Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

అర్థములు

పుట 2 'మనస్త్వమ్‌'

శివయువతి ! = ఓ భగవతీ!, మనః=మనసు, త్వమ్‌ ఏవ=నీవే, న్యోమ=ఆకాశము, త్వమ్‌ ఏవ=నీవే, మరుత్‌=వాయువు, అసి=నీవే (అసి అనునది నీవు అను అర్థము కల అవ్యయము), మరుత్‌ సారథిః=అగ్ని, అసి=నీవు, ఆపః=నీరు, అసి=నీసి, భూమిః=భూమి, అసి=నీవు నేను వ్రేల్వగలనని తలచుటకు కర్తమనసు కావున యజమానుడవును నీవే. మరియు మనఃపదము చంద్రుని, మరుతా=రథిపదము సూర్యునిజెప్పును. ఎటులనిన- 'చంద్ర మా మనసో జాతః' (='మనసు=న చంద్రుడు పుట్టెను') అను శ్రుతికలదు. కార్యకారణములు వేరుకావు కావున మనస=నగా చంద్రుడని అర్థము. ఇటులే- 'అహో7గ్ని | తామ్రో7రుణః | తా అవిసృష్టౌ'=(అహసు=నుండి అగ్ని (యు) రాగి వన్నె కల సూర్యుడు (ను) పుట్టిరి. ఆయిరువురును ఎడబాయరు) అను శ్రుతి కలదు. కాగా చంద్రుడు నీవే, సూర్యడు నీవే. యజమానుడవు నీవే అను అర్థము కలిమి నీవు, అష్టమూర్తిని - శివస్వరూపము నీది అని తేలినది.ొ ఇటులు, త్వయి నీవు, పరిణతాయామ్‌ = అష్టమూర్తులుగా పరిణామము చెందగా, పరం = ఇక వేరయినదేదియు, నహిఖలు లేదుకదా! (నీకంటెను ఈ యెనిమిదికంటెను వేరు దినుసు లేనేలేదు కదా!) త్వమేవ=నీవే, స్వాత్మానం= స్వస్వరూపమును, విశ్వ వపుషా = ప్రపంచరూపముగా, పరిణమయితుం =పరిణమింప జేయుటకు, చిదానందాకారం = చిచ్ఛక్తి యొక్కయు ఆనందభైరవునియొక్కయు ఆకారమును, భావేన = చిత్తముచే, బిభృషే = భరించుచున్నావు, లేక - చిదానందాకారం = బ్రహ్మస్వరూపమగు శితతత్త్వమును, శివయువతిభావేన = శివయువతివై, బిభృషే = భరించుచున్నావు. లే%్‌ - చిదారందాకారం = బ్రహ్మస్వరూపమగు శివతత్వమును, శివయువతిభావేన = శివయువతివై, బిభృషే = భరించుచున్నావు. స్వస్వరూపమును శక్తి రూపముగా పరిణమించిన ఎనిమిది మూర్తులయందును కూర్పుచున్నావని తాత్పర్యము.

ఉత్తర కౌలులిటులు చెప్పుదురు:- ప్రధానమే ప్రపంచమును సృజించును, శివుడు లేడు. దాన తానే ప్రథానము. ప్రథానము కావుననే అనగా అప్రథానము కాదు గనుకనే శేషభావము లేదు. ప్రథానపరిణామము పంచతత్త్వాత్మకము. మనసు మొదలగునవి ప్రథానాత్మకమగు శక్తియొక్కపరిథామములు. తత్త్వములో స్వరూప పరిణామములు. ఇటులు కార్యరూపమగు ప్రపంచమునెల్ల తనయం దారోపించుకొని కారణరూపముగా ఏదిఉన్నదో అది ఆధారకుండలిని.

ఆగమికులు ఇటులు చెప్పుదురు:- శివయువతి =ఓభగవతీ! మనః=ఆజ్ఞాచక్రమునందు సూక్ష్మరూపముతో నున్న మనస్తత్వము, అసి=నీవు, వ్యోమ=విశుద్ధి చక్రమునందు సూక్ష్మరూపముతో నున్న ఆకాశతత్త్వము, అసి=నీవు. మరుత్‌ = అనాహతమునందు సూక్ష్మరూపముతో నున్న వాయుతత్త్వము, అసి=నీవు, మరుత్‌ సారథిః = స్వాధిష్ఠానచక్రమున సూక్ష్మరూపముతో నున్న అగ్నితత్త్వము, అసి=నీవు, అపః = మణిపూరమునందు సూక్ష్మరూపముతో నున్న జలతత్త్వము త్వం=నీవు, భూమిః= మూలాధారమున సూక్ష్మాకారముతో నున్న భూతత్త్వము, త్వం=నీవు (ఇటులు సంచభూత సూక్ష్మాత్మక కార్యకారణరూపముగా), త్వయి నీవు, పరిణతాయాం = పరిణామము పొందునటులు చేసియుండుచుండగా, లేక ఇట్టి రూపాంతరముతో వివర్తముచెంది యుండగా (పరిణామ శబ్దమిచట వివర్తపరము), నహిపరం = వేరేదియు లేదు. పిండాండమునందును బ్రహ్మాండమునందును ఏకరసముగా నీవే ఉండుటవలన నీకంటె వేరువస్తువే లేదని అర్థము. త్వమేవ=నీవే (నిన్నుపరిణమింపజేయు వాడొకడును లేడని నీవే అని అవథారణము), స్వాత్మానం=స్వస్వరూపమును, విశ్వవపుషా = వ్యాపకమను పూర్ణమునగురూపముగా - లేక పృథిని మొదలగు స్థూలప్రపంచము; విరాడ్రూపమగు తత్కార్యము, విరాడభిమానియగువిశ్వుడు: ఏతద్రూపముగా. పరిణమయితుం = పరిణమింపజేయుటకు, చిదానందాకారం = చిత్‌ = చిచ్ఛక్తియొక్కయు, ఆనంద = బ్రహ్మము యొక్కయు, ఆకారం = స్వరూపమును; భావేన = ఇచ్ఛచే, బిభృషే = భరించుచున్నావు. సృష్టిస్థితిలయములు చేయునిచ్చ నొడమి శక్తియనియు శివుడనియు రెండురూపములను తాల్చుచున్నావు. తాల్పనియెడల నీ వొకతవే యని అభిప్రాయము.

పుట 3 'లీయే పురహరజాయే'

పుర....జాయే = త్రిపురములను హరించిన హరుని యిల్లాలా! మాయే ఓ మాయా!, చంద్రాభరణ = చంద్రుడాభరణముగా గల ఓఅమ్మా!, కాంచీశరణ=కాంచియే ఇల్లుగా గలదానా!, నతార్తి సంహరణ = మ్రొక్కువారి బాధలను బాపుదానా!, తవ=నీయొక్క, తరుణ=లేజిగురులచాయగల, చరణ పాదము(ల)లో, లీయే=లయమగును. (నీ యడుగులమీద వ్రాలుదును.

పుట 4 'సృష్టికర్త్రీ'

'సృష్టికర్త్రీ'=సృష్టి చేయునది. (అంబిక పేర్తలో నిదియొకటి. ఈ పయివన్నియు అంబికా నామములే.)

'బ్రహ్మరూపా'=సృష్టికాలమున బ్రహ్మగా అగునది. బ్మహ్మయనగా నాలుగు మోముల వేలుపు. రజోగుణము ప్రథానమయినపుడు ఈశ్వరుడగు చతుర్ముఖుడు సృష్టిచేయును. 'బ్రహ్మ విష్ణు శివా బ్రహ్మన్‌ ప్రథానా బ్రహ్మశక్తియః' అని విష్ణుపురాణము. అనగా బ్రహ్మయు విష్ణువును శివుడును ప్రధానములగు బ్రహ్మశక్తులు అని అర్థము.

'గోప్త్రీ'=ప్రపంచమును నిలుపునది. ఇదిసత్త్వగుణప్రథానుడగు ఈశ్వరుని కృత్యము. దానిని చేయునది గాన అంబికకు గోప్త్రీయని పేరు.

'గోవిందరూపిణి' - గోవిందు డనబడు ఈశ్వరుడు విష్ణువు. అంబికారూపమే ఆ విష్ణువు. కాగా విష్ణురూపము కలది అని అర్థము. 'ప్రకృత్యాః ప్రథమోభాగ ఉమాదేవీ యశస్వినీ| వ్యక్తః సర్వమయో విష్ణుః స్త్రి సంజ్ఞో లోకభావనః|' అని హరివంశము. =ప్రకృతి ప్రథమ భాగము ఉమ; ద్వితీయము విష్ణువు. అతడు రూపుతాల్చియు సర్వమయుడు. లోకపాలకుడు. మరియు అతడు స్త్రీగా తెలియబడువాడు.

'సంహారిణి' లోకములను అణువులనుగా సంహారముచేయునది. తమోగుణము ప్రథానముగా భాసించినపు డిది ఈశ్వరుడు చేయుపని.

'రుద్రరూపా'=రుద్రుని రూపు తాల్చినది. పై నామము నందు చెప్పబడిన ఈశ్వరు డీరుద్రుడే.

'తిరోథానకరీ'=సమస్తమును మఱుగుచేయునది మాయము చేయునది. పరమాణువులను గూడ ప్రకృతిలో లయమగునటు లొనరించునది. ఇది దీపమును ఆర్పినటులు. ఇది శుద్ధసత్త్వప్రథానుడగు ఈశ్వరుని కృత్యము.

'ఈశ్వరీ'=పై జెప్పబడిన ఈశ్వరుడు మాయ యంతటి శుద్ధసత్త్వము. అట్టి యీ యీశ్వరునికంటె వేరుకానిది కావున ఈ యమ్మ యీశ్వరి. లేక పరాహంతయే యీశ్వరత్వము. ఆ యీశ్వరత్వము కలది కావున ఈశ్వరి. 'ఈశ్వరత్వము. కర్తృత్వము, స్వాతంత్ర్యము చిత్‌ స్వరూపత ఇవి పరాహంతకు సర్యాయము' లని విరూపాక్ష పంచాశిక. (విశ్వశరీర స్కంధము. చూ)

'సదాశివా'=గడ్డకట్టిన సత్త్వము ప్రథానముగా భాసించిన ఈశ్వరుడు సదాశివుడు. ఆయనకంటె వేరుకాడు. కావున అంబిక సదాశివ.

'అనుగ్రహదా'=ఇసుమంతయు మిగులకు ధ్వంసము పొందిన జగత్తును మరల పరమాణురూపము నొందజేయుట అనుగ్రహము. ఇది కరుడుకట్టిన సత్త్వము ప్రథానముగా భాసించునట్టియు సదాశివుడు పేరు కలట్టి ఈశ్వరుని (ప్రభువు) పని. ఆపని చేయునదికాన 'అనుగ్రహద' అని అంబికకు పేరు. లేక తిరోథానానుగ్రహములకు బంధమోక్షము లని అర్థము. ఈ యర్థము స్వారసికము. ఏలయన బహిరున్మేషము కల వా డీశ్వరుడు. అంతరున్మేషము కలవాడు సదాశివుడు.

'పంచకృత్య పరాయణా' =ఐదు పనులను పాటించునది. లేక ఈ ఐదింటికి ఆశ్రయమయినది లేక పాలించునది. ఆ ఐదు పనులు ఇవి: 'బ్రహ్మ మొకటియే జగజ్జన్మ స్థితి థ్వంస తిరోథానమలకును (క్రమ్మఱ) భూత భౌతికముల యునికిని కారణము'- అని మృగేంద్ర సంహిత. ఇటులే ఆచార్యులవారు సౌందర్యలహరియందు 'జగతూ=తేథాతా' అని చెప్పిరి. శక్తిసూత్రాదులును ఇటులే చెప్పుచున్నవి. (సౌభాగ్య భాస్కరవ్యాఖ్య).

పుట 5 'మూలతో బ్రహ్మ'

మూలతః=మూలమున, బ్రహ్మరూపాయ బ్రహ్మ రూపమును, మధ్యతః=నడుమ, విష్ణురూపిణ=విష్ణు రూపమును, అగ్రతః=కొనను, శివరూపాయ=శివ స్వరూపమును కలట్టియు, వృక్షరాజాయ=చెట్లకు రాజవైన, తే=నీ కొరకు, నమః=వందనము.

పుట 6 'ఓం పూర్ణమదః'

అదః=అది (బ్రహ్మము), పూర్ణం=అనంతము, ఇదం=ఇదియు (ప్రపంచము), పూర్ణం =అనంతము, పూర్ణాత్‌=అనంతమునుండి పూర్ణం=అనంతము, ఉదచ్యతే= వ్యక్తమగుచున్నది, పూర్ణస్య = అనంతము యొక్క, పూర్ణం=అనంతతను, ఆదాయ=గ్రహించినను అనగా కలిపినను తీసివైచినను పూర్ణమేవ=అనంతమే, అవశిష్యతే మిగులును. (అనంతమగు బ్రహ్మమునుండి అనంతములగు బ్రహ్మాండములెన్ని తీసినను ఎన్ని కలిపినను ఆ బ్రహ్మము అనంతమే.)

పుట 17 ' యో యో'

యః యః=ఎవ డెవడు, యాం యాం = ఏ యే తనుం=మూర్తిని, భక్త్యా=భక్తితో, శ్రద్ధయా = శ్రద్ధతో, అర్చితుం=పూజించుటకు, ఇచ్ఛతి=ఇచ్చగించునో, (భక్తః అని పాఠాంతరము, భక్తః=భక్తుడై పూజింప నిచ్చగించునో అని అర్థము) సత్య సత్య = ఆయా వానికి, అహం=నేను, తామేవ = ఆమూర్తినే గురించిన, శ్రద్ధాం = శ్రద్ధను, అచలాం విథాదమి = గట్టిపరతును, (మానిటెంకయేని వేపగింజయేని మరి యే విత్తేని తమతమ సంస్కారమునకు తగినటులు పరిణమించుటకు వానిలోని నీరు వానికి తగిన శక్తి నొసగినటులు జీవులును తమతమ సంస్కారములకను రూపముగా ప్రవర్తించుట కెటులిచ్చగింతురో అటులే ఆయా జీవుల బుద్ధియందున్న ఆత్మస్వసన్నిధి మాత్రమున ఆయాబుద్ధులకు ప్రవృత్త్యనురూపమగు శక్తిని ఇచ్చును. రౌతు గుర్రమును ఇచ్చవచ్చినటులు నడపి నటులు ఆత్మ తన యిచ్చ కనుకూలముగా నడిపింపదు. ఆత్మ నిష్ర్కియము కావున ప్రేరణ మసంభవమను తాత్పర్యమును శంకరానందీయమున చూచునది).

పుట 18 ' సాంఖ్య యోగౌ'

సాంఖ్యేః=జ్ఞాననిష్ట కల సన్న్యాసులచే, యత్‌=ఏ, స్థానం=తావు అనగా మోక్షము, ప్రాప్యతే = పొందబడునో, యోగైరపి = కర్మయోగులచే గూడ, తత్‌ = ఆమోక్షము, ప్రాప్యతే=పొందబడును, యః=ఎవడు, సాంఖ్యం చ యోగంచ=సన్న్యాసమును కర్మయోగమును, ఏక =ఒకటిగనే-ఫలైక్యము కలదానిగా, పశ్యతి = తెలిసికొనుచో, సః= అతడు, పశ్యతి = తెలిసి కొన్నవాడు అగును.

