Nadichedevudu   Chapters  

 

16. పరమార్థ మార్గంలో పరమ నాస్తికుడు!

అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేషప్రజలో ఆర్తులూ, అర్థార్థులూ ఎందరో ఉంటారు. ఒకరికి రోగంనయం కావాలి. ఒకరికి దరిద్రం పోవాలి. ఒక యువతికి వివాహం కావాలి. ఒక యువకుడికి ఉద్యోగం రావాలి. ఒక తండ్రికి బిడ్డలు కలగాలి. మరొకరికి వ్యాపారం కలిసి రావాలి.

ఎన్నో కోరికలు! స్వామిఅనుగ్రహంతో భక్తుల కర్మవిపాకం కావడంతో, వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి.

అయితే వీటన్నింటినీ మించినదీ, ఉత్తమోత్తమమైనదీ, మనిషి ప్రకృతినే మార్చివేసి పరమ నాస్తికుని భగవద్భక్తునిగా చేయజాలినదీ స్వామి దివ్యశక్తి!....

అందుకు ఒక నిదర్శనం:

అప్పుడు నేను భద్రాచలానికి రెండుమైళ్ళ దూరాన ''బిల్వవనం''లో నివసిస్తున్నాను. ప్రకాశంజిల్లా పర్చూరు కాపురస్థుడు శ్రీ గండు సిద్దయ్య అనే వ్యక్తి దగ్గరనుంచి నా కొక ఉత్తరం వచ్చింది.

కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటుచేస్తున్నాననీ, ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసిందిగా మరీ, మరీ కోరుతున్నాననీ ఉన్నది ఆ ఉత్తరంలో.

సిద్దయ్య గారెవరో అంతకు పూర్వం నాకు తెలియదు. ఎందుకు నాకీ సన్మానం తలపెట్టారో నే నెరగను. అదీగాక ఆయనగారు సన్మానసభకు నన్ను ఆహ్వానించిన నాడే భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామిదేవాలయం. ధర్మకర్తలసమావేశంలో నేను పాల్గొనవలసి ఉన్నది.

ఈ కారణా లన్నింటిని పురస్కరించుకుని ''పర్చూరులో జరిగే సన్మాన సభకు రాజాలనందుకు నన్ను క్షమించండి'' అంటూ సిద్దయ్య గారికి జాబు రాశాను.

అయినా ఆ ''గండు'' వారు నన్ను వదలలేదు. సభకు చాలా పెద్దయెత్తున సన్నాహం చేశామనీ, చుట్టుప్రక్కల గ్రామాలక్కూడా తెలియజేశామనీ, ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్కపూటా పర్చూరులో ఉండవలసిందనీ, ఏ కారణం చేతనైనా అది సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు ''గండు'' వారు.

ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తబడ్డారు. సిద్దయ్యగారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు, నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి, ధర్మకర్తలసభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణాధికారికి లేఖ వ్రాసి పర్చూరు సభకు బయలుదేరాను.

సభ నిండుగా జరిగింది. పరిసర గ్రామాలనుంచి కూడా ప్రజలు విచ్చేశారు. పండితులను సభలో సన్మానించారు.

అయితే - ''ఆంధ్రప్రభ'' సంపాదకపదవినుంచి విరమించుకుని, భద్రాచలంలో సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకూ, పత్రికారంగానికీ, ప్రజా జీవితానికీ దూరంగా ఉన్న నన్ను ఈ సిద్దయ్యగారు ఇంత పట్టుపట్టి పర్చూరుకు ఎందుకు రప్పించాలి? అసలు నాకీ సన్మానం ఎందుకు తలపెట్టాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉన్నది. ఆ కథ శ్రీ గండు సిద్దయ్య గారికీ, ఆయన రాజకీయాలకూ, ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించినది.

ఆ కథ:

శ్రీ గండు సిద్దయ్యగారు పర్చూరులో పేరుమోసిన కమ్యూనిస్టు. ఒక్క పర్చూరులోనే కాక చుట్టుప్రక్కల ఆ ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది. భయమో, భక్తో ఆ రోజుల్లో సిద్దయ్యగారి మాట పార్టీలో, ప్రజల్లో బాగా చలామణి అవుతుండేది.

ఒకనాడు సిద్దయ్య గారు హోటల్లో కూచుని కాఫీ సేవిస్తూ ''ప్రభ'' ఆదివారం పత్రిక చూస్తున్నారు. అందులో కంచికామకోటిపీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి ఫోటో ఆయన కంటపడింది. ఏ వేళావిశేషమో, ఆ బొమ్మ ఆయన్ను ఆకర్షించింది. అది మొదలు వారం వారం ''ప్రభ''లో కంచిస్వామి బోధలను చదవడం మొదలుపెట్టారు.

నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాలలో మునిగి తేలుతూ ఉండే సిద్దయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదికి మళ్ళించింది. ఆదివారం ''ఆంధ్రప్రభ'' రావడం ఆలస్యమైతే సిద్దయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు.

రాను రాను ఆయనలో అదివర కెన్నడూ లేని, ఎవరూ ఊహించని మార్పు వచ్చింది. అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు. పార్టీకి విడాకు లిచ్చారు. ఆ ప్రాంతమంతటా ప్రసిద్ధి కెక్కిన కమ్యూనిస్టునాయకుడల్లా కామకోటిపీఠానికి ప్రియశిష్యుడైనాడు.

అయితే మరి నాకు సన్మానం ఎందుకూ?

నా సంపాదకత్వం క్రింద వెలువడిన ''ఆంధ్రప్రభ'' లో కంచి స్వామి వారి ఫోటోలు చూసీ, స్వామి ఉపన్యాసాలు చదివీ, వాటిచే ప్రభావితుడైనందున, మార్క్సిస్టు రాజకీయాల నుంచి మతం వేపు మారడానికి పరోక్షంగా నేను కారకుణ్ణి కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పమట!

అందరి కథలూ ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్దయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో!





హిందూ ధర్మానికి ఆధారం

ఒక ధర్మం శక్తి, ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపైగాక, దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూధర్మసిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే హిందువుడే హిందూధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహాపురుషుల వల్లనే హిందూధర్మం నేటికీ నిలచిఉన్నది.

Nadichedevudu   Chapters