Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

పార్థసారథి

దాదాపు రెండువేలేండ్ల క్రితం శంకరభగవత్పాదులవతరించి ఆసేతుశీతాచలమూ సంచరించి ప్రజకు యోగ క్షేమములు చేకూర్చు బోధలు ఎన్నో చేశారు. తాము చేసిన బోధలు తమతోనే తరలిపోకుండా నాలుగుమఠాలు ఏర్పరచి ప్రజలు ధర్మాచరణమునుండి తొలగిపోకుండా ఉండేట్టు చూస్తూ ఉండండని తమ తరువాత రాబోవు పీఠాధిపతులకు కట్టడి చేశారు. ఏవి చేసిన క్షేమము కలిగించునని తోచునో అట్టి సంగతులను ప్రజల బుద్ధి శక్తులకు తగినటులు చెప్పవలయునని మాబోటివారికి వారిచ్చిన ఆదేశము. ఇంతేకాక ఉత్తమ క్షేత్రముల నన్నిటినీ దర్శనము చేసికొనవలయునని కూడా మాకు వారి ఆజ్ఞయే. మే మూరూరు తిరుగాడుటయు పూజ్యపాదుల ఆనను అనుసరించుటయే.

మద్రాసు నగరములోని ఈ తిరువల్లిక్కేణి ఉత్తమ క్షేత్రములలో నొకటి. ఇందలి మూర్తి అనాది, అక్షరమును ఐన తత్త్వమునుపదేశించు శ్రీకృష్ణభగవానుడు, వారు పార్థునిసారథ్యమేకాక యెన్నో పనులు చేశారు. బృందావనంలో గొల్లపిల్ల డాయెను. వేణుగోపాలు డాయెను. ఇవి ఆయా సమయములకు సరిగా తగియుండవచ్చును. కాని పార్థ సారథియై చేసిన గీతోపదేశముమాత్రము మూడు కాలములకును ఉపయోగించి సంసారపు చీకటికి దివ్వెయై భవార్ణవమునకు నౌకయై వెలయుచున్నది. అట్టి పార్థసారథి ఆవిర్భవించిన యీ క్షేత్ర మొక జ్ఞానభూమి.

పార్థసారథి వ్యక్తిత్వమును చూడండి. సాధారణంగా సారథ్యము తక్కువపని, కాని మధురాధిపతికి అఖిలమూ మధురమే. ఆయన కెక్కువ తక్కువలులేవు. రథచోదన చేసి కర్మయోగము నుపదేశించి జ్ఞానయోగము నా యోగీశ్వరుడు తన జీవితమునందే నిరూపించెను. అష్టాదశాక్షౌహిణుల నడుమ శాంతముగా విసుకనుమాట లేక నిర్భయముగా ఆయన అర్జునుని సందేహ పరంపరను పటాపంచలు చేశాడు. ఎంతో ప్రశాంతమైన దేశకాలాలలో చేసిననైనా పారమార్థిక బోధలు మనకు మనసుకు పట్టడం కష్టం. 'యస్మిక్‌ స్థితో న దుఃఖేన గురుణాసి విచాల్యతే' ఎంతటి దుఃఖం వచ్చినా కలవరం కలుగనీయని ఉపదేశం అది. దానిని ఆ పార్థసారథి ఒక్కడే చేసేది. అ పార్థు డొక్కడే తెలిసికొనేది.

