Nadichedevudu   Chapters  

 

28. మూగికి మాటలు!

శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని, సమీపంలో ఉన్న ఆనందతాండవపురం చేరారు.

ఆ ఊరిలో పండితులూ, ప్రజలూ స్వామికి అఖండస్వాగతం సమర్పించారు.

ఆ జనసమూహంలో అనేకమంది బాలు రున్నారు. ఆ బాలు రందరినీ పిలిచి, 'శ్రీ రామాయనమః' అని నూరు పర్యాయాలు వ్రాసి, ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసినదిగా స్వామి వారికి చెప్పారు.

అదేవిధంగా వారంతా 'శ్రీరామాయనమః' అని నూరుసార్లు వ్రాసి, ఆ పత్రాలన్నిటిని స్వామికి సమర్పించారు.

వారందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి బహూకరించారు.

వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ, స్వామి అరవంలో ''సొల్లు, సొల్లు.'' నీవు వ్రాసింది నీ నోటితో 'చెప్పు చెప్పు' అని ఆదేశించారు.

అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితు లందరూ ''అయం మూకః, అయం మూకః'' (అతడు మూగవాడు, మూగవాడు) అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు.

అయినా, స్వామి వారి మాటలను విననట్టుగా మరల ఆ పిల్లవానివైపు తిరిగి ''నీ సొల్లు, సొల్లు'' (నీవు 'చెప్పు చెప్పు') అన్నారు.

అంతట ఆ బాలుడు ''శ్రీ రామాయనమః'' అని అందరూ వినేట్టు బిగ్గరగా అన్నాడు.

''మూకం కరోతి వాచాలం!''

ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు స్వయంగా చూచినది.



వరకట్నాలను నిషేధించాలి

వరకట్నాలు పుచ్చుకోరాదు. ఆడంబరం కోసం వివాహాదులలో అనవసరమైన ఖర్చులు చేయరాదు. స్త్రీలు, విశేషించి శ్రీమంతులైన వారు పట్టుచీరలు ధరించరాదు. మధ్యతరగతి కుటుంబాల దుస్థితికి కారణమవుతున్న కాఫి, టీ లను మానివేసి, వాటి బదులు గంజి, లేక మజ్జిగలను పానీయాలుగ పుచ్చుకోవాలి.



Nadichedevudu   Chapters