Sri Ramacharitha    Chapters   

పంచమ సోపానము

సుందరకాండ

శాంతుడు. శాశ్వతుడు, అవ్రమేయుడు, పాపరహితుడు. మోక్షరూప శాంతి ప్రదాత, నిరంతర బ్రహ్మ శివ శేషసంసేవ్యుడు, వేదాంతవేద్యుడు, విభుడు. సురగురుడు, మాయామానవ స్వరూపుడు, శ్రీహరి, కరుణాకరుడు, భూపాలచూడామణి, రఘువరుడుఅగు రాముడను నామము కలిగిన జగదీశ్వరునికి నమస్కరింతును,

రఘుపతీ, నీవు అభిలాండరాత్మవు.

నా హృదయమున వేఱొక కోరికలేదు.

సత్యము వచింతును.

రఘుపుంగవా, నీయందు వరిపూర్ణమగు భక్తిని నాకు ప్రసాదించుము. నా మనస్సు కామాది దోషరహితము కావింపుము,

అనన్యబలనిలయుడు, నుమేరుపర్వత పమకాంతియుత శరీరుడు, దునుజవన కృశానుడు, జ్ఞానులయందు అగ్రగణ్యుడు, సకలగుణనిధానుడు, వానరాధీశ్వరుడు, రఘుపతికి ప్రియభక్తుడు అగు వాయుపుత్రునికి వందనమొనర్తును.

జాంబవంతుని సుందరవచనములను విని హనుమంతుని హృదయము అమితానందము పొందెను.

''సీతనుచూచి నేను తిరిగి వచ్చువరకు మిత్రులారా, ఏ కందమూలములనో, వనౌషధులనో, ఫలములనో భక్షించుచు ఎన్నికష్టములను సహింపవలసివచ్చినను సరే ఇచ్చటనే ఉండుడు. మనకార్యము తప్పక నెరవేరును. నాకు విశేషమగు సంతోషము కలుగుచున్నది'' అని హనుమంతుడు వారికెల్లరకు నమస్కరించెను. రఘునాథుని దివ్యమూర్తిని అతడు తన హృదయమున ధరించెను. ఉల్లాసముతో పయనమయ్యెను.

సముద్రతీరమున రమ్యమగు ఒక పర్వతమున్నది. పవననందనుడు కౌతుకమున దాని శిఖరముపైకి దుమికెను. పదేపదే రఘువీరుని స్మరించుచు మహాబలుడగు పవనతనయుడు అచ్చటనుండి శక్తికొలది పైకి ఎగిరెను. తత్‌క్షణమే హనుంతుని పాదములక్రింద ఉన్న పర్వతము పాతాళమునకు క్రుంగిపోయెను.

అమోఘమగు రామభాణమువలె హనుమ పయనించుచుండెను. హనుమంతుడు రఘుపతియొక్క దూత అని జలనిధి తెలిసికొనెను. ఆతని శ్రమ తీర్చుమని సముద్రుడు మైనాకునికి ఆనతిచ్చెను. హనుమ మైనాకుని తన చేతితో స్పృశించి అతనికి ప్రణమల్లెను. ''రామకార్యము సఫలము చేయువరకు నాకు విశ్రాంతి ఎచ్చటిది?'' అని వచించెను.

పవనసుతుని పయనమును దేవతలు కనుగొనిరి. అతని బల, బుద్ధి విశేషములను వారు పరీక్షింపతలచి నాగమాత అగు సురసను పంపిరి. సురస హనుమవద్దకు వచ్చినది.

''ఈనాడు దేవతలే నాకు ఆహారము సమకూర్చిరి'' అని వచించినది. సురస పలుకులను పవనకుమారుడు వినెను.

''రామకార్యమును సాఫల్యముకావించి తిరిగి ఏతెంతును. అంతట నీ నోట నేను ప్రవేశింతును. తల్లీ, సత్యము వచింతును. ఇప్పుడుమాత్రము నన్ను పోనిమ్ము'' అని అతడు వేడెను. హనుమంతుడు ఎంత ప్రయత్నించినను సురస అతనిని పోనీయ లేదు. తుదకు అతడు ''ఐనచో తినవేమి?'' అనెను.

సురస తన నోటిని ఒక యోజనవి స్తీర్ణము చేసెను. కపి తన శరీరమును అంతకు రెండింతలు కావించెను. సురస తననోటిని పదునారుయోజన విస్తీర్ణము పెంచెను. పవనసుతుడు తన దేహమును ముప్పదిరెండుయోజనములు చేసెను. సురస తననోటిని పెంచినకొలది హనుమ తన శరీరమును ద్విగుణీకృతము కావించుచుండెను. సురస తననోటిని నూరుయోజనములు కావించినవెంటనే పవననందనుడు లఘురూపమునుధరించి ఆమెనోట చొచ్చి బయటికి వచ్చెను. ఆమెకు నమస్కరించెను. 'అమ్మా, సెలవిమ్ము' అని కోరెను.

''హనుమా, రామకార్యము సర్వమును నీవు నిర్వర్తింతువు. బల, బుద్ధి నిధానమవు నీవు. నీ బుద్ధి కుశలతను, బలమును పరీక్షింపుమని దేవతలు నన్నుపంపిరి. నేను వచ్చినపని నెరవేరినది. నీ బుద్ది బలము, దార్ఢ్యము అతి ఉన్నతమైనవి.'' అని సురస హనుమను దీవించి వెడలినది. ఆనందమున హనుమంతుడు పయనము సాగించెను.

ఆ మహాసముద్రమున ఒక నిశాచరి నివసించుచున్నది. ఆకసమున ఎగిరిపోవు పక్షులను అది తన మాయాజాలముచే గ్రహించును. గాలిలో ఎగిరిపోవు జీవజంతువుల నీడలను నీటిమీద అది కనుగొనును. ఆ నీడలను పట్టివైచును. ఆ గగనచరులు ఇక ఎగురలేవు. ఈరీతిని ఆరక్కసి గగనచరులను కబళించును. ఈ జిత్తును అది హనుమతునిపై ప్రయోగించెను. కాని, ధీరుడగు మారుతి దాని కపటచర్యను గ్రహించి వెంటనే దానిని పరిమార్చెను. నిర్భీతిగా వారిధిని దాటెను. అచ్చటి వనశోభను కనుగొనెను. మధువునందలి లోభముచే మధుపములు అవ్యక్తమధురధ్వనులు చేయుచున్నవి. నానావిధములగు వృక్షములు పండ్లతో, పూలతో అవనమున శోభిల్లుచున్నవి. అచ్చట ఖగములను, మృగములనుచూచి మారుతి ఆనందించెను. ఎదుటనే ఒక విశాలశైల మున్నది. భయవర్జితుడై అతడు ఎగిరి దానిపైకి ఎక్కెను.

ఉమా, ఇందు కపీశ్వరుని ప్రతాపమేమియు లేదు. కాలునిసహితము కబళింప గల ప్రభుని ప్రతాపమే అది అంతయు. గిరిపైకెగిరి హనుమంతుడు లంకను తిలకించెను. అతి దృఢమగు దుర్గమది! వర్ణనాతీతమైనది. అతి ఉన్నతమైనది! దానికి నాలుగువైపులను వారిధియే. బంగరు కోటగోడలు చిత్రవిచిత్రమణులచే సుందరాతి సుందరములై ధగధగ ప్రకాశించుచున్నవి. వానివెనుక అందమగు భవనములు, విశాలమగు వీధులు, సందులు, నాల్గువీధులు కలియుచోట్లు, అంగళ్ళు, యోజనాబద్ధమైనరమ్యమగు ఆ నగరము అనేకరీతుల అతిసుందరముగా అలంకరింపబడినది. ఏనుగుల, గుఱ్ఱముల, కంచరగాడిదల, రథముల, పాదచారులగు సైనికసమూహము లెన్నో? ఎవరు లెక్కించగలరు? అనేకరూపములలో విశాచరదళములున్నవి. అత్యంత బల యుతమగు ఆ సేనను వర్ణింపతరము కాదు.

వనములు, ఉద్యానవనములు, ఉపవనములు, పొదరిండ్లు, పచ్చికబయళ్లు - వాటికలు, సరస్సులు, కూపములు అన్నియు అతిమనోహరదృశ్యములే!

అచ్చటి నర, సుర, నాగ, గంధ్వర, దేవతా కన్నియల సౌందర్యము మునుల మనములనై నను మోహింపచేయును!

శైలసమానులు, విశాలకాయులు, అతిబలులు అగు మల్లయోధులు ఒకచోట గర్జించుచున్నారు. వివిధరంగస్థలములలో పోరాడుచున్నారు. ఒకరినొకరు కాలుద్రవ్వికవ్వించుచున్నారు.

భయంకర శరీరధారులగు కోటానుకోట్ల యోధులు నగరమును నాలుగుదెసలను జాగరూకులై సంరక్షించుచున్నారు. మరి ఒకచోట మహిషములను, మనుష్యులను, ఆవులను, గేదెలను. ఎడ్లను, గాడిదలను. మేకలను రాక్షసులు భక్షించుచున్నారు.

రఘువీరుని బాణములకు ఆహుతియై, శరీరములు త్యజించి రక్కసులు పరమగతిని నిశ్చయముగా పొందనున్నారు. కనుకనే తులసీదాసు వీరిని ఇంత క్లుప్తముగా నైనను వర్ణించుట!

నగర రక్షకులను మారుతి కనుగొనెను. ''అతి లఘురూపమును ధరించ వలెను - రాత్రివేళ నగరమును ప్రవేశించవలెను'' అని అతడు అనుకొనెను.

