Nadichedevudu   Chapters  

 

13. సంస్కృతం చదివిన శాస్త్రిగారూ : నేనూ

దక్షిణదేశంలో మధురకు సమీపాన ఎలియత్తాన్‌గుడి ఒక చిన్న గ్రామం. అయినా అది అన్ని గ్రామాల వంటిది కాదు. ఆ ఊళ్ళోఇళ్ళన్నీ దేవాలయాలు. ఆలయాల్లో అర్చన చేసే పూజారులూ, పరిచారకులూ తప్పితే, ఆ గ్రామ వాసులంటూ ఇతరు లెవ్వరూ లేరు.

ఆ గుళ్ళనూ, గోపురాలనూ కట్టించినవారు ద్రవిడదేశంలోని నాటుకోటిశెట్లు. కోట్లకు పడగలెత్తిన కుబేరులు.

ఊరు కాని ఊళ్ళో మహోన్నతాలైన ఆ ఆలయాలనూ, అలవిమాలిన ఆ లోగిళ్ళనూ, శెట్టియార్లు ఎందుకు నిర్మించారో, జనం లేకున్నా వాటి నెందుకు పోషిస్తున్నారో - అది వారి భక్తిశ్రద్ధలకు నిదర్శనమే తప్ప - కారణం ఊహించలేము.

1960 సంవత్సరంలో స్వామి ఆ ఊళ్ళో సుమారు నెలరోజులు మకాం చేశారు. స్వామిదర్శనం చేద్దామని నేను మద్రాసునుంచి బయలుదేరాను. ఎగ్మూరు స్టేషన్‌నుండి రాత్రి రైల్లో నా ప్రయాణం.

ఆ రైల్లోనే నాకు సుపరిచితులైన శాస్త్రిగా రొకరు నాతోబాటు ప్రయాణం చేశారు. ఆ రాత్రి శ్రీ శాస్త్రిగారి సహవాసం నా కెంతో సంతోషం కలిగించింది.

ఆయన జగమెరిగిన పండితుడు. భారత, భాగవత, రామాయణాలు మొదలుకొని భగవద్గీతవరకూ అన్నటిని గురించీ చక్కగా, శ్రావ్యంగా ఉపన్యసించగల విద్వాంసుడు. చమత్కారంగా కబుర్లు కూడా చెప్పగల డాయన. ఇహ, కాలక్షేపానికి కొరతేమిటి?

ఎగ్మూరుస్టేషన్‌లో బండి బయలుదేరింది. ఉభయులం పక్కపక్కనే కూచుని స్వామివారిని గురించే గాక, సంగీతం, సాహిత్యం - అనేకవిషయాలను గురించి సరదాగా మాట్లాడుకున్నాము.

వేదాంతచర్చలోకి దిగినప్పుడు శాస్త్రిగారు ఆ పుస్తకంనించీ, ఈ పుస్తకంనించీ సంస్కృత శ్లోకాలు గుప్పించే వారు. అవన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యేవి కావు. శాస్త్రిగారి వలె చిన్నతనంలో గీర్వాణం నేర్వని లోపం.

నే నిలా అన్నాను. ''శాస్త్రిగారూ, చిన్నప్పుడు సంస్కృతం అభ్యసించే అవకాశం నాకు లేకపోయింది, ఈ ఇంగ్లీషు చదువుమూలాన.''

''అది మీ కెట్లా అలవడుతుందిలెండి? దాన్ని మా బోంట్లకు వదిలిపెట్టండి'' అన్నారు శాస్త్రిగారు తడుముకోకుండా.

ఆయనగారి మాట పైకి సాధువుగా కనిపించినా, అందులో కొంత అవహేళన ధ్వనించకపోలేదు. నా మనస్సు చివుక్కుమన్నది. అయినా నేను బయటికి పొక్కలేదు.

పొద్దుపోయేవరకు ఆ మాటా, ఈ మాటా మాట్లాడుకుని, ఇద్దరం సుఖంగా నిద్రించాము.

