Acharyavaani - Vedamulu     Chapters   Last Page

19. వేదాంగములు : జ్యోతిషం

వేదముల - నేత్రములు :

ఇప్పటి వరకూ శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తమనే నాలుగు వేదాంగాల గురించి చెప్పాను. అయిదవది : జ్యోతిషం.

వేదపురుషునికి నేత్రం వంటిది జ్యోతిషం. ఈ శాస్త్రానికి మూడు విభాగాలున్నాయి. లేక, మూడు స్కందాలున్నాయి. అందువల్లనే ఈ శాస్త్రాన్ని ''స్కంద త్రయాత్మక'' మంటారు. స్కందమంటే చెట్టు యొక్క ముఖ్యమైన శాఖ.

గర్గ, నారద, పరాశరాదులెందరో జ్యోతిషం గురించి గొప్ప గ్రంథాలు వ్రాశారు. ఈ శాస్త్రంలో ఒక విభాగాన్ని తీసికొని దివ్యశిల్పి మయునకు సూర్యుడు భోదించాడంటూ ఒక గ్రంథముంది. దాని పేరు ''సూర్య సిద్ధాంతం''. దేవతలూ, ఋషులూ రచించిన గ్రంథాలెన్నో యున్నాయి. మానవులు రచించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. వరాహమిహిరుడెన్నో గ్రంథాలు వ్రాసినట్టు ప్రసిద్ధి. ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు కూడ ఈ శాస్త్రానికెంతో సేవ చేశారు. ఇటీవలి కాలంలో సుందరేశ్వర శ్రౌతి అన్న పండితుడు, ''జ్యోతిష కౌస్తుభ'' మన్న గ్రంథాన్ని రచించారు.

కళ్లులేని వాడు అంధుడు. దగ్గరగా ఉన్న వాటిని స్పృశించి తెలుసుకోవచ్చు. కాని దూరంగా ఉన్నవాటిని కళ్లతోనే చూడాలి. మానవ నేత్రాలు దగ్గరవాటినీ, దూరంగా ఉన్నవాటినీ చూచి గుర్తించినట్టే, జ్యోతిషశాస్త్రం దూరంగా ఉన్న గ్రహాలను, నక్షత్రాలను వాటి పూర్వపు గతులనూ, భావిగతులను చూడటానికి ఉపయోగపడుతుంది. గ్రహాలు ఇప్పుడెట్లా ఉన్నాయో తెలిసికోవటం చూపుతోనే సాధ్యం - దీనికి జ్యోతిషజ్ఞాన మక్కరలేదు. కాని ఎప్పుడో గ్రహాలస్థితి ఎట్లా ఉండేదో తెలిసికోవటానికి జ్యోతిష శాస్త్రమవసరమే. రంగులను గుర్తించటానికి స్పర్శ జ్ఞానం చాలదు, కళ్లుకావాలి. ఇప్పుడైనా ఒక గ్రహం కనబడితే దాని ఉనికి బట్టి మనపై దాని ప్రభావమేమిటో ఎరుగలేము. దీనికి జ్యోతిషశాస్త్రమే శరణ్యం. అందువల్లనే వేదపురుషునికి నేత్రమన్నారు ఈ శాస్త్రాన్ని.

వైదిక కర్మలను నిర్వహించటానికి గ్రహాల స్థితిని తెలుసుకోవాలని నియమాలున్నాయి. వివాహాది కార్యాలకు ముహూర్తాలని నిర్ణయించేప్పుడు గ్రహాలసానుకూలత చూస్తారు. జ్యోతిషాన్ని ''నయన''మని కూడ అంటారు, అంటే 'కన్ను' అని అర్థం. ''నయ'' అంటే ''దారి చూపట''మని అర్థం. గ్రుడ్డివానికి ఎవరైనా దారి చూపాలి. కళ్లున్న వాళ్లకి ఆ కళ్లే దారి చూపుతాయి. వైదిక కర్మలని నిర్వహించటానికి ముహూర్తాలను తెలిపి, జ్యోతిషం వాటిని నిర్వహించటానికి కంటివలె మార్గాన్ని చూపుతుంది.

జ్యోతిషం, ఖగోళశాస్త్రం :

ఆధునిక ఖగోళశాస్త్రం ఆయా గ్రహాల ఉనికిని తెలియజేయడానికే పరిమితమయినది. ఆ గ్రహాల స్థితి ప్రపంచాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది? మనపై దాని ప్రభావమేమిటి? ఆ ప్రభావం మనకి సానుకూలమవటానికి ఏమి చెయ్యాలి? ఈ శాస్త్రంతో కలిసి జ్యోతిషం ఇందుకు ఉపయోగిస్తుంది.

ఒక్కొక్క గ్రహం క్రింద, నక్షత్రం క్రింద, ఒక్కొక్క తిథిలో జరిపే కర్మల సఫలతా విఫలతలను తెలిసికోవటానికి ఏర్పడింది జ్యోతిషశాస్త్రం ఆదిలో. అంటే ఏయే కర్మలు చేయటానికి ఏయే సమయాలు సానుకూలమో తెల్పటమే జ్యోతీషశాస్త్ర ముఖ్య ప్రయోజనం. అందువల్లనే ఈ శాస్త్రాన్ని వేదాలలో భాగంగా, వేదాంగంగా రూపొందించారు. గ్రహాల గతులను సూచించటానికి ఎన్నో లెక్కలు అవసరమవటం వల్ల గణితశాస్త్రం కూడ దీనిలో భాగమైంది. వైదిక యజ్ఞాన్ని నిర్వహించే ప్రదేశాన్ని ''యజ్ఞవేది'' అంటారు. ఆ స్థలాన్ని నిర్ణయించటానికి, ఎన్నో విపులమైన నియమాలున్నాయి. ఈ నియమాలననుసరించి యజ్ఞవేదిని సరిగ్గా నిర్మిస్తే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి, ఈ లెక్కలని అతి జాగ్రత్తగా ఈ నియమాల ప్రకారం వేయవలసిన అవసరమేర్పడింది. ఈ కారణం వల్లనే గణితశాస్త్రం వేదాలకి ఉపాంగంగా రూపొందింపబడింది.

ప్రాచీన గణిత గ్రంథాలు :

జ్యోతిషంలో మూడు స్కందాలు ఉన్నాయి. అవి సిద్ధాంత స్కందం, హోరస్కందం, సంహిత స్కందం. సిద్ధాంత స్కందంలో అంకగణితం (arithmetic) త్రికోణశాస్త్రం (trignometry) క్షేత్రగణితం (geometry) బీజగణితం (algebra) వివరింప బడ్డాయి. పాశ్చాతులకు కొన్ని శతాబ్దాల కృషివల్ల గాని దొరకని ఉన్నత గణిత సంబంధమైన విషయాలు మన పురాతన జ్యోతిషంలో ఉన్నాయి.

అంకగణితం కేవలం అంకెలకి సంబంధించినది. కూడికలు, తీసివేతలు, హెచ్చింపులు, భాగహారాలు వంటివి అంకగణితానికి సంబంధించినవి. ''అవ్యక్త గణితం'' ''తెలియని అంకెల''తో సంబంధించినది. అంటే, ఒకటి - రెండు - మూడు వంటి అంకెలను గాక ''అ'' ''ఆ'' వంటి గుర్తులను వాడేది. దీనినే బీజ గణితమంటారు. అవ్యక్తమంటే స్పష్టంగా తెలియని అని అర్థం. క్షేత్రగణితం అంటే 'జియో (geo) అంటే భూమి. మిట లేక మీటర్‌ అంటే కొలత. అందువల్లనే జియోమెట్రి అన్న పదమేర్పడింది. యజ్ఞభూమిని, యజ్ఞవేదిని నిర్ణయించి వాటి విస్తీర్ణము, ఆకారము ఎట్లా ఉండాలో చెప్పేది క్షేత్రగణితం. అంకగణితంలో ''సమీకరణ''మనే భాగముంది. తెలియని విషయాలని తెలిసిన విషయాలతో కనుగొనటమది. తెలియని అంకెల సమూహాలని ఇస్తే వాటిని సమీకరణాలుగా రూపొందించవలసి యుంటుంది. సమీకరణ మంటే సమానం చేయటం. ఆ విధంగానే ఆంగ్లంలో equation అన్న పదమేర్పడింది.

