Aathmabodha         Chapters          Last Page

4. ఆనంద వీచిక

దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవస్సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్‌ ||

సర్వ వేదాంతశాస్త్రసారము ఈ చిన్న శ్లోకంలో ఇమిడి ఉంది. దేహము, జీవుడు, అజ్ఞానము, అజ్ఞానమును త్యజించుట, సః, అహం పదాలను వివరించటంలోనే శాస్త్రములు, మతములు, గురువులు, తలమునకలవటం జరుగుతున్నది. దానినే బ్రహ్మవిద్య అని కూడా అంటారు. ఏదైనా కష్టము అని కాని, అది నాకు తెలియదు అని కాని అని అంటే, ఏమిటోయ్‌ అంతగా ఇదవుతున్నావు. అదేమన్నా బ్రహ్మవిద్యా అనటం తరచు వింటూ ఉంటాము. శ్రీ ఆదిశంకరులకు లోకముమీద ఉన్న దయ అపారమైనది. మహాభాష్యాది బహు గ్రంథరచనలతో తృప్తినొందక అరువది ఎనిమిది శ్లోకములు గల ఆత్మబోధయను పేర ఈ ప్రకరణ గ్రంథము రచించిరి. ఆ శ్లోకములను విపులంగా వివరిస్తూ శ్రీ చంద్రమోహన్‌ ఈ రచన చేయటం జరిగింది.

ఆత్మని మాయ (అజ్ఞానము, అవిద్య) ఎందుకు ఏ విధంగా కప్పివేస్తుంది. దానిని నిర్మూలించటం ఎలా? జ్ఞానేంద్రియాలని భగవంతుడు బహిర్ముఖంగా ఎందుకు నిర్మించాడు? వాటిని అంతర్ముఖం ఎందుకు చేయాలి? చేయటం ఎట్లా? మొదలయిన ప్రశ్నలు ఈ కాలంలో ఉదయించటమే అరుదు. అట్టి విషయ జిజ్ఞాసతో బహుగ్రంథావలోకనం చేయటం తత్త్వవేత్తలైన మహాత్ములను కలవటం, వారి అనుగ్రహం పొంది, ఆ ముఖంగా సాధన చేయటం మరీ అరుదు. పుష్కరకాలంగా మహాగ్రంథాలను బృహద్వ్యాఖ్యలతో చదివి మధుపంలాగా విషయ సేకరణ చేసి 1989లో డివైన్‌ యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ అధినేత శ్రీ సంత్‌ బాలయోగీశ్వర్‌గారి వద్ద జ్ఞానదీక్షను గ్రహించి, నిరంతర సాధనతో ఆత్మవిద్యాసోపానముల నధిరోహించుచు, తన అనుభూతులను తాను సేకరించిన జ్ఞాన మకరందముతో రంగరించి శ్రీ చంద్రమోహన్‌ ఈ గ్రంథమందంటను పరచుట జరిగినది. అందువల్ల రచయిత తేనేటీగగానే కాక సాలీడుగా కూడా కనబడుతున్నాడు.

జీవుని కప్పిన అవిద్యను తొలగించటం పాలలో కలసిన నీటిని వేరు చేయటమంత కష్టమయినది. అందుకనే కాబోలు జ్ఞానులైన మహాత్ములను హంసలని, పరమహంసలని స్తుతిస్తారు. జిజ్ఞాసువుల మేలుకోరి ఉత్కృష్టము, కష్టసాధ్యము అయిన పనికి మార్గమును వివరించటానికి పూనుకొన్న శ్రీ చంద్రమోహన్‌ సర్వధా అభినందనీయుడు. అట్టి సదాశయుని పరిచయమిచట కొంత అవసరమని పించుచున్నది.

