Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము .

కర్మకాండ

ప్రయోజనము.

హిందువుడు ప్రతిదినము నాచరింపవలసిన కృత్యములును, అపుడపుడు నిర్వర్తింపవలసిన కర్మలును, ఈయధ్యాయమున సంగ్రహముగా దెలుపబడును. ఇందు మొదటివానికి నిత్యకర్మలనియు, రెండవవానికి నైమిత్తికకర్మలనియు పేర్లు.

ప్రతిదినము మనమాచరింపవలసిన కృత్యములలోని వేశములనుకూడ హిందూమతము ధర్మరూపమున విధించుచున్నది. ''స్నానముచేయుట మొదలుగాగల కర్మలుగూడ మతముక్రిందికే వచ్చునా?'' యని కొందరు పరిహసింతురు; కాని హిందూమతములో నిట్టివిధులు చేయబడుట మన సౌకర్యము కొఱకును, లాభముకొఱకును; ఐహికాముష్మికాభివృద్ధి కొఱకును నవి చెప్పవలసియున్నది. హిందూమత మనునది వేరుగా నొక చోటనుండి, మనజీవిత మనునది మరియొకచోట లేదు. మన జీవితములో హిందూమతము పెనవేసికొనిపోయినది.

ఈ కర్మల యావశ్యకతను గుర్తించుటలో మన మీ క్రింది యంశములను జ్ఞప్తియం దుంచుకొనవలెను.

1. ఈకర్మవిధులు కొన్ని మన యారోగ్యమునకు సంబంధించినవిగా నున్నవి. ఆరోగ్యము భౌతికవిషయము కావున మతములోనిదికాదని తలంపరాదు. ఏలన ధర్మమును నాచరించుటకు శరీరమే మొదటి సాధనము. ''శరీరమాద్యం ఖలు ధర్మసాధనం'' అని ప్రాచీనులు నుడివియున్నారు. ఎవడైనను శరీరమును ధర్మసాధనకు తగనిదానినిగా జేసికొనినచో, వాడు ధర్మహాని జేసినాడన్నమాట. కావున నిట్టి విధులుగూడ మతములోనికే వచ్చును. శరీరమును సుస్థితిలో నుంచుటకు వైద్యశాస్త్రము చాలదాయన, నొక యంశమును జెప్పవలసి యున్నది. ధర్మశాస్త్రములలో జెప్పబడిన యారోగ్యవిధు లన్నియు, శరీరమును మంచి స్థితిలో నుంచుటకు తోడు మనలో సాత్వికగుణమును వృద్ధినొందించునట్లు కూడ నున్నవి. కావున నీ విధులను బాలించుటవలన రెండు విధములయిన ధర్మనిర్వహణము గలుగుచున్నది.

2) మన మహర్షులు చేసిన స్నాన, పాన, భోజనాది నియమముల మహత్త్వము మనస్థూలదృష్టికి సరిగా నర్థము కాకపోవచ్చును. ఇందులకు కొన్ని ఉదాహరణములు రెండవ యథ్యాయమున నీయబడినవి. కావున మన స్థూలదృష్టికి నర్థరహితములుగ గన్పట్టినను, మనమతగ్రంథములలో విధింపబడిన యాచారములు విడువదగినవి కావు.

