Sri Ramacharitha    Chapters   

సమస్తమ సోపానము

ఉత్తరకాండము

నెమలి కంఠద్యుతినిపోలు నీలవర్ణుడు, సురవరుడు, విప్రపాదకమల చిహ్నములచే విలసిల్లువాడు, శోభాఢ్యుడు, పీతవస్త్రధారి, సరసజనయనుడు, సర్వదా సుప్రసన్నుడు, ధనుర్బాణపాణీ, కపిసమూహయుతుడు, సోదర పంపేవ్యమానుడు, రఘువరుడు, పుష్పకారూఢుడు, జనకీపతి అగు రఘువరునికి శ్రీరామునికి నమస్కరింతును.

కోసలేంద్రుని మంజుల కోమల చరణ కమలములకు బ్రహ్మయు శివుడును వందన మొనర్తురు. జానకీ కరసరోజములు ఆ చరణకమలములను మురిపించును. కుందుపుష్పమును, చందురుని, శంఖమునుపోలిన సుందరగౌరవర్ణుడు అంబికా పతి, అభిష్ట ఫలప్రదాత, కరుణాకరుడు, కమలలోచనుడు అనంగునిబారినుండి విడిపించువాడు అగు శంకరునికి వందనము చేతును.

శ్రీముడు అయోధ్యకు తిరిగి వచ్చుటకు ఇంక ఒక్కదినము మాత్రమే గడువు ఉన్నది. అయోధ్యా పురవాసులెల్లరు అతి ఆర్తులై ఉన్నారు. రామ వియోగమున కృశించిఉన్న స్త్రీలు, పురుషులు ఎల్లచోట్లనుచింతించుచున్నారు.

సకల విధములగు శుభ శకునములు పొడగట్టినవి. ఆందరి మనస్సులు ఆనంద భరితములైఉన్నవి నగరపు నాలుగుదిసలు రమ్యమై కనుపించుచున్నవి. ఈ చిన్నెలన్నియు ప్రభుని ఆగమనమునుతెలుపుటకో_ అనునట్లున్నవి.

అనుజ సీతా సహితుడై ప్రభువు వచ్చెనని ఇప్పుడే ఎవరైన చెప్పదురో అనునట్లుకౌసల్యాది తల్లులెల్లరి మనసులలో ఆనందము ఉప్పొంగుచున్నది. భరతుని కుడికన్ను, కుడిభుజములు మాటి మాటికి అదరుచున్నవి. ఇవి శుభశకునములని అతడు మనమున మిక్కిలి సంతసించెను. మరుక్షణమే అతడు అలోచనా నిమగ్నుడయ్యెను.

"నా ప్రాణాధారమగు అవధికి ఇక ఒకే దినము మిగిలినది" అని భరతునికి అపారమగు విచారము కలిగెను. "స్వామి ఇంకనూ రాడాయెను. కారణమేమో? నేను కుటిలుడననితెలిసికొని ప్రభువు నన్ను మరువలేదుకదా! అహో! కడుధన్యుడు లక్ష్మణుడు! బహు భాగ్యవంతుడు అతడు! రామ పాదరవింద అనురాగి; నేనో కపటిని. కుటిలుడను. ప్రభువు దీనిని గ్రహించెను. కనుకనే అతడు నన్ను తనవెంట తోడ్కొని పోలేదు. అవును. నా చర్యలను ప్రభుడు తెలిసికొనినచో శతకోటి కల్పములవరకు నాకు విముక్తిఉండదు. కాని స్వామి- భక్తజనుల అవగుణములను ఎన్నడూ పరిగణించడు అతడు దీనబాంధవుడు అతి మృదువుల స్వభావుడు. నాకు శుభశకునములు కనుపించుచున్నవి. రాముడు తప్పక దర్శింతునని నా హృదయమున దృఢమగు నమ్మకము కలుగుచున్నది. గడువు గడచినా ప్రాణము నిలచినచో జగత్తున నావంటి అధముడు ఎవ్వడుండును?" అని అతడువిచారించెను. రామ వియోగము విరహసముద్రమున భరతుని మనస్సు మునిగెను.

ఆ సమయుమున పవనసుతుడు విప్రరూపమును ధరించి మునుగుచున్నవానిని సంరక్షించుటకు నావవలె ఏతెంచెను.

దుర్బల శరీరుడై, జటాముకుటాధారియై "రామా, రామా, రఘుపతీ" అని జపించుచు కుశాసనముపై కూర్చుండి ఉన్నాడు భరతుడు అతని కమల నయనముల నుండి ఆశ్రవులు ప్రవహించుచున్నవి. భరతుని మారుతి చూచెను. అత్యంతహర్షము చెందెను. అతని శరీరము పులకరించెను. కన్నులనుండి నీరు వర్షించెను. అతడు మనమున అమితానందము పొందెను.

"ఎవని ఎడబాటుచే రాత్రింబవళ్ళు నీవు చింతించి కృశించుచుంటివో, ఎవని గుణగణములను ఎల్లవేళల నీవు స్మరించుచుంటివో, ఆ రఘుకుల తిలకుడు, సజ్జన సుఖప్రదాత, దేవ, మునిసంరక్షకుడు - రాముడు కుశలముగా వచ్చినాడు రణమున రిపులను జయించి అనుజునితో, సీతతో కలసి ప్రభువు అరుదెంచుచున్నాడు. అతని సత్కీర్తిని సురలుగానను చేయుచున్నారు" అని సుధాతుల్య వచనముల మారుతి వచించెను. ఈ మాటలు వినగనే భరతుడు దుఃఖమును అంతయు మరచెను. దప్పి గొన్నివానికి అమృతము లభించినట్లయ్యెను.

"నాయనా, ఎవరు నీవు? ఎక్కడనుండి ఏతెంచుచున్నావు? పరమప్రియమగు పలుకులను నాకు వచించితివి." అని భరతుడు ప్రశ్నించెను.

"కృపానిధీ, వినుము. నేను మారుతాత్మజుడును. కపిని-నా పేరు హనుమంతుడు. దీనబంధువగు రఘుపతియొక్క కింకరుడను" అని మారుతి ప్రత్యుత్తరమిచ్చెను.

ఈ సమాధానమును వినినంతనే భరతుడు లేచి సాదరముగా హనుమంతుని కౌగలించుకొనెను ఆ సమయమున భరతుని హృదయమునుండి ప్రేమ ఉప్పొంగుచున్నది.అతని కన్నులనుండి ఆనందబాష్పములు ప్రవహించుచున్నవి. అతని తనువు పులకించుచున్నవి.

"కపీ, నీ దర్శనమున నా సకల దుఃఖములు దూరమయ్యెను. నీ రూపమున నేనడు ప్రియుడగు రాముడే నన్నుఆలింగము చేసికొనినాడు" అని భరతుడు పలుమారులు రాముని కుశలమును గురించి హనుమను ప్రశ్నించెను.

"సోదరా, వినుము, నీకు నేనుఏమి బహూకరింపగలను? నీ సందేశమునకు సాటివచ్చునది జగత్తున ఏదియులేదు. యోచించితిని నాయనా, ఏ విధమునను నీ ఋణము నేను తీర్చలేను ఇక నాకు (ప్రభుని యొక్క చరిత్ర) వినిపింపుము" అని అతడు అడిగెను.

అంతట హనుమంతుడు భరతుని పాదములకు తన తలవంచి నమస్కరించి రఘుపతియొక్క గుణగాథల నన్నింటిని వివరించెను.

"హనుమా, తెలుపుము కృపాళుడగుస్వామి ఎన్నడైనను నన్నుతన దాసునిగా స్మరించునా? నేను తన సేవకుడనని రఘువంశ భూషణుడు తలంచెనా ఎన్నడైనను?" అని భరతుడు హనుమంతుని ప్రశ్నించెను.

భరతునియొక్క అతివినీత వచనముల విని మారుతి పులకితగాత్రుడయ్యెను. భరతుని చరణములపై అతడు పడి.

"చరాచర నాథుడు శ్రీరాముడై-స్వయముగ తన నోటితో ఎవని గుణగణములను వర్ణించునోఅట్టి భరతుడు-ఇట్లు-వినీతుడు, పరమపునీతుడు, సద్గుణసాగరుడు కాక ఇంకెట్లుండును?" అ%ి తనలో తాను తలచెను.

"నాథా, రామునికి నీవు ప్రాణసమానుడవు. స్వామీ. నేను పలుకునది నిజము"అని మారుతి అనెను. ఈ మాటలువిని భరతుడు పదేపదే హనుంతుని కౌగలించుకొనెను. అతని మనసునుండి ఆనందము పొంగి పొరలుచుచుండెను. హనుమంతుడు భరతుని పాదములకు తలవంచి నమస్కరించి రామునివద్దకు మరలెను. భరతుని కుశలమును రామునికి తెలిపెను. ప్రభువు సంతసించి, విమానమును అధిరోహించి పయనము సాగించెను.

భరతుడు ఆనందముతో ఆయోధ్యకు వచ్చెను. వార్తఅంతయు గురునికి నివేదించెను. రఘుపతి కుశలుడై నగరమునకు తిరిగి వచ్చుచున్నాడని రాజమందిరములకు సందేశము పంపెను. ఈ వార్త విన్నంతనే తల్లులెల్లరు లేచి పరుగెత్తిరి. ప్రభుని కుశలవార్తను భరతుడు వారికీ తెలిపి, వారిని శాంతపరచెను. రాముడు వచ్చుచున్నాడనువార్త అయోధ్యాపురవాసులకు తెలిసినది. స్త్రీలు పురుషులు, ఆనందమున పరుగులిడిరి.

పెరుగు, గరికెదుబ్బులు, గోరోచనము, ఫలములు, పుష్పములు, మంగళములకు మూలములగు లేత తులసీదళము మొదలుగు వస్తువులను బంగారుపళ్ళరములలో నింపి గజగామినులగు భామినులు వానిని చేకొని-గానముచేయుచూ బయలుదేరిరి.

ఉన్నవారు ఉన్నట్లుగాలేచి అట్లే వరు పరుగెత్తి వెడలిరి. బాలురను, వృద్ధులను తమవెంట ఎవ్వరూ తీసికొనివెడలుట లేదు. "సోదరా, దయాళుడగు రఘురాముని చూచితివా నీవు?" అని ఒకరినొకరి ప్రశ్నించుచున్నారు. ప్రభుని ఆగమనవార్త తెలిసికొని అయోధ్యాపురి సకలశోభాఖని అయ్యెను. సుందరములగు త్రివిధావాయువులు వీచుచున్నవి. సరయూనదియందు నిర్మలసలిలము ప్రవహించుచున్నది. గురువును. కుటుంబమును. తమ్మును భూసురబృందమును వెంటపెట్టుకొని సంతోషముతో భరతుడు అత్యంతప్రేమపూరితమానసుడై కృపానిలయుడగు రాముని సమ్ముఖమునకు పయనమయ్యెను.

స్త్రీలు అనేకులు తమ మిద్దెలపై ఎక్కి ఆకాశమున విమానమును వీక్షించుచుండిరి. దానిని కనుగొనగానే వారు ఆనందమున సుమంగళగానమును మధురస్వరములలో కావింపసాగిరి.

అయోధ్య అను అంబోనిధి రఘుపతి అను రాకాచంద్రుని కనుగొని ఆనందించి కోలాహలము కావించుచు ఉప్పొంగుచున్నట్లున్నది. నగరిస్త్రీలు ఆ సముద్రపు తరంగములవలె కనుపించుచున్నారు.

ఇచ్చట- భానుకుల కమలాభాస్కరుడు శ్రీరాముడు మనోహరమగు అయోధ్యానగరమును వానరులకు చూపించుచున్నాడు.

"కపీశా, అంగదా, లంకేశా, ఇదిగో చూడుడు, ఈ పవిత్రనగరము, సుందరమగు ఈ దేశము. వేదపురాణ విదితమగు వైకుంఠమును ఎల్లరు కొనియాడుదురు. అది జగత్‌ ప్రసిద్ధమానదైనను అయోధ్యవలె వైకుంఠము నాకు ప్రియముకాదు. ఈ రహస్యము ఎవ్వరికో కాని తెలియదు. ఈ సుందరనగరము నా జన్మభూమి, పావన సరయూనది ఈ నగరమునకు ఉత్తరమున ప్రవహంచును. సరయూనధీ సలిలముల స్నానముచేసిన నరుడు శ్రమలేకయే నా సామీప్యస్థితిని పొందును. ఈ పురవాసులు నాకు మిక్కిలి ప్రియులు అయోధ్య నా పరమధామమును ప్రసాదించును. ఈ పురిసుఖపింజము" అన అతడు వర్ణించుచున్నాడు.

ప్రభుని పలుకులువిని కపులెల్లరు ఆనందించిరి. "స్వయముగ రాముడే శ్లాఘించిన అయోధ్య ధన్యమయ్యెను!" అని వచించిరి.

కృపాసాగరుడగు భగవానుడు ప్రజలెల్లరు వచ్చుచుండుటను కనుగొనెను. నగరమునకు సమీపమున విమానమునుదిగుమని ఆతడు ఆదేశించెను. విమానము నేలపై దిగెను. రాముడు దానినుండి అవరోహించెను. "ఇక నీవుకుబేరునివద్దకు మరిలిపొమ్ము" అని పుష్పకవిమానమునకు అతడుఆజ్ఞ ఇచ్చెను. రాముని ఆనతిని,హర్షవిషాదములతో విమానము వెడలెను.

భరతసమేతులై ప్రజలెల్లరు. ఏతెంచిరి. శ్రీ రఘువీరుని వియోగమున నా రెల్లరిశరీరములు కృశించిఉన్నవి. వామదేవుని, వసిష్ఠుని, ఇతర మునినాయకులను ప్రభువు చూచెను. ధనుర్బాణములను అతడు నేలపై ఉంచి అనుజసహితుడై, పులకిత గాత్రుడై పరుగిడి అతడు గురుని చరణ సరోరూహములను గ్రహించెను.

మునిరాజగు వసిష్ఠుడు రాముని లేవనెత్తి కౌగలించుకొనెను. కుశలప్రశ్నలు కావించెను. "తమదయచే మేము క్షేమము" అని రాముడు పలికెను, ధర్మధురంధరుడగు రఘుకులనాథుడు ద్విజులనెల్లరును అభినందించి వారికి నమస్కరించెను. సురులు, మునులు, శంకరుడు, విరించి వందనమొనర్చు ఆ ప్రభుని పాదపంకజములను భరతుడు మరి ఒకసారి పట్టుకొనెను. అతడునేలపై పడును! లేపినను లేవడు! కృపాసాగరుడగు రాముడు బలవంతముగ అతనిని లేవదీసి కౌగలించుకొనెను.

రాముని శ్యామలశరీరమునందలి రోమావళి గగుర్పాటుచెందెను. అతని నవరాజీవనయనములు బాష్పాపూరితములయ్యెను. ఆ రాజీవలచోనములనుండి ఆ శ్రుధారలు వ్రవహించెను. అతని లలితమగు తనువు పులకించెను. త్రిభువననాథుడగు రాముడు అత్యంత ప్రేమతో అనుజడుని ఆలింగనముచేసికొని, తన హృదయమునకు హత్తుకొనెను. భరతుని ఆలింగనము చేసికొనినప్పటి ఆ రాముని శోభను పోల్చుటకు సామ్యమేదియనాకు గోచరించదు. ప్రేమయు, శృంగారము తనువును ధరించి కలిసికొని ఉజ్జ్వల కాంతిని కాంచినవి అనునట్లున్నది.

కృపానిధిఅగు రాముడు భరతుడు ప్రశ్నించెను. భరతునినోట మాటలు వెంటనే వచ్చుటలేదు.

భవానీ, వినుము భరతునియొక్క ఆ ఆనందము వాక్కునకు, మనసునకు అతీతము అది అనుభవించినవారికే తెలియును.

అనంతరము భరతుడు "కోసలనాథా, ఈదాసుడు ఆర్తుడని ఎఱిగి దర్శన మిచ్చితివి. ఇక నేను కుశలమే, విరహసముద్రమున మునుగుచున్న నన్ను కృపానిధి తన చేయూతనిచ్చి కాపాడెను!" అనెను

పిదప ప్రభువు ఆనందముతో శత్రుఘ్నువి తన హృదయమునకు హత్తుకొని ఆలింగనము కావించుకొనెను. భరత లక్ష్మణులు-సోదరులు ఇరువురు-పరమ ప్రేమతో కౌగలించుకొనిరి. తదుపరి లక్ష్మణ శత్రుఘ్నులు ఆలింగనము చేసికొనిరి. ఇట్లు విరహజనతమగు దుస్సహదుఃఖము తొలగిపొయెను. అనుజసమేతుడై భరతుడు జానకియొక్క చ.రణములకు వందనముచేసి ఆనందించెను. రామప్రభుని భరతుడు జానకియొక్క చరణములకు వందనముచేసి అందించెను. రామప్రభుని వీక్షించి అయోధ్యాపురవాసులెల్లరు హర్షితులైరి. వియోగజనిత దుఃఖము సర్వము నశించెను.

ప్రజలెల్లరు ప్రేమాతురులై ఉన్నట్లు ప్రభువు కనుగొనెను. ఖరారి అగు కృపాశుడు శ్రీరాముడు ఒక వినోదమును కావించెను. ఆ సమయమున ఆ కృపాళుడు అనేక రూపములలో ప్రకటమయ్యెను! అకేసారి అతడు ఎల్లరను తగురీతిని కలసికొని అభినందించెను. అందరిని కృపాదృష్టితో రఘువీరుడు వీక్షించెను. సకల స్త్రీ, పురుషులను శోకరహితులను కావించెను. ఒకేక్షేణమున భగవానుడు అందరిని అభినందించెను. ఈమర్మము. ఉమా, ఎవ్వరికీ తెలియదు.

శీల, గుణాధాముడగు రాముడు ఇట్లుఅందరిని ఆనందపరవశులను కావించుచు ముందుకు సాగెను. క్రొత్తగా పుట్టిన తమ లేగదూడలను ఇంటివద్దవిడచి. బలవంతమున మేతకై అడవులకు తోలుకొనిపోబడిన ధేనువులు సాయంసమయమున తమ పొందుగులనుండి పాలుకార, అంబాఅని అరచుచు ఊరివైపు పరుగెత్తుకొనివ్చచునట్లు ప్రేమతో ప్రభువు తల్లులెల్లరును కౌగలించుకొనెను. బహువిధములగు మృదువచనములను వారితో పలికెను.

విషమవియోగముచే జనించిన విషత్తు తొలగి, తల్లులందరు అమితానందమును. సుఖమునుపొందిరి.

లక్ష్మణుడు రామచరణరతుడని తల్లి సుమిత్ర గ్రహించి ఆమె తన తనయుని, కౌగలించుకొనెను. రాముని ఆలింగనము చేసికొనినప్పుడు కైకయొక్క మనస్సున మహాసంకోచము జనించెను. ఆమె మిక్కలి సిగ్గుపడెను.

లక్ష్మణుడు తల్లులెల్లరను కౌగలించుకొని వారి దీవనలనుపొంది ఆనందించెను. అతడు కైకేయిని పలుమారలు కౌగలించుకొనెను. కాని అతని మనసునందలి క్షోభతొలగిపోలేదు.

వైదేహి తన అత్తలను ఆలింగనముచేసికొనినది. వారి చరణములను గ్రహించి ఆమె అత్యంత ఆనందము పొందినది. ఆత్తలు అమెను కుశలప్రశ్నలు కావించిరి. "సదా సుమంగళీభవ" అని దీవించిరి. తల్లులందరు రఘుపతియొక్క వదన సరోజనమున వీక్షించి-అది శుభసమయమని గ్రహించితమ కన్నీటిని ఆపుకొనిరి. అతనికి అనేకవిధముల దృష్టి తీసివేసిరి. వారిహృదయముల పరమానంద, హర్షభరితములయ్యెను.

కౌసల్య మాటిమాటికి కృపాసింధుడు, రణధీరుడగు రఘువీరుని చూచును!

"ఆ లంకాపతిని ఎట్లు సంహరించెనమ్మా ఇతడు! ఈనా కుఱ్రలిద్దరు అతి సుకుమారులు! ఆ నిశాచరులో! మహాయోధులు! అతిబలులు!" అని ఆమె తన మనమున యోచించును. సీతీ లక్ష్మణ సహితుడగురాముని - మాత కౌసల్య వీక్షించును. ఆమె మనస్సు పరమానందనిమగ్నమై ఉన్నది. శరీరము పలుమారులు పులకించుచున్నది.

వీరవరుడగు లంకాపతి విభీషణుడు, కపీశడగు సుగ్రీవుడు. నలుడు వీలుడు, జాంబవంతుడు. అంగద, హనుమంతాది వానరవీరులెల్లరు మనోహర మానవశరీరము లను ధరించిరి. వారందురు భరతుని ప్రేమను, శీలమును, వ్రతమును అతి ప్రేమతో సాదరముగా ప్రశంసించిరి. నగరవాసుల ప్రవర్తననుచూచి వారికి ప్రభునిచరణములయందు కలభక్తిని కొనియాడిరి.

అంతట రఘుపతి సఖులనెల్లరును పిలచెను. "మునియొక్క పాదములను గ్రహించుడు. గురువగు వసిష్ఠుడు మాకులమునకు పూజ్యుడు. ఈయన కృపచేతనే దనుజులు రణమున సంహరింపబడిరి" అని వారితో చెప్పెను.

"మునిసత్తమా, అవధరింపుడు వీరెల్లరు నాసఖులు, సమరసాగరమున నాకు వీరు నావలైరి. నా హితమునకై వీరు తమ ప్రాణములనుసహితము అర్పించిరి.భరతునికంటె నాకు మీరు అధికప్రియులు"అని రాముడు వసిష్ఠునితో అనెను.

ప్రభుని వచనములను విని అందరు ఆనందమగ్నులైరి. ఇట్లు ప్రతినిమిషము వారికి నూతన ఆనందము జనించుచున్నది. అందరు అంతట కౌసల్యపాదములకు ప్రణమిల్లరి. కౌసల్య ఆనందమున వారికి ఆశీస్సుల నిచ్చెను. "రఘునాయకునివలె మీరునూ నాకు ప్రియులు" అని వచించెను. సుఖముల మూలకారణుడగురాముడు తన భవన మునకు వెడలెను. ఆకాశము పూలజల్లులతో నిండెను. అయోధ్యయందలి స్త్రీ పురుషబృందములు తమ మేడలపై, మిద్దెలపైఎక్కి ప్రభుని వీక్షించుచుండిరి.

సువర్ణకలశములను విచిత్రముగా ఆలంకరించి, సింగారించి పురజనులెల్లరు తమతమ వీధి గుమ్మములవద్ద ఉంచిరి శుభసూచకములుగా తోరణములను, పతాకములను, ధ్వజములను అలంకరించిరి. వీథులన్నిటియందు పరిమళద్రవ్యములను చల్లిరి. గజముక్తామణులతో నాలుగువీథులు కలియుచోట్లు అలంకరింపబడినవి. నానావిధములగు సుందర మంగళ ద్రవ్యములు సిద్ధము చేయబపడినవి. నగరమంతయు పలు భేరి నగారాలు మ్రోగుచున్నవి. ఎల్లచోట్ల ప్రభునికి స్త్రీలు దృష్టితీసి. కానుకలిచ్చి ఆనందభరిత హృదయములతో ఆశీర్వదించుచున్నారు. బంగారుపళ్ళెరములను బహువిధముల శృంగారించి,హారతులను అమర్చి-పలువురు యువతులు మంగళగీతములను పాడుచున్నారు. ఆర్తిహరుడు రఘుకుల కమల విసినదినకరుడుఅగు రామునికి హారతులిచ్చుచున్నారు. ఉమా, అయోధ్యాపురియొక్క శోభ, సంపద, కల్యాణములను నిగమములు, ఆదిశేషుడు, శారదయునుపొగడుదురు. కాని వారుకూడా ఈ చరిత్రను వీక్షించి ఆశ్చర్యచకితు లగుచున్నారు.

అట్టిచో నరుడు ఆ నగర గుణగణములను ఎట్లు వర్ణింపకలడు?

అయోధ్య అను సరోవరమున వసించు తెల్లకలువలనుపోలిన స్త్రీలు, రఘుపతి వియోగమను సూర్యరశ్మిచే వాడిపోయి, చంద్రునివంటి రాముని వీక్షించి తిరికి వికసించిరి. విరహభానుడు ఆస్తమించెను. నానావిధములగు శుభశకనములగు శుభశకునములు కనుపించినవి. నభమున దుందుభలు మ్రోగినవి. అయోధ్యాపుర స్త్రీలను, పురుషులను సనాథులను కావించి భగవానుడు తన భవనమునకు వెడలెను.

భవానీ, కైక లజ్జితయై ఉన్నట్లు ప్రభునికి తెలిపెను. అతడు ఆమెగృహమునకే మొదట ఏగెను. అతుడ కైకేయిని బహువిధముల ఓదార్చి, ఆనందింపచేసేను. పిదప హరిస్వీయభవనమునకు అరిగెను.

కృపాసాగరుడు తన మందరిమును చేరగనే పురమునందలి స్త్రీ, పురుషులు ఆనందించిరి, గురుడగు వసిష్ఠుడు ద్విజులను పిలిపించి "నేడు సుదినము మంచి ఘడియలు యోగముకూడా శుభ##మైనది, ద్విజులను తామెల్లరు శ్రీరామచంద్రడు సింహసనమును అధిష్ఠంప ఆనతిని దయచేయుడు" అని కోరెను. వసిష్ఠమునియొక్క సుందరవచనములను వినగనే సకలవిప్రులకు సంతోషము జనించెను.

"రామపట్టాభిషేకము జగదానంతకరము మునివార, ఇక ఆలస్యము చేయకుడు. మహారాజునకు తిలకము అలంకరించుడు" అని విప్రులు అనేకులు మృదువచన ములను పలికిరి.

అంతట వసిష్ఠముని సుమంత్రునికి ఆనతిఇచ్చెను. దానిని వినినంతనే సుమంత్రుడు సంతోషించివెడలి అనేకరథములను, అశ్వములను గజములను సిద్ధము చేయించెను. అన్నిచోట్లకు అతడు దూతలను పంపించెను. మంగళద్రవ్యములను తెప్పించెను. ఆనందమున తిరిగివచ్చి వసిష్ఠుని చరణమునకు నమస్కరించెను.

అయోధ్యాపురి అతి సుందరముగా ఆలంకరింపబడినది. దేవతలు విరులవానను విరివిగా కురిపంచిరి.

రాముడు సేవకులనుపిలచి "మీరువెడలి నా సఖులకు ముందు స్నానము చేయించుడు" అని అజ్ఞఇచ్చేను. ఆ ఆనతినివిని సేవకులు ఎక్కడివారక్కడ పరుగిడి వెడలిరి. సుగ్రీవదులకు స్నానము చేయించిరి. పిదప కరుణానిధి అగు రాముడు భరతునిపిలచి స్వహస్తములతో అతని జడలచిక్కులను విడతీసెను. భక్తవత్సలుడు, కృపాళుడు అగు రఘుపతి అంతట ముగ్గురు తమ్ములకు స్నానము చేయించెను. భరతుని భాగ్యమును, ప్రభుని కోమలత్వమును శతకోటి ఆదిశేషులై నను వర్ణింపజాలరు!

అనంతరము రాముడు తన జటాబంధమును విప్పెను. గురుని ఆనతిని కొని ఆతడు స్నానము చేసెను. మజ్జనమాడి స్వామి భూషణములను ధరించెను. ఆతని శరీరలావణ్యమును కనుగొని అగణిత రతిపతులు లజ్జచెందిరి!

అత్తలుజనకిని సాదరముగా వెంటనే స్నాననము చేయించిరి. జానకియొక్క అంగ అంగమును దివ్యవస్త్రములచే మేలైన ఆభరణములచే అలంకరించిరి.

రాముని నామభాగమున-రూప, గుణఖని అగు రమ శేభిల్లినది. వారినిచూచి తల్లులెల్లరు తమజన్మ సఫలమయ్యెనని తలచి సంతసించిరి.

ఖగేశ్వరా, వినుము. ఆసమయమున బ్రహ్మ, శివుడు మునిబృందములు, సకల దేవతలువిమానములను అధిరోహించి ఆనందమునకు మూలాధారుడగురాముని దర్శించుటకు ఏతెంచిరి. ప్రభుని వీక్షించి వసిష్ఠుని మనసు అనురాగభరితమయ్యెను. వెంటనే ఆ ముని రవిసన్నిభ##తేజముతో విలసిల్లు ఒక దివ్యసింహాసనమును తెప్పించెను. ఆ సింహాసనము వర్ణానాతీతము. తలవంచి ద్విజులకుమ్రొక్కి దానిపై రాముడు ఆసీనుడయ్యెను. జనకసుతా సమేతుడగు రఘుపతిచూచి మునిసముదాయములు హర్షము చెందిరి. ద్విజులు వేదమంత్రములనుపఠించిరి. గగనమునుండి "జయము-జయము" అని సురులు, మునులు ధ్వానములు చేసిరి, ప్రథముమున వసిష్ఠముని తిలకమున తాను అలంకరించుకొనెను. పిదప అతడు సకలవిప్రులకు అనతి ఇచ్చెను. సుతుని తిలకించి తల్లులు ఆనందించిరి. పలుమార్లువారు హారతులిచ్చిరి. విప్రులకు నానావిధములగు దానము లిచ్చిరి సకలయాచకులను ఆయాచకులను కావించరి. త్రిభుజ వననాథుని సింహసననమున వీక్షించి దేవతలు భేరులను మ్రోగించిరి.

ఆకాశమున నగారాలు అనేకములు మ్రోగినవి. గంధర్వులు కిన్నరలు గానముచేసిరి. దేవవేశ్యాబృందములు నాట్యము చేసిరి. సురులు, మునులు పరమానందమును పొందిరి భరతుడు, ఇతర సోదరులు, విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు మొదలగువారు ఛత్ర చామరములను, వ్యంజనములను, ధనువును ఖడ్గములను, డాలులను, శక్తులను చేతపట్టి విరాజిల్లిరి.

శ్రీసమేతుడు దినకరవంశభూషణుడు అగు రాముడు శరీరమున అనేక కాములకాంతి శోభిల్లుచున్నది. జలయుత నూతనమేఘములవలె సుందరశ్యామశరీరమున పీతాంబరము సురలమానసములను సహితము మోహపరవశము చేయుచున్నది. ముకుటము. సందికడయము మొదలగు విచిత్రభూషణములు రాముని ప్రతిఅంగమునను అలంకిరింపబడినవి. కమలనయనములు, విశాలవక్షస్థలము. పొడవగు బాహువులు కలిగిన - ఆ రాముని దర్శించునరులు ధన్యులు.

ఖగేశా, అశోభను ఆ సభను, ఆ ఆనందము నేను వ్రణింపజాలను శారద- శేషుడు. శ్రుతులు వానిని వర్ణింపకలరు. ఆ ఆనందము మహేశ్వరు డెఱుగును.

సురలెల్లరు వేఱువేఱు స్తుతులను చేసి తమతమ ధామములకు మరలిరి. అంతట వందీజనరూపములను తాల్చి శ్రుతులు రామునివద్దకు ఏతెంచెను. కృపానిధి, సర్వజ్ఞుడు ప్రభువు వారిని అత్యంతముగా ఆదరించెను. ఈ మర్మము ఎవ్వరు ఎఱుగరు. శ్రుతులు రా ముని గుణగానము ఇట్లు కావించెను.

''జయము-సగుణస్వరూపా, నీకు జయము. నిర్గుణస్వరూపా నీకు జయము. అనుపమ రూపలావణ్యాది, భూపాలశిరోమణీ, నీకు జయము. దశకంఠారాది ప్రచండ నిశాచరులను, ప్రబలులగు ఖలులను నీభుజబలముచే వధించితిని. మానవ అవతారమును ధరించి ప్రపంచభారమును తొలగించితిని. దారుణదుఃఖములను దహించితివి. ఆర్తరక్షణా, దయాళూ, నీకు జయము. శక్తిసంయుక్తుడవగు నీకు నమస్కరింతుము.

హరీ, నీ విషమమాయావశులై సురలు, అసురులు, నాగులు, నరులు, చరాచరజగమెల్లయు కాల, కర్మ, గుణయుతమగు రేయింబవళ్ళు అనంతమగు భవమార్గమున భ్రమించుచుండును. నాథా, వీరిలో నీవు కృప చూపినవారు త్రివిధదుఃఖములనుండి విడివడుదురు. భవభేదములను ఛేదించుటయందు నీవు దక్షుడవు. రామా, మమ్ము రక్షింపుము. నీకు నమస్కరింతుము. తాము జ్ఞానులమను గర్వముతో మత్తెక్కి, భవనాశకుడవగు నిన్ను భక్తితో ఆదరించనివారు- సుర దుర్లభమగు పదమును పొందినను హరీ, ఆ పదవినుండి పడిపోవుదురు. ఇది మేము చూచుచున్నదే. ఆశలన్నిటిని విడిచి, నీయందే విశ్వాసము ఉంచి, నీదాసులై ఉండువారు, నీనామమునే జపించి, ఏశ్రమయు లేకయే భవసాగరమును తరింతురు. అట్టి నిన్ను స్వామి, మేము స్మరింతుము.

శివుని బ్రహ్మచే పూజింపబడినవి ఏ నీచరణములో, ఏచరణ శుభరజమును స్పృశించి మునిపత్ని అహల్య తరించెనో, మునివందిత అగు సురనిది, త్రిలోకపావని గంగానది ఏ చరణనఖములనుండి జనించెనో- ధ్వజ, వజ్ర, అంకుశ, కమల చిహ్నములతో వెలసిన ఏచరణములు వనములయందు విహరించునపుడు ముండ్లు గ్రుచ్చుకొని కాయలు కాచెనో- అట్టి నీ చరణకమలద్వయమును ముకందా -రామా, రమేశా, నిత్యము మేము భజింతుము.

