Nadichedevudu   Chapters  

 

29. కలియుగ ఋష్యశృంగులు!

1960 మేనెల. స్వామి మధుర సమీపాన ఇలయత్తాన్‌గుడిలో మకాం చేస్తున్నారు. కుటుంబంతోసహా మేము రామేశ్వర యాత్రకు బయలుదేరాము. మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకుని, ఇలయత్తాన్‌గుడికి మధ్యాహ్నానికి చేరుకున్నాము.

ఆనాడే స్వామి జన్మనక్షత్రం. ప్రచండంగా ఎండకాస్తున్నది. నాటుకోటిసెట్లు కట్టించిన అలవిమాలిన సత్రంలో స్వామి, ఒకమూల, చీకట్లో, బియ్యం బస్తాలు పేర్చి ఉన్న చోట బాచిపెట్లు పెట్టుకు కూచుని ఉన్నారు. భక్తులైనా ఎక్కువమంది లేరు. కొందరు సువాసినులు పళ్లూ, పూలూ తెచ్చి స్వామికి సమర్పిస్తున్నారు. కొందరు హారతులు పడుతూ పాటలు పాడుతున్నారు.

ఆ సత్రపు భవనం ఎంత పెద్దదంటే, బయట ఒకవేళ ఒకబాంబు వేసినా, ఆ శబ్దం లోపలికి వినిపించదు. పాపం శమించుగాక!

కొంతసేపు ఆ కార్యక్రమం కొనసాగింది. ఇంతలో వెలుపలి నుంచి వచ్చిన భక్తులను స్వామి అడిగారు అరవంలో, 'బయట వర్షం కురుస్తున్నదా?'

భక్తులు: ఆహా, కురుస్తున్నది.

స్వామి: పెద్దవర్షమా?

భక్తులు: బ్రహ్మాండంగా కురుస్తున్నది. మేము సత్రానికి బయలుదేరి వచ్చేప్పుడు ఎండలో మా తలలు మాడిపోయాయి. కాళ్లు కాలాయి.

ముత్తయిదువులు స్వామికి హారతులుపట్టే సమయానికి పిలిస్తే వచ్చినట్టు వచ్చింది అంత పెద్దవర్షం - ఆ మేనెల ఎండల్లో!

ఇలాగే ఒకసారి స్వామి సూళ్లూరిపేట ప్రవేశించగానే, ఉన్నట్టుండి వర్షం పట్టుకుంది. ధారాపాతంగా కురిసింది. ఆ ఊరివారు నాతో చెప్పారు. కొన్ని నెలలుగా వర్షాలు లేక అవస్థ పడుతున్నామని!

మరొక నిదర్శనం:

1983 జులై నెలలో కర్నూలు పట్టణంలో కామకోటి పీఠంస్వాములు చాతుర్మాస్యం చేశారు. పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, మూడవ ఆచార్య స్వామి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ముగ్గురూ ఆ చాతుర్మాస్యంలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ, పరిసర ప్రాంతాలనుంచికూడా ఆచార్యత్రయాన్ని సందర్శించడానికి వేలాది ప్రజలు అరుదెంచారు.

స్వాములు కాలు పెట్టడానికి పూర్వం కర్నూలులో నీటికరవు ఏర్పడింది. చాతుర్మాస్యం జరిగే స్థలంలో మరింత ఎద్దడి సంభవించింది. నూరు, నూట ఇరవై మీటర్ల లోతున బోర్లు త్రవ్వినా నీరు పడలేదు. అయినా పరమాచార్యలు సూచించిన ప్రదేశంలో 20 మీటర్ల లోతుకే సమృద్ధిగా నీరు పడడం చూచి, పురజనులు ఆశ్చర్యపడ్డారు.

అంతేకాదు; ఒక ఆదివారం ఉదయం ముగ్గురు స్వాములూ సమీపంలో ఉన్న నదిలో స్నానానికి వెళ్లినప్పుడు అక్కడ మోకాటి లోతుకంటే నీరులేదు. అద్భుత మేమంటే, వ్యాసపూజ జరిగిన 12 గంటలకు ఎక్కడనుంచి వచ్చిందో కట్టలు తెగేట్టు నీరు ప్రవహించింది. ఆ మరునాడు కర్నూలు పట్టణంలో వర్షం ప్రారంభ##మైంది.

జగద్గురువులు పాదంమోపిన ఫలితమని పట్టణవాసులంతా ఆనందంలో ఓలలాడారు!

* * *

వాల్మీకి రామాయణం బాలకాండలో ఋష్యశృంగుని గురించి ఇలా వర్ణించబడింది:

తత్ర చానీయ మానేతు

విప్రేతస్మిన్‌ మహాత్మని

వవర్ష సహసాదేవో

జగత్‌ ప్రహ్లాదయం స్తదా.

(మహాత్ముడగు ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో కాలిడి నంతనే సర్వ ప్రపంచానికి సంతోషం కలిగేట్టు శీఘ్రంగా వర్షం కురిసింది).

స్వామి కలియుగ ఋష్యశృంగులు!

* * *









నేటి ప్రమాణాలతీరు

ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మశాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి. ఆ తరువాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి.

కాని, ఈ కాలంలో అన్నీ తల క్రిందు అయ్యాయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి; చిట్టచివరకు వేదం ప్రమాణం!

జగద్గురు ప్రశస్తి

జపేన హోమేనచ సాధనేన పరేణ చేతో విమలత్వ మాప్తుం,

అశక్త ఆప్నోమి తదీయ పాదౌ ఇష్టార్ధసిద్ద్యై శరణాగతస్సన్‌.

చిత్తశుద్ధి సంపాదించుకొనడానికి జపాలను, హోమాలను, ఇతర కష్టసాధనాలను నేను ఆచరించలేను. స్వామి పాదాలనే ఆశ్రయిస్తున్నాను.

యోగధ్యాన తపో2ర్చనాదిక విధై రేతేనయా సాధనై

ప్రాప్తా శక్తి రనేకరీతి విభవా లేశో2పి తస్యామయి,

స్యందేతేతిచ జన్మనస్సఫలతా స్యాదిత్యహం భక్తిత

స్తచ్చారిత్ర పవిత్రభావన జలైః ప్రక్షాళ##యే మేమనః.

యోగధ్యానాది సాధనములచేత స్వామి ఏ శక్తిని సంపాదించారో దానినుండి లేశ##మైనా నా పైన చిందుననీ, జన్మసాఫల్యం కలుగుననీ ఆశిస్తూ స్వామి పావన చారిత్ర భావనమనే జలంతో నా మనస్సును కడిగివేస్తూ, శుద్ధి చేసుకుంటున్నాను.

* * *





వేదం - రామనామం

వేదవేద్యుడగు పరమపురుషుడు దశరథాత్మజుడుగ అవతరించినందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణగి ఉంది. ఆ రామనామం చిత్త మాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలుగనీయక, సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది.

Nadichedevudu   Chapters