(3) నిత్యనైమిత్తికకర్మలలో వాడబడు మంత్రములు చాలశక్తిగలవగుటచే వానివలన విశేషమైన ఫలము గల్గును. మంత్రశక్తి పూర్వాధ్యాయములలో గొంత చెప్పబడినది. వేదమంత్రములేకాక, ఋషివిరచితములైన శ్లోకములు గూడ శక్తిమంతములే. వీనినుచ్చరించిన మహర్షుల యాధ్యాత్మిక శక్తి యింకను, నా యక్షరసంపుటిలో గలదు. అపార తపస్సుచే సిద్ధిని బడసినవారి వాక్కునకును, సామాన్యుల వాక్కునకును ఫలితములో చాల భేదముండును. నేడు మనదేశములో సర్పాది విషయములకుగాని, కొన్ని శారీరకరోగములకుగాని వేయబడు మంత్రములు అద్భుతముగా వెంటనే ఫలించుట యందరము చూచుచున్నాము. మంత్రములు ఫలించుటలోగల ముఖ్యకారణము ఆ మంత్రములను మనకందజేసినవా రాయక్షరసంపుటిలోనికి ప్రవేశింపజేసిన యఖండమైన ఆత్మబలమని చెప్పవచ్చును. మనలోగూడ గొంత యేకాగ్రత యుండవలసిన యవసరమున్నది. కాని యంతకంటెను ముఖ్యమైనది యా యక్షరసంపుటిలో నిదివరలోనే సిద్ధమైయున్నశక్తి, నేడు క్రొత్తగ నొకడు ఘోర తపస్సుజేసి నూతనాక్షరసంపుటిలో మహిమను దెచ్చుట సాధ్యమే. కాని నిత్యము మనమట్టి ఘోరతపస్సు చేయలేము. కావున నిదివరలోనే సిద్ధమైయున్న మహిమగల యక్షర సంపుటి నాశ్రయింపక తప్పదు. సంధ్యావందనాదులలోని మంత్రములనుగాని, వివాహాదులలోని మంత్రములను గాని మార్చరాదనుటకు గల యనేకకారణములలో నిదియొకటి. వివాహాదులలోని మంత్రములను దేశభాషలోనే జెప్పరాదా యనువారు ముఖ్యముగా నీయంశములను జ్ఞప్తియందుంచుకొనవలెను.

(4) కర్మకాండలోని క్రియాకలాపముకూడ ముఖ్యమైనదే. తంత్రగ్రంథములలో చెప్పబడిన ముద్రలు యంత్రములు మున్నగువాని కెట్టిశక్తిగలదో, ఇంచుమించుగా నట్టి శక్తియే యీకర్మకలాపమునకు గలదు. ఇదిగూడ మంత్రముయొక్క శక్తివలెనే సూక్ష్మమైనది. మరియు నీ క్రియా కలాపముగూడ నుండుటచే మనదృష్టి చాలవరకు మనము చేయు కర్మయందు లగ్నమగుట కవకాశము కలుగును.

నిత్యనైమిత్తిక కర్మల నాచరించుటచే, నిదివరలో సంపాదింపబడిన పాపము క్రమక్రమముగా నశించును. ఈ కర్మల యావశ్యకతను కేవలము కర్మవాదులైన పూర్వమీమాంసామతస్థులే గాక, వేదాంతులుగూడ నంగీకరించి యున్నారు. శ్రీ శంకరాచార్యులవారుగూడ నిత్యనైమిత్తిక కర్మలు గృహస్థుడు తప్పక చేయదగినవేయని చెప్పినారు. ఈకర్మలును ఫలాపేక్షారహితముగ చేయబడిన జ్యోతిష్టోమాదిక్రతువులునుగూడ చిత్తశుద్ధిని గల్గించును. చిత్తశుద్ధి జ్ఞానమున కావశ్యకము. కావున జ్ఞానమార్గములోనికి పోదలచినవాడు ముందుగా కర్మ నాచరింపవలయును.

దినప్రారంభకృత్యము.

హిందువుడు నిత్యము నాచరింపవలసిన కొన్నివిధుల నిపుడు చూతము. ఇందు కొన్ని ముఖ్యములు, కొన్ని యముఖ్యములు గావచ్చును. కాని విధులన్నియు తప్పక పాటింప దగినవే.

సూర్యోదయమునకు 1 ½ గంటల పూర్వమే నిద్రనుండి లేవవలయును. ఆకాలమునకు బ్రాహ్మముహూర్తమని పేరు.

