Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

మహిమాన్వితములైన మనప్రాచీన శాస్త్రములు

మనపెద్దలు చాలా శాస్త్రగ్రంథాలు వ్రాశారు. వానిలో ఎన్నో గ్రంథాలు మరుగైపోయినై. ప్రస్తుతం అందుబాటులోఉన్న గ్రంథాలకుకూడ సరిగా అర్థం తెలియదు. కొంత తెలిసినవారున్నారు. వారైనా కొద్దిమంది.

వరాహమిహిరుడనే ఆయన దాదాపు 1500 సంవత్సరాలకు వెనుక ఉండేవారు. ఆయన అనేక గ్రంథాలు వ్రాశారు. ఆయన విక్రమాదిత్యుని కాలంలో ఉన్నట్లు ప్రసిద్ధి.

విక్రమాదిత్యుని సభలో నవరత్నాలుండేవారని ఒక ప్రతీతి. నవరత్నాలనూ పేర్కొనే ఈ క్రింది శ్లోకం చాలా కాలంనుండి వాడుకలో ఉంది.

''ధన్వంతరి క్షపణకామరసింహశంకు

వేతాలభట్ట ఘటకర్పర కాళిదాసాః|

ఖ్యాతో వరాహమిహిరో నృపతే స్సఖాయాం

రత్నాని వై వరరుచి ర్నవ విక్రమస్య||

'ధన్వంతరి మొదలైన ఈ నవరత్నాల కాలం ఒకటి కాదు'- అని శాస్త్రపరిశోధకులు అంటారు. వీరంతా విక్రమాదిత్యుని కాలంలో ఉన్నట్లు ఏదోవిధంగా పేరు వచ్చింది.

నాలుగు వందల సంవత్సరాలకు వెనుక కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించాడు. ఈ విజయనగరం బళ్ళారిజిల్లా హోస్పేట ప్రాంతంలో తుంగభద్రాతీరంలో 'హంపి' అనే చోట ఉండేదని చెపుతారు. 'పంపాసరస్సు', 'కిష్కింధ' ఈ ప్రాంతంలోనివేనట. కన్నడంలో 'పంపాసరస్సు'ను 'హంపాసరస్సు' అంటారు. 'ప' అనే అక్షరం కన్నడంలో 'హ'గా మారుతుంది. కన్నడులు 'పాలను' ''హాలు'' అంటారు. ఈ కృష్ణరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుండేవారు. అట్లే విక్రమాదిత్యుని సభలో నవరత్నా లుండేవారు.

పై శ్లోకంలో అమరసింహునకు, వరాహమిహిరునకు మాత్రం విశేషణాలున్నాయి. మిగిలిన ధన్వంతరి మొదలైన వారి పేర్లు మాత్రం పేర్కొనబడ్డాయి. వారికి విశేషణాలు లేవు. క్షపణకు డనగా జైనుడు. ''క్షపణకామరసింహ'' అంటే జైనుడైన అమరసింహుడని అర్థం. ఇచ్చట క్షపణక శబ్ధ విశేషణం. అట్లే ''ఖ్యాతో వరాహమిహిరః'' అన్నపుడు ఖ్యాతశబ్దం వరాహమిహిరునకు విశేషణం. ఖ్యాతిశబ్దం శ్రేష్ఠతావాచకం. ఇట్లు విశేషించి పేర్కొనబడ్డారు. గనుక వీరిలో ఒక్కరైనా విక్రమాదిత్యుని కాలంలో ఉండి యున్నారనిపిస్తుంది.

వరాహమిహిరుడు వ్రాసిన గ్రంథాలనేకాలు. ఆయన వ్రాసిన 'బృహత్సంహిత' దాదాపు నూరు అధ్యాయాలు గ్రంథం. దాని ఉపోద్ఘాతంలో ఆయన - ''నేను ఒక్కొక్క అధ్యాయంగా వ్రాసిన విషయాలకు ఒక్కొక్క శాస్త్రమే పురాతనకాలంలో ఉన్నట్లు తెలుస్తూఉంది; ఇప్పుడు అన్ని ప్రత్యేక శాస్త్రాలు చదివే వాడుక నశించింది; అందుచే చెదరిపోయిన విశాలశాస్త్రగ్రంథాల విషయాలను ఒక్కొక్క అధ్యాయంగా ఇందు సంతరించాను'- అని వ్రాశారు.

బృహత్సంహితలో 'ఇది ఉంది, ఇది లేదు' అని చెప్పడం వీలుకాదు. అందులో సర్వవిషయాలూ ఉన్నాయి. 'ఫలానా చెట్టు ఫలానాచోట ఉంటే నీరు ఫలానా దెసగా ప్రవహిస్తుంది'- అని కూడ తెలుపగల స్థావర శాస్త్రము. ఇట్లే ధాతుశాస్త్రము, పశువులను పక్షులను గురించిన శాస్త్రము, మనకు ఎక్కడను కనపడని నాడీశాస్త్రము-ఇలా ప్రపంచంలోని అన్ని విషయాలు ఇందులో గుప్పబడ్డాయి. చాలామందికి ఇట్టి అపూర్వగ్రంథం ఒకటి ఉన్నదని కూడ తెలియదనడానికే ఇదంతా సోదాహరణం చెప్పాను.

