మీదట అంతా సక్రమంగా జరుగుతుందని'' ధైర్యం చెప్పి కొద్దిగా పంచదార పొట్లం కట్టి ఇచ్చి, దానిని మీ అమ్మగారి నోట్లో వెయ్యవలసిందని ఆదేశించారు.

''తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్నిగంటలకు ఉన్న'' దని స్వామి నన్నడిగారు. 7 గంటలకని చెబుతూ విమానం అందుతుందో అందదో అన్నాను. భయంలేదు. విమానం అందుతుందిలే, వెళ్లు అన్నారు శ్రీవారు.

అయినా నాకు విమానం అందుతుందని నమ్మకం లేదు. అందదేమో అనే సందేహంతోనే హైదరాబాదు చేరాను. ఇంటికి వెళ్ళి విమానం సంగతి ఫోనులో అడుగగా విమానం గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. సీట్లు కూడా ఉన్నవని చెప్పారు.

త్వరగా వెళ్ళి విమానంలో కూచున్నాను. విమానం అందిందే గాని, నేను మద్రాసు చేరేలోపల అమ్మగారి స్థితి ఎలా ఉంటుందో ఏమో అని ఆందోళన పడుతూనే ఉన్నాను, మానవమాత్రుణ్ణి కాబట్టి. మద్రాసులో విమానాశ్రయం వద్దకు కారు వచ్చింది. ''అమ్మ స్థితి ఎలా ఉన్న'' దని ఆదుర్దాగా డ్రైవరును అడిగాను. ''వేకువఝూమునే నాలుగున్నర గంటలకు అమ్మగారు కళ్ళు తెరిచారు'' అని డ్రైవరు చెప్పగానే 'అమ్మయ్యా' అనుకున్నాను. విచిత్రం. సరిగ్గా నాలుగున్నర గంటలకే ఉగార్‌లో స్వామివారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి, ప్రసాదం నా చేతికిచ్చి భయంలే దంటూ నన్ను పంపించారు.

నేను మద్రాసు చేరగానే స్వామివా రిచ్చిన చక్కెరప్రసాదం పాలల్లో కలిపి మా అమ్మగారి చేత తాగించాను. ఆ పాలు తాగడంతోనే మా అమ్మగారు కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టింది. అటు తరువాత మా తల్లితండ్రులు పార్వతీపరమేశ్వరులు లాగా శతాభిషేకం సక్రమంగా, సలక్షణంగా జరుపుకున్నారు! 1983లో మా అమ్మగారు ఉత్తరాయణపుణ్యకాలంలో పౌర్ణమి శుక్రవారంనాడు స్వర్గస్థులైనారు. ఆ సంవత్సరం శ్రీవారు కర్నూలులో ఉండగా మేము శ్రీవారి దర్శనం చేసుకుని అమ్మగారు కాలం చేసిన సంగతి శ్రీవారికి చెప్పాము.

''మీ అమ్మగారు సంవత్సరం క్రితమే కాలం చేసి ఉండవలసింది. కాని శ్రీ కామాక్షి అమ్మవారు మీ అమ్మగారి ఆయుర్దాయం ఒక సంవత్సరం పొడిగించింది. మీ అమ్మగారు కొడుకులతో, కోడండ్లతో, మనుమలు, మనుమరాండ్రతో సర్వసౌఖ్యములూ అనుభవించి, మీ నాయనగారి శతాభిషేకం సలక్షణంగా జరుపుకుని ఉత్తమ లోకానికి వెళ్ళింది. ఆమెకై మీరు ఏమాత్రం చింతించ పనిలేదు. ఆమె ఎంతో అదృష్టవంతురాలు'' అంటూ శ్రీవారు మమ్ము ఓదార్చారు.

మళ్ళా మా తండ్రిగారికి ప్రమాదస్థితి:

1987లో మా ఉమ్మడి స్థలంలో 30 గ్రౌండ్లు ఏదైనా ధర్మకార్యాల వినియోగం కొరకు అగ్రిమెంటు వ్రాసుకున్నాము. ఆ స్థలాన్ని ఏ విధంగా వినియోగించవలెనో స్వామివారితో సంప్రదించి, వారి సలహా ప్రకారం చేదామనుకున్నాము. ఇంతలో ఆ సంవత్సరం మార్చి నెలలో మా నాన్నగారికి మళ్ళా జబ్బు చేసింది. ప్రమాద స్థితిలో వారిని హాస్పటల్లో చేర్పించాము. వారికి శ్వాస కూడా పీల్చుకోలేని పరిస్థితి సంభవించింది.

మేము కంచికి వెళ్ళి శ్రీవారిని దర్శించి, ఈ వార్త వారికి వినిపించాము. వెంటనే శ్రీవారు కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి స్వయంగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు చేసి, ఆ ప్రసాదం మా నాన్నగారికి ఇవ్వమని చెప్పి ఇంకా ఇలా అన్నారు.

''కామాక్షి అమ్మవారు మదరాసు నగరంలో మీ తండ్రిగారి చేత తనకొక ఆలయం నిర్మించుకోవాలి అని సంకల్పించింది. అంతవరకూ మీ నాన్నగారికి ఏ భయమూ ఉండదు'' అని అభయమిచ్చారు. శ్రీవారిచ్చిన ప్రసాదం తెచ్చి మా నాన్నగిరికి ఇవ్వగానే వారికి ప్రమాదస్థితి తప్పిపోయింది. ఆపోలో ఆస్పత్రిలోని డాక్టర్లు అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. ''మీ నాన్నగారు కేవలం ఆత్మశక్తితో, ఎవరి ప్రభావంతోనో జీవించి ఉన్నారే గాని క్లినికల్‌గా మాత్రం వారు ప్రాణంతో లేనట్టే. ఊపిరితిత్తులు ఇంత బలహీనంగా ఉన్నా 87 సంవత్సరాలు వారిలా జీవించి ఉండడం అసామాన్యం''అని వారంతా అన్నారు.