''బ్రాహ్మేముహూర్తే బుధ్యేత'' (మను 4-92)

అని మనువు చెప్పినాడు. ఈ కాలము చాల అమూల్యమైనది. ఈసమయమున నింకను నిద్రించుట శరీరమున కస్వస్థత కలిగించునని వైద్యులు చెప్పుచున్నారు. మఱియు నీసమయమున బుద్ధి నిర్మలముగానుండి బాగుగ వికసించును. 'బ్రాహ్మి'యనగా 'సరస్వతి'; అనగా మనలోని బుద్ధి. బుద్ధి ప్రబోధము చెందుకాలము గావున దీనికి బ్రాహ్మముహూర్తమని పేరు.

ఈ సమయమున లేచి వెంటనే ధర్మార్థముల నాలోచించి, అనగా ధర్మమును, దానికి విరుద్ధముగాకుండునట్లు ధనము సంపాదించు విధమును నాలోచించి వేదతత్వము నొక్కసారి చింతింపవలెనని మనువు చెప్పినాడు. ప్రార్థనము సంక్షేపముగా జేసికొనపలెనని చాలమంది స్మృతికారులు చెప్పినారు.

అంత జాగుచేయక శౌచవిధులను నిర్వర్తింపనలయును. ఇందులకు కొంతదూరము నడచి గ్రామమునకు బైటకు వెడలవలయును, పిమ్మట దంతధావనము చేయవలయును.

ఉత్తరేణి, బిల్వము, జిల్లేడు, ఉదుంబరము, నేరేడు, వేప-ఈ వృక్షముల పుల్లలు దంతధావనమునకు శ్రేష్ఠములు.

పిమ్మట స్నాన మాచరింపవలయును. భగవంతుని స్మరించుచు, శాస్త్రములో చెప్పబడిన విధితో స్నానమాచరింపవలెను. వీలైనంతవరకు నదులలో స్నాన మాచరింపవలెను. పిమ్మట శుద్ధమైన వస్త్రములను, అనగా అంతకు పూర్వదినమున క్షాళనచేసి యారవేయబడి యెవ్వరిచేతను స్పృశింపబడియుండని వస్త్రములను ధరింపవలెను. కట్టుబట్టయు, ఉత్తరీయమును ధరింపవలెను. ధౌతవస్త్రధారియై తన కుల సంప్రదాయసిద్ధమైన విధమున విభూతిధారణమునో, ఊర్ధ్వపుండ్రధారణమునో గావింపవలెను.

సంధ్యావందనము

ఇవి యన్నియు నగునప్పటికి, ఒక గంటకాలమునకు మించరాదు. ఇది యత్యంతము ముఖ్యము. ఏలయన, స్నానానంతరము సంధ్యావందనము ప్రారంభించి, యర్ఘ్యప్రదానము చేసి గాయత్రీమంత్ర జపమువరకు వచ్చునప్పటికింకను నక్షత్రము లుండవలయును. సూర్యోదయమునకు సుమారు అరగంట పూర్వము నక్షత్రములు లుప్తమగును. కావున సూర్యోదయమునకు అరగంట కాలమునకు పూర్వమున సంధ్యోపాసనమును ప్రారంభింపవలయును.

నక్షత్రముల యునికియొక్క చివరికాలము మొదలుకొని, సూర్యోదయముయొక్క ప్రారంభకాలమువరకు గల అంతరమునకు సంధ్యాకాలమని పేరు. కాన, నక్షత్రములుగాని, సూర్యుడుగాని ప్రకాశింపని కాలమునకు సంధ్యయని కూడ చెప్పవచ్చును. ఈకాలములో నద్భుతమయిన పవిత్రత, శక్తి కలవు. దీనిని వ్యర్థముగా గడుపువాడు బుద్ధిహీనుడు. సంధ్యాకాలనిర్వచన మీ క్రిందిశ్లోకములో దక్షస్మృతిలో చేయబడినది.