పుట 20 'త్రయీ సాంఖ్యం'

త్రయీ=వేదమతము, సాంఖ్యం=సాంఖ్యమతము-యోగః=యోగమతము, పశుపతిమతం = పాశుపతము, వైష్ణవంచ = వైష్ణవమును అని, విభిన్నే=వేరువేరయిన, ప్రస్థానే=మార్గమునందు, ఇదం = ఈ మతము, పరమితి చ = దొడ్డదనియును, అదః = ఆ మతము, పథ్యమితి చ సరియయినదనియును (పథి = సాధు. అదిపూలబాట యనియును), రుచీనాం వైచిత్ర్యాత్‌ = (నాలుకకొక రుచి) ఎవరి అభిరుచి వారిది, కావున పెక్కు అభిరుచులుండుటవలన; ఋజు....జుషాం=నూటియు వంకరయు అగు పలుమార్గములను పట్టి పోవు, నృణాం=నరులకు, పయసాం=నీళ్ళకు, అర్ణవ ఇవ = సముద్రమువలె, త్వమ్‌ ఏకః గమ్యః అసి = నీ వొకడవే పొందదగినవాడవు.

పుట 26 'త్రంబకం యజామహే'

సుగంధిం=మేలు తావి గలిగినట్టియు, పుష్టి, వర్థనం =లౌకికమగు పుష్టిని, వైదికమగు పుష్టిని పెంపొందించు నట్టియు; త్రంబకం = మూడుకన్నుల దేవరను, శివుని; యజామహే=పూజించుచున్నాము (పూజింతము), (హేత్ర్యంబః=ఓ ముక్కంటీ) బంధనాత్‌ = తొడిమ నుండి, ఉర్వారుక మివ = దోసపండువలె, మృత్యోః= మృత్యువునుండి, ముక్షీయ = విడివడుదము గాక! మోక్షాత్‌=మోక్షమునుండి, మా = విడివడకుందము గాక!

పుట 30 'అంతర్‌ బహిశ్చ'- (తైత్తి. -3అనువాక)

(దీని వెనుకనున్న 'యచ్చ కించి జ్జగత=ర్వం దృశ్యతే శ్రూయతే7పివా' అను దానిగూడ కలిపి అర్థము చెప్పినయెడల తేలికగా తెలియునుగాన అట్లు చెప్పుచున్నాను) జగత్‌ = జగతిలో, యత్‌ = ఏ, కించిత్‌ = కొంచియమగు, సర్వంచ = ఎల్లయందు, దృశ్యతే = చూడబడుచున్నదో, అపి వా = లేక, శ్రూయతేవా = వినబడుచున్నదో, తత్‌ = దానియొక్క, అంతః = లోపలను, బహిశ్చ = వెలుపలను, సర్వం = అంతటను, నారాయణః = నారాయణుడు, స్థితః ఉన్నాడు. (దాపున కంటికి కనిపించు నెల్లవస్తువులందును దవ్వుల నుండి చెవులకు వినిపించు అన్ని వస్తువులందునులోపలను వెలుపలను అంతటను నారాయణుడు వ్యాపించియున్నాడు.)

పుట 31 'మాయా హ్యేషా' (భారత)

నారద = ఓ నారదుడా!, సర్వభూత గుణౖః = ఎల్లభూతములయు గుణములచే, యుక్తం= కూడుకొనిన, మాం = నన్ను, ఎల్లభూతములయు గుణములచే కూడుకొనినవానినిగా), పశ్యసి (ఇతి) యత్‌ = చూచు చుంటి వనునది (ఏదికలదో), ఏషా = ఈ, మాయా = మాయ. మాయా = నాచే (ఇది) సృష్టాసృజింపబడెను, ఏవం = ఇటులు (మాయాయుక్తునిగా), మాం = నన్ను, జ్ఞాతుంనార్హసి = తెలియకుమా! (నా సత్య స్వరూపముమాయా విహీనము. ఇట్టి మాయతో సంబంధము కలిగినందువలన నీవు నన్ను చూడగలుగు చున్నావు. స్వస్వరూపము ఇటులు చూడబడునదికాదు.)

పుట 25 'యత్‌ సాంఖ్త్యెః'

సాంఖ్త్యెః = జ్ఞాననిష్ఠకలవారిచే, యత్‌= ఏ, స్థానం=తావు అనగా మోక్షము, ప్రాప్యతే = పొందబడుచున్నదో, యోగైరపి = యోగముకలవారి చేతను అనగా ఫలము కోరిక ఈశ్వరార్పణముగ కర్మలు చేయు కర్మయోగుల చేతను, తత్‌ = ఆ మోక్షము, గమ్యతే = పొందబడుచున్నది, యః=ఎవడు, సాంఖ్యం చ = (ఎఱుకపట్టుకల) సంన్యాసమును, యోగం చ = కర్మ యోగమును, ఏకం = ఒకటిగనే అనగా మోక్షఫలము కలదానిగా, పశ్యతి = తెలియునో, సః=వాడు, పశ్యతి = బాగుగా తెలిసినివాడు - (అగును ఇచట సాంఖ్య పదము జ్ఞాననిష్టులగు సంన్యాసములను, యోగపదము యోగులను కర్మయోగులనుచెప్పును.)

పుట 33 'ధన్వంతరి' (చాటువు)

నవవిక్రమస్య నృపతేః = నవవిక్రమార్క మహరాజు యొక్క, సభాయాం= సభలో, ధన్వంతరి....కాళిదాసాః = ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుడు, వేతాలభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు; ఖ్యాతః = ప్రసిద్ధుడైన, వరాహమిహిరః = వరాహమిహిరుడు, వరరుచిః = వరరుచియు, రత్నానివై = నిక్కపు రత్నములు, రాలను వేనినో చూచి రత్నములని అనుకొందురుగాని ఈ తొమ్మండ్రే నవరత్నములు.

పుట 41 'కావ్యం కరోమి' (భోజచరిత్ర)

కావ్యం = కబ్బమును, కరోమి= అల్లుదును, చారుతరం = మిగుల సుందరముగా (మాత్రము), నహి కరోమి = అల్లలేను, యత్నాత్‌ = యత్నమువలన (యత్నించి), యది కరోమి= అల్లుదునేని, చారుతరం = సుందరతరముగనే, కరోమి = అల్లుదును, భూపాల మౌళి మణిరంజిత పాదపీఠ!= రాజుల కిరీటమణులచే అలంకరింపబడిన పాదపీఠముకల, హే సాహసాంక! = సాహసవిక్రమార్క బిరుదాంచితుడా?, కవయామి = కవనమల్లుదును, వయామి = వలువలు నేయుదును, (ఇక) యామి = (సెలవయినచో) పోవుదును.

పుట 42 'బుద్ధి'

హనుమాత్‌ స్మరణాత్‌ = ఆంజనేయుని ధ్యానించుటవలన బుద్ధి= బుద్ధియు, బలం =బలమును, యశః = కీర్తియు, ధైర్యం = ధీరతయు, నిర్భయత్వం = భయమన్నది లేక పోవుటయు, అరోగతా = రోగము లేకపోవుటయు, అజాడ్యం = జడత లేకపోవుటయు అనగా చురుకుతనమును, వాక్పటుత్వంచ = వాక్పాటవమును, భ##వేత్‌ = కలుగును.

పుట 43' యత్ర యత్ర'

యత్ర యత్ర = ఎచటనెచట, రఘునాథకీర్తనం రామ సంకర్తనము (జరగునో), తత్ర తత్ర - అచట నచట; కృత, మస్త కాంజలిం - చేయబడిన, తలమీదదోయిలి కల (అనగా తలమీదికి చేతులు పోనిచ్చి నమస్కరించు నట్టియు); బాష్పవారి పరిపూర్ణలోచనం = కన్నీటిచే నిండిన కనులు గలట్టియు, రాక్షసాంతకం రాకాసులకు యముడైన, మారుతిం = ఆంజనేయుని, నమత = నమస్కరింపుడు. (నమస్కరింతురు గాక!)

పుట 44 'వైదేహి'

సురద్రుమతలే = కల్పవృక్షము క్రింద, హైమే = బంగారుతో జేసిన, మహామంటపే= గొప్ప మంటపమునందు, మధ్యే పుష్పకం = పుష్పకము నడుమ, మణిమయే = మణివికారమైన, ఆసనే = పీఠముమీద, వీరాసనే సంస్థితం = వీరాసనము వేసికొని కూరుచున్నట్టియు, వైదేహీ సంహితం = సీతాసమేతు డయినట్టియు భరతాదిభిః = భరతలక్ష్మణ శత్రుఘ్నులతోడను నిత్య సూరులతోడను, పరివృతం = పరివేష్టింపబడినట్టియు, అగ్రే = ఎదుట, ప్రభంజనస్తుతే = హనుమ, (ఏతదేవ) పరంతత్త్వమ్‌ (ఇతి) వాచయతి = (సతి) ఇదియే పరతత్వము అని పలుకుచుండగా, భరతాదిభిః = (ఈపదమునకు ఆవృత్తి) భరతాదులచే, మునిభ్యః=మునుల కొరకు, (ఏతదేవ) పరంతత్త్వమ్‌ (ఇతి) = (ఈపదములకును ఆవృత్తి) ఇదియే పరతత్త్వము అని, వ్యాఖ్యాతం = వక్కాణింపబడినట్టియు, శ్యామలం = అగిసెపూ వన్నెకల, రామం = రాముని, భ##జే = కొలుతును,

కొందఱు- 'వ్యాఖ్యాంతం' అని పఠించి-ఎదుట హనుమంతుడు నామము పలుకుచుండగా, దక్షిణామూర్తి మునులకు జ్ఞానోపదేశము చేసినటులు ఆంజనేయుని చూచుచు మునులకు ఆత్మజ్ఞానమును భక్తి తత్త్వమును ఉపదేశించు రామమూర్తిని కొలుతును అని చెప్పుదురు, మరికొందరు-శేష (లక్ష్మణ) శంఖ (భరత) చక్ర (శత్రుఘ్న) ములతో శ్రీ మహాలక్ష్మి తోడను కూడిన రాముని ఇదే పరతత్త్వమని (వ్యాఖ్యాతం). భరతాదులను మహాలక్ష్మియు ఉన్న ఈ సన్నివేశముచే ఇదే పరతత్త్వమని చెప్పబడిన అనగా చెప్పక చెప్పబడిన రామునిభజింతును అని చెప్పుదురు. ఇంకొందరు వ్యాఖ్యాతప్రాయుని భజింతురు అనిచెప్పిరి.

ఇంకొందరు- 'వ్యాఖ్యాస్తం' అని పఠించి అగ్రే ప్రభంజనసుతే (తత్త్వప్రతిపాదికాంశ్రుతిం) వాచయతి సతి = ఎదుట హనుమంతుడు తత్త్వమును జెప్పు శ్రుతిని పలుకుచుండగా, మునులకు పరతత్త్వమును వివరించుచున్న రాముని కొలుతును అని చెప్పుచున్నారు.

మరికొందరు మరికొన్ని అర్థములు చెప్పుచున్నారు. వీనిలో కొన్ని అర్థములు వైష్ణవ సంప్రదాయములోనివి, కొన్ని ఏ సంప్రదాయమునకును విరుద్ధము కానివి.

పుట 48 'అయోధ్యా'

అయోధ్య, మధుర, మాయ, కాశి, కాంచి, అవంతి ద్వారవతి అను నీయేడు వీడులును మోక్షమొసగునవి.

పుట 48'గంగే చ'

ఓ గంగా ! ఓ యమునా ! ఓ గోదావరి ! ఓ సరస్వతీ! ఓ నర్మదా ! ఓ సింధూ ! ఓ కావేరీ ! ఈ నీటిలోనికి దయచేయుడు.

'' 'శ్వేతారణ్యం'

శ్వేతారణ్యము, పంచనదము, గౌరీమాయూరము, అర్జునము, ఛాయావనము, శ్రీ వాంచ్యము-ఇవి కాశీ సమానములు.

పుట 54 'లోకాః సమస్తాః'

సమస్తా= ఎల్ల, లోకాః = లోకములు-జీవులు, సుఖినః =సుఖముకలవారు, భవంతు=

అగుదురుగాక!

పుట 56 'కీటాః పతంగాః'

జలే = నీటగాని, స్థలే = నేలమీదగాని, యే = ఏ, కీటాః = కీటకములును, పతంగాః = రెక్కలపురుగులును, మశకాః = దోమలును, వృక్షాః=చెట్లు (మొదలగునవి కలవో), తే = ఆ, జీవాః = జీవములు, ప్రదీపం = కార్తికదీపమును, ప్రదృష్ట్వా = చూచి, నిత్యం = ఎపుడును, జన్మభాగినః చ = మరల జన్మమును తాల్పునవి, న = కావు, శ్వపచాః= శ్వపచులును, విప్రాః భవన్తిహి = విప్రులయిపోదురు.

పుట 58 'ఆపాతాళ'

ఆపాతాల-పాతాలము మొదలుకొని, సభస్ధలాంత = ఆకాశతలము తుదగానున్న, భువన = భువనములతో గూడిన, బ్రహ్మాండం = బ్రహ్మాండరూపముగా ఆవిః స్ఫురత్‌ = ఆవిర్భవించు (ఆ విస్ఫురత్‌ అను పాఠమున ప్రకాశించు అని అర్థము), జ్యోతిః స్ఫాటికలింగ = జ్యోతిర్మయమగు స్ఫటికలింగము యొక్క, మౌళి = తలపై, విలసత్‌ = వెలుగు, పూర్ణేందు = నిండు చంద్రుని నుండి, వాంత = (టు వమ ఉద్గిరణ) కురియు, అమృతైః- అమృతములచే, అస్తోకాప్లుతం = దట్టముగా ముంపబడి నట్టియు, ఏకం = కేవలుడగు, ఈశం = ఈశ్వరుని, ఈపి=తసిద్ధయే = కోరిక నెరవేరుటకు, అనిశం = ఎల్లపుడును, రుద్రానువాకాన్‌ = రుద్రానువాకములను, జపన్‌ = జపించుచు, థ్యాయేత్‌ = థ్యానించునది, ధ్రువపదం = మూడుకాలములందును చెడని, శివం = శివుని, విప్రః = విప్రుడు, అభిషించేత్‌ = అభిషేకించునది.

మొదట పరమేశ్వరుడు జ్యోతిర్లింగముగ నావిర్భవించెననియు పిదప బ్రహ్మాండము భువనము మొదలుగా నెల్లయు దాన ప్రతిబింబించెననియు తాత్పర్యము- జ్యోతిర్లింగముగ ఆవిర్భవించెనని అనుటకు స్కాందము కాళికాపురాణాదులు ప్రమాణము.

కొందరు- 'ఆపాతాల.....బ్రహ్మాండమ్‌' అనుసమస్త పదము క్రియావిశేషణముగా చేసి పాతాలముమొదలు ఆకాశము వరకు బ్రహ్మాండముగా అగుచు-ప్రతిబింబించుచు - రజ్జుసర్పముగా కానిపించుచు - రూపొందు స్ఫటికలింగము అని అర్థము చెప్పుదురు. మరికొందరు- వివర్తరూపముతో ఆపాతాల.....బ్రహ్మాండమేయగు స్ఫటికలింగము అని చెప్పి ఆవిర్భవజ్జ్యోతిః అను పదమును 'ఈశమ్‌' అను కర్మకు విశేషింతురు. వీరు అస్తోకాప్లుతలోకమ్‌ అనియు పఠించి దానిని ఈశ పదమునకు విశేషణముగా చెప్పుదురు, ఇంకొందఱు- 'బ్రహ్మాండ మభితః అభితః అని అథ్యాహరించి ద్వితీయావిభక్తి యనియు, బ్రహ్మాండ మంతటను ఆవిఃస్ఫురజ్జ్యోతి-శివస్వరూపమని చెప్పుదురు ఇందలిపదములు ఈఅర్ధము అన్వయక్లేశము లేనిదే యని సాక్ష్యము చెప్పుటకు జంకును అర్థమునం దీష ద్భేదమున్నను తాత్పర్యమొకటియే. బ్రహ్మమగుశివుడు వ్యోమకేశుడు, చంద్రమౌళి, శివలింగము శివచిహ్నము. బ్రహ్మాండము ఇంచుమించు గుండ్రము. లింగము గుండ్రము. ఈ దెస నిర్గుణము సగుణమాయెను, ఈరెంటికిని వాచకము ఓంకారము. బ్రహ్మమునకు నాలుగుపాదములు, ఓంకారమునకును నాలుగు మాత్రలు.