హనుమంతుడు మశకసమానరూపమును ధరించెను. నరహరిని, రాముని స్మరించెను. లంకకు వెడలెను. అచ్చట లంకిణి అను ఒక నిశాచరి ఉన్నది. ''నన్ను నిరాదరించి ఎచటికి పోదువురా నీవు?'' అన్నది అది.

''నాసంగతి తెలియదురా నీకు? మూర్ఖుడా, లంకలో ప్రవేశించు చోరులందరు నానోట పడవలసినదే అని తెలియదా?'' అని ఆ రాక్షసి ప్రశ్నించినది. ఆ మహాకపీశ్వరుడు దానిని ఒక్కగ్రుద్దు గ్రుద్దెను. నెత్తురు కక్కుచు అది నేలపై కూలెను. కొంత సేపటికి అది తెప్పరిల్లి లేచెను. చేతులు జోడించెను. ఇట్లు వచించెను:- ''పూర్వము రావణునికి వరమిచ్చి తిరిగిపోవుచు విరించి ఒక గుర్తు నుడివినాడు. ''ఒక వానరుడు వచ్చును. వానిచేతిలో నీకు చావుదెబ్బలున్నవి. ఆనాడే తెలిసికొనుము-రాక్షసవినాశ##మైనట్లే'' అని. రామదూతను కన్నులార కనుగొంటిని. నాయనా, నా పూర్వపుణ్యము ఎంత గొప్పదో! స్వర్గ మోక్ష సుఖములన్నియు కలిపినను సత్సంగమునకు లవ మాత్రము సాటిరావు. కోసలపురాధీశుని నీ హృదయమున నిలిపి నగరమున ప్రవేశింపుము. సర్వకార్యము నీకు సఫలమగును. గరళము అమృతమగును. శత్రువులు మిత్రులగుదురు. సముద్రము గోష్పాదతుల్యమగును, అగ్ని శీతలమగును.''

గరుడా, ఒక్కసారి శ్రీరాముడు దయతో ఎవరినైనను చూచిన చాలు. వానికి సుమేరుపర్వతము ఇసుకరేణవు కాగలదు!

హనుమంతుడు అత్యంతసూక్ష్మరూపము ధరించెను. భగవానుని స్మరించెను. నగరమున ప్రవేశించెను. మందిరములన్నిటిని శోధించెను. ఎక్కడచూచినను అసంఖ్యాకులగు యోధులే! తుదకు అతడు దశాననునిమందిరము ప్రవేశించెను. అతి విచిత్రమైఉన్న ఆ మందిరము వర్ణింపతరము కాదు. నిద్రించుచున్న రావణుని హనుమంతుడు కనుగొనెను. కాని వై దేహి అచ్చట కనుపించలేదు. కొంతదూరమున మరి ఒక సుందర మందిరమున్నది. అచ్చట ప్రత్యేకముగా ఒక హరిమందిరము కలదు. రామాయుధచిహ్నములతో అలంకరింపబడినది అది. దాని శోభ వర్ణనాతీతము. అచ్చట నవతులసీవనమును కనుగొని పవనసుతుడు ఆనందించెను.

''నిశాచరుల నివావభూమియే లంక! ఇచ్చట సజ్జనులెట్లు నివసింతురు?'' అని తనలో తాను కపీశ్వరుడు తర్కింపసాగెను. అదేసమయమున విభీషణుడు నిద్రనుండి లేచి ''రామ రామ'' అని రాముని స్మరించుచుండెను. ఇతడు సజ్జనుడే అని హనుమంతుడు తలచి సంతపించెను. ''ఇతనితో ఎట్లైనను పరిచయము చేసికొందును. సాధుజనులచే కార్యహాని కలుగదు'' అని అతడు తలచెను.

విప్రరూపమునుధరించి అతడు విభీషణుని ప్రశ్నించమొదలిడెను. ఆ ప్రశ్నలను వినగనే విభీషణుడు లేచివచ్చెను. ప్రణామముచేసి కుశలప్రశ్నము కావించెను. ''బ్రాహ్మణోత్తమా, నీ స్వీయకథను తెలియచేయుము'' అని మారుతిని కోరెను. ''మిమ్ములను కనుగొని నా హృదయమున అత్యంతమగు ప్రేమ ఉప్పొంగుచున్నది. అయ్యా. తాము హరిదాసులా? లేక నన్ను కృతార్థుని చేయవచ్చిన దీనానురాగులగు శ్రీరాములేనా?'' అని విభీషణుడు ప్రశ్నించెను.

అంతట హనుమంతుడు రామకథ అంతయు వివరించెను. తనపేరును తెలిపెను. ఆపేరు వినగానే వారిరువురి తనువులు పులకరించెను. రాముని గుణగణములను స్మరించుచు వారిమనసులు ఆనందమగ్నము లయ్యెను.

''పవనసుత, ఇక నాస్థితి వినుము. నోటిలో పండ్లమధ్య నాలుకవలె ఉన్నాను. నన్ను అనాథునిగా ఎంచి భామకులతిలకుడు ఎన్నడైనను నాపై కనికరించునా?'' తామసశరీరుడను కనుక ఏసాధనయు చేయలేనివాడను. నామనమున శ్రీరామ పాదసరోజములపై ప్రేమయే కాదు - హనుమంతా, ఇప్పుడు విశ్వాసమును నాకు కలిగినది - హరికృపలేనిదే భక్తసాంగత్యము కలుగదు. రఘువీరుని అనుగ్రహము నాపై కలదు. కనుకనే నీ దర్శనము నాకు లిభించినది'' అని విభీషణుడు పలికెను.

''ప్రభుని గుణములను వినుము. విభీషణా, తన సేవకులపై సదా ఆయనకు ప్రేమ. నేనుమాత్రము గొప్పకులమువాడనా? చంచలుడగు కపిని. సకలవిధముల హీనుడను. ఉదయమున మాపేరు ఉచ్చరించినవారికి ఆనాడు ఆహారముకూడా లభింపదు! నేను అట్టి అధముడను. సఖుడా, విమము, కాని రఘువీరునికి నాపై కృపకలిగినది!'' అని హనుమంతుడు వచించెను.

రాముని గుణగణములను స్మరించిన హనుమకు ఆనందబాష్పములు పొంగిపొరలినవి. అట్టి స్వామిని రఘువీరునిగురించి తెలిసియు అతనిని విస్మరించి చరించువానికి దుఃఖములు కలుగకుండునా?

ఇట్లు రాముని గుణసంపదను వర్ణించుచు వారు అనిర్వచనీయమగు ప్రశాంతిని పొందిరి.

జనకసుత ఎట్లున్నదియు విభీషణుడు మారుతికి వివరించెను. హనుమంతుడు ''సోదరా, నాకు తల్లి - జానకిని వీక్షించవలెనని ఉన్నది'' అనెను. సీతను చూచుటకు ఉపాయములన్నిటిని విభీషణుడు తెలిపెను.

పవనసుతుడు సెలవుతీసికొని వెడలినాడు. తిరిగి మశకరూపమును ధరించినాడు. సీతఉన్న అశోకవనము ప్రవేశించినాడు, సీతను కనుగొనినాడు. మనస్సుననే ఆమెకు ప్రణామము కావించినాడు.

కృశించినశరీరముతో, ఏకవేణియై సీత కూర్చుండిఉన్నది. హృదయమున సదా రఘుపతియొక్క గుణగణములను ఆమె జపించుచున్నది. ఇట్లు ఎన్ని రాత్రింబవళ్ళు గడచినవో ఆమెకు! ఆమె కన్నులు ఆమె పాదములయందు, మనస్సు రాపాదకమల ములయందును లగ్నమై ఉన్నవి. దీనురాలగు జానకినిచూచి పవనసుతుడు కడు దుఃఖితుడయ్యెను.

తరువల్లవములచాటున మారుతి దాగెను. ''సోదరా, ఇప్పుడు ఏమి చేయవలెను?'' అని చింతింపసాగెను. ఇంతలో వివిధాలంకృతులగు పలువురు స్త్రీలతో కలసి రావణుడు అచ్చటికి వచ్చెను. బహువిధముల అతడు సీతకు బోధింపసాగెను. సామదానభయ భేదములను ప్రదర్శించి అతడు ''ఓ సుముఖీ - వివేకవతీ, నామాట వినుము. మండోదరి మొదలగు రాణులందరిని నేను నీ అనుచరుల చేతును. ఇదే నా ప్రతిజ్ఞ, ఒక్కసారి నీవు నావంక చూచిన చాలు'' అని వేడసాగెను.

తన ప్రాణనాథుడగు అయోధ్యాపతిని స్మరించి ఒక గడ్డిపరకను అడ్డుపెట్టుకొని వై దేహి, ''దశముఖా, మిణుగురుపురుగు ప్రకాశించినంతమాత్రమున కమలము వికసించునా? నీ మనస్సున ఆలోచించుకొనుము. ఖలుడా, రఘువీరుని బాణమనిన ఏమియో నీకు తెలియదు. పాపీ, ఒంటరియైఉన్న నన్ను దొంగిలించి తెచ్చితివి. అధముడా, లజ్ఞావిహీనుడా, నీకు సిగ్గులేదా?'' అనెను.

తనను మిణుగురుపురుగుతో, రాముని భానుసదృశువిగా పోల్చుచు పరుషవచనములను సీత వచించుట విని కత్తినిదూసి రావణుడు క్రుద్దుడై వచ్చెను.