ఆపస్తంబ సూత్రాలలో ఒక సమీకరణ ముంది. ఈ మధ్య వరకూ దానిని ఎవ్వరూ నిరూపింపలేకపోయారు. పాశ్చాత్య గణిత శాస్త్రానుసారం ఎవ్వరూ నిరూపింప లేకపోవటం వల్ల దానిని నిరూపించట మసాధ్యమన్నారు కూడా. కాని మరికొంత పరిశోధన తరువాత ఆ సమీకరణము సరియైనదే నని తేలింది. దీనికి పాశ్చాత్య పరిశోధకులు ఆశ్చర్య పడటం సహజమే. ఆధునిక శాస్త్రవేత్తలకు అర్థంకాని గణితశాస్త్ర కౌశలం, ప్రాచీన భారతీయ పండితులకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కైవసమైంది. ఇప్పటికీ అర్థంకాని, ఋజువు అంతుపట్టని, సూత్రాలున్నాయి. వీటిని కూడ సమీకరణ సహాయంతోనే నిరూపించాలి. గణిత శాస్త్రానికి సంబంధించిన శాఖలింకా ఉన్నాయని మన శాస్త్రాలు పేర్కొంటాయి. ఉదాహరణకి - రేఖాగణితం, గుట్టక, అంగభాగం - ఇత్యాది. అవ్యక్తగణితాన్ని బీజగణితమని కూడ అంటారు.

దాదాపు 800 సంవత్సరాల క్రింద భాస్కరాచార్య అనే ప్రసిద్ధ గణితశాస్త్రజ్ఞుడుండేవాడు. మనమెంత తెలివిగా వ్యవహరించినా, విధి బలీయమని చూపే సంఘటన ఆయన జీవితంలో సంభవించింది. ఆయనకి లీలావతి అనే కుమార్తె ఉండేది. గొప్ప జ్యోతిష్యుడవటం వల్ల లీలావతికి వివాహమవగానే వైధవ్యం ప్రాప్తిస్తుందని ఎరిగాడాయన. సుఖసంసారానికి గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయాన వివాహం జరిగితే ఆమె జీవితాన్నే మార్చగలనను కున్నాడాయన. అటువంటి గ్రహస్థితిని ఎంచి వివాహముహూర్తాన్ని పెట్టారాయన. ఆ రోజులలో ఇప్పటి వలె గడియారాలు లేవు. సమయం తెల్పటానికి ఒక నీటి పాత్రను వాడేవారు. దీనిని ఘటిక అనేవారు (అదే నేటి ఘటికారం లేక గడియారం). ఈ పాత్రకు రెండు భాగాలుండేవి - పైదీ, క్రిందిదీ. పై భాగం నుండి ఒక సన్నని రంధ్రం ద్వారా నీరు క్రిందికి జారేది. క్రింది భాగంపైన మందుల సీసాలపై ఉండేట్టగా గీతలుండేవి. నీటిమట్టాన్ని బట్టి గంట తెలిసికునే వారు. ఒక్కొక్క గీత రోజులో 60వ భాగాన్ని సూచించేది. దీనిని ఘటిక అనేవారు. (ఘట లేక కుండ అన్న మాటనుంచి వచ్చింది). ఒక ఘటిక 24 నిముషాలతో సమానం. వాతావరణానుసారంగా నీరు ఆవిరి అవటం వల్ల ఈ పద్ధతి అంత సరియైనది కాదని, తరువాతి కాలంలో ఇసుకని వాడటం మొదలుపెట్టారు. ఆ విధమైన సాధనని ఇసుక గడియారం (hour glass) అంటారు. ఆ నాటి సంప్రదాయానుసారం లీలావతి వివాహం ఆమె బాలికగా ఉన్నప్పుడే నిర్ణయమయిపోయింది. ఆ బిడ్డ ''నీటి ఘటిక'' వద్ద చేరి ఏదో ఆడుకుంది. అందువల్ల ఆమె ముక్కుపుడక నుండి ఒక ముత్యం జారి ఆ ఘటిక యొక్క రెండు భాగాల నడుమగల బెజ్ఞంపై పడింది. ఆ కారణంగా నీరు క్రిందికి జారటం సన్నగిల్లింది. ముహూర్తాన్ని సూచించే మట్టానికి నీరు వచ్చేప్పటికి, ఆ ముహూర్తం దాటిపోయి చాలా సేపయింది. ఆ తరువాతి లగ్నం, అశుభ##మైనది, అది వచ్చేసింది. ఆ ముహూర్తానికే లీలావతి వివాహమవటం వల్ల ఆమె బాల వితంతువయింది - జాతకం నిజమయింది.

ఆ ఘటికలో ముత్యం పడినట్టు, ఆ పిల్లతో సహా, ఎవ్వరూ గమనించలేదు. కాని ఆ విషయాన్ని గుర్తించేప్పటికి కాలం మించి పోయింది. అప్పటికే వివాహం జరిగిపోయింది. విధి అనుల్లంఘనీయమని సమాధాన పడ్డారు.

ఆ తరువాత భాస్కరాచార్యునికి గణితశాస్త్రంపై గ్రంథం రచించాలనిపించింది. ఆ గ్రంథానికి కుమార్తె పేరునే ఎన్నుకొన్నారు. ఆమె పెరిగిన తరువాత ఆమెని మంచి గణితశాస్త్రజ్ఞురాలిగా చేసి, తన గ్రంథానికి ఆమె పేరునే పెట్టుకున్నారు. ఈ గ్రంథంలో అంకగణితం, వ్యక్తగణితం, బీజగణితం ఇత్యాది వన్నీ యున్నాయి. గ్రహాల గతులను, స్థానాలను గణించటానికి ''సిద్ధాంత శిరోమణి'' అన్న గ్రంథాన్ని కూడా రచించారు.

''ప్రాచీన లేఖామాల'' అన్న గ్రంథమొకటి యుంది - పురాతన శాసనాల సంకలనమది. గుజరాత్‌లో సింగన అనే రాజు భాస్కరాచార్యుని రచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి కృషిచేశాడని ఈ గ్రంథం నుంచి తెలుస్తుంది.

యూక్లిడ్‌ (Euclid) క్షేత్రగణితం (geometry) లోని 7, 8, 9, 10 అధ్యాయాలు దొరకటం లేదంటారు. కానీ, సంస్కృతంలో పన్నెండు గణితగ్రంథాలు చెదరకుండా ఉన్నాయి. మన పురాతన గణితశాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన అతిసులువయిన గణన పద్ధతులు కూడా మనకు తెలియవు. గుణింతముంటే పదే పదే జరిగే కూడికే, అట్లాగే భాగహారమంటే పదేపదే జరిగే తీసివేతే.

