Nadichedevudu   Chapters  

22. సర్వజ్ఞపీఠం సార్ధకం

ఆదిశంకరభగవత్పాదులు మూడవ యేటనే దేశభాషలను అభ్యసించారు. అయిదో యేట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. ఉపనీతులైన పిదప, ఎనిమిదో యేడు ముగిసేలోగా వేదశాస్త్రాలను పూర్తి చేశారు.

భగవత్పాదుల జీవిత చరిత్రలలో వ్రాయబడిన ఈ వాక్యాలను చదివినప్పుడు, మానవ మాత్రుల కిది సాధ్యమా అని శంకించే వా రుండవచ్చు.

కాని, శ్రీశంకరులు అవతరించిన రెండువేల సంవత్సరాల తరువాత, అదే సంప్రదాయానికి చెంది, అదే కామకోటిపీఠం అధిష్ఠించిన ఒక మహాపురుషుడు సాక్షాత్తు పుంభావ సరస్వతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆదిశంకరులను గురించి ప్రాచీనపండితులు నుడివిన మాటలు అతిశయోక్తులుగా పరిగణించవలసిన పనిలేదు.

అవతారమూర్తులనూ, కారణజన్ములనూ అన్ని విద్యలూ అన్ని కళలూ, వాటంతట అవే వచ్చి ఆశ్రయిస్తాయి. అక్కడ గురుశుశ్రూష నామమాత్రమే.

శ్రీకృష్ణభగవానుడు మహర్షిసాందీపుని వద్ద శిష్యుడుగా చేరి 64 రోజులలో వేద వేదాంగాలను, అస్త్ర విద్యతో సహా అన్ని విద్యలను అభ్యసించాడని శ్రీ మద్భాగవతంలో చెప్పబడుతున్నది.

లోకంలో సర్వసాధారణంగా మనం చూచే గురుశిష్య సంప్రదాయం కామకోటి పీఠం 68వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామి విషయంలో కిందు మీదయింది. కంచి స్వామికి ఒకప్పుడు విద్యాగురువులైన మహామహోపాథ్యాయ బ్రహ్మ శ్రీ కృష్ణశాస్త్రి గారు, స్వామితో ఇలా అన్నారు. ''స్వామీ! నిమిత్త మాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించినా, యదార్థంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం''

1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీనది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకం ఒక వర్ణశాల నిర్మించుకుని. 1911 మొదలు 1914 వరకు నాలుగుసంవత్సరాలు తదేకదీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు.

బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచికూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళవ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుక్కురళ్‌ మొదలైన గ్రంథాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను కడముట్ట చూచారు.

గానకళకు సంబంధించిన శాస్త్రాంశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ (ఫోటోగ్రఫి) రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళశాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీనశాసన పరిశోదనలో, స్థలపురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు.

''చరిత్రకు సంబంధించి శాసనపరిశోధనలో మా కేవైనా సందేహాలు కలిగినప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము'' అని ఆర్కియాలాజికల్‌ డిపార్టుమెంటు ఉన్నతాధికారి శ్రీ టి.యన్‌. రామచంద్రన్‌ ఒక సభలో చెప్పగా నేను విన్నాను. నేటికి సైతం, శాసనపరిశోధనలు చేసే పండితు లనేకులు ఆయా సమస్యలను గురించి స్వామిని సంప్రదిస్తూ ఉంటారు.

స్వామికి పదిహేడు దేశ, విదేశ భాషలు తెలుసు. ఇన్ని విద్యలలో ఇన్ని కళలలో, ఇన్ని భాషలలో అపారమైన ఇంత విజ్ఞానాన్ని ఎలా సాధించగలిగారన్నది విద్యాధికులకూ, భాషావేత్తలకూ అంతుబట్టని విషయం.

ఈవిధంగా శిల్పమేమి, ఆగమమేమి, మంత్రమేమి, భాషాపరిశోధనమేమి అన్నిటా సర్వతోముఖమైన స్వామి పాండిత్యప్రతిభలను గురించి ఆయా విద్యలలో, కళల్లో ఆరితేరిన ప్రవీణులు వాగ్రూపంగా, వ్రాతమూలంగా ఆశ్చర్యం వెలిబుచ్చటం నే నెరుగుదును.

అమేయమూ, విశ్వతోముఖమూ ఆయన ఈ విజ్ఞానభాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అలౌకికమైన వర ప్రసాదమే తప్ప, ఎంతటి వారికైనా కేవలం స్వయంకృషితో సాధ్యం కాదీ అసాధారణ, సర్వంకష ప్రతిభ.

''శంభోర్మూర్తిః

చరతి భువనే శంకరాచార్య రూపా''

చివరకొక మాట. సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచికామకోటి పీఠం సర్వజ్ఞపీఠంగా లోకానికి చాటి, ఆ పీఠాన్ని అధిష్ఠించారు. మరల ఈ శతాబ్దిలో అదే పరంపరకు చెందిన అరవై ఎనిమిదవ ఆచార్యపురుషుడు ఆదిశంకరుల అపరావతారంగా సమస్త విజ్ఞప్రపంచంచే ప్రస్తుతించబడుతూ ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతియతీంద్రులు సర్వజ్ఞ పీఠమనే మాటను సార్థకం చేశారు.

* * *

Nadichedevudu   Chapters