కవుల భావనయు, ఉపాసకులయు, థ్యాతలయు, మంత్రయోగులయు ప్రతీకాదులు ఇంచుమించుగా కలియుచుండును.

కొందరు ఈ పయివిషయములన్నియు పరశీలించి ఈశ్లోకమునందలి బ్రహ్మాండమును లింగమును ఈశుని విరాడ్ఢిరణ్యగర్భేశ్వరులుగను, జాగ్రదాదులను ఆంతర పూజా ధ్యానములలో చంద్ర మండలమును శివపురాదులను గురుతింతురు.

ఈ శ్లోకమున ''అస్తోకాప్లుత మేకమ్‌'' కు బదులు 'అస్తోకాప్లుత లోకమ్‌' అనియు ''ధ్రువపదమ్‌'' కు బదులు ''అద్రుతపదమ్‌'' అనియు మేలు పాఠములు.

పుట 60 ''సర్వేవేదాః' (కఠ-2-వల్లి.15)

సర్వే- అన్ని, వేదాః - వేదములు, యత్‌ - దేనిని, పదం - పొందగిన దానినిగా (పద్ఞ గతౌ పదనీయం- గమనీయం), ఆమనంతి - చెప్పునో ( వేదము లన్నియు చెప్పుచున్నవి అనగా ఒక వేదము చెప్పుటయు మరి యొక వేదము చెప్పకపోవుటయును లేదనియును, ఇటులు చెప్పుటలో ఒక శ్రుతికిని. మరియొక శ్రుతికిని విరోధము లేదనియును తాత్పర్యము.), సర్వాణి-ఎల్ల, తపాంసి - తపసు=లును, యత్‌ - దేనిని, వదన్తి - చెప్పునో (దేనిని పొందుటకు పలు తెగలగు తపసు=లు చేయుదురో అని తాత్పర్యము.)

''కోహం ముక్తిః కధం కేవ సంసారః ప్రతిపన్నవాన్‌

ఇత్యాలోచనమర్థజ్ఞాస్తవః కేనన్తి పండితాః||'

'నే నెవడను? ముక్తి ఏది? సంసారములో ఏల పడితిని?' అని విచారించుటయే తపసు= అని సూతసంహిత.

మనసు= యొక్కయు, యింద్రియములయొక్కయు ఏకాగ్రత తపస=ని భారతము. (మోక్ష ధర్మ. 250-4.)

ఇదియును అన్వయవ్యతిరేకములచే 'అహంబ్రహ్మ' అను వాక్యార్థమును విచారించుటయును తపసు= అని తైత్తిరీయ భాష్య వార్తికము. (భృగు. (1-18-19)

యత్‌ = దేనిని, ఇచ్ఛన్తః = కోరుచున్నవారై, బ్రహ్మచర్యం చరన్తి = గురుకులవాస లక్షణమయిన బ్రహ్మ చర్యమునుగాని బ్రహ్మప్రాప్తికి మరియొక రీతి ఆచరణ మునుగాని చేయుదురో, తత్‌ = దానిని, తే=నీకొఱకు, సంగ్రహేణ బ్రవీమి=క్లుప్తముగా చెప్పుదును- ఓమ్‌ ఇత్యేతత్‌ = అది ఓమ్‌. (ఓమ్‌ అను) శబ్దమునకు అర్థమైనదది అనిగాని ఓం శబ్దప్రతీక మని గాని తాత్పర్యము.)

పుట 60 'సర్వం హి'

సర్వం హి ఏతద్బ్రహ్మే=ఎల్లయు బ్రహ్మమే, అయం ఆత్మా బ్రహ్మ = ఈ (జీవ) ఆత్మయు బ్రహ్మమే, సః అయమ్‌ ఆత్మా చతుష్పాత్‌ = ఆ యీ ఆత్మ నాల్గు పాదములు కలది.

పూర్వమంత్రమున ఇదియెల్ల ఓంకారమే. దానికి వ్యాఖ్యానము చెప్పుచున్నాము అని ఉన్నది. ఆ యెల్లయు బ్రహ్మమేయనియు ఈజీవాత్మయుబ్రహ్మమే యనియు చెప్పబడినది. కా-గా పూర్వము చెప్పబడిన ఓంకారము సర్వశబ్దముతో బ్రహ్మమునకు బ్రహ్మాత్మలకును అభేదము చెప్పి నాలుగు పాదములుకల ఆత్మను చొప్పరచెను. అది జాగ్రత్‌స్వప్న సుషుప్తి తురీయములుగా బోధించి ఓంకారముతో ఐక్యపరచి సాధకుల మననమునకు సమపరచెను.

పుల 61 ' ఏక మేవ'

బ్రహ్మ= బ్రహ్మము, ఏక మేవ = కేవలమే, ఒక్కటనిన ఒక్కటియే; అద్వితీయమ్‌ = రెండవది మరిలేదు.

'' 'న చోదర్ధ్వమ్‌'

ఊర్ధ్వం చ న = 'మీద' అనునదియులేదు, అధఃచ న= 'క్రింద' అనునదియు లేదు. అంతః చ న = 'లోపల' అనునదియు లేదు. బాహ్యంత న = 'వెలుపల' అనునదియు లేదు. మధ్యం న= 'నడుమ' అనునదియు లేదు. తిర్యక్‌ న= 'అడ్డముగా' అనునదియులేదు. పరాదిక్‌ న = పడమటిదిక్కు అనునదియులేదు. (నాయం దివి ఏవియు లేదు). వియద్వ్యాపకత్వాత్‌ = ఆకాశమువలె ఎల్లెడల నిండియుంటిని కావున, అఖండైకరూపః = అఖండరూపుడను, మరి ఏకరూపుడను, తదేకఃఅవశిష్టః శివః కేవలః అహం = వీనికి మిగిలిన రెండవ అనునది లేని ఒకే ఒకడను, శివుడను, నేను.

62 'న జాగ్రత్‌'

మే=నాకు, జాగ్రత్‌ న = జాగ్రదవస్థ లేదు, స్వప్నకో వా న = కలయేని లేదు, సుషుప్తి ర్వా న = నిదుర యేని లేదు; (అహం= నేను) విశ్వః న = విశ్వుడను కాను (జాగ్రదవస్థ ననుభవించువాడువిశ్వుడు), నవా తైజః = తైజసుడనుగూడ (కలలు కనువాడు తైజసుడు) కాను, ప్రాజ్ఞకో వా న = ప్రాజ్ఞడ నేనియు (నిదురగూరువాడు) కాను (ఏలయనిన ఈయవస్థలును వీని ననుభవించువాడును అగు). త్రయాణాం= మూగురును (మూడవస్థలును), అవిద్యాత్మకత్వాత్‌ = వీని స్వభావము అవిద్య. (కావున నేను) తురీయః = నాల్గవ వాడను, తదేకోవశిష్టః శివః కేవలః అహం పరిశిష్టుడను, శివస్వరూపుడను, అద్వితీయుడను, కేవలుడను.

పుట 63 ' మూర్థని హిమకర చిహ్నం'

మూర్థని = తలమీద, హిమకర చిహ్నం = చంద్రుని గురుతును, నిటలే = నుదుట, నయనాంకం = కంటిగుర్తును, అంసయోః = మూపులపై-శూలపుగుర్తును, వపుషి = శరీరమున, స్పటిక సవర్ణం =స్ఫటికముతో సరియగు వర్ణమును గల, తం = (శిశువుగానున్ను) ఆశంకరుని, ప్రాజ్ఞాః = ఎరుకగలవారు, శంభుం = శివునిగా, మేనిరే = తలచిరి.

'' 'అజ్ఞాన'

అజ్ఞానాంతర్గహన పతితాన్‌ = అజ్ఞానము అను అడవి నడుమ పడినట్టియు, భవదన శిఖా తాపపాపచ్యమా నాన్‌ = సంసారము అను కార్చిచ్చు సెగల మంటలచే ఉడికి యుడికి పోవుచున్న, లోకాన్‌ = మానవులను, ఆత్మ విద్యోప దేశైః = బ్రహ్మవిద్యోప దేశములచే, త్రాతుం = కాపాడుటకు, మౌనం = మౌనమును, ముక్త్వా = వీడి, వటవిటపినః = మఱ్ఱిచెట్టు యొక్క మూలతః = మొదటినుండి, నిష్పతన్తీ = బయలుదేరి వచ్చుచున్న, శంకరాచార్యరూపా = శంకరాచార్యుల వారి రూపుతాల్చిన, శంభోః = శివుని, మూర్తిః = మూర్తి, భువనే = ప్రపంచమున, చరతి = తిరుగుచున్నది.

పుట 63 'సంభావయతి'

సంభావయతి ఉత్పాదయతి-సృజించువాడు శంభువు, శం = సుఖమును, మంగళమును; కరోతి = చేయువాడు, శంకరుడు.

పుట 64 'లోకాం'

లోకాన్‌ = లోకములను, త్రాతుం = కాపాడుటకు, చరతి = తిరుగుచున్నది. (63 పుట చూ.)

పుట 65 'యద్వై శివం'

యద్వై శివం తన్వయః = ఏది శివమో అది మయము, శివమయ పదములు పర్యాయములు.

'' 'శాంతం'

శాంతం = శాంతమైనది, శివమ్‌ = సుఖమైనది.

పుట 67 'త మేవం విద్వాన్‌'

తం = ఆ యాత్మను, ఏవం = ఇటులు, విద్వాన్‌ = తెలిసి కొనినవాడు, ఇహ = ఇచటనే, ఈ జీవితమునందే; అమృతః = ముక్తుడు, భవతి = అగుచున్నాడు.

పుట 68 'శక్నోతీ'

యః = ఎవడు, కామక్రోధోద్భవం = కోరికలవలనను క్రోధమువలనను కలుగు, వేగం= వడిని, శరీరవిమోక్షణాత్‌ ప్రాక్‌ = శరీరమును విడుచుముందే, సోఢుమ్‌ = ఓర్చికొనుటకు, ఇహైవ = ఈ లోకమునందే (బ్రతికి యుండగనే), శక్నోతి = సమర్థుడో, సః నరః= అల్లతడు, యుక్తః = యోగి, సుఖి =సుఖి.

పుట 71 'చతుర్విధాం'

అర్జునా= అర్జునుడా!, భరతరభ = భరతశ్రేష్ఠుడా! ఆర్తః = ఆర్తి పొందినవాడును, జిజ్ఞాసుః = (ఆత్మను) తెలిసికొనగోరువాడును, అర్థార్థీ = అర్థముకోరువాడును, జ్ఞానీ చ = పరమేశ్వరు నెరిగినవాడును (అను) చతుర్విథాః = నలుదెరగులగు, సుకృతినః = సుకృతముకల, జనాః = జనులు, మాం = నన్ను, భజంతే = భజించు చున్నారు. 'ఆర్తి అనగా బాధ' బాధ రోగములవలన గాని శత్రువులవలనగాని యింకను అనేక విధములుగా కలుగును. అట్టి బాధలు పొందువారు ఆర్తులు. ఆ బాధలు పోగొట్టుకొనదలచువారు భగవంతుని భజింతురు, ఇంద్రయజ్ఞము చేయవలదని కృష్ణుడు చెప్పగా గొల్లవారు మానిరి. దానికి కోపించి ఇంద్రుడు రాల వాన కురియించెను. అపుడు గోపికలు గోవులు ఆవులు మొదలగునవెల్ల ఆర్తిబొందెను. ఇటులే జరాసంధుడు చెఱపట్టిన రాణులును, రాజులును ఆర్తులు. మొసలి పట్టిన గజేంద్రు డార్తుడు. ఇట్టి ఆర్తులు భగవంతుని భజింతురు. ముచికుందుడు, జనకుడు, శ్రుతదేవుడు, ఉద్ధవుడు ఇట్టి వారు జిజ్ఞాసువులు. అర్థము ఇహమునగాని పరమునగాని పొందదలచిన ఏదేనివస్తువు, అది భోగోప కరణము. దానిని పొందగోరువాడు అర్థార్థి. సుగ్రీవుడు విభీషణుడు, ఉపమన్యువు ఇట్టివారు ఇహభోగమును కోరినవారు. ధ్రువుడు పరమున భోగమును కోరినవాడు, వీరు భగవంతుని సేవించి మాయను దాటిరి. ఈ మూగురిలోను జిజ్ఞాసువు జ్ఞానముచే సాక్షాత్తుగా మాయను దాటును. ఆర్తుడును అర్ధియును జిజ్ఞాసువులై జ్ఞానోత్పత్తిచే మాయను దాటగలరు. ఇది ఈ మూగురిలో భేదము. జిజ్ఞాసువునకు ఆర్తత్వము సంభవించును. జ్ఞానమునకు ఉపకరణముగా అర్థార్థిత్వమును సంభవించును. కాన జిజ్ఞాస ఆర్తికంటెను ఆర్థిత్వము కంటెను దొడ్డది. ఈమూగురుకును ఏదో ఒకకామము కలదు, ఇక జ్ఞానియో నిష్కాముడు. జ్ఞానమనగా భగవత్తత్త్వము నెరుగుట. అట్టి యెరుకచే నిత్యముక్తు డైనవాడుజ్ఞాని. నిష్కామప్రేమకలవారు గూడజ్ఞానులే. ఈయర్థము నుద్దేశించియే 'జ్ఞానీ చ' అని చెప్పబడెను. (నిష్కామభక్తులును జ్ఞానికోటిలోని వారేయని చెప్పుటకు 'జ్ఞానియును' అనుసముచ్చయము). సనకాదులు నారదుడు, ప్రహ్లాదుడు, పృథుచక్రవర్తి, శుకుడు ఈ మొదలగువారు నిష్కామ భక్తులు. గోపికాదులు అక్రూరుడు, యుధిష్టిరుడు ఈ మొదలగువారు గూడ నిష్కామభక్తులే. వీరు శుద్ధప్రేమ కలవారే. కంసాదులు ద్వేషమువలన భక్తులు కారు. భక్తి స్వరూపాదులకు 'భక్తిరసాయనము' చూచునది అని మధుసూదన సరస్వతి.

పుట 72 'వాసుదేవ'

వాసుదేవః సర్వమ్‌ ఇతి - ఎల్లయు వాసుదేవుడే అనగా భగవంతుడే, బ్రహ్మమే,

పుట 73 'అవినయం-'

విష్ణో = ఓ పరమేశ్వరా!, అవినయం నా అవినయమును (దీనికి వివరణము 74, 75 పుటలలో చూచునది) అపనయ = పోజేయుమా! మనః దమయ = దమింపజేయుమా! విషయ మృగతృష్ణాం = విషయులు అను ఎండ మావులు, శమయ = ఇంకింపుమా (శమదమములను కలుగజేయుమా), భూతదయాం = భూతములయెడ దయను, విస్తారయ = పెంపొందింపుమా! సంసార సాగరతః = భవసాగరమునుండి, తారయ= ఉద్ధరింపుమా!