నీయొక్క మూలము'అవ్యక్తము, అనాది' అని నిగమములు, అగమములు వచించును. నాచర్మములు ఆరు, తనువులు ఆరు, శాఖలు ఇరువదిఅయిదు, పత్రములు అనేకములు, పుష్పములు పెక్కులు, తీయనివి, చేదైనది అగు రెండువిధములగు ఫలములు నీయందున్నవి. నీపైన తీగె ఒక్కటియే. దానినుండి నిత్యనూతనములగు పత్రములు, పుష్పములు జనించుచుండును. అట్టి వృక్షమును ఆశ్రయించి ఉండు వారము మేము విశ్వజగత్‌ వృక్షస్వరూపుడవగు నీకు నమస్కరింతుము. ''అజుడు, అద్వైతుడు, అనుభవజ్ఞేయుడు, మనస్సునకు అతీతుడు'' అని బ్రహ్మమును ధ్యానించు వారు వర్ణింతురు బ్రహ్మమును, ఇట్లే వారు తెలియనిమ్ము, కాని కరుణానిలయా ప్రభూ, సుగుణాకారా, దేవా నీయొక్క సగురుణయశస్సునే నిత్యము మేము కీర్తింతుము మనోవాక్‌, కర్మలయందు వికారములను విడిచి మేము నీ చరణానురాగులమై ఉండునట్లు వరమిమ్ము''.

అందరు చూచుచుండగనే వేదములు ఈ ఉత్తమప్రార్థననుకావించి అంత ర్థానమై బ్రహ్మలోకమునకు వెడలెను.

వైనతేయా, వినుము అంతట శంభుడు రఘవీరునివద్దకు ఏతెంచి, సంపూర్ణ పులకింతశరీరుడై, గద్గదకంఠమున ఇట్లు ప్రార్తించెను.

''రమా, రమారమణా, నీకు జయము, భవతాపవిభంజనా, నీకు జయము భవభయచుములచే కలతపడిఉన్న ఈ సేవకుని రక్షింపుము. అయోధ్యాదిపతి, సురేశా, రమేశా, విభూ , శరణాగతుడను ప్రభూ, నన్ను రక్షింపుము.

పదితలలు, ఇరువదిబాహువులు కలిగిన రావణుని వినాశమొనర్చి, భూతలము నందలి మహారోగములన్నిటిని దూరము చేసితివి. నిశాచరసమూహములనబడు మిడుతలు నీబాణాగ్నియొక్క ప్రచండతేజముచే భస్మమయ్యెను.

నీవు మహీమండలమునకు అతి రమణీయ ఆభరణమవు, వరచాపబాణ ధరుడవు మహామదము, మోహము, మమత అను నిశయందు క్రమ్ముకొన్న గాఢాంధకారమును పారద్రోలు ప్రచండభాస్కరుడవు నీవు. మన్మథుడును కిరాతుడు మానవమృగముల హృదయములను దుష్టభోగములనబడు శరములతోకొట్టి-బాధించును. హరీ, స్వామి, ఆకిరాతుని వధించుము. విషయవనములయందు ఆసక్తులైపడిఉన్న ఈ పాపములను, అనాధులను, రక్షింపుము. జనులు నీ చరణములను నిరాదిరంచి అనేక రోగములచే , వియోగములపాలగుచున్నారు. నీపాదములను నిరదరించుటచే కలిగిన ఫలమే ఇది. నీచరణకమలములయందు భక్తిలేనివారు అగాథమగు భవసాగరమున పడిపోవుదురు. నీపాదపద్మములయందు ప్రీతిలేనవాడు నిత్య దీనాతిదీనుడు, మలినుడు దుఃఖి....... నీకథలను అవలంబము కావించుకొన్నవాడు మహాత్ములను, నిన్ను సదా ప్రియులుగా ఎంతురు. రాగ, లోభ, గర్వ, మదములు వారికి ఉండవు. సంపదలు , ఆపదలు సమానమే వారికి. కనుకనే మునులు యోగమును, యోగసాధనమును సర్వదా విడిచి ఆనందమున నీ సేవకులగుదురు. నియమయుతులై ప్రేమపూర్వకముగా నిరంతరము నిశుద్ధహృదయమున నీపాదపంకజములను సేవింతురు. ఆదరమును, నిరాదరమును సమానముగా భావించి అట్టి సాధుసత్పురుషులు సఖులై మహీతలమున సుఖముగా చరింతురు.

మునిమానస కమలభృంగమా, రఘువీరా, అజేయుడగు మహారణధీరా, నిన్ను భజింతును. హరీ నీనామము జపింతును, నీకు నమస్కరింతును. భవరోగుము నకు నీవు ఔషదము. గర్వమునకు నీకు రిపుడవు, గుణ, శీలములకు, కృపకు నీవు ఉత్తమనిలయుడవు. శ్రీరమణుడవు, నీకు నిరంతరముప్రణమిల్లుదును. రఘునందనా, ద్వంద్వములను హరింపచేయుము. భూపాలా, ఈ దీనజనునివంక చూడుము. నీపాదసరోజములయందు స్థిరమగు భక్తిని, నీభక్తులతో నెయ్యము నాకు సదా కలుగు నట్లు వరము ప్రసాదించుము. పదేపదే ఈ వరమునే నేను వేడుచుంటిని. శ్రీరంగా, సంతోషముతో ఈవరమిమ్ము.''

ఇట్లు రాముని గుణములనవర్ణించి ఉమాపతి ఆనందమున కైలాసమునకు మరలెను.

అంతట ప్రభువు కపులందరికి సర్వవిధముల సుఖప్రదమగు వసతిమందిరములను ఏర్పాటు చేయించెను.

ఖగపతీ, వినము. ఈకథ పావనమైనది. త్రివిధతాపములను, భవభయమును నాశనమొనర్చునది, శ్రీరామచంద్ర మహారాజుయొక్క శుభమయ పట్టాభిషేక చరిత్రను వినిన నరులు వివేక, వైరాగ్యములను పొందురు. నకాములై ఈ కథను వినువారు, గానము చేయువారు, నానావిధసంపదలను, సుఖములను ఆర్జింతురు. సుర దుర్లభమగు సుఖములను అనుభవించి అంతమున రఘుపతియొక్క పురుమునకు చనుదురు.

దీనిని వినిన జీవన్ముక్తులకు భక్తిసంప్రాప్తించును. విరాగులకు ముక్తి చేకూరును. విషయాసక్తులకు నిత్యనూతనసంపత్తి లభించును.

ఖగేశ్వరా, నాబుద్ధిబలమును అనుసరించి- భయ, దుఃఖములను హరించు ఈ రామకథను వర్ణించితిని. ఇది వైరాగ్యమును, వివేకమును, భక్తిని దృఢపరచును, మోహమును నదిని దాటుటకు ఇది చక్కని నావ.

కోసలపురియందు నిత్య నూతన మంగళోత్సవములు జరుగుచున్నవి. అన్నివర్గములప్రజలు ఆనందమున జీవించుచున్నారు. బ్రహ్మ, శివుడు, మునులు నమస్కరించు రామపాదపంకజములయందు ఎల్లరకు నిత్య నూతనప్రీతి కలుగుచున్నది. భిక్షకులు అనేకవిధములగు వస్త్రములు, ఆభరణములు పొందిరి, నానావిధములగు దానములను ద్విజులు పొందిరి.

కపులెల్లరు బ్రహ్మానందమగ్నులై ఉండిరి. ప్రభునిపాదములయందు వారి కెల్లరకు భక్తి, దినములు గడుచున్నట్లే వారికి తెలియుటలేదు. ఇట్లు ఆరునెలలు గడచినవి. తమఇండ్లను కపులు మరచిరి, సాధు, సజ్జనుల మనస్సులయందు పరద్రోహప్రసక్తి ఎన్నడూ రానట్లు -వానరులకు కలలోనైనను వారి ఇండ్లను గరించిన స్మరణ కలుగటయే లేదు.

అంతట ఒకనాడు సఖులనెల్లరును రఘుపతి పిలిపించెను. వారందరు వచ్చిరి. సాదరముగా నమస్కరించిరి, పరమప్రీతితో రాముడు వారిని తనవద్ద కూర్చుండపెట్టుకొనెను. భక్తసుఖప్రదుడగు అతడు ఇట్లు మృదువచనములను పలికెను:-

''మీరందరు నాకు మిక్కుటమగు సేవచేసితిరి. మీఎదుట ఎట్లు పొగడగలను నేను? నాహితమును గురించి ఇండ్లను మీరు విడిచితిరి. సర్వసుఖములను త్యజించితిరి. మీరెల్లరు నాకు అత్యంతప్రియులు, అనుజులు, రాజ్యము సంపద, వైదేహి, దేహము, గేహము , పరివారము, మిత్రులు అందరు నాకు ప్రియులే. కాని మీకు సమానులుకారు. నేను అసత్యమును పలుకను, ఇదినాస్వభావము. ఎల్లరుకు తమసేవకులయందు ప్రేమయే. ఇదిఒకనియము. నాకు మాత్రము నాదాసులపై అధిక మగు ప్రేమ.

సఖులారా, ఇకమీరందరు మీమీ గృహములకు మరలుడు, దృఢనియముముతో అచ్చటనే నన్ను భజించుచుండుడు. నేను సర్వవ్యాపకుడననియు, సర్వహితకరుడననియు గ్రహించి నన్ను మిక్కుటముగా ప్రేమించుడు''.

ప్రభుడు నుడివిన పలుకులను విని అందరు ప్రేమమగ్రులైరి. తామెవ్వరో ఎచ్చట ఉన్నారో- అనునదికూడా మరచిరి. తమ దేహస్మృతినే వారు విస్మరించిరి. చేతులు జోడించి వారెల్లరు రెప్పవాల్చక చూచుచుండిరి. మహా అనురాగముచే వార ఏమియు పలుకజాలక ఉండిరి. వారి పరమప్రేమను గమనించి స్వామివారికి అనే విధముల జ్ఞానవిశేషములను ఉపదేశించెను. స్వామి సమ్ముఖమున ఏమియు వారు నుడవలేక ఉండిరి. అతని పాదసరోజములను వారు పదేపదే వీక్షించుచుండిరి.

అంతట, ప్రభువు రంగు రంగుల, అనుపమమగు అనే సుందరవస్త్రములను భూషణములను తెప్పించెను. మొట్టమొదట భరతుడు స్వహస్తములతో అలంకరించి సుగ్రీవునికి వస్త్రాభరణములన బహూకరించి, వానిని ధరింపచేసెను.

ప్రభునియొక్క ప్రేరణచే లక్ష్మణుడు వస్త్రములను, ఆ భూషణములను రఘుపతి మనసునకు నచ్చిన వానిని విభీషణునికి బహూకరించెను. అంగదుడు కూర్చుండిఉన్నాడు. కూర్చున్నచోటునుండి కదలలేదు. అతని ప్రేమనుకనుగొని ప్రభువు అతనిని పిలవలేదు. జాంబవంతుడు , నీలుడు మొదలగు వారికి ఎల్లరకు రఘునాథుడు వస్త్రము లను, భూషణములను బహూకరించి వారిచే ధరింపచేసెను. రాముని రూపమును తమ హృదయములధరించి, రామపాదములకు తలలు వంచి, జలభరిత నయనములతో చేతులు జోడించి అతివినీతుడై, ప్రేమరసమున మునిగిన వచనములను ఇట్టు నుడివెను:-

''సర్వజ్ఞా, కృపాసింధూ, అవధరింపుము, సుఖసాగరా, దీనదయాళూ, ఆర్తసింధూ, నాథా, నాతండ్రి అగు వాలి తన మరణసమయమున నన్నునీ ఒడిలో పెట్టెను. భక్తహితకారీ, 'శరణులేనివారికి నేనే శరణ్య'మను నీబిరుదను స్మరించుము. నన్ను త్యజింపకుము. నాకు ప్రభువు, గురువు, తల్లి, తండ్రి సర్వమునీవే. నీపాదకమలమును వీడి ఎందుకుపోదును? నరనాథా, నీవే ఆలోచించి తెలుపుము. నిన్ను విడిచినపిదప ఇక నాఇంటితో ఏమిపని నాకు? జ్ఞానము, బుద్ది, బలము లేని ఈ బాలకునికి, దీనునికి శరణ్యము ప్రసాదించుము. నీ ఇంట నీచాతినీచమగు సేవ నేను చేతును నీచరణపంకజములను వీక్షించచు భవసాగరమును తరింతును''.

ఇట్లు పలికి అంగదుడు ప్రభునిపాదుములపై పడెను. ''ప్రభూ, పాహిమాం, నాథా, నన్ను ఇంటికి పొమ్మని ఇక చెప్పవలదు'' అనెను. అంగదుని వినమ్రవచన ములను విని అపారకరుణానిధి అగు రఘుపతి అతనిని లేవనెత్తెను.అతని తన హృదమునకు హత్తుకొనెను. రాముని రాజీవనేత్రములు నీరునిండెను. తన కంఠమునందలి మాలను, కొన్ని వస్త్రములను, మణులను వాలి తనయునకు రాముడు బహూకరించి ధరింపచేసెను. అనేక విధముల ఓదార్చి అంగదునకు వీడ్కోలు పలికెను. భక్తుడగు అంగదుడు తమకు చేసిన సహాయమును మనమున ఇడుకొని అనుజ సౌమిత్రి సహితుడై భరతుడు అంగదుని సాగనంపుటకై వెడలెను. అంగదునిహృదయమున అత్యధికమగు ప్రేమభక్తికలదు. మాటిమాటికి అతడు వెనుకకు తిరిగి రామునివంకచూచుచుండెను. పదేపదే సాష్టాంగప్రణామము చేయుచుండెను. ''రాముడు నిన్ను ఉండుమని అనినచో ఎంత అదృష్టము?'' అని తలచుచుండెను. రాముని కృపావిలోకములను, మాటలను, నడకలను స్మరించుచు, స్మరించుచు , రాముడు నవ్వుచూ కలసికొనువిధమును గుర్తునకు తెచ్చుకొనుచు అంగదుడు చింతించుచుండెను. ప్రభుని ఇంగితమును గ్రహించి, అనేక వినయవచనములను వచించి, రాముని చరణపంకజములను తన హృదయమునధరించి అతడు వెడలెను. అత్యంత ఆదరమున కపులనందరిని సాగనింపి తమ్ములతో భరతుడు తిరిగివచ్చెను.

అంతట, హనుమంతుడు సుగ్రీవుని చరణములను పట్టుకొని పలువిధముల ప్రార్థించెను. ''దేవా పదిదినములు రఘపతి చరణములను సేవించి వచ్చి నీపాద ములను దర్శింతును''అని అతడు నుడివెను.

''పవనకుమారా, నీవు పుణ్యరాశివి, వెడలి కృపానిలయుని సేవించుము'' అని సుగ్రీవుడు చెప్పెను. ఇట్లు పలికి వానరులెల్లరు వెడలిరి.

''హనుమా, వినుము, చేతులు జోడించి నీకు వచింతును. ప్రభునికి నాసాస్టాంగనమస్కారములు తెలుపుము. రఘునాయకునికి నన్ను పలుమార్లు గుర్తునకు తెచ్చు చుండుము'' అని పలికి వాలిసుతుడు అంగదుడు పయనయ్యెను.

హనుమంతుడు తిరిగివచ్చి అంగదుని ప్రేమను ప్రభునికి వర్ణించెను. దానిని విని భగవానుడు ప్రేమమగ్ను డయ్యెను.

''ఖగేశా, రాముని చిత్తము వజ్రముకంటె కఠోరము, సుమములకంటె అతి కోమలము, ఇకచెప్పుము. దీనిని ఎవరు గ్రహింపగలరు?'' అని కాకభుశుండి అనెను.

అనంతరము , కృపాళుడు రాముడు నిషాదునిపిలిపించి అతనికి భూషణమును, వస్త్రములను , ప్రసాదమును బహూకరించెను, '' ఇక నీవునూ ఇంటికి మరలిపొమ్ము, నన్ను స్మరించుచుండుము. మనోవాక్‌ కర్మలయందు ధర్మమున అనుసరింపుము. నీవు నాసఖుడవు. భరతునివంటి సోదరుడవు. ఈపురము నకు వచ్చుచు పోవుచూ ఉండుము''అని అతడు వచించెను.

ఈ మాటలు వినగానే నిషాదునికి మిక్కుటమగు ఆనందము జనించెను. కన్నులనీరునిండగా అతడు రాముని యొక్క చరణములపై పడెను. రాముని చరణములను తన హృదమున నిలిపి గుహుడు ఇంటికి మరలెను. తన పరిజనులకు ప్రభునియొక్క స్వభావమును తెలిపెను.

రఘుపతియొక్క చరితను కనుగొని అయోధ్యాపురవాసులెల్లరు ''సుఖరాశి అగు రాముడు ధన్యుడు!'' అని పదేపదే కొనియాడుచుండిరి.

రాముడు సింహాసనమును అదిష్ఠించినంత- ముల్లోకములు ఆనందించెను. వాని శోకమంతయు తొలగెను. ఒకరినొకరికి వైరము లేదు. రాముని ప్రతాపముచే వైషమ్యములన్నియు నశించెను. అందరు తమతమ వర్ణాశ్రమధర్మనిరతులై ఉండిరి . ఎల్లరు వేదమార్గమున సదాచరించుచుండిరి. సుఖించుచుండిరి. ఎవ్వరికీ ఎట్టి భయము లేదు. శోకములేదు. రోగములేదు. రామరాజ్యమున దైహిక, దైవిక, భౌతికతాపములు ఎవ్వరికి సోకుటలేదు. జనులెల్లరు ఒకరినొకరు ప్రేమించుచుండిరి. వేదనిర్ణయరీతిని స్వధర్మనిరతులై ఎల్లరు చరించుచుండిరి. సకలజగమున ధర్మము నాలుగు సాదములు సంపూర్ణముగా స్థాపింపబడినవి. కలలోనైనను ఎక్కడా పాపమనుమాట లేదు. స్త్రీలు , పురుషులు అందరు రామభక్తికిరతులే, అందరు మోక్షమునకు అర్హులే. అకాలమరణములు లేవు. ఎవ్వరికి ఏవిధమగు బాధయూలేదు. అందరిశరీరము సుందరములే, రోగములేనివే, దరిద్రుడెవ్వడూ, లేడు, దుఃఖితుడు లేడు. దీనుడు లేడు. పండితుడు కానివాడు లేనేలేడు, శుభలక్షణములు లేనివాడు లేనేలేడు. అందరు దంభరహితులే, ధర్మరహితులే, పుణ్యాత్ములే, స్త్రీలు, పురుషులు అందరు చతురులు గుణవంతులు, గుణజ్ఞులు, పండితులు, జ్ఞానులు, కృతజ్ఞులు, ఎవ్వరూకపటమున చతురులకారు.

పక్షిరాజా, వినుము, రామరాజ్యమున చరాచరజగమున ఎక్కడనూ కాల, కర్మ, స్వభావగుణములచే జనించిన దుఃఖము ఎవ్వరికినీ లేనేలేదు.

సప్తసాగర, మేఖలావలయిత వసుంధరకు ఒక్కడే ప్రభువు. కోసలాధిపతి అగు రఘుపతి యే, ఎవనియొక్క రోమరోమమునకుఅనేక భువనములన్నవో అట్టి వానిని ఈ సప్తద్వీపములపై ప్రభువనుట గొప్పఅగునా? ప్రభుని మహిమను తెలిసికొననినివానికి ఈ వర్ణన అల్పమే కాగలదు, ఖగేశా, అతని మహిమని ఎఱిగినవారైనను ప్రభుని ఈ లీలలయందు ప్రేమమగ్రులగుదురు. అతని మహిమను తెలిసినఫలము ఈ లీలలను అనుభవించుటయే అని ఇంద్రియములను తమవశము కావించుకొనిన మహా మునివరులు వచింతురు. రామరాజ్యమునందలి సుఖసంపదలను అదిశేషుడు, సరస్వతియు వర్ణింపజాలరు.

స్త్రీలు, పురుషులు అందరు ఆ రాజ్యమున పరోపకారులు, విప్రచరణసేవకులు, పురుషలెల్లరు ఏకపత్నీవ్రతులు, స్త్రీలందరు మనోవాక్‌కర్మలయందు పతిహితకరులే , రామచంద్రుని రాజ్యమున దండము యతులచేతులలోనే ఉండెను. 'భేదములు' నర్తకుల, నృత్యసమాజముల తాళములయందే మిగిలెను. 'జయము' అనుశబ్దము మనస్సును జయించుటను తెలుపుటకే ప్రయోగింపబడెడిది. వనములయందలి వృక్షములు సదా ఫలించుచున్నవి. ఏనుగులు , సింహములు ఒకే చోట నివసించుచున్నవి.పక్షులు, పశువులు తమ సహజవైరములు మరచి, పరస్పర ప్రేమను పెంపొందించు కొనినవి. పక్షులు మధురముగా కూయుచున్నవి. నానావిధమృగసమూహములు అడవులలో నిర్భయముగాచరించుచున్నవి. ఆనందించుచున్నవి. శీతల, మంద, సుగంధ వాయువులు వీచుచున్నవి. తుమ్మెదలు మకరందమును గ్రహించి జుమ్మని రొద చేయుచున్నవి.

లతలు, వృక్షములు-కోరినదే తడవుగా మకరందమును స్రవించున్నవి. ధేనువులు కోరినన్ని పాలిచ్చుచున్నవి. ధరణి సదా సస్యసంపన్నయై ఉన్నది. త్రేతా యుగున కృతయుగమునందలి పరిస్థితి ఏర్పడెను.

జగన్మాత రాజయ్యెనని గిరులన్నియు తెలిసికొన్నవి. అవి వివిధమణిగనులను వెలువరచినవి. నదులన్నిటియందు శీతల, నిర్మల, సుఖద, రుచికర, శుద్దసలిలము ప్రవహించుచుండెను. సముద్రము తన పరిమితిలోనిలచెను. జనులు గ్రహించుటకు అనువుగా తన కెరటములతో రత్నములను గట్టున పడవేయుచుండెను. తటాకము లన్నియు కమలభరితములయ్యెను. దశదిశలు -సకలప్రదేశములు అత్యంతప్రసన్నముగా ఉండెను.

రామరాజ్యమున చంద్రుడు తన సుధాకిరణములతో మహీతలనమును ముంచి వేయుచుండెన. సూర్యుడు అవసరమైనంతవరకే ప్రకాశించుచుండెన. మేఘములు వనలయునంతవర్షమునే కురియుచుండెను. రామప్రభువు కోట్లకొలది అశ్వమేధయాగుమలను చేసెను. ద్విజులకు, అనేక దానములిచ్చెను. శ్రుతిపథపాలకుడు, ధర్మధురంధరుడు గుణాతీతుడై, భోగమున పురందరతుల్యుడై రాజ్యము పరిపాలించుచుండెను.

సౌంధర్యఖని, సుశీల, వినీత అగు సీత సదా పతికి అనుకూలమున వర్తించు చుండెను. కృపాసాగరుడగు రాముని మహిమ ఆమెకు తెలియును. తనమనస్సును లగ్నముచేసి ఆమె చరణకమలమును సేవించుచున్నది. ఇంట అనేకులు సేవికలు, సేవుకులున్నారు. వారెల్లరు సేవలొనర్చుటయందు నిపుణులు. ఐనను, ఆయెయే ఇంటిపన్నులన్నియు స్వహస్తములతోనే చేయును రామచంద్రుని ఆజ్ఞలను ఆమెపాలించెను. కృపాసాగరుడగు రామునికి ఆనందప్రదములగు పనులన్నియు ఆమె నిర్వర్తించును. సేవావిధులన్నియు ఆమెకు తెలియును. గర్వము, దురభిమానము లేక ఆమె కౌసల్యాది అత్తలను ఇంట సేవించును. ఉమా, బ్రహ్మాదులు రమకు వందనము సేతురు. ఆమె జగదాంబ, సంతతము ఆనిందిత, ఏతల్లి యొక్క కృపాకటా క్షమును దేవతలు వాంఛింతురో, ఏ అమ్మ వారివంక కన్నెత్తిచూడనైనను చూడదోఅట్టి సీత, స్వీయమహామహిమను మరచి రామపాదారవిందములయందు నిరంతరము అనురక్తయై ఉన్నది. తమ్ములందరు అనుకూలురై రాముని సేవించుచున్నారు. రామచరణములయందు వారికి అధికప్రీతి. ''కృపాళుడు మాకు ఎన్నడైనను- ఏ సేవనైనను ఒప్పగించువా!'' అనివారు ప్రభుని ముఖకమలమును వీక్షించుచుందురు.

రాముడు తమ్ములను ప్రేమించును. వారికి అనేకవిధములగు నీతులను బోధించును. అయోధ్యనగరవాసులు ఆనందమును నివసించుచు దేవతలకు సహితము దుర్లభమగు సకలభోగములను అనుభవించుచుండిరి. వారు అహర్నిశలు విధిని కొనియాడుదురు. శ్రీరఘువీరునియొక్క చరణకమలములయందు భక్తిని వరమిమ్మని వాంఛింతురు.

సీతకు ఇరువురు సుందరసుతులు జన్మింతరు. లవుడు, కుశుడు అని వారి పేర్లు, వారిని వేదములు, పురాణములు స్తుతించినవి. ఆసుతులిరువురు విజయములు, వినమ్రులు, సద్గుణధాములు, అతిసుందరులు, హరికి ప్రతిబింబములో అనునట్లుందురు. రాముని సోదరులకు కూడా ఒక్కక్కరికి ఇద్దరు పుత్రులు జన్మింతురు. వారునూ అతి సుందరులు, గుణవంతులు, శీలవంతులు, జ్ఞానమునకు, వాక్కునకు, ఇంద్రియములకు అతీతుడు-వాణికి అగోచరుడు, అజుడు, మాయాతీతుడు, గుణాతీతుడు, మనస్సునకు అతీతుడు, సచ్చిదానంద ఘనుడు అగు రాముడు ఉత్తమ మానవలీలలను సృజించుచున్నాడు.

ప్రాతఃకాలమున రాముడు సరయూనదిలో స్నానముచేయును. ద్విజ, సజ్జన సభయందు ఆసీనుడగును. వేద, పురాణములను వసిష్టుడు వివరించును. సర్వము తెలిసినవాడే ఐనను వానిని అన్నిటిని రాముడు వినును. తమ్ములతో కలసి అరగించును. వారినిచూచి తల్లులెల్లరు ఆనందభరితులగుదురు. పవనసుతునితో కలసి భరతశత్రుఘ్నలు ఉపవనమున కేగుదురు. అచ్చట కూర్చుండి రాముని గుణగాథలను గురించి హనుమంతుని ప్రశ్నింతురు. సన్మతితో రాముని గుణగుణములను అతి వివేకముతో అతడు వర్ణించును. ప్రభుని నిర్మలగుణములను విని భరతశత్రుఘ్నులు మహాఆనందము పొందుదురు. చెప్పినవానినే పలుమార్లు చెప్పించుకొందురు. ఇంటింటను పురాణములు, పావనరామచరిత, కథలు శ్రవణము చేయబడుచున్నవి. స్త్రీలు, పురుషులు రాముని గుణములను వర్ణింతురు, రాత్రులు , పగళ్లు గడచుటయే తెలియదు వారికి.

రాముడు రాజై విరాజిల్లు ఆ ఆయోద్యాపురవాసుల సుఖసంపదలను వేయి మంది శేషులైనను వర్ణింపజాలరు. నారద, సనత్కుమారాది మునీశ్వరులెల్లరు కోసలాధీశుని దర్శించుటకు ప్రతిదినము అయోధ్యకు ఏతెంతురు. ఆ నగరమును వీక్షింతరురు. తమ వైరాగ్యమును విస్మరింతురు.

అయోధ్యయందు దివ్యమణినిర్మిత మందిరము లున్నవి. ఆ నగరియందలి మేడల యుందున్న వసారాలు సువర్ణ ఆభరణములతో అలంకరింపబడి ఉండును. వీథులకు ప్రక్కఉన్న చక్కని కాలిబాటలు పలురంగులతో అలంకరింపబడి ఉండును. నగరమునకు చుట్టు ప్రాకారము, దానియందలి బురుజులన్నియు పలురంగులలో చిత్రింపబడినవి. నవగ్రహములు ఒక మహాసేనను సిద్ధముచేసి, అమరావతికి వచ్చి దానిని ముట్టడించినట్లు కనుపించును. రంగురంగుల రత్నములతో ధరణి గచ్చు చేయబడినదా అను నట్లుండును. దానిని చూచి మునివరుల మనములైనను నాట్యముచేయును.

ఆకాశమును చుంబించు ఉజ్జ్వలమందిరములు ఆ భవనములపై -సూర్య, చంద్రులకాంతిని దిక్కరించు కలశములు, భవనమునకు-మణులచే నిర్మింపబడిన అనేక గవాక్షములు శోభాయమానముగా ఉండును. భవనములయందు మణిదీపములు ప్రకాశించుచుండును. పగడములతో నిర్మింపబడిన గడపలు తళుకుమనుచుండును. మణులతో నిర్మింపడిన స్తంభములు, మరకతమణులుపొదిగిన బంగారుగోడలు- బ్రహ్మప్రత్యేకముగా నిర్మించెనా అనునంత మనోహరముగాఉండును. సుందర, మనోహర, విశాలభవనములు, వానికి రమణీయముగా నిర్మింపబడిన స్ఫటికపు ముంగిళ్ళు, ప్రతిద్వారమునకు సానపట్టిన, అనేకవజ్రములు పొదగిన బంగారుతలుపులు.

ప్రతిఇంట-రమ్యమగు చిత్రశాలలు, ఆచిత్రములలో చక్కగా చిత్రింపబడిన రామచరిత ఆచిత్రములను చూచిన మునులమనస్సులు సహితము సమ్మోహితమగును. ప్రజలెల్లరు వివిధరీతులగు పూలవాటికలను శ్రద్ధతోపెంచి పోషింతురు. ఆ వాటికలయందు అనేకజాతుల రమణీయ, లలిత లతలు -వసంతమునవలె సదా పుష్పించును. తుమ్మెదలు మంజుల మనోహరస్వరముతో జుంజుం అనును. త్రివిధముగు సుందరవాయువులు సదావీచును. మధురముగాపలుకు, రమ్యముగా ఎగురు. నానావిధములగు పక్షులను బాలురు పెంచుచుందరు. నెమళ్ళు, హంసలు, నారాయణ పక్షులు, పావురములు, ఇండ్లపైకడు శోభిల్లుచుండును. అక్కడక్కడ తమ ప్రతిబింబములను ఆ పక్షులు కనుగొని అనేకరీతుల మధురముగా పలుకుచుండును. నృత్యము సలుపుచుండును. బాలకులు'' రామా, రఘపతీ, జనపాలకా'' అన మాటలను చిలుకలకు, శారికలకు నేర్పుచుందురు.

రాజద్వారము సర్వవిధముల రమణీయమై ఉన్నది. వీధులు నాలుగుమార్గములు కలియుచోట్ల, వ్యాపారస్థలములు అన్నియు అందముగా ఉన్నవి. వానిని వర్ణింపలేము. మూల్యము చెల్లించనక్కరలేకయే అక్కడ వస్తువులు లభించును. రమానివాసుడు రాజై ఉన్నచోట సంపదలను వర్ణించుట ఎట్లు? వస్త్రవ్యాపారులు, చిల్లరవ్యాపారులు, ఇతరవ్యాపారస్థులు అనేక కుబేరులవలె తమ అంగళ్ళవద్ద కూర్చుండి ఉందురు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరు సుఖులే , సచ్చరితులే సుందరులే.

అయోధ్యకు ఉత్తరదిశను సరయూనది ప్రవహించును. దానినీరు నిర్మలమై , ఆనది గంభీరమై ఉండును. మనోహరఘట్టములు నదికి నిర్మింపబడినవి. గట్లమీద కొంంచెమైనను బురద ఉండదు. అనతిదూరమున - గుఱ్ఱములు, ఏనుగులు అన్నియు నీరుత్రాగు ఘట్టమున్నది. స్త్రీలు నీరు తీసుకొనివెళ్లుటకు పెక్కు రేవులున్నవి. కడుమనోమరమైనవి అవి. ఆ రేవులలో పురుషులు స్నానము చేయరు.

రాజఘట్టము అన్నివిధముల రమణీయమై, శ్రేష్ఠమై ఒప్పును. దానియందు నాలుగువర్ణములవారు స్నానము చేతురు. నదీతీరమున దేవాలయులు వానికి నాలుగు వైపుల చక్కనితోటలు, నదీతీరమున అక్కడక్కడ నిరక్తులు, జ్ఞాననిరతులగు మునులు, సన్యాసులు వసింతురు. అచ్చటచ్చట నదిగట్టున మనోహరమగు తులసి వృక్షములు అనేకములు-మునులు నాటినవి కలవు. ఆపురియొక్క శోభను ఎంతమాత్రము వర్ణింపజాలము. నగరమునకు వెలుపలకూడా సుందరముగనే ఉండును. వనములు, ఉపవనములు, సాటిలేని తటాకములు, చిన్నచెరువులు మనోహర విశాల కూపములు కలిగిన ఆ పురిని చూచిన చాలు పాపములన్నియు పటాపంచలగును. సుందరసోపానములతో, నిర్మలజలముతో ఆనగరముతో ఆనగరమునందలి అనుపమ వాపీ కూప తటాకమలు మనోహరములై శోభిల్లుచున్నవి. తటాకములలో బహురంగుల కమలము లున్నవి. అచ్చట పలుఖగముల కిలకిలలు, తుమ్మెదల రొదలు ప్రతిధ్వనించును. కోయిలల కుహూకుహూలతో, పక్షులరవములతో రమ్యముగ ఆరామములు బాటసారులను ఆహ్వానించుచున్నట్లుండును.

రమానాథుడు రాజ్యమేలు ఆనగరమున వర్ణింపగలమా? ఆణిమాదిసిద్ధలు, సకల సుఖసంపదలు అయోధ్యయందు సదావసియించి ఉన్నవి. ఎల్లచోట్ల నరులు రఘుపతి యొక్క గుణములను కీర్తింతురు. కూర్చుండి ఒకరు మరిఒకరికి ''శరణాగత రక్షకుడుగు రాముని భజింపుము''అని భోదింతురు.