''సీతా, నున్న నీవు అవమానించితివి. ఈ కఠినకృపాణముచే నీ శిరమును ఖండింతును. వెంటనే నామాట వినుము. లేనిచో, సుముఖీ, నీ ప్రాణహాని తప్పదు'' అని అతడనెను.

''దశకంధర - శ్యామసరోజ హారసమ సుందరభుజమూర్తి రాముడు. కరికరసమమగు అతనికరములే నా కంఠమును అలంకరించును. అట్లుకానిచో కఠోరమగు నీ ఖడ్గమే నా కంఠమును అలంకరింపగలదు. శఠుడా, ఇదే నా ప్రతిజ్ఞ వినుము'' అని సీత పలికెను.

''చంద్రహాసమా - రఘునాథ విరహాగ్నిజనితమగు నా పరితాపమును హరింపుము. ఖడ్గమా, నీధార నిశితమైనది, శీతలమైనదియు. నా దుఃఖభారమును హరింపుము'' అని ఆమె విలసించెను.

సీతయొక్క పలుకులను విని దశాననుడు ఆమెను చంపుటకు పరుగిడెను. మయతనయ మండోదరి నీతిచెప్పి అతనిని మందలించి నివారించినది. సకలరాక్షస స్త్రీలనుపిలచి రావణుడు ''పోయి మీరందరు అన్నివిధములను సీతను భయపెట్టుడు - ఒక నెలదినములలో నామాట విననిచో ఈ కఠోరఖడ్గముచే ఆమెను సంహరింతును'' అని పలికి అతడు తనభవనమునకు మరలెను.

పిశాచినీబృందములు బహువిధక్రూరరూపములను ధరించి సీతను భయపెట్టమొదలిడెను. వారిలో త్రిజట అను ఒక రాక్షసి ఉన్నది. వివేకమున అతినిపుణురాలు ఆమె. రామచరణములయందు ఆమెకు భక్తి. తన స్వప్నవృత్తాంతమును అందరికి ఆమె తెలియచేసి ''సీతను సేవించుడు-మీకు మేలుకలుగును'' అని చెప్పినది.

''నా స్వప్నమున కనుగొంటిని - ఒక వానరుడువచ్చి లంకను కాల్చును, రాక్షససేననంతను పరిమార్చును. దిగంబరుడై దశాననుడు ఒక గాడిదమీద స్వారిచేయును, అతనితల గొరుగబడిఉన్నది, ఇరువదిచేతులు నరుకబడిఉన్నవి. ఈ అకృతితో అతడు దక్షిణాభిముఖుడై పోవును. లంక విభీషణునిపాలగును. నగరమంతయు రాముని శరణుజొచ్చును. తుదకు రాముడు సీతను రప్పించును. నేను గట్టిగా చెప్పగలను. కొద్దిదినములలో ఈ నాకల నిజమగును'' అని త్రిజట నుడివినది. ఆమాటలు విని రాక్షసస్త్రీలందరు భయభీతులై జానకియొక్క చరణములపై పడిరి. కొంతసేపటికి ఎక్కడివారు అక్కడ చవిరి.

''ఒకమాసము దినములు గడచినపిదప ఈ నీచనిశాచరుడు నన్ను సంహరించును'' అని సీత తన మనస్సులో చింతింపసాగినది.

''తల్లీ, ఈ విపత్తులో నీవే నాకు తోడు, ఈశరీరమును నేను త్యజించు ఉపాయమేదైనను త్వరగా నాకు తెలుపుము. విరహము భరింపరానిదగుచున్నది. ఇక నేను సహింపజాలను'' అని చేతులుజోడించి ఆమె త్రిజటను వేడినది.

''అమ్మా కట్టెలుతెచ్చి చితిని పేర్చించుము. చితికి అగ్నిని రగుల్చుము. ప్రభునియందు నా ప్రేమను సఫలము కావింపుము. బుద్ధిమతీ, శూలములవంటి రావణుని పలుకులు ఎట్లు వినగలను?'' అని సీత ఆమెను ప్రార్థించినది.

ఆ మాటలువిని త్రిజట సీత చరణములనుపట్టికొని ఆమెను ఓదార్చినది. ప్రభుని ప్రతాపమును, బలమును, సత్కీర్తిని వర్ణించినది. ''ఈ రాత్రివేళ అగ్నిదొరకదమ్మా, సుకుమారీ'' అని చెప్పి ఆమె తనఇంటికి వెడలినది.

''నాకు విధియు ప్రతికూలమయ్యెను. అగ్నియైనను లభింపదు - ఆపదలేమియు తొలగవు - ఆకాశమున అగ్నికణములే కన్పించుచున్నవి. కాని ఒక్క తారయైనను అవనిపైకి రాలదుకదా! చంద్రుడు అగ్నిమయుడైనాడు. కాని అతడునూ నన్ను హతభాగిని అనితలచి అగ్నిని వర్షింపడే! అశోకవృక్షమా, నా వినతిని వినుము. నా శోకమును తొలగించి నీ పేరును సార్థకము చేసికొనుము.. నీ క్రొత్తచిగుళ్ళు నిప్పులవలె ఉన్నవి. అగ్నిని ప్రసాదించుము. నా విరహజాడ్యమును ఇంకనూ వృద్ధిచేయకుము'' అని జానకి దుఃఖింపసాగినది.

పరమవిరహాకులయైన సీతనుచూచి మారుతి క్షణమొక కల్పమువలె గడపుచుండెను.

హనుమ తనమనమున విచారించెను. అశోకవృక్షమే అగ్నికణమును పడవైచెనో అన్నట్లు అతడు ముద్రికను క్రింద పడవైచెను. దానిని కనుగొని సంతోషముతో సీత లేచెను. ముద్రికను చేతిలో తీసికొనెను. అతిసుందరముగా రామ నామాంకితమైన ఆ ముద్రికను గుర్తించి ఆశ్చర్యచకితురాలై ఆమె దానిని చూడసాగెను. ఆమె హృదయము హర్షవిషాదములతో కలవరపడెను.

''సర్వథా అజేయుడు రఘురాముడు. అతనిని జయింపగలవా రెవ్వరు'? మాయ ఇట్టి ముద్రికను సృష్టింపజాలదు'' అని ఆమె తనమనమున అనేకవిధముల ఆలోచించుచుండెను. ఇంతలో హనుమంతుడు మధురవచనములతో రామచంద్రుని గుణగణములను వర్ణింపమొదలిడెను. ఆతని వచనములను వినినంతనే సీతయొక్క దుఃఖము పలాయనయ్యెను. మనస్సును చెవులను లగ్నముచేసి ఆమె వినసాగెను ఆదినుండి రామకథను అంతయు హనుమంతుడు వినిపించెను.

''శ్రవణామృతమగు ఈ సుందరచరితను వర్ణించినవారెవరో నాఎదుట, సోదరా, ఏల ప్రకటము కారు?'' అని సీత నుడివెను. అంతట హనుమంతుడు జానకిని సమీపించెను. అతనినిచూచి సీత మొగముత్రిప్పుకొని వెనుకకుతిరిగి కూర్చిండెను. ఆమె మనస్సున విస్మయము భయము కలిగెను.

''అమ్మా, జానకీ, నేను రామదూతను, కరుణానిది అగు రాముడే నా సత్య సంధతకు సాక్షి, తల్లీ, ఈ ముద్రికను నేనే తెచ్చితిని. దీనిని నీకొరకై గుర్తుగా రాముడే ఇచ్చెను'' అని హనుమంతుడు పలికెను.

''నరులకు వానరులకు సాంగత్యము ఎట్లు కలిగినది?'' అని సీత ప్రశ్నించినది. ఆకలయిక ఎట్లు సంభవించినదో ఆకథ అంతయు మారుతి వివరించినాడు. కపీశుడు పలికిన ప్రేమయుత వచనములనువిని జానకియొక్క మనస్సున విశ్వాసము జనించెను. ''మనోవాక్కాయకర్మలయందు ఇతడు కృపాసింధువగు రాముని దాసుడే'' అని ఆమె గ్రహించెను. హనుమ హరిభక్తుడని తెలిసికొని ఆమెకు అతనిపై అత్యంత గాఢవాత్సల్యము ఏర్పడెను. ఆమెనేత్రములు జలభరితములయ్యెను. శరీరము పులకించెను.

''నాయనా, హనమంతా, విరహసముద్రములో మునిగిఉన్న నాకు నీవు నావవు. ఇప్పుడు చెప్పుము నీకు పుణ్యముండును. అనుజసహితుడై ఖరారి కుశలమేనా? రఘునాథుడు కోమలచిత్తుడు, కృపాళుడు, ఏకారణమున నాపై ఇంత నిష్ఠురత వహించినాడు? సేవకులకు సుఖము ప్రసాదించుట అతని సహజగుణము. రఘునాయకుడు నన్నెప్పుడైన స్మరించునా? అతని కోమల శ్యామలగాత్రము కనుగొని నా కన్ను లెన్నడైన చల్లనగునా?'' అని ఆమె కపిని ప్రశ్నించెను. ఆమెనోట మాట వచ్చుటలేదు. ఆమె నేత్రములు బాష్పపూరితము లయ్యెను.

''అయ్యో, నాథా నన్ను పూర్తిగా విస్మరించితివి'' అని ఆమె దుఃఖింపమొదలిడినది. పరమవిరహాకులయైన సీతనుచూచి కపి వినీతభావముతో మృదువచనములను ఇట్లు పలికెను:- ''అమ్మా, అనుజసమేతుడై ప్రభువు కృపానిలయుడు కుశలముగా ఉన్నాడు. నీ వియోగదుఃఖమువలన దుఃఖితుడై ఉన్నాడు. నీ మనసున గ్లాని వలదు. నీకు రామునిపైకంటె రామునికి నీపై ద్విగుణీకృతమగు ప్రేమ సుమా!