పుట 79 'దివ్యధునీ'

దివ్య ధునీ మకరందే = గంగ అను తేనె కలదియు, పరిమళ పరిభోగ సచ్చిదానందే = సచ్చిదానందములు అను నెత్తాని పెల్లు కలదియు, శ్రీమతి పదారవిందే = విష్ణు పదారవిందము, (ల) ముందు భవ భయ భేదచ్ఛిదే సంసార = భయచ్ఛేదము కొరకు, వందే = నమస్కరించుచున్నాను.

పుట 73 'సత్యపి'

నాథ = పరమేశా!, భేదాపగమే సత్యపి = భేదములేక యున్నను, అహం = నేను, తవ= నీవాడను (కాని), త్వం = నీవు, న మామకీనః = నావాడవుకావు, హి = ఏలన, తరంగః= అల, సాముద్రః = సముద్రముది, (కాని), సముద్రః = సముద్రము, క్వచన= ఎచటనేనేనియును, న తారంగః = అలదికాదు. అల సముద్రమున పొడమునుగాని అలలో సముద్రము పొడమదు. అటులే నేను నీ అంశమను కాని, నీవు నీయంశమవు కావు.

పుట 74 'ఉద్ధృత నగ'

ఉద్‌ధృత నగ = కొండను ఎత్తినవాడా!, నగభి దనుజ = ఇంద్రునికి తమ్ముడా!, దనుజ కులామిత్ర = రాక్షస కులవైరీ, మిత్ర శశి దృష్టే = సూర్యచంద్రుల కనుల వాడా!, భవతి= నీవు, ధృష్టే సతి = చూడబడగా, ప్రభవతి = సర్వసమర్థుడు అగును, భవ తిరస్కారః= సంసారము అడగుట, న భవతి కిమ్‌ = కాదా?.

'' 'మత్‌స్యాదిభిః'

మత్‌స్యాదిభిః = చేప తాబేలు మొదలగు అవతారైః = రూపములతో, అవతారవతా= అవతరించినట్టియు, సదా = ఎపుడును, వసుథాం = పుడమిని, అవతా = వీలునట్టియు, భవతా = నీచే, భవతాప భీతః = భవతాపముచే భయపడిన, అహం = నేను, పరమేశ్వర!- ఓ పరమేశ్వరా!, పరిపాల్యః = రక్షింపదగువాడను.

పుట 74 'దామోదర'

దామోదర = దామోదరా!, గుణమందిర = గుణములకు ఇల్లు అనగా ప్రాపైనవాడా!, సుందరవదనారవింద = అందమగు మోముదమ్మి కల, గోవింద = గోవిందా!, భవజలధి మథన మందర = సంసారము అను సముద్రమును త్రచ్చు కవ్వపు గొండవంటివాడా!, త్వ = నీవు, మే = నాయొక్క, పరమం = పెద్ద, దరం = (సంసార) భయమును, అపనయ = ఎడబాపుమా!

'' 'నారాయణ'

కరుణామయ = కరుణామయుడవయిన, నారాయణ = ఓ నారాయణుడా!, తానకౌ చరణౌ శరణం కరవాణి = నీ యడుగులకు శరణు, ఇతి షట్పదీ = ఆరుకాళ్ళ తుమ్మెద (ఆరు పద్యములు ఈ స్తోత్రమున నున్నవి. ఒకొక పద్యము ఒకొక పదము. తుమ్మెదకును ఆరు పదములు కాన ఈషట్పదీస్తోత్రమే ఒక తుమ్ముద.) మదీయే వదన సరోజే = (ఇది) నామోముదమ్మిలో, సదా ఎల్లప్పుడును, వసతు = నివసించుగాక! (ఇందలి చమత్కారమును 78వ పుటలో చూచునది.)

పుట 75 'విద్యా'

విద్యా వినయ సంపన్నే = విద్యతోడను వినయము తోడను కూడుకొనిన (బ్రహ్మణుని యెడలను).

'' 'ప్రజానాం'

ప్రజానాం = ప్రజలకు, వినయాధానాత్‌, వినయ = వినయమును, ఆధానాత్‌= నేర్పుటవలనను; రక్షణాత్‌ = ప్రజలను రక్షించుటవలనను, భరణాత్‌ = యోగక్షేమము లొనర్చి భరణము చేయుటవలనను....

పుట 77 'భిద్యతే'

తస్మిన్‌ = ఆ, పరావరే = కారణ కార్యరూపమగు బ్రహ్మము (పరమనగా అన్నిటికంటె పెద్దది - 'మహతో మహీయాన్‌' - అవరమనగా అన్నిటికంటెను చిన్నది- 'అణోరణీయాన్‌'), దృష్టే (సతి) = చూడబడుచు, హృదయగ్రంధిః = ఎద కణితి (ఎదలో నాటుకొనిన కామాదులు సంస్కారములు దృఢమైపోవును. అవియే కణితిగా చెప్పబడెను), భిద్యతే = పగులును, సర్వ సంశయాః = సంశయములెల్ల, ఛిద్యంతే= తెగిపోవును, అస్య = ఇతని, కర్మాణిచ = కర్మలును, క్షియంతే - తగ్గిపోవును. (బ్రహ్మము నెరిగినవాడు సర్వజ్ఞుడుగాన సంశయములు నశించును. నాశ మనగా ఫలమును మొలకలెత్తించు శక్తిని పోగొట్టుట. మరియుప్రారబ్ధము కంటె వేరయిన కర్మలన్నియు నశించును.)

పుట 81 'స్వదేశో'

స్వదేశో భువనత్రయమ్‌ = ముల్లోకములును స్వదేశ##మే.

పుట 86 'స్థితః స్థితాం'

స్థితాం (సతీం) = (నందిని అను ఆవు) నిలువుగా, స్థితః (సన్‌) = నిలిచియుండి, ప్రయాతాం (సతీం) = నడవగా, ఉచ్చలితః = నడచిన, నిషేదుషీం (సతీం) = పడుకొనగా, ఆసనబంధధీరః = బాసీపట్టు వేసికొని ధైర్యముతో కూర్చుండి, జలం = నీటిని, ఆదదానాం (సతీం) = క్రోలగా. జలాభిలాషీ = నీరుకోరినవాడై, భూపతిః = రేడు (దిలీపుడు), ఛాయేవ = నీడవలె, తాం = ఆనందినిని, అన్వగచ్ఛత్‌ =వెన్నడించెను.

పుట 87 'తస్యాః'

అపాంసులానాం = కలంకము లేనివారిలో, ధురి = మొదట, కీర్తనీయా = కొనియాడదగిన, మనుష్యేశ్వర ధర్మపత్నీ = సుదక్షిణ, తస్యాః = నందినియొక్క, ఖురన్యాసపవిత్ర పాంసుం = గిట్టలనుంచుటచే పవిత్రమయిన పరాగముకల, మార్గం = దారిని, శ్రుతేః = శ్రుతియొక్క, అర్థం= అర్థములు, స్మృతిరివ = స్మృతివలె, అన్వగచ్ఛత్‌ = అనుగమించెను.

పుట 89 'అనంశయం'

యత్‌ = దేనివలన, ఆర్యం = పొరపాటుపడని, మే = (జితేంద్రియమగు) నాయొక్క మనః= మనసు, అస్యాం = ఈమెయెడ, అభిలాషి -లగ్నమాయెనో (తత్‌ దానివలన, ఈమె) క్షత్త్ర పరిగ్రహక్షమా = క్షత్త్రియుడు పెండ్లి చేసుకొనదగినది (అగుటలో), అసంశయం = సందియములేదు. హి = ఏలనగా, సతాం = యోగ్యులకు, సందేహపదేషు= చేయవచ్చునా చేయరాదా యనిసందియములయెడల, అంతఃకరణ ప్రవృత్త యః = మానసికములగు ప్రవర్తనములు, ప్రమాణం =ప్రమాణము.

పుట 90 'బాణోచ్ఛిష్టం'

సర్వం =ఎల్ల, జగత్‌ =కవితాప్రపంచము, బాణోచ్ఛిష్టం =బాణుని ఎంగిలి, బాణుడు చెప్పినదానినే కవులెల్లరు అనువదించిరి. బాణుని భావనాప్రపంచము అంత దొడ్డదని తాత్పర్యము.

'' 'ఉపమా'

కాళిదాసస్య = కాళిదాసునకు, ఉపమా = ఉపమ, భారవేః = భారవికి, అర్థగౌరవం= అర్థగురుత్వము, దండినః = దండికి, పదలాలిత్యం =పదముల మెత్తదనము, మాఘే = మాఘునియందు, త్రయోః గుణాః, = ఈ మూడును గలవు.

పుట 91 'పురా'

పురా = వెనుక నొకానొకపుడు; కవీనాం = కవులయొక్క, గణనా ప్రసంగే = ఎక్కువవారెవరు అని లెక్కించవలసి వచ్చినపుడు, కనిష్ఠికా = చిటికెనవ్రేలు, అధిష్ఠిత కాళిదాసా = కాళిదాసుచే అధిష్టింపబడెను ('మొదటివాడు' అని లెక్క పెట్టునపుడు చిటికెనవ్రేలిని చాపుదుము) అద్యాపి = నేటికిని, తత్తుల్యకవేః = అతనితోతులతూగెడు, కవేః అభావాత్‌ = కవి లేకపోవుటవలన, అనామికా = చిటికెన వ్రేలి వెనుకవ్రేలు సార్థ వతీ = అన్వర్థమయినిది. అనగా నామము లేనిది- పేరులేనిది (అ=నామికా), బభూవ = ఆయెను. రెండవకవి లేకపోవుటచే వేలు తెరచుటకుగాని మడచుటకుగాని పని లేకపోయెనని తాత్పర్యము.

పుట 91 'రజోజుషే'

ప్రజానాంజన్మని = స్భషియెడ, రజోజుషే = రజోగుణము పొందునట్టియూ, స్థితౌ = స్థితి కాలమున. సత్త్వవృత్త యే = సత్త్వముతో గూడునట్టియు, ప్రలయే = ప్రలయ కాలమున, తమఃస్పృశే = తమోగుణమునుతాకునట్టియు, అజాయ = పుటనివాడును, సర్గస్థితినాశ##హేతవే = సృష్టి స్థితిప్రలయములకు కారణమును, త్రయీమయాయ = వేదమయుడును, త్రిగుణాత్మనే = త్రిగుణ స్వరూపుడు నగువానికి, నమః = వందనము.

పుట 92 'ఏకైవ'

ఏకైవ = ఒకటియేయగు, సా= ఆ, మూర్తిః = వస్తువు, త్రిధా = ముత్తెరగులుగా, బిభిదే = వేరాయెను. కదాచిత్‌ = ఒకానొకపుడు (ఆ మూగురలో), విష్ణోః = విష్ణువునకు, హరః = శివుడును, కదాచిత్‌ = ఒకానొకపుడు, తస్య- శివునకు, హరి రపి = విష్ణుమూర్తియు, కదాచిత్‌ = ఒకపుడు, తయోః-ఆ హరిహరులకు, వేధాః =బ్రహ్మయు, కదాచిత్‌ = ఒకానొకపుడు, ధాతుః = బ్రహ్మకు, ఆద్యావపి = హరిహరులును, ఏవం = ఇటులు, ప్రథమాపరత్వం = (ఒకరికి) పరత్వము (ఇంకొకరికి) అపరత్వము, సామాన్యం = సమానము. (ఒకపుడు హరిపరుడగుచో హరు డపరుడు, ఇటులే ఈ మూగురలోను ఎక్కువ తక్కువలను మాటలేదు.)

పుట 94 'క్రోధమ్‌'

తీవ్రం = ఉగ్రమగు, క్రోధం = కినుకను, ఆహారయత్‌ = తెచ్చికొనెను. (రాముడు కర్త)

పుట 96 'అహింసా'

అహింసా = మనో వాక్కాయములచే హింస చేయకుండుట పరమః ధర్మః = దొడ్డ ధర్మము.

పుట 101 'అనంతా'

వేదాః = వేదములు, అనంతాఃవై అంతములేనివే.

04 ' దేవాన్‌ భావయుత'

అనేన = ఈ యజ్ఞముచే, దేవాన్‌ = ఇంద్రాదులను, భావయత = వృద్ధిపొందినపుడు, తే= ఆ, దేవాః = దేవతలు, వః = మిమ్ము, భావయంతు = తృప్తిపరతురుగాక!, పరస్పరం = మీరు ఒకరినొకరు, భావయంతః = భావించుకొనుచు, పరం= మేలైన, శ్రేయః = శ్రేయమును, అవాప=్యథ = పొందుదురుగాక, శ్రౌతకర్మలను స్మార్త కర్మలను చేసి మీరింద్రాదులకు సంతోషము కలిగించినచో వారును మీయిష్టమును సమకూర్తురు. మీకు దేవతా ప్రతిబంధకము పోయి చిత్తశుద్ధియు దానజ్ఞానమును కలుగును. ''ఈ పరమశ్రేయః ప్రాప్తివిధి దేవతలకు సంబంధపడదు. ఇది ప్రజకే ఏలయనిన ఈధర్మోపదేశము దేవతలకు గాదు'' అని శంకరానందీయము.

పుట 107 'భిక్షాప్రదా జనన్యః'

విరక్తస్య = వైరాగ్యము కలవానికి, భిక్షాప్రదాః = బిచ్చము పెట్టువారే, జనన్యః = తల్లులు, గురవః = గురువులే. పితరః =తండ్రులు, శిష్యాః = శిష్యులే, కుమారకాః= కొడుకులు, ఏకాంతరమణ హేతుః = ఏకాంతమునందు ఆనందము కలిగించుటకు కారణమయిన, శాంతిః = శాంతియే, వనితా = ఇల్లాలు.

పుట 108 'న మే పార్థ'

పార్థ = అర్జునా!, మే నాకు, త్రిషులోకేషు = ముల్లోకములందును, కర్తవ్యం కించన న = చేయదగినదని యేదియు లేదు, అనవాప్తం = పొందబడనిది, అవాస్తవ్యం = పొందదగినదియు, న = లేదు, (అయినను) కర్మణి = కర్మయందు, వర్తేవ చ = వర్తించుచునే యున్నాను.- పని చేయుచునేయున్నాను. 'నాకు పొందదగిన ఫలముగాని పొందబడని ఫలముగాని లేదు. ఇటులయినను నేను పని చేయుచునే యుంటిని. కర్మచే సాధింపదగిన దేదియు లేదని తెలిసినవానికే కర్మాచరణము లేదే! అట్టివారెవరు కర్మ చేయుదురు? అని అనునెడల దానికి నేనే ఉదాహరణము. ఎందులకు అనినయెడల లోకసంగ్రహమునకు ఆ లోకులందును మొదటివాడవైన నీకే తెలుపుటకును' అని మథుసూదన సరస్వతి.

పుట 108 'యది హి'

అహం = నేను, జాతు = ఒకానొకపుడేని, కర్మణి = కర్మము నందు, అతంద్రితః = సోమరితనము లేనివాడనై, న వర్తేయం యది = ఉండనియెడల, మమవర్త్మ = నా మార్గమును, పార్థ = అర్జునా, మనుష్యాః = మనుజులు, సర్వశః = ఎల్ల తీరులను, అనువర్తం తే =అనుసరింతురు.

'' 'గోవిందం'

పరమానందం = బ్రహ్మానందముకల, మద్గురుం = మత్‌ = నాకు, గురుం = ఒజ్జయగు; గోవింద = గోవిందుని అహం = నేను, ప్రణతః = నమస్కరించినవాడను, అస్మి = అగుచున్నాను.