భాస్కరాచార్యునికి పూర్వము దాదాపు 1500 సంవత్సరాల నాడు, వరాహమిహురుడనే గణిత శాస్త్రజ్ఞుండేవాడు. ''బృహత్‌సంహిత'' ''బృహత్‌ జాతకము'' వంటి గ్రంథాల రచయిత ఆయన. బృహత్‌ సంహిత అనేక శాస్త్రాల సంక్షిప్త రూపము. ఎన్నో శాస్త్రాలను బాగా ఎరిగిన వారు మన ప్రాచీన శాస్త్రజ్ఞులు! ''బృహత్‌ జాతకము'' అన్నది జ్యోతిషానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చిస్తుంది. ''ఆర్యభట్ట సిద్ధాంత''మన్న గ్రంథరచయిత ఆర్యభట్టుడు. ఆయన కూడ పదిహేనువందల సంవత్సరముల క్రితముండేవాడు. ఆర్యభట్టుడు బోధించిన సూత్రాలననుసరించే ఇప్పటి ''అంకగణిత'' మేర్పడింది. ఆధునిక గణితశాస్త్రజ్ఞులు వరాహమిహిరుని, ఆర్యభట్టుని ఆరాధిస్తారు. ఈ గణితశాస్త్రాలన్నీ నవగ్రహాలూ, నక్షత్రాలూ - వాటి సంచారమూ చెప్తాయి. కాని ఉన్నవి ఏడు గ్రహాలే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, సూర్యచంద్రుల గతికి వ్యతిరేక దిశలో సంచరిస్తాయి. వాటికి ప్రత్యేకమైన లెక్కలు కావాలి. వాటి స్థానాలని తెలుసుకోవాలంటే సూర్య చంద్రుల సంచారాన్ని తిరుగ వేయాలి.

నక్షత్రానికీ, గ్రహానికీ తేడా ఏమిటి? మన సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు. నక్షత్రవీధికి (galaxy) చెందినవి నక్షత్రాలు. కంటి చూపుతో గుర్తించే విధానమొకటి ఉంది. వజ్రాన్ని త్రిప్పుతూంటే మిణుకుమిణుకు మంటూ తళతళలాడుతుంది. నక్షత్రాలూ అంతే. గ్రహాలు మాత్రం అట్లా కాక కాంతిని ఒకే విధంగా వెదజల్లు తూంటాయి.

సూర్యుడూ, చంద్రుడూ స్వయంప్రకాశాలు. నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ ఎన్నో రంగులను చూపుతాయి. బాగా చెక్కిన వజ్రం నుంచి నీలమూ, ఆకుపచ్చా కనబడినట్టు. గురు, శుక్రులు పెద్ద నక్షత్రాల వలె ఉంటాయి కాని అవి నక్షత్రాల వలె తళతళతాడవు. మిణుకుమిణుకుగా కనబడేవి నక్షత్రాలే. సూర్యుడు కూడ అంతే. జాగ్రత్తగా చూస్తే చుట్టూ ఉన్న జ్యోతిచక్రం మాయమవుతుంది. అప్పుడు నీటిపై తేలుతున్న అద్దం వలె ఉంటుంది. మిణుకు మిణుకు మంటూ కదులుతున్నట్టుంది. చంద్రుడట్లా కాదు.

సూర్యునికి కాంతీ, కదలికా ఎట్లా ఉన్నాయో వివరిస్తాను. పూరిగుడిసెలో చూరులో ఒక చిన్న రంధ్రం ద్వారా సూర్యుని కిరణాలు వస్తున్నాయనుకోండి. ఆ రంధ్రం నుండే చంద్రుని కిరణాలు కూడా వస్తాయి. సూర్యుకిరణాలు కదులుతున్నట్లు కనబడగా, చంద్రకిరణాలు నిశ్చలింగా ఉన్నట్లుంటాయి. ఇతర గ్రహాలు చంద్రుని వంటివే. నక్షత్రాలు చిన్నవిగా కనబడినా, వాటికి కదలికా, తళతళతాడటం ఉంటాయి. నక్షత్రం బాగా పెద్దదయితే దాని మెరుపులో సప్తవర్ణాలూ కనబడుతాయి, వజ్రం నుండి విరజిమ్మే రంగుల వలె. సూర్యుని పేర్లలో ''సప్తాశ్వాన్‌'' అన్నది ఒకటి. అంటే అతని రథానికి ఏడు గుఱ్ఱాలుంటాయని అర్థం. ఏడు రంగులు గల ఒకే అశ్వమని కూడ అర్థం చెప్పుకోవచ్చు. 'అశ్వ' అంటే 'కిరణ'మని కూడ అర్థముంది. సూర్యునికిరణాలు వెదజల్లే ఏడు రంగుల గురించి ఈ ప్రస్తావన. ఒక కిరణం కూడ ఏడు రంగులనీ విరజిమ్ముతుంది. తైత్తిరీయ ఆరణ్యకం ఒక కిరణానికి ఏడు పేర్లున్నాయని అంటుంది. ''ఏకొ అశ్వః వహతి సప్తనామ'' అంటే ఒకే రంగు, తెలుపు, వక్రీకరణం వల్ల ఏడు రంగులుగా చీలుతుంది.

నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాయి. గ్రహాలు ఊడ పశ్చిమంవైపే కదులుతాయి కాని ప్రతిరోజూ తూర్పు వైపు కొంత కదులుతాయి. ఏడు గ్రహాలూ తూర్పువైపు కదులుతాయి. జ్యోతిషశాస్త్రం ఈ చలనాన్ని అధ్యయనం చేస్తుంది.

మానవ జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహాలు :

భూమి మీద మానవుని బ్రతుకు గ్రహాల చలనం వల్లనే మారుతూంటుంది. మంచి రోజులు, కష్టకాలం, దుఃఖం, సంతోషం, ఉచ్ఛస్థితి, పతనం - ఇవీ మారుతూఉండే మానవుని జీవిత లక్షణాలు. అటువంటి మార్పులు మానవులకు మాత్రమే పరిమితం కాదు. సంస్థలకూ, దేశాలకూ కూడ మంచిరోజులూ, గడ్డురోజులూ సంభవిస్తూంటాయి. భూమి మీద కనబడే ఈ ఫలితాలకూ గ్రహాల గతికీ సంబంధమున్నదని ప్రాచీన ఋషులు కనుగొన్నారు. మనపై ప్రభావాన్ని బట్టి గ్రహాలగతిని సిద్ధాంతీకరించారు. ఏ కర్యాన్నైనా ప్రారంభించిన వేళ బట్టి, అప్పటి గ్రహస్థితిని బట్టి, ఫలితమేమవుతుందో చెప్పవచ్చు.

ఈ పరిజ్ఞానం ''హోరాశాస్త్రం''లో ఉంది. జన్మకాలం నాటి గ్రహాలస్థితి గతులను నిర్థారించి, జాతక చక్రాన్ని వేయవచ్చు. దాని బట్టి ఆ మనిషి జీవిత పర్యంతమూ మంచి రోజులూ, చెడురోజులూ ఏమిటో చెప్పవచ్చు.