తెల్లవారింది. రైలు దిగి ఎలియత్తాన్‌గుడికి వెళ్ళే బస్సెక్కి ఏడుగంటలకల్లా ఆ ఊరు చేరాము. మూటాముల్లె సత్రంలో పెట్టి, త్వరత్వరగా స్నానసంధ్యలు ముగించుకుని, ఇద్దరం స్వామి దర్శనానికి బయలుదేరాం. పెద్దసత్రం ముందు కోనేటిగట్టుపైన అనుష్ఠానం పూర్తి చేసుకుని సత్రంలోకి ప్రవేశించబోతున్నారు స్వామి వారు.

వంటి నిండా భస్మంతో, రుద్రాక్షమాలలతో, దండకమండలాలతో, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్కరించిన స్వామికి ఉభయులం సాష్టాంగ నమస్కారాలు చేసి, మా రాకను తెలియజేసుకున్నాం. ప్రసన్నవదనంతో స్వామి ఆశీర్వదించారు.

'సాయంత్రం చల్లబడ్డాక రండి' అని సెలవిచ్చి సత్రంలోకి నడిచారు. అది మే నెల. ఎండ తీక్షణం చెప్పనక్కరలేదు.

పొద్దెప్పుడు వాటాలుతుందా మళ్లా స్వామి దర్శనం ఎప్పుడా అని గడియలు లెక్కపెట్టుకుంటూ, ఎక్కువమంది చేరకముందే దర్శనం చేసుకుందామను కొని, కాస్త ఎండపొడ ఉండగానే స్వామివా రున్న సత్రానికి బయలుదేరాము. లోపలికి ప్రవేశించాము. ''స్వామి ఎక్కడ?'' అని మఠం పరిచారకులను అడిగాము.

'పెరియవళ్‌' దొడ్డివైపు బయట చెట్టునీడను ఒంటరిగా కూర్చున్నారంటూ దారి చూపించారు. ఆరుబయట ఒకమూలను అలవిమాలిన పెద్దవృక్షమూలాన్ని ఆనుకుని, నేలమీద కూచున్నారు. పిల్లవాళ్ళు రబ్బరు బంతితో ఆడుకుంటున్నట్లు ఒక చిన్నరాయిని చేత్తో ఎగరేస్తున్నారు.

సంపూర్ణజ్ఞానవైరాగ్యసంపన్నులూ, బ్రహ్మవేత్తలూ అయిన జగద్గురువు లేమిటి, ఒంటరిగా రాళ్లతో బంతులాడుకోవడ మేమిటి!

జీవన్ముక్తుని స్థితిని శంకరభగవత్పాదులు ఇలా వర్ణిస్తారు:

క్వచిత్‌ బాలై సార్థం కరతలగతావై సహసితైః

క్వచి త్తారుణ్యాలంకృత నవవధూభిస్సహరమన్‌

క్వచిత్‌ వృద్ధైశ్చింతాకలిత హృదయైశ్చాపివిలసన్‌

మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః

(ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకుని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం, కిలకిల నవ్వుతూ క్రీడాపరులైన బాలురతో ఆడడం, మరొకప్పుడు అలంకృతలైన స్త్రీలతో చరిస్తూ ఉండడం, ఇంకొకప్పుడు సాంసారిక చింతాజాలంతో కుంగిపోయే ముసలివాళ్ళతో కలిసి విచారించడం, ఇన్ని విధాల చరిస్తూ ఉన్నా జీవన్ముక్తుడైన యతివరుడు జ్ఞానయోగదీక్షామహిమవల్ల దేహతాదాత్మ్యభ్రాంతిని పొందడు.)

అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా మేమిద్దరం స్వామి కనుచూపుమేరలోకి వెళ్లాము. మమ్మల్ని చూచారు స్వామి. దగ్గరకు రండని చేత్తో సంజ్ఞ చేశారు. ఉత్సాహంతో ముందుకు నడిచాము. పాదాభివందనం చేసి కూచున్నాము.

