Nadichedevudu   Chapters  

 

32. భక్తజన సులభులు

భక్తులపై స్వామికిగల వాత్సల్యం అంతా యింతా కాదు. భక్తులను సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ చెప్పశక్యం కాదు.

ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేకమంది భక్తులు జీవితంలో తమ కష్టసుఖాలను గురించి సంసారంలోని చిక్కులను గురించీ స్వామితో తమ సమస్యలు చెప్పబోయే సరికి - భక్తి చేతనో, భయం చేతనో, మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెబుతారు. అసలు తాము చెప్పదలచింది మరిచిపోతారు, సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపరు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని అనుకోరు. వారి బాధ ఏమిటో తెలిసికోడానికి ప్రయత్నిస్తారు. వారి మనస్సులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలడిగి, తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింప జేస్తారు.

చూడ వచ్చినవారి పెద్దలను గురించీ, వారి బంధువర్గాన్ని గురించీ పేరుపేరునా అడిగి, వాళ్ల యోగక్షేమా లన్నిటినీ తెలుసుకుంటారు. తమ దూరపు బంధువులను, ఒకవేళ భక్తులెవరైనా మరిచిపోతారేమోకాని, స్వామికిమాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర స్వామి జ్ఞాపకశక్తి అనే బీరువా అరలో ఎలా భద్రపరిచి ఉంటుందో ఊహకు అందని విషయం! మఠం వ్యవహారాలను స్వామి స్వయంగా చూచుకునే రోజులలో భిక్ష చెయ్యడానికి వచ్చిన భక్తులు ఆ రోజు భిక్షకు కావలసిన సామగ్రిని - కూరగాయలతో సహా -తట్టలతో, పళ్లేలతో తెచ్చి స్వామి ముందు ఉంచేవారు. సాధారణంగా భిక్షకు తెచ్చే సామానంతా, ఇంటియజమాని స్వయంగా వెళ్లి, మార్కెటులో దొరికే వస్తువుల్లో మేలురకాలను ఎంచి, శ్రేష్ఠమైన వస్తువులనే సేకరించి తెస్తాడు. వాటి నన్నటిని చూచి స్వామి మెచ్చుకోవాలని భిక్ష చేసే వారి కోరిక. వారి హృదయాన్ని కనిపెట్టిన స్వామి ప్రతి వస్తువునూ స్వయంగా చేత్తో ముట్టుకుని పరీక్షించి చూస్తారు.

స్వామి భుజించేవి కాకపోయినా, కుంకుమపువ్వేమిటి, పచ్చకర్పూర మేమిటి, జీడిపప్పేమిటి, సీమబాదం పప్పేమిటి - (స్వామి ఆహారం సాధారణంగా పేలాలూ, మజ్జిగా, ఏవో కొన్ని పండ్లూ) - రకరకాల కూరగాయలు, అవన్నీ ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయో ఆయా భాషల్లో వాటి పేర్లేమిటో, వాటితో ఎన్ని విధాలైన వంటకాలు చేయవచ్చునో, ఆయుర్వేదం ప్రకారం వాటి గుణగణాలేమిటో, - మనకు తెలియని వివరాలన్నీ ప్రశ్నోత్తరాల మూలంగా స్వామి భక్తుల నుంచి రాబట్టుతారు.

చిన్నతనం నుంచీ సన్యాసదీక్షలో ఉండి, ఆహార విహారాల్లో కఠిన నియమాలను అవలంబిస్తున్న ఈ స్వామి 'వస్తుగుణదీపిక' నంతా కంఠస్థం చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది. కాని, స్వామికి అదొక లీల. తాను చెప్పే మాటలవల్లా, తాను చేసే పనులవల్లా భక్తులు ఆనందించాలి. వారి ఆనందం చూచి తానూ తనివి చెందాలి!

ఈ సందర్భంలో నా కొక సంగతి జ్ఞాపకం వస్తున్నది. ఇది జరిగి ఇరవై ఏళ్లు దాటింది. ఆంధ్రదేశ సంచారంలో స్వామి గుంటూరు జిల్లా రేపల్లెలో మకాం చేస్తున్నారు.