మంచి రోజులకూ, చెడ్డరోజులకూ కారణాలనేకం. ఏదైనా జబ్బుకి కారణాలు చెప్పినట్టే యిదీను. ''తత్త్వం''లో మార్పు వల్ల నంటాడు వైద్యుడు, అలౌకికశక్తుల వల్ల నంటాడు మాంత్రికుడు, గ్రహాల మార్పు వల్లనంటాడు జ్యోతిష్యుడు. పూర్వ జన్మకృత కర్మఫలమంటుంది ధర్మశాస్త్రం. మానసిక అవస్థల మార్పు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటాడు మానసిక శాస్త్రజ్ఞుడు. ఈ రకంగా ఎన్నో కారణాలు చెప్తారు. కాని అసలు కారణమేమిటి? గ్రహాలా, అలౌకిక శక్తులా, మనస్సా - ఇవేవీ కాక మరేదైనానా? ఇవేవీ అసత్యాలు కావు. వీటిలో ప్రతిదాని పాత్రా ఉంది - అన్నీ ఒకే దానికి విభిన్నరూపాలే. మన మర్థం చేసుకోవటానికి అనేక కారణాలు చెప్తారు. వాటి సమిష్టి ప్రభావమే మన అనుభవం. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యానమిస్తారు. వర్షం పడితే, తేమ కలుగుతుంది. ఈగలు ముసురుతాయి, కప్పలు బెకబెకమంటాయి. ఇవన్నీ వర్షం యొక్క పరిణామాలే - ఆ విధంగానే పూర్వ జన్మలో మనం చేసిన వాటికి ఫలితాలుగా భావింపదగ్గ సూచిక లెన్నో ఉన్నాయి. ప్రతివ్యాఖ్యానమూ - మరొక నిదర్శనం! వీటన్నిటికీ పరస్పర సంబంధాలున్నాయి. పూర్వ కర్మ ననుసరించే గ్రహాలస్థితి గతులుంటాయి. ఇవన్నీ ఒకే కర్మకి ఫలాలు. దుర్ఘటనకి ఆపాదింపబడిన ప్రతికారణమునూ ఆధారంగా చేసికొని దీనిని నిరూపించవచ్చు. కాని గ్రహాలగతులకు సంబంధించిన లెక్కల ద్వారా నిరూపించటం అన్నిటికంటే తేలిక.

శకునాలూ, నిమిత్తాలూ :

జ్యోతిషశాస్త్రంలో ఒక భాగం ''సంహిత స్కంద'' మన్నాను. భూగర్భంలో నీరు ఎక్కడ ఉంటుంది? భూగర్భంలో నదులూ, వాగులూ ఎక్కడ ప్రవహిస్తూంటాయి? భూగర్భంలో నీరు ఉంటే, భూమిపైన కనబడే సూచనలేమిటి? ఇటువంటి విషయాలు కొన్ని ఈ స్కందంలో ఉన్నాయి. సుగంధద్రవ్యాలను చేయటం, అత్తర్లను చేయటం, గృహనిర్మాణం, శకునాలూ, నిమిత్తాలూ, చెప్పే శాస్త్రం ఇవన్నీ కూడా ఈ స్కందంలో ఉన్నాయి.

శకునానికీ, నిమిత్తానికీ తేడా ఉంది - రెంటినీ కలిపి 'శకునా'లని అన్నా 'శకున'మంటే ''పక్షి'' అని అర్థం. పక్షుల వల్ల కలిగేవి శకునాలు ఈ భూమి మీద ప్రతిదానికీ మరొక దానితో సంబంధముండి తీరుతుంది. సంఘటనలకుకూడ అటువంటి సంబంధమే ఉంది. సరియైన లెక్కలు కట్టితే వీటి గురించి ముందే చెప్పవచ్చు, అర్థం చేసికోవచ్చు.

భూమి మీద సంభవించే వన్నీ ఒక దివ్యశక్తికి విధేయాలు. అన్నీ ఒక నిర్ణీత పద్ధతిలో జరుగుతాయి. అందువల్ల ఒక విషయాన్ని బట్టి మిగిలిన వాటి గురించి చెప్పవచ్చు. హస్తరేఖలు, ప్రశ్న అడిగిన సమయంలో గ్రహాల స్థితిని బట్టి భవిష్యత్తుని చెప్పటం (ఆరూఢం) జ్యోతిషం - అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలవే. అన్నీ సత్యాలే. వీటిలో శకునాలొకటి.

శకున శాస్త్రం ఈ విషయాలను కూడ చెప్పుతుంది. (1) మనకి ఎడమవైపు నుండి కుడివైపుకి పక్షి వెళ్తే ఫలితమేమిటి? (2) వివిధ పక్షుల కేకలకు అర్థమేమిటి?

నిమిత్తాలను కూడ తెలియజేస్తుంది. ''నిమిత్తానిచ పశ్యామి విపరీతాని కేశవ''. అంటాడు అర్జునుడు కృష్ణునితో యుద్ధమారంభమయే ముందు. దుశ్శకునాలు కనబడుతున్నాయని మనం అనటం వంటిదే అదీను. ఇక్కడ ''శకున'' మనకుండా ''నిమిత్త''మనే సరియైన పదాన్ని వాడాడు. పిల్లి దారికడ్డంగా వెళ్తే శకునం, రాబందు ఎగిరితే శకునం.

ఆ తరువాత భగవంతుడు 'నిమిత్తం' గురించి అర్జునితో ''నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్‌'' అంటాడు. ''వీరందరూ ఈ యుద్ధంలో హతమవాలని ముందే నిశ్చయించాను. కాబట్టి వీరంతా మృతులేనని భావించు. వారిని హతమార్చేది ఇంకెవ్వరూ కారు, నేనే. నీవు కేవలం ఒక సాధనానివే'' అంటాడు. అందువల్లే ''నిమిత్త మాత్రం భవ'' అంటాడు.

అందువల్ల శకునం ఏ సంఘటననూ కల్పించదు మార్పు చేయదు. ఎప్పటికైనా బయల్పడే పరిణామాన్ని ముందుగానే తెల్పుతుంది. అట్లాగే శకునాలు కూడ పూర్వజన్మ కృత కర్మలకి ఫలితాలు ఎట్లా ఉంటాయో ముందే చెప్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే, ఈ మూడు స్కందాలలోనూ గణితశాస్త్రం గురించి, గ్రహాలగతుల గురించీ, ప్రధానసూత్రాలు చెప్పబడ్డాయి. ఒక మనిషి జీవితంలో మంచి కాలము, చెడు కాలము చెప్పటం హోరలేక జాతకానికి సంబంధించినది. ''హోర'' అన్న పదంనుండే horoscope అన్న మాట వచ్చింది.

ఆధునిక ఆవిష్కరణాలూ, ప్రాచీన గ్రంథాలూ :

వరాహమిహురుడు ''బృహత్‌ సంహిత'' అనే గ్రంథాన్ని రచించాడని చెప్పాను. అందులో కొత్తగా కనుగొన్న శాస్త్ర విషయాలెన్నో ఉన్నాయి.

అంతరిక్షంలో ఏ ఆలంబనా లేకుండా గ్రహాలు ఎట్లా వ్రేలాడుతున్నాయి? క్రిందకి పడిపోవేమి? ఈ అద్భుతవిషయాలను న్యూటన్‌ కనుగొన్నాడని అందరి నమ్మకమూను.

ప్రాచీన విజ్ఞానంలో సూర్యమండలాన్ని వర్ణించే ప్రథమశ్లోకంలో, అంతరిక్షంలో భూమి పడిపోకుండా ఉండటానికి కారణం ఆకర్షణ శక్తి అని ఉంది. ఆదిశంకరులు ఉపనిషత్‌ భాష్యంలో కూడ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని పేర్కొన్నారు. గాలిలోకి దేనినైనా విసరినప్పుడు అది భూమిమీద పడుతుంది. దీనికి కారణం భూమ్యాకర్షణ శ##క్తే. అదే లాగుతుంది. ప్రాణం పైకి వెళ్తుంది, అపానం క్రిందికి లాగుతుంది. అందువల్లే క్రిందికి లాగే శక్తిని అపానశక్తి అంటారు. శంకరులు భూమికి అపానశక్తి ఉన్నదంటారు. దీనినే ఆకర్షణ శక్తి అని కూడా అంటారు. ప్రశ్నోపనిషత్తులో ''పృథివ్యాం యాదేవతా సైషా పురుషస్యాపానమ వస్టభ్యాన్తరా'' (3.8) అని ఉంది. అంటే, భూమిని నియంత్రించే దేవతే మానవ దేహంలో అపానశక్తిని కలిగిస్తుందని భావం. ఆచార్యుల వారు తమ భాష్యంలో ఇట్లా అంటారు. గాలిలోకి విసరబడిన వస్తువు క్రిందికి లాగబడినట్లే, పైకి లేచే ప్రాణాన్ని అపానం క్రిందికి లాగుతుంది. దీనిని బట్టి ఈ ఉపనిషత్తు ఆకర్షణ సిద్ధాంతం గురించే చెప్పుతోందని స్పష్టమౌతుంది. ఇటువంటి అద్భుత విషయాలెన్నో ఉన్నాయి మన శాస్త్రాలలో. వాటి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించకపోగా, ఏ శాస్త్రంలో దేనిని కనుగొన్నా అది పాశ్చాత్య దేశాలనుండే వచ్చిందని నమ్ముతాం!