తల్లీ, ధైర్యమువహించి రఘుపతి నీకు పంపిన సందేశమును వినుము'' అని నుడివి మారుతి గద్గదుడయ్యెను. అతని కన్నులు నీరునిండెను.

ఆయన సందేశమిది:_"నీవియోగమున, సీతా సకలమును నాకు ప్రతికూలమైనది. వృక్షముల క్రొత్తచిగుళ్ళు అగ్నివలె ఉన్నవి. రాత్రులు కాళరాత్రులవలె ఉన్నవి. చంద్రుడు సూర్యునివలె ఉన్నాడు. కమలములు శూలములవలె ఉన్నవి. కాగుచున్న తైలమును వర్షించుచున్నట్లున్నవి మేఘములు. హితమొనరించినవారుకూడా ఇప్పుడు పీడాకారులైనారు. త్రివిధవాయువులు ఉరగశ్వాసమువలె ఉన్నవి.

ఎవరికైనను వెలిబుచ్చినచో దుఃఖము కొంత తగ్గును. కాని ఎవరితో నేను చెప్పను? నా దుఃఖము ఎవరెరుగుదురు? ప్రియా, మన ప్రేమతత్వము నామనస్సునకే తెలియును. కాని నా మనస్సు నీ వద్దనే ఎల్లప్పుడు ఉన్నదికదా. నా ప్రేమసారమంతయు ఇదే_"

ప్రభుని సందేశమునువిని వైదేహి ప్రేమమగ్న అయ్యెను. శరీరస్పృహ ఆమెకు లేదు.

"అమ్మా, హృదయమున ధైర్యము వహించుము. సేవకసుఖదాయకుడగు రాముని స్మరింపుము. రఘుపతియొక్క సామర్థ్యమును తలంపుము. నా మాటలువిని పిరికితనము త్యజింపుము.

రాక్షససమూహములు మిడతలలో సమానము. రఘుపతి బాణములు అగ్నితో నమానము. జననీ. హృదయమున ధైర్యము ధరించుము. నిశాచరులు నాశనమైరనియే ఎఱుగుము. నీవార్త తెలిసిఉన్నచో రఘువీరుడు విలంబము కావించెడువాడు కాడు. అమ్మా జానకీ, రామభాణములనబడు రవి ఉదయించినచో రాక్షససేనారూప మగు అంధకారము నిలుచునా?

మాతా, ఇప్పుడే నిన్ను ఇచ్చటినుండి తీసికొనివెడలగలను. కాని ప్రభుని ప్రతిజ్ఞ ఉన్నది. నాకు ఆయన ఆజ్ఞయు లేదు. మరికొన్నిదినములు అమ్మా, ఓర్పు వహింపుము. కపిసహితుడైన రఘువీరుడు ఇచ్చటకు ఏతెంచును. విశాచరులని సంహరించును. నిన్నుతీసికొని వెడలును. నారదాదులు ముల్లోకములలో ఆయన యశమును కీర్తింతురు" అని హనుమంతుడు నుడివెను.

సీత ప్రశ్నించినది:_"కుమారా, వానరులందరు నీవంటివారై ఉందురు! ఈ రాక్షసులు అతియోధులు-మహాబలవంతులుసుమా? నా హృదయమున గొప్ప సందేహమున్నది"అని.

ఈ ప్రశ్నవిని కపి తన నిజస్వరూపమును ప్రకటించెను. సుమేరుపర్వత సమానగాత్రుడు, సమరభయంకరుడు, అతిబలుడు, వీరుడు మారుతి ప్రకటమయ్యెను!

జానకియొక్క మనస్సున విశ్వాసము కలిగినది. పవనసుతుడు తిరిగి లఘురూపమును ధరించెను.

"అమ్మా, శాఖామృగములకు విశాలబలము, బుద్ధి ఉండవు. కాని రామప్రభుని ప్రతాపముచే చిన్న పాము గరుడునిసహితము కబళించగలదు!" అని అతడు పలికెను.

భక్తిప్రతాపబల తేజ సంభరితములగు కపి పలుకులను విని సీత సంతసించినది. అతడు రామప్రియుడని తెలసికొన్నది. అతనిని "నాయన, నీవు బలశీలనిధివి కమ్ము" అని అశీర్వదించినది. "అజరుడవు, అమరుడు, గుణనిధివి అగుదువుగాక! రఘునాయకునికి నీపై అపారమగు కృప కలుగునుగాక! అని దీవించినది.

"ప్రభునికి నీపై కృప కలుగుగాక!" అనెడు జానకిమాటలు తనచెవుల పడినంతనే హనుమానుడు సంపూర్ణప్రేమమగ్ను డయ్యెను. పదేపదే అతడు తన శిరముతో జానకి చరణములకు మ్రొక్కెను, ముకుళితకరుడై "మాతా, నేనిప్పుడు కృత కృత్యుడనైతిని, నీ ఆశీర్వాదము అమోఘమైనదని విఖ్యాతమైనది.

అమ్మా, ఈ సుందర ఫలవృక్షములనుచూచి నాకు అపరిమితమగు ఆకలి వేయుచున్నది" అనెను.

"కుమారా, ఈ వనమునకు బలవంతులగు రజనీచరభటులు రక్షకులున్నారు"

అని జానకి నుడివెను.

"నీవు ప్రసన్నురాలవై ఆజ్ఞ ఇమ్ము. వారివలన భయము నాకు లేదు"అని మారుతి ప్రత్యుత్తరమిచ్చెను.

కపీశ్వరుని బుద్ధి బల నైపుణ్యములను కనుగొని జానకి "నాయనా, రఘుపతి చరణములను నీ హృదయమున నిడుకొని మధురఫలములను భక్షింపుము, పొమ్ము" అనెను.

మారుతి సీతకు నమస్కరించినాడు, వనములో ప్రవేశించినాడు, పండ్లను భక్షించినాడు, వృక్షములను పెకలింప మొదలినాడు.

ఆ వనమునకు పెక్కురు రక్షకభటులున్నారు. వారిలో కొందరిని మారుతి పరిమార్చినాడు. మరికొందరు పారిపోయి "ప్రభు, ఒక పెద్దకోతి వచ్చినది. అశోకవనమును ధ్వంసము కావించినది. పండ్లను తిన్నది. చెట్లను పెకలించివేసినది. రక్షకులను మర్దించి నేలకూల్చివేసినది" అని రావణునికి విన్నవించిరి.

రావణుడు విని పలువురు యోధులను పంపించెను. హనుమంతుడు వారిని కాంచెను, గర్జించెను, ఆ రజనీచరులనెల్లరను సంహరించెను. సగముచచ్చిన కొందరు చని రావణునికి మొర పెట్టుకొనిరి.

రావణుడు అక్షయకుమారుని పంపినాడు, అపారమగు సైన్యమును వెంటనిడుకొని ఆ కుమారుడు బయలు దేరినాడు, అతనిరాకను మారుతు కనుకొని ఒకచెటును తనచేతితో పెకలించి, దానితో అతనిని చంపి మహాధ్వనికావించి గర్జించినాడు.

సేనలో కొందరిని మారుతి సంహరించినాడు, మరికొందరిని మర్దించినాడు, మరికొందరిని పట్టుకొని నైలపై పడకొట్టినాడు, మిగిలిన కొందరు రావణునివద్దకు వెడలి "ప్రభూ, ఆ మర్కటము మహాబలిశాలి"అని నివేదించిరి.

కుమారుని మరణవార్తవిని దశాననుడి క్రుద్ధుడైనాడు. పెద్దకొడుకగు మేఘనాదునిపిలిచి, "కుమారా, ఆకోతిని చంపవద్దు, బంధించి తీసుకొనిరమ్ము. ఆ కోతి ఎక్కడనుండి వచ్చినదో కనుగొనవలయును"అని ఆజ్ఞాపించినాడు.

ఇంద్రుని జయించినవాడు, అసమానయోధుడు, మేఘనాదుడు బయలుదేరి నాడు. తమ్ముని చావుగురించి విని అతనికి క్రోధము కలిగినది.

ఆ భయంకరయోధుని హనుమంతుడుచూచి పండ్లు పటపట కొరికినాడు, భీకరగర్జన చేసినాడు. పరుగిడి ఒక మహావృక్షమును పెకలించి తెచ్చినాడు. దానితో లంకేశుని కుమారుని విరధునికావించి ఆ రాక్షసునితోవచ్చిన మహాయోధులనందరిని పట్టి తనశరీరముతో వారిని మర్దించసాగినాడు. వారినెల్లరనుచంపి అతడు తిరిగి మేఘనాదునితో మల్లయుద్ధముచేయ మొదలిడినాడు. గజరాజులపోరాటమో అన్నట్లున్నది వారియుద్ధము. మేఘనాదుని ఒక్క గ్రుద్దుగ్రుద్ది హనుమంతుడు ఒక చెట్టుపైకి ఎక్కెను. ఒక క్షణకాలము మేఘనాదుడు మూర్ఛిల్లెను. తిరిగిలేచి అతడు అనేక మాయాజాలము లను ప్రయోగింప మొదలిడెను. కాని పవననందునుని ఓడింంపలేకపోయెను. తుదకు మేఘనాదుడు బ్రహ్మస్త్రమును సంధించెను. "బ్రహ్మాస్త్రమును నేను మన్నించనిచో దాని అపారమహిమ నశించును"అని హనుమంతుడు తలచెను.