''అహోరాత్రస్య యస్యంధిః నూర్యనక్షత్ర వర్జితః,

సాతు సంధ్యా సమాఖ్యాతా మునిభిస్తత్వ దర్శభిః.

పైని దెల్పినట్లు నక్షత్రములుండగనే గాయత్రీమంత్రమును జపించుటకు ప్రారంభించి, సూర్యోదయ మగువరకు నట్లు జపించుచు నుండవలయును. ఈయంశమును సమస్త ధర్మగ్రంథములును జెప్పుచున్నవి.

''పూరాం సంధ్యాం జపం స్తిష్ఠే

త్సావిత్రీ మార్కదర్శనాత్‌.'' (మను. 2-104)

అని మనుస్మృతిలో చెప్పబడినది. కావున ప్రతిదినము ఉదయమున సరియైన సంధ్యాకాలములో కనీసము 24 నిమిషములు సావిత్రిని జపింపవలయును. ఈకాలములో సుమారు మూడు అష్టోత్తరశతములు పూర్తియగును. ఎంత హెచ్చుకాలము జపించిన నంతశ్రేయస్సు గల్గును; సావిత్రీ జపమును త్యజించువాడు ద్విజుడు కాజాలడు.

బ్రాహ్మణునకు గాయత్రి యత్యంతము ముఖ్యము. గాయత్రియే బ్రాహ్మణుని జీవితము. గాయత్రీ సారములేని బ్రాహ్మణుడు తోలుబొమ్మవంటివాడు. గాయత్రీ మంత్రము యొక్క శక్తిస్థలాంతరమున కొంత చెప్పబడినది. అర్థమునుబట్టిచూచినను గాయత్రిని మించిన ప్రార్థనగాని, మంత్రముగాని మరియొకటి యుండజాలదు. మిన బుద్ధులను ప్రేరేపించు దివ్యతేజస్సును ధ్యానించుటకంటెను పవిత్రమైనది యేది యుండును? మనబుద్ధి యపమార్గమున బోకుండ నిరంతరము సరియైన మార్గమున నడువవలయునను ప్రార్థనము కంటె గొప్పప్రార్థన మేముండును? మన మనస్సు పాపముల జోలికి బోకుండ కాపాడుటకిట్టి ప్రార్థనముకంటెను గొప్ప రక్షక మేమియుండును? ఏవిధముగ చూచినను గాయత్రి వంటి రక్షణము మరియొకటి ద్విజునకులేదు. శూద్రులు గాయత్రీ మంత్రార్థ బోధకములగు పురాణ శ్లోకములను పఠింపదగును. అట్టి వనేకములు గలవు. వానిని శిష్టులవలన తెలిసికొనదగును.

తపస్సు ప్రధానలక్షణముగాగల బ్రాహ్మణునకు గాయత్రి యత్యంతము ఉపాస్యము. బ్రాహ్మణుడు గాయత్రీ మాత్రసారుడైనను బ్రాహ్మణత్వమును కోలుపోడని యిదివరలో చూచి యుంటిమి.

గాయత్రికంటెను గొప్ప శోధనములేదని ''గాయాత్ర్యాస్తుపరం నాస్తిశోధనం'' అని సంపర్తస్మృతి చెప్పుచున్నది.

ఇట్లు సావిత్రిని జపియించి సూర్యోపస్థానాదికమును గావించి సంధ్యను ముగింపవలయును. ఈ సంధ్యను గ్రామము బయట నేనది యొడ్డుననో చేయుట మంచిది.

ద్విజుడు సంధ్యావందనము పరిత్యజించినచో భ్రష్టుడగునని సర్వస్మృతులును దెలుపుచున్నవి.

సంధ్యావందనము చేయనివా డేకర్మ చేయుటకును అర్హుడుకాడు; ఏకర్మచేసినను సరిగా ఫలింపదు.