ఎంతో ప్రాచీన కాలంలో రచింపబడ్డ మన జ్యోతిషగ్రంథాలలో ఇప్పుడు వాడుకలో నున్న గణితశాస్త్ర సిద్ధాంతాలెన్నో ఉన్నాయి. సృష్ట్యాదిలో గ్రహాలన్నీ ఒకే వరుసలోఉండేవి. కాలక్రమేణా అవి కొద్దిగా జరుగుతూ వచ్చాయి. మరొక కల్ప మారంభమయేప్పటికి అవన్నీ ఒకే వరుసకి వస్తాయి.

భూమ్యాకర్షణ శక్తి గురించి కాక, భూభ్రమణం గురించి కూడ ఆర్యభట్టు, వరాహమిహిరుడు చెప్పారు. 11వ శతాబ్దివరకు పాశ్చాత్యుల సిద్ధాంతమిది ''భూమి ఒక్కటే విశ్వంలో మధ్యగా నిలకడగా ఉంటుంది. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు. అందువల్లనే భూమిమీద పగలూ రాత్రీ సంభవిస్తాయి''. దీనికి భిన్నంగా ఎవరైనా ఇంకో సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఆ వ్యక్తిని తగులబెట్టించే వారు అప్పటి మూఢమతులు. కాని ఆదికాలంనుండి సత్యమేమిటో మన కెరుకే.

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని, సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదనీ సూచించటానికి ఆర్యభట్టుడు ఒక చక్కని పేరును వాడాడు. అది ''లాఘవ గౌరవ న్యాయం'' (తేలిక తనం గురించిన సిద్ధాంతం). తేలికగా ఏ పనైనా జరిగితే దానిని హస్త లాఘవమంటారు. అంటే, చేతిలో చేసిన పనినేర్పు. ''లఘు''కి విపరీతార్థం ''గురు''. - పెద్దది, బరువైనది - గురు. గురువంటే పెద్దవాడని అర్థం. ఆయన దేశికుడు, ఆచార్యుడు. ఆచార్యుడు గురువైతే, శిష్యుడు లఘువు. గురువైన ఆచార్యుని శిష్యుడు గౌరవిస్తాడు. అందువల్లనే ఆచార్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. సౌరమండలంలో అన్నిటి కంటె పెద్దది సూర్యుడు. భూమి లఘువు. ఆ పెద్దదాని చుట్టూ చిన్నది తిరుగుతూంటుంది - ఇదే ''లాఘవగౌరవ న్యాయం''. ఈ విధమైన ఉపమానంతో ఆర్యభట్టు భూమి సూర్యుని చుట్టూ చేసే పరిభ్రమణాన్ని వర్ణించాడు.

శాస్త్రజ్ఞులు మతద్రోహులని, వారిని కాల్చివేసి, శాస్త్రప్రగతిని ఆపటానికి ప్రయత్నించిన వారితో బాటుగా మనం కూడా హిందూమతం గురించి ఇటువంటి ఆరోపణలను చేస్తూ ఉంటాం. ''హిందూ దేశంలో శాస్త్రపురోగతి లేకపోవటానికి కారణం, హిందూ మతం ఈలోక వ్యవహారాలను పట్టించుకోకుండా, పరలోక చింతనను ప్రోత్సహించటమే'' అంటాం. నిజానికి, మన పూర్వులకు అన్ని శాస్త్రాలూ సుపరిచితాలే.

సూర్యుడు కదలడు. భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తూర్పున ఉదయించి, కొద్దిగా పైకి ప్రాకి, మళ్లీ పశ్చిమాన అస్తమిస్తూన్నట్టు కనబడుతుంది, అంటే. ఇది వాస్తవం కాదని, ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. అందులో సూర్యోదయంగాని, సూర్యాస్తమయంగాని లేవని ఉంది.

గాలిఎప్పుడూ కదులుతూనే ఉంటుంది - దీనిని మనం గమనించవచ్చు. జ్వాల నిశ్చలంగా ఉండదు, ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. నీరు నిలచిపోదు. ప్రవహిస్తూనే ఉంటుంది. ఆకాశం వైపు చూస్తే సూర్యచంద్రులు కదులుతున్నట్లే ఉంటుంది. శబ్దానికి కారణం ఆకాశ##మే. ప్రకంపనం వల్లే శబ్దం వస్తుంది. కాబట్టి శబ్దం కూడ కదలికే. కాని పైకి మాత్రం భూమి కదలక, నిశ్చలంగా ఉన్నట్లుంటుంది.

ఆకర్షణశక్తీ, భూభ్రమణమూ అట్లా ఉంచుదాం. భూమి ఆకారం గమనిద్దాం. పాశ్చాత్యులేమంటారు? పూర్వం వారు భూమిని సమస్థలంగా భావించేవారు. కాని తరువాత గోళాకారమని తామే కనుగొన్నట్టు గొప్పలు చెప్పుకుంటారు. సరే, మన భాషలో జియోగ్రఫీ (geography) అన్న దానినే మంటాం? భూగోళశాస్త్రమని కదా. దానిని భూ-శాస్త్రమని కూడ అని ఉండవచ్చు. కాని భూమి గోళాకారం కలదని ఎప్పుడో ఎరిగిన విషయాన్ని తెలియజేయటానికే భూగోళ శాస్త్ర మన్న పేరు వచ్చింది. ''గోళం'' అంటే గుండ్రని, భూ-అంటే భూమి!

విశ్వంలో అన్ని లోకాలూ, నక్షత్రమండలాలూ ఉన్నాయి. దానినే బ్రహ్మాండ మంటాం. అంటే బ్రహ్మ కల్పించిన అండమని అర్థం. ''అండ''మంటే గ్రుడ్డు గుండ్రంగా ఉండదు. ఆధునిక విజ్ఞానం నిరూపించేదిదే - విశ్వం గుండ్రంగా కాక అండాకారంలో ఉంటుందని. ఖగోళశాస్త్రం ప్రకారం విశ్వం చలనాత్మకం. ''జగత్‌'' అన్న పేరులోనే ఉన్నదీ విషయం. ''జగత్‌'' అంటే నిరంతరం కదులుతూ, నిశ్చలంగా ఉండనిది అని అర్థం.