పుట 111 దంతిని 'దారువికారే'

దారు వికారే = చెక్కతో చేసిన, దంతిని = ఏనుగు (బొమ్మ) నందు, దారు = చెక్క, తిరోభవతి = కనిపింపదు, చెక్కతో చేసిన ఏనుగు బొమ్మను మనము చూచినపుడు ఏనుగే తోచునుగాని చెక్కకనిపింపదు. సో7పి=ఆ యేనుగుకూడ, తత్రైవ= ఆ చెక్కయందే, తిరోభవతి = (తిరోథానము చెందును) కనిపించదు (ఇది చెక్కతో చేసినదని చెక్కయే కనిపించును, తథా = అటులే, జగతి = జగతిలో, పరమాత్మా అపి = పరమాత్మయు, పరమాత్మని = పరమాత్మయందు, జగదపి = జగతియును, తిరోధత్తే = కనిపింపదు. పరమాత్ముని చూచునపుడు జగత్తు కనిపింపదు. జగత్తునుచూచునపుడు పరమాత్మయు కనిపింపడు.

పుట 112 'యత్‌సౌఖ్యాంబుధి'

ఇమే = ఈ, శక్రాదయః = ఇద్రాదులు, యత్‌ - లేకతః = యత్‌ = లేని, సౌఖ్య = ఆనందము అను, అంబుద సముద్రముయొక్క, లేశ = లవముయొక్క, లేశతః = లవముచే నిర్వృతాః = ఆనందితురో (బ్రహ్మానందములో ఒకానొక చిన్న చిదుర ఇంద్రాదుల ఆనందము. తైత్తిరీయమునందలి ఆనందవల్లి చూ.). నితరాం = మిగుల, ప్రశాంత = శమించిన, కలనే = వృత్తులుకల, చిత్తే =చిత్తమునందు, యత్‌ =దేనిని, లబ్థ్వా = పొంది, మునిః = ముని (జాత్యేకవచవము, మౌనము కలవాడు అని అన్వర్థము, నిర్వృతః = ఆనందితుడో ('శోత్రియస్య చాకామహతస్య' అను ఆనందవల్లి చూ.). నిత్యసుఖాంబుధౌ = ఎపుడేనియు పోని ఆనందమునకు సముద్రమయిన, యస్మిన్‌ = దేనియందు, గలితధీః = కరగిపోయిన చిత్తము కలవాడు, బ్రహ్మనిత్‌ న = బ్రహ్మవేత్తకాక మరి, బ్రహ్మైవ = బ్రహ్మమే యగునో (ఇట్టివాడు), యఃకశ్చిత్‌ = ఎవడేని (అగుగాక), సః = అతడు, సురేంద్ర నందితపదః = ఇంద్రునిచే వందనము చేయబడిన పదములు కలవాడని, మమ మనీషా = నాతలవు.

పుట 116 'అవేద్యతాం'

అవిదితం=నీచే తెలియబడనిది, కిమావేద్యతామ్‌ = తెలియజేయబడునా? (నేను తెలియజెప్పుటకు నీకు తెలియనిదేమున్నది?) అథాపి = అయినను, వక్తవ్యం = చెప్పదగినది, అనుక్తంచేత్‌ = చెప్పబడనియెడలఆంతరయ = ఆంతర మనసులోనున్న, రుజా = రోగముయొక్క ఉపశమాయ = ఉపశమనము కొరకు, నాలం = చాలదు. తత్‌ = కిమపి = ఏదో ఆ నాగోడును, శ్రవణ నిథాతుం = చెవిలో వేసికొనుటకు. అర్థ్యసే = ప్రార్థింపబడుచున్నావు, మలయధ్వజ పాండ్యకన్యే = మలయథ్వజుడను పాండీని కుమారీ!, మాతః = అమ్మా!, ప్రసీద = అనుగ్రహింపుమా! (మలయధ్వజుడు అను పాండ్య మహారాజు మీనాక్షిని కుమారీ భావనచే కొలిచెను.)

పుట 117 'యస్య దేవే'

యస్య = ఎవనికి, దేవే = దైవమునందు, పరాభక్తిః = అనన్యభక్తి (కలదో), దేవే= దైవమునందు, యథా =ఎటులు అనన్యభక్తికలదో, గురౌ = గురువునందును, తథా = అటు లనన్యభక్తికలదో, తస్య = ఆ, మహాత్మనః = మహాత్మునకు, కథితాః = (శ్రుతిలో) చెప్పబడిన, అర్థా = అర్థములు, ప్రకాశంతే = ప్రకాశము పడయును.

పుట 118 'శివే రుష్టే'

శివే = శివుడు, రుష్టే (సతి) కోపించగా - కోపించుచో, గురుః = గురువు, త్రాతా= కాపాడువాడు (కాగలడు), గురౌ = గురువు, రుష్టే (సతి) = కోపగించునెడల, కశ్చనన = కాపాడువా డెవడును లేడు.

'' 'గురుర్‌ బ్రహ్మ'

గురుః = గురువే, బ్రహ్మ =బ్రహ్మ, గురుః = గురువే, విష్ణుః =విష్ణువు, గురుః = గురువే, మహేశ్వరః దేవః = శివదేవుడు (ఇంతియకాదు) గురుః = గురువు, సాక్షాత్‌ పరబ్రహ్మ= సాక్షాత్తు పరబ్రహ్మము, తసై#్మ = అట్టి. శ్రీగురవేనమః = శ్రీగురువునకు నమస్కారము.

పుట 119 'భవాని!త్వం దాసే'

హే భవాని! = ఓ భవానీ! భవపత్నీ!, దాసే = బంటు అయిన, మయి = నాయెడల, సకరుణాం = కరుణతో గూడిన, దృష్టిం = చూపును, వితర! = దానముచేయుమా! (నన్ను దయజూడుమా), ఇతి = ఇటులు, స్తోతుం = స్తుతించుటకు, వాంఛన్‌ = కోరుచు, యః = ఎవడు, 'భవానిత్వమ్‌' భవానిత్వమ్‌ అని, కథయతి = పలుకుచున్నాడో, తదైవ = అప్పటికపుడే, త్వం = నీవు తసై#్మ = అతని కొఱకు (అతనికి), ముకుంద..... ....... తదాం=విష్ణు బ్రహ్మేంద్రుల చక్కని కిరీటములచే ఆరతి యెత్తిన పాదములు కల (కిరీటములు పాదములమీద మ్రొగ్గినపుడు వానిలోగల రత్నముల కాంతులు ఆరతి యిచ్చినటులున్నవని తాత్పర్యము), నిజసాయుజ్య పదవీం = నీ సాయుజ్యమును, దిశసి = ఇచ్చుచున్నావు. 'భవాని' అను పదమునకు (లోడంత భూధాతువునకు ఉత్తమ పురుషైక వచనము) ''అగుదునుగాక'' అనియు అర్థము ''త్వ భవాని'' =నేను నీవగుదునుగాక అని అన్నంతనే అన్న భక్తున కీ యర్థ ముద్దిష్టము కాకున్నను ఈ యర్థమును చలామణిచేసి సాయుజ్యమిచ్చు చున్నానని చమత్కారము. నీ అనుగ్రహము అంత దొడ్డదని తాత్పర్యము.

పుట 119 'శివా'

శివా- భవానీ-రుద్రాణీ-శర్వాణీ-సర్వమంగళా అనునవి పార్వతికి వేరు పేరులు.

పుట 122 'మన్యే సృజంతి'

రమారమణ నారాయణా!, కవిపుంగవాః = కవివృషభులు, తే అభినుతిం = నీస్తుతిని, సృజంతి = (వడివడిగా). చేయుచున్నారు, (ఇతి = అని) మన్యే = తలతును (ఇది నిక్కమే కావచ్చును.), త్వ ద్వర్ణనే = నీ వర్ణనములో (నిన్ను) వర్ణించునెడల, ధృతరసః = ధరింపబడిన రసము కలవాడై (రసదృష్టి కలవాడై - లగ్నచిత్తుడై) కవి తాతి మాంద్యాత్‌ = కవిత్వ మల్లునెడల మెల్లదనము వలన, తత్తదంగ చిరచింతన భాగ్యం = ఆయాయీ అవయవములను చాలసేపు ధ్యానించు భాగ్యమును, యః = ఎవడు, ఏతి = పొందుచున్నాడో, (సః = అట్టి) మాదృశ ఏవ = నావంటివాడే, ధన్యితి = గొప్పకవి అని (ధన్యుడని), మన్యే = తలతును.

పుట 123 'ఆత్మా త్వం'

శంభో = శివా!, ఆత్మా = నేను, త్వం = నీవు, మతిః = నామతియే, గిరిజా = పార్వతీ, ప్రాణాః = నా ప్రాణములే, ప్రియజనాః చుట్టపక్కాలు, శరీరం = ఈనాశరీరమే, గృహం = ఇల్లు, విషయోపభోగరచనా = విషయములను అనుభవించుట అను పనియే అనగా నావిషయోపభోగమే, తే = నీకు, పూజ, నిద్రా = నిదురయే, సమాధిస్థితిః = సమాధిలో ఉండుట, పదయోః, సంచారః = నడక, ప్రదక్షిణవిధిః = ప్రదక్షిణము చేయుట, సర్వాః = ఎల్ల, గిరః = మాటలు - నేను పలుకు మాటలు, స్తోత్రాణి = స్తోత్రములు, యత్‌ యత్‌ కర్మ = ఏ యే పనిని, కరోమి = చేయుదునో, తత్‌ తత్‌ అఖిలం = ఆ యది యెల్లయు, తవ ఆరాధనమ్‌ = నీసేవ. (నా మంచియు చెడ్డయు నీకర్పించుచున్నాను. మంచి చెడ్డలలో చెడ్డనుగూడ అర్పించుట యేమి పని అని అను కొనవచ్చునుగాని ఇది అలవాటయిన పిదప మంచి చెడ్డలను మాటలేపోయి భగవానుడే శేషించును.)

పుట 125 'సేనయోః'

అచ్యుత = కృష్ణా!, ఉభయోః సేనయోః మధ్యే =రెండు సేవల నడుమ, మే =నా, రథం = రథమును, స్థాపయ = నిలుపుమా!

పుట 126 'శిష్యస్తే7హం' (గీత 2-7)

అహం = నేను, తే = నీకు, శిష్యః = శిష్యుడను, త్వాం = నిన్ను, ప్రసన్నః = శరణుచెందిన, మాం = నన్ను, శాధి = అనుశాసింపుము. (ధర్మమెరుగని నాకు నిక్కమేమో చెప్పుము.)

పుట 128 'క్షుద్రం' (గీత. 2-3)

క్షుద్రం = నిందనీయమగు, హృదయ దౌర్బల్యం = మనో దుర్బలత్వమును - పిరికితనమును, త్యక్వా = విడిచి, పరంతప = శత్రువులకు భయంకరుడా! ఉత్తిష్ఠ= యుద్ధమునకు పూనుకొనుమా!

పుట 129 'నష్టో'

మోహః= అజ్ఞానము, నష్టః = నశించెను.

పుట 130 'మాశుచః'

మాశుచః = దుఃఖింపకుము.

'తస్మాత్‌' (గీత. 2-18)

తస్మాత్‌ = దానివలన - జీవుడు నిత్యుడగుటవలన, యుధ్యస్వ = యుద్ధము చేయుమా! నాశము లేని విషయము కాని శరీరికి-జీవునకు, ఈ శరీరములు నశించునని ఈ శ్లోకపాదము వెనుక మూడు పాదములలో కలదు.ొ

పుట 132 'యస్మిన్‌ స్థితో న' (గీత. 6-22)

యస్మిన్‌ = దేనియందు (ఆత్మతత్త్వమందు), స్థితః = ఉన్నవాడై, గురుణా7పి = గొప్పదయినను, దుఃఖేన = శోకముచే-బాధచే, న విచాల్యతే = చలింపజేయ బడడో, (తం యోగం విద్యాత్‌ = దానిని యోగమని తెలియునది,) దీని పూర్వార్థము - ' యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః' అనునది మొదటి సంపుటమున గలదు.

పుట 134 'రాజా....'

రాజా = రాజు, రాష్ట్రకృతం =రాష్ట్రముచే, కృతం = చేయబడిన అనగా తనదేశమునందలి ప్రజలచే చేయబడిన, పాపం = పాపమును, అశ్ను తే = పొందును, పురోహితః = పురోహితుడు, రాజపాపం = రాజుచే చేయబడిన పాపమును, అశ్ను తే = పొందును. స్త్రీకృతం = భార్యచే చేయబడిన, పాపం = పాపము, భర్తారం = మగనిని, ప్రజేత్‌ = పొందును. శిష్యపాపం = శిష్యులచే చేయబడిన పాపము, గురుం = గురువును, ప్రజేత్‌ = పొందును.

పుట 135 'అపిచేత్‌'

సర్వేభ్యః పాపేభ్యః = పాపు లందరికంటెను, పాప కృత్తమః = అతిపాపిని, అపి అసి చేత్‌ - అయినను (తత్‌ = ఆ) సర్వం వృజినం = పాపమునునెల్ల, జ్ఞానప్లవే నైన = ఎరుక యను తెప్పచేతనే, సంతరిష్యసి = దాట గలవు. (అధర్మరూపమగు) పాపము పోయినను ధర్మము ఉండునే! ముముక్షువునకు అదియు పాపము వంటిదే. కావున ఎరుక కలిగెనేని అధర్మముతో పాటు ధర్మముకూడ నశించును అని శంకరులు.

పుట 138 'సరస్వత్యా లక్ష్మ్యా'

(మాతః = ఓయమ్మా!) త్వద్భజనవాన్‌ = నీభక్తుడు, సరస్వత్యా = విద్యతో - (సరస్వతితో అనియు చమత్కారము), లక్ష్మ్యా =ధనముతో (శ్రీదేవితో అనియు చమత్కారము) కూడుకొనినవాడై; విధి, హరి, సనత్నః = బ్రహ్మతో, హరితో, సవతుగా, విహరతే = విహరించును (సపత్నః అనగా శత్రువనియు అర్థము. లక్ష్మీసరస్వతులు నీ భక్తుని చేరుటచే బ్రహ్మ విష్ణువులకు విరోధియై వారితో పోటాపోటీగా తిరుగు నని చమత్కారము), రమ్యేణ = సుందరమయిన, వపుషా = శరీరముతో, రతేః = రతీదేవియొక్క, పాతివ్రత్యం = పాతివ్రత్యమును, ఈలుపు తనమును; శిథిలయతి = వదులు చేయును, చిరం = చాలకాలము, జీవన్నేవ = జీవించుచునే, క్షపితపశు పాశవ్యతికరః = జీవావిద్యల కలయికను విడగొట్టినవాడై, పరానందాభిఖ్యం = బ్రహ్మానంద మనబడు, రసం = రసమును, సారమును; రసయతి = ఆస్వాదించుచున్నాడు. (సాదాఖ్య కళో పాసకులు ఇహపర సుఖములతో సదాశివు లగుదురని భావము.)

పుట 139 'న మేంద్రో మేధయా' (తై. 4-1)

ఇంద్రః = పరమేశ్వర స్వరూపమగు, సః = ప్రణవము, మా = నన్ను, మేధయా = ప్రజ్ఞచే, స్పృణోతు = సంతస పరచుగాక లేక బలపరచుగాక!

'' 'తతోమే' (తై. 4-2)

తతః = మేధను కలిగించిన పిమ్మట, 'సదసస్పతి మద్భుతం ప్రియ మింద్రస్య కామ్యమ్‌! సనిం మేధా మయాసిషమ్‌' అనునెడ గల మేధాపదమునకు థారణ అర్థమని సాయణభాష్యము చూ. మే = నాకు, శ్రియం = సిరిని (ఆవులను మేకలను), ఆవహ = ఇమ్మా!