సంధ్యాహీనోశుచిర్నిత్యమన్హరస్సర్వకర్మసు,

యదన్యత్కురుతే కర్మ వతస్య ఫలభాగ్భవేత్‌.

ఋషులు దీర్ఘకాలము సంధ్యనుపాసించిన వారగుటచే దీర్ఘాయువును, ప్రజ్ఞను, యశస్సును, కీర్తిని బ్రహ్మవర్చస్సును పొందుచుండిరని మనువు చెప్పుచున్నాడు.

ఋషయో దీర్ఘ సంధ్యత్యాత్‌ దీర్ఘమాయురవాప్నువన్‌,

ప్రజ్ఞాం యశశ్చ కీర్తించ బ్రహ్మవర్చన మేవచ. (4-94)

ఉచితకాలములో నిట్లే మాధ్యాహ్నిక సంధ్య నాచరింపవలయును. సూర్యోదయానంతరము ఆఱుగడియలకు లోపల మధ్యాహ్నముగా గణింపబడదు.

ఇతర నిత్యకర్మలు

ప్రతిదినమును, ఉదయము సంధ్యావందన మైనపిమ్మట గృహస్థు డవశ్యము చేయవలసిన కర్మ అగ్న్యౌపాసనము.

'అగ్నిహోత్రంచ జుహుయా

దాద్యన్తే ద్యునిశోస్సదా' (మను. 4-52)

ఈ ¸°పాసనము గృహ్యాగ్నిలోనే చేయబడును. గృహ్యాగ్ని వివాహముతో ప్రారంభమగును. ఈ ¸°పాసన విధానమును, ఈక్రింది తెలుపబడిన యితరకర్మల విధానములును గృహ్యసూత్రములలో వివరింపబడినవి. పండితులైన బ్రాహ్మణులవలన వానిని తెలిసికొని యాచరింపవలయును.

గృహస్థు డింటలేనిచో గృహిణియైనమ, అగ్నిహోత్రములో మంత్రరహితముగా హోమము చేయవలయును.

'అపివా స్త్రీ జుహుయాన్మంత్రవర్జం' అని భరద్వాజుడు చెప్పినాడు.

ఆహోమములో తండులములు, యవలు, పాలాశ సమిధలు మున్నగునవి యుపయోగింపబడును.

అగ్న్యౌపాసనమైన పిమ్మట, బ్రహ్మయజ్ఞము చేయవలయును. ఇందు దేవతలకు, దేవపత్నులకు ఋషులకు, ఋషిపత్నులకు, పితరులకు, కాండర్షులకు తర్పణములు గావింపబడును. ఈసమయముననే మహర్షులు మనకందచేసిన వేదములు, వేదాంగములు మున్నగువానిలోని కొన్ని భాగములు పఠించి వారి ఋణము తీర్చుకొనవలయును.

మృతపితృకుడై వాడు పితృతర్పణము గావింపవలయును.

ఆపిమ్మట దేవతార్చనము గావింపవలయును. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు- అను పంచాయతనము నర్చించుట స్మార్తబ్రాహ్మణులలో నాచారముగ నున్నది. కులసంప్రదాయములనుబట్టి దేవతార్చనా విధానము మారవచ్చును.

స్త్రీలు, శూద్రులుకూడ దేవతార్చన చేయవలయును, కాని వేదమంత్రము లేక యాగమవిధానమున చేయవలయును.

''స్త్రీశూద్రాణాంచ భవతినామ్నానై దేవతార్చనం

సర్వేచాగమమంత్రేణ కుర్యు ర్వేదానుసారిణా''

అని స్మృత్యర్థసారమున చెప్పబడినది.

అనంతరము వైశ్యదేవ విధానము వచ్చును. ఇందు దేవయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మ (ఋషి) యజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము అనునవి హోయాదిరూపమున నాచరింపబడును.

