Kamakoti   Chapters   Last Page

 

13. గాంధీజీసుభాషితము

(దేవుడనగా సత్యము, ప్రేమ)

నాకు దేవుడనగా సత్యము, ప్రేమ, నీతినియమములు, దేవుడనగా భయరాహిత్యము (అభయము). ఈశ్వరుడు జీవితమునకు వెలుగునకు మూలాధారయైయుండియు వీనినంటక, అతీతుడై వెలుగుచుండును. దేవుడు మనస్సాక్షి. నాస్తికుని నాస్తికత్వము కూడ నతడే. తన అపారప్రేమచే నాస్తికుని గూడ జీవించునట్లు చేయుచున్నాడు. హృదయ పరిశోధకుడు మనస్సునకు వాక్కునకు అగోచరుడు మనసంగతి మన మనసుసంగతి మనకంటె దేవునికే బాగుగా తెలియును. కొందరికి తెలిసియు కొందరికి తెలియకయు వారు మాటాడునది వారి ఉద్దేశ్యము కాదు గనుక మనమాటలకు విలువ నొసగడు. దర్శనము కోరినవారికి రూపము గైకొని ప్రత్యక్షమగును. తాకగోరువారికి దేహము ధరించి యగపడును. అతడు పుణ్యములసారము. విశ్వాసయుతులకు ముమ్మాటికి కలడు. సకలజనులకు సకలవస్తువులకు నతడే. మనలోనుండియు, మనలనంటక అతీతుడై యున్నాడు.

కాంగ్రెసునుండి ఈశ్వరుడగు పదము నిషేధించ వచ్చు కాని ఆస్వరూపము తొలగించ నెవరికి శక్తి లేదు. దేవుని పేరును ప్రతిజ్ఞయు నొకటి కాదేని దాని కేమి విలువగలదు ? మనస్సాక్షి యనుపదము 'దేవుడు' అను మూడు అక్షరాల మాటకు సరికాని దూరాన్వయము, దేవుని పేరిట ఘోరదుర్నీతులు, అమానుష దారుణకృత్యములు జరుగుచున్నంతమాత్రమున దేవుడు లేకుండ పోనక్కరలేదు. దీర్ఘబాధ దేవుడు, ఓర్పును భయంకరత్వమును నతడే ఇహపరములయందు ఖండితముగా ప్రవర్తించువ్యక్తి యతడే. మనిరుగు పొరుగు వారికి జంతువులకు మనమేమిత్తుమో అదియే మనకు దేవుడొసగును. తెలియదనిన క్షమింపడు. కాని క్షమాగుణసంపన్నుడై పశ్చాత్తాపమున కవకాశ మొసగుచుండును. అంతటి ప్రజాస్వామ్యవాది లేడు ఏలయన మంచిచెడుగుల నెన్నుకొనుటలో మనలను నిరంకుశముగా వదలియున్నాడు. అంతటి నిరంకుశుడును లేడు, ఏలయన నోటి దగ్గర అన్నము పడగొట్టి ఇచ్ఛాస్వాతంత్ర్యము పేర మనకు కొంచెము నందొసంగి దానిచే బాధలనుభవించు మనము వారి కాటవస్తువుల మగుట చూచుచుండును. కనుకనే హిందూమతము సర్వమును ఈశ్వరుని లీలగాను మాయగాను వర్ణించుచుండును. కనుక ''ఉన్నది'' అతడే. మనము ''లేనివారమే'' మనముకూడా ఉండకోరినచో నిత్యమతని పొగడుచు వానిశాసనముననుష్టింపవలెను అతని మురళీ నాదము ననుసరించి మనము నృత్యము చేసిన నంతయు మేలగును.

Kamakoti   Chapters   Last Page