మనిషికీ మనసున్నది. అది సరిగా లేకపోతే తక్కిన ఇంద్రియాలన్నీ ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. మనస్సు గిరాగిరా తిరుగుతుంటే ఎవడేం చేయగలడు? చిత్తంలో చాంచల్యం పోవాలి; ఇంద్రియాలు చెప్పిన మాట వినాలి. మంచి మనసు కలవారు నలుగురికీ మంచి చేస్తాడు. దుష్టబుద్ధి కలవారు నలుగురికీ క్షోభ##పెటతాడు. ఇక పిచ్చివాని మాట చెప్పనే అక్కరలేదు. వాడు పరులకేకాక తనకుకూడా హింసచేసికొంటాడు. అదృష్టవశాత్తు మనకు కొంచెం చిత్తచాంచల్యమే ఉందికాని చిత్తభ్రంశం లేదు. అలాగే అయితే మనలను మించిన పిచ్చివాండ్లు వేరే ఉండరు. మనకు కోపతాపాలున్నవి. వానితోపాటు శాంతగుణంకూడా కొంత మనకు భగవంతు డిచ్చాడు. మనస్సులో మంచితనం లేకపోతే పిచ్చి అంకురించడం ఆరంభమవుతుంది. దానివల్ల తనకూ పేదవారికీ దుఃఖమ. మనలోని మంచితనాన్ని మనం ఇబ్బడిచేసినకొలదీ శాంతి పెరుగుకొంటూ పోతుంది.

ఎట్టి కష్టాలు రానీ, కదలక కొండవలె ఉండాలి. దానికి ఉపాయ మేమిటి?

ఉత్తమ పదార్థంతో లగ్నమైన మనస్సు ఉత్తమ భావనతో ఉద్దీపిస్తుంది. దేవుడు పురుషోత్తముడు గనుక అతని పాదాలకంటె ఉత్‌ కృష్టమైన వస్తు వింకొకటి లేదు. భగవత్‌ పాదాలే భగవత్‌ పాదులు. భగవద్‌ స్మరణరూపంగా భగవచ్చరణ స్మరణఉంటే మనకు ఉత్తమస్థానం దొరుకుతుంది.

శైశవమాదీ మనం పాపంచేస్తూనే ఉన్నాము. వానితోపాటు ఈశ్వరుణ్ణి తలచుకుంటూవుంటే మన పాపాలెంతో తగ్గి ఉండేవి. జన్మకు ఫలం ఏమిటి? మరవక ఈశ్వరస్మరణ ప్రణిధానము చేసి కృతకృత్యుడు కావటమే. ఆచార్యులవారు మాకిచ్చిన ఆజ్ఞా అదే. మే మీశ్వరస్మరణ చేయడమే కాదు. ఇతరులచే చేయించడంకూడా.

రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితమ్‌|

భర్తారం స్త్రీకృతం పాపం శిష్యపాపం గురుంవ్రజేత్‌|

దుర్బలులను ప్రబలులు బాధించకుండా ఉండేటటులు మాచే బాధ్యత రాజుది అట్లా రాజు ప్రజలను రక్షించకపోతే ప్రజలులు చేసిన ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది. అట్లే శిష్యుని పాపం గురువుకు చుట్టుకుంటుంది. అందుచే శ్రీ శంకర భగవత్పాదులు మమ్ము ప్రతినిధులనుగా చేసి అందరికిన్నీ భగవచ్చరణస్మరణం బోధింపండని ఆజ్ఞాపించారు. మీరు చెప్పినట్లు వారు చేయకపోతే మీరయినా చేయండని మాకు కట్టడి చేశారు.

మనం ప్రతిరోజు చేసే కార్య్రకమం పరిశీలిస్తే పరమేశ్వరునికై వెచ్చించే కాలం పదిక్షణా లుంటుందా? మన తీరిక అంతా వ్యర్థప్రసంగాలతోనూ వృథాలోచనలతోనూ కయ్యాలతోనూ వియ్యాలతోనూ గడిపేస్తున్నాం. మనం ప్రతి దినమూ వార్తాప్రతికలు చదువుతాం. దీనివల్ల బాధలేదుకాని దానిలోని విషయాలను చర్చించడంవల్ల ఫల మున్నట్లు కనిపించదు. కాలాన్ని ఇట్లా వమ్ము చేయడానికి బదులు భగవత్‌ స్మరణకై వినియోగిస్తే పాపభయం ఉండదు. బ్రతికి ఉన్నంత వరకూ పరహింస చేయకుండా రాచకార్యాలూ దేశకార్యాలూ మనం చేయవచ్చు. ప్రజాహితకరమై ప్రభుత్వం ఉంటేకాని ఐహికసౌఖ్యాలు అనుభవించలేము. తమ బుద్ధికి తోచిన రాజ్యాంగలోపాలను ప్రభుత్వానికి తెలపడం ప్రజకు విధి. రాజు ఐహికవిషయాలు కెట్టిబాధ్యత వహిస్తాడో ఆచార్యుడు ప్రజల పారమార్థిక విషయాలకు అట్టి బాధ్యత వహిస్తాడు. ఐహిక విషయసౌఖ్యం ఒకటే చాలదు. అముష్మికానందం కూడా అనుభవించవద్దా?

