Upanyasamulu    Chapters   

భగవన్నామమే తరించుటకు  సులభోపాయము.

భగవన్నామ భజనమే మన జన్మతరించుటకు సులభోపాయము. పాపకార్యమంటే ఎటువంటిదో ఎఱుగక పరిశుద్ధముగా జీవితమును గడపడమంటే సాధ్యంకానిపని. అటువంటివారు ఈ ప్రపంచంలో ఏ ఒకరిద్దరో ఉంటారు. మనముకూడా మనజీవితంలో సాధ్యమైనంతవరుకు పాపకార్యాచరణమును మాని కొంతకుకొంత అయినా పుణ్యకార్యాచరణ మొనర్పవలెను. భగవంతుడు పతితపావనుడని పేరున్నది. అంటే ఎంత పతితులయిన మనుష్యులనైనాసరే అంటే ఎంత పాపుల నైనాసరే ఒక్కమారు ప్రేమపూరితంగా, భక్తిపురస్సరంగా ఆభగవంతుణ్ణి స్మరిస్తేచాలు తప్పక రక్షించితీరుతాడు. దీనజనులను రక్షించడానికై ఆ భగవంతుడాయాకాలాల్లో అవతరిస్తున్నాడు. వాటిలో రామావతారము, కృష్ణావతారము చాలా ముఖ్యములైనవి. వారిద్దరిని భారతదేశంలో స్మరించని బాల బాలికలు ఎక్కడా లేరు.

పాపరహితులమైనట్లయితే అప్పుడు మనకిన్ని కష్టములు గాని, దుఃఖములుగానిలేవు. కాని మనజీవితమునంతయు ఆవిధంగా పరిశుద్ధంగా గడపడమంటే సాధ్యంకానిపని. అటువంటివారు చాలా అరుదు. కాని మన మనస్సులోకలిగే చెడ్డభావాలు నశించవలెనంటే అందుకు ఆ భగవంతుని నామస్మరణయే ఉపాయము. మన దేహమునకు బురద అయినదనుకొనుడు. అప్పుడు మనమేమిచేయుదుము? నీళ్ళుబోసి కడుగుకొనెదము. ఆవిధంగానే మన బుద్ధిలోకలిగే వివిధదుష్టభావములు నశింపవలనంటే అందుకు నామస్మరణముఖ్యము. మనకిప్పుడు తుదకొక్క క్షణకాలంకూడా భగవధ్యానం చేస్తామంటే మనస్సు నిలచుట లేదు. అందుకు యోగము, భక్తి అని ఈవిధంగా పలుమార్గము శాస్త్రకారులు విధించినారు. కాని ఆమార్గములందరికీ అందుబాటుకావు. కాబట్టియే సర్వమానవులకు భగవన్నామస్మరణ ముక్తిపొందుటకు సులభోపాయమని శాస్త్రకారులు, భక్తులు చెప్పుచున్నారు.

భగవంతుడికి నామ రూపములని రెండుకలవు. నామమనగా రామ, కృష్ణ, ఇత్యాది పేరులు. రూపమంటే దివ్యమంగళవిగ్రహధారిత్వము శంఖచక్రాది ధారణము మొదలగునవి. కాని వానిలోకూడా రూపమునుధ్యానం చెయ్యడమంటే కష్టము. ముందు మనబుద్ధితో నొకరూపము నేర్పఱచుకొనవలెను. అప్పుడుకూడా ముఖమును ధ్యానించుచుండిన పాదముల మఱతుము. పాదముల స్మరించిన ముఖమును మఱచెదము. కాని నామమటువంటిదికాదు, అది అందరికి అందుబాటులో నుండును. అదీకూడా మంత్రరూపంగా వుంటే మరీమంచిది. ఎందుచేతనంటే మంత్రములో ప్రతివర్ణమునకుకూడా అనంతశక్తులున్నవి. కాబట్టి మనము ఏదో నొకమంత్రమును పఠించుచుండుట సర్వోత్తమము. లేదా తుదకాతని నామమునైనను సర్వదా స్మరించుచుండుట మనకర్తవ్యమైయున్నది. తుదకు భగవద్గీతలోకూడా.

