Nadichedevudu   Chapters  

 

35. ''నేనంటే స్వామికి ఎక్కువ యిష్టం''

స్వామికి సన్నిహితు లైనవారు ఒక వింత అనుభవం పొంది ఆనందిస్తారు.

''నే నంటే స్వామికి ఎక్కువప్రీతి. అందరికంటె స్వామి నన్నే ఎక్కువ ఆదరిస్తారు. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. నా విషయం, నాకుటుంబ విషయం అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారు. అందరికంటే నేనే స్వామి అనుగ్రహానికి పాత్రుణ్ణి!''

విశేష మేమంటే, ఈ విధమైన భావాన్ని స్వామి ఎందరెందరికో కలిగిస్తారు. ఇది స్వామికి సహజమో, ప్రయత్న పూర్వకమో ఋజువు చెయ్యడం కష్టం. సహజమేనని నా నమ్మకం. కాకపోతే, అందరినీ సమధికంగా తృప్తిపరచడం మానవమాత్రులకు సాధ్యామా? అపూర్వమూ, అనితరసాధ్యమూ అయిన ఈ లక్షణం దైవాంశసంభూతులకే సాధ్యం.

మన పురాణాలు తిరగవేస్తే రామ, కృష్ణుల్లాంటి అవతారమూర్తులు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది.

శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసకేళి సలిపే టప్పుడు ''ఆత్మారాముండయ్యును గోపసతు లెందరో అందరకు నందరై నిజ ప్రతిబింబంబు తోడన్‌ క్రీడించు బాలుర పోలిక'' కేళి సలిపెనట - భాగవతం, దశమస్కంధం.

అదేవిధంగా పట్టాభిషేకానంతరం రామచంద్ర ప్రభువు వానరసేనను సంభావించినప్పుడు వానరు లొక్కొక్కరూ ''ప్రభువు నన్ను చూసే నవ్వాడనీ, నా వైపే చేతులు చాచాడనీ, నన్నే పలకరించాడనీ, నన్ను మెచ్చుకున్నాడనీ,'' పలువిధాల సంతోషించారట.

న్యూనాధిక తారతమ్యం లేని ఈ భావం దివ్య పురుషులకు మాత్రమే సాధ్యం! కీర్తి శేషులు శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారీ కింది శ్లోకంలో ఇదే భావాన్ని ప్రకటించారు.

మయ్యేవ పూర్ణాsస్తి గురోర్దయేతి

సర్వస్య శిష్యస్య నిరూఢభావః|

తథావిభక్తాs పి దయావ్యయాsస్య

సర్వేశ్వరో మేయదయోహినాన్యః||





హరిహర స్వరూపం

శంకరనారాయణ స్వరూపమూ అర్థనారీశ్వర స్వరూపమూ రెండూ ఒకటేనని చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలు ఉన్నాయి. మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం; ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగమని చెప్పడానికి పురాణాల మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు. దక్షిణాన తిరునెల్వేలి జిల్లాలో శంకర్‌నయనార్‌కోయల్‌ అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు. ఇలాగే మైసూరు, మహారాష్ట్రల మధ్య 'హరిహర' క్షేత్రంలో హరి, హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు.

Nadichedevudu   Chapters