ప్రాచీన భారతంలో కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందన్న సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారుండేవారు. వీరు ఉద్దేశాలివి: భూమి పరిధి దాదాపు 25,000 మైళ్లు. భూమి ఒకసారి పరిభ్రమించటానికి దాదాపు 24 గంటలు తీసుకుంటే, రమారమి గంటకు 1000 మైళ్ల వేగంతో పరిభ్రమిస్తోందనమాట. అంటే నిమిషానికి 16 లేక 17 మైళ్లు పయనిస్తుంది. దీని అర్థమిది: భూమి ఎప్పుడూ పరిభ్రమిస్తూండటం వల్ల ఒక స్థానంలో ఈ నిమిషంలో మద్రాసు ఉంటే మరొక నిమిషంలో అక్కడికి మద్రాసుకి 17 మైళ్ల దూరంలో ఉన్న నేలో, సముద్రమో వస్తుందన మాట. ఈ క్షణం మద్రాసులో ఉండే కాకి ఎగిరి ఒక నిమిషం తరువాత క్రిందికి వచ్చిందనుకుందాం. అది ఏ చెట్టు మీద నుంచి నుంచో, ఇంటి మీదనించో ఎగిరితే తిరిగి అక్కడికే వస్తుంది. భూమి అతి వేగంగా తిరుగుతోందంటే, ఆ కాకి వెళ్లిన చోటుకే తిరిగి ఎట్లా రాగలుగుతుంది? భూమి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మద్రాసు ఉండే ప్రదేశం 17 మైళ్లు జరిగి, ఆ స్థానంలో మద్రాసుకి 17 మైళ్ల దూరంలో ఉండేది రావాలి కదా? ఈ ధోరణిలో భూభ్రమణ వాదాన్ని వ్యతిరేకించేవారు మాట్లాడుతారు. దీనికి భూభ్రమణ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఏ సమాధానమిచ్చారో నేనెరుగను. కాని ఆధునిక శాస్త్రజ్ఞులతో చర్చించిన తరువాత నాకు తెలిసిన విషయమిది; భూమిచుట్టూ 200 మైళ్ల వరకూ గాలితో ఒక వాయుమండల ముంది - ఆ పైని పొరలుపొరలుగా మరికొన్ని మండలాలున్నాయి. ఇవన్నీ కూడా భూమితో పాటే పరిభ్రమిస్తూ ఉంటాయి. వాళ్లు చెప్పినదేదో నాకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కాని భూమితో బాటు వాయుమండలం కూడ పరిభ్రమిస్తోందన్నది నిస్సందేహం.

''అరేబియా అంకెలు'' అనబడే అంకెలు - అంటే 1, 2, 3, 4 ...... ఇత్యాది భారతదేశంలోనే జన్మించాయని పాశ్చాత్యులు ఇప్పుడు గ్రహించారు. శూన్యమంటే ''0''. ఇది భారతదేశంలోనే ఉదయించిందని పండితులు అందరూ అంగీకరించారు. అందుచే, ప్రాచీన భారతంలో గణితశాస్త్రం గొప్పదశకు చేరుకున్నదని ఒప్పుకున్నారు. మనపూర్వులు శూన్యాన్ని (సున్నాని) కనిపెట్టి ఊరుకోలేదు. ఏ అంకెనైనా సున్నాతో భాగహారిస్తే వచ్చేది అనంతత్వమే నన్న సూత్రాన్ని భాష్కరాచార్యుడు ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని అనంతుడైన భగవంతునితో జోడించి తన గణితశాస్త్ర గ్రంథంలో, మొదటి శ్లోకంలో చెప్పాడు.

భాజకము (భాగించే సంఖ్య) చిన్నదైనా కొద్దీ భాగహార లబ్దం (భాగింపగా వచ్చు సంఖ్య) పెద్ద దవుతూ ఉంటుంది పదహారుని ఎనిమిదితో భాగిస్తే వచ్చేది రెండు. నాలుగుతో భాగిస్తే వచ్చేది నాలుగు. రెండుతో భాగిస్తే, ఎనిమిది వస్తుంది. కాని శూన్యంతో భాగిస్తే? వచ్చేది లెక్కకు అందదు - అనంతత్వం. ఏ అంకెనైనా సున్నాతో భాగించినా వచ్చేది అనంతమే. దీనిని ''కహర''మన్నాడు భాస్కరాచార్యుడు. ''కమ్‌'' అంటే సున్నా, ''హరమ్‌'' అంటే భాగించుట.

గ్రుడ్డి నమ్మకం కాదు - నిరూపించ దగిన సత్యాలు c

''హిందూ శాస్త్రాలు అర్థంలేని వాటితో నిండి ఉంటాయి. మేరు పర్వత శిఖరం భూమికి ఉత్తరదిశన ఉన్నదని నమ్మకం. అక్కడ నివసించే దేవతలకు మన సంవత్సరం ఒక రోజుతో సమానం. ఆ మేరువు చుట్టూ సూర్యుడు తిరుగుతాడు. భూమిచుట్టూ ఉప్పునీటి సముద్రమే కాక వేరే ఏడు సముద్రాలున్నాయి - వీటిలో చెరుకురసం, పాలు, ఇత్యాదివి ఉంటాయి. అయిదు ఖండాలున్న భూమిపై నున్నవి ఏడు ద్వీపాలు. ఇదంతా శుద్ధ చెత్త''! ఇదీ పాశ్చాతుల వైఖరి. కొన్ని ప్రశ్నలని వేసుకుందాం. సముద్రపు నీరు ఉప్పగా ఎందుకుండాలి? ఆ నీటిలో ఉప్పుని ఎవరు కలిపారు? ఉప్పునీరు ఉండటం నిజమైతే తియ్యగా, పాలవలె ఉండే నీరు ఉండటం అంత ఊహించలేని విషయమా?

సరే, సప్తద్వీపాలూ, సప్తసముద్రాలూ సరికావను కుంటే, ఆ శాస్త్రమే భూమియొక్క స్థానం గురించి ఏమంటుంది? ఉత్తరదిశ చివర మేరుపర్వతమూ, దక్షిణదిశ చివర ధృవనక్షత్రమూ ఉన్నాయని కదా!

ఉత్తరదిశపు చివర అంటే ధృవమనుకోవచ్చు. దక్షిణ ధృవం వైపు చూస్తే అది సరిగ్గా ఎదురుగా ఉండదు. ఈ ప్రాంతాన్ని కూడా ధృవమనే అంటారు, ధృవనక్షత్రమనే పేరు ననుసరించి. ఇప్పుడు ఉత్తరధృవానికి సరిగ్గా, ఎదురుగా లేకపోయినా, ఆదిలో ఉండేది. విశ్వాంతరాళంలో జరిగే మార్పుల వల్ల భూమి కొంత ఒరిగిందంటారు. ఆధునిక శాస్త్రవేత్తలు. భూమి ధృవనక్షత్రాని కెదురుగా ఒక బొంగరం వలె తిరుగుతూండేది. ఆ రోజులలో శాస్త్రాలలో చెప్పినట్టు సప్తసముద్రాలు, సప్తద్వీపాలు ఉండేవి. కాని ఆ తిరగటంలో భూమి నిటారుగా లేక కొంత ఒరిగింది. ఆ ఏడు సముద్రాలూ కలిసిపోయి ఉంటాయి. అందువల్లే సముద్రపునీరు ఉప్పగా ఉంటుందనుకుంటాను. ఆ సమయంలోనే సప్తద్వీపాలు ఏడు ఖండాలుగా మారాయేమో!

ఉత్తరధృవానికి ఇంకా ఉత్తరంగా ఏ ప్రదేశ##మైనా ఉంటే అక్కడే మేరువుంది. అక్కడే స్వర్గం ఉంది. భూమిని ఒక నిమ్మకాయతో పోలిస్తే దాని శిఖరం మేరువు. అక్కడ్నుంచి అన్నీ క్రిందికీ, దక్షిణానికే, ఉంటాయి. అక్కడ నుండి తూర్పుకిగాని, పశ్చిమానికిగాని, ఉత్తరానికిగాని వెళ్లే అవకాశం లేదు. దక్షిణముఖంగా దిగటానికి గత్యంతరం లేదు. నిమ్మకాయ 'శిఖరం' పై దేనినైనా ఉంచితే ఇది విశదమవుతుంది. భూమిపై అన్నిటికీ ఉత్తరాన ఉన్నది మేరువే. ''సర్వేషాం అపి వర్షానాం మేరు ఉత్తరస్థిత'' అన్న మాటకి అర్థమిదే.