''ఎండగా ఉంది. అయినా పరవాలేదు. సాయంకాలపు టెండ'' అంటూ ''వృద్ధాతపః వృద్ధాతపః'' అన్న పదాన్ని రెండుసార్లు అన్నారు, పాదపూరణం కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్లు.

ఆ క్షణంలో చిన్నప్పటి శ్లోకమొకటి నాకు గుర్తుకు వచ్చింది. ఆ శ్లోకాన్ని స్వామి సమక్షంలో చదవవచ్చునా చదవరాదా అన్న యోచన ఏమాత్రం లేకుండా, నేనేమిటి, సర్వజ్ఞులైన స్వామికి శ్లోకపాదం అందివ్వడ మేమిటి అనే ఔచిత్యవిచారణ చెయ్యకుండా, ఈ కింది శ్లోకం చదివాను.

''వృద్ధార్కః, హోమధూమశ్చ

బాలస్త్రీ నిర్మలోదకం

రాత్రౌక్షీరాన్న భుక్తిశ్చ

ఆయుర్‌వృద్ధిః దినేదినే''

'ఆC C అంటూ స్వామి ఆ శ్లోకం మొదటిపాదం అందుకున్నారు.

ఇక అడుగుతారూ! అంతవరకు నావైపే చూస్తూ ఉన్న శాస్త్రిగారి ముఖం వివర్ణమైంది. ఆయనగారు అలా ఎందు కైనారో నాకు అర్థం కాలేదు.

స్వామి మాతో విడివిడిగానూ, ఉమ్మడిగానూ అనేకవిషయాలు ఆప్యాయంగా మాట్లాడారు. తండ్రి కొడుకుల నడిగినట్లు మామా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అంత సులభంగా స్వామి దర్శనం లభించినందుకూ, అంత సావకాశంగా స్వామి మాతో మాట్లాడినందుకూ, మా అదృష్టాన్ని పొగుడుకుంటూ మళ్ళీ స్వామికి ప్రణమిల్లి, సెలవు పుచ్చుకుని బయలుదేరాము.

బసకు వస్తున్నప్పుడు శాస్త్రిగారు నాతో ''అవురా, ఎంత నాటకం ఆడారండి! నాకు సంస్కృతం రానేరాదంటూ రాత్రి నాతో అన్నారు కదా, ఇప్పుడు స్వామికే శ్లోకాన్ని అందించారే!'' అన్నారు విస్తుపోతూ.

''నేనేం నాటకం ఆడలేదు, మహాశయా! అప్పటి కప్పడు నాకా శ్లోకం స్పురించింది. చప్పున చదివేశాను. ముందు వెనకలు చూచుకోకుండా'' అన్నాను.

ఎంత చెప్పినా ఆయన నా మాట నమ్మరు. తనంత పండితుణ్ణి పక్కన పెట్టుకుని, కేవలం ఇంగ్లీషు ముక్కలు నేర్చిన నేను స్వామికి సంస్కృతశ్లోకం అందివ్వడమా? తాను మౌనంగా ఉండిపోవడమా! ఇదీ ఆయనకు పట్టుకున్న బాధ.

పురాణాలన్నీ పుక్కిటబట్టిన శ్రీ శాస్త్రిగారికి అతి సాధారణమైన ఆ శ్లోకం ఎందుకు స్ఫురించింది కాదు? అది నాకు ఎలా తట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెబితేనే గాని, కథ కంచికి పోదు.

* * *

ఇంగ్లీషు బళ్ళో నేనేవో నాలుగు సంస్కృతం ముక్కలు నేర్చుకున్నమాట వాస్తవమే. అయినా శబ్దమంజరిలో కొన్ని శబ్దాలూ, హితోపదేశంలోని కొన్ని శ్లోకాలు వల్లించటంతో నా సంస్కృతభాషాభ్యాసానికి స్వస్తి జరిగింది.

