Nadichedevudu   Chapters  

 

19. ఆ చిరంజీవి అదృష్టం

'ఆచారశ్చైవ సాధూనాం ఆత్మన స్తుష్టి రేవచ' - మనువు

ఆచారాలు ఆత్మానందానికి అవసరమైన చిత్త సంస్కారాన్ని కలగజేస్తాయని సంస్కార ధర్మాలకు మనువు నిర్వచనం.

ఒకమారు పూర్వాచారాన్ని, లేక సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే, ఒకరి తరవాత ఒకరు ప్రజ లందరూ వాటిని ఉల్లంఘిస్తారు. అందువల్ల అనాచారం ప్రబలుతుంది. మతం సారహీన మవుతుంది.

'ఒక్కొక్క పొరనే ఒలిచివేస్తే, ఉల్లిగడ్డలో చివరకు మిగిలేది శూన్యం. అదేవిధంగా, మనకు అనుకూలించడం లేదని ఒక్కొక్క సంప్రదాయాన్ని తోసివేస్తే, అసలు సంస్కృతికే నష్టం వాటిల్లుతుంది' అంటాడు ప్రపంచప్రఖ్యాతిగాంచిన ఆంగ్లచరిత్రకారుడు ఆర్నాల్డ్‌ టాయన్‌బీ.

భక్తుల కోరికలను తృప్తిపరచడానికి ఒక్కొక్కప్పుడు స్వామి పూర్వాచారాన్ని సడలించినట్టు కనిపిస్తుంది.

అయినా, అది ఆచారానికి విరుద్దం కాదు; సంప్రదాయానికి భిన్నమూ కాదు. ఆచారానికి భంగం వాటిల్లకుండా, భక్తులను తృప్తిపరచడంలో స్వామి సూచించే పరిష్కారమార్గం అపూర్వంగా, అద్భుతావహంగా ఉంటుంది.

అందుకు ఒక ఉదాహరణ:

విదేశాల్లో చదువు ముగించుకుని, భార్యతో, ఏణ్ణర్థం బిడ్డతో స్వదేశానికి తిరిగి వస్తున్న ఒక విద్యావంతుడు, దేశంలో అడుగు పెడుతూనే ఓం ప్రథమంగా కంచికి వెళ్లి శ్రీకామకోటి శంకరాచార్య స్వామిని సందర్శించాలనుకున్నాడు.

బొంబైలో విమానం దిగి, భార్యా భర్తలు బిడ్డను చంక నెత్తుకుని, మద్రాసు మీదుగా ముందు కంచికి వెళ్లారు. మఠం మేనేజరును కలుసుకున్నారు.

''మేము ఇంగ్లండు నుంచి వస్తున్నాము. స్వామి దర్శనం చేసి, పాదపూజ చెయ్యాలనుకుంటున్నాము'' అన్నారు.

''మీరు విదేశం నుంచి నేరుగా ఇక్కడికి వస్తున్నారు. విదేశం వెళ్లి వచ్చిన వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటేనేగాని, పాదపూజ చెయ్యడానికి వీలులేదు. మీరు స్వామిని సందర్శించేందుకు మాత్రం అభ్యంతరం లేదు'' అన్నాడు మేనేజరు.

ఆశాభంగం కలిగింది ఆ యువదంపతులకు. ''వేల మైళ్లు ప్రయాణంచేసి, ఎంతో ఆశతో వచ్చాంకదా, మా కోరిక తీరడానికి మార్గ మేదైనా చెప్పలేరా?'' అని అడిగారు.

''మఠంలో చిరకాలంగా మేము అనుసరిస్తున్న సంప్రదాయం ఇది. దీనిని ఉల్లంఘించడానికి మాకు వీలులేదు. అయినా, మీరు పెద్ద స్వామిని (శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి) చూడండి. మీ విషయం వారికి విన్నవించుకోండి. స్వామివారిప్పుడు విష్ణుకంచిలో చిన్న మఠంలో ఉన్నారు'' అంటూ కొంచెం సానుభూతి కనబరిచాడు మేనేజరు.

వెంటనే విష్ణుకంచిలో ఉన్న చిన్న మఠానికి బయలుదేరారు ఆ దంపతులు. స్వామి దర్శనం చేశారు. తమ పరిస్థితి స్వామికి విన్నవించారు.

'ఎంత భక్తిశ్రద్దలు లేకపోతే ఈ యువదంపతులు విదేశాల నుంచి వస్తూ, స్వగ్రామానికైనా వెళ్లకుండా, స్వజనాన్ని చూడకుండా, మొదట కంచికే ఎందుకు వస్తారు? తమ కోరిక నిరాకరిస్తే వారు ఎంత నిరుత్సాహపడతారు? అయితే, పూర్వాచారానికి భంగం కలగరాదు. ఇందుకు ఉపాయాంతరమేదైనా వెతికి వారిని తృప్తిపరచాలి' అని యోచించి ఉంటారు స్వామివారు.

మఠంలో మామూలుగా పూజ జరిగేది 'ఆది శంకరుల' పాదుకలకు. వాటికి ప్రత్యామ్నాయంగా తమ సొంత పాదుకలను తెప్పించారు. 'ఆ బిడ్డచేత ఆ పాదుకలకు పూజ చేయించండి' అన్నారు.

అంత చిన్నబిడ్డ పూజ చెయ్యడం ఎట్లా అంటే, తల్లి తన ఒళ్లో బిడ్డను కూచో పెట్టుకుని బిడ్డ చెయ్యి పట్టుకుని పూజ చేయించ మన్నారు.

స్వామి చెప్పిన విధంగానే, శిష్యులు ఆ బిడ్డ చేత పూజ చేయించారు. భార్యాభర్తలిరువురూ ఎంతో సంతోషించారు. తమ కూతురు అదృష్టం కొనియాడుకున్నారు!

విదేశయాత్ర చేసి వచ్చినవారు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా పాదపూజ చెయ్యరాదనే నియమానికి భంగం కలిగిందా లేదా, అనే వాదానికి స్వామి సమాధానం:

విదేశయాత్ర చేసి తిరిగి వచ్చినవారు భార్యాభర్తలు, నిజమే. కాని, ఆ బిడ్డ విదేశాలకు వెళ్లిందా? లేదు. విదేశంలో జన్మించింది. స్వదేశానికి వచ్చింది. విదేశయాత్ర చేసిన దోషం బిడ్డకు ఎట్లా వర్తిస్తుంది?

ఎంత ఉపజ్ఞాపూర్వకమైన సమర్ధన!

* * *

Nadichedevudu   Chapters