ఇట్టి గొప్ప శాస్త్రగ్రంథాలు మనకు దక్కకుండ పోయాయి. బృహత్సంహితలో కొంచెం కొంచెంగా గ్రంథించిన అధ్యాయాలను చూస్తే - ఆ అధ్యాయాలకు మూలగ్రంథాలు ఎంత గొప్పవై ఉండేవో అని ఆశ్చర్యం వేస్తుంది. విక్రమాదిత్యుని కాలంలో ఆయన కీర్తి నలుదెసలా ప్రాకింది. గొప్ప గొప్ప పండితులు, కవులు ఆయన ఆస్థానానికి వచ్చారు. వారంతా పరిశోధించి ఉద్గ్రంథా లనేకాలు వ్రాశారు.

విజయనగర సామ్రాజ్యస్థాపనకు ముందు 'మాలిక్‌ కాఫర్‌' దక్షిణదేశం మీదకు దండెత్తి వచ్చాడు. అతడు ఆలయాలను కూలద్రోశాడు. పశువులను హింసించాడు. జనాన్ని ముప్పుతిప్పలుపెట్టి రణగొణధ్వనులతో రామేశ్వరందాక వెళ్ళాడు. అక్కడ ఒక మసీదును స్థాపించి మధురలోను, తిరుచునాపల్లికి ఉత్తరాన కొణ్ణనూరులో మారియమ్మ కోవెలగల సమయపుర ప్రాంతంలోను తన ప్రతినిధులను నిలిపి వెనుకకు మరలి వెళ్ళాడు. ఆచోటునే 'భోజేశ్వరం' అని అంటారు. ఇచ్చట కర్ణాట రాజు లుండేవారు.

శ్రీరంగాలయాన్ని గురించి ఏడెనిమిది వందల సంవత్సరాల చరిత్ర - 'దినచర్య గ్రంథం'లో వలె వ్రాయబడి ఉంది. అందులో మహమ్మదీయుల దండయాత్ర విషయం వివరంగా వ్రాసి ఉంది. ఒకప్పుడు ఆ కోవెలలో వైష్ణవశాస్త్ర కాలక్షేపం జరుగుతూ ఉండగా మహమ్మదీయులు వచ్చి పడ్డారట. అప్పుడా వైష్ణవులంతా భయపడి శ్రీరంగనాథు నెత్తుకొని మళయాళ##దేశానికి, ఇంకా ఇతర ప్రదేశాలకు వెళ్ళారట. చివరకు చెంజికోట దళపతి గోపన్న సాయంతో ఏభై, అరవై సంవత్సరాల తరువాత పెరుమాళ్ళును శ్రీరంగానికి చేర్చారట. ఈ విషయం ఆలయచరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. గోపన్న రాయలు ఆ కాలంలో చెంజికోటకు దళపతి. ఈయనను గూర్చి వేదాంతదేశికులు వ్రాసిన రెండు శ్లోకాలు నేటికి శ్రీరంగాలయంలో కానవస్తాయి. గోపన్న శ్రీరంగానికి పెరుమాళ్ళను తిరిగి తెచ్చాడన్న ప్రశంస వానిలో ఉంది.

మాలిక్‌ కాఫరు కాలంలో నేలగూలిన ఆలయాలు అడుగంటిన ఆచారాలు, నశించిన ధర్మాలు విద్యారణ్యుల కాలంలో పునరుద్ధరింపబడ్డాయి.

విద్యారణ్యులు నాలుగు వేదాలకూ కలిపి ఒక భాష్యం వ్రాశారు. అంతవరకు అట్టి గ్రంథం వ్రాసినవారు లేరు.

ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క భాష్యం వ్రాసిన వారున్నారు. కాని నాలుగు వేదాలకు పూర్తిగా భాష్యం వ్రాసినది విద్యారణ్యు లొక్కరే. ఇంతే కాక 'జ్యోతిశాస్త్రము మొదలైన వానికి వీరు వ్రాసిన గ్రంథాలు లెక్కలేనన్ని. వీరి పేరే విద్యారణ్యులు. వీరు వ్రాసిన గ్రంథావళికూడ అరణ్య సమానమే.

చరిత్రాధారా లున్నాయో లేవోకాని, వీరినిగూర్చి ఒక కథ చెపుతారు. ఈకథ ఆదిశంకరుల సంన్యాస స్వీకార కథను పోలిఉంటుంది. శంకరులు తల్లితో స్నానార్థం నదికి వెళ్ళారు. స్నానం చేస్తూఉండగా ఒక మొసలి శంకరుల పాదం పట్టుకొంది. వెంటనే ఆయన తనకీ జన్మలో ఆయు విక లేదని తలచారు. తోడనే ఆయన తన సంన్యాస స్వీకారానికి అనుమతించవలసినదని తల్లిని ప్రార్థించారు. 'సంన్యాసం స్వీకరిస్తే తిరిగి జన్మించినట్లే. తాను బ్రతుక వచ్చును,' అని వారి ఊహ. శంకరుల తల్లి కుమారుని సంన్యాసస్వీకారానికి అనుమతించింది. తోడనే మొసలికూడ పట్టు విడిచింది. ఇది శంకరుల సంన్యాసస్వీకార కథ. విద్యారణ్యులు సంన్యసించిన కథ కూడ ఇట్టిదే.