మేఘనాదుడు బ్రహ్మబాణమును కపిపై ప్రయోగించెను. చెట్టుపైనుండి మారుతి క్రిందపడెను. పడునపుడుకుడా అతడు పలువురు రాక్షసులను పరిమార్చెను. కపి మూర్ఛితుడై నాడని కనుగొని మేఘనాదుడు అతనిని నాగపాశముతో బంధించి తీసి కొని చనెను.

జ్ఞానులగు నరులు ఎవనినామమును జపించి భవబంధములను త్రెంచుకొందురో-అట్టివాని దూత-బంధములలో ఎట్లు పడును భవానీ; కాని ప్రభుని కార్యసాధనకే మారుతి స్వయముగా బంధింపబడెను. కపి బంధింపబడినాడని విని నిశాచరులు పరుగెత్తిరి. కౌతుకము వీక్షించుటకై అందరు సభకు వచ్చిరి. హనుమంతుడు దశముఖుని సభను పరికించెను. ఆ మహాసభయొక్క శోభ వర్ణనాతీతము. సురలు, దిక్పాలురు చేతులుజోడించి భయభీతులై బహునమ్రతతో రావణుని భ్రుకుటిని విలోకించుచున్నారు. దశాననుని ప్రతాపమును కనుగొనియు మారితియొక్కమనమున భయము కలుగలేదు. సర్పగణములలో గరుడునివలె జంకులేక అతడు ఉండెను. కపిని కనుగొని దశాననుడు నిష్ఠురవచనములు పలుకుచునే నవ్వుచుండెను. పుత్రునిమరణము స్మరణముకు వచ్చి మరల అతనిహృదయమున విషాదము ఉత్పన్నమగుచుండెను.

"ఓరీ కోతీ, ఎవ్వడవురా నీవు? ఎలని అండచూచి ఈవనమును నాశనమొనరించితివి? నా పేరు. నాకీర్తి నీచెవుల పడలేదా? శఠుడా, నిర్భయుడవై ఉన్నావు? ఏ అపరాధము కావించిరని నిశాచరులను చంపితివి? మూర్ఖుడా చెప్పుము. ప్రాణాములు పోవునని నీకు భయములేదా?" అని లంకేశుడు హనుమంతుని ప్రశ్నించెను.

"ఎవనిబలముచే మాయ సకలబ్రహ్మాండ నికాయములను సృష్టించునో, ఎవని బలముచే బ్రహ్మ, విష్ణు మహేశులు-సృష్టి, పాలన, సంహారములను కావింతురో, దశాననా, ఎవనిబలముచే గిరి కాననసమేతముగా ఈ బ్రహ్మాండమును తన శిరమును సహస్రముఖుడు ధరించునో, సురలను రక్షించుటకై ఎవడు వివిధదేహములను తాల్చునో, నీవంటి శఠులను శిక్షించువాడెవడో, కఠోర హరకోదండమును ఎవడు త్రుంచెనో, నీవంటి శఠులను శిక్షించువాడెవడో, కఠోర హరకోదండమును ఎవడు త్రుంచెనో, నృపాలుర గర్వభంగము కావించినవాడెవడో, అనన్యబలశాలురగు ఖర, దూషణ త్రిశిరులను, వాలిని సంహరించినవాడెవడో, ఎవ్వని లేశమాత్రశక్తిచే సకల చరాచరజగత్తును జయించితివో, ఎవ్వని ప్రియపత్నిని నీవు హరించి తెచ్చితివో- అతని దూతను నేను. నీ ప్రతాపము నేను వింటిని. సహస్రబాహునితో నీవు యుద్ధము చేసితివి! వాలితో పోరాడి కీర్తిని సంపాదించితివి!" అని హనుమంతుడు సమాధానమిచ్చెను.

కపియొక్క పలుకులువిని దశాననుడు నవ్వెను. మొగమును మరి ఒక ప్రక్కకుత్రిప్పెను. "ప్రభూ, నాకు ఆకలివేసినది. పండ్లను తింటిని. వానరస్వభావమున వృక్షములను పడగొట్టితిని. ఎల్లవారికి తమ దేహము పరమ ప్రియమైనది. దుర్మార్గచరులగు రాక్షసులు నన్ను కొట్టసాగిరి. వారిని నేను కొట్టితిని. నీతనయుడువచ్చిన న్ను బంధించినాడు 'బంధింపబడితిని' అని నాక లజ్జలేదు. నా ప్రభుని కార్యసాఫల్యమే నాకు కావలసినది. రావణా కరములు మోడ్చి నీకు వినతి కావింతును. గర్వమువదలి నేను చెప్పునది వినుము. నీ వంశమునుగూర్చి చింతింపుము. భ్రమను వీడుము. భక్త భయహారిని భజింపుము.

సురలను, ఆసురులను, చరాచరములను మ్రింగునది కాలము. ఎవ్వడనిన ఆ కాలము భీతిచెందునో అట్టివానితో ఎన్నటికి నీకు వైరము వలదు. నేను చెప్పినట్లు జానకిని రామునికి సమర్పించుము.

ఖరారి అగు రఘునాయకుడు కరుణసముద్రుడు. శరణాగతరక్షకుడు. నీవు శరణన్నచో నీ అపరాధములనుమరచి ఆతడు నిన్ను రక్షించును.

రామచరణపంకజములను నీహృదయమున ధరింపుము. సుస్థిరముగా లంకారాజ్యమును పాలింపము, పులస్త్యఋషియొక్క కీర్తి విమలచంద్రుని వంటిది. ఆ చంద్రునికి కళంకము రానీయకుము.

రామనామము లేనిదే వాణికి శోభ##లేదు. మదమోహములను త్యజింపుము. యోచించి తెలిసికొనుము. సురారీ, సంకలభూషణ భూషితమైనను వస్తృవిహీనయైనచో స్త్రీ శోభించదు.

రామవిముఖుని సంపద, ప్రభుత్వము -ఆర్జింపబడినవి. ఆర్జింపబడుచున్నవి లేక ఆర్జింపబడునవి - అయినను వ్యర్థములు-జలలేని నది వర్షము తగ్గిపోయినపిదప వెంటనే ఎండిపోవును. నేను ప్రతినచేసి చెప్పుచున్నాను. వినుము. దశాననా, రామవిముఖుని రక్షించువా డెవ్వడూ లేడు. రామద్రోహిని వేయిమంది శంకరులు, బ్రహ్మలు, విష్ణులైనను రక్షింపలేరు.

మోహమూలను, బహుపీడాకరము, తమోరూపము అగు అభిమానమును త్యజింపుము, కృపాసింధువు రఘనాయకుడు అగు రామభగవానుని భజింపుము"ని హనుమంతుడు భక్తి, వివేక, వైరాగ్య, నీతి సంభరితములు, అతి హితములు అగువాక్యములను రావణునికి భోధించెను. మహాఅభిమాని అగు రావణుడు, "మహాజ్ఞని-మనకు ఒక కపిగురువు దొరికివాడు!" అని పరిహసించెను.

"దుష్టుడా, నీ చావు దగ్గరపడినది. అధమా, నాకే బోధింపవచ్చితివిరా"అని అతడు నుడివెను.

"నీవు చెప్పినదానికి పూర్తిగా వ్యతిరేకము జరుగునురా. నీకు మతిభ్రమ కలిగినది. నేను ప్రత్యక్షజ్ఞానమును తెలిపితిని" అని హనుమంతుడు ప్రత్యుత్తరమిచ్చెను.

మారితియొక్క పలుకులివిని దశాననుడు అతి కుపితుడై " మూఢుని ప్రాణములు వెంటనే తీయరేమిరా?" అనెను. ఆ మాటలు వినగనే రాక్షసులు హనుమంతుని చంపుటడకు పరుగెత్తిరి. ఇంతలో మంత్రులతో కలసి విభీషణుడు వచ్చెను. శిరమువంచి అతడు కడు వినయుడై దశాననునికి నమస్కరించి "దూతను చంపరాదు. అది రాజనీతివిరుద్ధము. ప్రభూ, మరి ఏ ఇతర శిక్షనైనను విధించుము"అనెను.

"ఈ ఉపదేశము బాగున్నది, సోదరా"అని అందరు అనిరి.

ఆ మాటలువిని దశకంధరుడు నవ్వెను. "సరే, మంచిది అట్లైనచో ఈ కోతిని అంగచ్ఛేదము కావించి పంపివేయుడు. నేను చెప్పునది వినుడు. కోతులకు తమ తోకలయందు మమత ఎక్కు కనుక నూనెలో గుడ్డలను తడిపి ఈ వానరుని తోకకుచుట్టుడు. వానికి నిప్పు అంటించుడు, తోకలేకయే వానరుడు తిరిగిపోవును. తన యజమానిని ఈ మూర్ఖుడు తీసికొనివచ్చును. ఎంత గొప్పగానో వర్ణింపబడిన ఆతిని సామర్థ్యము చూతును!" అనెను

ఈ మాటలు కపీశ్వరుడు తనలో తాను నవ్వుకొనెను. "నాకు తెలిపినది సరస్వతి సహాయకారి అయినది!" అని అనుకొనెను.