నా ప్రతి జన్మదినానికీ స్వామిని సందర్శించి, వారి ఆశీస్సులు పొంది రావడం నాకు అలవాటు. ఆ సంవత్సరం నా కుటుంబంతో సహా విజయవాడ నుంచి బస్సులో రేపల్లె బయలుదేరాను.

కార్యక్రమం యావత్తు యథావిధిగా ముగిసింది. ఆ రోజు మధ్యాహ్నం మమ్ముల నందరినీ అక్కడే మఠంలో భోంచెయ్య మన్నారు. అందరం కలిసి వనభోజనంలా చెట్ల నీడను భుజిస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారో ఏమో, మేము భోజనాలు చేసే చోట స్వామి ఒక బల్లపైన కూచున్నారు. మా విస్తళ్లల్లో వడ్డించిన శాకపాకాలు చూసి, వాటిని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఏయే వంటకాలు, ఏ ప్రాంతంవారు, ఏ విధంగా తయారు చేస్తారో వివరంగా చెప్పసాగారు.

స్వామి మాటలు వింటూ ఉంటే, భోజన పదార్థాలు మాకు మరింత రుచిగా తోచాయి. వారి మాటలు ఆలకిస్తూ, ఇన్ని విషయాలను గురించి ఇంత పరిజ్ఞానం పుట్టు సన్యాసి అయిన ఈ స్వామికి ఎలా అమరిందా అని ఆశ్చర్యపోతూ ఆనందంగా భోంచేస్తున్నాం.

ఇంతలో ఎక్కడినుంచి ఊడి పడ్డాడో మఠం మేనేజర్‌ శ్రీ విశ్వనాథయ్యర్‌, దూరంనుంచే స్వామినిచూసి, ఉరుమినట్టు బిగ్గరగా, ''స్వామికి ఇహ విశ్రాంతి అంటూ అక్కరలేదా? పగళ్లూ, రాత్రులూ భక్తులతో సంభాషణ లేనా?'' అని అరిచాడు. విశ్వనాధయ్యరు ఎంతో కాలంగా మఠం మేనేజరుగా ఉండి, పీఠాన్ని, స్వామినీ సేవిస్తున్నాడు. స్వామిపై ఆయనకు అంత స్వతంత్రం.

కేక వింటూనే స్వామి గబగబా లేచి, కాషాయం సర్దుకుని, పసిపిల్లవాడు పరుగెత్తినట్టు మమ్మల్ని వదిలిపెట్టి, పాకలోకి ప్రవేశించారు.

భక్తులపై స్వామికి అంత అనురాగం. తన నిద్రాహారాలు ఆయన కొక లెక్కలోవి కావు.

''దళ##మైన పుష్పమైనను

ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్‌

గొలిచిన జనులర్పించిన

నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుజింతున్‌''

అని కుచేలోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు అన్నట్టు, స్వామికి మనం సమర్పించే టెంకాయలూ, అరటిపండ్లూ కావు; ఆ మహనీయునిపై మనకు గల భక్తి అమూల్యం.

సౌజన్య సింధువు స్వామి!

* * *





సినిమాలు : చిత్తశాంతి

నాట్యజీవనులైన భరతపుత్రులకు కొన్ని నియమాలు ఉండేవి. నాటకంలో దంపతుల వేషాలు ధరించే స్త్రీపురుషులు జీవితంలో దంపతులై ఉండాలేగాని, పరపురుషునికి భార్యగా స్త్రీ నటించకూడదు. నేటి నాటకాలలోనూ, సినిమాలలోనూ ఈ నియమాన్ని ఉల్లంఘించడంవల్ల సంఘంలో బహిరంగంగా నేమి, చాటుమాటుగా నేమి అవినీతి ప్రబలిపోతున్నది. ఇంతకూ, నేటి సినిమాలు కామాది ప్రకోపనమే పనిగా పెట్టుకున్నవి. చిత్తశాంతినీ, ఆనందాన్నీ చేకూర్చే నాటకాలు, సినిమాలు మృగ్యమైనవి.

Nadichedevudu   Chapters