పాపం విరగడ కాకపోతే ఆనందం అందదు. పాపక్షాళనానికి కావలసిన హంగు-మనస్సూ దేహమూ శాస్త్రమూ తీర్థమూ క్షేత్రమూ. ఇవన్నీ ఇహలోకంలోనే ఉన్నవి. వరుస పుట్టుక ఏదో మనకు తెలియదు. కనుక ఈ పుట్టుకలోని పాపాలీ పుట్టుకలోనే పోవాలి. మనం చేసినపాపం కొద్దీ మరుపుట్టువులో పశువులంగా గానీ కీటాదులంగా గానీ పుటితే పూజాపురస్కారాలు పరోపకారాదులు ఇవన్నీ పాపమోచకాలున్నూ చిత్తశోధకాలున్నూ, కార్యం చిన్నదయినా పెద్దదయినా మనం చిత్తశుద్ధితో చేయాలి.

అపి చే దసి పా పేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః|

సర్వం జ్ఞానప్లవేనైవ పృజినం నంతరిష్యసి. -గీత

పాపాలు చేశాననేభయం అక్కరలేదు. బ్రహ్మజ్ఞానం అనే తెప్పవల్ల ధర్మాన్నీ ఆ ధర్మాన్నీ అతిక్రమించాలి. పాపసముద్రాలు దాటిపోవడానికి జ్ఞాననౌకను మించిన దేదీలేదు. అందుచేత మనోమాలిన్యాన్ని పోగొట్టుకొని నిఃశ్రేయసము నందుటకు భగవత్‌ పాదరూపమైన ఆచార్యచరణ థ్యానం చేయాలి.

ధ్యానానికి మన మెంత యెక్కువ కాలం వీలు చేసుకుంటే అంత మేలు. ఐశ్వర్యమున్నా సరే. లేకున్నా సరే ధ్యానం మాత్రం వదలకుండా ఉండాలి. మనంమాత్రం చేయడమే కాదు; మన అభిరుచులతో ఏకీభావమున్న మనచుట్టు ప్రక్కల నున్నవారినికూడా చేయండని చెప్పాలి. వారొకవేళ మన మాట పాటిచేయకపోతే మనం కినుకపడరాదు. కాని వారి వారి విధులను మెత్తగా వారికి గుర్తు తేవాలి. మంచిమాటకు కరగని మనసంటూఉండదు. వేరు వేరు పనులను క్రమక్రమంగా తగ్గించుకొని ధ్యానకాలాన్ని పొడిగించుకొని ఈశ్వర స్మరణలో మునిగి తేలుతూవుండాలి. ఇట్టి మేలిపనిని అడ్డమూ ఆకా లేకుండా నిర్వర్తిస్తూ అనవసర ప్రసంగాలలో వృధా అయిపోయే కాలాన్ని ధ్యానానికి ఉపయోగిస్తే శ్రేయస్సు పొందగలం.

ప్రజల పారమార్థిక ప్రయోజనార్థం ఈ విషయాన్ని తెలుపవలెనన్న ఆచార్యులవారిమాట పాటించి, మావిధిని నెరవేర్చుకొనే భాగ్యం మాకున్నూ, శ్రవణభాగ్యం మీకున్నూ కలిగింది.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page