రావణుని పలుకులు వినినవెంటనే మూర్ఖులగు రాక్షసులు అతడు చెప్పినట్లే చేయ మొదలిడిరి. నగరములో ఇక బట్టలు, నేయి, నూనె మిగులలేదు. హనుమంతుడు తన తోకను వింతగా పెంచెను. అతనికి ఇది ఒక ఆటవలె ఉన్నది. పురవాసులు ఈ కౌతుకమును చూచుటకు వచ్చిరి. హనుమంతుని వారు కాళ్ళతో తన్నిరి. కొట్టిరి, పరిహసించిరి, డోళ్ళు మ్రోగించుచు అందరు చప్పట్లుకొట్టుచూ మారుతిని నగరములో ఊరేగించి తిరిగి తోకకు నిప్పుఅంటించిరి.

అగ్ని ప్రజ్వలించినది. దానిని చూచి హనుమంతుడు వెంటనే అతి సూక్ష్మరూపుడయ్యెను. బంధములనుండి అతడు బయటపడి ఒక కనకమందిరముపైకి ఎగిరెను. అతనినిచూచి నిశాచరవనితలు భయబీతులైరి.

హరిప్రేరణచే ఆ సమయమున నలుబదితొమ్మిది వాయువులు వీచసాగినవి. హనుమంతుడు అట్టహాసముచేసి గర్జించెను. పెరిగి ఆకాశమునంటెను. అతని దేహము అపరిమితమైనదే. అయినను తేలికయైనది. పరుగెత్తుకొనిచని ఒక మందిరము నుండి ఇంకొక మందిరముపైకి అతడు ఎగురుచుండెను. నగరమంతయు దగ్ధమగు చున్నది. జనులందరు ఆయోమయ స్థితిలో నుండిరి. అగ్నిదేవుని భయంకర జ్వాలలు కోటానుకోట్లు అన్నిదిశలకు ముట్టుచున్నవి.

"అయ్యో, తల్లీ, అయ్యో తండ్రీ, ఇప్పుడు మమ్ము రక్షించువారెవరు?"అను ఆక్రోశములు అన్ని దిక్కులనుండి వినపడుచున్నవి.

"వీడు వానరుడు కాడు. వానరరూపము ధరించిన ఎవడో ఒక దేవత! మేము మొట్టమొదటనుండియే అనుకొంటిమి. సాధుజనులను అవమానించినందులకు ఫలితము ఇదియే-అనాథవలె ఈ నగరము తగులబడిపోవుచున్నది." అని జనులు వాపోవుచుండిరి

ఒక్క నిమిషములో నగరమంతయు దగ్ధమైపోయెను. విభీషణుని ఇల్లు మాత్రము దగ్ధముకాలేదు.

అగ్నిని సృష్టించిన వాని దూత హనుమంతుడు. అందువలన గిరిజా, అగ్ని అతనిని దహింపలేదు.

అగ్నిని సృష్టించిన వాని దూత హనుమంతుడు, అందువలన గిరిజా, అగ్ని అతనిని దహింపలేదు.

లంక అంతయు ఒకమూలనుండి ఇంకొకమూల వరకు కాలిపోయెను. హనుమంతుడు వెడలి సముద్రములోనికి ఉరికెను. తోకను చల్లార్చుకొనెను. శ్రమను తొలదగించుకొనెను తిరిగి సూక్ష్మరూపమును ధరించెను. జానకి ఎదుట చేతులు జోడించి నిలచెను.

"తల్లీ, రఘునాయకుడు నాకు ఇచ్చినట్లు చిహ్నమునేదైన నాకు నీవు దయచేయుము" అని జానకిని ప్రార్థించెను. తన చూడామణిని తీసి ఆమె పవనసుతుని కిచ్చెను. సంతోషముతో అతడు దానిని గ్రహించెను.

"నాయనా, ప్రభునికి నా ప్రణామములు నివేదింపుము. నా మాటలుగా ఇట్లు ఆయనకు తెలుపుము. 'ప్రభూ, సర్వవిధముల నీవు పూర్ణకాముడవు. దీనిదయాళుడవని బిరుదు ధరించితివి. కనుక ఆ బిరుదును గురుతుననిడుకొని, నాథా, నా సంకటములను తొలగింపుము.

శక్రసుతునిగాథ, తండ్రీ, రాముని స్మరణకుతెమ్ము. ప్రభుని బాణ ప్రతాపమును గుర్తుచేయుము. ఒక మాసము దినములలో నాథుడు రానిచో నేను బ్రతికి ఉండగా నన్నుచూడలేడు.

హనుమా, నీవే చెప్పుము. ఇంకనేను ఎట్లు నా ప్రాణములను నిలుపుకొన గలను? నీవునూ వెడలుదుననుచుంటివి నిన్ను చూచి నా హృదయము శాంతించినది. ఇంకనాకు ఆ రాత్రులు ఆ పగళ్ళే!" అని జానకి పలికినది.

పవనసుతుడు జనకసుతును అనేకరీతులు ఓదార్చెను. ఆమె చరణకమలములకు తన శిరముతో నమస్కరించి రాముని వద్దకు అతడు బయలు దేరెను.

వెడలునప్పుడు అతడు మహాధ్వని చేయుచు గర్జించెను. ఆ గర్జనవిని నిశాచర స్త్రీల గర్భములు స్రవించెను. సముద్రమును దాటి ఈవలి ఒడ్డునకు హనుమంతుడు చేరెను. కిలకిలశబ్దము కావించెను.

హనుమంతుని చూచి అందరు ఆనందించిరి. పునర్జన్మ లభించినట్లు భావించిరి. మారుతి ముఖము ప్రసన్నముగా ఉన్నది. శరీరమున తేజము విరాజిల్లుచున్నది. అతనిని చూచి రామకార్యము సఫలము కావించియే అతడు వచ్చుచున్నాడని వారందరు తలంచిరి.

అందరు హనుమంతుని అభినందించిరి. కలవరముచెందు చేపకు నీరు దొరకినట్లు సంతసించిరి. జరిగిన వృత్తాంతమును నూతన విశేషములను గురించి సంభాషించుచు అందరు రఘునాయకుని వద్దకు బయలుదేరిరి.

దారిలో వారు మధువనమును ప్రవేశించిరి. అంగదుని సమ్మతిపొంది మధురఫలములను భక్షించిరి. అడ్డగింపవచ్చిన వనరక్షకులు ముష్టిప్రహారములు తిని పలాయన మైరి. ఆ రక్షకులు సుగ్రీవుని సమీపించి "యవరాజు అంగదుడు వనమును సర్వము ధ్వంసము చేసివేసినాడని" అరచిరి. ఈ సంగతివిని , సుగ్రీవుడు సంతసించెను. ప్రభుకార్యమును సఫలముకావించి వానరులు తిరిగివచ్చినారని తలచి ఆనందించెను.

"సీతయొక్క జాడ తెలియనిచో మధువనములోని ఫలములను వారు తినకలు గుదురా?" అని సుగ్రీవుడు తన మనమున ఆలోచించుచుండునంతలో సమాజసహితముగా వానరులు వచ్చిరి.

అందరు సుగ్రీవుని చరణములపై శిరములుంచి మ్రొక్కిరి. అతి ప్రేమతో సుగ్రీవుడు కపులను కౌగలించుకొనెను. వారి కుశలమును తెలిసికొనెను, "నీ పాదసందర్శనముచే అందరూ కుశలమే. రాముని కృపవలన విశేషమగు కార్యము సఫలమైనది. ప్రభూ, సర్వకార్యమును హనుంతుడే సాధించినాడు. సకల కపుల ప్రాణములు రక్షింపబడినవి." అని వానరులు నుండివిరి. వారి మాటలను విని సుగ్రీవుడు హనుమంతుని మరల కౌగలించుకొని వానరులందరితో సహా రఘుపతి వద్దకు వెడలెను.

కార్యము సఫలముకావించి వానరులు వచ్చుచుండుట రాముడు కనుకొనెను. మనమున హర్షించెను.

సోదరిలిరువురు స్ఫటికశిలపై కూర్చుండి ఉండిరి. వానరులెల్లరు వెడలి వారి పాదములపై పడిరి. కరుణారాశి రఘుపతి వానరులనెల్లరను ప్రీతితో ఆలింగనము చేసి కొనెను. వారి కుశలమును గురించి ప్రశ్నించెను.

"నాథా నీ పాదకంజములను దర్శించి మేము కుశలమే." అని వానరులు అనిరి

రఘురాయా, నాథా, వినుము, నీ కృప ఎవనిపై ప్రసరించునో అట్టివానికి నిరంతరము శుభ##మే. అనవరతము కుశలమే. సురలు, నరులు, మునులు అట్టివాని ఎడల ప్రసన్నులే, వాడే విజయుడు. వాడే వినయుడు, వాడే గుణసాగరుడు. ముల్లోకములలో వాని సుయశము ప్రకాశించును. ప్రభుని కృపచే సర్వకార్యమును సిద్ధించినది. నేడు మా జన్మ సఫలమైనది. నాథా, పవనసుతుడు సాధించిన ఘనకార్యమును వేయి నోళ్ళతోనైనను వర్ణింపవశము కాదు." అని పవనతనయుని సుందరచరిత్రను జాంబవంతుడు రఘుపతికి నివేదించెను. ఆ చరితనువిని కృపానిధిఆనందించెను. సంతోషముతో మరి ఒకసారి అతడు హనుమంతుని తన హృదయమునకు హత్తుకొని "నాయనా, జానకి ఎట్లున్నది? తన ప్రాణములకు ఎట్లు రక్షించుకొనుచున్నది?"అని ప్రశ్నించెను.