విద్యారణ్యులు మహాలక్ష్మిని గూర్చి కఠినమైన తపస్సు చేశారు. ఏకాగ్రచిత్తులై వీరు చేసిన తపస్సువల్ల మహాలక్ష్మి ప్రత్యక్షం అయింది. వీరు చూస్తే పరమ దరిద్రులు. ''నీకు ఏమి కావాలి?'' - అని మహాలక్ష్మి ప్రశ్నించగా ''అంతులేని ఐశ్వర్యం నాకు అనుగ్రహింపు'' మంటూ వేడుకొన్నారట. దానికి లక్ష్మీదేవి- ''నాయనా! ఈజన్మలో నీకు ఐశ్వర్యం ఇవ్వడం శక్యంకాదు. కావాలి అంటే తరువాతి జన్మలో ఇస్తాను''. అని బదులాడినదట. అందుచే విద్యారణ్యులు తత్‌ క్షణమే సంన్యాసం స్వీకరించి 'ఇస్తానన్న ఐశ్వర్యం' ఇమ్మన్నారట. సంన్యాసం తీసికొంటే శాస్త్రంరీత్యా తిరిగి జన్మించినట్లే. అందుచే మహాలక్ష్మి మారుపలుకకుండ కనకవం
ఎక్కడ చూచినా బంగారమూ, నవనిధులూ వెల్లివిరిశాయి. వీనినిచూచి విద్యారణ్యులు- ''అయ్యో! నే నెంత మొరకును, ఆశ్రమం తీసికొన్నవానికి ద్రవ్యంతో పనియేమిటి? సంన్యాసికి దీనిని తాకుటకూడ కూడదు. వరాలు కోరకపోతే ఈ ఐశ్వర్యం కనీసం మలిపుట్టువునందైన లభించేదికదా!'' అని విచారించారట.

మాలిక్‌ కాఫర్‌ దండయాత్రచేసి అల్లకల్లోలం చేసిన సమయం అదే. మహాలక్ష్మీ ప్రసాదంవల్ల వచ్చిపడ్డ ఐశ్వర్యంతో విద్యారణ్యులు మాలిక్‌ కాఫర్‌ చేసిన అక్రమాలను సరిదిద్ద నిర్ధారించారు. హరిహరుడు, బుక్కడు అనే ఇద్దరూ గొర్రెల కాపరులు. విద్యారణ్యులు వారిని చేరదీసి వారి అండతో తుంగభద్రాతీరంలో విజయనగరసామ్రాజ్యానికి శంకుస్థాపన చేశారు. రాజ్యం ఎక్కడ స్థాపించాలో తెలిసికొనడానికి విద్యారణ్యులు ఒక జాతకం గుణించారు. ఆ విధంగా స్థాపించిన రాజ్యమే విజయనగర సామ్రాజ్యము.

హరిహర బుక్కరాయళ్ళ వంశంలో వారి జ్ఞాతి ఒకడు ఉండేవాడు. ఆయనపేరు కంపన్న. ఆయన ఉపాసనా బలం కలవాడు. మధురానగరదేవత అనుగ్రహంవల్ల ఆయనకొక కరవాలం లభించిందట. ఆయనను రాజ్యానికి సైన్యాధిపతిగా విద్యారణ్యులు నియమించినారు. కంపన్నకు 'ఉడయార్‌' అని బిరుదు ఉంది. మైసూరు రాజులనుకూడ 'ఒడయారు' లంటారు. దక్షిణంలో శిథిలములైన రాజ్యాలను విజయనగర సామ్రాజ్యం నీడలోనికి తెమ్మని కంపన్న ఒడయారును పంపారు. కంపన్న రామేశ్వరంవరకు జైత్రయాత్ర చేశాడు.

కంపన్న ఒడయారు అంతఃపురస్త్రీలలో గంగాదేవి అనే ఆమె ఒకతె ఉంది. కంపన్న ఎక్కడకు వెళ్ళినా ఆమె కూడ అనుగమించేది. ఆమెకు సంస్కృతంలో మంచి పాండిత్యంఉంది. కంపన్న జైత్రయాత్రలో జరిగిన విషయాలన్నీ దినచర్య వ్రాసినట్లు వ్రాసి కావ్యంగా ఆమె రూపొందించింది. ఆమె వ్రాతలు కాళిదాసు కవితను మించుతై. అంత చక్కని శైలి ఆమెది. ఆమె కావ్యం అంత మధురమైనది. దీనిని ఎథిగ్రాఫికల్‌ డిపార్టుమెంటువారు అచ్చువేశారు.

ఢిల్లీ రాజు ప్రతినిధులతో కంపన్న ఐదారు యుద్ధాలు చేశాడు. మధురలో జరిగిన యుద్ధం వీనిలో పెద్దది. అప్పుడు కంపన్నకు నగరదేవత కలలో కనబడి 'విజయం నిశ్చయంగా నీదే' అని అనుగ్రహించిందట. అటుపైన కంపన్న విరోధులను గెలిచాడట. దీనిని చాల సుందరంగా గంగాదేవి కావ్యంలో చిత్రించింది.

కన్ననూరులో స్వామికి భోజేశ్వరుడని పేరు. మైసూరుకు చేరిన కన్నడుల పరిపాలనలో ఆ ప్రదేశంఉంది. భోజేశ్వరుడను పేరిప్పుడు పోచలేశ్వరుడుగా మారింది. ఇపు డాకోవెల శిథిలమై పోయింది. ఆలయకుడ్యాలలోని శిలాశాసనాలలోకంపన్న ఈ ఆలయాన్ని రక్షించాడని వ్రాయబడి ఉంది. గంగాదేవి కావ్యంలో కూడ ఈ విషయప్రస్తావన ఉంది. తిరుచునాపల్లిలోని గుడిగోడల మీదకూడ కంపన్న పేరు కనిపిస్తుంది. తిరుచునాపల్లికి ప్రక్కగా 'కంపరసన్‌ పేట' అనే ఊరు ఉంది. ''కంపరాయ చతుర్వేది మంగళ'' మని దాని మొదటి పేరు. ఇలాచూస్తే ఈ ప్రాంతం నలభై ఏభై ఏండ్లు మాత్రం పరమతాలవారి పరిపాలనలో ఉన్నట్లు తెలుస్తుంది.