శ్లో || యం యం వాపి స్మర9భావం త్యజ త్యంతేకళేబరం

తంతమేవైతికౌన్తేయ సదా తద్భావ భావితః.

అంతమున మనమేభావములో ఈ శరీరమును వదలుచున్నామో ఆభావమే మఱుజన్మములో కూడావస్తుంది.

మనకు నిద్ర ఒకస్టేటు (అవస్థ) అట్లే జాగ్రదవస్థ ఒక స్టేటు. ఆవిధంగానే జననమొక స్టేటు. మరణమొకస్టేటు. మనము చచ్చిపోవునపుడు ఏభావములోనుందుమో ఆభావమే ఆస్టేటే మరుజన్మమునకూడా వచ్చితీరుతుంది. మనము నిద్రపోవుటకు ముందు ఏవస్తువుగురించి తలుస్తున్నామో ఆవస్తువే కలలో వస్తుంది. ఒకడు కల్లుత్రాగుచున్నాడు. కాని వాడు మద్యమును త్రాగుటకుముందు ఏభావమునుకలిగయుండునో ఆభావములనే, ఆ మాటలనే ఉన్మత్తస్థితియందుకూడ మాటాలాడును.

మరణమంటే ఏమిటి? స్థూలదేహం నశించిందన్నమాట సూక్ష్మదేహమునకెప్పుడును నాశనములేదు. అది స్థూలదేహము నశించినప్పుడు వాయువున లీనమైయుండును, మరలావీడికి కర్మానుగుణమగు శరీరమొచ్చినప్పుడు ఆ సూక్ష్మశరీరము, చిత్తము ఇందులో ప్రవేశించును. ఎలక్‌ ట్రిక్‌ అంటే విద్యుచ్ఛక్తి ఉన్నది. కాని బల్పుపెట్టితేనేగాని దానితేజస్సు బయటికిరాదు. ఆ విధంగానే స్థూలదేహము నశించినప్పుడు ఈ సూక్ష్మశరీరము ఇంద్రియములు నశించక వాయువు ఆకాశము, తేజస్సువీటియందు దాగియుండును. కర్మానుగుణమగు స్థూలదేహము వచ్చినప్పుడందులో మరలా ప్రవేశించి చైతన్యమువహిస్తవి. ఇప్పుడున్న సూక్ష్మశరీరమే మరుజన్మమునకూడా రావడముచేతనే కొందఱు సామాన్యులు ఏ పల్లెటూరిలోనో ఉండియో బాల్యముననే అసాథారణమగు గణితశాస్త్రమున ప్రావీణ్యమును చూపుచున్నారు. మరికొందరికి మంచి సంగీతము బాల్యముననే పట్టుబడుచున్నది.

ఇప్పుడు త్తరదేశములో పదిమంది ఆడపిల్లలు పూర్వజన్మ జ్ఞానముకలిగి, పూర్వము తామెవరో ఎచ్చటనుండిరో ఏమేమి చేసిరో మొదలగు వృత్తాంతముల నాశ్చర్యముగ చెప్పుచున్నారు కాని ఆ జ్ఞానమంతాకూడా కొంతకాలమునకు అంటే పెద్దవారగుసరికి క్రమముగ తగ్గిపోవును. అయితే మనకిప్పుడు తేలిన విషయమేమి? మరణమొకస్టేటు. ఆ మరణసమయములో మనము దేనిని ధ్యానించుచుందుమో, దాని ననుసరించియే ఉత్తర జన్మమన కొచ్చితీరును. కాబట్టి మనముగనుక అంత్యకాలములో భగవంతుని నామోచ్చారణమునుచేయుచు, సంతోషముగ నుంటిమా? సుఖపడెదము కాని మనము భగవంతునిమరచి సంసార వ్యామోహమునబడి సుఖదుఃఖములయందు మగ్నులమైయుంటి మా మరలా ఇంకనూ దుఃఖప్రదమగు శరీరము రాకతప్పదు. కాబట్టి ప్రతివారికి కూడా ఆ అంత్యక్షణము చాలా ముఖ్యమైనది.