ధృవం దగ్గర వాతావరణ మెట్లా ఉంటుంది? ఆరు మాసాలు పగలూ, ఆరు మాసాలు రాత్రీను. ఈ విషయాన్ని ప్రాథమిక తరగతుల్లో కూడా చెప్పుతున్నారు. ఒక రాత్రీ, ఒక పగలూ కలిసి ఒక రోజు అవుతాయి. అట్లాగే, ధృవప్రాంతంలో ఆరునెలల చీకటీ, ఆరు నెలల వెలుగూ - ఒక సంవత్సరమన మాట - ఒక దినమైనట్టే కదా! ఈ విధంగానే దేవతల ఒక రోజు, మన సంవత్సరానికి సమానమైంది. భూమి తిరుగుతున్నప్పుడు దాని పరిధిలోని ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉన్నా, ఉత్తరపు మొనా, దక్షిణపుమొనా తిరుగుతూన్నట్టు కాదు. ఆ ప్రాంతం అతిస్వల్పం - అందువల్లనే దానిని ''మొన'' అంటారు.

భూభ్రమణం జరిగేప్పుడు సూర్యచంద్రులతో కల సంబంధాన్ని బట్టి ఆయా ప్రదేశాలకు 18 గంటలు పగలుంటే సరిగ్గా వాటి కెదురుగా ఉన్నా వాటికి 6 గంటలే సూర్యరశ్మి ఉంటుంది, మిగిలిన 18 గంటలూ చీకటే. రేయింబవళ్ల నిడివి ఆయా ప్రదేశాల ఉనికిని బట్టి ఉంటుంది - వీటిలో వ్యత్యాసాలు చాలా ఉంటాయి. సూర్యోదయం తూర్పున కొద్ది రోజులు జరుగుతుంది. సరిగ్గా నడినెత్తి మీదికి సూర్యుడు రావటమూ కొన్ని రోజులలోనే. ఇతర రోజులలో సూర్యోదయం కొద్దిగా ఈశాన్యంగానైనా, కొద్దిగా ఆగ్నేయంగానైనా జరుగుతుంది. ఉత్తరధృవం వద్ద అట్లా కాదు. ఆరుమాసాలు వరుసగా పగలు, ఆరుమాసాలు వరుసగా రాత్రీ మళ్లీ పగలు - ఇట్లా జరగటం చూస్తే ఆ ప్రదేశం సూర్యుని చుట్టూ తిరగటం కాక సూర్యుడే ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నాడేమో ననిపిస్తుంది. మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతాడన్నమాట కర్థమిదే. ఉత్తరధృవప్రాంతంలో ఆరుమాసాల పగలునీ ఉత్తరాయణ మంటారు, అక్కడ చీకటి పడి దక్షిణధృవం వద్ద పగలు వచ్చినప్పుడు దక్షిణాయనమంటారు.

ఉత్తరధృవాన్ని సుమేరు అనీ, దక్షిణధృవాన్ని మేరువనీ అంటారు. 'సుమేరియా' అన్న పేరు సుమేరు నుండి వచ్చినదే. అక్కడ వైదిక దేవతల ఆరాధన జరుగుతూండేదట. ఉత్తరాన దేవతలున్నట్లే దక్షిణాన పితృలూ, నరకమూ ఉన్నాయి. దివ్య చక్షువులుంటేనే గాని దేవతలనూ, పితరులనూ నరకాన్నీ చూడటమసాద్యం. మనకా దివ్యదృష్టి లేనంత మాత్రాన ఆ ప్రాంతాలు లేవని అకారణంగా అనకూడదు.

రష్యాలో పుట్టి, అమెరికాలో పెరిగి, భారతదేశంలో స్థిరపడిన బ్లావట్‌స్కీ వంటి వారు థియొసాఫికల్‌ సొసైటీని (దివ్యజ్ఞాన సమాజం) స్థాపించారు. వారు భూతాల గురించీ, దివ్యుల గురించీ చెప్పారు. సర్‌ ఆలివర్‌ లాడ్జ్‌ అనే సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు భూతాలగురించీ, చనిపోయిన వారి ఆత్మగురించీ ప్రత్యేకంగా ఆధ్యయనం చేశాడు. భూతాలున్నాయని వాటిని ఆవాహనం చేసి మనం లబ్ధిని పొందవచ్చుననీ చెప్పారాయన.

జ్యోతిషశాస్త్రం ప్రారంభంలో ఖగోళశాస్త్రాలను చెప్పి చివరికి ఆముష్మిక విషయాలను ప్రస్తావించిందంటే అబ్బుర మేమీ లేదు; ఈ విషయాలు పరస్పర విరుద్ధాలు కావని చెప్పటానికా అన్నట్టు. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడ అదే మార్గాన నడుస్తున్నారు. మన శాస్త్రాలు ఎప్పుడో ప్రాచీన కాలంలో పుట్టాయి. ఇప్పుడు మనలో మనకి ఉన్నట్టు ఆ రోజులలో మానవులకూ దేవతలకూ పరస్పర సంబంధాలుండేవి. ఏ క్రతువుకైనా మనం చెప్పే ''సంకల్పం'' గమనిస్తే ఇది విశదమవుతుంది. సంకల్పంలో కొన్ని యుగాల వెనుకకు వెళ్ళి, సృస్ట్యాదికి వెళ్లి, ప్రస్తుతకాలం గురించి చెప్పుతాం. యుగారంభంలో, ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, అన్ని గ్రహాలూ ఒక వరుసలో ఉండేవి.

కొన్ని లెక్కల వల్ల ఇప్పుడు వచ్చే సమాధానాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు భౌతికంగా తెలిసేదానికీ, శాస్త్రాలలో ఉన్నదానికీ తేడా ఉంటే, శాస్త్రాలన్నీ అభూతకల్పనలని మనం త్వరపడి అనకూడదు. గ్రహాలన్నీ ఒకే వరుసలో, ఉత్తర దక్షిణ ధృవాలు ఒకదానికొకటి సరిగ్గా ఎదురుగా ఉన్నప్పుడు శాస్త్రాలావిర్భవించాయి. ఆ పిదప ఎన్నో యుగాలూ, భూమిలో పరివర్తనలూ సంభవించాయి. నేల పర్వతంగానూ, పర్వతం సముద్రంగానూ, సముద్రమెడారి గాను - ఈ విధంగా ఎన్నో మార్పులు సంభవించాయి. ఈ వివరాలన్నీ భూగర్భశాస్త్రజ్ఞుల వద్ద ఉన్నాయి. ఇంతేకాక, గ్రహాల చలనం వల్ల నక్షత్రమండలాలలో కూడ మార్పులు వచ్చాయని ఖగోళశాస్త్రజ్ఞులంటారు. శాస్త్రాలలో చెప్పిన దానికీ ఇప్పుడు కనబడే దానికీ భేదాలు నిస్సందేహంగా ఉన్నాయి.

సృష్టి ప్రారంభం నుంచి ఖగోళశాస్త్రాల అంచనా ప్రకారం వచ్చే సమయానికీ ఆధునిక శాస్త్రానుసారం వచ్చే దానికీ తేడా లేదు.