విద్యారణ్యుల కాలంలో విజయనగర సామ్రాజ్యస్థాపనానంతరము వేదాలు, ఆలయాలు, ధర్మాలు-పునరుద్ధరింపబడ్డాయి. 'కంపన్న ఒడయార్‌' జనులకు చాల సాయపడినట్లు ప్రతీతి. ఇతని కాలంలో ధర్మశాస్త్రాలు అభివృద్ధి చెందాయి. ఇట్లు మన శాస్త్రాల ఆధారంతో వెలసిన విజయనగర సామ్రాజ్యం చాల కీర్తి గడించింది. కృష్ణదేవరాయలు ఆ వంశంలోనే పుట్టాడు. ఆరాయల ఆస్థానంలోనే అష్టదిగ్గజాలుండేవారు. తెలుగు భాషలోని బృహత్కావ్యాలలోకొన్ని ఈ కాలమందే వ్రాయబడ్డాయి. తెలుగుకావ్యముల ఉన్నతి ఈయన కాలమున నూతనశిఖరముల నధిరోహించెను. విక్రమాదిత్యుని కాలంలో వరాహమిహిరులుకూడ ఇట్లే అనేక శాస్త్రాలలో ప్రగతి సాధించారు. ఆయన బృహత్సంహితలో - వేదాంతం తప్ప, మిగిలిన యెన్నో ఉపయోగించే శాస్త్రాలు సంకలనం చేయబడ్డాయి.

భోజరాజు, అతని రాజధాని ధారానగరము ఇట్టివే. ధారానగరంలో కవికానివాడే లేడట. కవి కానివాడు ధారా నగరం వదలి వెళ్లాలని జారాజ్ఞ. రాజభటులు కవికాని వానికై మూలమూలల వెదక నారంభించారు. వెదుకగా వెదుకగా వారి శ్రమఫలించింది. ఒక సాలెవానికి కవనమల్లడం రాదు. రాజభటు లా సాలెవానిని భోజరాజు ముందు నిలువ బెట్టారు. కవికానివానికిసైతం భోజరాజు ముఖం చూచేసరికి కవితా శక్తి కలిగేదట.

భోజరాజు 'కవిత్వం అల్లగలవా?' - అని నేతగానిని ప్రశ్నించాడు. అతడు - 'కావ్యం కరోమి;' అని బదులు చెప్పాడు. అంతటితో ఆగక - 'సహి చారుతరం కరోమి' - అన్నాడు. అంటే 'కావ్యము వ్రాయగలనుగాని - అంత చక్కగా వ్రాయలే'నని అర్థం. వెంటనే అతడు - 'యత్నాత్‌ కరోమి యది చారుతరం కరోమి' - అని రెండవ చరణం చెప్పాడు. ప్రయత్నిస్తే కొంచెం చక్కగా వ్రాయుదునేమో' అని దీని భావం. నేతగా డింతటితో ఆగలేదు -

'భూపాలమౌళి మణిరంజిత పాదపీఠ |

హే! సాహసాంక! కమయామి వయామి యామి' ||

అన్నాడు. అనగా - ''రాజులందరు తలలువంచి నీ పాదాలకు నమస్కరించేవేళ వారి కిరీటాలలో పొదుగబడ్డ రత్నాల కాంతులు నీ పాదపీఠంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అట్టి పాదపీఠముగల ఓసాహసాంకా! నేను కవిత్వమూ అల్లుతాను, బట్టలూ నేస్తాను, ఇక వెడతా''నని అర్థం.

ఇలా చెప్పి నేతగాడు బయలుదేరాడట. కవనమల్లండరాదని భటులు బంధించితెచ్చారు - కాని వాడే గడ గడ మంచినీళ్ళలా కవిత్వం చెప్పి 'యామి' అని శ్లోకం పూర్తిచేసి వెళ్ళాడట. ఇట్లు ధారానగరంలో కవికానివాడేలేడని ఒక ప్రతీతి.

మనదేశంలోరాజులంతా ధర్మానుపర్తులై శాస్త్రాలననుసరించి పరిపాలన చేశారు. శివాజీని చూడండి! ఆయన సామాన్యుడు కాడు. ఆయన గురువు సమర్థ రామదాసస్వామి. ఆయన ఆంజనేయుని అవతారమని అంటారు. సదా రామనామపరాయణు డాయన ఆయనయొక్క ఆనుగ్రహబలంవల్లనే అందరిని కూడగట్టుకొని శివాజీ ఢిల్లీ రాజుల నెదిరించాడు. ఉత్తరభాగంలో ధర్మమార్గాన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ ఎన్ని గ్రామాలు గెలిచినీ నాటికి నాదే సమర్థరామదాసస్వామి దగ్గరకు వచ్చి - 'స్వామీ! ఈ గ్రామాలన్నీ మీవి' అని సమర్పణ చేసేవాడట. 'ఈ గ్రామాలు నా కెందుకు? వీనిని నాకు ప్రతినిధిగా నీవే పరిపాలించు' - అని గురువు బదులు పలికేవారట. శత్రుకాంత నిను సైతం చెరపట్టక, హింసించక - శివాజీ వారికి తోడిచ్చి స్వజనులకడకు పంపేవాడట. శివాజీ చరిత్రలో ఇట్లు వ్రాయబడింది.