శ్రీమతి సుమిత్రమ్మగారు, శ్రీ లక్ష్మయ్యగారు శ్రీ చంద్రమోహన్‌ తల్లిదండ్రులు. వీరికి ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె. కృష్ణాజిల్లా గుడివాడ నివాస స్థానం వారిది. ఒకప్పుడు, అంటే ఈ శతాబ్దం తొలి పాదంలో బాగా కలిగిన కుటుంబం. ఆ రోజుల్లో కృష్ణాజిల్లాలో కొన్ని రూట్లలో స్వంత బస్సులు నడిపినవారు. ఏడవ కుమారుడైన ఇతని చిన్నతనానికే అదంతా గత వైభవం అయింది. ఆర్థికంగా ఒడిదుడుకులు అనుభవిస్తూ మూడవ అన్నగారి దగ్గర ఉండి, రెండవ అన్నగారి దగ్గర ఉండి తొలుత విద్యాభ్యాసం చేశాడు. రెండవ అన్నగారి దగ్గర ఉండగానే టైఫాయిడ్‌ జ్వరం వచ్చి ఇబ్బందులలో ఇబ్బందిగా బధిరత్వం వచ్చింది. దానివల్ల విద్యాభ్యాసానికి చాలా ఇబ్బందులు కలిగినవి. కాలేజీ చదువుకు వచ్చేటప్పటికి శ్రీ బాబూరావుగారు (అయిదవ అన్నగారు) ఇతని బరువు బాధ్యతలు స్వీకరించారు. దానితో ఇతని దశ తిరిగింది.

శ్రీ బాబురావుగారు యోగిలాంటి వ్యక్తి. చదువుకోనివాడయినా చదువులలో సారమెల్ల ఎరిగినవాడు. స్వయంకృషితో పైకి వచ్చినవాడు. ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత తృప్తిగా అనుభవించే భోగి. ఆత్మీయులని కల్పవృక్షంగా ఆదుకునే నిస్వార్థజీవి. తమ్ముడైన చంద్రాన్ని జమీందారు బిడ్డలా చూశాడు. ఆయన చూడటమే కాదు, వారి భార్య పరమసాధ్వి కీ||శే|| రత్నంగారు కూడా ఇతన్ని పుత్ర నిర్విశేషంగా ప్రేమించారు. ఆ అన్నావదినల చల్లని నీడలో ఇతను ఎం.ఎ. వరకు విద్యాభ్యాసం సాగించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ అన్నగారి బలవంతంవల్లనే ఇతను అంతవరకు చదవటం జరిగింది. స్వయంగా సంపాదించుకోవాలని అన్నగారికి తాను బరువుగా ఉండగూడదని స్వాభిమానియైన ఇతననుకునేవాడు. కాని ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా బుజ్జగించి, నచ్చచెప్పి తమ్ముడిని ఎం.ఎ. వరకు చదివించారు. అన్నగారు చూపిన అనురాగానికి, చేసిన సహాయానికి చంద్రం ఆయనకు మనసా అమ్ముడుపోయాడు. ప్రాణాధికంగా ప్రేమించాడు.

చిత్రంగా ఆథ్యాత్మిక విద్యకుగూడా శ్రీ చంద్రానికి ఆ అన్నగారి వల్లనే అంకురార్పణ జరిగింది. శ్రీ బాబూరావుగారికి ఉన్నత విద్యాభ్యాసంచేసిన, నాలుగు భుజముల వంటి కుమారులున్నా, ఆత్మీయులు, మిత్రులు వగైరా ఇంకెంతమంది ఉన్నా ఆయన మనస్సు తమ్ముని సాహచర్యాన్నే కోరుతుంది. అందులోనే ఆయన పూర్తి తృప్తి, సాంత్వనం అనుభవిస్తారు. అందువల్ల 1984లో ఆయన సతీయుక్తంగా రమణమహర్షి ఆశ్రమానికి వెడుతూ తమ్ముని కూడా వెంటబెట్టుకు వెళ్లారు. అక్కడి నుంచి ఇతని జీవితం మరో మలుపు తిరిగింది. ఆధ్యాత్మిక విద్యావిలాసం వైపు మనస్సు ఉరకలు వెయ్యటం ప్రారంభమయింది. రమణ మహర్షివంటి సిద్ధ పురుషుల జీవితములు, బోధలు చదవటంతో ఈ జీవితం ప్రారంభమయింది. ప్రస్థానత్రయంవరకు అలుపు ఎరుగని, తనివి తీరని దాహంతో ప్రయాణం చేశాడు. చదవటం అంటే మూల గ్రంథాన్నిగాని ఒక వ్యాఖ్యానంగాని చదవటం కాదు. ఒక్క భగవద్గీతనే ఎన్నో వ్యాఖ్యానాలతో మననం చేశాడు. ఆ కృషి ఫలితమే అనునట్లుగా శ్రీ బాలయోగీ మహారాజ్‌ వంటి వారు గురువుగా లభించటం జరిగింది.