''కమలనేత్రుడు, శ్యామలగాత్రుడు, కంటికి రెప్పలవలె సేవకులను రక్షించువాడు, సుందరధనుర్భాణ తూణీరధరుడు, మహాత్ములనబడు కమలవనమబునకు రవి-రణధీరుడు-అట్టి రాముని భజింపుడు. కాలుడను భయంకరసర్పమును భక్షించు గరుడుడు రాముడు, నిష్కామభావమున నమస్కరించినచో మీ మమతను హరించును శ్రీరాముడు, లోభ మోహములనబడు మృగయాధములను నాశనమొనచ్చుటకు కిరాతుడు రాముడు. మన్మథుడనబడు మత్తగజములకు అతడు సింహము. సేవకజన సుఖప్రదాత రాముడు. అట్టి రాముని భజించుడు. సంశయము, శోకము అను ఘోర అంధకారమును హరించు సూర్యుడు శ్రీరాముడు. ధనుజులనబడు నిశాచరవనమును దహించు అగ్ని ఆతడు, భవభయమును భంజనమోనర్చువాడు శ్రీరాముడు. జనకసుతా సమేతుడగు రఘువీరుని ఏల భజించరు? బహువాసనలు అనబడు దోమలను నాశనముచేయు హిమరాశి శ్రీరాముడు, నిరంతరము ఒకేరీతిని ఉండువాడు. పుట్టుకలేనివాడు, నాశనములేనివాడు, మునులను రంజించువాడు, భూభారమును భంజించువాడు. తులసీదాసుని ప్రభువు''ఆ రాముని భజించుడు''అని ఇట్లు నగరమందలి స్త్రీలు, పురుషులు రాముని గుణగానము చేయుచున్నారు. కృపానిధి అగు రాముడు సంతతము సర్వుల యందు ప్రసన్నుడే. ఖగేశా, రామప్రతాపమని యెడు అతిప్రబల దినేశుడు ఉదయించిననాటినుండియు ముల్లోకములు సంపూర్ణ ప్రకాశమంతమయ్యెను.

ఈకారణమున అనేకులు ఆనందించిరి. అనేకులు విచారించిరి. విచారించిన వారినిగురించి మొదట వర్ణింతును. ఆవిద్య అనునిశ నశించినది. పాపమను గుడ్లగూబ ఎచ్చటికో పారిపోయి దాగుకొనినది. కామ, క్రోధములు ముడుచుకొనిపోయినవి.

వివిధకర్మలు, గుణములు, కాలము, ప్రకృతి అను చకోరములుకు ఎచ్చటనూ సుఖములేదు. మత్సరము, అభిమానము, మోహము, మదము అను చోరులయొక్క నేర్పు ఎక్కడనూ అక్కరకు వచ్చుటలేదు.

ధర్మము తటాకమున జ్ఞానము, విజ్ఞానము అను నానావిధములగు కమలములు వికసించెను. సుఖము, సంతోషము, వైరాగ్యము, వివేకము, అను అనేక చక్రవాకములు శోకవిహీనములయ్యెను. రామప్రతాపమను రవిఒక హృదయమున ప్రకాశించినంతనేధర్మము , జ్ఞానము, విజ్ఞానము మొదలైనవి వృద్ధిచెందును. ఆవిద్య, పాపము మొదలగువి నశించును.

ఒకనొకదినమున సోదరులతో, పరమప్రియుడగు పవనకుమారునితో కలిసి రాముడు ఒక సుందరఉపవనమును వీక్షింప ఏగెను. అచ్చట వృక్షములన్నియు పుష్పించి చిగిర్చి ఉన్నవి. అది మంచి సమయమని ఎంచి తేజోరాశులు, సుందరగుణశీలయుతులు, సదా బ్రహ్మానందమగ్నులు అగు సనకాదిమునులు ఏతెంచిరి. చూచుటకు వారు బాలురువలె ఉందురు. కాని కడు వృద్ధులు వారు, నాలువేదములు బాలుర రూపములను ధరించివచ్చెనో అనునట్టున్నారు. వారు, సమదర్శులు, మునులు, భేధరహితులు వారు, దిశ##లే వారివస్త్రములు, రఘుపతి యొక్క చరిత్రను వినవలెనను ఆశ ఒక్కటియే వారి ఆసక్తి, భవానీ,

జ్ఞాని, మునివరుడు అగు అగస్త్యుని ఆశ్రమమున సనకాదిమునులు చాలా కాలము ఉండిరి. మునివరుడు రామకథలను పెక్కింటిని వారికి అభివర్ణించి తెలిపెను. అరణికట్టెలు అగ్నినావిర్భవింపచేయునట్లు జ్ఞానోదయమును కలిగింపగల కథలని,

మునులరాకను కని రాముడు హర్షముతో వారికి సాష్టాంగప్రమాణము చేసెను. కుశలప్రశ్నల నడిగెను. ప్రభువు తన పీతాంబరమును వారికి ఆసనము కావించెను. పవనసుతునితో సహా రామానుజులు మునికి సాష్టాంగనమస్కారములు చేసిరి. వారందరు కడు ఆనందించిరి. రాఘవుని అనన్యసౌంధర్యమును వీక్షించి మునులు తమను తామే మరచిరి. వారిమనస్సులు ఉప్పొంగినవి.

శ్యామలగాత్రుడు, సరోరుహనేత్రుడు, సౌంధర్యమందిరుడు, భవమోచనుడు అగు రాముని తదేక దృష్టితో రెప్పవాల్చక వారు చూచుచుండిరి. చేతులు జోడించి, శిరములలను వంచి ప్రభువు వారికి నమస్కరించెను. మునులయొక్కస్థితిని కనుగొని రఘువీరుని కన్నులనుండి నీరు కారెను. అతని శరీరము పులకించెను. ప్రభువు మునివరులు చేతులుపట్టుకొని, వారిని ఆసీనులచేసి పరమమనోహరములనగు వచనమునలను ఇట్లు నుడివెను:-

''మునీశ్వరులారా, ఆవధరింపుడు , నేడు నేను ధన్యుడనైతిని, మీదర్శనుమన పాపములన్నయు నశించును. మహాభాగ్యమువలననే సత్సంగము సంప్రాప్తిచును. ఏ శ్రమయు లేకనే భవబంధములన్నియు తొలగును. సంత్‌జనసత్సంగము మోక్షమునకు,కాముకజనసంగము భవబంధములకు మర్గములని మమాత్ములు, కవులు ,పండితులు , శ్రుతులు, పురాణములు, సద్గ్రంధములు నుడువుచున్నవి''?

ప్రభుని వచనములను విని పలువురు మునులు ఆనందించిరి. పులకింతశరీరులై వారు ఇట్లు అతనిని స్తుతించిరి.

''భగవానుడా, నీకు జయము, నీవు అనంతుడవు. అనామయుడవు. పాపరహితుడువు. అనేకరూపుడవు. అద్వితీయుడవు. కరుణామయుడవు, నిర్గుణవు. నీకు జయము. గుణసాగరా, నీకు జయము, జయము. నీవు సుఖనిలయుడవు. సుందరడువు. అతి చాతురడువ. ఇందిరారమణా, నీకు జయము, భూధరా, నీకు జయము, ఉపమానరహితుడవు, అజుడవు, ఆదిలేనివాడవు. శోభానిధివి. మానరహితుడవు. మానప్రదాతవు నీవు. నీ వేద, పురాణములు, నీపావనసత్కీర్తిని కీర్తించుచున్నవి. నీవు తత్త్వజ్ఞుడవు. కృతజ్ఞుడవు. అజ్ఞానాంతకుడవు. నీ నామములు అనేకకములు, నీవు నామరహితుడువు. మాయారహితుడవు. సర్వమునీవే. సర్వవ్యాపివి నీవే. సర్వుల హృదయములయందు సదా నీవు వసింతును. మమ్ము పరిపాలించుము, ద్వంద్వములను , విపత్తిని భవబంధములను నాశనమొనర్చుము. రామా, మాహృదయములయందు వసింపుము.శ్రీరామా, నీవు పరమానందస్వరూరూపుడువు, కృపానిలయుడవు. మనోవాంచితప్రదుడవు. నీయందు సుస్థిర ప్రేమభక్తిని మాకు అనుగ్రహింపుము. ప్రభూ,

రఘుపతీ, అతిపావనమొనర్చునట్టియు, త్రివిధతాపములను, భవక్లేశములను నాశనమొనరించునట్టియు భక్తిని మాకు ప్రసాదించుము, మాయందు ప్రసన్నుడవు కమ్ము, మాకు ఈ వరమిమ్ము , ప్రభూ,

రఘునాయకా, సంసారసాగరమునకు కుంభజుడవు, సేవకసులభుడవు, సుఖప్రదాతవు, మామనోజనిత దారుణ దుఃఖములను నాశనమొనర్చుము. దీనబంధూమాయందు సమత్వమును విస్తరింపచేయుము.

ఆశ, భయ ఈర్ష్వాదులను నివారింతువు నీవు. వినయ, వివేక వైరాగ్యమును విస్తరింపచేతువు నీవు.రాజమౌళులకు మణివి నీవు. భూమికి భూషణము నీవు జన్మమరణ ప్రవాహమగు నదిని తరించుటకు నౌక అగు నీయందలి భక్తిని మాకు పసాదించుము.

మునిజన మానసరోవరములయందు నిరంతరము నివసించు హంసస్వరూపా అజశంకరులు నీచరణకమలముకు వందనమొనర్తురు.రఘుకులకేతూ, వేద సంరక్షకా, కాల, కర్మ, ప్రకృతి, గుణభక్షకా, భవసాగరమును తరింపచేయు నావవు. నావికుడువునీవే, దోషములన్నిటిని హరింతువు. త్రిభువనములకు నీవు భూషణము 'తులసీదాసునియొక్క స్వామి'' ఇట్లు సనకాదిమునులు ప్రేమసమేతులై పలుమారులు స్తుతించిరి. శిరములు వంచి నమస్కరించిరి. తాము కోరినవరమును పొంది బ్రహ్మలోకమునకు మరలిరి. అంతట భరత లక్ష్మణ శత్రుఘ్నులు రామునికి వందనము చేసిరి. ప్రభుని ప్రశ్నించుటకు వారు జంకి మారుతివంక చూచిరి. శ్రీముఖమునండి భ్రమలన్నిటిని తొలగించువచనములను వినవలెనని వారికోరిక.

అంతర్యామి అగు స్వామికి అన్నియు తెలియును. ''హనుమా, ఏమది? '' అని మారుతిని రాముడు అడిగెను. హనుమంతుడు కరములుజోడించి ''దీనదయళా, భగవానుడా, నాథా, ఆకర్ణింపుము, భరతుడు ఏమియో అడుగదలచినాడు. ప్రశ్నించుటకు మనమున సంకోచించుచున్నాడు'' అనెను. ''మారుతీ, నాస్వభావము నీకు తెలియనుకదా?భరతునికి నాకు మధ్య భేదమున్నదా?'' అని రాముడు వచించెను. ఆ మాటలువిని భరతుడు రాముని పాదములను పట్టుకొని ఇట్లు నుడివెను:-

''నాథా, వినుము. శరణాగతుల దుఃఖమును హరించువాడవు నీవు. స్వామి, నాకు ఎట్టి సందేహములు లేవు. స్వప్నముననైనను శోకములేదు. మోహములేదు. ఆనంద, కృపారాశీ, ఇది అంతయు నీకృపయొక్క ఫలితమే. దయానిధీ, ఐనను, ఒక్కసాహసము చేయుచున్నాను. నేను సేవకుడను, నీవు సేవకసుఖప్రదాతవు. వేదములు, పురాణముల, సాదుసజ్జనులు (మహాత్ముల, పుణ్యపురుషుల) మహిమను బహువిధములవర్ణించినవి. నీవును స్వయముగా వారిని కొనియాడితివి. వారియందు ప్రభునిక అధికప్రేమ, ప్రభూ, వారి లక్షణములనుగురించి నాకు విన కోరిక, నీవు కృపాసముద్రుడవు. గుణ, జ్ఞానవిచక్షణ చేయువాడవు. శరణాగతరక్షకా, సాధుసజ్జనులకు, ఖలులుకును కల భేదము నాకు వివరముగా బోధింపుము''.

అంతట రాముడు ఇట్లు వివరించెను:-

''తమ్ముడా, సాధు, సజ్జనుల లక్షణములు అగణితములు, వేదప్రసిద్దములు, మహాత్ముల, పాపాత్ముల చర్యలు- మంచిగంధము, గొడ్డలి వంటివి. గొడ్డలి చందనవృక్షమును నఱికివేయును. కాని ఆచందనవృక్షము తన పరిమళమును ఆ గొడ్డలికే ప్రసాదించును. కనుకనే శ్రీఖండము సురల శిరమునకు ఎక్కును. లోకము నకు ప్రియకరమయ్యెను. గొడ్డలి ముఖమునకు శిక్ష లభించును. గొడ్డలిని నిప్పులో కాల్చి గట్టిగా కొట్టుదురు కదా!

సాధు సజ్జనులు, మహాత్ములువిషయలంపటులు కారు. వారు శీల, సద్గుణ ఖనులు, పరులదుఃఖములను చూచి వారుదుఃఖింతురు. పరులసుఖమును కాంచి సుఖింతురు. సర్వదా వారకి సమదృష్టియే, వారికి శత్రువే లేడు, వారు మదరహితులు. విరాగులు, లోభ, క్రోద, హర్ష, భయములన త్యజించినవారు. వారిని చిత్తములు కోమలములు, వారికి దీనులపై దయ, మనసా, వాచా, కర్మణా వారికి నయందు కపటరహితమగుభక్తి. వారు అందరిని గౌరవింతురు. వారుస్వయముగామానవరహితులు. భరతా, ఇట్టివారు నాప్రాణవములు, వారికి కోర్కెలు ఉండవు. వారు నా నామపరాయణులు, శాంతికి, వైరాగ్య, వివేకి, వినయ, ఆనందములకు నిలయములు వారు , దర్మమునకు కారణభూతములగు శాంతి , సరళత, మైత్రి, ద్విజులపాదములయందు భక్తివారికి ఉండును.

నాయనా, ఈ లక్షణములు హృదయమున కలిగినవారు నిరంతర నిత్యసాధుపురుషులు, సజ్జనులు, మహాత్ములు అని గ్రహించుము. శమము, దమము, నీతి, నియములనుండి వీరు ఎన్నడూ చలింపరు. పరుషవచనమును వీరు ఎన్నడూ వచింపరూ, నిందాస్తుతులు రెండునూ వీరికి సమానమే. నాపాదమలములయదు వీరికి మమత,ఇట్టి గుణనిలయములు, సుఖపుంజములు అగు సజ్జనులు నాకు ప్రాణసమానప్రియులు.

ఇక ఖలుల స్వభావమును వినుము. పొరపాటుననైనను వారి సాంగత్యము కూడదు సుమా! వారి సాంగత్యము నిరంతదుఃఖప్రదము. దుష్టజాతి ఆవుతనతో సాంగత్యముచేయు కపిలగోవును నాశనముచేయునట్లే! దుర్జనులహృదయముల యందు మిక్కుటమగు సంతానము ఉండును. పరులసంపదను చూచి మండిపడుదురువారు. పరనిందను వారుఎక్కడైనను వినిన చాలు-దారిలో పడిఉన్న నవనిధులు తమకు దొరకినట్లు సంతసింతురు. వారు కామ, క్రోధ, మద, లోభవరాయణులు, నిర్దయులు, కపటులే కుటిలస్వభావులు. పాపనిలయులు నిష్కారణముగా అందరితో వైరమే వారికి , తమయెడల దయకలవారతో సహితము వారు వైరభావమున ప్రవర్తింతురు. ఇచ్చిపుచ్చుకొనుటలో కూడా అబద్దములే వారికి తమభోజనమును గరురించియు వారు అసత్యమే పలుకుదురు. శనగలుతిని విందారగించితిమని అందురు. విషయమును క్రక్కు పాములను భక్షించు నెమలియొక్క కంఠము మధురము. దానిహృదము కఠోరము అట్లే ఖలులవచనములు మధురములు వారు ద్రోహులై, పరమదారరతులై ఉందురు. పరధనమునందు, పరులపై అపవాదులయందు వారికి ఆసక్తి, పామరులు, పాపమయులు, అగు ఆ వనరులు మనవదేహము ధరించిన రాక్షసులు, లోభము వారు కట్టుబట్ట. లోభ##మే వారు పరుండు పరుపు. వారుశిశ్నోదరపరాయణులు. యమపురిఅనిన వారికి భయములేదు. ఎవరిగొప్పతనుమ నైనను వారు వినిరో చలిజ్వరము వచ్చనట్టు వారు బాధపడుదురు. ఎవరి ఆపదనైన చూచిరో-తాము జగత్ప్రభువులైనట్లు ఆనందింతురు. వారు స్వార్థరతులు, బంధువిరోధులు, కామ, లోభ లంపటులు, వారికి అమితకోపము, తల్లిని, తండ్రిని, గురువులను, విప్రులను వారు గౌరవింపరు. తాము సర్వనాశనముగుటయేకాక ఇతరులను నాశనమొనర్తురు. మోహవశులై వారు పరులకు ద్రోహము చేతురు. మహాత్ముల, సాధు సత్పురుషుల సాంగత్యము వారికి సరిపడదు. హరికథలు వారికి రుచించవు, వారు దుర్గుణజలధులు, మందమతులు, కాముకులు, వేదములను వారు పరిమసింతురు. పరధనమును దోచుకొందురు. అందరికి ద్రోహము కావింతురు. వారువిప్రులకు చేయు ద్రోహము మరింత , వారి హృదయములయందు అంతయూ దంభ##మే కపటమే వారు ధరించు వేషముమాత్రము సుందరమైనది.

ఇట్టి అధమమనుజులు, ఖలులు-కృత, త్రేతాయుగములయందు లేనేలేరు. ద్వాపరమున కొద్దిమంది ఉండిరి. ఇక కలియుగమున వారు మందలు, మందలే, తమ్ముడా, పరహితమువంటి ధర్మము లేదు. పరపీడవంటి పాపము లేదు. సకలపురాణ, వేదనిర్ణయ మిది, నాయనా నీకు దీనిని వర్ణించితిని. పండితులు దీనిని ఎఱుగుదురు.

మానవశరీరమును ధరించి, పరపీడాకులగువారు జన్మమృత్యురూపమగు భవభాదలను అనుభవింతురు. మోహవశమును నరుడు స్వార్థపరుడై నానాపాపములను కావించచును. అట్టివానికి పరలోకమున సద్గతిలేదు. వారికి నేను కాలరూపుడను. పోదరా, వారువారు చేయు శుభ, అశుభకర్మలకు తగుఫలముల నిత్తును. దీనిని గ్రహించి వరమ వికేకులు సంసారదుఃఖమయమని తెలిసికొందురు. శుభాశుభపలమునిచ్చు కర్మలను వవారు త్యజింతురు. సురనరనాయకుడనగు నన్ను భజింతురు. పాధు సజ్జనులు, ఖలులు గుణములను వచించినాను. ఈ గుణములను తెలిసినవరు భవప్రవాహమున పడరు.

నాయనా, వినుము, మాయచే సృజించపడినవే -సకలగుణములు, దోషములు వీనిన రెండింటిని లక్ష్యపెట్టకపోవుటయే వివేకము. వీనిని పరిగణించుటయే అవివేకము. శ్రీముఖమునండి వెలువడిన ఈ ప్రపంచములను విని అనుజులెల్లరు సంతసించారు.వారి హృదయములనుండి ప్రేమ ఉప్పొంగెను. వారు పదేపదే ప్రభునికి ప్రణమిల్లిరి. అపారమగు ఆనందము హనుమంతుని హృదయమునకలిగెను.

పిదప రఘుపతి తనమందిరమునకు వెడలెను. ఇట్లు అతడు నిత్యనూనత చరితను కానించుచుండెను.

నారదముని అయోధ్యాపురికి పలుమార్లు వచ్చును. రాముని పవిత్రచిత్రమున గానముచేయును. అచ్చట నిత్యనూతనముగు రామచరితను వీక్షించును. బ్రహ్మలోకమునకేగి ఆ కథ అంతయు వినిపించెను. కథను విని విరించి విశేషముగా ఆనందించును. 'కుమారా, మరల మరల రాముని గుణగానము కావించుము'అని కోరును.

సనకాదిమునులు నారదుని కొనిడుదురు. తాము బ్రహ్మనిష్ఠాపరులే, ఐనను రాముని గుణవర్ణను విని వారు తమ సమాధిని మరతురు. ఆ గుణవర్ణనను వినుటకు పరమయోగ్యులగు ఆ మునులు దానిని సాదరముగా విందురు. సనకసనందానదాజీవన్ముక్తులు, బ్రహ్మనిష్టులు అగు మునులే ధ్యానమును విడిచి, రామచరిత్రను వినుచున్నారు. హరికథలయందు ప్రేమలేనివారిని పాషాణహృదయములే?

ఒకనాడు రఘునాథుడు పిలవనంపగా గురవగు వసిష్ఠుడు , ద్విజులు , పురవారసులు, అందరు రాజసభకు వచ్చిరి. గురు, ముని , విప్రవరులు, సజ్జనులు ఉచితాసనముయందు ఆసఅనులైన పిదప భక్త భవభంజనుడు వారికి ఇట్లు పలికెను:-

''సకల పురజనులారా, నావచనములను వినుడు. నాహృదయమున మీ యందలి మమతకారణముగ నేనేదియు నుడువబోను. అవినీతికరమైన దేదియు వచింవను. అధికారమును పురస్కరించుకొని ఏదియు పలుకను, నాలుకులు వినుడు, విని అవి మీక మంచివనితోచినచో వానిని అనుసరింపుడు. నాఆజ్ఞలను మన్నించువాడే నాసేవకుడు. వాడే నాకు ప్రియతముడు. సోదరులారా, అవినీతికరములైన వచనములను నేను నుడివినచో నన్ను మీరు నిర్భయముగా సరిదిద్దుడు. ఎంత బాగ్యమవశముని మానవశీరరము లభించినది. ఈశరీరము దేవతలకైనను దుర్లభమని సర్వగ్రంథములు నుడివినవి. మానవదేహము సాధనకు నిలయము, మోక్షమునకు ద్వారము, దీనీనీ ధరించియు పరలోకమును సద్గతిని పొందజాలనివారు దుఃఖములను అనుభవింతురు. తరుపరి , తలలు బాదుకొని పశ్చాత్తాపము పొందుచు కాలుమ, కర్మము, ఈశ్వరులపై మిధ్యాదోషమును ఆరోపింతురు. ఈ తనువు ప్రాప్తించినందులకు ఫలము విషయభాగానుభవము కాదు. -సోదరులారా, స్వర్గసుఖములసహితము క్షణికములే. అంతమున అవి దుఃఖమునిచ్చును. మానవశరీరములను పొందియు విసయ సుఖములయందే మనస్సును లగ్నముచేయువారు శఠులు. అట్టివారు అమృతము వలదని విషయమున గ్రహించునట్టివారు. వారు మంచివారని ఎవ్వరు అనరు. పరశువేదిని పారవైచి గురువిందగింజను తెచ్చుకొనునట్టివారు వారు.

నాలుగువిధములగు జన్మలలో ఎనుబదినాలుగులక్షల యోనులందు -అనవినాశి అగు ఈ జీవుడు పరిభ్రమించుచుండును. మాయాప్రేరితుడై, కాల, కర్మ, గుణ, ప్రకృతివశుడై అతడు సదా వ్యర్థముగా తిరుగచునే ఉండును. నిర్హేతుక కరుణామము డగు ఈశ్వరుడు ఏదో ఒకనాడు దుర్లభమగు నరదేహమును కృపతో వానికిప్రసాదించును. మానవశరీరము భరవారధిని దాటుటకు నావ, నాఅనుగ్రహము దానికి అను కూలమగు వాయువు, ఈదృఢమగు నావను నడుపుటకు కర్ణధారుడు సద్గురువు. ఇట్లు నరుడు దుస్తరమగు భవసాగరమును దాటుటకు సులభమగు సాధనములు లభించును. ఈ సాధనుమలను పొందియు భవసాగరమును తరింపనివాడు కృతఘ్నుడు, మందమతి, ఆత్మహత్య చేసికొనినవాని గతియే అట్టివానికి ప్రాప్తించును. ఇహపర సుఖములను కాంక్షింతురేని నాపలుకులను ఆలకింపుడు,. వానిని మీ హృదయముల దృడముగా ధరించుడు. సోదరులారా, ఈ నాభక్తిమార్గము సులభ##మైనది. సుఖము నిచ్చు వేదములు, పురాణములు దీనిని వర్ణించినవి.

జ్ఞానమార్గము అగమమైనది. జ్ఞానప్రాప్తికి అనేకవిఘ్నములున్నవి. సాధనము కఠనము, దానియందు మనస్సునకు ఆశ్రయము ఉండదు. ఎంతకష్టపడిన పిదపనో ఎవనికి అది సంప్రాప్తించును . అట్టివాడు భక్తిహీనుడై నాకు ప్రియుడు కానేరడు.

భక్తిస్వత్రంత్రమైనది, అదిసకలసుఖములనక ఖని, సత్సగంమలేనిదే ప్రాణులకు అది ఆలభ్యము. పుణ్యపుంజములేనిదే మహాత్ములు, సాధుసజ్జనులు లబింపరు. జనన మరణచక్రము ను అంతమొందించునది సత్సంగమే. జగమున పుణ్యము అనన్యమైనది. దానికి సాటి రెండవది లేదు. మనో, వాక్‌ , కర్మలయందు విప్రవాదములను పూజించుట ఒకే ఒకపుణ్యము , కపటమును వీడి, ద్విజులను సేవించువారియందు మునులు, సురలు అనుకూలురై ఉందురు. మరిఒక రహస్యముసిద్ధాంతమున్నది. చేతులు జోడించి అందరికి తెలుపుచున్నాను. శంకరుని భజింపనిదే నరునికి నాయందు భక్తి లబించదు.

భక్తిపథమున ఏ ప్రయాస ఉన్నది? చెప్పుడు,దానికి యోగము అక్కరలేదు.

జపము, తపము, ఉపవాసము అక్కరలేదు. యజ్ఞము అక్కరలేదు. సరళస్వభావము కలిగి, మనస్సున కుటిలత లేకున్న చాలు . లభించినదానితో తృప్తిపడి సంతసించిన చాలు.

నాదాసులమని చెప్పుకొనుచూ, నరులనే నమ్మువారికి మీరే చెప్పుడు-నాయందు విశ్వాసము ఎట్లుండును? ఇంకను కథ విస్తరించి ఏమి చెప్పవలెను? తమ్ములారా, ఈ తెలుపబోవువానిని ఆచరించువారి వశుడనై నేను ఉందును.

ఎవ్వరితోను వైరము, జగడము లేనివారికి, ఆశలు లేనివారికి భయము లేని వారికి లోకమెల్లయు సదా సుఖమయమే, ఫలాపేక్షతో ఏకర్మను ప్రారంభించని వారు, తమగృహములనుగురించి మమత లేనివారు. అభిమానరహితులు, పాపకర్మలు చేయనివారు, క్రోధరహితులు, భక్తిదక్షులు, విజ్ఞానులు, సజ్జనసాంగత్యమున సదా ప్రీతికలవారు. స్వర్గ, మోక్ష విషయములను తృణప్రాయముగాఎంచువారు, భక్తిదీక్షాపరులు, పరమతవిషయమున మూర్ఘత్వము లేనివారు. కుతర్కములకు అన్నిటికిదూర ముగా ఉండువారు. నాగుణగణ, నామపరాయణులు మమత, నుద, మోహములు లేనివారు.

అట్టివారు మానవులు పొందు పరమానందము అనుభవించినవారికే తెలియును.

రాముని సుధాసమమగు వచనములను విని అందరు ఆ కృపానిలయుని పాదములను పట్టుకొని కృపాధామా'' నీవే మాతల్లివి, తండ్రివి, గురుడవు, సోదరుడవు, సర్వమును మాప్రాణములకంటె ప్రియుడవు నీవే, రామా , శరణాగత దుఃఖసంహారకుడవు. నీవే మా తనువు, ధనము గృహము, సకలవిదముల మాహితకరుడవు నీవే. నీవుతప్ప ఇట్టిబోధను ఇంకెవ్వరు చేయజాలరు. జనీనకుల సహితము స్వార్థపరులే. అసురారీ, నిర్హీతుకముగ ఉపకారము కావించువారు జగమున ఇరువురే, నీవు ఒకడవు. నీభక్తుడు ఇంకొకడు జగమున ఇతరులెల్లరు స్వార్థమిత్రులే. ప్రభూ, వారికి స్వప్నమునైననను పరమార్థచింత ఉండదు'' అని వచించిరి. ప్రేమరసమున మునిగిన ఆ పలుకులనువిని రఘునాథుడు ఆనందించెను. అనతిని పొంది అందరు ప్రభుని యొక్క రమ్యమగు సంభాషణన వర్ణించుకొనుచు తమతమ ఇండ్లకు మరలిరి.

ఉమా, సచ్చిదాంనందఘనుడు, బ్రహ్మ, రఘునాయకుడు రాజ్యమేలుచున్న అయోధ్యావాసులెల్లరు- స్త్రీలు, పురుషులు కృతార్థస్వరూపులు.

ఒకదినమున వసిష్ఠముని- సుఖదాముడగు రాముని సందర్శించుటకు ఏతెంచెను. రఘునాయకుడు మునికి ఆదరసత్కారములను కావించెను. మునియొక్క చరణము లను అతడు కడిగి, ఆపాదోదకమును సేవించెన. కరములను జోడించి వసిష్టుడు ''కృపాసాగరా, నా ఈ స్వల్పవినతిని అవధరింపము, నీచర్యలను కనుగొన కనుగొన నాహృదయమున ఆఅపారమోహమును జనించునది. భగవానుడా, నీమహిమ అమితము వేదములకైననూ అది తెలియరాదు. నెనెట్లు వచింపగలను? పౌరోహితవృత్తికడు నీచమైనది, శ్రుతులు, పురాణములు, స్మృతులు, ఈ వృత్తిచే నిందించు చున్నవి. దీనిని నేను స్వీకరింపకముందు బ్రహ్మనాతో''కుమారా, దీనిచే మున్ముందు నీకు ప్రయోజనము కలుగును. పరమాత్ముడగు బ్రహ్మము మానవరూపమును ధరించి రఘుకులభూషణుడగు పరపతి అగును'' అని చెప్పెను. అంతట నేను నాహృదమున ఆలోచించితిని. ''యాగములు, యజ్ఞములు, వ్రతములు, దానములు-ఏఫలమును ఆశించుకావింబపడుచున్నవో - దానిని నేను ఈ వృత్తిని పొందగలను. ఇక దీనికి సమానమగు ధర్మము ఇంకొకటి ఉండదు. జపము, తపము, నియమము, యోగము, స్వదర్మము, శ్రుతి సంభవములగు నానావిధ శుభకర్మలు, జ్ఞానము, దయ దమము, తీర్థస్నానాదులు, సర్వము , శ్రుతులు, మహాత్ములు తెలిసిన ధర్మములు, అనేకతంత్రములు, వేద-పురాణములను పఠించిన -వినిన కలుగు ఫలము -ఒకే ఒకటి సకలసాదన లకు ఇదియే సుందరమగు ఫలితము. నీపాదపంకజములయందు నిరంతరము భక్తి కలిగియుండట ఒక్కటే అని తలచితిని.

మురికితో కడిగినచో మురికిపోవునా? నీటిని చిలికిచో నేయి లభించునా? అట్లే ప్రేమభక్తి అను నీరులేనిదే అంతఃకరణమునందలి మలినము తొలగదు రఘునాయకా, నీచరణసరోజములయందు అనురాగము కలిగినవాడే సర్వజ్ఞుడు. వాడే తత్త్వజ్ఞుడు వాడే పండితుడు. వాడే గుణనిలయముడు, వాడే అఖండవిజ్ఞాని . వాడే చతురుడు. పకల సులక్షణసంపన్నుడు. నాథా, రామా, ఒక్కవరము నిన్ను యాచింతును. దయచేసి ప్రసాదింపుము. నీపాదకమలములయందు నాభక్తి జన్మజన్మాంతరుములయందైనను ఎన్నడూ క్షీణించకుండునట్లు అనుగ్రహింపుము'' అని ప్రార్థించెను.

ఇట్లు వచించి వసిష్ఠుని తన గృహమునకు మరలెను. కృపాసముద్రుడగు రాముడు మనమున సంతసించెను.

సేవకనుసుఖప్రదాత, కృపాళుడు, అగు శ్రీరాముడు హనుమంతుని, భరతాది సోదరులను వెంట ఇడుకొని అంతట అయోధ్యాపురి వెలుపలకు వెడలెను. రథములను, తురగములను తెప్పించెను. వానిని సమీక్షించెను. కృఫతో వానిని ప్రశంసించెను. ఎవరెవరు ఏదికోరిన దానిని వారి వారికి ఉచితరీతిని బహూకరించెను.

సకలశ్రమలను హరించు ప్రభువు శ్రమచెందెను ! మామిడితోటయందలి చల్లనినీడకు అతడు నడిచెను. తమ వస్త్రమును తీసి అచ్చట భరతుడు పరచెను. ప్రభువు దానిపై ఆసీనుడయ్యెను. అతనిశరీరము పులకించెను. కన్నుల నీరుకారెను.

గిరిజా, హనుమంతునికి ఈడగు అదృష్టవంతుడు లేదు. అతనినిపోలు రామ చరణానురాగియు లేడు. అతని భక్తిని, సేవను పలుమారులు ప్రభువే స్వయముగా కొనయాడెను!

ఆ సమయమున వీణాపాణియై నారదముని ఏతెంచెను, రాముని సుందర. నిత్య నూతనయశనమును ఆ ముని గానముచేయు మొదలిడెను.