ఈదేవ, పితృ, ఋషి, భూత, మనుష్యయజ్ఞములు పంచమహాయజ్ఞములని చెప్పబడును. వీని విధానమును గూడ పండితులైన బ్రాహ్మణులవలన తెలిసికొని వీనిని నిత్యము నాచరింపవలయును. అన్ని స్మృతులలోను పంచమహాయజ్ఞముల ప్రశంస విశేషముగా గలదు. ఆశ్రమధర్మాధ్యాయమున నీ పంచమహాయజ్ఞములనుగూర్చి కొంత విచారించి యుంటిమి.

పంచమహాయజ్ఞములను శూద్రులుకూడ నాచరింపవలసినదేకాని, వారు వేదమంత్రముల నుపయోగింపక యాచరింపవలయును. వైశ్యదేవాదులయందు శూద్రుడు వేదమంత్రమునకు బదులు తత్తర్దేవతాపదమును చతుర్థ్యంతమున మనస్సులో ధ్యానించి ''నమోనమః'' అనవలయునని ఉశనసుడు చెప్పుచున్నాడు.

''అస్యవైశ్వ దేవేషు తత్తద్దేవతాపదం,

చతుర్ధ్యన్తం మనసాథ్యాత్వా నమోనమ ఇత్యేవం,

రూపోమంత్రోనుజ్ఞాతో దర్మైరితి.''

అహ్నిక కర్మానుష్ఠానానంతరము భోజనము చేయవలయును. భోజనవిషయమున పాటింపదగిన యాచారము లనేకములు గలవు. ఒకపూట వండినది మరొకపూట భుజింపరాదు. ప్రవర్తనము సరిగ లేనివారు, సంస్కారములను పొందనివారు, క్రిందివర్ణములవారు స్పృశించిన యన్నమును తినరాదు. ఆహార ద్వారమున రజస్తమోగుణములు, దుర్గుణములు సులువుగ సంక్రమించును. ఆహారమును గూర్చి మన శిష్టులలో ననేక నియమము లున్నవి. వానికి శాస్త్రాధారము లేదని త్రోసివేయరాదు. అనేకములకు శాస్త్రాధారమున్నది. కొన్నిటికి లేకపోయినను, శాస్త్రవిరుద్ధములు కాకపోవుటచే నీ శిష్టాచారములు ప్రమాణములే యగునని ప్రథమాధ్యాయములో చెప్పబడిన యంశములనుబట్టి తెలియుచున్నది గాదా!

దినమునకు రెండుసార్లే భోజనము చేయవలయును. రెండు భోజనములకు నడుమ నేమియు తినరాదని మనువు చెప్పుచున్నాడు. ఆరోగ్యవిషయమున దీనిప్రాముఖ్య మత్యధికము.

గృహస్థుడు ప్రతిదినము పోష్యవర్గమునకు తప్పక భోజనము నిడవలయునని స్మృతులు చెప్పుచున్నవి. అతిధులు, తల్లిదండ్రులు, సేవకులు మున్నగువారు పోష్యవర్గములోనివారు.

ఇట్లు సుమారు 12 గంటల ప్రాంతమున భోజనముచేసి, లౌకిక వ్యాపారములను చూచుకొని, సాయంకాలమున స్నానముచేసి సూర్యుడుండగా ప్రారంభించి, నక్షత్రదర్శన మగువరకును సాయంసంధ్య నుపాసించి నక్షత్రదర్శనమైన పిమ్మట నుపస్థానముచెప్పి అగ్నిహోత్ర మాచరించి భుజింపవలయును.

పగటిపూట మిగిలిన సమయములో కొంతభాగమును దేహధారణమున కవసరమగు ధనము నార్జించుటయం దపయోగించుకొనవలయును. మిగిలినకాలములో కొంతభాగము పురాణతిహాసములను పఠించుటలో వినియోగింపవలయును. ద్విజుడు ప్రతిదినము వేదము నెంత యధ్యయనము చేసిన నంత మంచిది. బ్రాహ్మణుడు వేదమును ముఖ్యముగ నధ్యయనముచేయుచు నొకరికి చెప్పుచుండవలయును. ఈస్వాధ్యాయ ప్రవచనములచేతనే మానవుడు తరింపగలడనియు, నింకేమియు నక్కరలేదనియు, తైత్తిరీయోపనిషత్తు (1-9) చెప్పుచున్నది.