అయితే భగవన్నామ సంకీర్తనమును మరణసమయమున చేయవచ్చునుగదా అని మగతకాలమున ఊరకుండరాదు. ఆ అలవాటును ఇప్పటినుండియే చేసినగాని మరణ కాలమున జ్ఞప్తికి రాదు. కాబట్టి మనమందఱమును సర్వప్రపంచము భగవత్స్వరూపమని ధ్యానంచేయుచుండవలెను. అప్పుడే మనము జన్మలేని వారమగుదుము. ఆవిధమైనభావము మనము సంపాదించవలెను. అయితే మరణసమయములో ధ్యానము నిలవడము కష్టము ఎందుచేతనంటే అప్పుడు రోగముతో బాధపడుతాము. దుఃఖము హెచ్చుగా ఉండును. ఏడుస్తుంటాము అటువంటప్పుడు ఈనామము జ్ఞాపమకానికొస్తుందా? రాదు. కాని మన జన్మమునంతయు పరిశుద్ధముగా అంటే పాపము నెఱుగక, భగవన్నామ సంకీర్తనలతోనే గడపడమంటే సాధ్యముకానిపని అది చాలాకష్టమైన పని. కాబట్టి ఆ చివరభాగమున అంటే మరణసమయంలోనైనా భగవన్నామ సంకీర్తన మొనర్చిన మానవుడు తరించునని శాస్త్రములు చెప్పుచున్నావి.

అయితే మనకు మరణసమయంలో ఈ భావము ఏవిధంగావస్తుంది? వచ్చుటకు మనమేమిచేయవలెను. అని మనమాలోచించవలెను. అందుకు మనపెద్దలు నామసంకీర్తనము సులభోపాయమని చెప్పినారు. జన్మతరించుటకు యోగము, భక్తి, ఇటువంటివి చాలా ఉన్నవి. కాని అవన్నీకూడా జనసామాన్యమునకు సాధ్యమగునవికావు భగవంతుని ఆ కారమును మనస్సులో ధ్యానము చేయడముకూడా కష్టమైనదే. ఆ రూపముకూడా చిత్రించు చిత్రకారుని ఇష్టముననుసరించి నానావిధములుగ నుండును. కాని నామోచ్చారణము చాల సులభ##మైనది. మన మాభగవంతుని నామమును ధ్యానించునపుడాతని ఆకారము ఙప్తికిరాకపోయినను, ఏదో ఇంతపెద్ద ప్రపంచమును పుట్టించి, పోషించుటకనువగు ఒత తత్త్వమున్నది. ఆ తత్త్వమే నేనుచేయు నామమునకు వాచ్యము అను జ్ఞానముండినచాలును. ఆ భావమంత్యకాలమున రావలెను. అదే లాభకారిఅవుతుంది. దానిచేత ఎంత పాపవంతుడైనాసరే తరిస్తాడు. అందరినీ తరింపజేయడానికే శాస్త్రమేర్పడింది కాని ఏకొలదిమందికోకాదు. ఇప్పుడు వైద్యశాస్త్రమున్నదంటే అది బలహీనులను, రోగులను చక్కబఱచుటకున్నది. కాని ఆరోగ్యవంతులను కాపాడుటకేగాదు. ఆ విధముగానే మన శాస్త్రములన్నీకూడా మానవులందరికినీ తరింపజేయడానికేర్పడినవి. కాబట్టే అవన్నీకూడా మనలను సులభోపాయమైన నామసంకీర్తన చేయుడని ఉద్బోధించుచున్నవి. మనము ఆ భగవంతుని నామస్మరణమున కలవాటుపడినందులకు చిహ్నమేమి? రోగమొచ్చినను, దుఃఖమొచ్చినను మనమానామమును మఱవక చేయుచున్నామా అని విచారించుకొనవెలను.