ఆలయ నిర్మాణం

అటు తరువాత మా నాన్నగారిని ఆస్పత్రి నుండి ఇంటికి తెచ్చాము. శ్రీవారి ఆనతి ప్రకారం మా ఇంటి ప్రక్కనున్న మా స్థలంలోనే 1987 మే నెల 4వ తేదీ శ్రీలక్షీ కామాక్షి అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణానికి ముందు ప్రభుత్వం నుంచీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచీ ఎన్నో అనుమతులు వగైరా కావాలి. అయినా అవి అన్నీ శ్రీవారి అనుగ్రహం వల్ల వెంట వెంటనే లభించినవి. 1987 ఆఖరుకు ఆలయనిర్మాణం చాలా వరకు పూర్తి అయింది.

ప్రతి శుక్రవారం మా నాన్నగారికి కామాక్షి అమ్మవారు స్వప్నంలో కనిపించేవారు. మా నాన్నగారు ముప్పొద్దులూ 'చంద్రశేఖరా, చంద్రశేఖరా' అంటూ శ్రీవారిని సంస్మరిస్తూ ఉండేవారు. ఆ స్థితిలోనే ఒకమారు మా నాన్నగారిని శ్రీవారి దర్శనానికి కారులో కంచికి తీసుకువెళ్ళాము. మా నాన్నగారు స్వామివారిని చూడగానే సాష్టాంగ నమస్కారంచేయడానికి పూనుకున్నారు. మేమంతా వారికి సాయపడబోగా 'మీరెవ్వరూ వారిని పట్టుకోకండి. వారిని వదిలి పెట్టండి' అన్నారు. అంత దుర్భలస్థితిలో ఉండి మా నాన్నగారు ఎవరి సహాయం లేకుండా శ్రీవారికి అయిదుసార్లు సాష్టాంగనమస్కారం చేశారు. అందరూ ఆశ్చర్యపోయినారు.

''ఆలయనిర్మాణానికి ఏవిధమైన ఆటంకం ఉండదు. ఆదాయపు పన్నుకు సంబంధించిన ఏ ఇబ్బందులున్నా, అవి అన్నీ పరిష్కారమై, నిర్విఘ్నంగా నిర్మాణం పూర్తి అవుతుంది.'' అంటూ శ్రీవారు అభయప్రదానం చేశారు. ఎంతో సంతృప్తితో మేమంతా మద్రాసునుండి తిరిగి వచ్చాము.

1988 ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం మానాన్నగారు ఎప్పటివలె నిద్రలేచి, కాలకృత్యాలన్నీ తీర్చుకుని, పక్కమీద పడుకుని, నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. అనాయాస మరణం వారిది.

మేము శ్రీవారి దగ్గరకు వెళ్ళి వారికి మానాన్నగారు దివంగతులైన సంగతి తెలియజేశాము.

స్వామివారిలా అన్నారు మాతో. ''మీ నాన్నగారు ఎంతో పుణ్యమూర్తి. అరుదుగా గాని అట్టి వారుండరు. జీవించి ఉండగా మీనాన్నగారు అమ్మవారి ఆలయం పూర్తిచెయ్యలేదని మీరెంతమాత్రం విచారపడవద్దు. ఆ కార్యం మీవల్ల పూర్తి కావలసి ఉన్నది. ఆ అదృష్టం మీకుదక్కుతుంది. ఆలయం పని పూర్తిచేసి పుణ్యం మూట కట్టుకోండి!'' అని ఆశీర్వదించారు.

శ్రీవారి ఆశీర్వాద ఫలితంగా, అప్పటికి రెండుసంవత్సరాలనుంచి ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంటు నాకు బిగపట్టినందువల్ల మా చేతికి రాని పెద్దమొత్తం వడ్డీతో సహా మాకు లభించింది.

దేవాలయనిర్మాణం పూర్తి కావచ్చింది. ఆలయనిర్వహణకూ, 108 మంది వేద పండితుల గృహనిర్మాణానికి ''శ్రీ చంద్రశేఖరమహాస్వామిట్రస్టు'' అనుపేరుతో ఒక ధర్మసంస్థ ఏర్పాటుచేశాము.

మా నాన్నగారికి శ్రీవారిపై గల భక్తి అనన్యం. స్వామివారికి మా నాన్నగారిపై గల అనుగ్రహం అపారం. శ్రీవారు సంకల్పిస్తే మా నాన్నగారు ఎటువంటి పని అయినా దానిని నెరవేర్చేవారు. ఒకసారి శ్రీవారు ఏలూరులో ఉండగానూ, మరొకమారు ఉగార్‌లో ఉన్నప్పుడూ, మా నాన్నగారు మహామాఖమప్పుడు కుంభకోణం నుంచి విమానంలో తీర్థం తెప్పించి, ఆ తీర్థంతో శ్రీవారిని స్నానం చేయించారు.

శ్రీవారికీ మా నాన్నగారికీ గల అన్యోన్య సంబంధం అటువంటిది. మా నాన్నగారు చేసిన సేవలవల్ల శ్రీవారి అనుగ్రహం మాయింటిల్లిపాదికీ, మా కుటుంబ మంతటికి లభ్యమైంది.

- చావలి శ్రీకృష్ణ



Nadichedevudu   Chapters