''స్వాధ్యాయప్రవచనే ఏవేతినాకో మౌద్గల్యః''

సంస్కారములు

ఇవిగాక ఆచరింపదగినవి ముప్పదియైదు సంస్కారములు కలవు. ఇదివరలో తెల్పబడిన పంచమహాయజ్ఞములును ఈ 35 సంస్కారములును కలసి చత్వారింశత్సంస్కారములుగ గౌతమధర్మ సూత్రములలో పేర్కొనబడినవి. (గౌ. ధ. 1-8, 14, 15, 16, 17, 18, 19, 20, 21).

పంచమహాయజ్ఞములు కాక మిగిలిన సంస్కారముల స్వరూపము నిపుడు సంగ్రహముగ చూతము.

(6) గర్భాధానము : దంపతులు సంతానము కనగోరి, గర్భశుద్ధికొరకై, వంశాభివర్థకుడైన సత్పుత్రుడు గర్భమందు ప్రవేశించుటకై దేవతలను ప్రార్థించు రూపమున చేయు సంస్కారమునకు గర్భాధానమనిపేరు. కావున నిది పుట్టబోవువాని నిమిత్తమై చేయబడు సంస్కారము.

(7) పుంసవనము : గర్భోత్పత్తి యైనపిమ్మట గర్భస్థ శిశువు పురుషుడగుటకై చేయబడు సంస్కారమునకు పుంసవనమని పేరు.

(8) సీమంతోన్నయనము : గర్భముయొక్క నాల్గవ మాసమందు మాతకు పాపిటదిద్ది, కేశమున పుష్పము లిడిచేయబడు సంస్కారమునకు సీమంతోన్నయన మని పేరు. దీనివలన శిశువునకు దృఢత్వమేర్పడును. ఇది మొదలు తల్లి సుఖియైన కుమారుడు జనించుటకై నిత్యసుఖజీవనమును గడపుచుండును. ఈ సంస్కారము ప్రథమగర్భమునకు మాత్రమే.

(9) జాతకర్మ : ఇది పుత్రుడు పుట్టగానే తండ్రిచేత చేయబడు సంస్కారము. దీనివలన పుత్రుడు దీర్ఘాయుష్మంతుడగును.

(10) నామకరణము : ఇది పుత్రుడు జనించిన పదునొకండవ దినమున జరుపబడును. ఈ సమయమున పేరుపెట్టబడును. పురుషులకు సరిసంఖ్యగల యక్షరములతో గూడిన పేర్లను, స్త్రీలకు బేసిసంఖ్యగల యక్షరములపేర్లను బెట్టవలయును. నాలుగువర్ణములవారికిని, నాయాగుణకర్మలకు దగిన పేర్లుండవలయును. ఆపేర్లకు చివర వర్ణద్యోతకము లయిన పదము లుండవలయును. అనగా పేరునకు పిమ్మట బ్రాహ్మణునకు శర్మయనియు, క్షత్రియునకు వర్మయనియు, వైశ్యునకు గుప్తయనియు, శూద్రునకు దాస యనియు నుండవలయును.

(11) అన్నప్రాశనము : ఆఱవనెలలో గాని సంవత్సరము లోవున నెప్పుడుగాని యీ సంస్కారము చేయబడును.

(12) చౌలము : దీనినే చూడాకర్మయందురు. ఇదియే కేశఖండనము, కులాచారమునుబట్టి యిది మూడవసంవత్సరమున గాని, ఐదవ సంవత్సరమున గాని జరుగును.