భగవంతుడు శ్రీ చంద్రానికి ఇచ్చిన మరొక వరం అన్నపూర్ణకు ఉద్ది¸° అతని గృహిణి. మా వదినగారు శ్రీమతి సరోజిని (బి.ఎ.బి.ఇడి.), షట్కర్మయుక్త అయిన స్త్రీ రత్నం. ఈ దంపతులకు ఇరువురు కుమార్తెలు. పెద్ద కుమార్తె చి||సౌ|| శ్రీదేవి (బి.ఎస్‌సి.) ఇల్లాలుగా ఇద్దరి పిల్లలతోను, రెండవ కుమార్తె చి||సౌ|| శివశ్రీ (ఎం.ఎస్‌సి.) ఎస్‌.బి.ఐ.లో ఉద్యోగం చేస్తూ ఒక కుమార్తెతోను సుఖంగా సంసారయాత్ర సాగిస్తున్నారు. ఇన్ని ఉన్నా పురుష సంతానం శ్రీ చంద్రానికి లేదనే బాధ అస్మదాదులకు ఉన్నది. భగవంతుడు ఆ లోపం తీర్చటానికా అన్నట్లు ఈ (ఆత్మబోధగ్రంథ) సంతానాన్ని అతనికి అందించాడని తృప్తీ ఆనందమూ కలుగుతున్నవి.

''శ్రీ గురుభ్యోనమః'' అని విద్యార్థి గురువందనంతో విద్యాభ్యాసం ప్రారంభించటం భారతీయ సంప్రదాయం. అంటే ఏ దేవుడికీ, ఏ దేవతకీ ఈయని ప్రాధాన్యం జ్ఞానదాతయైన గురువుకి ఈయటం జరుగుతున్నది. మహాత్ముడూ సిద్ధపురుషుడూ అయిన గురువు లభించటం ఒక ఎత్తూ, ఆ గురువుమీద అనన్యమూ అచంచలమూ అయిన భక్తి విశ్వాసములు శిష్యునికి కలగటం మరియొక ఎత్తూను. అవి రెండూ కలసినప్పుడు బంగారానికి తావి అబ్బినట్లవుతుంది. పై రెండింటిలో ద్వితీయమే అద్వితీయమైనదిగా విశ్వసింపబడుచున్నది. కృష్ణ పరమాత్మ మొదలు రమణమహర్షి వరకు ఎందరో మహానుభావులుద్భవించిన పుణ్యభూమి మనది. వారి వలన తరించిన వారెంతమంది అంటే వేళ్లు మడవటం మొదలవుతుంది. శ్రీ బాలయోగీ మహారాజ్‌ వంటి గురువు లభించటం, ఆయననే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పురోగమించటం, శ్రీ చంద్రం అదృష్టం. గురువుగారి వద్ద జ్ఞానోపదేశం పొంది ఏడు సంవత్సరములుగా అఖండ దీక్షతో నిరంతర సాధన చేస్తున్నాడు. ఈ గ్రంథము వ్రాయుటకు ప్రేరణకాదు శక్తి కూడా గురుమహారాజ్‌ ఇచ్చినదే అంటాడు. గురువు ఎంతవాడు అనేది కాదు, గురువునందు మనకుగల భక్తి శ్రద్ధలు, అచంచలమైన నమ్మకము ఎంతటివి అనేది మనని త్వరగా తరింపజేస్తుంది.