ఎన్నడో నా ఎనిమిదో ఏట మాతామహుల ఊళ్లో, వీథిబడిలో చదువుతూ ఉండగా, ఓ నాడు బడినుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక అచ్చుకాగితం కనిపించింది. దానిలో కొన్ని శ్లోకా లున్నవి, అర్థంతో సహా. ''నాకూ సంస్కృతం వచ్చు'' అని మా వాళ్ళకు నా గొప్పలు చెప్పుకోవడానికి ఆ కాగితంలోని రెండు శ్లోకాలు బట్టీ పెట్టాను.

ఇవీ ఆ రెండూ:

బాలార్కః ప్రేత ధూమశ్చ వృద్ధస్త్రీ పల్వలోదకం,

రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే||

వృద్ధార్కః హోమధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం

రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్‌వృద్ధిః దినే దినే||

గోచీ పెట్టుకుని వీథిబళ్ళో చదువుకుంటున్న రోజుల్లో యధాలాపంగా నేర్చుకున్న పై శ్లోకం, ఏనాడో జీర్ణమైపోయిన ఆ నాలుగుపంక్తులుగా యాభైసంవత్సరాలు గడిచిన తరువాత నా కెలా జ్ఞాపకం వచ్చాయో, ఊహకు అందని విషయం.

ఎక్కడో అంతరాంతరాల్లో దాగి ఉన్న ఆ శ్లోకాన్ని ఎన్ని పొరల్లోనించో పైకి లాగిందెవరు?

అంతేకాదు; అదే, నీతిశాస్త్రంలోని సాధారణశ్లోకం కాకుండా ఏ పంచ కావ్యాల లోనిదో, ఏ భారతభాగవతాదుల్లోదో అయినట్లయితే - శాస్త్రిగారికి అవన్నీ కొట్టిన పిండి కావడం చేత - అది వారికి కరతలామలకం అయ్యేది. నేను మూగి నయ్యేవాణ్ణి. అందుకని, శ్రీ శాస్త్రిగారి సంస్కృతపాండిత్యానికి ఎక్కడా అందుబాటులోలేనిదీ, నా మిడిమిడి సంస్కృతజ్ఞానంతో నేను అందుకోజాలినదీ అయిన శ్లోకాన్ని విస్మృతిగర్భంలోనుంచి పైకి లాగాలి. దాన్ని నేను శాస్త్రిగారి ఎదుటనే చదివి, నా 'పాండిత్యా'న్ని ప్రదర్శించాలి!

'అబ్బో, సంస్కృతం మీ కెందుకు లెండి? అది మాకు వదిలెయ్యండి!' అన్న శాస్త్రిగారి ఎత్తిపొడుపు మాటకు స్వామి నా చేతనే సమాధానం చెప్పించాలి!

అద్భుత సృష్టి!

* * *

శ్రీ శంకరభగవత్పాదుల శిష్యులవిషయంలో ఇలాంటిదే ఒక కథ ప్రచారంలో ఉన్నది. పాత్రల తారతమ్యం మాట వదిలేస్తే, ఆ కథ ఇక్కడ చక్కగా అతుకుతుంది.

ఆదిశంకరుల శిష్యులలో 'గిరి' అనే పేరుగల శిష్యుడు ఉండేవాడు. రోజూ దేవునిపూజకు పుష్పం, బిల్వం వగైరా పూజాద్రవ్యాన్ని సమకూర్చడం, గురువు గారి గుడ్డలు ఉతికి పెట్టి, గురువుకు శుశ్రూష చెయ్యడం ఇలాంటి పనులు అతడు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పనులెంత చక్కగా చేసినా, చదువులో మొద్దబ్బాయిగా కనిపించేవాడు.

ఒకనాడు గురువుచేత పాఠం చెప్పించుకోవడానికి శిష్యులంతా సమావేశ##మైనారు. గురు వింకా పాఠం మొదలెట్టలేదు. గిరి రాలేదని గురువు ఎదురుచూస్తున్నట్లు కనిపించింది.