(13) ఉపనయనము : ఆశ్రమ ధర్మాధ్యాయమున దీని స్వరూపము కొంత తెలుపబడినది. ఇది స్త్రీలకు శూద్రులకు లేదు. పై సంస్కారములును వారికి వేదమంత్రములతో జరుగవు. శూద్రులకు వివాహములకు వేదమంత్రములతో జరుగదు.

(14), (15), (16), (17) నాలుగు వేదవ్రతములు : ఇవి ద్విజబ్రహ్మచారికి వేదము చక్కగా నభ్యాసమగుటకు జేయబడు సంస్కారములు.

(18) సమావర్తనము లేక స్నాతకము : ఇదియు ఆశ్రమధర్మాథ్యాయములో జెప్పబడినది.

(19) వివాహము : ఇదిగూడ నాయధ్యాయములోనే చెప్పబడనిది.

(20) నుండి (26) వఱకు : సప్తపాకయజ్ఞములు: ఇందు స్థాలిలో వచనముగావింపబడిన కొన్నిపదార్థములు హోమము చేయబడును. అష్టకము, పార్వణము, శ్రాద్ధము, శ్రావణి, ఆగ్రహాయణి, చైత్రి, ఆశ్వయుజియని వీనినామములు.

(27) నుండి (33) వఱకు : సప్తహవిర్య యజ్ఞములు: ఇవి శ్రౌతకర్మలు. ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అను త్రేతాగ్నులలో గావింపబడినవి. అగ్న్యాధేయము. అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసేష్టులు నిరూఢ పశుబంధము, సౌత్రామణి, ఆగ్రయణము, చాతుర్మాస్యలు, అని వీని పేర్లు.

(34) నుండి (40) వఱకు సప్తసోమసంస్థలు : ఇవి మహాతంత్రముతోను, విపుల క్రియాకలాపముతోను గూడి చాల దినములు నిర్వర్తింపవలసిన శ్రౌతకర్మలు, అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్థ్యము, షోడశి, వాజిపేయము, అతిరాత్రము, అప్తోర్యామము అని వీనిపేర్లు. ఈ శ్రౌత కర్మలు స్వర్గాదులను కోరి చేయబడుచో కామ్యము లనబడును. కాని యివి నిష్కామముగ నాచరింపబడి చిత్తశుద్ధి ద్వారా మోక్షహేతు వగును. ఎట్లయినను గౌతముడు వీనిని సంస్కారములలో లెక్క పెట్టినాడు.

నైమిత్తిక కర్మలు

పైని తెల్పిన సంస్కారములలో కొన్ని నైమిత్తిక కర్మలుగనే పరిగణింపదగును. నైమిత్తిక కర్మలలో మృతపితృకుడు తప్పక యాచరింపవలసినది శ్రాద్ధము. ఇది చేయనివాడు పతితుడగునని శాస్త్రములు చెప్పుచున్నవి. పితరులకు ఔర్ధ్వదైహిక కర్మలను ప్రత్యాబ్దికమును ఆచరింపనివాడు వర్ణభ్రష్టుడు, ధర్మభ్రష్టుడు అగును. అమావాస్యాతితర్పణము తప్పక యాచరింపదగినవి. సూర్యచంద్రగ్రహణముల సందర్భమున స్నానదానములు చేయవలయును. అవియు నైమిత్తికకర్మలే. కాశీ, ప్రయాగ, రామేశ్వరాది పుణ్యక్షేత్ర సంసేవనమును పాపక్షయముకొఱకు, ఉత్తమగతి ప్రాప్తి కొరకు తప్పక చేయదగినది.

కర్మకాండ నంతను నీగ్రంథములోని యొకయధ్యాయమున వివరించుట సాధ్యముకాదు. హిందూమతమునకు చెందినవాడు తప్పక యాచరింపవలసిన విధులలో ముఖ్యమైనవి కొన్నిమాత్ర మిందు నూచింపబడినవి.

Hindumatamu    Chapters    Last Page