"రేయింబవళ్ళు నీ నామమే ఆమెకు రక్షకభటుడు. నీ ధ్యానమే ఆమెకు కవాటము. తన చరణములను ఆమె తన కన్నులకు బంధించుకొనినది. ఇక ఆమె ప్రాణములు పోవుటకు మార్గమేది! నేను తిరిగి వచ్చునప్పుడు తన చూడామణిని నాకు తీసి ఇచ్చినది." అని హనుమంతుడు చూడామణిని రామునికిచ్చెను. దానిని రాముడు తన హృదయమునకు హత్తుకొనెను.

"ప్రభూ, రెండు కన్నులలో నీరునిండ జనకకుమారి నాతో కొన్ని మాటలు చెప్పినది. అనుజసమేతుడగు ప్రభుని చరణములను పట్టుకొని ఈ నాపలుకులు తెలుపమన్నది:-"నీవు దీనబంధుడవు. ప్రణతార్తిహరుడవు. మనోవాక్‌ కర్మలయందు నీ చరణానురాగిణిని నేను. నాథా. ఏ అపరాధము కావించితినని నన్ను త్యజించితివి?

ఒక్క దోషము నాయందున్నదని అంగీకరింతును. నిన్ను ఎడబాసియు నా ప్రాణములు విడువలేదు. కాని ప్రభూ, నా నేత్రములదే అపరాధము రాత్రింబవళ్ళు అవి నా ప్రాణములను పోనియక అడ్డునిలచి బాధించుచున్నవి. నీ ఎడబాటు అను విరహము అగ్నియైనది. నా శరీరము దూదియైనది. శ్వాసపవనుడైనాడు. ఒక క్షణములో ఈ శరీరము దగ్ధము కాగలదు. కాని తమ స్వార్థమునకై నయనములు అశ్రువులు స్రవించుచున్నవి. ఆ కన్నీటి కారణమున విరహాగ్నియును నా దేహమును దహించుటలేదు'.'

సీతయొక్క విపత్త మహాఘోరము. నీవు దీనదయాళుడవు. దానిని తెలుపక ఉండుటయే మంచిది. నిమిషనిమిషము, కరుణావిధీ, ఆమెకు ఒక కల్పమువలె గడచుచున్నది. ప్రభూ, వేగమే వెడలుము. నీ భుజబలముచే ఆ ఖలదళమును జయించి ఆమెను తీసికొనిరమ్ము."అని హనుంతుడు వివరించెను.

సీతయొక్క దుఃఖములను విని సుఖాదాముడగు ప్రభుని రాజీవనయనములు బాష్పపూరితములయ్యెను.

"మనోవాక్కాయములయందు నేనే గతిఅగు వారికి స్వప్నమందైనను విపత్తు కలుగునా?" అని రాముడు నుడివెను.

హనుమంతుడు:- "ప్రభూ, నిన్ను స్మరించుకుండుట కంటెను. భజించుకుండుట కంటెను విపత్తు ఏదియులేదు. రాక్షసులొక లెక్కయా? రిపులను జయింతువు జానకిని తెత్తువు" అనెను.

"హనుమా, నీవంటి ఉపకారి నాకు సురనరమునులయందు ఏ శరీరధారియు లేడు ఏ ప్రత్యుపకారము నీకు నేను చేయగలను? నా మనసున ఏదియును తట్టుటయు లేదు. కుమారా, బాగుగా నా మనసున విచారించితిని. నీ ఋణమును నేను తీర్చలేను" అని రాముడు నుడివెను.

సురరక్షకుడు. మరలమరల మారుతిని వీక్షించుచుండెను. ఆయన నయనములు నీరు క్రమ్మినవి. శరీరము అత్యంత పులకితమయ్యెను.

ప్రభుని పలుకులు విని. ఆతని వదనమును, పులరకితశరీరమును కనుగొని హనుమంతుడు హర్షసంభరితుడయ్యెను. ప్రేమాకులుడై అతడు "రక్షింపుము, భగవాన్‌, రక్షింపుము" అనుచు రాముని పాదములపై పడెను.

అతనిని లేవదీయుటకు ప్రభువు మాటిమాటికి ప్రయత్నించును. కాని ప్రేమమగ్నుడైన మారుతి ప్రభుని పదములనుండి లేవడు! ప్రభుని కరపంకజములు కపిశిరమున ఉన్నవి.

[ఆ పరిస్థితిని స్మరించి గౌరీశుడును ప్రేమమగ్నుడయ్యెను. మనస్సును కుదట పరచుకొని శంకరుడు అతిసుందరమగు కథను మరల వివరింపసాగెను.]

హనుమంతుని లేవనెత్తి రాముడు తన హృదయమునకు హత్తుకొనెను. అతని చేతిని పట్టుకొని తనకు అత్యంత సమీపమున కూర్చుండ పెట్టకొనెను.

"హనుమా, రావణపాలితమగు లంక అభేద్యము. ఆదుర్గమును నీవు ఎట్లు దహించితివయ్యా? తెలియజేయము? అనికోరెను. ప్రభువు ప్రసన్నుడైనాడని తెలిసికొని హనుమంతుడు విగతాభిమానుడై ఇట్లు నుడివెను:_

"మర్కటములకు వృక్షములపై ఒక కొమ్మనుండి ఇంకొక కొమ్మపైకి ఎగురుటలో నిపుణతకలదు. నేను సముద్రమును దాటుట. సువర్ణనగరమును దగ్ధము చేయుట రాక్షససమూహములను సంహించుట. అశోకవనమును ధ్వసంము కావించుట ఇవి అన్నియు రఘునాథా, నీ ప్రతాపములే దీనిలో నా మహిమ ఏమియులేదు. ప్రభూ, ఎవనియందు నీవు ప్రసన్నడవో వానికి అగమమగునది ఏదియులేదు. నీ ప్రభావము వలన దూదియును బడ బానలమును నిశ్చయముగా దహించివేయగలదు. అతిసుఖదాయని అగు నీయందు నిశ్చలభక్తిని కృపతో నాథా. నాకు ప్రసాదించుము."అని హనుంతుడు అతి సరళ వచనములను పలికెను. భవానీ, ఆ వచనములను విని ప్రభువు" అట్లే అగుగాక"అనియెను.

ఉమా, రాముని స్వభావమును తెలిసికొనిన వారికి ఆతని భజన తప్ప వేరొక విషయము రుచించదు.

'స్వామి, సేవక సంవాదమును, హృదయమున ధరించిన వానికి రఘుపతి చరణములయందు భక్తి జనించును.'

ప్రభుని పలుకులు విని కపిగణములు "జయము జయము జయము కృపాళూ, సుఖదాయకా, నీకు జయము" అని జయధ్వానములు చేసిరి. రఘుపతి కపిపతిని పిలిపించి "మన జైత్రయాత్రకు సన్నాహములు కావింపుము. ఇక విలంబమెందులకు? శీఘ్రమే కపులకు ఆజ్ఞఇమ్ము."అనిచెప్పెను.

ఈ కౌతుకము వీక్షించి దేవతలు సుమనవర్షము విరివిగా కురిపించిరి. సంతోషముతో వారు నభమునుడి తమతమ లోకములకు వెడలిరి.

కపిపతి వేగమే వానరులను పిలిపించినాడు. యూథప యూథములు వచ్చనవి. వానర భల్లూక సమూహములు పలు రంగులు కలవి. అన్నియు సాటిలేని బలముకలవి.

వానరులందరు ప్రభుని పాదపంకజములకు శిరములుమోడ్చి నమస్కరించిరి. మహాబలులగు భల్లూకములు, వానరమలు గర్జించెను.

సకల కపిసేనను రాముడు సమీక్షించెను. రాజీవనయనములతో కృపాపూర్వక దృష్టిని వారిపై ప్రసరించెను.

రామకృపాబలమును పొంది కపిపుంగవులు రెక్కలుకలిగిన పర్వతమువలె ఉండిరి.

హర్షముతో రాముడు పయనమయ్యెను.

సుందర శుభ శకునములు అనేకముల కనుపించినవి. ఎవనికీర్తి సకల సన్మంగళ సంభరితమో అట్టి ఆతని ప్రస్థానసమయమున శుభశకునములు పొడగట్టుట సదాచారమే కదా. వైదేహికికూడా రాముని ప్రయాణముగూర్చి తెలిసినది. ఆ శుభ వార్త తెలుపుటకో అనునట్లు ఆమె ఎడమభాగము అదరినది.

జానకియొక్క శుభశకునములన్నియు రావణుని ఆశుభ శకునములయ్యెను.

మహాసేన కదలుచున్నది. దానిన వర్ణించుట ఎవరితరము? అంఖ్యాకులగు వానరులు, భల్లూకములు గర్జించుచున్నారు. కొందరికి గోళ్ళే ఆయుధములు, భల్లూకములు వానరులు పర్వతములను వృక్షములను ధరించి గగనమార్గమున, భూమిపైన ఇచ్ఛానుసారులై నడచుచున్నారు. సింహగర్జన చేయుచున్నారు. ఆ గర్జనకు దిగ్గజములు చలించి ఘీంకారము కావించినవి. పృథ్వి కంపించినది. గిరులు చలించినవి. సాగరములు కలదతచెందినది. తమ దుఃఖములు తొలగినవి గంధర్వులు. దేవతలు మునులు, నాగులు, కిన్నరులు అందరు సంతసించిరి. కోట్లకొలది వికటస్వరూపులగు వానర యోధులు పండ్లు పటపట మనిపించిరి.