అందుకుమనమేమిచేయవలెను?

రోగములేనప్పుడే, దుఃఖములేనప్పుడే ఆ నామమును స్మరణచేయుచుండిననేగాని ఆ రోగములో, ఆ దుఃఖములో ఈ నామమ జ్ఞప్తికిరాదు.

350 సంవత్సరముల క్రిందట దక్షిణదేశమున వేలూరు ప్రాంతమున ఒక శివభక్తుడుండినాడు. గొప్పపండితుడు. బహుగ్రన్థముల వ్రాసినాడు. చాల గ్రన్థములకు వ్యాఖ్యలరచించినాడు. ఆయనపేరు అప్పయ్యదీక్షితులు. ఇప్పుడక్కడ శివాలయములున్నవంటే, మనమంతాకూడా విభూతిధారణచేసి, రుద్రాక్షల ధరిస్తున్నామంటే, శివుని ధ్యానించుచున్నామంటే అది అంతా కూడా ఆ అప్పయ్యదీక్షుతుల వారి గొప్ప శక్తియే అని చెప్పవచ్చును. ఆయనకు ముందు దేశంలో ఒక నిధమైన వాతారణమును కలిగించిన మహానుభావుడు. ఆయనొకప్పుడు "మనము శివభక్తిని చేస్తున్నామే కాని ఈ భావము పిచ్చిబట్టినప్పుడు లేదా రోగమొచ్చినప్పుడు వచ్చునా" అని పరీక్షించవలెనను కున్నారు. ఒక కామకుడున్నాడనుకొనుడు. వాడికి పిచ్చిపట్టినట్లయితే ఆ కామ వికారములైన మాటలనే మాటలాడును. ఆ విధముగానే భక్తుడైనవాడికి పిచ్చిపట్టినప్పుడు విషయస్ఫూర్తిలేకపోయినప్పుటికిన్నీ ఆ భగవంతుని నామమునే పెద్దగ నుచ్చరించుచుండును. సరే ఆ అప్పయ్య దీక్షితులుగారొకప్పుడు వైద్యులను దగ్గరపెట్టుకున్నారు. ఉమ్మెత్త కాయ విత్తనములను తినవలెననుకున్నారు (ఉన్మాదమును కలిగిస్తుంది. కాబట్టి ఉమ్మెత్త అని పేరువచ్చింది.) మరల దానికి విరుగుడు మందునిచ్చి బాగుచేసెదమని వైద్యులు చెప్పినారు.

దీక్షితులుగారు శిష్యులను దగ్గరకుపిలచి నాకు పిచ్చిపట్టినపుడు ఏమేమిమాటలాడుదునో అదంతయు రికార్డు వ్రాసిపెట్టవలసిందని ఉత్తరువుచేసినారు. ఉమ్మెత్తగింజలుతిన్నారు, పిచ్చిపట్టింది.