'' 'ఏవ మాదీని'

తతః = మేధానిర్వర్తనాత్పరం ప్రజ్ఞనుఇచ్చి నపిమ్మట, యా = ఎవరు, ఏవమాదీని-ఆవులను మేకలను అన్న పానాదులను, కుర్వాణా = కలిగించుచుండునో, తాం = ఆ, సిరిని, ఆవహ, ఆనయ = ఇమ్మా, అమేధనః = తెలివి మాలినవానికి, శ్రీః= సిరి, అనర్థాయైన = చేటుకే.

'' 'అర్థమనర్థం భావయ'

అర్థం = ధనమును, అనర్థం = ఆపదనుగా, నిత్యమ్‌ = ఎల్లయపుడును, భావయ = తలపుమా!, తతః = ఆధనము వల్ల, సుఖిలేశ = సుం తేని సుఖము, నాస్తి = లేదు.

పుట 141 'కోటి మన్మథ'

కోటిమన్మథ = కోటి చక్కనయ్యల (యొక్క), విగ్రహం = మేను-రూపము - చక్కందనము వంటి చక్కదనము కలవాడు. కోటిమన్మథుల అందము తెచ్చి ఒకచో చేర్చినచో నెటులుండునో అటు లున్నవాడు అని తాత్పర్యము.

పుట 143 'ఐశ్వర్య మిందుమౌళేః'

ఇందుమౌళేః = నెలతాల్పగు శివునియొక్క, ఐశ్వర్యమ్‌ = ఐశ్వర్యము (ఈశ్వరుని ధర్మము ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యముచే నెలతాల్పు ఈశ్వరుడాయెనని తాత్పర్యము) ఐకాత్మ్య ప్రకృతి = ఆత్మయును, శక్తియును ఏకాత్మ. తద్ధర్మ మైకాత్మ్యము. అట్టి ఐకాత్మ్యమే ఈ కామాక్షీ దేవి ప్రకృతి. ఐందవ కిశోర శేఖరం = లేనెల సిగ పూవుగా గలది, నిగమానాం = ప్రాజదువులకు - వేదములకు, ఐదంపర్యం = ముఖ్య తాత్పర్యమగు కామాక్షీ దేవి, కాంచి మధ్యగతమ్‌ = కాంచి నడుమనున్నదదై, చకాస్తి = వెలుగొందుచున్నది.

పుట 124 'అహః సూతే'

(ఓయమ్మా!) తవ = నీ, సవ్యం = కుడి, నయనం = కన్ను, అర్కాత్మకతయా = సూర్యరూపమయినందున, అహః = పగటిని, సూతే = చేయుచున్నది. తే-నీ, వామం = ఎడమ, నయనం = కన్ను, రజనీనాయకతయా - చందురుడగుటచే, త్రయామాం = రేయిని సృజతి-చేయుచున్నది. తే = నీ, తృతీయా = మూడవదగు, దృష్టిః = కన్ను, దర దళిత హేమాంబుజ రుచిః = అరవిచ్చిన పొందామర డాలుకలదై, దివస నిశయోః = పగటికిని రేయికిని, అంతర చరీం = నడుమ నుండెడు, సంథ్యాం= (రేపుమాపుల సంధుల) సంజను, సమాధత్తే = చేయుచున్నది (ఇచట అమ్మమూడు కన్నులచే రేబవలు సంజలు కలుగుచున్న వనుటచే ఆమె కాలాతీత అని ఉత్తమధ్వని, 'సూర్యరూపము, చంద్ర రూపము' అనునది వాచ్యమాత్రము. 'అరవిచ్చిన పొందామర డాలు' కలదనుటచే ఆ మూడవకన్ను ఆగ్న్యాత్మక మని అనుఠణనాత్మక ధ్వని. ఇటు లిచట మధ్యమోత్తమ కావ్యప్రయోజకములగు ధ్వనులకుసం సృష్టి సంసృష్టములగు ఈ వ్యంగ్యములు రెంటికిని ప్రథాన ధ్వనికిని అంగాంగిభావముగా సాంకర్యము అని లక్ష్మి ధర వ్యాఖ్య. అమ్మ ముక్కంటి యని ఆగమములందు ప్రసిద్ధము కాన ఇచట స్వభావోక్తియను అలంకారము రేయింబవలు సంజలచే ఉపలక్షింపబడు మాసర్త్వాది కాలములకు కారణముగా చెప్పుటజేసి అమ్మకు కాలా బాధ్యత్వము, శావాభిన్నత్వము అనునవి ప్రతీతములగు చున్నవి. కాగా స్వభావోక్త్యలంకారముచే వస్తుధ్వని అని అరుణామోదిని.

పుట 144 'త్వయా హృత్వా' (సౌందర్య. 23)

శంభోః = శివునియొక్క, వామం = ఎడమ, వపుః = మేను, హృత్వా = హరించి, అపరితృప్తేన = తనవి తీరని, మనసా = మదిలో, అపరమపి = కుడిదియునగు, శరీరార్థం = సామేను, హృతం = హరింపబడినదని, శంకే = తలచుచున్నాను. యత్‌ = ఏలయనగా, ఏతత్‌ = ఈ (నా మదిలో ప్రతిబింబించు) సకలం, త్వద్రూపం = నీ రూపెల్లయు, అరుణాభం = పొడుచుచున్న వేవెలుగు చాయవంటి చాయ కలదియు-లేక ఎఱ్ఱని కాంతి కలదియు, త్రినయనం = మూడు కన్నులు కలదియు, కుచాభ్యాం = స్తనములచే, ఆనమ్రం = కొలదిగా వంగినదియు, కుటిల శశిచూడాల మకుటం = తురుమున చందురువంకచే కిరీటము కలదియు అనగా చందురు వంకయే కిరీటముగా కలదియు (ఏలగును?)

తాత్పర్యము :- అంబిక సామేను కొనియు మిగిలిన మేను గూడ హరించేనని ఉత్ప్రేక్ష. లేక ఉత్తరకౌల సిద్ధాంతము ఇందు కలదు-శక్తితత్త్వమే కాని శివతత్త్వము లేదు. దీనివలన శివతత్త్వము శక్తితత్వము నందడగియున్నది. కాన శక్తితత్త్వమే ఉపాసింపదగినది అని వారి తాత్పర్యము అని 'లక్ష్మీధర'. 'న శివేన వినా శక్తిర్న శక్తిరహితః శివః' = 'శివుడు లేక శక్తి గాని శక్తి లేక శివుడుగాని ఉండడు' అను నీ మొదలగు అభేదమును జెప్పు వాక్యములను తెల్ల మొనరించి లోకముల ననుగ్రహించుటకే అర్థనారీశ్వరరూపము స్వీకరింపబడెనని పరమార్థము. ఇచట అపరశరీరార్థ హరణొత్‌ ప్రేక్ష కావ్యలింగముచే అనుప్రాణితము అని అరుణామోదిని.

పుట 146 'సర్వవర్ణాత్మికే'

సర్వ వర్ణాత్మికే = అక్షరసమామ్నాయ స్వరూపిణి! (అక్షరములెల్ల నీ రూపములే. 'పంచదశవర్ణరూపం' మూక-ఆర్యాశతక. 58)

పుట 147 'మాతృదేవో' (తైత్తి 11 అనువాకమున 3

ఆ శాస.)

మాతృదేవః = తల్లి దేవతగా కలవాడవు, భవ = అగుమా, పితృదేవః = తండ్రి దేవముగా కలవాడవు, భవ = అగుమా!, తలిదండ్రులు దేవతలవలె ఉపాసింప దగినవారిని తాత్పర్యము.

పుట 148 'విపంచ్యా' (సౌందర్య)

(ఓ అమ్మా!) వివథం = పలు తెరగులగు, పశుపతేః = శివుని యొక్క, అపదానం = అద్భుత చరిత్రమును, విపంచ్యా = వీణమీద, గాయంతీ = పాడుచున్న, వాణీ = వాణి (తాను పాడిన తరువాత), సాధువచనే = 'బళిబళీ' 'మేలుమేలు' అను ప్రశంస, చలితశిరసా = ఊపిన తల కల (తల యూపి), త్వయా = నీచే, వక్తుం = చెప్పుటకు, ఆరబ్ధే (సతి) = ఆరంభింపబడగా ('ఎంతో మధురముగా నున్నది; ఏదీ ఇంకొకటి మరియొకటి పాడుము' అని చెప్ప మొదలిడగా), తదీయైః = ఆ పలుకులలోని, మాధుర్యైః = మాధుర్యములచే, అపలపిత తంత్రీ కల రవాం = నవ్వబడిన-నీరసింపబడిన-తీగల కలధ్వని కల, నిజాం = తనదగు, వీణాం = వీణను, చోళేన = గవుసెనచే, నిభృతం = ఎవరికిని తెలియనటులు, నిచులయతి = కప్పు చున్నది. (సంగీతము కట్టిపెట్టి ఎవరికిని కనబడనటులు వీణకు గవుసెన తొడుగుచున్నది.) ఓడిపోయిన వైణికుడు తన వీణకు గవుసెన తొడగుచందమున 'వీణకు గవుసెన వేయకపోయినను వేసినటులు చెప్పుటచే ఇచట అతిశయోక్తి యను అలంకారము. ఓడిన వైణికునితో అభేదాధ్యవసాయము ప్రతీతమగుచున్నది, అని లక్ష్మీధర, 'ఎవరికిని కనబడనటులు గవుసెన తొడగుచున్నదను వర్ణనమువల్ల సిగ్గుపడి వాణి కొండొక నెపమున పాటకచేరి చాలించినదని ప్రతీతమగుచున్నదని అరుణామోదిని.

పుట 149 'కల మంజుల' ( మూక. ఆర్యాశంక. 99)

కల మంజులవాక్‌ = జిలిబిలి ముద్దుపలుకులచే, అనుమిత = ఊహింపబడిన, గళ పంజర = మెడయను పంజరమును, గత = పొందిన, శుక = చిలుక (యొక్క) ను, గ్రహ = పట్టుకొను, ఔత్కంఠ్యాత్‌ = కోరికవల్ల, అంబ = అమ్మా!, శంబరారిణా = మన్మథునిచే, న్యస్తం = ఉంచబడిన, బింబఫలం = దొండపండు, తే = నీ, రదనాం బరం = వా తెర.

'' 'చేటీ భవన్నిఖిల'

చేటీ భవత్‌ నిఖిల ఖేటీ = బానిసలుగా అగుచున్న ఎల్ల పురస్త్రీలు కలదియు, కదంబవనవాటీషు = కడమతోటల వీథులందు, నాకి పటలీ కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా = సురల (యొక్క) గుంపుల కిరీటములందు సుందరమగు అంచులయందున్న (మణి, కాంతుల పెక్కులచే) పెక్కు మణికాంతులచే మిశ్రిత మయిన పాదములు కలదియు, పాటీర గంధకుచశాటీ = చందనపు గందపు బూతకల వలెవాటుకలదియు నగు, అగాధిపసుతా = కొండలరేని కూతురు అనగా హైమవతి యగు అంబిక; ఉదార ముఖ వీటీ రసేవ = కోరికల నెల్లనొసగగల మోము తమ్మరసముచే; ఘోటీ కులాత్‌ = గుఱ్ఱముల కంటె, అధిక థాటీం = మిగుల వడిగల, కవిత్వ పరిపాటీమ్‌ = కవితాపరిపాటిని, తను తాం = ఇచ్చుగాక.

పుట 151 'విద్యాసు'

విద్యాసు = అష్టాదశవిద్యలలో, శ్రుతిః = వేదము, ఉత్‌ కృష్టా = దొడ్డది, శ్రుతౌ= (ఆ) వేదమునందును, రుద్రై కాదశినీ = రుద్రముగల పదునొకండవదగు 'నమః శివాయ చ' అనునది, ఉత్‌కృష్టా = దొడ్డది, తత్‌ = ఆరుద్రములో, పంచాక్షరీ = పంచాక్షరి, ఉత్‌కృష్టా = దొడ్డది, తస్యాం = ఆ పంచాక్షరియందును, శివ ఇతి = శి వ యను, అక్షరద్వయం అక్కరముల = జంట ఉత్‌కృష్టం = దొడ్డది,

'' 'శాంతం శివం'

శాంతం = శాంతమయినదానిగను, శివం = సుఖమయిన దానిగను, అద్వైతం = ద్వైతము కానిదానిగను, చతుర్థం = మెలకువ కల నిదుర అను అవస్థలకు పై దానిగను, నున్యంతే = తలచుచున్నాను, సః = అట్టి, ఆత్మా = ఆత్మ, విజ్ఞేయః = ఎరుగదగినది.

పుట 152 'యజ్జీవరత్నం'

త్రినేత్ర = ఓ ముక్కంటీ! యత్‌ = శివ అను అక్షరద్వయము, అఖిలాగమలాలనీయం - అఖిల = ఎల్ల, ఆగమ = వేదములచే, లాలనీయం = బుజ్జగింపదగిన, జీవరత్నం = మేలురతనమో, (తేన = ఆశివనామముచేత) యే ఏ, మృడ శంకర నామధేయే చ= మృడ శంకర అను పేరులు కలవో, ఏతైరపి = ఈ మూటిచే గూడ (శివ, మృడ, శంకర), అనన్య సమాశ్రయం = ఇతరుల నెవరిని ఆశ్రయింపని, తే = నీయొక్క, సకల జీవ సుఖ ప్రదత్వం = ఎల్ల జీవులకును సుఖమును ఇచ్చుట అను ధర్మము, ప్రఖ్యాప్యతే ప్రచురపరపబడుచున్నది.

పుట 153 'శ్వశ్రేయసం' (అమరము)

శ్వశ్రేయసం, శివం, భద్రం, కల్యాణం, మంగళమ్‌, శుభమ్‌ = ఇవి అన్నియు మంగళవాచకములు.

'' 'యద్‌ ద్వ్యక్షరం' (భాగ 4-4 14)

సకృత్‌ ప్రసంగాత్‌ = ఒకే ఒక మాటు. గిరా పలుకుచే = నాలుకచే, యత్‌ = ఏ, ద్వ్యక్షరం = రెండు అక్కరములుకల, నామ = పేరు- 'శివ,' అను పేరు, ఈరితం (సత్‌)పలుకబడినదై, తత్‌ = ఆ శివనామము, అఘం = పాపమును, హన్తి = పాపును, ఆలంఘ్య శాసనం = దాటరాని ఆజ్ఞకలట్టియు, పవిత్రకీర్తిం = పవిత్రమగు కీర్తి కలట్టియు, తం = ఆ, శివం = శివుని, భవాన్‌ = నీవు, ద్వేష్టి = ద్వేషించుచున్నావు, (భవచ్ఛబ్ద యోగముచే ప్రథమపురుషము), వివేతరః = (నీవు) అశివుడవు, అమంగళుడవు? అహో = అయ్యో!- ఎంత అశివుడవో!

పుట 154 'అపి వా య శ్చాండాలః'

యః = ఎవడు, చండాలో7పి వా = చండాలుడేయయినను, 'శివ' ఇతి = 'శివ' అని, వాచం విసృజేత్‌ = పలుకునేని-శివనామముచేయునేని-శివ శివ అని నామ కీర్తన మొనరించునేని, తేన సహ = అతనితో గూడ, సంవసేత్‌ = నివసించునది.

పుట 155 'సర్వే వేదాః'

సర్వే = ఎల్ల, వేదాః = వేదములు, యత్‌ = ఏ, పదం = మాటను, ఆమనన్తి = చెప్పుచున్నవో (అది ఓమ్‌).