''పంకజలోచనా, శోకవిమోచనా, ప్రభూ, నాపై నీకృపాదృష్టిని ప్రసరించుము. హారీ, నీలకమలసమశ్యామలగాత్రా. మన్మథారి అగు శివుని హృదయకమలమునందలి మకరందమును పానముచేయు భ్రమరమా, నిశాచర సేనాభంజనా, ముని, సజ్జన మనో రంజకా. పాపవిధ్వంసకా. భూసురులనబడు సశ్యములకు నీవు నూతనమేఘబృందము. రక్షకులు లేనివారికి రక్షకుడవు - దీనజానాశ్రయా. నీ భుజబలముచే అత్యంత భూభారమును తొలగించితివి. ఖరదూషణులను, విరాధుని వధించుటయందు నిపుణుడవు. రావణారీ. ఆనందస్వరూపుడా ! భూపాలవరా. దశరథకుల కుముద సుధాకరా. నీకు జయము. నీ నసత్కీర్తిపురాణ. వేద. నిగము. ఆగమ విదితము. సుర, ముని, సజ్జన సాధుసమాజములు దానిని కీర్తింతురు. కరుణాయుతా, అసత్యమును, మదమును హరించువాడవు. సకలవిధముల నిపుణుడవు. కోసలపురికి భూషణుడవు. కలియుగపాపములను మథించువాడవని నీ బిరుదు. మమతను హరించువాడనియు పేరు పొందితివి. తులసీదాసుని స్వామి. శరణాగతులను రక్షింపుము'' అని ఇట్లు ప్రేమసహితుడై రాముని గుణగణములను వర్ణించుచు, శోభాసముద్రుడగు ప్రభుని తన హృదయమున స్మరించి, నారదముని బ్రహ్మలోకమునకు మరలెను.

''గిరిజా, వినుము.నా బుద్ధిని అనుసరించి రామకథను విశదముగా వచించితిని. రామచరితలు శతకోట్లు, అపారములు. శారదయైనను శ్రుతులైనను వానిని వర్ణింపజాలరు. రాముడు అనంతుడు. అతని గుణగణములను అనంతములు.అతని జన్మలు. కర్మలు, నామములు అనంతములు. నీటిబిందువులను, ఇసుకరేణువులను లెక్కింపగలమేమో కాని రఘపతియొక్క చరిత్రలను వర్ణించుటకు అంతములేదు.

విమలమగు ఈ కథ హరిపదమును ప్రసాదించును. దీనిని వినువారికి అచంచలభక్తి సంప్రాప్తించును. ఉమా, రమ్యమగు ఈ కథను వివరించితిని. మున్ను దీనిని కాకభుశుండి గురుడునికి తెలిపెను. రాముని గుణగణములను కొన్నిటిని వర్ణించి తిని. భవానీ, ఇక నేను వివరింపవలసినది ఏదియో తెలుపుము'' అని శంకరుడు ఉమను అడిగెను.

మంగళకరమగు రామకథనువిని భవాని సంతసించెను. ఆమె అతి వినీతమై మృదువచనములను ఇట్లు వచించెను :

''త్రిపురారీ, ధన్యురాలనైతిని. ధన్యురాలనైతిని, ధన్యురాలనైతిని. భవ భయ విధ్వంసకుడగు రామగుణచరితను వింటిని. కృపానిలయా. నీదయచే నేను కృతకృత్యురాలనైతిని. వా మోహము నశించినది. ప్రభూ, చిదానందసందోహు డగు శ్రీరాముని ప్రతాపమును తెలిసికొంటిని. నాథా, నీ ముఖచంద్రునినుండి రఘవీరుని కథ అను సుధ స్రవించుచున్నది. ధీరుమతీ, నా శ్రవణంద్రియములతో ఆ అమృతమును పానముచేయుటచే నా మానసము సంతృప్తిచెందుటలేదు. రామచరితను విని తృప్తిచెందువారు ఆ చరితయందలి విశేషరసమును గ్రహించలేదన్నమాటయే! జీవన్ముక్తులగు మహామునులుసహితము సతతము హరిగుణములను ఆకర్ణించుటచునే ఉందురు. భవసాగరమును తరింపగోరువారికి రామకథ దృఢమగు నౌక. హరి గుణజాలములు విషయలోలుర చెవులకు సహతము సుఖదములు. అవి మానసములకు ఆనందప్రదములు. చెవులున్నవానికి ఎవ్వనికి ఈ జగమున రఘుపతికథ మనోహరము కానేరదు! రఘుపతియొక్క చరిత్రనువిని ఆనందించనివారు జడజీవులు, ఆత్మహంతకులు, స్వామి, హరిచరిత మానసమును నీవు వర్ణించితిని. దానిని విని నేను అమితానందమును పొందితిని.

సుందరమగు ఈ కథను కాకభుశుండి గరుడునికి నుడివెనంటివి. కాకభుశుండి వైరాగ్య, జ్ఞాన, విజ్ఞానములయందు దిట్ట అయ్యెను. అతనికి రామచరణములందు అత్యంతమగు ప్రేమ, 'వాయస తనువున రామభక్తియ'? అను విషయమై నాకు ఒక మహాసందేహము కలుగుచున్నది. త్రిపురారీ, వేయిమంది మానవులలో ఏ ఒక్కడో ధర్మవ్రతధారి అగును. కోట్లకొలది ధర్మశీలురలో ఏ ఒకడో విషయవిముఖుడు. వైరాగ్యపరాయణుడు ఉండును. కోటిమంది విరక్తులయందు ఏ ఒక్కనికో యథార్థజ్ఞానము లభించుననియు, కోటిమంది జ్ఞానులయందు ఏ ఒక్కడో జీవన్ముక్తుడు ఉండుననియు శ్రుతులు వచించుచున్నవి. సకృత్తుగా ఏనాడో ఏ ఒకడో ఇట్లు జగమున జీన్ముక్తుడగును. వేయిమంది జీవన్ముక్తులలో సర్వసుఖనికి బ్రహ్మయందు లీనమగు విజ్ఞానవంతుడగువాడు దుర్లభుడు.

ధర్మస్వభావము కలవారు. విరక్తులు జ్ఞానులు. జీవన్ముక్తులు. బ్రహ్మమునే లీనమై ఉండువారియందును - ఓ మహాదేవా, దేవాదిదేవా, మద మాయారహితులై - రామభక్తి పరాయణులైనవారు అత్యంత దుర్లభులు. ఇట్టి హరిభక్తి విశ్వనాథా, ఒక కాకికి ఎట్లు సంప్రాప్తించెను ? నాకు తెలియచెప్పుము. నాథా, ఇట్టి రామభక్తిపరాయణుడు, జ్ఞాననిరతుడు. గుణనిలయుడు. ధీరమతి అగువాడు వాయసశరీరమును ఏకారణమున పొందెను? దయాళూ. ప్రభునియొక్క ఈ పవిత్ర సుందరచరిత్రను ఆ వాయసము ఎచ్చట తెలిసికొనెను? ఈ విషయమునుసహితము మదనారీ, నాకు వివరింపుము. మరి నీ వెట్లుమిటివి ఈ కథను ? తెలిసికొనలెనని నాకు మిక్కిలి కుతూహలము కలుగుచున్నది.

గరుడుడు మహాజ్ఞాని. సద్గుణరాశి. హరిసేవకుడు. హరిసాన్నిధ్య నివాసి అట్టి వాడు మునిసమూహమును వీడి కాకివద్దకువెడలి హరికథను ఏకారణమున వినెను ? వివరింపుము. హరిభక్తులగు గరుడ. కాకభూశుండుల సంవాదము ఎట్లు సంభవించెను?

గౌరియొక్క సరళ, మనోహర వచనములను విని హరుడు ఆనందించి సాదరముగా ఇట్లు నుడివెను:-

''సతీ, ధన్యురాలవు నీవు. నీబుద్ధి పావనమైనది. రఘుపతియొక్క చరణముల యందు నీకు మిక్కుటమగు ప్రీతి. పరమపవిత్రమగు ఆ ఇతిహాసమును వినుము. దానిని వినినచో ప్రాపంచికభ్రమ సర్వము నశించును. రామచరణములయందు విశ్వాసము జనించును. ప్రయాసలేకయే నరుడు భవసాగరమును తరించును. విహంగపతి గరుడువెడలి కాకభుశుండిని అట్లే ప్రశ్నించెను. ఉమా, దానిని అంతయు సాదరముగా నేను వివరింతును. భవయోచని అగు ఆ కథను నేను ఎట్లు వింటినో సుముఖీ, సులోచనీ. వినుము.

మున్ను ఒకప్పుడు నీవు దక్షునిఇంట అవతరించితివి. అప్పటి నీపేరు సతి. నాడు దక్షయజ్ఞమున నీకు అవమానము జరిగెను. అతి క్రోధమున నీవు ప్రాణములను త్యజించితివి. నా సేవకులు ఆ యజ్ఞమును విధ్వంసము కావించిరి. ఆవిషయము నకలము నీకు ఎఱుకయే ప్రియా. ఆనాడు నామనసున మహవిచారము కలిగెను. నీ వియోగమున దుఃఖితుడనైతిని. విరాగినై - సుందరవన, సర్వత, నదీ, తటాక సౌందర్యమును తిలకించుచు తిరుగుచుంటిని. సుమేరుగిరికి ఉత్తరమున దూరమున సుందరమగు ఒక పెద్దనీలశైలమున్నది. దానికి నాలుగు రమ్యమగు సువర్ణశిఖరములున్నవి. అవి నామనసునకు ఆనందము ఇచ్చెను. ఆ శిఖరములు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పెద్ద పెద్ద మఱ్ఱి. రావి. జువ్వి, మామిడిచెట్లు కలవు. ఆ శైలముపై ఒకచక్కని సరస్సు. దానికి మణులుకూర్చిన సోపానములు. వానిని చూచిన మనసు సమ్మోహితమగును. ఆ సరస్సునందలి, జలము శీతలమై, నిర్మలమై ఉండును. దాని యందు రంగురంగుల వికసితకమలములు, కలవరమును కావించుచు పలుహంసులు. మంజులముగా రొదచేయు మధపములు. రమణీయమగు ఆగిరిపై కాకభుశుండి నివసించుచుండును. కాల్పాంతమునసహితము అతనికి నాశములేదు. మాయాకృత గుణ, దోషములు, మోహ. కామాది అవివేకములు జగమెల్లయు అవరించునవి - ఆ గిరిని సమీపింపజాలవు. ఆ ప్రదేశమున ఆ కాకము నివసించి హరిని ఎట్లు భుజించెనో అనురాగమున వినుము.

ఆ వాయసము రావిచెట్టక్రింద ధ్యానసాధన. జువ్విచెట్టుక్రింద జపయజ్ఞము. మామిడి చెట్టునీడను మానసికపూజ చేయుచుండును. హరిభజనతప్ప రెండవపని ఏదియు భుశుండికి లేదు. వారికథాప్రసంగములను ఆ వాయసము మఱ్ఱిచెటుక్రింద చేయును. అనేకపక్షులువచ్చి ఆ కథలనువిని పోవుచుండును. విచిత్రమగు రామకథను ఆకాకి అనేకరీతులలో ప్రేమసహితముగా వర్ణించును. ఆ సరస్సున సదా నివసించుచు విమలనుతులగు హంసలు ఆ కథను వినును. నేనును ఆ స్థలమునకు వెడలి దర్శించి నంతట నా మానసమున విశేషమగు ఆనందము జనించెను. అంత నేను ఒక హంస శరీరమునుధరించి కొంతకాలము అచ్చట నివసించి. రఘుపతియొక్క గుణములను పాదరముగా వింటిని. తిరిగి కైలాసమునకు మరలితిని.

గిరిజా, కకాభుశుండివద్దకు నేను వెడలిని చరిత్ర అంతయు తెలిపితిని. ఖగకుల కేతువగు గరుడుడు ఏకారణమున ఆ కాకమువద్దకు వెడలెనో వివరింతును.

రఘునాథుడు రణక్రీడను సలపుకాలము అది. ఆ లీలను స్మరించినంత నాకు సిగ్గగును. ఇంద్రజిత్తుచేతులలో అతడు తనంతట తానే బంధితుడైనాడు. అంతట నారదముని రామునివద్దకు గరుడుని పంపించెను. ఉరగభక్షకుడగు గరుడుడు రాముని బంధనములను త్రెంచివైచెను. అతని హృదయమున ప్రచండమగు విషాదము కలిగెను.

''ప్రభుడేమి? బంధింపబడుట ఏమి?'' అని ఉరగారి పలువిధముల విచారించెను.

''సర్వవ్యాపకుడు, బ్రహ్మము, వాగీశుడు, మాయామోహాతీతుడు అగు పరమేశ్వరుడు ఈ జగమున అవతరించెనని వింటిని. ఆ అవతార ప్రభావము లేశమాత్రము కనుగొననైతిని. ఎవనినామమును జపించి మానవుడు భవబంధములనుండి విడివడునో ఆ రాముని ఒక నీచనిశాచరుడు నాగపాశమును బంధించుటా?'' అని గరుడుడు అనేక విధముల తన మనమును తర్కించుకొనెను. అతనిహృదయమున జ్ఞానము కలుగకపోగా భ్రమ అధికమయ్యెను. దుఃఖముచే ఖిన్నుడైన అతనిమనమున కలత మరింత పెరిగెను. నీవలెనే అతడు మోహవశుడయ్యెను. వ్యాకులుడగు గరుడుడు దేవర్షి అగు నారదునివద్దకు ఏగి తన మనస్సునందలి సందేహములను అన్నిటిని ఆ మునికి వివరించెను. వానిని వినిన నారదునికి మిక్కుటమగు కరుణ కలిగెను.

''గరుడా, వినుము. రామమాయ ప్రబలమైనది. జ్ఞానుల చిత్తములనుకూడా అది అపహరించును. వారి మనసులయందు బలవంతముగా మహామోహమును జనింపచేయును. అనేకపర్యాయములు నన్నునూ నాట్యమాడించిన ఆ మాయ నేడు విహంగవతీ. నిన్ను ఆవరించినది. చతురాననునివద్దకు పొమ్ము. ఖగేశా, ఆతడు ఆదేశించిన రీతిని ఆచరింపుము'' అని నారదుడు చెప్పెను. ఇట్లుపలికి చతురుడగు ఆ దేవర్షి రాముని గుణములను, హరి మాయాబలమును వర్ణించుకొనుచు వెడలెను.

అంతట ఖగపతి విరించిని సమీపించి తన సంశయమును వివరించెను. విరించి విని రామునికి నమస్కరించెను. రాముని ప్రతాపమును తెలిసికొనిన విరించికి అత్యంత ప్రేమ జనించెను. ''కవులు, కోవిదులు, జ్ఞానులు. ఎల్లరు మాయావశులే ! హరి మాయాప్రభావము అమితము. పలుమారులు అది నన్నే నాట్యమాడించెను! ఈ సకల చరాచరజగము నాచే సృజింపబడినది. మాయాపశుడనై నేనే నాట్యమాడినచో ఇక ఖగరాజగు గరుడుడు మోహపశుడగుటయందు ఆశ్యర్యమేమియు లేదు'' అని చతురాననుడు తలచెను.

''రామమహిమను మహేశుడు ఎఱుగును. వైనతేయా, నీవు శంకరుని వద్దకు పొమ్ము. నాయనా, మరి ఎవ్వరినీ ప్రశ్నింపకుము, నీ సంశయము శంకరుని వద్దనే నశించును'' అని అతడు మృదువచనములను పలికెను.

విధియొక్క పలుకులను వినినవెంటనే విహంగపతి వెడలెను. కడు వ్యాకులుడై అతివేగమున అతడు నా వద్దకు వచ్చెను. ఉమా, అసమయమున నేను కుబేరుని ఇంటికి వెడలుచుంటిని. నీవు కైలాసమున ఉంటివి. గరుడుడువచ్చి తలవంచి నా పాదములకు సాదరముగా నమస్కరించి తన సందేహమును తెలిపెను. అతని వినమ్ర, మృదువాణిని విని నేను ప్రేమసమేతముగ ఇట్లు నుడివితిని:-

''గరుడా, నన్ను మార్గమున నీవు కలిసికొంటివి. మార్గమధ్యమున నీకు నేనేమి బోధింతును ? బహుకాలము సత్సంగము కావించిననే సర్వసంశయములు సమసిపోవును. మునులు అనేకభంగుల హరికథలను వర్ణించిరి. ఆది, మధ్య. అంతములయందు భగవానుడగు శ్రీరాముడే ప్రతిపాద్యదైవమగు ఆ కథలన్నియు సత్సంగములయందే వినవలెను. ప్రతిదినము హరికథలను వినిపించు స్థలములకు నిన్ను పంపింతును అచటికిచని వానిని నీవు వినుము. వినినవెంటనే నీ సంశయము లన్నియు తొలగిపోవును. రామచరణములయందు ప్రగాఢమగుప్రేమ నీకు సంప్రాప్తించును. సత్సంగములేనిదే హరికథలు లేవు. ఆ కథలను విననిదే మోహము తొలగిపోదు. మోహము నశించనిదే రామచరణములయందు దృఢమగు అనురాగము కలుగజాలదు. అనురాగములేనిదే యోగ, తప, జ్ఞాన, వైరాగ్యములచే రాముని చేర జాలము.

ఉత్తరదిశయందు రమ్యమగు ఒక నీలగిరి కలదు. పరమసౌశీల్యవంతుడగు కాకభుశుండి అచ్చట నివసించును. అతడు రామభక్తిమార్గమున పరమప్రవీణుడు. జ్ఞాని, గుణనిలయుడు. అతి వృద్ధుడు, నిరంతరము అతడు రామకథను ప్రవచించుచుండును. వివిధవిహంగవరులు సాదరముగా వినుచుందురు. అచ్చటికి ఏగి హరి గుణగణములను నీవు వినుము. మోహజనితమగు నీ దుఃఖము దూరమగును''

ఇట్లు నేను వివరించినంతనే గరుడుడు నా పాదములకు వందనముచేసి ఆనందముతో వెడలెను. ఉమా, రఘునాథుని కృపచే ఆ మర్మము నాకు తెలియును. కనుక గరుడునికి నేనేమియు ఉపదేశించలేదు. ఏనాడో గరుడుడు గర్వమున ఉండెనేమో! కృపానిధి ఆ గర్వమును పొగొట్టతలచెను! పక్షులకు పక్షులభాషయే తెలియును. కనుక గరుడుని నా వద్ద ఉండనీయలేదు. భవానీ, ప్రభుని మాయ బలీయమైనది. దానికి వశుడు కానట్టి జ్ఞానికలడా? జ్ఞానశిరోమణి, భక్తశిరోమణి, త్రిభువనపతి యొక్క వాహనము ఆగు అట్టి గరుడుని సహితము తన వశము కావించుకొనినది మాయ! పామరుడగు క్షురుడు మూర్ఖుడైగర్వించుచును! శివుని, బ్రహ్మను కూడా ఈ మాయ వశపరచుకొనును అట్టిచోపాపము: ఇతరులు ఒకలెక్కయా? ఇట్లు తమ హృదయములందు తెలిసికొని మునులు మాయానాథుడగు భగవానునిభజింతురు.

అకుంఠిత బుద్ధిశాలి, అఖండహరి భక్తుడు అగు భుశుండివద్దకు గరుడుడు వెడలెను. అచ్చటి శైలములను వీక్షించి గరుడుని మనస్సు ప్రసన్నతకాంచెను. మాయ. మోహము, విచారము అన్నియు తొలగిపోయెను.

గరుడుడు సరోవరమున స్నానముచేసెను. జలపానము కావించెను. హృదయమున హర్షముతో అతడు వటవృక్షచ్ఛాయకు నడచెను. రాముని సుందర చరితను వినుటకు అచ్చట వృద్ధ విహంగములు అనేకములు సమావేశ##మై ఉన్నవి.

కథ ప్రారంభము కాబోవుచున్నది. ఇంతలో ఖగనాథుడు - గరుడుడు అక్కడ చేరెను. సకల ఖగేశుని రాకను చూచి కాకభుశుండియు, అతని బృందము అందరు ఆనందించిరి. భుశుండి గరుడునికి అత్యంత ఆదర సత్కారములను కావించెను. స్వాగతము పలికెను. కుశలమును ప్రశ్నించెను. చక్కని ఆసనమున ఆసీనుని కావించెను. అనురాగసహితుడై గరుడుని పూజించి, కాకభుశుండి మధుర వచనములను ఇట్లు వచించెను.:-

''ఖగరాజా, నాథా, నీ దర్శనములవలన నేను కృతార్థుడనైతిని. అజ్ఞ దయ చేయుడు. నిర్వర్తింప సిద్ధముగా ఉన్నాను ఏ కార్యమునకై విచ్చేసితిని ప్రభు?''

పక్షిరాజు మృదువచనములలో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను :

''నీవు సదా కృతార్థరూపుడవు. స్వయముగా మహేశుడే నీ మహిమను సాదరముగా వర్ణించినాడు : నాయనా, వినుము, నేను వచ్చినపని అంతయు నేను వచ్చిన తోడనే పూర్తి అయ్యెను. నీ దర్శనము లభించినది. పరమపావనమగు నీ ఆశ్రమమును చూచినంతనే నా మోహము, సంశయము, నానా విధములగు భ్రమలు తొలగిపోయెను. అతిపావనము, సదా సుఖప్రదము, దుఃఖజాలమును నాశనమొనర్చునదియు ఆగు శ్రీరామకథను సాదరముగా వినిపించుము. ప్రభూ. పదే పదే నీకు వినతి చేతును.''

గరుడుని వినీత, సరళ, సుఖద, అతి పునీత, ప్రేమయుత వచనములను వినిన వెంటనే భుశుండియొక్కమనసున పరమ ఉత్సాహము కలిగెను. కాకము రఘుపతి యొక్క గుణములను వచింపమొదలిడెను.

భవనీ, అత్యంత అనురాగముతో భుశుండి మొట్ట మొదటి రామచరిత మానన సరోవర భావము సర్వమును వర్ణించెను తదుపరి నారదుని అపార మోహము, రావణుని అవతారములను గురించి నుడివెను. అంతట ప్రభుని అవతారకథను వచించెను. పిదప మనసు లగ్నముచేసి రాముని బాల లీలలను వివరించెను.

ఉత్సాహభిరత మానసముతో వివిధ విధములగు బాలలీలలను వర్ణించి, పిదప విశ్వామిత్రుడు అయోధ్యకువచ్చుటను, శ్రీ రాఘువీరుని వివాహమును వర్ణించెను. రాముని పట్టాభిషేక విషయము, దశరథుని వరములచే రాజ్యాభిషేకభంగము, అయోధ్యాపుర వాసుల విరహము. విషాదము, రామలక్ష్మణ సంవాదమును నుడివెను. రాముడు వనములకు వెడలుట, వల్లెవానియొక్క అనురాగము, గంగానదినిదాటి ప్రయాగయందు నివాసము, రామ - వాల్మీక సమాగమము, భగవానుడు చిత్రకూటమున నివసించుట. - ఈ ఘట్టములన్నిటిని వర్ణించెను. సచివుడు అయోధ్యకు మరలుట, దశరథుని నిర్యాణము, భరతుడు అయోధ్యకు వచ్చుటను. అతనొయొక్క ప్రేమను ఎంతో వర్ణించెను. దశరథుని అంత్యక్రియలు, నగరవాసులను తోడ్కొని సుఖరాశి అగు ప్రభునివద్దకు భరతుడు ఏతెంచుట, రఘుపతి భరతుని ఓదార్చుట, రాముని పాదుకలను తీసికొని భరతుడు అయోధ్యకు మరలుట - ఈ కథ అంతయు వివరించెను. భరతుడు నివసించిన విధము, ఇంద్రసుతుని చర్య, రామ - అత్రిముని సమాగనమును నుడివెను. విరాఢవధ, శరభంగుడు దేహమును త్యజించిన విధము, సుతీక్షుణి భక్తి, రామ - అగస్త్య సత్సంగము, దండకవనమును పావనమొనర్చుట, జటాయువుతో మైత్రిని వర్ణించెను. పిదప - పంచవటియందు ప్రభువు నివసించుట, సకలమునుల భయమును పారద్రోలుట, లక్ష్మణునికి అనుపమమగు ఉపదేశము కావించుట, శూర్పణఖను కురూపిని చేయుట. ఖరదూషణ సంహారము, మర్మమెల్లయు రావణునికి తెలిపిన విధము, దశకంధర మారీచ సంభాషణ జరిగినవిధము - అన్నియు తెలిపెను. మాయాసీతను రావణుడు హరించుట, శ్రీ రఘువీరుని విరహమును కొంత వర్ణించెను. తరువాత, గృధ్రరాజగు జటాయువునకు ప్రభువు అంత్యక్రియలు సలుపుట, కబంధవధ, శబరికి మోక్ష ప్రదానము, విరహవర్ణన చేయుచు రఘువీరుడు సంపాసరోవర తీరమునకు వెడలుట వివరించెను. రామ - నారద సంవాదము, రామ - వాయుసుత సమాగమము. సుగ్రీవునితో మైత్రి, వాలి వధ, సుగ్రీవ పట్టాభిషేకము. ప్రవర్షణగిరిపై నివాసము. వర్ష శరదృదుతువల వర్ణన, సుగ్రీవునిపై రాముని ఆగ్రహము. సుగ్రీవుని భయము. వానరరాజు కవులను పంపుట, సీతను వెదకుచు. అన్నిదిశలకు వానరులు వడలుట వారందరు బిలమున ప్రవేశించుట, వానర - సంపాతుల సమాగమము, కథ అంతయు విని సమీరకుమారుడు ఆపారమగు సముద్రమునుదాటుట, హనుమంతుడు లంకను ఎట్లు ప్రవేశించినది. సీతకు ఎట్లు ధైర్యముబోధించినది. వనమును పెకలించి రావణునికి ఎట్లు బోధించినది. లంకా పురీని కాల్చి. సముద్రముపై ఎట్లు ఎగిరి తిరిగి వచ్చినది. వానరులెల్లరు ఎట్లు రఘు నాథుడు ఉన్నచోటికి వచ్చినది. జానకీయొక్క కుశలవారను రామునికి ఎఱిగించుట, సేనాసపమేతముగా రఘువీరుడు వెడలి సముద్రమతీరమున చేరుట. విభీషణురేగి రాముని దర్శించుట, సముద్రబంధనము ఈ కథ అంతయు వినిపించెను.

సేతువును బంధించి వానరసేన సాగరమును దాటుట, వాలి తనయుడగు అంగదుడు, వీరవరుడు దూతగా ఏగుటను, నిశాచర - వానర రణములను వివిధరీతుల వర్ణించెను. కుంభకర్ణమేఘనాదులబల, పౌరుషములు, వారి వధ, నానావిధ నిశాచర సమూహముల మరణము, రామ రావణయుద్ధము, రావణసంహారము మందోదరి శోకము, విభీషణ పట్టాభిషేకము, దేవతలు శోకరహితులగుట, సీతారాముల సమాగమము, చేతులుజోడించి దేవతలు రాముని స్తుతించుట, పుష్పకమును అధిరోహించి కపులతోకలసి కృపానికేతనుడగు ప్రభువు అయోధ్యకు బయలుదేరుట, నిజనగరమునకు రాముని విచ్చేయుట - ఆ కథ అంతటిని వాయసము విశదీకరించెను.

రామ పట్టాభిషేకము, అయోధ్యపురవర్ణన, నానా విధములగు రాజనీతి - అంతయు భుశుండి తెలిపెను. భవానీ, ఆ కథను నీకు నేను వివరించితిని.''

రామకథ సర్వము విని, మనసున మహా ఉత్సాహముపొంది గరుడుడు ఇట్లు పలికెను:-

''రామచరిత సకలము విన్నాను. నా సందేహము తొలగిపోయినది. వాయస తిలకమా, నీ అనుగ్రహమువలన నాకు రామపాదములయందు భక్తి జనించెను. ''చిదానందఘనుడే శ్రీరాముడు! ఏకారణమున అతడు వ్యాకులపడెనో?'' అని నాగపాశబద్ధుడైన ప్రభుని చూచి నాకు మహా మోహము కలిగెను. సానూన్య మానవుని అనుసరించు రాముని చరిత్రను విని నా హృదయమున అత్యంతసంశయము పొడమెను. ఆ సందేహము నా మేలుకొరకే కలిగెనని ఇప్పడు తెలిసినది. కృపాదనిధి నాపై అనుగ్రహము చూపెను. ఎండచే వ్యాకులపడి ఉన్నవానికే చెట్టు నీడయొక్క సౌఖ్యము తెలియును. అత్యంత మోహమే నాకు కలిగి ఉండనిచో, నాయనా, నిన్నెట్లు కలిసికొని ఉండును? అతి విచిత్రము, సుందరము అగు ఈ హరికథను నీవు అనేక విధముల వర్ణించిన ఈ కథను ఎట్లు వినకలిగిఉందును? రాముడు కృపతో వీక్షించినవారినే పరిశుద్ధులగు మహాత్ములు కలసికొందురు. నిగమములు. ఆగమములు, పురాణములు, వెలువరించు అభిప్రాయమిదియే, సిదులు, మునులు సహితము ఇట్లే వచింతురు. దీనిలో సందేహములేదు. రామకృషచే నీ దర్శనము నాకు లభించినది. నీ ప్రసాదముచే నా సకల సంశయములు నశించినవి.''

విహంగపతి అగు గరుడుని వినయ, అనురాగయుత వచనములను విని కాక భుశుండి యొక్క తనువు పులకించెను. అతని కన్నులనుంచి నీరుకారెను. అతడు మనుసున మహానందముపొందెను.

ఉమా, సుమతులు, సచ్ఛీలురు, పవిత్రులు, హరికథా రసికులు, హరి సేవకులు అగు శ్రోతలున్నచో సజ్జనులు అతిగోప్యమగు రహస్యములను సహతము ప్రకటింతురు.

నభగనాథునిపై అత్యంత ప్రేమ కలిగిన కాకభుశుండి ఇంకనూ ఇట్లు నుడివెను. ''స్వామి. సర్వవిధముల నీవు నాకు పూజ్యుడవు. రఘునాయకుని కృపకే పాత్రుడవు. శంశయము, మోహం, మాయ నీకు లేవు. నా యందు కృపచూపితివి. ఖగపతీ. మోహమను నెపమును రఘుపతి నీకు కల్పించి నా వద్దకు నిన్ను పంపినాడు. నన్ను గొప్పవానిని చేసినాడు. ఖగేశ్వరా. నీ యొక్క మోహమును గురించి తెలిపినావు. స్వామీ, దానియందు ఆశ్చర్యములేదు. నారదుని, భవుని, విరించిని. సనకాదులను ఆత్మతత్త్వమును తెలిపిన మునినాయకులనే అంధులను చేయలేదా ఈ మోహము? జగమున కామము నాట్యమాడించినది ఎవ్వనిని? తృష్ణ ఎవ్వనిని మత్తెక్కించలేదు. క్రోధము ఎవ్వని హృదయమును దహించి ఉండలేదు? లోభముచే ఈ లోకమున దుస్థితి పాలుకానట్టి జ్ఞాని, తాపసుడు, శూరుడు, కవి, కోవిదుడు, గుణనిలయుడు ఎవ్వడైన ఉన్నాడా? ధనమదము ఎవ్వరిని వక్రబుద్ధిని చేయలేదు? ఐశ్వర్యము ఎందరిని చెవిటివారిని కావించలేదు? మృగనయనల నయన శరములు తగులనిది ఎవ్వరిని? మహావిజయముచే కలిగిన గర్వము తారుమారు చేయనిది ఎవ్వరిని? గర్వము, మదము సోకకుండా తప్పించికొనిన దెవ్వరు? యవ్వన జ్వరము ఎవ్వనిని అతిక్రుద్ధుని కావించలేదు? మమత ఎవ్వని యశమును నాశనము చేయలేదు? మత్సరము కళంకముచేసి ఉండనిది ఎవ్వరిని? శోకమును వాయువు కదిలించి ఉండనిది ఎవ్వరిని? చింత అను సర్పము తిననిది ఎవ్వరిని? జగమున మాయచే ఆవరింపబడి ఉండని వాడెవ్వడు? మనోరథము ఒక చీడపురుగు, శరీరము ఒ కొయ్య, ఈ పురుగు పట్టని శరీరము కల ధీరుడెవ్వడున్నాడు? పుత్రేషన, ధనేషణ, లోకప్రతిష్ఠ అను ఈషనత్రయము అందరి బుద్ధిని పాడుచేసిఉండలేదా? ఇవి అన్నియు మాయయొక్క ప్రబల, అపార పరివారము. మాయను వర్ణింపకలిగినవాడ్వెవడు? శివుడు, చతురాననుడు సహితము మాయకు భయపడుదురు. ఇక ఇతర జీవులు ఒక్కలెక్కయా? మాయయొక్క ప్రచండసేన లోకము అంతటా వ్యాపించిఉన్నది. కామాదులు మాయ యొక్క సేనాపతులు. దంభము, కపటము, బూటకము దాని భటులు. మాయ రఘువీరుని దాని. తెలిసికొనిన పిదప మాయ మిథ్యయే, కాని, రామకృపలేనిదే అది తొలగదు. నాథా, ఇట్లు నేను నొక్కిచెప్పుచున్నాను. ఖగరాజా, సకల జగమును నాట్యమాడించు ఈ మాయయొక్క చర్యలను ఎవ్వరూ ఊహించలేరు. ఈ మాయ - రామ ప్రభుని భ్రూవిలాసమున తన బృందముతో సహా నాట్యమాడును. అట్టి సచ్చిదానంద ఘనుడు రాముడు. అతడు అజన్ముడు. విజ్ఞానస్వరూపుడు. బలధాముడు. సర్వ వ్యాపకుడు. సర్వ స్వరూపుడు. అఖండుడు. అనంతుడు అఖిల అమోఘశక్తి ఆతడే. ఆతడే భగవంతుడు, నిర్గుణుడు. వాక్కునకు అతీతుడు, ఇంద్రియాతీతుడు. సర్వద్రష్ట. నిరోషి, అజేయుడు, మమతారహితుడు, నిరాకారుడు, మోహరహితుడు. నిత్యుడు. నిరంజనుడు, సుఖరాశి, ప్రకృతికి అతీతుడు, ప్రభుడు, సర్వహృదయాంతర్యామి, బ్రహ్మము, ఇచ్ఛారహితుడు, వికారరహితుడు, అవినాశి, అతనిలో మోహమునకు అవకాశములేదు. చీకటి ఎన్నడైనను సూర్యుని ఎదుటికి పోగలదా?