శివాజీకి గురువైన సమర్థ రామదాసస్వామి దాదాపు నలభై ఏభైమఠాలు స్థాపించారు. ఆయన తన శిష్యులకు 'శ్రీరామ జయరామ జయజయరామ' అనే మంత్రం ఉపదేశించి ఉంఛవృత్తితో జీవించండని ఆదేశించేవారట. తంజావూరు మహారాష్ట్రుల పరిపాలనలో ఉన్నప్పుడు - అక్కడ కూడ నాలుగైదు మఠాలు ఏర్పడ్డాయి. మహారాష్ట్రదేశంలో చాలామఠాలు వెలసాయి. వానిని 'రామదాసు'లనే అంటారు. ఇంతకూ కారణం సమర్థరామదాసుయొక్క మారుతి ఆంజనేయుని ప్రభావమే.

బుద్ధి ర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా!

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్‌స్మరణా ధ్భవేత్‌||

వేదాంతం క్షుణ్ణంగా పరిశీలించినవారు కొందరుంటారు. కాని వారి దేహం చిక్కి శిథిలమై ఉంటుంది. మనస్సులో ఎక్కడలేని ధైర్యమూ ఉంటుంది. కాని, శరీరంలో చేవ ఉండదు. కొందరికి అట్లుకాక దేహం క్రొవ్వి ఉంటుంది; కాని మనస్సుమాత్రం పిరికి. ఒకదాని కొకటి విరోధముగానుండును. మొదట మార్గమున - దుర్మార్గమున పోయెడువా డొకడుండును. భక్తియుండదు. కొందరికి భక్తియుండును. కాని జ్ఞానముండదు. మూఢభక్తి మాత్రముండును.

కాని ఆంజనేయ భక్తులట్లుకాదు. ఆంజనేయునిగూర్చి చెపుతూ శ్రీరామచంద్రు డాయనను 'నవవ్యాకరణవేత్త' అన్నారు. అంతే కాదు. ఆయన తత్వవేత్తకూడా. 'పైశాచి' అనేది ఒక భాష. ఆ భాషతో భగవద్గీతకు ఒక భాష్యం ఆంజనేయస్వామి వ్రాశారు. దానికి 'పైశాచ్యభాష్య' మని పేరు. హనుమ తన్నుపాసించినవారికి బలాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. 'బలం ఉంది - ధైర్యంలేదు', 'ధైర్యంఉంది - బలంలేదు'. అనుట ఉండదు.

అరవదేశంలో ఈయనకు 'హనుమార్‌' అని వ్యవహారం. తెలుగుదేశంలో ఆంజనేయశబ్దం ఎక్కువ. కన్నడులు 'హనుమంతయ్య' అని అంటారు. మహారాష్ట్ర దేశంలో మారుతికి 'మారుతి' అనియే ప్రసిద్ధి, 'బంగాళము-కాశ్మీరము మధ్యప్రదేశము - ఈ చోటులలో మహావీర్‌' శబ్దానికి వాడుక ఎక్కువ. ఆంజనేయుడు భక్తికి పరాక్రాంతికీ నెలవు. ఆయన కాయనయే సాటి.

''యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలిం|

బాష్పవారి పరిపూర్ణలోచనం

మారుతిం నమత రాక్షసాంతకం''

రామశబ్దము, రఘునాథుని కీర్తనము ఉన్న ఏ చోటనైనాసరే- మన కన్నుల కగోచరంగా - కనులనుండి నీరు ధారగా కారుస్తూ-ఆంజనేయుడు కీర్తన శ్రవణానందంలో మునిగి ఉంటాడు.

రామునియందాయన కంతభక్తి. బలంలో, ధైర్యంలో, కీర్తిలో, భక్తిలో-అన్నిట ఆంజనేయునిస్థానం అత్యున్నతమైనది.

వై దేహీసహితం సురద్రుమతలే

హైమే మహామంటపే

మధ్యే పుష్పక మాననే మణిమయే

వీరాసనే సంస్థితం,

అగ్రే వాచయతి ప్రభంజననుతే

తత్త్వం మునిభ్యః పరం

వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం

రామం భ##జే శ్యామలమ్‌||

దక్షిణామూర్తి సనకాదులకు జ్ఞానోపదేశం చేసే రీతిలో శ్రీరాముడు- ఆంజనేయునివంక చూస్తూ మహం్షులకు ఆత్మజ్ఞానము, భక్తి మార్గతత్త్వము ఉపదేశిస్తాడు.