మొదట ఒకటిరెండు పిచ్చికేకలువేశారు. తర్వాత ఆత్మార్పణస్తుతి అనే పేరుతో 50 శ్లోకములను చెప్పి భగవంతుని స్తోత్రమొనర్చినారు. భగవంతుడికి తన ఆత్మను అర్పణచేసినాడు. భగవంతునియందు లీనమైనాడు. ఆమోస్తరుగా మనకెంత రోగమువచ్చినాసరే, ఎంత దుఃఖమొచ్చినాసరే లేదా ఎంత సుఖమొచ్చినాసరే ఎంత అవమానమొచ్చినాసరే భగవన్నామము మరుపునకు రాకూడదు. మన జీవితమునంతయు దానికై వినియోగించవలెను. అప్పుడుగాని మనకటువంటి భావమురాదు. ఒకడెప్పుడుకూడా చొక్కావేసుకుంటూవుంటే వాడికి కలలో కూడా చొక్కావేసుకున్నట్లేవస్తుంది. షరాయి వేసుకున్నవాడికి షరకాయివేసుకోవడమే కలలోవస్తుంది. ఆవిధంగానే మకు మంత్రము సిద్ధించినందుకు ఏమిగుర్తు? మనకు కలలువచ్చినను, రోగమువచ్చినను, పిచ్చిపట్టినను, ఆ నామము మరపునకు రాగూడదు. అటువంటిస్థితి మనకెప్పుడువచ్చునో అప్పుడే మనకు మరణావస్థలోకూడా ఆనామము జ్ఞప్తికివచ్చునని నమ్మవలెను. ఆనామ సంకీర్తనమునకు రాగ, తాళములుకూడా సహకారమగును. అవి ఇతరులమనస్సుల నాకర్షించి వారినికూడ భక్తిభావము కలవారినిగ చేయును. పిల్లలకు చేదుమందును బెల్లములోపొదిపి ఇచ్చినట్లు భగవన్నామమును రాగతాళములు సులువుగ అందివ్వగలవు. అందుకనియే ఇటువంటి భజనమందిరములక్కడక్కడ నేర్పడినవి. ఇటువంటిచోట పదిమందికలసి అయినాసరే,లేదా ఏకాంతమునైనాసరే భగవన్నామ సంకీర్తన మొనర్పవలెను. మన మనస్సుకు ఒకప్పుడు కాకుంటే ఒకప్పుడైనా సంకీర్తనసమయంలో విసుకుపట్టడము సహజము. కాబట్టి అటువంటప్పుడు సంగీతమును, తాళమును వినియోగించవలెను. అప్పుడు మరల ఉత్సాహవంతులమగుదుము. కాని మనము సంగీతముపాడినా, తాళమువేసినా తుదకేదిచేసినను భగవన్నామ మిళితమైనయుండవలెను. అజామిళుడు తన అంత్యకాలంలో 'నారాయణ' అని స్మరించి తరించినాడు. మన మెన్ని శాస్త్రములుచదివినా పురాణములుచదివినా, వేదములుచదివినా, అవన్నియు అంత్యమున అనగా అంత్యకాలమున ఆ భగవంతుడు స్మరణకువచ్చుటకేతప్ప ఎక్కువలాభములేదు. దానినే శ్రీకృష్ణుఁడు గీతల్లో

యం యం వాపి స్మిర9భావం త్యజత్యంతే కళేబరం

తంతమేవైతి కౌన్తేయ సదాతద్భావ భావితః.

తటాలున అప్పుడు జ్ఞప్తికిరమ్మనినరాదు. అందుకని ఇప్పటినుండియే మనము దానిని అభ్యసింపవలెను. మనము మన పొట్టకై ఎన్ని లౌకిక కార్యములందు మగ్నులమైనను లోపలమాత్రము అటువంటిభావమును మరువరాదు. మనమెన్ని యుద్ధములుచేసినా, ఎన్నిడిబేటులుచేసినా, ఎన్ని పనులుచేసినా భగవన్నామ స్మరణను మానరాదు. జ్ఞానములోనే బుద్ధిని నిలపడమంటే అందరికీ సాధ్యంకానిపని. కాబట్టి మీరంతాకూడా లౌకికముగా ఎన్నిపనులు చేసినను భావములో మాత్రము భగవంతుని మఱచిపోకుండా నామసంకీర్తనము చేస్తుండవలసినది. ఇదే మానవుడు తరించుటకు సులభోపాయము.

-----

Upanyasamulu    Chapters