భగవానుడగు రామప్రభువు భక్తులకొరకై భూపాలుని శరీరము ధరించెను. ప్రాకృతమానవునివలె పరమపావన చరిత్రను సృజించెను. నటుడు అనేక వేషములను ధరించి నటించును. ఆ ఆవేషములకు తగినట్లు భావములను ప్రదర్శించును. తాను మాత్రము ఆ వేషములలో ఏదియూకాడు. అట్లే ఉరగారీ, రఘునాథుని లీలలును - ఆ లీలలు రక్కసులనే సమ్మోహపరచినవి. ఆతడు భక్తసుఖప్రదుడు. మలిన మానసులు, విషయలోలురు, కాముకులు మాత్రమే ప్రభునియందు మోహమును ఆరోపింతురు. నేత్రదోషము కలవారు చంద్రుడు పచ్చగా ఉన్నాడని అందురు. ఖగేశా, దిక్కులయందు భ్రమకలిగినవాడు సూర్యుడు పశ్చిమముననే ఉదయించెననును. ఓడపై ఎక్కినవానికి ప్రపంచము తిరుగుచున్నట్లు కనుపించెను. మోహవశుడై అతడు తాను తిరుగుట లేదనుకొనును. బాలురు గిరిగిర పరుగెత్తుదురు. ఇండ్లు మొదలైనవి కదలవు. ఐనను - బాలురు ఒకరొకరితో ''ఇళ్ళు తిరుగుచున్న''ని మిథ్యావాదనచేతురు. ఇట్లే హరి విషయముననూ మోహము. ఖగపతీ, కలోలోనైనను అతనిని గురించి అజ్ఞాన ప్రసక్తిలేదు.

మాయావశులు, మందమతులు, అభాగ్యులు, తమ హృదయములపై అనేక విధములగు తెరలు కలవారు అగు శరులు బలాత్కారవశులై సంశయింతురు. తమ అజ్ఞానమును రామునికే ఆరోపింతురు. కామ, క్రోధ, మద, లోభరతులు, దుఃఖరూపములగు గృహాసక్తులు ఎట్లు తెలిసికొనగలరు రఘుపతిని? చీకటి అను నూతిలోపడి ఉన్నారాయెవారు!

నిర్గుణ రూపమును తెలిసికొనుట అతి సులభము, సగుణరూపమును ఎవ్వరూ తెలియజాలరు. సుగుణమూర్తియొక్క నానా చరిత్రలను. సుగములైనవానిని. అగములైన వానిని విని మునుల మనములు సహితము భ్రమచెందును.

ఖగేశ్వరా, రఘపతియొక్క మహిమను వినుము. సుందరమగు ఆ కథను నా బుద్ధిని అనుసరించి వివరింతును. ప్రభూ. నాకు మోహము ఎట్లు జనించెనో అదియు నీకు వచింతును.

నాయనా, రామ కృపాభాజనుడవు నీవు. హరి గుణములయందు నీకు ప్రీతి. నీవు నాకు సుఖప్రదాతవు. కనుక నీ వద్ద నాకు రహస్యమేదియు లేదు. పరమహస్యమగు మనోహర చరితను వర్ణింతును.

రాముని సహజ స్వభావమును వినుము. జనన మరణ రూపమగు ఈ ప్రపంచ మునకు అహంకారము మూలకారణము. సకలశోకములను, నానా కష్టములను అదియే తెచ్చిపెట్టెను. కనుకనే రాముడు ఆ అహంకారమును తన భక్తులయందు ఉండవీయడు. కృపానిధి అగు అతడు వారినుండి దానిని దూరముచేయును. అతనికి తన సేవకులయందు అత్యధిక మమత. స్వామీ, పసివాని శరీరమును కురుపుఉన్నచో తల్లి కఠినురాలివలె దానిని కోయించి వేయును. కురుపు ఉన్నచో పసివాడు మొదట బాధపడును వ్యాకులత చెందును. ఏడ్చును. ఐనను వ్యాధి నాశనమగుటకు తల్లి ఆ బాధను, వ్యాకులతను, ఏడ్పును లక్ష్యపెట్టదు. అట్లే రఘుపతి తన దాసుల యొక్క అహంకారమును వారిర హితము కొరకు హరించివైచును. భ్రమనుత్యజించి ఓయీ, తులసీ, అట్టి ప్రభుని ఏల భజింపవోయీ?

ఖగేశ్వరా, రామకృఫను, నా మూర్ఖత్వమును గురించి తెలియచేతును. శ్రద్ధతో వినుము. రాముడు మానవతనువును ధరించి, భక్తులకొరకై అనేక లీలలను కావించు సమయంలో అయోధ్యాపురికి నేను పోదును. రాముని బాలలీలలను వీక్షింతును. సంతసింతును.

రామజననమహోత్సవములను దర్శించుటకు వెడలి, ఆ లీలలను తిలికించి సమ్మోహమున ఐదేండ్లవరకు అయోధ్యయందే ఉందును. శతకోటి మన్మథ సౌందర్య శరీరుడగు బాలరాముడు నా ఇష్టదైవము. ఉరగారీ, నా స్వామి యొక్క వదనమును వీక్షించి, వీక్షించి నేత్ర సాఫల్యమును కావింతును. ఒక చిన్నకాకి యొక్క తనువును ధరించి, హరి వెనువెంట తిరుగుచుందును. అతని బహు విధబాలచరితలను వీక్షింతును. అతు బాల్యమున తిరిగిన చోట్లయందెల్ల అతని వెంటన నేనును ఎగురుచుందును. దొడ్డిలోపడు అతని ఎంగిలిని తీసికొని తినుచుందును. ఒక పర్యాయము రఘువీరుడు ఒక అసాధారణ చరిత్రను కావించెను.'' ఇట్లు ప్రభుని లీలలను స్మరించుచుండగా కాకభుశుండియొక్క శరీరము పూలకించెను.

''ఖగనాయకా, వినుము'' అని భుశుండి తరువాత చరిత్రను ఇట్లు వినిపింపసాగెను.

''రామచరిత అతని సేవకులకు ఆనంద ప్రదమైనది. దశరథుని రాజమందిరము సర్వ విధముల సుందరమైనది. నలువురు అన్నదమ్ములు నిత్యము అటలాడిన ఆ రమణీయ ప్రాంగణములను వర్ణింజపజాలము. తల్లులకు ఆనందము కలిగించుచు, బాల వినోదము కావించుచు రఘునాధుడు ప్రాంగణమున తిరుగుచుండును.

మరకతమణివలె శ్యామల కోమలశరీరము రామునిది. అతిని ప్రతి అంగమున అనేక మన్మథుల శోభకలదు. నవరాజీపమువలె అరుణ, మృదుచరణములు, రుచిరమగు వ్రేళ్లే. చంద్రకాంతిని హరించుగోళ్ళు. పాదములయందు వజ్ర, అంకుశ, ధ్వజ, కమల చిహ్నములు నాలుగు, మంజుల రవమును కావించు సుందర నూపురములు కలరవమును సులుపు-మణులు పొదిగిన బంగారు గజ్జెలు. ఉదరమున త్రిరేఖలు, చక్కని లోతైననాభి. విశాలవక్షస్థలమున శోభిల్లు అనేకబాల విభూషణములు, వస్త్రములు, ఎఱ్ఱని అరచేతులు. మనోహర నఖములు. చక్కని వ్రేళ్లు. విశాలబాహువలపై సుందర విభూషణములు. బాలకేసరినిపోలు భుజములు. శంఖమువంటి కంఠము. అందమగు గడ్డము, లావణ్యమునకు అవధి అగు ముఖము. చిలుక పలుకులు. ఎఱ్ఱని పెదవులు. ఉజ్జ్వలమై, రమణీయమగు రెండువరుసల దంతములు. లలితమగు కపోలము. మనో హరమగు నాసిక. సకల సుఖప్రదమై, శశి సన్నిభమగు దరహాసము. భవమోచన కరములై. నీలకమలములను పోలులోచనములు, లలాటమున విరాజిల్లు గోరోచన తిలకము. వక్రములగు కనుబొమలు. సమమై, సుందరమైన శ్రవణంద్రియములు. నల్లనై. ఉంగరములు తిరిగిన శిరోజములచే వ్యాపించిన సౌందర్యము తనువుపై పసుపుపచ్చని పెద్దచొక్కా, ఆహర్షధ్వనులు, ఆ చూపులు నాకు అత్యంతప్రియము. దశరథ నృపాలుని ప్రాంగణమున విహరించు రూపరాశి తన నీడను వీక్షించి నాట్యము సలుపుచున్నాడు! అనేక విధములగు అటలను నాతో అడుచున్నాడు. వాటన్నింటిని వర్ణించుటకు నాకు సిగ్గగుచున్నది.

హర్షధ్వనులు చేయుచు నన్ను పట్టుకొనుటకు ఆతడు పరుగునవచ్చును. నేను వారిపోవుదును! ఆతడు తినుబండారమును నాకు చూపును. నేను దగ్గరకు పోదును. అంతట ప్రభువు నవ్వును. నేను దూరముగా పారిపోదును. ఆతడు ఏడ్చును. ఆతని చరణములను స్పృశించుటకు నేను ఆతనిని సమీపింతును. వెనుకకు తిరిగి నన్ను చూచుచునే ఆతడు పారిపోవును. ప్రాకృత శిశువువలె కావించు ఆతని చర్యలను చూచి నాకు మోహము జనించును. ''ఎమి? చిదానంద సందోహుడు - ప్రభువు ఇట్టి లీలలను కావించుచున్నాడే?'' అను సందేహము నాకు కలిగెను. ఖగరాజా, రఘుపతిచే ప్రేరేపింపబడిన మాయ నన్ను ఆవరించినదని నా మనస్సున శంక కలిగెను. ఆ మాయ నాకు దుఃఖమును కలిగించునదికాదు. ఇతరజీవులను వలె అది నన్ను ఈ భవబంధమున పడవై చునదియుకాదు. స్వామీ, ఇచ్చట ఇంకొక కారణమున్నది. సావధానముగా వినుము, హరివాహనమా,

సీతాపతి ఒక్కడే అఖండ జ్ఞానస్వరూపుడు. చరాచర జీవులన్నియు మాయా వశములే. అన్ని జీవులకు ఒకే విధమున అఖండజ్ఞానమే ఉన్నచో ఇక ఈశ్వరునికి జీవునికి భేదము ఎట్లు ఉండునో చెప్పుము. మాయా వశుడగుటచే జీవుడు గర్విష్ఠి అగును. త్రిగుణఖని అగు ఆ మాయ ఈశ్వరుని వశమునఉన్నది. జీవుడు పరతంత్రుడు. భగవంతుడు స్వవశుడు. జీవులు అనేకులు, శ్రీకాంతుడు ఒక్కడే. మాయా కల్పితమగు ఈ భేదము మిథ్యయే. కాని అది నశించుటకు కోటి ఉపాయము లైనను పనికిరావు. ఒకే ఒక ఉపాయమున్నది. హరిభజనయే అది, రామంచంద్రుని భుజింపకయే మోక్షపదమును కాంక్షించువాడు జ్ఞానవంతుడైనను సరే తోకయు, కొమ్ములులేని పశువు. షోడశ కళలతో సకల తారాగణములతో రాకాపతి ఉదయించనిమ్ము, సకల గిరులును దావాగ్నిచే దగ్ధముకానిమ్ము రవి ఉదయించనిదే రాత్రి గడువ నట్లేకదా! అట్లే, ఖగేశా,. హరిభజనలేనిదే జీవుని క్లేశము నశింపజాలదు. హరియొక్క సేవకునికి అవిద్య అంటదు. అతనికి ప్రభునియొక్క ప్రేరణచే విద్యయే వ్యాపించును. విహంగవరా, దీని వలన హరిదాసుడు నశించడు. స్వామియందు ఆ దాసుని భేదభక్తి వృద్ధిచెందును. భ్రమవలన చకితుడనై ఉన్న నన్ను రాముడు చూచి నవ్వెను. ఇక ఆ విశేష చరిత్రను వినుము. ఆ కౌతుక మర్మము ఎవ్వరికీ తెలియదు. అతని తమ్ములకే తెలియదు. అతని తల్లిదండ్రులు దానిని ఎఱుగురు.

శ్యామశరీరుడు, అరుణారుణ కరచరణయుతుడు, శ్రీరాముడు - మోకాళ్ళ చేతుల బలముచే నన్ను పట్టుకొన పరుగిడివచ్చెను. అంతట నేను పారిపోతినయ్యా గరుడా. నన్ను పట్టుకొనుటకు రాముడు చేతులు చాపినాడు. నేను ఆకాశమున ఎంత ఎగిరినను - ఎంత దూరము ఎగిరినను హరియొక్క బాహువులు నా వెనువెంటనే ఉన్నవి. నేను బ్రహ్మలోకమునకు పోతిని. ఎగురుచూ నేను వెనుకక తిరిగి చూతును కదా - నాయనా, రాముని బాహువులకు నాకు మధ్య రెండు వ్రేళ్ళ దూరము మాత్రము ఉన్నది. సప్త ఆవరణములను ఛేదించుకొని నాకు సాధ్యమైనంతవరకు పోతిని అక్కడకూడా ప్రభుని హస్తములు నా వెనువెంటనే ఉన్నవి. వానిని చూచి నేను వ్యాకులపడితిని. భయభీతుడనైతిని. వెంటనే కన్నులు మూసికొంటిని. కొంత తడవుకు కండ్లు తెరచితిని. తెరచి చూతునుకాదా ! కోసలపురియందు ఉంటిని. నన్ను చూచి రాముడు చిరునవ్వు నవ్వుచుండెను. అతడు నవ్విన వెంటనే అతని నోటియందు ఉంటిని నేను. పక్షిరాజా. అతని ఉదరమున అనేక బ్రహ్మాండ నికాయములను కనగొంటిని. అందు అతి విచిత్రమగు లోకములు అనేకములున్నవి. ఒక దానికంటె ఒకటి విచిత్రముగా సృజింపబడినవి అవి. కోట్లకొలది చతురాననులు, గౌరీశులు, అగణిత తారాగణములు, సూర్యులు, చంద్రులు, లోకపాలురు. యములు, కాలులు అనేక పర్వతములు, భూములు - విశాలములైనవి - అసంఖ్యాక సాగరములు. నదులు, సరస్సులు, వనములు, నానా విధములగు విస్తారదృష్టిని కనుగొంటిని. దేవతలను, మునులను, సిద్ధ, నాగ, నర, కిన్నరులను, చతుర్విధములగు చరాచర జీవులను చూచితిని.

ఎన్నడూ కనని, వినని, మనస్సుచే ఊహింపజాలని - అద్భుత సృష్టిని కాంచితిని. దానిని ఎట్లు వర్ణింపగలను ? ఒక్కొక్క బ్రహ్మాండమునను నూరేసి సంవత్సరములు ఉంటిని. ఇట్లు అనేక బ్రహ్మాండములను వీక్షించుచు వానియందు విహరించుచుంటిని. ప్రతి ఒక లోకమునకు వేఱు వేఱు విధాతలు, విష్ణువులు, శివులు, మనువులు, దిక్పాలకులు. నరులు, గంధర్వులు, భూతములు. భేతాళములు. కిన్నరలు, నిశాచరులు. పశువులు, పక్షులు, పాములు, నానాజాతి దేవగణములు. దైత్యగణములు! అనేక మహితలములు, నదులు, సాగరములు, సరస్సులు, పర్వతములు, - ప్రతి లోకము నందలి సృష్టి సకలవిధముల భిన్నమే. ప్రతి ఒక్క బ్రహ్మాండమునను నారూపమును కనుగొంటివి. అనుపమమగు అనేక వస్తువులను చూతిని. ప్రతి ఒక భువనమునను విలక్షణమగు అయోధ్యాపురియే ! భిన్నమగు సరయూనదియే ! భిన్న, భిన్న నరులు - భిన్న భిన్న స్త్రీలు! గరుడా, వినుము. దశరథుడు, కౌసల్య, భరతుడు మొదలగు సోదరుల రూపములు సహితము భిన్నముగనే ఉన్నవి. ప్రతి బ్రహ్మాండమునందును రామావతారమును దర్శించుచు, రాముని అపార బాలలీలలను తిలికించుచు తిరుగు చుంటివి. హరిహనమా, సకలము అతి విచిత్రముగా, వేఱు వేఱుగా కనుగొంటిని. లెక్కలేనన్ని భువనములను తిరిగితిని. కాని రామప్రభుని మాత్రము వేఱుగా వీక్షించనైతిని.

రఘువీరుడు అన్నిచోట్ల - అదే బాల్యమున, అదే శోభతో, అదే కృపాళుడు కనుపించెను : ఇట్లు మోహపవన ప్రేరితుడనై భువనములన్నియు తిరుగుచూ తిలకించుచూ ఉంటిని. బ్రహ్మాండములను అనేకములను తిరుగుచున్న నాకు నూరు కల్పములు గడచెను. తిరుగుచూ, తిరుగుచూ నా ఆశ్రమమునకు వచ్చితిని. కొంత కాలము గడిపితిని. ఇంతలో ప్రభువు అయోధ్యయందు అవతరించెనని వింటిని. 1 ప్రేమ సంభరితుడనై. ఆనందమున లేచి పరుగెత్తితిని. ప్రభుని జన్మోత్సవమును వీక్షించితిని. అది అంతయు మొదట నేను వర్ణించినట్లే ఉన్నది. రాముని కుక్షియందు అనేక జగములను నేను కనుగొన్నాను. వానిని చూడవలసినదే కాని వర్ణింజాలము. అక్కడనూ - మాయాధిపతి, చతురుడు, కృపాళుడు అగు భగవానుని - రామునే కనుగొంటిని. నేను పదే పదే పర్యాలోచన కావించితిని. మోహపంకిలమున నామతి చిక్కుకొనెను. ఇది అంతయు నేను రెండు గడియలలో చూచితిని. నా మనస్సున మహామోహము జనించెను. నేను ఆలసిపోతిని. నేను వ్యాకులపడుచున్నట్లు కృపాళుడు, రఘువీరుడు కనుగొనెను. అతడు నవ్వెను - ధీరమతీ, వినుము. అతడు నవ్వినవెంటనే నేను అతని నోటినుండి బయటకుపడితిని - రాముడు మరల అనే బాల్యచేష్టలు నాతో సలుప మొదలిడెను. నా మనస్సును కోటి విధముల శాంతింపచేసినను నాకు శాంతి కలుగలేదు. రాముని బాల్య చరిత్రను కాంచి - అతని మహిమను స్మరించి నేను నా దేహస్థితిని విస్మరించితిని. ''ఆర్తజనరక్షకా - రక్షింపుము. రక్షింపుము'' అని కేకలు వేయుచూ నేలపై పడిపోతిని. నా నోట మాట వచ్చుటలేదు. ప్రేమ విహ్వలుడనైన నన్ను ప్రభువు వీక్షించెను. నాపై తన మాయా ప్రభావమును అతడు ఉపసంహరించెను. తనకర సరోజములను స్వామి నా శిరమున ఉంచెను. దీనదయాళుడు నా సకల దుఃఖములను తొలగించెను. సేవక సుఖప్రదాత, కృపామయుడు, శ్రీరాముడు నన్ను మోహరహితుని కావించెను. అతని పూర్వ మహిమలను తలచుకొని నా మనస్సు అత్యంత హర్షము పొందెను. ప్రభునియొక్క భక్తవాత్సల్యమును చూచి నా హృదయమున మిక్కుటమగు ప్రేమ ఉద్భవించెను. నా నేత్రములు జలభరితములయ్యెను. నేను పులకితుడనైతిని. కరములు మోడ్చి పలు విధముల నేను వినతి చేసితిని. ప్రేమయుతములగు నా పలుకులను స్వామి వినెను. తన దాసుడు దీనుడని అతడు గ్రహించెను. రమానివాసుడు సుఖప్రదాత అగు రాముడు గంభీర, కోమల వచనములను ఇట్లు నుడివెను:-

''కాకభుశుండీ, నేను అతి ప్రసన్నుడనైతినని తెలియుము. వరము కోరుకొనుము అణిమాది అష్టసిద్ధులు, అపరబుద్ధులు, సకల సుఖఖని అగు మోక్షము. జ్ఞానము, వివేకము, వైరాగ్యము, విజ్ఞానము, జగమున మునులకు దుర్లభమగు నానా సద్గుణములు - సకలము నీకు ప్రసాదింతును. సంశయములేదు. మనోభీష్టమగు వరమును కోరుకొనుము.

ప్రభుని వచనములను విని నేను అధిక అనురాగభరితుడనైతిని. ''స్వామి సర్వసుఖములను ప్రసాదింతుననెను. కాని తనయందుభక్తిని కరుణింతుననలేదు'' అని నామనమున ఆలోచించితిని. ''ఉప్పులేని భోజనపదార్థములవలె భక్తిలేని గుణములు ఎన్నియైనను వ్యర్థము భజనరహితమగు సుఖము ఎందులకు?'' అని యోచించి. పక్షిరాజా, నేను

''ప్రభూ, నాయందు ప్రసన్నుడవై, నాకు వరము అనుగ్రహింపతలచితినేని నాపై కరుణించితివేని, నాయందు ప్రేమ చూపుదువేని - స్వామి, నా మనోభీష్టమగు వరమును కోరుకొందును. నీవు 'ఉదారుడవు', సకల హృదయాంతర్యామిని. శ్రుతులు. పురాణములు గానముచేయునట్టి, యోగీశ్వరులగు మునులు అన్వేషించునట్టి నీ అనుగ్రహముచేతనే కాని ఎవ్వడైనను పొందజాలనట్టి భక్తిని, నీయందు అవిరళ భక్తిని. విశుద్ధభక్తిని, ఓ భక్తకల్పద్రుమా. శరణాగతహితకరా, కృపాసింధూ, సుఖనిలయా, రామా, కృపచేసి నాకు ప్రసాదించుము'' అని వేడితిని.

''అట్లే అగుగాక!'' అని రఘుకులనాయకుడు పరమ సుఖదములగు వచనములను ఇట్లు వచించెను:-

''ఓ వాయసమా, వినుము, నీవు సహజ చతురుడవు, ఇట్టి వరమునే కోరవామరి? సకల సుఖములకు గని అగుభక్తినే కావలయునంటివి. జగమున నీవంటి భాగ్యవంతుడు మరిఒకడులేదు. జపముచే, యోగాగ్నిచే తమ తనువులను దహించి, కోట్ల కొలది యత్నమలు కావించి మునులు పొందజాలని భక్తిని నాకు అత్యంత ప్రీతికరమగు దానిని నీవు వరమువేడితివి. నీ చాతుర్యమును కని నేను ముగ్ధుడనైతిని. నీ చతురత నన్ను కడుప్రసన్నుని కావించెను. విహంగమా, వినుము. నా కృపచే సకల శుభగుణములు నీ హృదయమున వపించుగాత! భక్తి, జ్ఞానము, వైరాగ్యము, విజ్ఞానము, యోగము, నా లీలలు, వానియొక్క రహస్యములు, విభాగములు, వీని అన్నిటి యొక్క భేదములు, నా కృపచే నీవు తెలిసికొందువు. సాధనయందు ఏ కష్టము కలుగనేరదు. మాయా జనితమగు భ్రమ ఏదియు నిన్ను ఆవరింపదు.

నేను అనాదిపురుషుడను, అజుడను, ప్రాకృత గుణరహితుడను, గుణకారుడగు బ్రహ్మను ఈ విషయమును ఎఱగుము. కాకామా, నాకు సంతతము భక్తులు ప్రియులు. ఇట్లు యోచించి మనో, వాక్‌, కాయములతోనా పాదములయందు నిశ్చలమగు భక్తిని కలిగిఉండుము. నా వాక్కు సుగమమైనది, సత్యమైనది, వేదాదులచే వర్ణతమైనది, నిర్మలమైనది, సత్యమగు ఈ సిద్దాంతమును నీకు నేను వివరింతును. ఇక వినుము. విని నీ మనమున ధరింపుము. సర్వమును త్యజించుము. నన్ను భజించుము.

ఈ సర్వప్రపంచము నామాయవలన సంభవించినది. దీనియందు నానావిధములగు చరాచరజీవులన్నవి. అన్నిటిని నేనే సృష్టించితిని. అన్నియు నాకు ప్రియమైనవే. కాని అందరకంటెను మానవుడు నాకు అధికప్రియుడు. మనుజులయందు ద్విజులు నాకు ప్రియులు. ద్విజులయందు వేదాధ్యాయనపరులు నాకు ప్రియులు. వారి యందు నాకుప్రియులు వేదధర్మానుసారులు. వారిలో విరక్తులు నాకు ప్రియులు. విరక్తులయందు జ్ఞానులు నాకు ప్రియులు. జ్ఞానులలో నాకు అతిప్రయులువిజ్ఞానులు. నేనేగతి అని ఎంచి, ఇతర ఆశలు విడచిన నాదాసులు విజ్ఞానులకంటెను నాకు ప్రియులు నాభక్తునివలె నాకు ప్రియమైనవాడు మరిఒకడు లేడు, ఈ సత్యమును నీకు పదేపదేబోదించుచున్నాను.

బ్రహ్మ అయినను సరే భక్తివిహీనుడైనచో సకలజీవులవలెనే నాకు ప్రియుడు. భక్తియుతుడు అతినీచప్రాణి కానిమ్మునాకు ప్రాణసమానప్రియుడు. ఇదియే నా సిద్ధాంతము. పవిత్రుడు , మంచినడవడికగలవాడు, సుమతి, అగు సేవకుడు ఎవరికి ఇష్టుడు కాక ఉండును? చెప్పుము. శ్రుతులు పురాణములు ఈ నీతినే ఉపదేశించును. కాకను, జాగరూకతతో వినుము.

ఒక తండ్రికి పెక్కురు పుత్రులుందురు. వారిగుణములు వేరు, శీలములువేరు. ఆచారములు భిన్నములు , ఒకడు పండితుడు, ఒకడు తపస్వి, ఒకడు జ్ఞాని మరిఒకడు ధనవంతుడు, ఇంకొకడు శూరుడు, వేఱొకడు దాత. సర్వజ్ఞుడు మరిఒకడు. ధర్మపరాయణుడు ఇంకొకడు ఐనను వారి అందరియందును తండ్రికి ప్రేమ సమానమే. వీరిలో ఏ ఒకడైనను మనసా, వాచా, కర్మణా, తండ్రికి భక్తుడైనచో ఆ సుతునికి కలలోనైనను మరి ఒక ధర్మము తెలియనిచో, అతడు సర్వవిధముల అజ్ఞానియైనను సరే తండ్రికి ప్రాణ సమప్రియుడగును.

ఇట్లే తిర్యక్‌ జంతువులు, దేవతలు, నరులు, అసురులు, సకల చరాచరజీవులు అన్నిటితో నిండిఉన్న ఈ అఖిల విశ్వము నాచే సృష్టించబడినదే. అన్నిటియందును నాకు సమానమగు ప్రేమయే. వీనియందు మదమును మాయను వదలి మనోవాక్‌ కాయములతో నన్ను భజించువారు. పురుషుడు కానిమ్ము-నపుంసకుడు కానిమ్ము-స్త్రీ కానిమ్ము- చరాచరాజీవి ఏదైనను కానిమ్ము- కపటము ను త్యజించి-ఎవరైనను సరే - సర్వభావములను నన్నుభజించువాడే నాకు పరమప్రియుడు.

ఓ విహంగమా, నీకు నేను సత్యము వచింతును. పవిత్రుడగు సేవికుడు నాకు ప్రాణసమానప్రియుడు, ఇట్లు మననము చేయుము. ఇతర ఆశలన్నిటిని విడుపుము. విశ్వాసము లన్నిటిని వీడుము. నన్నే భజింపుము. కాలప్రభావము నీపై ప్రసరింపదు. నిరతరము నన్ను స్మరింపుము. అనవరతము నన్ను భజింపుము''.

ప్రభుని వచనామృతము ఎంత సేవించినను తనివితీరలేదు. నా తనువు పులకించెను. నా మనస్సున అత్యంత ఆనందము కలిగెను. ఆ ఆనందము నామనస్సు, చెవులు మాత్రమే ఎఱుగును. జిహ్వదానిని వర్ణింపజాలదు. స్వామియొక్క శోభను కనుగొనిన ఆనందము నా కన్నులకే తెలియును. కాని అవి ఎట్లు పలుకగలవు? వానికి నోరులేదుకదా? బహువిధముల చక్కగా ప్రబోధించి, ఆనందము కలిగించి ప్రభువు మరల బాలలీలలను కావింపమొదలిడెను. అతని కన్నులు నీరు క్రమ్యెను. ముఖమున ఉదాసీనము కనపరచుచు అతడు తన తల్లివంక చూచెను. 'అమ్మా, ఆకలి మండిపోవుచున్నది. అనునట్లు సూచించెను. తల్లి చూచినది. వెంటనే లేచి పరిగెత్తినది.మృధువచనములను పలుకుచు రాముని తన హృదయమునకు హత్తుకొనినది.ఒడిలో కూర్చుండపెట్టుకొనినది. పాలు త్రాగించినది. రఘపతియొక్క లలిత చరితను గానము చేయసాగినది.

ఏ ఆనందమునకై సుఖప్రదాత అగు పురారి శివుడు అశుభ##వేషమును ధరించునో ఆ ఆనందముననే ఆయోధ్యాపురస్త్రీ పురుషులు సంతతము నిమగ్నులై ఉండిరి. ఆ ఆనందమున లవలేశ##మైనను కలయందైనను ఒక్కసారి అనుభవించిన సజ్జనుడు, సుమతి, ఆనందము ముందు బ్రహ్మానందమును సహితము లెక్కచేయడయ్యా, పక్షిరాజా.

మరికొంతకాలము నేను అయోధ్యయందు ఉంటిని. రాముని మధుర బాలలీలను సందర్శించితిని, రాముని కృపచే 'భక్తి' వరమును ఆర్జించితిని . ప్రభుని పాదములకు నమస్కరించి నా ఆశ్రమమునకు మరలితిని.

ఇట్లు రఘునాయకుడు నన్ను తనవానిగా చేసికొన్న నాటినుండి మాయనా జోలికి రాలేదు. హరిమాయ నన్ను ఎట్లు ఆడించునో, ఆ గుప్తచరితరను నీకు నేను వివరించితిని. ఖగేశా , ఇక నా స్వానుభవమును నీకు తెలియచేతును. హరిభజనలేనిదే క్లేశములు దూరముకానేరవు. రామకృపలేనిదే-పక్షిరాజా అతని మహిమను తెలియజాలము. అతని మహిమ తెలియనిదే అతనియందు విశ్వాసము జనించదు. విశ్వాసము లేనిదే ప్రేమలేదు. ప్రేమలేనిదే భక్తిదృఢముకానేరదు. నీటిపై నూనెవలె అది జారిపోవును ఖగపతీ.

గురువులేనిదే ఎక్కడైన జ్ఞానము కలుగనా? వైరాగ్యము లేనిదే జ్ఞానము ఉదయించునా? వేదములు, పురాణములు ఘోషించునట్లు-హరిభక్తిలేనిదే ఆనందము లభించునా? నాయనా, సహజ సంతోషములేనిదే ఎవరికైనను శాంతి లబించునా? కోటిఉపాయములచేనైనను సరే, చచ్చినను సరే ఎచ్చటనైన నీరులేనిదే నావ నడచునా? సంతృప్తి లేనిదే కోరికలు నశించవు. కోరికలు ఉండగా కలలోనైనను సుఖములేదు. రామభజన వినా కోరికలు ఎక్కడైననా నశించునా? మట్టిలేనిదే ఎక్కడైనా చెట్టు మొలచునా? విజ్ఞానములేనిదే సమభావము కలుగునా? ఆకాశము లేనిదే స్థలము ఉండునా? శ్రద్ధలేకనే ధర్మము ఉండునా? భూమిలేనిదే గంధములేదు. తపములేనిదే తేజము నిస్తరించకలదా? జలతత్త్వము లేకుండా ఏ రసము ఉండును లోకమున? బుధులను సేవింపలేనిదే సదాచారము ఏదైననూ ప్రాప్తించునా? స్వామీ, అగ్నితత్త్వము లేనిదే రూపము లేదు. ఆత్మానందములేనిది మనస్సు స్థిరమై ఉండదు. వాయుతత్త్వము లేనిదే స్పర్శఉండునా? విశ్వాసము లేకనే ఎవడైన సిద్ధుడగునా? హరిభజనచేయక మన భవభయము నశించునా? విశ్వాసములేనిదే భక్తికలుగనేరదు. భక్తి లేనిదే రాముని హృదయము ద్రవించదు. రాముని కృపలేనిదే జీవుడు స్వప్నముననైను శాంతిని పొందజాలడు.

ఓయీ ధీరమతి, ఇట్లు యోచింపుము. కుతర్కములను , సకల సంశయములను వీడుము. కరుణాకరుడు, సుందరుడు, సుఖప్రదుడు, అగు రఘువీరుని, రాముని భజించుము. స్వామి, పక్షిరాజా, నాబుద్ధికి తోచినట్లు ప్రభుని ప్రతాపమును, మహిమను వర్ణించితిని. ఇది అంతయు నాకండ్లతో నేను చూచినదే. నీకు తెలిపినాను. నాయుక్తిచే కాని, అతిశయోక్తులచే కాని ఏదియూ నేను తెలుపలేదు.