నన్నయభట్టారకుడు మనస్సు నవనీతంలాగా ఉండటం, పలుకు ఆఖండల శస్త్రతుల్యంగా ఉండటమూ విప్రుల లక్షణం అన్నారు. తిక్కయజ్వ కూడా ''నీ పలుకు విప్ర స్వాభావితమై శ్రుతికి కటువై'' ఉన్నదని ద్రుపద పురోహితునితో భీష్ముని చేత అనిపిస్తారు. ఈ లక్షణములు శ్రీ చంద్రంలో కనిపిస్తాయి. ఇంతేకాదు ఇతనియందు చాలా ఉత్తమగుణములు ఉన్నాయి. కాంతాకనకాలకు లోబడని విశిష్ట వ్యక్తిత్వమీతని సొమ్ము. జిహ్వచాపల్యంలేనివాడు. ఈ మూడు ప్రలోభాలకీ లొంగనివాడు. మహాపురుషులలో లెక్కింపబడతాడు. ఇక లౌకికంగా చూస్తే అతను బహు విషయములందు ప్రవేశము, ప్రావీణ్యము కలవాడు. వాస్తు, హస్తసాముద్రిక శాస్త్రములలో చక్కని ప్రవేశమున్నది. టైలరింగులో పూర్ణ ప్రజ్ఞకలవాడు. మద్రాసులో రెండవ అన్నగారి దగ్గర ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ గురించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుష్కలంగా సంపాదించాడు. నటనయందు మంచి కౌశల్యమున్నది. బుచ్చిబాబుగారు విజయవాడలో AIR డ్రామాలు నడుపుతున్నప్పుడు ఆయన డ్రామాల్లో చాలా పాత్రలు ధరించి ఆయన మెప్పు పొందాడు. విమర్శజ్ఞానము, నటనావైదుష్యము, కలిగినవాడవటంవల్ల ఎన్నో సాంస్కృతిక సంస్థలు ప్రదర్శించిన రూపకములకు దర్శకుడుగా తన సేవలందించాడు. ఆ విధంగా ఎన్నో కళాశాలల విద్యార్థులు, సాంస్కృతిక సంస్థలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అతని సహాయాన్ని పొంది రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ బహుమతులు పొందటం జరిగింది.

ఇన్ని శక్తియుక్తులు కలిగిన శ్రీ చంద్రమోహన్‌ ధనార్జనకు ప్రాధాన్యమీయక ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి పవిత్ర జీవితమును కొనసాగించి క్రమంగా ఆత్మ విద్యావిలాసంలో తలమునకలయి ఈ స్థితికి చేరుకున్నాడు. ఇకముందు ఇంకెంత అభివృద్ధి సాధించవలసియున్నదో. ఏ ప్రయోజన మాకాంక్షించి లేక ఏ ఫలాన్ని అనుగ్రహింపదలచి భగవంతుడు ఈ మార్గంలో నడుపుతున్నాడో ఆ జగజ్జననికే ఎరుక.

ఇట్టి వాడైన చంద్రం మహోత్కృష్టమైన ఆత్మబోధ వ్యాఖ్యాన గ్రంథానికి పీఠికగా 'నీకు తోచింది వ్రాయి' అని నన్ను అడగటం కేవలం నాయందున్న ప్రేమవల్లనే, నలుబది రెండు సంవత్సరముల కమ్మటి స్నేహబాంధవ్యాన్ని పురస్కరించుకొని అడిగినదే కాని మరొకటి కాదు. షుమారు నవమాసములు శ్రమించి రచించిన ఈ గ్రంథాన్ని ఒక్కసారి ప్రదర్శించి నన్ను దిగ్భ్రాంతుని చేశాడు. శ్రీ విశ్వనాథ ''జీవుడై యన్యభావములు సేకరించినది నీ వెఱుగ వావంక నివ్వెఱపోదు'' వన్నట్లయింది నా పని. ఇట్టి గ్రంథము మిత్రుడు వ్రాసినందుకు ఆనందంగానే కాదు కొంచెం గర్వంగా కూడా ఉంది.

కులం పవిత్రం జననీకృతార్థా

విశ్వంభరా పుణ్యవతీ చ తేన

అపార సచ్చిత్సుఖసాగరేస్మిన్‌

లీనం పరే బ్రహ్మణి యస్య చేతః

16-7-96 కొత్తపల్లి శ్రీ ఆంజనేయశర్మ

హైదరాబాదు రిటైర్డు తెలుగు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్‌,

&#&#&#&#&#వివేకవర్థినీ కళాశాల,

హైదరాబాదు.

Aathmabodha         Chapters          Last Page