కలియుగానికి 4,32,000 సంవత్సరాలున్నాయి. ద్వాపర యుగానికి దానికి రెండింతలు అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగానికి మూడింతలు, అంటే 12,96,000 సంవత్సరాలు. కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు. నాల్గింటినీ కలిపి మహాయుగమంటారు. దానికి 43,20,000 సంవత్సరాలు. అటువంటి వెయ్యి మహాయుగాలు పధ్నాలుగు మనువుల పరిపాలనా కాలం. మనువు పరిపాలనా కాలాన్ని మన్వంతర మంటారు. ఎన్నో రాజ్యాలు, ప్రజాస్వామ్యాలూ వచ్చినా భూమిని పరిపాలించటానికి భగవంతుడు మనువులను నియమించాడు. పధ్నాలుగు మనువులుంటారు. సృష్ట్యాది నుండి అంతం వరకు. మనువు కాలం నుండి వచ్చిన వారం కాబట్టి మనలను, మనుష్యులు (మనుజులు) అంటారు. ఆంగ్లంలో man అన్న పదం కూడ 'మనువు' నుండి వచ్చినదే. సంకల్పంలో మనం ఫలానా సంవత్సరంలో, వైవస్వత మన్వంతరంలో (ఏడవమనువు, వైవస్వుని కుమారిని) ఉన్నామని చెప్పుతాం. దీని బట్టి మొదటి మనువు - స్వయంభువ మనువు - వరకూ శాస్త్రాల ప్రకారం లెక్క పెట్టితే భూమి మీద మానవ జాతి నెలకొన్న కాలానికి సరిపోతుంది.

''మన్‌'' అన్న ధాతువుకి అర్థం ఆలోచించటం. అదే మనస్సు చేసే పని. దీనిని దృష్టిలో పెట్టుకొనే మనువు అన్న పేరు వచ్చింది. సచేతనమైన జీవులలో ప్రథముడు మానవుడు. ''ఆలోచించగల జంతువు'' అన్నది చాలా సముచితమైన మాట. ఆలోచించగలగటమే మానవుడ్ని జంతువునుండి వేరు చేస్తుంది. అది మనువుతోనే ప్రారంభ##మైనది. దీనినుండే man అన్న సముచితమైన పేరు వచ్చింది.

పైన చెప్పినట్టు, పధ్నాలుగు మనువుల కాలమే బ్రహ్మకి ఒక పగలు అవుతుంది. అటువంటి కాలమే రాత్రి అవుతుంది. అంటే 8640 మిలియన్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక దినమన్నమాట. అటువంటి 365 దినాలు బ్రహ్మకి ఒక సంవత్సరం. ఈ ప్రకారంగా బ్రహ్మవయస్సు 1200 సంవత్సరాలు. విశ్వం కూడ అంతకాలమే ఉంటుంది. బ్రహ్మలేకపోతే సృష్టిలో ఏదీ మిగులదు. దానినే ''మహాప్రళయ'' మంటారు. ఆ తరువాత బ్రహ్మ జీవితకాల పరిమితిలో సృష్టే ఉండదు. మన ఊహకందని, అనంతమైన బ్రహ్మమొక్కటే సంస్థితమవుతుంది. ఆ తరువాత మరొక బ్రహ్మసహాయంతో మరొక సృష్టి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన వైదిక కర్మలలో మనం చేసే సంకల్పానుసారం బ్రహ్మజీవితం ఉత్తరార్థంలో ఉంది.

ఏడులోకాలున్నాయి - అవి భూ, భువః, సువః, మహః, జనః, తపః, సత్యః. సృష్టిలోనివన్నీ దేవతలతో సహా ఈ ఏడు లోకాలలో ఎక్కడో అక్కడ ఉంటాయి. వీటిలో భూః, భువః, సువః - ఒక వర్గానికి చెందుతాయి. వీటిని 'భూర్భవసువః' అంటారు కర్మలు చేసేప్పుడు. మిగిలిన నాలుగూ వీటి కంటే పై లోకాలు 'బ్రహ్మ రాత్రివేళ నిద్రిస్తే ఈ మూడులోకాలూ లయమవుతాయి. దీనిని అవాంతర ప్రళయ మంటారు. బ్రహ్మ జీవిత కాలం పరిసమాప్తమైతే, అన్ని లోకాలూ (మిగిలిన నాలుగింటితో సహా) లయ మవుతాయి.

మనం గుర్తించలేక పోయినా, సూర్యుని వేడిమి కొద్దికొద్దిగా తగ్గుతున్నదని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సూర్యుని వేడిమి లేక పోతే జీవరాశులకి మనుగడే లేదు. ఆహారపదార్థాలతో ఆరంభించి, జీవితాన్ని నిలపడానికి అవసరమైన వన్నీ, అంటే వర్షాల వంటివి కూడ, సూర్యుని వేడిమిపైనే ఆధారపడ్డాయి. అందువల్ల కోటాను కోట్ల సంవత్సరాల తరువాత ప్రపంచమే ఉండదని లెక్కలు కట్టారు. తదుపరి అవాంతర ప్రళయమూ ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రకారం ప్రపంచలయమూ ఇంచుమించు ఒకే సమయానికి జరుగుతాయి. అట్లాగే ఈ అంచనాలనే వెనక్కి తిప్పితే సృష్టి ఆది గురించి చెప్పే సమయమూ ఆధునిక శాస్త్రజ్ఞుల అంచనాలతో సరిపోతుంది.

పధ్నాలుగు మనువుల పాలన బ్రహ్మకి ఒక పగలుతో అయిపోతాయి గనుక ఒక్కొక్క మన్వంతరానికీ 71 చతుర్‌ యుగాలుంటాయి. మన వైవస్వత మన్వంతరంలో మన మిప్పుడు 28 చతుర్‌ యుగంలోని కలియుగంలో ఉన్నాము. మనం చెప్పే 'సంకల్పం' దీనిని వివరిస్తుంది. అది రోజు, నిమిషం వరకూ కూడ చెప్తుంది. ఇదంతా కాలమానం ప్రకారమే.

సంకల్పంలో మనం నివసించే భూప్రదేశం గురించిన వర్ణనలు కూడ ఉన్నాయి. విశ్వాన్నంతా - అంటే బ్రహ్మాండాన్ని - వర్ణిస్తుంది. అక్కడ్నుంచి మనం నివసించే గ్రామం వరకూ వస్తుంది. మనముత్తరాలు వ్రాసేప్పుడు ఊరిపేరూ, తేదీ వ్రాసినట్టే ఈ వివరాలను సంకల్పంలో చెప్పుతాము. ఈ క్లిష్టమైన లెక్కలన్నీ జ్యోతిషశాస్త్రంలో ఉన్నాయి.

అనుభవసిద్ధమయ్యే సాక్ష్యం :

గుడిసె చూరులో చిన్న కన్నంలోంచి సూర్యకిరణం వచ్చినేలపై పడుతుంది. వచ్చే సంవత్సరం ఆ కిరణ మెక్కడ పడుతుందో చెప్పలేం. కాని జ్యోతిషశాస్త్రానుసారం చేసే లెక్కల సహాయంతో ఆ రోజునే నిర్థారణ చేయవచ్చు. పూర్వకాలంలో ఒక ముత్యాన్ని త్రాడుతో వేళ్లాడదీసి, నిర్ణీత సమయాలలో నేలమీద సూర్యుని కిరణాలు ఎప్పుడు పడుతాయో చెప్పే వాళ్ళని రాజులు సత్కరించేవారు. మిగిలిన శాస్త్రాలలో కేవలం వాక్చాతుర్యంతో ఇటువంటి సత్కారాలు పొందవచ్చు కాని జ్యోతిషశాస్త్రజ్ఞులు ప్రత్యక్షంగా నిరూపించవలసి వచ్చేది. అక్కడ మోసానికి తావులేదు. వారి ప్రజ్ఞకు సూర్యచంద్రులే సాక్షులు!

* * *

Acharyavaani - Vedamulu     Chapters   Last Page