రఘనాథుని మహిమ, నామ, రూప, గుణముల గురించిన గాథలు అన్నియు అమితమైనవి. రఘునాథుడు అనంతుడు తమతమ బుద్ధిని అనుసరించి మునులు హరిగుణ గానముచేతురు. నిగమములు, ఆదిశేషుడు, శివుడు సహితము వాని అంతమును కనుగొనలేరు. నీ నుండి దోమవరకు రెక్కలున్న సకలజీవులు చిన్నవి-పెద్దవి ఆకాశమున ఎగురుచున్నవి. కాని ఆకాశము యొక్క అంతము ఎవ్వరైన తెలిసికొన కలిగిరా? తండ్రీ, ఇట్లే రఘుపతి యొక్క మహిమయు అగాధము, ఎన్నడైనను, ఎవ్వడైనను దాని లోతును కనుగొనగలరా?

రాముడు శతకోటి మన్మథ సుందర శరీరుడు, అనంతకోటి దుర్గలకు సముడగు అరిమర్దనుడే. శతకోటి ఇంద్రసమ విలాసవంతుడు. శతకోటి ఆకాశతుల్యమగు అమిత స్థానము ఆయనయందున్నది. అతడు శతకోటి పవనతుల్యమహాబలుడు, శతకోటి రవి సన్నిభ తేజోవంతుడు. శతకోటి చంద్రసమ శీతలుడు. సకల భవభయ భంజకుడు. శతకోటి కాలులవలె అతిదుస్తరుడు. దుర్గముడు, అనంతడు, శతకోటి ధూమకేతులవలె అత్యంతప్రబలుడు, భగవంతుడు శతకోటి పాతాళములవలె ఆ ప్రభువు అగాధుడు. శతకోటి యములవలె అతడు భయానకుడు అనంతకోటి తీర్థములవలె అతనినామము పావనమైనది, పావనమొనర్చునది. అఖిల పాపసమూహములను నాశనమొనర్చకలది ఆతని నామము. కోటిహిమాచలములవలె అతడు అచలుడు. శతకోటి సాగరముల లోతైనవాడు. శతకోటి కామధేను సముడగు ఆతడు సకల కామ్యప్రదుడు. భగవానుడు. ఆతనికి శతకోటి శారదల చతురత కలదు. శతకోటి బ్రహ్మల సృష్టిరచనా నైపుణ్యము అతనికి ఉన్నది. కోటివిష్ణు తుల్యుడగు పాలనకర్త అతడు. శతకోటి రుద్రసమాడగు సంహారకర్త అతడు.శతకోటి కుబేరులకు సమానుడగు ధనవంతుడు అతడు. కోట్లకొలది మాయలకు సమానముగ మాయను సృజించగలడు అతడు. భారమును వహించుటయందు అతడు శతకోటి శేషతుల్యుడు. ఆ ప్రభువు జగదీశ్వరుడు, ఎందునను అతనికి అవధిలేదు. సాటిలేదు సామ్యములేదు. దేనితో అతనిని పోల్చకలము? రామునికి సాటి రాముడే. ఇది వేదవాక్కు.''శతకోటి మిణుగురు పురుగులకు సముడు సూర్యుడు'' అని వర్ణించుట అతిఅల్పమేకదా? ఈ రీతిని తమ తమ బుద్ధి వికాసమును అనుసరించి మునీశులు హరిని వర్ణించిరి.

ప్రభుడు భక్తభావగ్రాహకుడు. అతి కృపాళుడు. ప్రేమయుతమగు తన వర్ణనలను విని ప్రేమయుతుడై అతడు ఆనందించును. రాముడు అమితగుణసాగరుడు. అతని అంతమును గ్రహింపకల వాడెవడు? సాధు, సత్పరుషులనుండి నేను వినినదానిని కొంచెము నీకు తెలిపినాను. సుఖనిధానుడు, కరుణాధాముడు అగు భగవానుడు ప్రేమవశుడు. మమతను , మదమును, అభిమానమును విడిచి సదా సీతారమణుని భజించుము.''

ఇట్లు భుశుండి వచించిన సుందరవచనములను విని ఖగపతి హర్షము చెందెను. అతడు తన రెక్కలను చాపెను. అతని కన్నులు నీరు క్రమ్మెను. మనస్సు అత్యంత సంతోషముకాంచెను. శ్రీరఘుపతియొక్క ప్రతాపమును అతడు తన ఉరమున ధరించెను. గరుడుడు తన పూర్వము మోహమును గుర్తించెను.

''అనాది అగు బ్రహ్మను నేను మానవుడని తలచితిని.'' అని వగచెను. కాకభుశుండియొక్క పాదములకు పలుమార్లు గరుడుడు ప్రణామము చేసెను. భుశుండి రాముని యంతవాడని ఎఱిగిన గరుడుని ప్రేమ అధికమయ్యెను.

విరించికి, శంకరునికి సములైన వారైననను సరే- గురువులేనిదే భవసాగరమును ఎవ్వరూ దాటజాలరు.

''నాయనా , సంశయము లనబడు సర్పములు నన్ను కాటువేసినవి. కుతర్కము లనబడు అదిరిపాట్లు అనేకములు నాలో పైకి వచ్చుచుండెడివి. నీరూపమున ఉన్న గారుడమంత్రముచే- భక్తజన ఆనందదాయకుడగు రఘానాయక రూపగరుడడునన్ను పునర్జీవుని కావించెను. నీ అనుగ్రహమున నామోహము నశించెను. రాముని అనుపమ రహస్యము నాకు తెలిసెను'' అని గరుడుడు సుడివెను. భుశండిని గరుడుడు పలువిదముల ప్రశంసించెను. శిరమువంచి అతనికి నమస్కరించెను. చేతులు జోడించి ప్రేమయుతములగు మృదువచనములను వినమ్రుడై ఇట్లు వచించెను:-

''స్వామీ, ప్రభూ, నా అవివేకముచే నన్ను ప్రశ్నించుచున్నాను. కృపాసాగరా, నేను నీ నిజదాసుడనని ఎఱిగి సాదరముగా నా ప్రశ్నకు ప్రత్యుత్తరము ఇమ్ము. నీవు సర్వజ్ఞడవు. తత్త్వజ్ఞుడవు. మాయాతీతుడవు. సుమతివి. సౌశీల్యము కలవాడవు. సరళ ఆచారపరుడవు. జ్ఞనివి. వైరాగ్య, విజ్ఞాన ధాముడవు. రఘునాయకునికి ప్రియదాసుడవు. ఈకాకిశరీరము నీకేల ప్రాప్తించెను? తండ్రి , సకలము వినిపింపుము. ఈ రామచరితమానసము నీకు ఎక్కడ లభించెన? స్వామి, ఆకాశ గామీ, తెలుపుము. నాథా, శివునినుండి వింటిని- మహా ప్రళయకాలమున సహితము నీకు నాశనము లేదట? ఈశ్వరుడు మిథ్యావచనములను ఎన్నడు నుడువిడు. నామనసున ఈ సందేహముకూడా ఉన్నది.

స్వామీ, నాగ, నర, దేవాది చరాచర జీవులు, ఈ సర్వజగము- కాలుని బాలభోగము .అనేక బ్రహ్మాండములను నాశన మొనర్చుకాలము సదా అత్యంత అనివార్యమైనది? అట్టి భయంకరకాలము తన ప్రభావమును నీపై చూపజాలదు. కారణమేమి? కృపాళూ, నాకు తెలుపుము. ఇది జానప్రభావమా? లేక యోగబలమా?

ప్రభూ, నీ ఆశ్రమమునకు నేను రాగానే నామోహము. భ్రమ పలాయన మైనవి. దీనికి కారణమేమి? అనురాగయుతుడవై వీని నన్నిటిని వివరింపుము''?

ఉమా, గరుడుని పలుకులు విని కాకభుశండి సంతసించెను. పరమప్రేమతో అతడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను:-

''ఉరగారీ, నీ బుద్ధి ధన్యమైనది! ధన్యమైనది! నీ ప్రశ్న నాకు పరమానందము కలిగించినది. ప్రేమయుతమగు, రమణీయమగు నీప్రశ్నను విని నాకు అనేక పూర్వజన్మల స్మృతి కలిగినది. నా స్వీయచరిత అంతటిని సవిస్తరముగా వర్ణింతును. తండ్రీ , సాదరముగా మనస్సును లగ్నముచేసి వినుము.

జపముల, తపముల, యజ్ఞముల, శమ, దమ, వ్రత, దాన, వైరాగ్య, వివేక, యోగ, విజ్ఞానాదుల అన్నిటియొక్క ఫలము రఘుపతియొక్క పాదములయందు భక్తియే. భక్తిలేనిదే -ఎవ్వరికీ క్షేమము లభింపదు. ఈ తనువుతోనే నేను రామభక్తిని పొందితిని. కనుకనే నాకు దీనిపై అధికమగు మమత, తమ లక్ష్యములను దేనిద్వారా సాధింతురో దానియందు ఎల్లరకు మమతయేకదా!

ఓయీ పన్నగవిరోధీ, మనకు పరమహితకారి అని మనము తెలిసికొనిన అతినీచజంతువునైనను మనము ప్రేమించవలెను. ఇది వేద విదితమగు నీతి. సజ్జన సమ్మతమైనదియు. పట్టుపురుగులనుండి పట్టు వచ్చును. ఆ పట్టుతో చక్కని బట్టలు నేయుదురు. పరమఅపవిత్రమగు ఆ పురుగును అందరు ప్రాణతుల్యముగా పెంతురు.మనోవాక్‌ కర్మలచే రామచరణములను భజించుటయే జీవునియొక్క సత్యమగు స్వార్థము. ఏ శరీరమును ధరించు రఘువీరుని భజింపకలమో ఆ శరీరమే సావనమైనది. అదియే సుందరమైనదియు.

బ్రహ్మవంటి శరీరమును ధరించువాడైనను రామ విముఖుడు కవి కోదులచే ప్రశంసింపబడడు. ఈ తనువుతోనే నాహృదయమున రామభక్తి జనించెను. తండ్రీ, కనుకనే ఈ తనువు నాకు పరమప్రియము. నా మరణము నా ఇచ్ఛపై ఆధారపడి ఉన్నది.అయినను ఈ తనువును నేను త్యజించను. తనువులేనిదే భజన చేయలేనమని వేదములు తెలిసినవి. పూర్వము మోహము నాకు మహా కష్టమును కలిగించెను. రామ విముఖుడనై ఎన్నడూ, సుఖముగా నేను నిద్రింపలేదు. నానా జన్మలలో నేను అనేక విధములగు యోగ, జప, తప యజ్ఞ దానాదులను , కర్మలను కావించితిని. బహుజన్మలయందు తిరిగి తిరిగి నేను జన్మించని యోని ఉన్నదా ఖగేశా! సకల కర్మలను అనుభవించితిని. కాని స్వామీ, ఇప్పుడు ఈ జన్మలోపల ఇంతవరకు ఎన్నడూ నేను ఆనందించి ఉండలేదు. శివుని కృపచే నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. మోహము నాబుద్ధిని ఆవరించదు.

నా ప్రథమ జన్మ చరితను వివరింతును. వినుము, విహంగేశ్వరా, దానిని వినినచో ప్రభుని చరణములయందు భక్తిజనించును. క్లేశములన్నియు నశించును.

ప్రభూ, పూర్వము ఒక కల్పమున పాపములకు మూలమగు కలియుగము గడచుచుండును. స్త్రీలు, పురుషులు ఎల్లరు అధర్మరతులై , వేద ప్రతికూలురై ఉండిరి. ఆ కలియుగమున నేను కోసలపురియందు శూద్ర తనువును పొంది జనించితిని. మనో వాక్కర్మలయందు శివుని సేవకుడనై ఉంటిని. ఇతర దైవములను నిందించుచు గర్వినైతిని. ధన గర్వముచే మత్తెక్కి అతివాచాలుడనై, ఉగ్రబుద్ధినైనతిని, నాహృదయమున మిక్కిలి దంభము కలిగెను. రఘుపతియొక్క రాజధాని యందు నివసించుచున్ననూ ఆనాడు నాకు అయోధ్య యొక్క మహిమ కొంచెమైనను తెలియదు. ఆపురియొక్క మహిమనేడు తెలిసినదినాకు. ఏ జన్మయందైనను అయోధ్యయందు వసియించువాడు రామ పరాయణుడగునని నిగమములు, ఆగమములు, పురాణములు ఘోషించు చున్నవి. కోదండపాణి అగు రాముడు ఎవని హృదయమున నివసించునో అట్టి ప్రాణికి అయోధ్యయొక్క ప్రభావము తెలియకలదు. ఆకలికాలము అతికఠినమై ఉండెను. ఉరగారీ, స్త్రీలు, పురుషులు అందరు పాపపరాయణులే. కలి కల్మషములు ధర్మములన్నిటిని కబళించివైచెను. సద్గ్రంథములుప్తమయ్యెను. దంభములు పలుకువారు తమ స్వబుద్ధిచే అనేక సంప్రదాయములు. ఆచారములు కల్పించి ప్రకటించిరి. ప్రజలెల్లరు మోహవశులై ఉండిరి లోభము సత్కర్మలను మ్రింగివైచెను.

జ్ఞాననిధీ, హరివాహనమా, వినుము కలిధర్మములను కొన్నిటిని వివరింతును. వర్ణధర్మములు లేవు; ఆశ్రమ ధర్మములు లేవు, స్త్రీలు, పురుషులు అందరు వేద విదోధులు, ద్విజులు శ్రుతులను విక్రయించిరి. భూపాలురు ప్రజలను భక్షించిరి, వేదశాసనమును ఎవ్వరు లక్ష్యముచేయరైరి. యథేచ్చగా అందరు చరించిరి. డంబములు పలికిన వారే ఆనాడు పండితులైరి. ఆడంబరములు చేయువారు. డంభమున వర్తించువారు భక్తులనడబడిరి. పరధనమును హరించువారే బుద్ధిమంతులైరి. మోసగాండ్రే మిక్కిలి ఆచారపరులైరి. అబద్దము పలుకువారు, పరిహాసము చేయనేర్చినవారు గుణవంతులని కలియుగమున వర్ణింపబడిరి. ఆచార విహీనులు, శ్రుతిపథమును త్యజించినవారు కలియుగమున జ్ఞానులు, విరాగులు గోళ్ళు, పెద్దపెద్ద జడలు పెంచినవారు కలియుగమున ప్రసిద్ధ తాపసులు, అశుభ##వేషములను, భూషణములను ధరించువారు. తినతగినవి తినరానివితినువారే యోగులు. వారే సిద్దులు. కలియుగమున పూజింపబడినవారు వారే. పరులకు అహితకరమగు పనులను కావించువారికే మహా గౌరవము. సన్మానయోగ్యులు వారే. మనో , వాక్‌, కర్మలచే అసత్యము పలుకువారు కలికాలమున వక్తలు. నరులందరు స్వామీ, నారీవశలు, కోతులవలె వారుస్త్రీల చేతులలో నాట్యముచేసిరి. ద్విజులకు శూద్రులు జ్ఞానోపదేశముచేసిరి. మేడలో జందెములు ధరించి వారునీచదానము లను స్వీకరించిరి, పురుషులెల్లరు కామ, క్రోధ, లోభభరితులైరి. దేవతలకు, విప్రులకు, వేదములకు, భక్తులకు వారు విరోధులైరి, అభాగినులగు స్త్రీలు గుణధాములు, సుందరులు అగు తమ పతులను విడచి పరపురుషులను భజించిరి. సువాసినులగు స్త్రీలు భూషణ విహీనులైరి. విధవలు నిత్యనూతన శృంగారము చేసికొనిరి.

గురువులు చెవిటివారివలె, శిష్యులు గ్రుడ్డివారివలె ఉండిరి. ఒకడు వినడు. ఇంకొకడు కనడు. గురువు శిష్యునిధనమును హరించెను. కాని అతని శోకమును హరింపజాలడయ్యెను. అట్టి గురువు ఘోర నరకమునపడును.

తల్లి దండ్రులు బాలకులను పిలచి పొట్టనింపుకొనుటకే ధర్మములను బోధించిరి. స్త్రీలు, పురుషులు బ్రహ్మజ్ఞానము తప్ప ఇంకొకమాట మాటడనేలేదు. లోభవశులై ఒక చిల్లిగవ్వకే తమ గురువులను, విప్రులను వారు హత్యచేయుచుండిరి. శూద్రులు ద్విజులతో వాదములాడుచుండిరి.

''మీ కంటె మేము ఏమి తక్కువ''? అనుచుండిరి. బ్రహ్మను తెలిసినవాడే విప్రవరుడు అని కన్నులతో వారు ఉరిమి భయపెట్టుచుండిరి.

పరస్త్రీలంపటులు, కపటమున నిపుణులు, మోహ, ద్రోహ, మమతారతులు వీరే అబేదవాదులగు బ్రహ్మజ్ఞానులు ఆ యుగమున, ప్రతికలియుగమున, ఈ కలి చరిత అంతయు నేను కనుగొంటిని తాము సర్వభ్రష్టులగుదురు. సరే ఇంకెవ్వడైనను సన్మార్గగామి ఉన్నచో వానిని సహితము వీరు భ్రష్టుని చేతురు. (కు)తర్కములతో వేదములను దూషించిన వారు కల్ప కల్పాంతమువరకు ఒక్కొక్క నరకమున పడి ఉందురు. అథమ వర్ణజులు, నూనె తీయువారు, కుమ్మరులు, ఛండాలురు, భిల్లులు, కోలులు, కల్లుఅమ్మువారు-తమ భార్యలు మరణించిన అనంతరమో లేక తమ సంపద నశించినపుడే తలలు గొరిగించుకొని సన్యాసులైరి వారు. విప్రులచే పూజలనందిరి, తమ చేతులతో తాము ఇహపరములను కోల్పోయిరి. విప్రులు, నిరరక్షరులు, లోభులు, కాముకులు, ఆచారహీనులు, మూర్ఖులు, నీచజాతి వ్యభిచారిణి స్త్రీలకు స్వాములు! నానావిధములగు జప, తప, వ్రతములను శూద్రులు కావించిరి. ఉన్నతాసనముపై కూర్చుండి వారు పురాణములను చెప్పిరి. నరులెల్లరు స్వకల్పిత ఆచారములను అనుసరించిరి. అపారమగు ఆ అవినీతిని వర్ణింపజాలము. కలియుగమున అంతయు వర్ణసంకరమే. భిన్నభిన్న వేదమార్గములే. అందరు పాపులే.అందరు భయ, దుఃఖ, రోగ శోక, వియోగములను అనుభవింతురు. మోహవశులగు నరులు-వేద సమ్మతమగు. వైరాగ్య, జ్ఞానయుతములగు హరిభక్తి మార్గముల చరింపక నూతన మార్గములను కల్పించుకొనిరి.

యతులు బహుధనమును సేకరించిరి. ఇండ్లను అలంకరించుకొనిరి. వారిలో వైరాగ్యము లేనేలేదు. దానిని విషయాసక్తి హరించెను. తాపసులు ధనవంతులైరి. గృహస్థులు దరిద్రులైరి, నాయనా ఆ కలియుగలీలలను వర్ణింపలేమబు. కులకాంతలను సతులను పురుషులు ఇండ్లనుండి వెడలగొట్టిరి. సత్ప్రవర్తనను విడచిరి. దాసీలను తెచ్చి ఇండ్లయందు ఉంచుకొనిరి. ఆడుదాని మొగము చూడనంతవరకే పుత్రులు తమ తల్లి దండ్రులను గౌరవించిరి. అత్తవారి ఇండ్లు ప్రీతికరమైన నాటినుండియు స్వకుటుంబము శత్రురూపమయ్యెను. నరపతులు పాపపరాహణులైరి, వారియందు ధర్మములేదు. వారు ప్రజలను నిత్యము దండించి వారిని దుర్దశలపాలుచేసిరి. నీచజాతివారైనను ధనవంతులు కులీనులుగా ఎంచబడిరి, ద్విజులకు జందెము చిహ్నముగామాత్రమే మిగిలెను. దిగంబరత్వము తపస్వులకు చిహ్నమయ్యెను. వేదములను, పురాణములను మన్నించనివారే కలియుగమున హరిభక్తులు, నిజభక్తులు అని భావింపబడిరి.

కవి సమాజములు మందలు మందలయ్యెను. కాని దాతలు మాత్రమువినపడరు. గుణదోషములను ఎంచువారు అనేకులు, సద్గుణముల కలవారు ఎవ్వరూలేరు. కలిలో మాటిమాటికి ఆకాలమే అన్నములేక అందరు చచ్చుచుండిరి.

ఖగేశ్వరా, వినుము, కలియుగమున కపటము, బలత్కారము, దంభము, ద్వేషము, బూటకము, గర్వము, మోహము, మదము, కామము, మొదలగునవి బ్రహ్మాండము నంతటివని వ్యాపించినవి. నరులు, జప, తప, వ్రత, యజ్ఞ, దానములను తామసభావమున సలుపుచుండిరి. దేవతలు భూమిపై వర్షములు కురిపించుటలేదు. చల్లిన ధాన్యపు విత్తులు మొలచుటలేదు. అబలలకు తల వెండ్రుకలే ఆభరణములు, ఆకలిఅమితము, ధనహీనులు, దుఃఖితులైరి. వారికి అతి మమకారము తగ్గలేదు. ఆ మూఢులకు కావలసినది సుఖము, ధర్మమున ప్రీతి వారికి లేదు. వారి బుద్ధి అల్పము- కఠోరము, వారియందు కోమలత్వములేదు. నరులు రోగపీడుతులై ఉండిరి. ఎక్కడా భోగములు లేవు. ఆకారణ విరోధములు, అహంకారములు ఐదు, పదిఏండ్లు అల్పాయుష్కులు, ఐనను కల్పాంతరమువరకైనను నశించమను అహంకారము. కలికాలము మనుజులను అస్తవ్యస్తము చేసివైచెను.

చెల్లలనియు, కూతురనియు ఎవ్వరికి విచారమేలేదు. సంతృప్తిలేదు. వివేకము మృగ్యము శాంతి శూన్యము, ఉత్తమజాతివారు, నీచజాతివారు అందరు బిచ్చగాండ్రయ్యిరి. ఈర్ష్య, పరుషవాక్కులు, లోభత్వము పరిపూర్ణముగా వ్యాపించెను. సమతనశించెను. వియోగముచే, విశేష శోకముచే నిండి ప్రజలు ఉండిరి. వర్ణాశ్రమ ధర్మాచారములు నశించినవి. దమము, దానము, దయ, పరస్పర సౌహర్ద్రము ఎవ్వరియందునూ లేవు. మూర్ఖత్వుమ, పరమవంచన కడు విజృంభించెను. స్త్రీలు , పురుషులు తమ శరీరపోషణయందే నిమగ్నులై ఉండిరి. పరులను నిందించువారే జగమంతయు వ్యాపించిరి. గరుడా, వినుము, కలికాలము పాపములకు, అవగుణములకు నిలయము. కాని మహత్తరమగు పెక్కు సద్గుణములు సహితము కలియుగమున ఉండెను. యుగమునప్రయాసలేకయే భవబంధములనుండి విముక్తి లభించెను.

కృత, త్రేతా, ద్వాపర యుగములయందు యోగము, యజ్ఞము, పూజలచే సంప్రాప్తించిన సద్గతి కలియుగమున జనులు హరినామ సంకీర్తనలను పొందగలరు.కృతయుగమున వలరుపయోగములే. విజ్ఞానులే. హరిధ్యానముచేసి అందరు భవసాగరమును తరింతురు. త్రేతాయుగమున నరులు నానాయజ్ఞములను చేసి, కర్మల నన్నిటిని ప్రభునికి సమర్పింతురు. భవసాగరమును దాటుదురు. ద్వాపరయుగమున నరులు రఘుపతి యొక్క చరణములను పూజించి భవవారిధిని తరింతురు. వేఱొక ఉపాయము లేదు. కలియుగమున యోగములేదు. యజ్ఞములేదు. జ్ఞానములేదు. కేవలము హరిగుణగానము కావించుటవలననే నరులు భవసాగరముయొక్క అవధులను తెలిసికొనగలరు. కలియుగమున రాముని గుణగానము ఒక్కటే ఆధారము. ఇతర ఆశలనన్నిటిని, విడచి రాముని భజించువాడు, ప్రేమసహితుడై రాముని గుణగానము చేయువాడు-వాడే భవసాగరమును తరించును. లేశమాత్రము సంశయములేదు. కలియుగమున నామప్రతాపము ప్రకటమే, కలియుగమున మానసికపుణ్యమే కాని మానసికపాపములేదు. ఇది కలియుగముయొక్క ఒక పునీత మహిమ. నరునికి విశ్వాసమే ఉన్నచో కలియుగమువంటి యుగము మరి ఒకటిలేదు. రాముని విమలగుణములను గానము చేసి, ప్రయాసలేకయే నరుడు ఈ యుగమున భవసాగరమును తరింపకలడు.

ధర్మమునకు నాలుగు పాదములని తెలిసిన విషయమే. వానిలో కలియుగమున ఒక్కచరణమే ప్రధానము. ఏవిధిని సమర్పించిన దానమైనను కళ్యాణప్రదము. ఏయుగమున రాముని మాయచే ప్రేరేపింపబడి అందరి హృదయములో యుగధర్మములు అన్ని యుగములలో నిత్యమై ఉండును. శుద్ధసత్త్వగుణము సమత, విజ్ఞానము, మనస్సున ప్రసన్నభావము - ఇవి సత్యయుగ ప్రభావములు. అధిక సత్త్వగుణము, స్వల్పరజోగుణముల, కర్మలయందు ప్రీతి, సర్వవిధముల సౌఖ్యము ఇవి త్రేతాయుగ ధర్మములు.

రజోగుణము అధికము, సత్త్వగుణము అతిస్వల్పము-స్వల్పతమోగుణము, మనసున హర్షము, భయము, ఇవి ద్వాపరయుగ ధర్మములు. అధిక తమోగుణము, స్వల్ప రజోగుణమ నలుదిసలయందు ప్రతికూలత విరోదము ఇవి కలియుగ ప్రభావ ములు.

పండితులు యుగధర్మములను మనుసులయందు తెలిసికొని అధర్మములను త్యజించి, ధర్మరతులై ఉందురు. రఘుపతియొక్క చరణానురాగులపై యుగధర్మములు పనిచేయవు. ఖగరాజా, ఇంద్రజాలకుడు చేయు ఇంద్రజాలము ప్రేక్షకులకు అతి ఆశ్చర్యకరముగా ఉండును. కాని అతని సేవకులను అది మోసగించదు. హరి మాయచే సృష్టింపబడిన గుణదోషములు హరిని భజించనిదే తొలగిపోవు. ఇట్లు నీ మనసున యోచించి, కోరికలను త్యజించి, రాముని భజించుము.

విహంగేశ్వరా, ఆ కలియుగమున పెక్కు ఏండ్లు నేను అయోధ్యయందు ఉంటిని, ఇంతలో కఱవు వచ్చెను. ఆ విపత్తివలన నేను విదేశములకు వెడతిని. దీనుడనై, మలినుడవై , దరిద్రుడనై, దుఃఖితుడనై- అంతట- ఉరగారీ, వినుము, ఉజ్జయిని చేరితిని , కొంతకాలము గడచెను. కొంత సంపదను ఆర్జించితిని, తిరిగి అచ్చటనే శంభుని సేవింప మొదలిడితిని. ఉజ్జయినియందు విప్రుడు ఒకడు- వైదిక విధిని శివుని సదా పూజించుచుండెను. మరి ఒక పని అతనికి లేదు. అతడు పరమసాధువు. పరమార్థము తెలిసినవాడు. శంభుని ఉపాసించువాడే అయినను హరిని నిందించువాడు కాడు, నేను మాత్రము కపటముననే అతనిని సేవించుచుంటిని. అతి దయాళుడు అద్విజుడు. నీతి నిలయుడు, బహిరంగమున నమ్రతను ప్రదర్శించు చున్న నన్ను విప్రుడు స్వామి, పుత్రునివలె చూచి విద్య గరపుచుండెను. ఆ ద్విజవరుడు నాకు శివమంత్రమున ఉపదేశించెను. అనేక విధముల అతడు సదుపదేశములను కావించెను. నేను శివాలయమునకు వెడలి ఆ మంత్రమును జపించు చుంటిని. నా హృదయమున దంభము, అహంకారము పెరుగుచున్నవి. దుష్టడను, నీచుడను, పాపసంకులమతి కలవాడను, అగు నేను మోహవశుడనై హరిభక్తులను, ద్విజులను చూచినంతనే మండిపడుచుంటిని, విష్ణుద్రోహము కావించుచుంటిని. నా చర్యలను చూచి గురువు దుఃఖితుడయ్యెను. అనేక విధముల ఆయన నిత్యము నాకు బోధించుచుండెను. కాని -దానివలన నాలో అమిత క్రోధము ఉత్పన్నమగుచుండెను. దంభము కలవానికి నీతులు రుచించునా?

ఒకనాడు గురువు నన్ను పిలిపించు పలువిధముల నాకు నీతి గరపెను.

''కుమారా, రామపాదములయందు అవిరళభక్తి కలిగిఉండుటయే శివుని సేవించుటవలన కలుగు ఫలము. నాయనా, శివుడు, బ్రహ్మయు రాముని భజింతురు. ఇక పామరులకు మానవుల మాట ఎంత? అభాగ్యడా, అజుడు, శివుడు ఎవని చరణానురాగులో అట్టివానికి ద్రోహముచేసి సుఖింపతలతువా నీవు?'' అని అనెను.

శివుడు హరియొక్క సేవకుడని గురవు వచించెను! ఈ పలుకులు విని నా హృదయము భగ్గుమనెను. ఖగనాథా అథమజాతివాడను, విద్య నేర్పితిని. పాలుపోసి పెంచిన పామునైతిని! అహంకారిని కుటిలుడను, దౌర్భాగ్యుడను, దుష్టజాతివాడను అగు నేను రాత్రింబవళ్లు గురుద్రోహము కావించుచుంటిని. గురువు అతి కృపాళుడు. ఆయనకు స్వల్పమైనను క్రోధమేలేదు. పదేపదే ఆయన నాకు మంచిని బోధించుచుండెను.

నీచుడు తనకు దేవివలన గొప్పతనము వచ్చునో దానినే అన్నిటికంటే ముందు నాశనముచేయుచును. నిప్పునుండి పుట్టిన పొగ -మేఘపదవిని పొంది ఆ నిప్పునే ఆర్పివేయును! దుమ్ము నిరాదరింపబడి దారిలోపడిఉండును. నిత్యము అందరికాళ్ళక్రిందపడి అది తన్నులు తినును. వానిని సంహించును. గాలి వచ్చును. ఆ గాలి ఈ ధూళిని ఎగురకొట్టును. మొదట ఆ గాలి ధూళితోనే నిండును. తరువాత ఆ దుమ్ము రాజుల కండ్లలోను, వారి కిరీటములమీదనుపడును. ఖగపతీ, వినుము. ఈవిషయమును గ్రహించి బుధులు అథములతో కలసి వర్తించరు.

''ఖలులతో కలహము మంచిదికాదు, ప్రేమయూ అంతే'' అని కవులు , కోవిదులు నీతిని బోధింతురు. స్వామీ, సదానీవు ఉదాసీనుడవై ఉండవలెను. కుక్కను విడిచి నట్లు దుష్టుని విడువవలెను. నేను దుష్టుడనై ఉంటిని. నాహృదయము కపటముతో, కుటిలత్వముతోనిండిఉండెను. గురువు హితమును బోధించెను. కాని అది నాకు రుచించలేదు.

ఒకనాడు హరమందిరమున నేను శివనామమును జపించుచుంటిని. ఇంతలో గురువు ఏతెంచెను. నేను అహంకారమున లేచి ఆయనకు ప్రమాణము చేయనైతిని గురువు కృపాళుడు. ఆయన ఏమియు పలుకలేదు. ఆయనహృదయమున లేశమాత్రము కోపములేదు. గురువును అవమానించుట మహాపాపము. మహేశ్వరుడు దానిని సహించకలేకపోయేను. ఆలయమున ఆకాశవాణి ఇట్లు వినబడెను.:

''హతభాగ్యుడా, అహంకారీ, మూర్ఖుడా, నీగురువునకు కోపములేదు. అతడు అతి కృపాళుడు, యథార్థజ్ఞాని, ఐనను నిన్ను నేను శపించుచున్నాను. శకుడా, నీతి విరోధి నాకు ప్రియుడు కానేరడు, నిన్ను దండించినచో నావేదమార్గము భ్రష్టమగును. గురువుపై ఈర్ష్య చెందువాడు కోటియుగములు రౌరవ నరకమునపడి ఉండును. అక్కడినుండి పశుపక్ష్యాది యోనులయందు శరీరములను ధరించును. తరువాత పదివేల సంవత్సరముల వరకు దుఃఖములు పొందుచునే ఉండును. ఓరీ పాపీ, కొండచిలువవలె గురుని ఎదుట కూర్చుంటివి, పాపము నీబుద్దిని ఆవరించెను. దుష్టా, ఒక సర్పముకమ్ము, పొమ్ము, అధమాధమా, ఈ అధోగతినిపొంది ఏ చెట్టుతొఱ్ఱలోనో పడిఉండుము.''

శివునియొక్క ఈ దారుణశాపమును విని గురవు హాహాకారము కావించెను. కంపించుచున్న నన్ను చూచి ఆయన హృదయమున అత్యంతపరితాపము జనించెను. ప్రేమసమేతుడై ఆ ద్విజుడు సాష్టాంగప్రణామముచేసి శివుని సమ్ముఖమున చేతులు జోడించెను. నాయొక్క ఘోరస్థితిని తలచి, గద్గదవాణితో ఇట్లు అతడు శివుని వినతించెను:-

''ఈశా, ఈశానా, మోక్షస్వరూపా, ప్రభూ, సర్వవ్యాపకా, బ్రహ్మస్వరూపా, వేదరూపా, ఈశానుడా, ఈశా నీకు నమస్కరింతును. సత్యస్వరూపా, మాయా రహితా, నిర్గుణా, నిర్వికల్పా, ఇచ్చారహితా, చిదాకాశస్వరూపా, ఆకాశవాసీ, దిగంబరా, నిన్ను భజింతును.

