Nadichedevudu   Chapters  

23. స్థపతికి అనుగ్రహం

1960లో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయ సముద్ధరణకు బృహత్‌ ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజలు, పిన్న పెద్ద లంతా లక్షలాది కానుకలు సమర్పించారు. ఆలయమంటపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి అరవదేశంనుంచి కొందరు శిల్పులను రప్పించారు. అట్లా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు ఇరవైయేండ్లు నిండీ నిండని గణపతి అనే యువకుడు. కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మంటప మంతా ఆ యువశిల్పి చేతిమీదుగా రూపుదాల్చిన కళావిశేషమే.

ఆలయ పునఃప్రతిష్ఠకు అరుదెంచిన శ్రీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్యాణమంటపంలోని శిల్పసంపదను చూచి ముగ్ధులైనారు. పూర్వం దక్షిణదేశంలో చేర, చోళ, పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్పకళావైభవంకంటే ఇది మిన్న అని శ్లాఘించారు. యువశిల్పి గణపతిని ఆశీర్వదించారు.

అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రవీణుడుగా పేరొంది, ఆంధ్రదేశంలోనేగాక, అఖిల భారతంలో పలు రాష్ట్రాలలో అనేక ఆలయాలను, మండపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు. రాష్ట్రపతి అవార్డును గడించాడు.

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగలో నిర్మించిన ఆది శంకరమంటపం, సతారాలో నటరాజస్వామి ఆలయం, షికాగోలో (అమెరికా) శ్రీ రామచంద్రస్వామి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో వెలిసినవే.

దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా, కంచిస్వామి అనుమతి లేనిది, స్వామిద్వారా శిల్ప రహస్యాలను గ్రహించనిది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీగణపతి.

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా ఉన్నత పదవిని నిర్వహించి, ఇటీవలనే ఆ పదవినుంచి విరమించుకున్నాడు. పద్మశ్రీ బిరుదాంకితు డైనాడు.

స్వామి ఆశీర్వాదంతో ఎంత దుర్ఘటమైన కార్యమైనా అనాయాసంగా, నిర్విఘ్నంగా నెరవేర గలదంటాడు ప్రముఖ శిల్పకళానిధి శ్రీ గణపతి స్థపతి.

* * *





జగద్గురు ప్రశస్తి

తద్వాచివర్తతేప్రాయో, భవిష్యద్వస్తుసూచనం,

త ద్బుద్ధిపూర్వకం వాస్యా, దన్యధావేతి వేత్తికః?

ఆగామి వస్తుసకలం, జానా త్యేష మహానుత?

త ద్భావానుగుణం లోకే, సర్వమేవ ప్రవర్తతే?

జరుగబోవుదాని సూచన స్వామివాక్కులో కనిపిస్తుంది. జరుగబోవునది స్వామికి తెలుస్తూ ఉంటుందా? లేక, వారన్నట్టుగానే సర్వం జరుగుతుంటుందా?

శ్రీ దేవదేవీ కరుణా కటాక్ష మాకాంక్షమాణా బహుకష్టసాధ్యం,

నరా నిరాశాన భ##వేయు రద్య యదేషమౌనీ సులభప్రసాదః.

దేవదేవి అనుగ్రహం పొందడం మానవులకు కష్టతరం. కాగా, వారు నిరాశ చెందనక్కర లేదు. ఈ స్వామి అనుగ్రహం పొందడం సులభ##మే.

స్వాధీనేశ్వర ఏషస్యాత్‌ సాక్షాత్తన్మూర్తి రేవవా,

తదనుగ్రహ లాభ##శ్చేత్‌ కిమస్మాకన్ను దుర్లభమ్‌?

ఈశ్వరుడు స్వామికి అధీనుడు; లేదా, స్వామి రూపాన్నే ధరించాడు. స్వామి దయ ఉంటే మనకు లభించని దేమున్నది?

తద్దర్శనం పాపవినాశనం స్యాత్‌ తద్భాషణం శ్రోత్ర విభూషణంచ,

తద్బోధనం గ్రంధి విభేదనంచ తత్సంస్మృతి స్సర్వ శుభప్రదాత్రీ.

స్వామి దర్శనం పాపనాశనము. స్వామి భాషణం కర్ణ భూషణము. స్వామి బోధనం అజ్ఞానగ్రంధి భేదనము. స్వామి స్మరణం సర్వశుభము.



Nadichedevudu   Chapters