శైవసిద్ధాంతమున కైవల్యనవనీతము, శివజ్ఞానబోధము అను గ్రంథములు కలవు. హిందూస్థానీభాషలో విచారసాగరమను గ్రంథమొకటి తత్త్వగ్రంథము. ఇట్టిదే తెనుగున-సీతారామాంజనేయము అనుగ్రంథము. జ్ఞానము భక్తి, బలము, ధైర్యము, వీర్యము, శ్రేయముల నిచ్చునది ఆంజనేయులు, అన్నిటియందును వారు పరిపూర్ణులు. పైగా అఖండ బ్రహ్మచర్యనిష్ఠులు. ఒక్క క్షణముకూడ కామమనెడు విషయమే 'జ్ఞాపకములేని ఆంజనేయుల అవతారమే సమర్థ రామదాసస్వామి' వీరి బలముచేతనే మహారాష్ట్రమున ఒక పెద్ద రాజ్యమేర్పడినది. ఇంగ్లీషువారు సయితము ఎక్కువగ మహారాష్ట్రులతోనే యుద్ధము చేయవలసివచ్చినది. ఇట్లు తత్త్వము, శాస్త్రము- వీని ఆధారముపై లేచిన రాజ్యములు బహుకాలము కీర్తితో నిలిచియుండెను.

భోజుని ధారానగరంలో ఒక మసీదు ఉంది. అందులో ఒక శిలాశాసనం దొరకిందట. మసీదులోనికి వెళ్ళడానికి వీలులేక 10,15 సంవత్సరాలు ఊరకొన్నారు. ఈ మధ్య అనుమతి సంపాదించి ఎథిగ్రాఫికల్‌ డిపార్టుమెంటువారు ఆ శిలాశాసనాన్ని పరిశోధించారు. అందులో ఒక పెద్ద చక్రం- ఆ చక్రంలో శ్లోకాలు చెక్కబడ్డాయి. ఆ చక్రంలో వ్యాకరణం అంతా ఒక 'చార్టు'లా చెక్కబడి ఉన్నదట. తరువాత దానిని ఆ ఇలాకావారు అచ్చువేశారు. ఆ మసీదు ఉన్న చోటనే పూర్వం భోజరాజుకాలంలో సరస్వత్యాలయం ఉండేదట. ఇట్లు భోజరాజుకాలానికి చెందిన ఒక శిలాచక్రం ఈనాటికి అగపడింది. వ్యాకరణశాస్త్రాన్ని శిలపై చెక్కి సరస్వత్యాలయంలో ప్రతిష్టించారు. ఆలయం మసీదుగా మారి, మరల ఆచక్రం మనకు ఫలప్రదం అయింది. ఈ శాసనాన్ని ఆంగ్లంలో ప్రశంసించారు.

భోజరాజు 'సమరాంగణసూత్రము' అనే గ్రంథం వ్రాశాడు. 'యంత్రాలు. మిషన్లు ఎట్లు చేయాలి? ఆకాశయానం ఎలా సాధ్యం?' అనే విషయాలిందు ప్రస్తావించబడ్డాయి. అమరంలో 'వ్యోమయానం విమానో7స్త్రీ' అని ఉంది. ఆకాశంలో పయనించే వాహనానికి విమాన మని పేరు. రామాయణంలో కూడ విమాన ప్రశంస వస్తుంది. కాని మనము దానిని కథ అని వదలిపెట్టాము. భోజరాజకృతమైన 'సమరాంగణ సూత్రము'లో విమాన నిర్మాణవిధానం వ్రాయబడి ఉంది. దానిని గూర్చి వ్రాస్తూ- విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వముమాత్రమే (థియరి) వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలియక వదలలేదు. చేయుటెట్లో చెప్పడం వల్ల సామాన్యజనాళికి సౌఖ్యానికి బదులు అసౌఖ్యమే ఏర్పడుతుంది- అని ఇది వ్రాయబడలేదు' అని వ్రాశారు.

ఈ విషయం మన కిప్పుడు బాగా అర్థమౌతోంది. ఈ ప్రపంచము నిలుస్తుందా? మరునిముసం ఉంటుందా ఏ నిముసంలో మనమంతా నశిస్తామా? అన్న భయంతో ఆటంబాంబు హైడ్రోజన్‌ బాంబులయుగంలో మనం ఉన్నాము. చిత్తశుద్ధిలేని వారి చేతులలో ఈ మారణాయుధాలు ఉండడం పసిపాపల చేతులలో విషం ఉండడంవంటిది. అందు చేతనే దీనిని గూర్చి చెప్పనని భోజరాజు సమరాంగణసూత్ర గ్రంథంలో వ్రాశాడు. కొంతకాలానికి వెనుక దీనిని గురించి ఉత్తర దేశం నుండి నాకొక లేఖవచ్చింది. విమాన నిర్మాణ విధానం ఈ గ్రంథంలో ఉందికదా! ఇది ఏమైనా అర్థమౌతోందా? అని నేను కొందరు ఇంజనీర్లకు దానిని చూపాను. ఏవో బెలూన్లవంటి సాధనాలను గురించి వర్ణించారని వారన్నారు.

ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు వృద్ధి చెందుతూ ఉండగా మనదేశంలో ఉన్నశాస్త్రాలు నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల నుపయోగించుకొనే రీతి మనకు తెలియడంలేదు. ఇట్టిదే నాడీశాస్త్రం. నాడీ శాస్త్రమంటే సాముద్రికం కాదు. మనం ముక్కుదగ్గర చేయిపెట్టి చూస్తే తెలుస్తుంది. శ్వాస ఒకప్పుడు కుడినాసిక నుండి వస్తే ఒకప్పుడు ఎడమనాసికనుండి వస్తుంది. ఈ శ్వాసల పేర్లు యోగశాస్త్రములో చెప్పబడిఉన్నాయి. 'ఎడమ నాసిక నుండి శ్వాసవస్తే మనోవృత్తి ఇలా వుంటుంది- కుడి నాసికనుండి శ్వాసవస్తే మనోవృత్తి ఇలా వుంటుంది' అని నాడీ శాస్త్రములో చెప్పబడింది. 'మంచి చిత్తవృత్తి, శాంతము, ఆరోగ్యము-అన్నీ కుడినాసికనుండి శ్వాస వచ్చినప్పుడు కలుగుతాయి; ఎడమ నాసికనుండి శ్వాస వస్తే కోపము, రోగము, దుఃఖము కలుగుతాయి'- అని వ్రాయబడింది. మంచికి కుడి, చెరుపునకు ఎడమ, నాడీశాస్త్రాన్ని గురించి తమిళంలో కూడ ఒకటి రెండు పుస్తకాలు ఉన్నాయి.