నిరాకరా, ఓంకారమునకు నీవు మూలమువు. సదా తురీయావస్థనే వసింతువు. వాక్కునకు, జ్ఞానమునకు, ఇంద్రియములకు నీవు అతీతుడవు. ఈశుడవు, గిరీశుడవు. కరాళుడవు, మహాకాలులకు సహితము కాలుడువు- కృపాళు, గుణనిలయా, ప్రపంచాతీతా ప్రభూ నీకు నమస్కరింతును.

హిమాచలమువలె గౌరవర్ణుడవు, గంభీరుడవు, కోటిమన్మధప్రభను, శోభను కలిగిన శరీరుడవు -శిరమున సుందర సురనదీతో - నుదుట విదియచంద్రునితో గళమున భుజంగములతో శోభిల్లుచుందువు.

సుందరమగు భ్రుకుటి, విశాలమగు నేత్రములు, చెవులకు కదలిఅడెడు కుండలములు, ప్రసన్నవదనము, నీలకంఠము, మృగాదీశచర్మాంబరము, కపాలమాల కలిగిన లోకనాథుడువు, దయాళుడవు, శంకరుడవు, సర్వప్రియుడవు. నిన్ను భజింతును.

ప్రచండరూపమున సర్వఉత్కృష్టుడవై, మహత్తరతేజముతో అనంతమగు ప్రతిభకలిగిన పరమేశ్వరా, నీవు అఖండుడవు. ఆజుడవు, కోటిసూర్యప్రభాసితుడవు, త్రివిదాపవిధ్వాంసకుడవు. శూలపాణివి, భావగమ్యుడవు, భవానీ పతివి, అట్టి ప్రభూ, నిన్ను భజింతును.

కళాతీతా, కల్యాణస్వరూపా, కల్పాంతకారీ, సదా సజ్జనానందప్రదాతా, త్రిపురారి, చిదానంద సందోహో, మోహనసంహారకా, మన్మథా రిపూ, ప్రభూ, ప్రసన్నుడవు కమ్ము- ప్రసన్నుడవుకమ్ము.

ఉమానాథా, నీపాదారవిందములను భజింపనంతవరకు నరులకు ఇహలోక మున, పరమలోకములన సుఖ, శాంతులు లభించవు. వారి తాపములు నశించవు. సర్వభూతాదివాసా, ప్రభూ, ప్రసన్నుడవు కమ్ము.

యోగము, జపము పూజయు నాకు తెలియవు. శంభో , సదా, సర్వదా నీకేనమస్కరింతును. జరా, జన్మ మరణ దుఃఖజాలములయందు మ్రగ్గుచున్న నన్ను ఆపన్నుడవను రక్షింపుము ప్రభూ, ఈశా, శంభో నీకు నమస్కరింతును,''

హరుని ప్రీతికొరకై విప్రునిచే కావింపబడినది ఈ రుద్రాష్టకము. దీనిని భక్తి పూర్వకముగా పఠించు నరులయందు శంభుడు ప్రసన్నుడగును.

సర్వజ్ఞుడగు శివుడు ఈ వినతిని వినెను. విప్రుని అనురాగమును గమనించెను. ఆలయ మునుండి మరిఒకమారు ''ద్విజవరా, వరముకోరుకొనుము'' అని ఆకాశవాణి వినిపించెను.

''ప్రభూ, నీవు నాయందు ప్రసన్నుడవైనచో , స్వామీ, ఈ దీనునిపై నీకు ప్రేమఉన్నచో నాకు ప్రథమమున నీపాదములయందు భక్తిని ప్రసాదించుము, అటు పిమ్మట ఈ రెండవవరమిమ్ము, జడుడగు ఈ జీవుడు నీమాయకువశుడై, పాపియై భ్రమించుచున్నాడు,ప్రభూ, కృపాసింధూ, భగవానుడా, వీనిపై కోపింపకుము.

దీనదాయళా, శంకరా, వీనిపై కృపచూపుము. నీకృపచే ఆనతికాలమున వీనిని శాపవిముక్తినిచేసి అనుగ్రహింపుము. కృపానిధీ, వీనికి పరమశుభము కలుగునట్లు కృపచూడుము.'' అని ద్విజుడు స్తుతించెను.

విప్రుని యొక్క వరహితకరమగు పలుకులువిని ఆకాశవాణి నుడి ''అట్లే అగు గాక '' అని విననయ్యెను.

''ఇతడు దారుణమగు పాపముచేసినను కోపించి ఇతనిని నేను శపించినను నాయొక్క సాధుత్వమును చూచి ఇతనిపై విశేషమగు కరుణ చూపింతును . క్షమాశీలురు, పరోపకారులు, ఖరారి, అగు రామునివలె నాకు ప్రియులు. ఓయీ ద్విజుడా, నా శాపము వ్యర్థము కాజాలదు. అవశ్యము ఇతడు వేయిజన్మలు ఎత్తవలసినదే. జనన, మరణ, దుఃఖములు దుస్సహములు, ఇతనిని అని ఏమాత్రవు బాధించవు. ఏజన్మముననైనను సరే ఇతని జ్ఞానము నశించదు. ఓయీ శూద్రుడా, ప్రామాణికమగు నా పలుకులను వినుము.రఘుపతి యొక్క పురమును నీవు జన్మించితివి. అంతే కాక నా సేవయందు నిమగ్నుడవైతిని. అయోధ్యపుర ప్రభావమువలనను, నాకృపచేతను, నీ హృదయమున రామభక్తి ఉదయించును. సోదరా, ఇక నాయొక్క సత్యవచనములను వినుము.

ద్విజసేవయే శ్రీహరిని ప్రసన్నుని చేయువ్రతము. ఇక విప్రులను అవమానింపకుము. సాధు, సత్పురుషులు భగవానుడగు అనంతునికి సములనిగ్రహించుము. ఇంద్రుని వజ్రాయుధముచేనైనను. నావిశాల త్రిశూలముచేనైనను, కాలుని దండుముచేనైనను, హరియొక్క వికరాళ చక్రముచేనైనను చావనివారు సహితము వ విప్రద్రోహమనబడు అగ్నిలోపడి బస్మమైపోదురు. ఇట్టి వివేకము నీ మనస్సున కలిగిఉండుము. జగమున నీకు దుర్బభమగునది ఏదియు ఉండదు. మరి ఒక అశీర్వాదమును ప్రసాదింతును. నీ ఇచ్చవచ్చినచోటికి నిరాటంకముగా పోగలవు." అని శివుడు పలికెను.

శివుని వచనములను విని గురువు సంతసించెను. అతడు "అట్లే అగుగాక!" అనెను. నాకు ఎంతో ఆయన బోధించెను. శంభుని చరణములను తన హృదయమున ధరించి తన ఇంటికి వెడలెను.

కాలప్రేరణచే నేను వింధ్యగిరికి పోయితిని. సర్పము నైతిని. మరి కొంత కాలము గడచినది. ఎట్టి ప్రయాసము లేకయే నేను ఆ తనువునుత్యజించితిని, నేను ఏ శరీరమును ధరించినను, గురుడా, దానిని పాతబట్టలను విడిచి. క్రొత్తవానిని నరుడు ధరించునట్లు ఆనాయాసముగా త్యజించుచుచుంటిని. శివుడు వేదనీతిని పరిక్షించెను. నేను క్లేశమును, పొందుటలేదు. ఖగేశ్వరా, ఇట్లు అనేక తనువులను ధరించితిని. కాని నా జ్ఞానముమాత్రము నశించలేదు. తిర్యక్‌. దేవ, నరయోనుల యందు ఏ తనువును ధరించినను రామభజనను నేను మానలేదు. ఒక్క బాధ మాత్రము నన్ను విడువలేదు. గురునియొక్క కోమల, సౌశీల్య, స్వభావము నా స్మృతికివచ్చి అది నన్ను బాధించుచునే ఉండెను. చరమదేహముగా ద్విజశరీరమును పొందితిని. సురలకు సహితము ఇది దుర్లభమని శ్రుతులు, పురాణములు నుడివినవి. ఈ జన్మయందును బాలకులతో కలసి ఆడుచుంటిని. రఘునాయకుని లీలన్నిటిని నటించుచుంటిని.

యుక్తవయస్కుడనైతిని! నాతండ్రి నాకు విద్య గరప మొదలిడినాడు. నేను నేర్చుకొనుచుంటిని. వినుచుంటిని ఆలోచించుచుంటిని ఐనను చదువు నాకు రుచించుటలేదు. నా మనసునుండి వాసనలన్నియు తొలగిపోయినవి కేవలము రామచరణములయందు లీనమైఉంటిని. పక్షిరాజు, చెప్పుము. కామధేనువును కాదని ఒక ఆడగాదను సేవించు అభాగ్యుడు ఉండునా ఎవడైనా? భక్తి ప్రేమ నిమగ్నుడనైనందున ఏదియునాకు రుచించుటలేదు. నాకు చెప్పి చెప్పి నాతండ్రి విసుగుచెందెను.

నా తల్లితండ్రులు కాలధర్మముచెందిన పిదప భక్తరక్షకుడగు రామునిభజించుటకై న్నుఅడవులకు పోతిని. ఎక్కడెక్కడ మునీశ్వరుల ఆశ్రమములున్నదో అక్కడికి పోయి మునులకు మ్రొక్కుచుంటిని. రాముని గుణగణములను వివరించుడని వారిని కోరుచుంటిని ఖగనాథా, వారు తెలుపుచుండిరి. విని నేను సంతసించుచుంటిని. ఇట్లు సదా సర్వత్రా హరి గుణగణములను వినుచు అడుగుచుంటిని. శంభుని కృపచే కోరిన చోటికి నేను పోగలను. నాయొక్క త్రివిధ. ప్రబలవాసనలు విడిపోయెను. నా హృదయమున ఒక్క ఆశమాత్రము అధికముగా పెరుగుచండెను. 'రాముని చరణ కమల సందర్శనము ఎన్నడుచేతునా' అనునదియే అది, అప్పుడుకదా నా జన్మ సఫలమగునని నా ఆశ.

ఏ మునులను ప్రశ్నించినను వారు "ఈశ్వరుడు సర్వభూతమయుడు" అని వచించుచుండిరి. ఈనిర్గుణ తత్త్వము నాకు తృప్తికలగింపదాయెను. సగుణ బ్రహ్మమునందు నా అనురాగము నా హృదయమున ప్రవర్ధమానమగుచుండెను. గురుని వచన ములను స్మరించి నా మనము రామ చరణములయందు లగ్నమయ్యెను. క్షణక్షణమునూతన అనురాగభరితుడనై రఘుపతియొక్క యశమును కీర్తించుచు విహరించుచుంటిని.

మేరు పర్వతశిఖరమున ఒక వటవృక్షచ్ఛాయ రోమశముని ఆసీనుడై ఉండెను. ఆయనను చూచిఆయనపాదములకునమస్కరించితిని. అతి దీనవచనములను వచించితిని. నా నమ్ర, మృదు వచనములను విని, ఖగరాజా ఆ ముని "ఓయీ ద్విజుడా, నీవు వచ్చినపని ఏమి?" అని ప్రశ్నించెను.

"కృపానిధీ, నీవు సర్వజ్ఞుడవు. చతురుడవు. భగవానుడా, సగుణారాధనను నాకు బోధింపుము"అని నేను వేడితిని. అంతట ఖగనాథా, ఆమునీశుడు రఘుపతి యొక్క గుణగాథలను కొన్నిటిని సాదరముగా తెలిపెను. బ్రహ్మజ్ఞానరతుడు. విజ్ఞాని అగు ఆ మును నేను యోగ్యుడనని తెలికొని బ్రహ్మనుగూర్చి ఇట్లు ఉపదేశింప మొదలిడెను.:_

"బ్రహ్మ అజడు, అద్వితీయుడు, అగుణుడు,అంతర్యామి, సమగ్రుడు, ఇచ్ఛా రహితుడు, నామరహితుడు, రూపరహితుడు, అనుభవవేద్యుడు. అఖండుడు అనుపముడు, ఇంద్రియాతీతుడు, విములుడు అవినాశి, నిర్వికారుడు,అనంతుడు, సుఖరాశి, నీరు నీటియందలి కెరటములవలె ఆతనికి నీకు భేదమేమియులేదు. ఆతడే నీవు. "తత్త్వమపి" అని వేదములు ఘోషించుచున్నవి." అని ఇట్లు ఆముని నాకు అనేక విధముల ఉపదేశించెను. కాని నిర్గుణ సిద్ధాంతము నా మనసునకు ఎక్కలేదు. తరిగి మునియొక్క చరణములకు నేను వందనముచేసి "సుగుణోపాసనను గురించి తెలుపుడు మునీశా" అని అర్థించితిని "నా మనసు రామభక్తి అను నీయందు చేప అయ్యెను. ముని సత్తమా, ఈ స్థితిని అది ఎట్లు వేఱుకాగలదు? నా ఈ నిజనేత్రములతో రఘునాథుని దర్శించు ఉపాయమును దయచేసి తెలుపుము. అయోధ్యాపతిని కన్నులార కనుగొందును. అనంతరము నిర్గుణబ్రహ్మ గురించిన ఉపదేశమును విందును." అని నేను అంటిని. మరికొన్ని హరికథలను ముని వచించెను. సగుణారాధనను ఖండించెను. నిర్గుణోపాసనను నిరూపించెను. నిర్గుణారాధనను ఖండించి మొండిపట్టుతో నేను సగుణమునే నిరూపణచేయసాగితిని. వాదోపవాదములకు దిగితిని. మునియొక్క శరీరమున క్రోధపు చిహ్నములు జనించెను. ప్రభూ, అత్యంత అవమానముకలిగినచో జ్ఞానియొక్క హృదయములు సహితము క్రోధము జనించును. బాగుగా ఒరపిడిచేసినచో మంచిగంధపు కఱ్ఱలనుండి కూడా అగ్ని ఉద్భవించును! అనేక పర్యాయములు ఆ ముని కోపముననే జ్ఞాననిరూపణ కావింపసాగెను. నా బుద్ధి అంతయు వినియోగించి అనేక విధముల ఆలోచించుచుంటిని. ద్వైతబుద్ధి లేనిదే క్రోధము కలుగగలదా? అజ్ఠానము లేనిదే ద్వైతబుద్ధి ఉండగలదా? మాయావశులు, పరిమితులు-అగు జడజీవులు ఈశ్వరునితో సములు ఎట్లుకాగలరు? సర్వులు మేలును కోరుటచే ఎన్నడైన దుఃఖముకలుగునా? పరశువేదిని దగ్గర ఉంచుకొన్న వారివద్ద దారిద్ర్యము నిలచునా? నిశ్శంకతో ఉండగలడా పరద్రోహి? కళంకరహితుడై ఉండగలడాకామి? ద్విజులకు అహితము కావించిన వంశమునిలుచునా? ఆత్మజ్ఞానము జనించిన పిదప సకామకర్మకు స్థానముఉండునా? దుష్టులుసాంగత్యముచే ఎవరికైనను సద్బుద్ధి కలిగెనా? పరస్త్రీగామికిఉత్తమగతి లభించునా? పరమాత్మను తెలిసకొనినవాడు జననమరణ చక్రమున ఎన్నడైనపడునా? హరిని నిందించువాడు ఎన్నడైనా సుఖిఅగునా? నీతి ఎరుగని రాజ్యము నిలువకలదా? హరి చరితనువర్ణించిన పిదప పాపములు బ్రతికి ఉండకలవా? పుణ్యములేకనే సత్కీర్తి ప్రాప్తించునా? పాపములేకనే ఎవడైనను ఆపకీర్తిపాలగునా? సాధు సత్పురుషులు, వేదములు, పురాణములు గానము చేసిన ఆ హరి భక్తికి తుల్యమగు ఫలమున్నదా? మానవశరీరమును పొంది రాముడు భజించకఉండుటవంటి హాని ఇంకొకటి జగమున కలదా సోదరా? ఖగపతీ, చాడీలు చెప్పుటవంటి పాపము మరి ఒకటి ఏదీ? దయను పోలిన ధర్మమున్నదా? ఇట్లులెక్కలేనన్నియుక్తులను నా మనస్న ఆలోచించితిని. మునియొక్క ఉపదేశమును ఆదరమును విననైతిని. పదే పదే నేను సగుణారాధనను భలపరచుచుంటిని. అంతడట ఆ ముని క్రోధభరితుడై.

"ఓరి, మూఢుడా, ఉత్తమబోధను నేను చేయుచుంటిని. నీవు గ్రహింపవు. వాదోపవాదములను, యుక్తిని ప్రయోగించుచుంటివి. నేను బోధించు సత్యవచనముల యందు విశ్వాసము నీకు లేదు. కాకివలె అన్నిటికీ నీకు భఫయమే. ధూర్తుడా, నీ వాదన యందు నీకు మొండిపట్టు. శ్రీఘ్రమే నీవు ఛండాలపక్షివి కమ్ము" అని శపించెను.

ఆ శాపమును తలదాల్చితిని. దానివలన నాకు దై న్యముకావి భయముకాని కలుగలేదు. వెంటనే నేను కాకినైతిని. మునియొక్క చరణములకు ప్రణమిల్లి, రఘవంశమణి అగు రాముని స్మరించి, సంతోషమున ఎగిరిపోతిని."

ఉమా, రామచరణరతునికి, కామ, క్రోధ, మదరహితునికి-జగమంతయు ప్రభు మయముగనే కనుపించును. వానికి ఎవనితో విరోధముండును?

తదుపరికథను కాకభుశుండి ఇట్లు వివరింపసాగెను: "వినుము, ఖగేశ్వరా, దీనియందు ఋషియొక్క దోషము లేశ##మైననులేదు. సకల హృదయప్రేరకుడు రఘువంశ విభూషణుడే. నా ప్రేమను పరీక్షించుటకై కృపాసింధుడు మునియొక్క మతిని కల్లోలపరచెను. మనో, వాక్‌, కర్మయందు నేను తన దాసుడనని తెలిసికొని ప్రభువు మునియొక్క బుద్ధిని తిరిగి చక్కపరచెను. నా నిజస్వభావమును. రామ చరణముల యందు నాకు కల విశేష విశ్వాసమును ముని కనుగొని విస్మయముచెందెను. అతడు పలుమారులు పశ్చాత్తాపము చెందెను. సాదరముగా నన్ను పిలిపించెను. అనేక విధముల నన్ను సంతోషపరచెను. హర్షమున అతడు నాకు రామ మంత్రమును ప్రసాదించెను. కృపానిధి అగు ఆ ముని బాలరాముని ధ్యానించు విధానమును నాకు ఉపదేశించెను. సుందరము, సుఖదము అగు ఈ ధ్యానము నా మనసును చూరకొనినది. దీనిని ప్రథముననే నేను నీకు తెలిపినాను.

కొంతకాలమువరకు ముని నన్ను తన సన్నిధినే ఉంచెను. ఆ సమయమున రామచరిత మానసమును ఆతడు వర్ణించెను. సాదరముగా దానిని వినిపించెను. ఆతడు మృదువచనములకు ఇట్లు పలికెను:_

"నాయనా, సుందరము, గుప్తము అగు ఈ రామ చరితమానసమును నేను శంభుని కృపచే తెలిసికొంటిని. నీవు రాముని నిజభక్తుడవని కనుగొంటిని. కనుకనే ఈ చరిత సర్వము సవిస్తరరముగా నీకు వర్ణించితిని. తండ్రీ, రామభక్తి లేనివారి ఎదుట ఈ కథ ఎన్నడూ చెప్పరాదుసుమా" రోమశ ముని ఇట్లుఅనేక ఉపదేశములను నాకు కావించెను. అంతట నేను ప్రేమయుతుడనై మునిచరణములకు మ్రొక్కితిని. మునీశుడు స్వీయకరములముచే నా శిరమును స్పృశించి సంతసించెను.

"ఇక నా కృపచే నీ హృదయమున సదా ఆవిరళమగు రామభక్తిస్థిరముగ నిలచును" అని దీవిచెను. "నీవు సదా రామునికి ప్రేమపాత్రుడవగుదవు. నీకు సదా రాముడు ప్రియుడగును. శుభగుణ నిలయుడవగుదువు. అభిమాన రహితుడవగుదువు. కామరూపుడవగుదువు. నీకు ఇచ్ఛామరణము కలుగును. నీవు జ్ఞాన, వైరాగ్య, నిధానమగుదువు. భగవంతుని స్మరించుచు ఏ ఆశ్రమమున నీవు నివసించుచున్ననను- ఆ ఆశ్రమమునకు ఒక యోజనదూరము వరకు అవిద్య, మాయయు వ్యాపించవు. కాల, కర్మ, గుణ, దోష స్వభావములచే కలుగు దుఃఖములేవియు ఎన్నడూ నిన్ను స్పృశించవు! ఇతిహాస, పురాణములయచందు గుప్తముగా ఉన్నవి. నిర్దేశింపబడినవి అగునానా విధ రమణీయ రామరహస్యములను అన్నిటిని శ్రమలేకయే నీవు తెలిసికొందువు. రామ చరణములయందు నీకు నిత్యనూతన భక్తికలుగును. నీ మనసున నీవు ఏది కోరినను అది హరియొక్క అనుగ్రహమున నెరవేరును. దుర్లభము ఏదియు ఉండబోదు" అని అతడు నన్నుఆశీర్వదించెను.

వినుము. ధీరమతీ, మునియొక్క దీవనను విని గగనమునుండి గంబీరవాణి-బ్రహ్మవాణి- "జ్ఞానివగు ఓ మునీ, అట్లే అగుగాక! నీ వచనము సఫలమగుగాక. ఈతడు మనో, వాక్‌, కర్మలయందు నా భక్తుడు." అని వినవచ్చెను.

ఆకాశవాణిని విని నాకు ఆనందము కలిగెను. నేను ప్రేమ మగ్నుడనైతిని. నా సంశయములన్నియు తొలగెను. అంతట మునికి వినతిచేసి,ఆతని ఆనంతిని పొంది, ఆతని చరణమ సరోజములకు నా శిరము వాల్చి పదే పదే నమస్కరించి హర్షమున ఈ ఆశ్రయమునకు ఏతెంచితిని. ప్రభుని కృపచే దుర్లభమగు వరమును పొందితిని.

ఖగేశ్వరా, వినుము. ఇరువదిఏడు కల్పములనుండి నేను ఇచ్చట నివసించుచు, రఘుపతియొక్క గుణములను సదా గానము చేయుచున్నాను. చతుర విహంగములు సాదరముగా వినుచున్నవి. భక్తుల హితముకొరకై అయోధ్యాపురియందు రఘువీరుడు మనుజశరీరధారుడై అవతరించునపుడు నేను అయోధ్యకుపోయి-ఆ రామనగరమున నివసింతును. ప్రభుని బాల్య లీలలను తిలకింతును. చూచిఆనందింతును. ఖగేశ్వరా, రాముని శిశు రూపమును నా హృదయమున నిలుపుకొని నా ఆశ్రమమునకు తిరిగి ఏతెంతును.

ఈ కాకి శరీరము నాకు ఏల ప్రాప్రించెనో - ఆ కథఅంతయు నీకు వివరించితిని. తండ్రీ. నీ ప్రశ్నలన్నిటికి సుమాధానమిచ్చితిని. రామభక్తి మహిమ అతి అద్భుతము!

ఈ కాకి శరీరమునకదా నాకు రామపాదములయందు ప్రేమ జనించెను.! కనుకనే ఈ దేహము నాకు ప్రియమయ్యెను. ఈ తనువుతోడనే నేను నా ప్రభుని దర్శించితిని. నా సంశయములన్నియుతీరిపోయెను.

మొండిపట్టుచే నేను భక్తి అను రెక్కలతో ఎగురుచుంటిని. మహర్షి నన్ను శిపించెను. ఐనను ఫలితముగా మునులకు సహితము దుర్లభమగు వరమును పొందితిని. భక్తయొక్క ప్రతాపమును కనుగొనుము. ఈ మహిమను తెలిపియు దానిని పరీహరించి జ్ఞానమునకై శ్రమపడువారు- మూర్ఖులు. అట్టి జడులు-ఇంటఉన్న కామధేనువును విడచి పాలకై జిల్లేడుచెట్టు వెదుకునట్టివారు!

పక్షిరాజా, వినుము. హరిభక్తని విడనాడి,ఇతర ఉపాయములచే ఆనందమును పొందతలచువారు మూర్ఖులు; అభాగ్యులు. నావలేకయే మహాసముద్రమును దోటుకోరు నట్టివారు!"

భవానీ, భుశుండియొక్క మాటలను విని గరుడుడు ఆనందించెను. మృదువగు వాణితో అతడు, "ప్రభూ, నీ ప్రసదామున నా హృదయమున శోకము, సంశయము, భ్రమ ఇప్పుడు లేవు. రాముని పావన గుణగణములను గురించి నీ కృపచే వింటిని. నాకు శాంతి భించినది. మరిఒక విషయమును నిన్ను ప్రశింప కోరిక కలదు. కృపానిధీ, నాకు తెలియచెప్పుము.

జ్ఞానమువలె దుర్లభ##మైనది మరి ఏదియు లేదని-సాధుసజ్జనులు, మునులు, వేదములు, పురాణములు నుడువును. స్వామీ ఆజ్ఞానమునే మునులు తెలిపిని కాని, భక్తి జ్ఞానములు సమమని నీవు అంగీకరించవైతివి. ప్రభూ, జ్ఞానమునకు భక్తికి భేదమేమి? ఈ విషయము సర్వము నాకు వివరింపుము. కృపానిలయుడవునీవు" అని కోరెను. ఉరగారియొక్క వచనములను విని. సంతసించి చతురుడగు కాకభుశుండి సాదరముగా ఇట్లు ప్రవచించెను.

"భక్తికి జ్ఞానమునకు వాస్తవమునకు ఎట్టి భేదమూలేదు. భవసంభవ భేధములను అవిరెండునూ హించును. కాని నాథా, మునీశ్వరులు ఈ రెండింటియందు కొంత తారతమ్యము తెలుపుదుపు. విహంగవరా, దానిని జాగరూకతతో వినుము.

జ్ఞాన, వైరాగ్య, యోగ, విజ్ఞానములు - అన్నియు పురుషవాచక శబ్దములు విశ్ష్యములు -పురుషుని ప్రతాపము సర్వవిదములు ప్రబలమైనది. గరుడా.

అబలలు సహజముగనే నిర్బలులు. జన్మచే జడులు. విరక్తులు ధీరమంతులు అగు పురుషులు స్త్రీని త్యజింపగలరు. కాముకులు, విషయవశులు, రఘువీర పద విముఖులు త్యజింపజాలరు. జ్ఞానవిధులగు మునులైనను మృగనయనల చంద్రవదనములను చూచి వారికి వశులగుదురు. హరి వాహనమా, విష్ణుమాయయే నారీపూపమున ప్రకటమైనది. ఇట్లునుటయందు పక్షపాతమేదియు నేను చూపుటలేదు. వేదములు, పురాణములు, సాధువులు, సజనులు అభిప్రాయమే ఇది. ఓయీ పన్నగారీ, ఇది విలక్షణమగు పద్ధతి. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ సౌందర్యమున మోహము చెందదుకదా!

మాయ, భక్తి-ఇవి రెండును.-వినుము. నారీవర్గమునకు చెందినవి. అందరికి తెలిసినదే ఇది. అంతేకాక- రఘువీరునికి భక్తియనిన కుడు ప్రీతి. మాయా నిశ్యముగాఒక నర్తకి మాత్రమే పాపము! భక్తికి మిక్కిలి అనుకూలుడు రఘుపతి. అతడనిన మాయా అతభయము చెందును. అనుపము, విశుద్ధము అగు రామభక్తి-ఏ బాధయులేక- ఎవని హృదయములయందు ఉండునో-అట్టి వానిని చూచి మాయ సిగ్గుపడను. అది తన ప్రభావమును అట్టివానిపై ఏ మాత్రము ప్రదర్శింపజాలదు. ఇట్లు యోచించియే విజ్ఞానులగు మునులు సహితము - సకల సుఖములకు ఖని అగు భక్తినే యాచింతురు. రఘునాథునియొక్క ఈ మర్మమును త్వరితగతిని ఎవ్వరూ గ్రహింపలేరు. రఘుపతియొక్క కృపచే ఎవరైనను తెలిసికొనినచో- అట్టివారికి-మోహము స్వప్నముననైననుఉండనేరదు.

నిపుణుడవగు పక్షిరాజా, జ్ఞానమునకు భక్తికి మరిఒక భేదమున్నది. వినుము. దానిని వినినచో రామచరణణులయందు సదా అవిచ్ఛిన్నమగుభక్తికలుగును. నాయనా, తెలియవసినదే కాని దీనిని వర్ణింపవశముకాదు.

జీవుడు ఈస్వరాంశ. అవినాశి. చేతనుడు, నిర్మలుడు, సహజ సుఖరాశి స్వామీ, అతడు మాయవశుడైనాడు చిలుకవలె. కోతివలె తనను తానే బంధించుకొన్నాడు. ఇట్లు చేతన. ఆచేతనములు ముడిపడినవి. ఆ ముడి మిథ్యయే ఐనను దానిని విడతీయుట కష్టము. అంతటినుండియు జీవుడు జననమరణములకు లోనైనాడు, ఇక ఆ ముడి విడదు. జీవు సుఖపడడు, వేదములు పురాణణులు ఎన్నో ఉపాయములను తెలిపినవి. ముడి వదులుకాదు సరికాద అది మరింత చిక్కుపడును. జీవుని హృదయమున మోహమను అంధకారము విశేషముగా ఆవిరించి. ఆ ముడి కనపడదు ఇక అది విడివడుట ఎట్లు? ఈశ్వరుడు అట్టి అదృష్టమును ప్రసాదించినచో ఎన్నడైన అది విడివడగలదు. అప్పుడైనను అది ఒక సమస్యయే.

హరి కృపచే సాత్త్వికశ్రద్ధ ఒక చక్కని ధేనువువలె వచ్చి, జీవుని హృదయాగారమున వసించి, వేదములయందు విధింపబడిన అపారజపతపవ్రత నియమములు, శుభధర్మములు, సదాచారములు-ఆ దేనువు మేయు పచ్చగడ్డియై-ఆపచ్చగడ్డిని అది మేసి, చూడిదై, ప్రేమ అను కోడెదూడ పుట్టినచో ఆ ఆవు పాలనుచేసి-నివృత్తి-ఆవును కట్టుత్రాడై, విశ్వాసము-పాలుపితుకుపాత్రయై, సోదరా, స్వాధీనమున ఉన్న నిర్మలమానసము-పాలుపితుకు గొల్లయై పరమ ధర్మమయ క్షీరమును పితికి, నిష్కామమను అగ్నిపై ఈ పాలనుకాచి, క్షమ, సంతోషము - అను గాలితో విసరి, ఆ పాలను చల్లార్చి, ధైర్యము, శమము-అను తోడు మజ్జిగను ఆ పాలలో కలిపి, ప్రసన్నత అను మట్టిపాత్రలో ఆలోచన-అను కవ్వముతో, దమము-అను స్తంభమునకు కట్టి సత్యము, ప్రియవాణి అను త్రాడుతో, కవ్వమును త్రిప్పి పెరుగును చిలికి, నిర్మల,రమ్య అతివవిత్ర వైరాగ్యమను వెన్నను తీసి,యోగమను అగ్నిని ప్రకటపరచి, శుభాశుభ కర్మలనబడు ఇంధనములను దానిలో వేసి మమత అను మలినమును మాడ్చి వేయవలెను. జ్ఞానమును నేయి మిగులును. అంతట బుద్ధి దానిని చల్లార్చును. విజ్ఞాన రూపిణి అగు ఆ బుద్ధి స్వచ్ఛమగు ఘృతముతో చిత్తమను (దీపమును) నింపి, సమత్వమను దృఢమగు సెమ్మెపై గట్టిగా నిలబెట్టవలెను.

అవస్థాత్రయము, త్రిగుణములు అనబడటు ముడిప త్తినుండి తురీయావస్థ అను ప్రత్తిని తీపి సరిచేసి, జ్ఞానదీపిక అను గట్టివత్తిన చేసి విజ్ఞానమయ తేజోరాశి అను దీపమును వెలిగించినతో దానిని సమీపించి మదము మొదలగు మిడతపురుగులు భస్మమైపోవును.

(సో 7హమస్మి అను అఖండవృత్తియే ఈ దీపముయొక్క పరమ ప్రచండ దీపశిఖ.

ఆత్మానుబవ సుఖజ్ఞానదీపిక యొక్క సుప్రకాశము బ్రహ్మానందము వెలుపడినంతనే సంసారమూలమగు దేహభ్రమ నశించిపోవును. ప్రబల అవిద్యకు పరివారమగు మోహాదులయొక్క గాఢాంధకారము తొలగును. అంతట విజ్ఞానరూపిణి అగు బుద్ధి-ప్రకాశవంతమై హృదయ నిలయము నిలచి ముడిని విడతీయును. ముడి విడివడినంత జీవుడు కృతార్థుడగును.

ఖగరాజా, ఆ ముడి విడుచున్నట్లు తెలికొని మాయ అంతట మరల నానావిఘ్నములను సృజించును. అనేకబుద్ధులను సిద్ధులనుఅది పంపును. సోదరా, అని వచ్చి బుద్ధికి ప్రలోభములను కలిగించును. బుద్ధి సిద్ధులు యుక్తులను, శక్తులనుచూపి, కపటమునుచేసి (బుద్ధి) దగ్గర చేరును. తమ చేలాంచలవాయువుతో అవి జ్ఞానదీపమును ఆర్పివైచును. బుద్ధి కడునేర్పరియైనచో- బుద్ధి సిద్ధులచేకలుగు అహితమునుగ్రహించి అది వానిని కన్నెత్తిచూడదు.