'' 'క్లేశకర్మ విపాకాశ##యైః' (1-24)

క్లేశకర్మ విపాకాశ##యైః = క్లేశములచేగాని కర్మలచేగాని విపాకముచేగాని ఆశయములచేగాని, అపరామృష్టః = అంటబడని, పురుషవిశేషః = ఒకానొక మహాపురుషుడు, ఈశ్వరుడు. (అవిద్య - అస్మిత-రాగ ద్వేష-అభినివేశము లనునవి క్లేశములు. చెడుపనులు మంచి పనులు అనునవి కర్మలు. ఈపనులవలనకలుగుఫలమే విపాకము. ఆ విపాకమును-అనగా ఆ యా కర్మ ఫలమును అనుభవించిన పిదప ఆ యనుభవమునకు తగిన చందముగా పుట్టు వాసనలు ఆశయము. ఈ వాసనలు మనసున నుండునుగాని పురుషునం దున్నటులు ఆరోపింపబడును. దానజేసి పురుషుడు భోక్త యనబడును. గెలుపుగాని ఓటమిగాని సైనికులది. వారు గెలుచుచొ రాజు గెలిచెనని అందురు. ఓడుచో రాజోడెనని యందురు. అటులే మనసే= భోక్త. ఆ భోక్తృత్వము పురుషునం దారోపితము. ఈ పురుషువి శేషుడగు పరమేశ్వరుడు అనాదిముక్తుడగుటజేసి భోక్త యనియేని వ్యవహరింపబడడు. అట్టి మహాపురుషుడే ఈశ్వరుడు.)

పుట 156 ' శబ్దాదేవ ప్రమితః' బ్రహ్మసూత్ర 1-8-24ొ

శబ్దాదేవ = ఈశానః అను శబ్దమువలననే, ప్రమితః = అంగుష్ఠమాత్రప్రమాణము కలవాడని చెప్పబడినవాడు, పరబ్రహ్మమేకాని జీవుడు కాడు.

'అంగుష్ఠమాత్రః పురుషోమధ్య ఆత్మని తిష్ఠతి,

అంగుష్ఠమాత్రః పురుషో జ్యోతి రి వాధూమకమ్‌

ఈశానో భూతభవ్యస్య స ఏ వాద్య స ఉశ్వ

ఏత ద్వైతత్‌.

బొటవ్రేలంత పురుషుడు ఎదనడుమ నున్నాడు. బొటవ్రేలంత పురుషుడు పొగలేని జోతివలె వెలుగు చున్నాడు. అతడే వెనుక ముందుల కీశానుడు, నేడు రేపుల నేకరూపుడు. ఇతడే నీ యడిగినవాడు. ఈ కఠమునందు ఈశానుడు పరమేశ్వరుడని యీసూత్రము చెప్పును.

పుట 156 'యా తే రుద్ర' శ్రీ రుద్రము. 3ొ

రుద్ర = ఓ రుద్రుడా!, తే = నీ, యా = ఏ, తనూః = శరీరము, శివా = మంగళమయినది (మమ్ముల సమగ్ర హించునది. కనుకనే), అఘోరా = హింస చేయదు, అపాప కాశినీ = పాపము నొనరింపనీయదు, హేగిరిశంత = కైలాసమునందుండి ఎపుడును ప్రాణులకు సుఖమొసగువాడా!, శంతమయా = మిగులసుఖమునొసగు, తయా = ఆ, తనువా = శరీరముచే, నః, అభిచాకశీహి = మాకు కనుపింపుమా! (మంగళకరమయిన నీనెమ్మేనిని చూపి మాకు సుఖము కలిగింపుమా)

'' 'తసై#్యతే తనువౌ ఘోరా న్యా శివా న్యా'

తస్య = (అగ్నిరూపుడైన) ఆ రుద్రునికి, ఏతే = ఈ, తనువౌ = శరీరములు (రెండు, ఆ రెంటిలో), అన్యా = ఒకటి ఘోరా = క్రూరమయినది, అన్యా = మఱియొకటి, శివా = మంగళకరమయినది. (ఈశ్వరునికి సంహారముచేయు శక్తికలదు. ఇంతియుకాక అట్టిశక్తులెన్ని యో కలవు. వానిలో సంహారశక్తి అతి భయం కరము. రుద్రమునకు గల భట్టభాస్కర భాష్యపీఠిక చూచునది.)

పుట 156 'యా తే రుద్ర శివా తనూః'

హే రుద్ర = ఓ రుద్రుడా!, తే = నీ, శివా =శాంతమయిన, యా =ఏ, తనూః = శరీరము (కలదో), తయా = ఆ శరీరముతో, నః = మమ్ము, జీవనే = బ్రతికించుటకు, మృడయ = సుఖపెట్టుమా! ఏ శరీరము ఎందువలన), విశ్వాహ భేషజీ = ఎల్ల ప్రొద్దులందును మందువంటిదో, (దానివలన) శివా = మంగళకర మందు వంటిది. మరియు దేనివలన) రుద్రస్య రుద్రునియొక్క (తాదాత్మ్యము పొందుటకు అనగా రుద్రత్వము చెందుటకు), భేషజీ = మందువంటిదో (దానివలన) శివా = మంగళకరమయినది. మంగళమయమయిన ఆ రూప మంబికది. జ్ఞానమొసగున దగుటచేతను జన్మమరణాది దుఃఖమును పోగొట్టునదగుటచేతను ఈ శరీరము మంగళమయినదని తాత్పర్యము.

'' 'కో బ్రాహ్మణౖ రుపాస్యః' (ప్రశ్నోత్తర రత్నమాలిక.71)

బ్రాహ్మణౖః = బ్రాహ్మణులచే, కః =ఎవడు, ఉపాస్యః = ఉపాసింపదగినవాడు? (బ్రాహ్మణు డెవరిని ధ్యానింపవలెను?) గాయత్య్రర్కాగ్నిగోచరః = గాయత్రిసూర్యుడు అగ్ని: వీనియందు గోచరించు, శంభుః = శివుడు.

పుట 157 'సౌరమండల మధ్యస్థమ్‌'

సౌరమండలమధ్యస్థం-సూర్యమండలముయొక్కనడుమ నున్నట్టియు, సాంబం = అంబికతో - చిచ్ఛక్తితో - కూడియున్నట్టియు, సంసారభేషజం = సంసారమునకు ముందువంటివాడయినట్టియు, నీలగ్రీవం = నల్లని మెడ గలట్టియు, విరూపాక్షం = మూడుకనులు కలట్టియు, అవ్యయం = అనంతుడగు, శివం = శివుని, నమామి = మ్రొక్కుచున్నాను.

పుట 157 'యో రుద్రో7గ్నౌ'

అగ్నౌ = అగ్నియందు, యః = ఏ, రుద్రః = రుద్రుడు కలడో.

'' 'శాస్త్రం శారీర మీమాంసా'

మే = నాకు, జన్మ జన్మని = ప్రతి జన్మమునందును, శాస్త్రం = శాస్త్రము, శారీరమీమాంసా = శారీరక మీమాంస యనునదియే, దేవః = దైవము, శ్రీచంద్ర శేఖరః = చంద్రశేఖరుడే, గురుః = ఆచార్యుడు, శ్రీ శంకరాచార్య = శంకరుడే, సంతు = అగుదురు గాక, శాస్త్రము లెన్నియో కలవు. వానిలో శారీరక మీమాంసయే శాస్త్రము. దేవత లెందరో కలరు. వారిలో చంద్రశేఖరుడే దేవత. గురువు లెందరో ఉందురు. కాని శ్రీ శంకరాచార్యులవారే గురువులు. శాస్త్రములలో శారీరక మీమాంసయు, దైవములలో చంద్రశేఖరుడును, గురువులలో శంకరులును దొడ్డ వారని భావము.

పుట 158 'త ద్విష్ణోః'

తత్‌ = అది, విష్ణోః = విష్ణువునకు, పరమం పదం = పరమ పదము. వైకుంఠము విష్ణుపదము అని తాత్పర్యము.

పుట 165 'ప్రదీపజ్వాలాభిః'

వాచాం = పలుకులకు, జనని! = తల్లీ ! మాతృకా రూపా ! (అనగా భాషకు అకారాద్యక్షరములు తల్లి వంటివి. ఆ తల్లినుండి వేదములుమొదలుగా శబ్దప్రపంచము పొడముచున్నది. శబ్దప్రపంచము రూపప్రపంచము శక్తికి శరీరము), త్వదీయాభిః = నీయవియగు, గ్భీః = పలుకులచే (రచింపబడిన), ఇయం = ఈ, స్తుతిః = ఆనందలహరి సౌందర్యలహరి అను ఈ స్తోత్రము, తవ = నీకు, ప్రదీపజ్వాలాభిః = దివిటీల వెలుగులచే, దివసకర నీరాజన విధిః = సూర్యునకు ఆరతి యిచ్చుట. (మహాత్ములు వచ్చినపుడు ఆరతి యెత్తి నలుగురికిని చూపుదురు. అదియే ఆరతియెత్తుట. వెలుగు సూర్యునినుండి వచ్చుచున్నదికదా! అట్టి వెలుగుల వెలుగైన వేవెలుగును ప్రకాశింపజేయు వెలు గేడది? ఆరతి యెత్తిన వెలుగుకూడ వేవెలుగుదే. అటులే నీవు మాతృకామూర్తివి, పలుకుల తల్లివి; కాన ఈ నుతియు నీ యదియే. ఇందు నాకర్తృత్వ మేమున్నది? అని భావము) సుధాసూతేః = అమృతము కురియు చంద్రునకు, చంద్రోపల జల లవైః = నెల రాల నీరి బొట్లచే, ఆర్ఘ్యరచనా = ఆర్ఘ్యమొసగుట, చంద్రునిదే యగు నెల రాల నీరు చంద్రున కిచ్చినటులే నీ పలుకులే నీ కిచ్చుచున్నాను అని తాత్పర్యము. స్వకీయైః = తనవగు, అంభోభిః = నీళ్లచే, సలిలనిధి సౌహిత్యకరణం = సముద్రునకు తర్పణాంజలి చేయుట. సముద్రములో మునిగి ఆ నీటినే ఆయనకు ఆర్ఘ్యమిచ్చి ఆ నీటితోనే మార్జన మంత్రములు చెప్పినట్లు. మాతృకాక్షరములు నీ రూపము, ఆగమార్థముతో సంవాదముకల యీస్తుతి నీకు సంబంధించిన మాతృకాక్షరమలకంటె వేరు కాదు. కావున నీ వాక్కులచేతనే నీ యీ స్తుతి అని పరమార్థము.

పుట 168 'ఆపో హి'

ఆపః = ఓ ఉదకములారా! హి = ఎందువలన, మయో భువః స్థః = సుఖము కలిగించుచుంటిరో (అందువలన) తాః = అట్టి మీరు, నః = మా (యొక్క), ఊర్జే= బలముకొఱకును, మహే = మహనీయమును, రణాయ = రమణీయమును అగు, చక్షసే = బ్రహ్మజ్ఞానము కొఱకును, దధాతన = ఉపకరింపుడు, మీ వలన మాకు సుఖము కలుగుచున్నది. ఆ సుఖము బల జ్ఞానములను - ఐహిక, ఆముష్మిక సుఖములను కలిగించుగాక అని తాత్పర్యము.

పుట 169 'యే నాధీతాని శాస్త్రాణి'

నిశ్శేష = ఎల్ల, సూరి = విద్వాంసులయొక్క, మూర్థ = తలలు అను, అలిమాలా = తుమ్మెదలబారుచే, లీఢ ఆస్వదింపబడిన, అంఘ్రి పంకజాత్‌ = అడుగుదమ్ములు కల, భగవచ్ఛంకరాహ్వయాత్‌ = భగవద్రూపులగు శంకరాచార్యులకడ, యేన = ఎవనిచే, శాస్త్రాణి = శాస్త్రములు, అధీతాని = చదువబడినవో (అతనిచే ఈ శాసనము వ్రాయబడినది).

పుట 171 'జాతస్య హి ధ్రువో మృత్యుః-' (గీత.2-27)

హి = దేనివలన, జాతస్య = పుట్టినవానికి, మృత్యుః = చావు, ధ్రువః =నిశ్చితమో, మృతస్య చ = చచ్చిన వానికి గూడ, జన్మ = పుట్టుక, ధ్రువమ్‌ = నిశ్చితము.

పుట 173 'తమేవం విద్వాన్‌'

తం = ఆ యీశ్వరుని, ఏవం = ఇటులు, విద్వాన్‌ = తెలిసినవాడు, ఇహ = ఇచటనే (అనగా ఈ శరీరము ఉండగనే), అమృతః = చావులేనివాడు (అనగా మరి జనన మరణ ప్రవాహము లేనివాడు), భవతి = అగుచున్నాడు, అయనాయ = బ్రహ్మప్రాప్తికి, అన్యః = వేరు, పంథాః = దారి, న విద్యతే = లేదు.

పుట 174 'తదేతత్‌'

తత్‌ ఏతత్‌ అశరీరిత్వం = ఆయీ శరీరము లేకపోవుట, మోక్షమ్‌ = ముక్తి.

'' 'తం స్వా చ్ఛరీరాత్‌' (కంఠ. 2-3-7)

(బొటనవ్రేలంత పురుషుడు అంతరాత్మస్వరూపుడై ఎప్పుడును జనుల హృదయములలో దూరియున్నాడు) తం = అతనిని, ఆ అంతరాత్ముని; ముంజాత = ముంజ అను గడ్డి మొక్కనుండి, ఇషీకాం ఇవ = మొవ్వును వలె, ధైర్యేణ = ధీరతతో, స్వాత్‌ శరీరాత్‌ = తన యొడలినుండి, ప్రవృహేత్‌ - వేరుపరపవలయును, తం = చిన్మాత్రుడగు ఆ యాత్మను, శుక్రం = శుద్ధమైన, అమృతం = బ్రహ్మమునుగా, విద్యాత్‌ = తెలియునది, తం = ఆ యాత్మనే, శుక్రం = శుద్ధమగు, అమృత మితి = బ్రహ్మమని, విద్యాత్‌= తెలియునది.

పుట 175 'అవిజ్ఞాతం విజానతామ్‌' కేన. 2-3ొ

ఎవడు బ్రహ్మస్వరూపము కనుగొనబడ దని భావించునో అతడే చక్కగ నెరుగును; ఎవడు బ్రహ్మస్వరూపమును కనుగొంటినని భావించునో అతడు ఎరుగడుొ విజానతాం = తెలిసికొన్నవారికి, అవిజ్ఞాతమ్‌ = బ్రహ్మ స్వరూపము తెలియబడనిదిగానున్నది, అవిజానతామ్‌ = తెలిసికొననివారికి, విజ్ఞాతమ్‌ = తెలిసికొనబడినదిగా నున్నది. బ్రహ్మము తనకు వేరు కాదుగాన కనుగొనబడదు మరి తెలియబడదు. అది కర్మ కాదు. తన్ను దాను తెలిసికొనుచున్నాడని చెప్పుట భాషలో మరొక రీతిగా చెప్పుటకు వీలులేక)

పుట 176 'నమః'

పార్వతీపతయే = పార్వతికి పతియగు శివునకు, నమః = జోత =నమస్కారము.

పుట 176 'అశరీరం వావ' ఛాందోగ్య 8-12-1ొ

అశరీరం వావ = (తన్నెరిగి అవివేకముతొలగి) మేనితోడి యంటును పెడబాసినవాడై, సంతం = ఆత్మమాత్రుడై శేషించిన పురుషుని, ప్రియాప్రియే = ధర్మమునకును అధర్మమునకును ఫలరూపమయిన ప్రియాప్రియవిషయములు = న స్పృశతః = అంటవు.