శిష్యులలో గుసగుసలు బయలుదేరాయి. గిరి కోసం కాచుకోవాలా? అతడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అంటూ శిష్యులు తమలో తాము ఏమనుకుంటున్నారో గురువు గారు కనిపెట్టారు. ఆనాడు వారికి కాస్త గుణపాఠం నేర్పాలని తోచింది గురువుగారికి.

ఇంతలో గిరి రానే వచ్చాడు. తోటక వృత్తాలలో గురువుపై తాను రచించిన శ్లోకాలు పాడుకుంటూ ఆనందంతో నర్తనం చేస్తూ వస్తున్నాడు.

శిష్యులు ఆ శ్లోకాలను విన్నారు. పరవశుడై అతడు చేసిన నృత్యాన్ని చూశారు. తాము అనుకున్నట్లు గిరి మొద్దబ్బాయి కాదని గ్రహించారు. సిగ్గుపడ్డారు.

ఆశువుగా ఆనా డాయన చెప్పిన శ్లోకాలలో మచ్చుకు ఒకటి:

విదితాఖిల శాస్త్రసుధాజలధే

మహితోపనిషత్‌ కథితార్థ నిధే||

హృదయే కలయే విమలం చరణం

భవ శంకర దేశికమే శరణమ్‌||





హరిహరాభేదం

తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్యుల అంశలు నాలుగూ ఇమిడి ఉన్నాయి. 'బాలాజీ' అనే పేరు 'బాలసుబ్రహ్మణ్యము'నకు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాభరణాలు, బిల్వపత్రపూజ శివ స్వరూపానికి సాక్ష్యాలు. శంఖచక్రకిరీటాదులు శ్రీ మహావిష్ణువు చిహ్నాలు. వెలుపలి ప్రాకారంలో సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈ విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్యముల సమన్వయమూర్తి. ఆ విధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ, కేశవాది భేదాలు ఆదిలో లేవు.





జగద్గురు ప్రశస్తి

త చ్ఛిష్య భాగ్యం కథమత్ర వర్ణ్యం నైకం గురు ర్విస్మరతి ప్రదీర్ఘే,

కాలేప్రయాతే స్ఫుటమేవనామ గ్రామం కుటుంబం సకలం స్మరేత్సః.

స్వామి శిష్యుల భాగ్యమేమోగాని, వారిని, వారి ఊరిని, వారి కుటుంబాన్ని అంతనూ ఆమహనీయులు ఎన్నడూ మరువరు.

తత్సన్నిధి ప్రాప్తివశా దనేక ఉత్సృజ్య నాస్తిక్య మధర్మమార్గం,

సత్సంప్రదాయం పరిగృహ్య శిష్యాః స్వజన్మసాఫల్య మవాపురీడ్యం.

ఈ స్వామి సాన్నిధ్యభాగ్యం వల్ల అనేకులు నాస్తిక్యం వదిలిపెట్టి ధన్యులైనారు.

నా త్యాదరం దర్శయతే ధనిభ్య ఉపేక్షతే నైవ ధనేన హీనాన్‌,

భావప్రధాన స్సజనార్దనోవా ప్రసారయే ద్భక్తజనే దయాం స్వాం.

ధనికులపై హెచ్చు ఆదరం కానీ, పేదవారిపై ఉదాసీనత కానీ స్వామి చూపరు. పరమేశ్వరుని వలె భక్తుల భావాన్నే ప్రధానంగా పాటిస్తారు.

యస్యగాఢ దిదృక్షాచ, సన్నిధి ప్రా ప్త్యశక్తతా,

దూరస్థ ఏవతద్భక్త స్తదనుగ్రహ భాగ్భవేత్‌.

సన్నిధికి రాజాలక దూరము నుండి దర్శనానికై పరితపించే భక్తులు స్వామి అనుగ్రహాన్ని దూరం నుంచే పొందగలరు.

Nadichedevudu   Chapters