మాయ కలిగుంచువిఘ్నములచే బుద్ధికి బాధలేకున్నను దేవతలు ఉపద్రవములను కలిగింతురు. ఇంద్రియములకు ద్వారమగు హృదయము అనేకగవాక్షములు కలిగిన ఒక గృహమువంటిది. ప్రతిగవాక్షమువద్దకు దేవతలు రక్షణకై ఉందురు. వేచిఉండి విషయరూపమగు గాలి వచ్చుచున్నట్లు కనుగొవనువవెంటనే వారు బలత్కారముగా కిటికీలను తెరతురు. వేగమున పరుగిడివచ్చు ఆ గాని హృదయగృహమున ప్రవేశించిన వెంటనే విజ్ఞానదీపము కొండెక్కును. గ్రంతికూడా విడిపోదు. ఆత్మనుభవమనబడు ప్రకాశము అంతరించును. విషయవాయుచవువలన బుద్ధియు కలతచెంది సర్వనాశనమగును.

ఇంద్రియాధి దేవతలకు జ్ఞానము రుచించద. విషయసుఖములయందే వానికి ఎల్లప్పుడు ప్రీతి, విషయసమీరుడు బుద్ధిని సహితము పిచ్చిదానిని కావంచును. అట్టిచో ఆ జ్ఞానదీపమును తిరిగి ఆదేప్రకారము వెలిగించకలిగన వారెవరు? ఖగేశ్వరా, అంతట జీవుడు నానావిధముల గు జననమరణాదిక్లేశములను అనుభవించుచు. హరిమాయ అతిదుస్తరమైనది. దానిని తరింపజాలము సుమా!

జ్ఞానము తెలుపుటకష్టము తెలియుట కష్టము సాధనచేయుట కఠినము. ఘుణాక్షరన్యాయమున ఏ దైవయోగముననో - ఎన్నడైనను జ్ఞానము లభించినచో దానిని పరిరక్షించుకొనుటయందు అనేకవిఘ్నములు కలుగును. జ్ఞానమార్గము- అసిధార వంటిది. ఖగేశ్వరా దీనినుండి పతనమగుటకు ఇసుమంతయు వ్యవధి అక్కరలేదు. ఈ మార్గమున నిర్విఘ్నముగా నడువకలగినవాడు కైవల్యము అనబడు పరమపదమును చేరును. ఈ పదమును చేరుట అతి దుర్లభమని సాధు, సజ్జనులు, వేద, పురాణ, శాస్త్రములు ఘోషించుచున్నవి. స్వామి, రాముని భజించినచో మోక్షము- ఇచ్చలేనప్పటికి దానిఅంత అదే ప్రాప్తించును.

కోటి ఉపాయములచేనైనను సరే. నేల లేకయే నీరు నిలువగలదా? అట్లే పక్షి రాజా, వినుము. హరిభక్తిలేనిదే-మోక్షానందము నిలువనేరదు. ఇట్లు యోచించి బుద్ధిమంతులగు హరిభక్తులు ముక్తిని నిరాదరించి భక్తినే ఆశింతురు. తృప్తికై, హితము నకై భోజనముచేతుము. ఆ ఆహమును జఠరాగ్ని జీర్ణముచేయును అట్లే భక్తి సంప్రాప్తించినపిదప- జననమరణరూపమగు అవిద్య -ఎట్టి ప్రయత్నము, ప్రయాసలేకయే నశించును,సుగమము, సుధదము అగునట్టిహరిభక్తి ఎవరికిఆనందము నీయదు? దానియందు ప్రీతిలేనిమూఢుడు ఉండునా?

"నేను సేవకుడను. భగవానుడు నా స్వామి." అను భావమునతప్ప భవసాగరమును తరింపజలము ఉరగరీ, ఈ సిద్ధాంతమును గ్రహించుము. రామును పాదపంకజములను భజించుము చేతనములను జడములుగా, జడములనుచైతన్యవంతముగా చేయగల సమర్ధుడు రఘునాయకుడు. అతనిని భజించువారు ధన్యులు.

జ్ఞానసిద్ధాంతమును తెలియచెప్పితిన.%ిఇక భక్తి అను మణియొక్క ప్రభావమును వినుము. రామభక్తిఅను రమ్యచింతామణి గరుడా, తమ హృదయాంతరమున కలిగినవారు రాత్రింబవళ్ళు పరమతేజోరూపమున ఉందురు. అట్టివారికి దీపము, వత్తి నేయి అక్కరయే లేదు. వారు స్వయంప్రకాశమగు మణులే! మోహమను దారిద్ర్యము వారిని సమీపించజాలదు.లోబమను వాయువు ఆ దీపమును ఆర్పివేయలేదు. భక్తి యొక్క కాంతిచే అవిద్యయొక్క ప్రబలఅంధాకరము నశించును. కామ క్రోధమ మదములు మొదలైన సకల శలభసముదాయములు దగ్ధమగును. హృదయమునభక్తికల వానివద్ద కామాది దుష్టప్రృత్తులుచేరనేరవు. రామభక్తునికి గరళము సుధాసమమగును. శత్రువులు మిత్రులగుదురు. ఆ మణిలేనిదే ఎవ్వనికీ ఆనందము లేదు. ఏ మహామానసరోగవశులై జీవులెల్లరు దుఃఖించుచుందురో ఏవి ఏవియు రామభక్తునికి సోకవు. రామభక్తి అను మణిని తమ హృదయముల ధరించినవానికి స్వప్నముననైనను లేక మాత్రమ %ుదుఃఖములు ఉండవు.

భక్తి అను ఈ మణికొరకు సకలయత్నములు చేయువాడు జగమున చతురశిరోమణి ఈ మణి జగత్తున ప్రత్యక్షమైఉన్నను- రామును కృపలేనిదే ఎవ్వరూ దానిని పొందజాలరు. దానిని పొందుఉపాయము సుగమమే. ఐనను, హతభాగ్యులగు నలురు దానిని తుచ్ఛమనుకొని విడతురు. ఉరగారీ, వేదములు, పురాణములు పవిత్రములగు పర్వతములు, రాముని నానాచరితలు ఆ పర్వతములయందలి చక్కని గనులు, మహాత్ములు, సజ్జనులు ఈ గనులమర్మములను ఎఱిగిన మర్మవేత్తలు, సద్బుద్ధి త్రవ్వుగోల. జ్ఞాన వైరాగ్యములు వారినేత్రములు, భావముతో అన్వేషంచుప్రాణలు సకలసుఖ ఖని అను ఈ భక్తి మణిని పొందగలరు. రామునికంటె ఆతనిదాసులే అధికులని నా విశ్వాసము. రాముడు ఒక సముద్రముగుచో ధీరమతకులగు సజ్జనులు మేఘములు. హరి-చందనవృక్షమగుచో సాధుపురుషులు సమీరులు. సకలసాధనలయొక్క ఫలమేసుందరమగు హరిభక్తియే. సత్పురుషులు, సాధువులు కానివారికి అది ఎవ్వరికీ సంప్రాప్తించదు. ఇట్లు యోచించి సత్పంగము చేయువారికి రామభక్తి సులభమయ్యా, పక్షింద్రా.

వేదములు ఒక మహాసముద్రము. జ్ఞానము మందరగిరి, జ్ఞానులు, నజ్జనులు, సాధుపురుషులు-దేవతలు. అ మహాసముద్రమును మథించి రామకథ అను సుధను ఈ దేవతలు వెలువరతురు. ఈ సుధయందలి మాధుర్యము భక్తియే, వైరాగ్యమనుడాలుతో జ్ఞానము అను ఖడ్గముతో లోభ, మోహ, మదములనబడు రిపులను సంహరించి. విజయము ప్రాప్తింపచేయునట్టిది హరిభక్తియే, ఖగేశా. దీనిని యోచింపుము.''

అంతట ఖగరాజు ప్రేమనమేతుడై ఇట్లునుడివెనుః--''దయాళూ, నాయందు నీకు ప్రేమ కలదేని. నేను నీ సేవకుడనని ఎంచి నా ఈ ఏడుప్రశ్నలకు సవిస్తరముగా సమాధానమిమ్ము. నాథా, ధీరమతీ,

1. అన్నికంటె దుర్లభమగు శరీరము ఏది? ప్రథమమునే ఈ విషయము వివరించుము.

2. అన్నిటికంటె అధికమగు దుఃఖమేది?

3. అన్నిటికన్న అధిక సుఖమేది? వంక్షేపముగా వివరించుము.

4. (సాధు నజ్జనులకు) మహాత్ములకు, పాపాత్ములకు కల భేదము నీకు తెలియును, వారి సహజస్వభావమునలను వర్ణించి తెలుపుము.

5. వేదవిదితమగు మహాపుణ్యము ఏది?

6. అన్నిటికంటె మహా భయంకరమగు పాపము ఏది?

7. మానసరోగము లేవి? వివరించి తెలుపుము.

నీవు సర్వజ్ఞుడవు. నాయందు నీకు అమితదయ.''

అంతట కాకభుశుండి ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెనుః--

''నాయనా, సాదరముగా అతిప్రేమతో వినుము. ఆ నీతిని సంక్షేపముగా వివరింతును:--

1. మానశరీరమునకు సమానమగు శరీరము మరిఒకటి లేదు. చరాచరజీవులన్నియు ఆ తనువునే వాంఛించును. మనుజతనువు నరక, స్వర్గ, మోక్షములకు నిచ్చెన. శుభకరములగు భక్తి, జ్ఞాన, వైరాగ్యములను ఇచ్చునది ఈ శరీరమే. ఇట్టి మానవధేహమును ధరించియు హరిభజనచేయని నరులు నీచవిషయ భోగములయందు అనురక్తులై ఉండువారు మందులే కాదు. అత్యంతమందులు, పరశువేదిని తమ చేతులతో పారవైచి గాజు పెంకులను చేపట్టువారు.

2. దారిద్ర్యమునకు సమమగు దుఃఖము జగమునలేదు.

3. సాధు సత్పురుష సత్సంగమముతో సాటిఅగు సుఖము జగమునలేదు.

4. మనోవాక్కర్మలతో పరులకు ఉపకారము కానించుట. ఖగరాజా, మహాపురుషుల, సాధుసజ్జనుల సహజస్వభావము. పరహితమునకై వారుదుఃఖమును సహింతురు. ఇక అభాగ్యులగు పాపాత్ములు పరులకు దుఃఖము కలిగించుటకై తాము దుఃఖింతురు. పరులకు దుఃఖహేతువు లగుదురు. దయాళురగు సజ్జనులు భూర్జవృక్షమువలె-పరులకొరకై మహావిపత్తిని సహితము సహింతురు. ఖలులు జనుమువలె ఇతరులను బంధింతురు. తమ చర్మమును ఒలిపించనిత్తురు. ఎట్టి విపత్తులనైనను భరింతురు. చావనైన చత్తురు. ఉరగారీ, వినుము. స్వార్థమేదియు లేకపోయినను దుష్టులు పామువలె, ఎలుకవలె నిష్కారణముగా పరులకు అపకారము చేతురు. పరులనంపదను నాశమొనర్చి తామును నశింతురు. వడగళ్లు పొలములను ధ్వంసముచేసి, పిదప అనియును నశించునట్లే. ప్రసిద్ధ అధమ గ్రహమగు కేతువు జగత్తుయొక్క దుఃఖమునకే ఉదయించును. అట్లే ఖలుల ఉన్నతియు.

5. సాధు సజ్జనులయొక్క అభ్యుదయము సదా సుఖకరమే. సూర్య చంద్రుల ఉదయము విశ్వమునకు సుఖదాయకమగునట్లే అదియును. అహింస పరమ ధర్మమనియు, పరనిందవంటి పాపము లేదనియు శ్రుతులు నుడువుచున్నని.

6. హరుని, గురుని నిందించువాడు మరుజన్మలో మండూకమై జనించును. వేయిజన్మలవరకు వాడు మండూకతమవునే పొందును. ద్విజులను నిందించువాడు నానానరకములను అనుభవించి తిరిగి జగత్తున కాకిశరీరమును తాల్చును. దేవతలను, వేదములను నిందించు దురభిమానలు రౌరవనరకమున పడుదురు. సాధుసజ్జనులను నిందించువారు గుడ్లగూబలై జన్మింతురు. మోహమసురాత్రియే వారికి ప్రీతి. జ్ఞానమను భానుడు లేనేలేడు వారికి. అందరిని నిందుచుమూర్ఖుడు గబ్బిలమై పుట్టును.

7. ఇక-లోకులెల్లరు దుఃఖములను అనుభవించు మానస రోగములను గురించి వినుము. సర్వరోగములకు మూలము మోహము, అజ్ఞానము. ఆ వ్యాధినుండి అనేక ఇతర బాధులు జనించును. కామము - వాతము, లోభము - అపారమగు కఫము. క్రోధము-నిత్యము గుండెను దహించు పిత్తము. ఈ మూడు రోగములు కలసినచో దుఃఖదాయకమగు సన్నిపాతము జనించును. సోదరా, అతికష్టమున ఫలించు విషయ మనోరథములే నొప్పులు, రోగములు, వీనిపేర్లన్నియు ఎవరికెరుక?

మమత - తామర; ఈర్ష్య - గజ్జి; హర్షవిషాదములు కంఠమునందలి రోగాధిక్యతలు. పరుల సుఖమునుచూచి మండిపోవువాడు - క్షయరోగి. దుష్టత్వము, మనసునందలి కౌటిల్యము - కుష్ఠురోగము. అహంకారము - అతి దుఃఖదాయకమగు చర్మవ్యాధి. దంభము, కపటము, మదము, అభిమానము - గోరుచుట్లు , తృష్ణ - జలోదరము, త్రివిధ ఈషణలు - చలిజ్వరములు. మత్సరము, అవివేకము - రెండువిధములగు జ్వరములు.

ఇట్లు అనేక చెడ్డరోగములున్నవి. ఎన్ని అని వచింపను? ఏదో ఒక రోగవశుడై నరుడు మరణించును. అనేక విధములగు అసాధ్యరోగములున్నవి. సంతతము అవి జీవుని బాధించుచుండును. ఇట్టి స్థితిలో జీవునికి శాంతి (సమాధి స్థితి) ఎట్లు లభించును?

నియమములు, ధర్మములు, ఆచారములు. తపము, జ్ఞానము, యజ్ఞము, జపము, దానము - ఇట్లే కోట్లకొలది ఔషధములున్నవి. గరుడా. కాని, వానితో ఈ రోగములు కుదరవు. ఇట్లు జగమునఉన్న సకలజీవులు రోగులే. శోక, హర్ష, భయ, వియోగ, దుఃఖములచే, ప్రేమచే వీరు మరింత దుఃఖితులగుచున్నారు. మానస రోగములను కొన్నిటినే వివరించితిని. ఇవి ఎల్లరకు సంభవించునవే. వీనిని నిర్ణయించుకొనగలవారు మాత్రము కొద్దిమందియే. ప్రాణులను దహించు ఈ రోగములు నిర్ణయింపబడినపిదప కొన్ని క్షిణించును. కాని పూర్తిగా అని నశించవు. విషయసుఖము లనబడు అపథ్యముతో ఇవి మునుల మనములయందు సహితము అకురించును. బాపురే ఇక సామాన్య మానవుల విషయము చెప్పవలెనా?

రామకృపదే ఈ చికిత్సచే రోగములన్నియు నశించును. సద్గురువను వైద్యుని మాటలయందు విశ్వాసము ఉండవలెను. విషయసుఖములపై ఆశ వీడవలెను. ఇదియే నియమము. రఘుపతియందు భక్తి అను సంజీవనీ మూలీకను, శ్రద్ధతో పరిపూర్ణబుద్ధి అను అనుపానముతో చక్కగా సేవించినచో రోగము నశించును. లేనిచో - కోటి .యత్నములచేనైనను అది నశించదు.

హృదయమున వైరాగ్యబలము అధికమై. సన్మతి అను ఆకలి నిత్యనూతనమై పెరిగి, విషయములయందు ఆశ అను దౌర్బల్యము నశించినచో - స్వామీ, మనస్సు రోగరహితమయ్యెనని తెలియవలెను.

నిర్మలజ్ఞానమును జలమున నరుడు స్నానము చేసినపుడు అతని హృదయము రామభక్తి సంభరితమగును శివుడు, బ్రహ్మ, శుకుడ, సనకాదులు, నారదాది బ్రహ్మవిదార విశారదులగు మునుల అందరి అభిప్రాయము ఇదియే - రామ పాడపంకజములయందు ప్రేమ కలిగి ఉండుటయే అది. రఘుపతియందు భక్తిలేనిదే సుఖములేదని - ఖగనాయకా, శ్రుతులు, పురాణములు, సకల సద్గ్రంథములు నుడుపుచున్నని.

''తాబేటి వీపుపై వెండ్రుకలు మొలచుగాక - గొట్రాలి బిడ్డడు ఎవనినైనను చంపుగాక - ఆకసమునుండి అనేక విధములగు పూవులు పూయుగాక - హరికి ప్రతికూలుడగు జీవునికి సుఖము, శాంతి లభింపవు'' అని శ్రుతి పురాణాది సద్గ్రంథములన్నియు వచించుచున్నవి.

ఎండమావులలోని నీరు త్రాగినచో దాహము తీరనిమ్ము - కుందేటితలపై కొమ్ములు మొలవనిమ్ము - అంధకారమే భాస్కరుని నశింపచేయనిమ్ము - రామ విముఖుడగు జీవుడు సుఖమును పొందజాలడు.

మంచునుండి అగ్ని జనింపవచ్చును కాని రామవిముఖుడై ఎవ్వడూ సుఖించే లేడు. జలమును మథించి నేతిని ఉత్పన్నము చేయించవచ్చునేమో - ఇసుకనుండి తైలమును తీయవచ్చునేమో - కాని హరిభజనచేయక - భవసాగరమును తరింపజాలము. ఇది నిశ్చిత సిద్ధాంతము. దోమను బ్రహ్మగా చేయకలడు స్వామి. బ్రహ్మను దోమకంటెను తుచ్ఛమైనవానినిగా చేయకలడు ఆతడు. ఇట్లని యోచించి ప్రవీణులు సంశయములన్నిటిని త్యజించి రాముని భజింతురు.

నిశ్చితమగు ఈ సిద్ధాంతమును నేను వచించున్నాను. నా పలుకులు అన్యథాకానేరవు. హరిని భజించు నరులు దుస్తరమగు భవసాగరము తరింతురు. నాథా. అనుపమమగు హరిచరితను - నా బుద్ధిని అనుసరించి, కొంత విస్తరించియు, కొంత సంక్షిప్తపరచియు వచించితిని. ఉరగారీ, సర్వకర్మలను త్యజించుము - రాముని భజించుము - ఇదియే వేదములందలి సిద్ధాంతము. నావంటి మూర్ఖునియందు సహితము మమతకలిగిన ప్రభువగు రఘుపతిని విడచి ఇక ఎవనిని సేవింపవలె? స్వామీ, నీవు విజ్ఞానరూపుడవు. నీకు మోహములేదు, నాపై నీవు అత్యంతకృపచూపితివి. శుక, సనకాదులకు, శంభునికి అతిప్రియము-పరమపావనమగు రామకథను గురించి ప్రశ్నించితివి. ఈ ప్రపంచమున ఒక గడియసేపైనను, లేక క్షణమాత్రమైనను, ఒక్కసారియైనను - సత్సంగము దుర్లభము. గరుడా, నీ హృదయమున యోచించు చూడుము.

రఘువీరుని భజనకు తగినవాడనానేను? అన్ని పక్షులలో అధముడను. సకలవిధముల అపవిత్రుడను. ప్రభువు నన్ను జగత్ప్రసిద్ధపావనుని కావించినాడు. సర్వవిధముల నేను హీనుడనైనను - నేను నేను ధన్యుడను. అతిధన్యుడను. నన్నుతనవానిగా చేసికొన్నాడు రాముడు, నీవంటివారితో సత్సంగము కలిగించినాడు. వాథా, నా బుద్ధికి తోచినట్లు వచించినాను. ఎంతమాత్రము ఏదియు గోప్యముగా ఉంచలేదు. రఘునాయకుని చరిత్ర ఒక సముద్రము. ఎవరైనను దానిలోతును తెలియగలరా?''

రాముని వివిధ గుణగణములను స్మరించి చతురుడగు భుశుండి పలుమారులు హర్షము చెందెను. ఏ రఘుపతియొక్క అతులితబలమును, ప్రతాపమును, ఐశ్వర్యమహిమను నిగముములు 'నేతి - నేతి' అని నుడివి వర్ణించినవో - ఏ రఘుపతి యొక్క చరణములు శివ, అజులకు పూజనీయములో - అట్టిరాముడు నాపై కృపచూపెను. ఇది ఆతని పరమ మృదు స్వభావముః ఇట్టి స్వభావము ఇంకెవ్వరియందును వినము, కనము.

ఖగేశ్వరా, శ్రీ రఘుపతితో ఇంకెవరు సాటి అని ఎంచగలను? సాధుకులు. సిద్ధులు, జీవన్ముక్తులు, విరక్తులు, కవులు, కోవిదులు, కృతజ్ఞులు, సన్యాసులు. యోగులు, శూరులు, మహాతాపసులు, జ్ఞానులు, ధర్మనిరతులు, పండితులు, విజ్ఞానులు - ఎవ్వరైనను సరే - నా స్వామి - అగు శ్రీరాముని సేవింపక తరింపలేరు.

ఆ రామునికి నమస్కరింతును. నమస్కరింతును. నమస్కరింతును. ఎవినిని శరణు వేడినచో నావంటి పాపరాశియు పరిశుద్ధుడగునో అట్టి అవినాశికి నమస్కరింతును. ఎవనినామము భవరోగములకు ఔషదమో ః ఏ నామము [ఆదిదైవిక, అదిభౌతిక, ఆధ్యాత్మికము లనబడు] ఘోరా త్రిశూలములను హరించునో - ఆ కృపాళుడు - సదా మీయందు నాయందు అనుకూలుడై ఉండుగాకః''

భుశుండి యొక్క సద్వచనములను విని, రామచరణములయందు అతనికి కలభక్తిని కని గరుడుని సంశయములు తొలగిపోయెను. ప్రేమ సహితుడై గరుడుడు.

''నేను కృతకృత్యుడనైతిని. రఘువీరుని యందలి భక్తిరసమున సమిళితమైన నీ వాణిని విని రామపాదముల యందు నాకు నూతనప్రేమ జనించినది. మాయా జనిత లిపత్తి సర్వము నశించినది. మోహజలధియందు మునుగుచున్న నాకు నీవు నావవైతివి. నాథా, నీవు నన్ను వివిధ విధముల సుఖిని కావించితివి. నీకు ప్రత్యుపకారము నేను చేయజాలను. పదేపదే నీ పాదములకు వందనమొనర్తును. నీవు పూర్ణకాముడవు. రామునియందు అనురాగివి. నాయనా, నీ వంటి భాగ్యవంతుడులేడు. మహాత్ముల. వృక్షముల, నదుల, పర్వతములు. ధరణియొక్క చర్యలన్నియు పరహితమునకే -- సాధు సజ్జనుల హృదయములు వెన్నవంటివని కవులు నుడివిరి. కాని ఏమి చెప్పవలయునో కవులకు తెలియలేదు. తనకు వేడి తగిలినపుడే వెన్న కరగును. అతి పునీతులగు సాధు, సత్పురుషులు ఒరుల దుఃఖములను కని కరగిపోవుదురు. నా జన్మ, నా జీవితము సఫలమయ్యెను. నీ ప్రసాదమున నా సంశయములు తొలగెను. సదా నేను నీకింకరుడనని ఎంచుము'' అని పలికెను.

ఉమా, విహంగవరుడు పదేపదే అట్లు వచించెను. కాకభుశుండి యొక్క చరణములకు ప్రేమ సహితముగా తలవంచి సమస్కరించెను రఘువీరుని తన హృదయమున ధరించెను. ధీరమతి అగుగరుడుడు అంతట వై కుంఠమునకు ఏగెను.

గిరిజా. సాధు సజ్జన సమాగమమును పోలిన ప్రయోజనము మరిఒకటి లేదు. హరికృపలేనిదే అదియును సంప్రాప్తించదు. ఇట్లని వేదములు, పురాణములు ఘోషించుచున్నవి.

పరమ పావనమగు ఇతిహాసమును నేనుప వచించితిని. దీని శ్రవణమాత్రము భవపాశములు విడవడును. శరణాగత కల్పతరువు, కరుణాపుంజము అగు రాముని పద కంజములయందు భక్తిజనించును. సావధాన చిత్తులై ఈ కథాశ్రవణము కావించు వారి మనోవాక్‌ కర్మ సంభవములగు పాపములన్నియు -- సర్వము నశించును. తీర్థయాత్రాది సాధనలు, నానా విధ కర్మలు, ధర్మములు, వ్రతములు, దానములు అనేక సంయమములు, దమము, జపము. తపము, యజ్ఞము, భూతదయ, ద్విజసేవ, గురుసేవ, విద్య, వినయము-వీని అన్నిటియొక్కయు, వివేక మహిమాదులయొక్కయు, వేద విదిత సాధనలన్నిటి యొక్కయు ఫలము హరిభక్తియే - భవానీ, వేదములు గానము చేసిన ఆ రఘునాథుని యందలి భక్తి - రాముని కృపచేతనే ఏ ఒక్కని కోపం సంప్రాప్తించును.

విశ్వాసముతో నిరంతరము ఈ కథను విను నరులు - మునులకైనను దుర్లభమగు శ్రీ హరిభక్తిని ప్రయాసలేకయే పొందగలరు. రామచరణానురక్తమానుసుడే సర్వజ్ఞడు. అతడే గుణి. అతడే జ్ఞాని, అతడే మహీభూషణుడు. పండితుడు. దాతుధర్మపరాయణుడు. కులసంరక్షకుడు. కపటము త్యజించి రఘువీరుని భజించువాడే నీతినిపుణుడు. అతడే కడు బుద్ధిమంతుడు. వేదసిద్ధాంతములను బాగుగా తెలిసినవాడు అతడే. అతడే కవి-విద్వాంసుడు - రణథీరుడు. సురనది ప్రవహించు దేశము ధన్యమైనది. పతివ్రతాధర్మములను పాలించు స్త్రీ ధన్యురాలు. న్యాయముగా పరిపాలించు భూపాలుడు ధన్యుడు. స్వధర్మమునుండి చలించని ద్విజుడు ధన్యుడు. ధర్మము చేయబడు ధనము ధన్యమైనది. పుణ్యమున ప్రీతికల బుద్ధి ధన్యమైనది. పరిపక్యమైనదియు. సత్సంగమున గడపు ఘడియ ధన్యమైనది. ద్విజులయందు అఖండమగు భక్తికలిగిన జన్మ ధన్యము.

ఉమా, వినుము. శ్రీ రఘువీరపరాయణులు. వినమ్రులు జన్మించినవంశ##మే ధన్యము. జగత్తున పూజనీయమైనది. అతి పునీతమైనదియు అదియే.

ఈ కథను మొదట నేను రహస్యముగనే ఉంచితిని. కాని నా బుద్ధిని అనుకరించి ఇప్పుడు వర్ణించితిని. నీ మనసునందలి ప్రేమాధిక్యతమ కనుగొని రఘుపతి యొక్క ఈ కథను నీకు వచించితిని. శఠులకు. మొండిపట్టు కలిగినవారికి, హరిలీలలనుతము మనస్సులను లగ్నములచేసి విననివారికి, లోభులకు, క్రోధముకలవారికి, కాముకులకు, సచరాచరస్వామి అగు రాముని భజించనివారికి ఈ కథను చెప్పరాదు. ఇంద్రునివంటి ప్రభుడైననుసరే ద్విజద్రోహికి - ఎవ్వరూ ఎన్నడూ ఈ కథను తెలుపరాదు. సత్సంగమున అత్యంత ప్రీతికలవారే రామకథను వినుటకు అర్హులు. గురుచరణానురాగ తత్పరులు, నీతిపరాయణులు. ద్విజసేవకులు. దీనిని వినుటకు యోగ్యులు. శ్రీ రఘునాథుడు ప్రాణప్రియుడైనవారికి ఇది విశేష ఆనందముచిచ్చును.

రామచరణరతులు కాగోరువారు, మోక్షపదమును కాంక్షించువారు తమమనసును లగ్నముచేసి భావసహితముగా - తమ శ్రవణపుటములతో ఈ కథ అను అమృతమును పానముచేయుడు.

గిరిజా, కలిమలములను నాశనమొనరించునదియు, మనోమలములను హరించుకట్టిదియు అగు రామకథను నేను వర్ణించి ఉంటిని. జనన మరణ రూప రోగమునకు రామకథ సంజీవనీ మూలిక, శ్రుతులు, పండితులు వచించిన విషయమే ఇది. దీనియందు రుచిరమగు సప్తసోపానములున్నవి. రఘుపతియందు భక్తికి పథములు ఈ సోపానములు, హరియొక్క అమితకృప ఎవనిపై కలదో - అతడే ఈ మార్గమున పాదము మోపును. కపటమును విడచి ఈ కథను గానముచేయు నరుని మనసులోని కోరికలన్నియు సిద్ధించును. ఈ కథను శ్రవణముచేయువారు. గానముచేయువారు. స్వీకృతి చేయువారు సంసారసాగరమును గోవు సాదమునకు సమమగు మట్టిగడ్డను దాటినట్లు దాటకలరు.

కథ అంతయు వినిని గిరిజయొక్క హృదయము ఆనందభరిత మయ్యెను.

''నాథునికృపచే నా సంశయములు తొలగినవి. రామచరణములయందు నవీన ప్రేమ ఉదయించినది. విశ్వేశ్వరా, నీ ప్రసాదమున నేను కృతకృత్యురాలనైతిని. దృఢమగు రామభక్తి నాలో ఉద్భవించినది. నాక్లేశములన్నియు నశించినవి.'' అని ఆమె మనోహరమగు వాణితో పలికెను.

ఉమా-శంభుల ఈ శుభ సంవాదము ఆనందప్రదము; విషాద విధ్వంసకరము జనన మరణములను ఇది నాశనమొనర్చును. సంశయములను అంతమొందించును. భక్తులకు ఆనందమిచ్చునది ఇది సజ్జనులకు ప్రియమైనది ఇది.

జగమునఉన్న రామోపాసకులకు ఈ కథవలె ప్రియమైనది మరి ఏదియూలేదు. రఘుపతియొక్క కృపచే పావనము. రమణీయము అగు ఈ చరితను నా బుద్ధిని అనుసరించి వివరించితిని. ఈ కలికాలమున యోగము. యజ్ఞము, జపము. తపము. వ్రతములు - ఏ ఇతర సాధనలు లేవు. రామునే స్మరించుడు. రామునిగుణములనే గానము కావించుడు. రాముని గుణసమూహములనే సంతతము శ్రవణము చేయుడు. పతితులను పావనమొనర్చుట ఆతని మహావ్రతము. కవులు, వేదములు, పురాణములు ఇట్లని ఘోషించుచున్నవి. మనసా, కుటిలతను త్యజించి ఆ రామునే భజించుము, మూర్ఖమానసా, రాముని భజించి పరమగతిని పొందనివాడెవడున్నాడు? పతితపావనుడగు రాముని భజించి సద్గతిని పొందని దెవడు? గణిక, అజామిళుడు, వేటకాడు, జటాయువు, గజేంద్రుడు మొదలగు అనేక ఖలులను ఆతడు ఉద్ధరింపలేదా? ఆభీర, యవన, కీరతా, ఖన, చండాలాది అత్యంత పాపరూపులు సహితము ఒక్కమారు రామనామము ఉచ్చరించి పవిత్రులయిరే అట్టి రామా, నీకు నమస్కరింతును.

రఘువంశభూషణునియొక్క ఈ చరిత్రను పఠించువారు, వినువారు, గానము చేయువారు కలిమలములను, మనోమలములను కడిగివైచుకొందురు. శ్రమలేకయే వారు రామధామమునకు చేరగలరు. ఈ మానసమునందలి ఏడు లేక ఐదు చౌయీలను మనోహరమగు వానిని - గ్రహించి, హృదయమున ధరించు నరుని యొక్క సంకవిధ అవిద్యాజనిత దారుణ వికారములను శ్రీరఘువరుడు హరించి వైచును.

సుందరుడు, చతురుడు, కృపానిధి, అనాథులపై ప్రేమ చూపువాడు ఒక్క రాముడే! విష్కాముడు, హితకరుడు, మోక్షప్రదుడు మరి ఒకడు ఇట్టివాడు ఏడీ? ఎవని లేశమాత్ర కృపచే మందబుద్ధి అగు తులసీదానుసనకు సహితము పరమశాంతి లభించెనో ఆ రామునికి సాటిప్రభువు ఇంకెందునూ లేడు.

రఘువీరా, నా వంటి దీనుడులేడు. నీవంటి దీనహిత కరుడులేడు. యోచించుము. రఘువంశమణీ, విషమ భవదుఃఖములను హరించుము.

కాముకునికి నారి ప్రియము. లోభికి ధనము ప్రీతి. అట్లే రఘునాదా, రామా నీవు నాకు విరంతరము ప్రియుడవుకమ్ము.

దుర్లభమగు ఈ రామాయణము-పూర్వము శ్రీరామ చరణ కమలములయందు అనిశము తక్తి ప్రాప్తించుటకై-మకని అగు శ్రీశంభునిచే రచింపబడెను. ఆ మానస రామాయణమును రఘునాథనామ నిరతుడై తన అంతఃకరణమందలి ఆంధకారమును పౌరద్రోలుటకై- ఈ మానసరూపమున తులసీదాసు భాషాబద్ధము కావించెను.

[గుడ్లవల్లేటి వేంకటాచపతిరావు ఆంధ్రీకరించెను.]

ఈ రామచరిత మానసము పుణ్యప్రదమైనది. సదా శుభకరమైనది. పాపమును హరించునది. విజ్ఞాన, భక్తిప్రదమై, మాయను, మోహమును, మలములను నాశనమొనర్చునది ఇది. అతి నిర్మలమై ప్రేమాంబు భరితమైనది. మంగళ మయమగునది ఇది. ఈ శ్రీమద్రామచరిత్ర మానస సరోవరమున భక్తియుతులై మునుగు నరులను జనన మరణ రూప భానుని ప్రచండ కిరణములు దహింపవు.

సమాప్తము.

Sri Ramacharitha    Chapters