పుట 176 'గౌణ మిధ్యాత్మనో7 సత్వై'

బ్రహ్మ. సూ శంకరభాష్య 1-1-4ొ

సత్‌ బ్రహ్మ ఆత్మా = సత్యము కంటెను బ్రహ్మము కంటెను ఆత్మకంటెను వేరు కానివాడను, అహం = నేను, ఇతి = అని, బోధే (సతి) = ఎరుక కలుగగా, పుత్త్ర దేహాది బాధనాత్‌ = కొడుకులు మొదలగువారి యెడను, దేహము మొదలగువానియెడను నేను అనుతలపు తలగిపోవులవలన, గౌణమిథ్యాత్మనఃఅసత్త్వేక = గౌణాత్మయు మిథ్యాత్మయు లేకపోగా, కార్యంలో యాత్రారూపమగు కార్యము, కథం = ఎటులు, భ##వేత్‌ = జరుగును?

'సవ్‌ బ్రహ్మాత్మా'

'ఓ సౌమ్యుడా సృష్టికివెనుక సత్యమే యుండెను' అను అర్థము కల - 'స దేవ సోమ్యేద మగ్ర ఆసీత్‌' (6-2) అను ఛాందోగ్యమునందలి సత్‌ అను మాటకును, 'సత్యముబ్రహ్మ, జ్ఞానము బ్రహ్మ, అనంతము బ్రహ్మ' అను అర్థముకల- 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' (2-2-1) అను తైత్తిరీయకమునందలి బ్రహ్మ అను మాటకును, 'సృష్టికి మొదట ఈ ఆత్మయేయుండెను' అను అర్థముకల - 'ఆత్మా వా ఇద మగ్ర ఆసీత్‌' (1-1-1) అను ఐతరేయమునందలి ఆత్మా అను మాటకును ఒకటే అర్థము. ఇక అహమ్‌ అనగా నేను అని అర్థము. సత్యము నేను, బ్రహ్మము నేను, ఆత్మ నేను ఇటులు సద్‌ బ్రహ్మాత్మ నేను అని తేలెను.

సత్‌ అనగా సత్యము. కామముచేగాని మరి దేనిచే గాని బాధింపబడనిది, నాశము పొందనిది అని అర్థము. బ్రహ్మము అనగా పూర్ణమైన వస్తువు. (ఏనుగు పాదమునం దన్ని పాదములును అడగియున్నటులు బ్రహ్మము నందు సృష్టి అడగియున్నది. కావుననే ప్రపంచము బ్రహ్మ-అండము) ఆత్మ యనగా నేను. ఆ నేను విషయములను గ్రహించును. సద్‌బ్రహ్మాత్మకమగు వస్తువే నేను కావున నేను సత్యము పూర్ణము మరియు సర్వమునకు సాక్షి.

గౌణాత్మ

పుత్త్రదేహాదిబాధనాత్‌ (బంధనాత్‌ అనియుఅచ్చులో ఉన్నది - పుత్త్ర దేహాదులు నే నని యనుకొనుట సత్యముకాదుగాన-దీనికి బాద - అనగా నాశము. సంసారి తన ఆలుబిడ్డలకు దుఃఖము కలిగినయెడల దుఃఖించును. సుఖము కలిగినయెడల సుఖించును. ఈ సుఖముగాని యీ దుఃఖముగాని తనదా? కాదు ఇటులు ఆలుబిడ్డల సుఖదుఃఖములు తనవిగా తలచిన ఆత్మ గౌణాత్మ.

'వాహీకుడు పశువు' అని వాడుక. వాహీకుడు అనగా బాహ్లిక దేవస్థుడు. వాడు పశు వెలు లగును? ఈ వాడుక యెటులు వచ్చెను?

పశువునకు తెలివితేటలు లేవు. కట్టనియెడల ఒక చోట ఉండదు. ములుకోల మోపనిచో అనుకూలముగా నడవదు. వాహీకునియందును ఇట్టి గుణములు ఉండుటచే 'వాహీకుడు పశు' వని అందురు. కాగా గుణములవలన కలిగినది గౌణము. అప్రధానము.

తలిదండ్రులు కొడుకులయు కూతులయు సుఖదుఃఖములు తమవే అని అనుకొనుటచే ఆ బిడ్డలయందలి ఆత్మాభిమానము గుణమే. అనగా అప్రధానమే. తాము వేరు, బిడ్డలు వేరు అని అనుభవములో నున్నదేశమా! కావున ఇది ఏకత్వాభిమానము కాదు, మరి గౌణము - అని భామతి.

మిథ్యాత్మ

కుంటివాడు 'నేనుకుంటివాడను' అనియు గ్రుడ్డివాడు 'నేను గ్రుడ్డివాడ' ననియును అనుకొందురు. ఈకుంటి తనముగాని గ్రుడ్డితనముగాని దేహమునకుసంబంధించినది. ఈ దేహము నే డుండును; రేపు పోవును. ఇట్టి దేహమునందలి యభిమానము- ఈ దేహమే నే నని అనుకొనుట - సత్యము కాదు. ఇది బాధితము కాదా! ఆత్మకాని దేహమును ఆత్మయని యనుకొనుట మిథ్య, అటు లనుకొనునది మిథ్యాత్మ.

ఈ గౌణ మిథ్యాత్మలు అసత్యములనియును తాను సద్‌ బ్రహ్మాత్మ అనియును తెలిసినవానికి లోకయాత్ర యెటులు జరగును?

భామతి యిటులు వివరించుచున్నది : పుత్రాదులు తనకంటె వేరని అనుభవములో నున్నటులు దేహేంద్రియాదులు తనకంటె వేరు అని అనుభవములో లేదు, అభేదానుభవమే ఉన్నది. కాని యీ అనుభవము ఎట్టిది? ఆలిచిప్పను చూచి వెండి అని అనుకొన్నటులిది మిథ్యానుభవము.

ఇరుతెరగులగు ఆ యీ ఆత్మాభిమానము లోక యాత్రను సాగించుచున్నది. ఇదియే లేనియెడల లోక యాత్రయు జరగదు. బ్రహ్మాత్మానుభవమును ఉండదు. ఏలయన శ్రవణ మననాదులు ఉండవుగా.

'గౌణాత్మ లేదు' అని అనినయెడల పుత్త్రకళత్రాదులు లేమి మమకారము లేదు. 'మిథ్యాత్మ' లేనియెడల దేహేంద్రియాదుల లేమితోపాటు శ్రవణాది ప్రమాణములకును లేవడి. ఇటులగుటచే కేవలము లోకయాత్ర ఇసుమంతయు జరగమియేకాక సద్‌ బ్రహ్మా7హమ్‌' అను బోధశీలమగు కార్యము అనగా అద్వైత సాక్షాత్కారము ఎటులు జరగును?

ఈప్రశ్నకు ప్రతివచనము పదపటిగాథలలో నున్నది. 'గౌణమిథ్యా....'అను నీమూడుగాథలు భగవద్‌ గౌడపాదుల వని వార్తికమునందును, శ్రీ నారాయణ సరస్వతుల వార్తికమునందును కలదు. ఆత్మ స్వరూపుడు పంచపాదికా వివరణటీక ప్రబోధ పరిశోధనిలో సుందరపాండ్యుని వని చెప్పెను. శ్రీ మత్కుప్పుస్వామి శాస్త్రిగారు సూతసంహితానురోధముగా ఈ విషయము నెత్తికొంతవ్రాసిరి. మహామహోపథ్యాయ శ్రీమదనంతకృష్ణశాస్త్రగారి ప్రదీప, వేదాంతపరిభాషా వ్యాఖ్యలు చూచునది.ొ

పుట 178 'వేదో నిత్య మధీయతామ్‌'

నిత్యం ఎల్లపుడును, వేదః = వేదము, అధీయతామ్‌ = అధ్యయనము చేయబడుగాక! (అనగా అధ్యయనము చేయుము), తదుదితం వేదముచే చెప్పబడిన, కర్మ = కర్మము, స్శుఅనుష్ఠీయతామ్‌ = చక్కగా నిర్వహింపబడుగాక (నిర్వహింపుము), తేన = ఆ వేదము చెప్పిన కర్మచే, ఈశస్య = ఈశ్వరునికి, అపచితిః = పూజ, విధీయతామ్‌ = చేయబడుగాక ! (చేయుము)

పుట 179 'కృష్ణానుస్మరణం'

కృష్ణానుస్మరణం పరం = కడపట కృష్ణుని స్మరించుట.

'' 'య దేవ విద్యయా' (ఛాందోగ్య 1-1-0)

యదేవ = దేనినేని, విద్యయా = జ్ఞానముతోడను, శ్రద్ధయా = విశ్వాసముతోడను, ఉపనిషదా = నిదిధ్యసతోడను, కరోతి = చేయునో, తదేవ = అదియే, వీర్యవత్తరం భవతి = ఫలవత్తరము అగును. తెలిసికొనక చేయు కర్మకంటె తెలిసికొనిచేయు కర్మఫలవత్తరము అగును. తెలిసికొనకచేయు కర్మకును ఫలము కలదు గాని తెలిసికొని చేయు కర్మకు ఎక్కువఫలము కలదని అర్థము. కోమటి పద్మరాగమును అమ్మజూపినిండు వెలరాబట్టుకొనును. కోయవాడో ఎంతకోఒకంతకు అమ్మివేయును.

పుట 179 'య దేవ విద్యయేతి హి' (బ్రహ్మసూ. 4-1-18)

అవతారిక : జ్ఞానముకలుగుటకు చేయుకర్మలు తిన్నగా తెలిసికొనియే శ్రద్ధతోడనే ఏకాగ్రతతోడనే చేసి తీరవలయునా? తిన్నగా తెలిసికొనకయు చేయవచ్చునా?

జ్ఞాన మనునది దొడ్డప్రయోజనము. దొడ్డకర్మల వలనగాని అట్టి ప్రయోజనము కలుగదు. దొడ్డకర్మలనగా తిన్నగా తెలిసికొని చేయు కర్మలు లేక విద్యా సహితములగు కర్మలు. కొన్ని శ్రుతులును (1) స్మృతులును (2) విద్యాసహితకర్మలుదొడ్డవిఅవి అనుచున్నవి. కావున ముముక్షువు విద్యాసహితములగు కర్మలనే చేయవలెను.

కొన్ని శ్రుతులు (3) విద్యాసహితమగు కర్మలని గాని విద్యారహితములగు కర్మ లనిగాని అనక కర్మ మాత్రముచే చెప్పునుగదా ! కాబట్టి విద్యాసహితములగు కర్మలనే యేల చేయవలయును ?

ఇటులు చెప్పినను ఈశ్రుతులకుగూడ విద్యాసహితములగు కర్మలనే చేయవలయు నను నభిప్రాయము చెప్పవలయును. 'బ్రాహ్మణులకు దక్షిణనీయవలయును' అనుచో చదువుకొనినవారికి ఈయవలయునని అర్థము చెప్పుదురుగాని చదువు రానివారికి ఈయవలయునని అర్థము చెప్పరుకదా! కాబట్టి అంగాశ్రితోపాసనలతో కూడిన కర్మలనే చేయవలయు అను పూర్వపక్షమునకు సమాధాన మీ సూత్రము చెప్పుచున్నది :-

'య దేవ విద్యయా' = య దేవ విద్యయా అను శ్రుతి, ఇతి హి = తిన్నగా తెలియకచేసినను-విద్యా రహితముగ చేసినను శక్తి కలదగునని చెప్పుచున్నది కదా!

చదువనివానికంటె చదివినవాడు మెరుగయినటులు తిన్నగా తెలిసికొనక చేసిన కర్మిష్ఠునికంటె తెలిసకొని చేసిన కర్మిష్ఠుడు మెరుగని వేరుగా చెప్పనక్కరలేదు. ఇటులయినను విద్యరహితమయిపోయెనే యనికర్మను మానరాదు. (అందరును తెలిసికొనియే చేయగలరా?)

కొన్ని శ్రుతులు కర్మసామాన్యమును చెప్పినవి. అనగా కర్మవిశేషమును- విద్యాసహితమగు కర్మను - చెప్పలేదు. అయినప్పటికిని విద్యారహితమగు కర్మయు ఫలమీయగలదే యయినను దొడ్డఫలమగు జ్ఞానమును కలిగింపలేకపోవచ్చును అని అనుకొందురా ? అటులనుకొనరాదు కర్మ జ్ఞానమునకు కారణమని అనుచున్నాముకద! ఈ కారణత్వము విద్యాసహితములగు కర్మలవలనయొక్కువ ఫలముకలుగుననియు, విద్యారహితములగు కర్మలవలన తక్కువఫలముకలుగుననియే అర్థము చేసికొనవలయునుగాని సామాన్యశ్రుతిని విశేషశ్రుతిగా గ్రహింపనొప్పదు. ఏలయనగా - 'య దేవ విద్యయా కరోతి' అను శ్రుతి విద్యాసహితమగు కర్మ వీర్యవత్తరము అని చెప్పుచున్నది. విద్యారహిత కర్మ ఉన్నది. విద్యాసహితకర్మయు నున్నది. ఈ రెంటిలో విద్యా సహితమగుకర్మ ఎక్కువఫలము కలదగునని 'వీర్యవత్తర' శబ్దములోని తరప్‌ ప్రత్యయము చెప్పును. వీర్యవత్తరమను ఈపదము తనకు సంబంధపడిన పనిలో ఫలాధిక్య ముండునని చెప్పినను విద్యారహితమగు కర్మ విఫలమగునని చెప్పదు. విద్యాసహితమగుకర్మఫలాధిక్యము కలిగించునెడల విద్యారహితమయినను కర్మ ఫలము కలిగించు ననుటలో సందియములేదు. అది వీర్యవత్తరము; ఇది వీర్యవత్తు. వీర్యవత్తమనగా తన పని తాను చేయగలదనియే యర్థము కదా! కావున విద్యతో కూడినకర్మగాని విద్యతోకూడని కర్మగాని మోక్షము కోరువాడు జ్ఞానము కలుగువరకు అనియుతముగ చేయవచ్చును. అది ప్రతిబంధకములగు పాపముల పోగొట్టి చిత్తశుద్ధినిచేకూర్చి శ్రవణ మననాదులందు ప్రవేశము కలిగించి జ్ఞానమూలమునముక్తి నొసగును.

(1) 'య దేవ విద్యాయా కరోతి' (దీనికి అర్థము దీనికి వెనుకనేకలదు.) 'య దహరేవ జహోతి త దహః పునర్‌ మృత్యు మపజయతి' - (ఇటు లెరిగినతడు) వ్రేల్చిననాడే అనగా హోమము చేసిననాడే మృత్యువును ఓడించును (జయించును).

(2) 'బుద్ధ్యా యుక్తో యయా పార్థ! కర్మబంధం ప్రహాస్యసి' = అర్జునా! ఏ జ్ఞానముతో యుక్తుడవై కర్మ బంధమును వదిలించుకొనగలవో ఆ జ్ఞానమును విను! 'దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ' = 'అర్జునా!జ్ఞానముకంటె కర్మ కొండంత తక్కువ.'

(3) 'త మేతం యజ్ఞేన వివిదిషంతి' = ఆ యితనిని యజ్ఞముచే తెలియగోరుచున్నారు (పొందగోరుచున్నారు).

పుట 79 'పరమేశ్వర'

పరమేశ్వర ప్రీత్యర్థమ్‌ = పరమేశ్వరునికి ప్రేమకలుగుటకు గాను.