Nadichedevudu   Chapters  

 

25. అంధురాలికి దృష్టి!

1963 ఆశ్వయుజమాసం. తిరుచిరాపల్లిలో జాతీయకళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ, శ్రీ జయేంద్ర సరస్వతీ.

ఉత్సవం తిలకించడానికి వచ్చే వేలాది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు. ఆ తొమ్మిదిరోజులూ పెద్ద స్వాములు దీక్షలో ఉండి, నవరాత్రులకు సంబంధించిన కార్యకలాపాలను స్వయంగా కొనసాగిస్తున్నారు. ప్రముఖులైన వారికి ప్రత్యేక దర్శనాలూ, ఇంటర్‌వ్యూలు వగైరా రద్దుచేశారు. ఆ తొమ్మిది రోజులూ.

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులలో సుమారు తొంభై సంవత్సరాల వయస్సుగల ఒక వృద్ధురా లున్నది. వార్థక్యానికి తోడు ఆమెకు కళ్లుకూడా కనిపించవు. మూడు రోజులుగా ఆ ముదుసలి ఉపవాసాలు కూడా చేస్తున్నదట. ఇరవై మైళ్ల దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనంకోసం వచ్చింది.

'శివా శివా, హరహరా' అనడం తప్పితే, మరేమీ మాటాడదు. ఆహారం అడగదు. ముందు స్వామిదర్శనం కావాలి అంటుంది. నవరాత్రి దీక్షలో ఉండగా స్వామిదర్శనం ఆమెకు సాధ్యమేనా, అని అందరూ సందేహించారు.

కాని, అక్కడ చేరిన భక్తులలో ఒకరికి ఒక యోచన తోచింది. గదిలో నుంచి స్వామి ఒక ద్వారంగుండా రోజుకు ఒకటి రెండుమారులు వెలుపలికి వస్తుంటారు. ఈ ముదుసలిని ఆ వాకిలి పక్కగా కూర్చోబెట్టాడు ఆ భక్తుడు. ఇహ, అక్కడే కూచుని 'శివశివా, హరహరా' అంటూ తన 'హఠం' సాగించింది ఆ భక్తురాలు! ఆమెను చూట్టానికి స్వామి బైటకు రావచ్చు నన్న ఆశతో అక్కడ కొన్ని వందలమంది మూగారు.

ఇంతలో తలవని తలంపుగా, స్వామివారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి, వాకిలి పక్కన కూచుని జపం చేస్తున్న ఆ భక్తురాలిని చూశాడు. చుట్టూ చేరిన వాళ్లందరూ ఆమె కథ వినిపించారు ఆ శిష్యుడికి. శిష్యుడు గబగబా లోపలికి వెళ్లి ఆ భక్తురాలి సంగతి స్వామికి తెలియజేశాడు.

మధ్యాహ్నం పూజకుగాను పూజామందిరంలోకి వెళ్లబోతున్న స్వామి, శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కు తిరిగి, వాకిలి తలుపు తీసి వెలుపలికి వచ్చారు. ఎర్రని ఎండలో 'శివ శివా, హరహరా' అంటూ కూచున్న ఆ వృద్ధురాలిని చూశారు.

''ఏం పాటీ! (అవ్వా!) నేను నిన్ను చూట్టానికి వచ్చాను. ఎంత సేపటినుంచి ఇక్కడ కూచున్నావు?'' అని అరవంలో అడిగారు స్వామి ఆ అవ్వను.

ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామి మాటలు.

ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ ''వచ్చావా నా దేవుడా! వచ్చావా నా తండ్రీ, నన్ను దీవించడానికి

''కాసేపు నా ఎదుటనే నిలబడు, నేను నీ కాళ్లకు మొక్కాలి'' అన్నది అరవంలో.

''అవ్వా, నీకు చూపులేదు కదా, ఎలా చూస్తావు నన్ను?''

''పోనీ, దగ్గర కొస్తే నీ మాటన్నా వింటాను.''

''అట్లా కాదు. నేను చెప్పినట్టు చెయ్యి'' అన్నారు స్వామి ఆమెతో.

ఆ ఎండలోనే ఆమెను కాస్తదూరంగా నిలుచోబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఆ ప్రదక్షిణంలో ఎనిమిది దిక్కులలో, ఒక్కొక దిక్కులో ఒక్కొక క్షణం ఆగుతూ ''నేను నీకు కనబడుతున్నానా, నన్ను నీవు చూస్తున్నావా?'' అని అడిగారు స్వామి అవ్వను.

''ఆ ఆ! నీ కాషాయవస్త్రం కనిపిస్తున్నది. చేతిలో నీ దండం కనిపిస్తున్నది...'' అంటూ వరసగా వర్ణించింది స్వామి రూపమంతా! స్వామి ప్రదక్షిణం పూర్తిచేసే సరికి, ''ఇరవై ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నాకళ్లకు ఎట్లా కనిపించావో, ఇప్పుడు మళ్లా అట్లాగే, అచ్చం అట్లాగే కనిపిస్తున్నావు, నా తండ్రీ'' అన్నది.

స్వామికి సాగిలబడి నమస్కారం చేసింది.

చుట్టూ ఉన్న భక్తు లంతా ఆశ్చర్యసంభ్రమాలతో ఆ అంధురాలి గురుభక్తిని ఒకటే పొగిడారు. స్వామి మహిమను కొనియాడారు.



ఆపద్ధర్మం

ఆపద్ధర్మం ఆపన్నిమిత్తంగా వచ్చింది. ఆ ఆపద తొలగగానే మానవుడు సాధారణ ధర్మాచరణను తక్షణం అవలంబించాలి.

Nadichedevudu   Chapters