ఇటులే కాశిలో మరణించినవారికి కుడిచెవిలో స్వామి తారకమంత్రోపదేశం చేస్తాడని ప్రతీతి. తారక మంటే ప్రణవం. రామనామానికిన్నీ తారకమనియే పేరు. జ్ఞానులకు ప్రణవాన్ని, భక్తులకు తదితరులకు రామమంత్రాన్ని స్వామి ఉపదేశిస్తారట. కాశీక్షేత్రము బహుదూరము. కాశికి సమానమైన క్షేత్రాలు ఇంకా ఉన్నాయా? అంటే, కాశితోబాటు ఏడు క్షేత్రాలను పేర్కొన్నారు.

అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా,

పురీ ద్వారవతీ చైవ సపై#్తతే మోక్షదాయకాః,

ఇదేరీతిని పుణ్యనదులు ఏడు.

గంగే! చ యమునే! చై వ గోదావరి ! సరస్వతి!

నర్మదే ! సింధు ! కావేరి !......

పుణ్య క్షేత్రములు ఏడు. పుణ్యనదులు ఏడు. ఈ క్షేత్రాలలో మరణించినవారికి మోక్షము లభిస్తుంది. 'పురీ అనగా ద్వారకాపురి. జగన్నాథముకాదు. దక్షిణమున వొక్క కంచియేకదా! కావేరీతీరములో కాశికి సమానములైన క్షేత్రములు మరి లేవా? అంటే ఈ క్రింది క్షేత్రాలు చెప్పబడ్డాయి.

శ్వేతారణ్యం పంచనదం గౌరీ మాయూర మర్జునం,

ఛాయావనం చ శ్రీవాంచ్యం కాశీక్షేత్ర నమాని షట్‌||

పంచనద మనగా తిరువైయార్‌, 'ఛాయావనం' అనేది కావేరీ పట్టణానికి ప్రక్కన; 'శ్రీ వాంచ్యము' 'నన్నిలము' అనే చోటుకు దాపున ఉన్నాయి. 'గౌరీమాయూరము- అంటే- 'మాయవరము', ఇవి కాశికి సమానములైన ఆరు క్షేత్రాలు.

తిరువైయార్‌లో పశువులు సైతము కుడిచెవిపైన ఎడమచెవి క్రింద ఉండునట్లు పరుండి ప్రాణాలు వదలుతాయి. అని ప్రతీతి. కుడిచెవిపైన ఉండవలెనంటే ఎడమచెవి క్రిందుగా ఉండవలెను. ఎడమప్రక్కగా పండుకొనవలెను. ఎడమప్రక్క శయనిస్తే దేహభావం అంతా ఎడమ ప్రక్కపడి కుడినాసిక నుండి శ్వాస సులభంగా వస్తుంది. కుడినాసికలోనుండి శ్వాస వస్తే మంచి మనోవృత్తులు శాంతి కలుగుతాయి; అని నాడీ శాస్త్రము చెపుతూఉంది. స్వామి కుడిచెవిలోనే మంత్రోపదేశము చేయుననుటకూడ పొందికగనే ఉంది.

ఇట్లు మన ప్రాచీన శాస్త్రాలు, ప్రాచీన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఢిల్లీలో కుతుబ్‌మీనారుకు సమీపంలో ఉన్న శివాలయంలో ఒక పెద్ద ఇనుప ధ్వజస్తంభము ఒకటి ఉంది. అంతపెద్ద స్తంభమును కరగించి ఎట్లు మూస పోసినారని ఈనాటికిని ఆశ్చర్యంగా ఉంది. నూతనయంత్రములతో గూడిన టాటా కంపెనీ ఉక్కు-ఇనుము కర్మాగారములు ఈనాటివి. కాని, ఈ పరికరము లేవియు లేని ఆకాలంలో ఇంతపెద్ద స్తంభాన్ని ఏలా నిర్మించినారో, అన్న ఆశ్చర్యం ఇంతింతకాదు. ప్రపంచంలోని అద్భుతాలు ఏడు అంటారు. పైసా నగరంలోని వ్రాలుడు గోపురము, జిబ్రాల్టరులోని ఒక పెద్ద విగ్రహము, ఈజిప్టులోని పిరమిడ్లు, ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా, మాస్కో చర్చిలోని ఒక పెద్ద గంట-ఇలా ప్రపంచంలోని అద్భుతాలు ఏడు అని చెపుతారు. ఇవి మాత్రమే కావు. ఇంకను ఎన్నో?

మనకు చాలా వెనుకటివారు ఇట్లు నిర్మించిన మహోన్నత దేవాలయాలు-శిల్పాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. వీనిని కట్టుట ఎటులో ఉపదేశించు శాస్త్రములు ఉండి ఉండాలి. ఇపుడేవీలేవు. ఇప్పటివారు 'మతము సైతము శాస్త్రానికి (సైన్సు) అనుకూలంగా ఉంటేనే ఒప్పుకుంటారు అంటారు. సైన్సుకు అనుకూలంగా ఉండాలీ అంటే ఏనాటి సైన్సుకు? ముప్పదేండ్ల క్రిందటి సైన్సు ఒకతీరు- ఏబదేండ్లకు వెనుకటి సైన్సు మరియొకతీరు. ఏ కాలమునాటి సైన్సు మనకు ప్రమాణము? ఏభై ఏండ్లకు వెనుక చెప్పిన విషయాలను జనము ఇప్పుడు ఒప్పుకొనడములేదు. ఇవన్నీ చూస్తే మన అజ్ఞానదశ వెల్లడిఔతోంది. 'మనకు తెలియనిదంతా అబద్ధము; వానిని తగుల బెట్టాలి', ఇది ఈ నాటి తీరు ఇప్పుడు ఉన్నశాస్త్రాలు మనం చదువాలి. మనకు అర్థము కాకపోయినా మన సంతతికొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా ఇవి ఉపయోగిస్తాయి, పిరమిడ్లను చూస్తే నేటికీ ఆశ్చర్యమే! మనకు, ఆ పిరమిడ దేశమువారికిని సంబంధము ఉండేదట. ఆఫ్రికాదేశములో 'మేరు, రామ' శబ్దా లీనాటికీ ఉన్నాయట. ఇలా ప్రపంచంలో ఒకే తత్త్వము, ఒకే నాగరికత ఉండేదని తెలుస్తూఉంది.

అందుచే నేడు మనకు ఉపలబ్దములైన శాస్త్రాలను రక్షించడం ఎంతైనా అవసరం. మనకు అర్థము కాలేదని ప్రయోజనములేదని- త్రోసివేయకూడదు. వాని రక్షణ పూర్వరాజులకు ఒక విధిగా ఉండేది. ఇపుడు రాజులులేరు. రాజ్యాంగమువుంది. కాని వారికి నెమ్మది అన్నదిలేదు. ఒక ప్రక్క భాషావివాదము-మరొకవంక పొలిమేరల తగాదా, జాతిని గూర్చిన వివాదము-ఇక సాధారణ కుటుంబాలగతి మరీ అధ్వాన్నముగా ఉంది. ఇట్టియెడ జీవితం ఎలా గడపాలి? అన్నదే పెద్ద చింత.

రాజ్యమంటే ఈలాగే ఉంటుంది. ఆ కాలములో ఒక రాజుకు మరియొక రాజుకు కయ్యాలు. ఇపుడొకజాతికి మరొక జాతికి వివాదము. ఒక రాజ్యానికి మఱొక రాజ్యానికి యుద్ధాలు. యుద్ధములేక మనుష్యుడు జీవించడం కష్టం. 'అలలు తగ్గిన మీదట సముద్రస్నానం-అన్నది కల్ల. ఆ శుభదినం ఎన్నటికీ రాదు. అరణ్యములో పులిపై సింహము దూకుతుంది. జింకను పులి తన వాతబెట్టుకొంటుంది. కాని అరణ్యంలో ఇవన్నీ వృద్ధిచెందుతూ, ఆడుకొంటూ, జీవిస్తూనే ఉన్నాయి. 'మనం రేపు ఏమి చేయాలి? మరునిముసములో మనం చేయవలసిన పని యేమిటి?- అని అవి మనఃక్లేశము పొందడం లేదు. మనుష్యునకు బుద్ధిఉంది. అందువల్లనే మరుసటిరోజును గూర్చి అతనికి చింత, నిన్నటినిగూర్చి రేపటిని గూర్చిగాని చింత ఎందుకు? రేపటినిగూర్చి ఏడువవలసిన అవసరం కనిపించదు. అన్నీ ఈశ్వరసంకల్పాన్ని అనుసరించి జరుగుతాయి. జరిగేది జరుగనీ, ప్రస్తుతమేదో అదే కర్తవ్యము. దానిని గమనించి చేస్తే చాలు.

ప్రాతశాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. అన్నిటినీ మించినది బ్రహ్మవిద్య. అది వట్టి బుద్ధిచేత మాత్రమే తెలియబడదు. అనుభవమునకు రావలసిందే. ఆత్మవిద్య అనుభవమునకు రావలెనంటే మనోవృత్తి దృఢంగా ఉండాలి. ఇతర విద్యలచే మనస్సు పరిపక్వమైనపుడే ఆత్మ విద్య అంటుతుంది.

మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చేయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వస్తూ ఉన్నట్లు తోస్తుంది. అన్ని దేశములు శిలాయుగమునుండి స్వర్ణ యుగానికి పురోగమించేయి. మనదేశం స్వర్ణయుగమునుండి శిలాయుగానికి పర్యటిస్తూ ఉంది. మన శాస్త్రములను మూఢతచే పనికిమాలినవని పారవేయగూడదు. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. దేనినీ ఖండించుటకు మన కధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం. ఆంజనేయస్వామి మన కెల్లరకు మంచి బుద్ధియు, శక్తి ప్రసాదించాలి. ఆయనను ప్రార్థిస్తే మనకు ఏ విధమైన కొరత ఉండదు. అన్నిటికి ఆయన అనుగ్రహమే కారణము.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page