"జయమురామా, ప్రబలప్రతాపా, కోసలనాథా" అని అరచుచు వారు రాముని గుణగణములను కీర్తించుచున్నారు. మహనీయుడగు శేషుడు ఆసేనయొక్క బరువును భరింపలేకున్నాడు. మాటమాటికి అతని తల తిరుగుచున్నది. కూర్మ పృష్టమున తన పండ్లతోపట్టి, రఘువీరుని సుందర ప్రస్థానము అత్యంత మనోహరమైనదని తెలిసికొని శాశ్వతమగు ఆపావనకథను తాబేటి వీపుపై అతడు రచించుచున్నాడో అనునట్లున్నది.

ఇట్లు కృపానిధి అగు రాముడు సాగరతీరమును చేరి విడిదిచేసెను. వానర, భల్లూకవీరులు అనేకులు కనిపించిన ఎల్లచోట్ల ఫలములను భక్షింపమొదలిడిరి.

ఇక అక్కడ లంకలో నిశాచరులు- హనుమంతుడు లంకను దహించి వెడలి నప్పటినుండి భయభీతులైరి. "ఇక ఈ రాక్షసకులమును రక్షించు ఉపాయము లేదు" అని తమతమ ఇండ్లలో ప్రతివారు విచారింపసాగిరి.

"ఎవ్వని దూతయొక్క బలమును వర్ణింప అలవికాదో అట్టి అతడే స్వయముగ మన నగరికి వచ్చినచో ఇకమనపని ఏమి కాగలదు? అని వారు చింతింపసాగిరి.

నగరవాసుల పలుకుల దూతికలద్వారా మండోదరివిని మిక్కిలి ఆందోళన చెందినది. ఏకాంతమున ఆమె పతికి చేతులెత్తి మ్రొక్కినది. అతని పాదములు పట్టుకొనినది. నీతిభరిత వచనమున పలికినది. "ప్రియా, శ్రీహరితో విరోధము మానుము. నేను చెప్పుమాటలు అత్యంత హితకరములని ఎంచి నీ హృదయమున ధరింపుము. ఆ దూత చేసిన చేష్టలు గుర్తునకు వచ్చినంతనే రజనీచరస్త్రీలు గర్భములు స్రవించుచున్నవి. స్వామీ, నీ మేలునుకోరినవాడవే అగుచో మంత్రిని పిలిపించి ఆ స్త్రీని పంపివేయుము.

నీ 'కులము' అను కమలవనమున దుఃఖదాయినిఅగు సీతా చలికాలమున రాత్రివలె దాపురించినది. నాథా. వినుము. సీతను తిరిగి పంపనిదే శంభుడైనను అజుడైనను నీకు హితము చేయలేరు.

రామబాణములు సర్పసమూహములకు సమానములు. నిశాచరనికరములు కప్పలవంటివి. ఆ సర్పములు వచ్చి నిన్ను కబళింపకముందే మొండితనమును వీడి మంచిని కావించుము." అవి హితము నుడివినది.

జగత్ర్పసిద్ధ అహంకారి, మూర్ఖుడు అగు రావణుడు ఆ మాటులు విని బిగ్గరగా నవ్వినాడు.

"భయము వనితల స్వభావము. శుభములలో సహితము వారికి భయమే. నీ మనస్సు అతి బలహీనమైనది. వానరసేన వచ్చినచో, పాపము, మన రాక్షసులు దానిని భక్షించి తమను రక్షించుకొందురు. లోకపాలురు ఎవ్వడనిన భయపడి వణుకుదురో అట్టివాని భార్యకు భయమా! ఎంత పరిహాసపు పలుకు!" అని నుడిను నవ్వి నాడు. మందోదరిని కౌగలించుకున్నాడు. ఆమెపై అధిక మమతను ప్రదర్శించి సభాస్థలికి చనినాడు.

తన పతియెడల విధి విపరీతమయ్యెనని మందోదరి విచారింపసాగినది. కొలువు కూటము రావణుడు చేరగానే వార్త వచ్చినది-శత్రుసేన అంతయు సముద్రము వద్దకు చేరినది.

సముచిత కర్తవ్యమును బోధింపుడని అతడు మంత్రులను కోరెను. వారందరు నవ్విరి, "మెదలక ఊరకుండుము. దేవతలను జయించితివి. రాక్షసులను ఓడించితివి. ఆ నాడు నీకు ఏశ్రమయును కలుగలేదుకదా! ఇక ఈ నరులు వానరులు ఒక లెక్కయా?"అనిరి

మంత్రి, వైద్యుడు, గురువు, ఈ ముగ్గురు భయపడికాని ఆశ##చేకాని హితము పలుకక ప్రియవచనములు పలికినచో రాజ్యము, శరీరము, ధర్మము ఈ మూడును శీఘ్రమే నాశనమగును.

రావణునికికూడా ఇట్టి సహాయమే చేకూరినది. మంత్రులందరి అతని మాటలువిని అతనిని ముఖస్తుతి కావించిరి. అది తగు సమయమని విభీషణుడు వచ్చెను. అన్నయొక్క పాదములకు శిరమువంచి నమస్కరించెను. మరి ఒకసారి తలవంచి తన ఆసనముపై ఆసీనుడయ్యెను. అన్న ఆననుపొంది "కృపాళూ, నా అభిప్రాయమును అడిగితివి కనుక నా బుద్ధిని అనుసరించి, నీకు హితమును వచింతును." అని అతడు ఇట్లు నుడివెను:_

"తనకల్యాణమును. సుయశమును, సుమతిని, శుభగతిని, సర్వవిధములగు సుఖమును కోరువాడు.స్వామీ, చవితినాటి చంద్రుని చూడనట్లు పరనారి ముఖమును త్యజించవలెను.

పదునాలుగులోకములను ఏకైక పతియైనను భూతద్రోహముచేసి మనజాలడు. గుణసాగరుడైనను. చతురుడైనను. అట్టిలవానికి ఏ స్వల్పలోభ##మైనను ఉన్నచో వానిని గురించి ఎవ్వరును మంచి పలుకరు. కామ, క్రోధ, లోభములన్నియు, నాథా, నరకమునకు చేర్చుమార్గములు. వీనినన్నింటిని త్యజించి, సత్పురుషులు భజించు రఘువీరుని నీవు భజింపుము. అన్నా, రాముడు నరపాలుడే కాడు. అతడు భువనేశ్వరుడు. కాలునికి కాలుడు. భగవంతుడు. అజుడు. అనామయుడు. వ్యాపకుడు. అజేయుడు. ఆది అంతములులేని బ్రహ్మ.

గోద్విజ ధేనుదేవ హితకారి - కృపాసింధవు, మనుష్యశరీరధారి యైనాడు భక్తజనరంజకుడు. దుష్టసంహారకుడు అన్నా, వినుము - అతడు వేదధర్మ రక్షకుడు వైరమును విడిచి అతనికి నమస్కరింపుము. రఘునాథుడు శరణాగత దుఃఖహరుడు. నాథా, వైదేహిని ప్రభునికి అర్పింపుము. నిర్హేతుక హితుడగు రాముని భజింపుము.

విశ్వజగత్తునకు ద్రోహమొనర్చిన పాపియైనను తనను శరణన్నచో ప్రభువు అతనిని త్యజింపడు. తాపత్రయములను నాశనము కావించునది. ఎవనినామమో ఆ ప్రభువే మనుజరూపమున రావణా, అవిర్భవించినాడు. ఈ విషయము విశ్వసింపుము.

దశాననా, పదేపదే నేను నీ పాదములను పట్టుదును. వినతిచేతును. మాన మోహ మదములను పరిహరించి కోసలాధీశుని భజింపుము.

పులస్త్యముని తన శిష్యునిద్వారా ఈ విషయమును మనకు చెప్పిపంపినాడు. సదవకాశమును చూచుకొని వెంటనే నేనుప్రభునికి దానిని తెలిపితిని."

మాల్యవంతుడను బుద్ధిమంతుడు రావణుని మంత్రులలో ఒకడు. అతడు విభీషణుని పలుకులువిని కడు సంతసించి "నాయనా, నీ అనుజుడు విభీషణుడు నీతి విభూషణుడు. ఆతడు చెప్పినది. నీ హృదయమున గ్రహింపుము"అని రావణునితో అనెను.

"ఈ ఇరువురు మూర్ఖులు శత్రువులమహిమను వర్ణించుచున్నారు. వీరిని తరిమి వేయుటకు ఇక్కడ ఎవ్వరూ లేరురా?" అని దశానను డనెను.

అంతట మాల్యవంతుడు తన ఇంటికి వెడలెను. విభీషణుడు కరములుమోడ్చి మరల ఇట్లు నుడుపసాగెను:-

"ప్రభూ, సకలహృదయములలో సుమతి, కుమతి రెండును. కలవని పురాణనములు నిగమములు తెలుపును. సుమతి ఉన్నచోట వివిధసంపదలు వసించును. కుమతి ఉన్నచోట తుదకు విపత్తుయే కలుగును. నీ హృదయమున విరుద్ధమగు దుర్బుద్ధిచేరి నివసించుచున్నది. కనుకనే నీవు హితుని అహితునిగా తలచుచున్నావు. శత్రువులను మిత్రులుగా భావించుచున్నావు. నిశాచరకులమునకు కాళరాత్రి అగు సీతపై ఇంతప్రీతి కలిగినది నీకు!

నాయనా, నీ చరణములను పట్టుకొని నిన్ను యాచింతును. నాయందు వాత్సల్యము నిలుపుము. సీతను రామునికి సమర్పింపుము. అట్లొనర్చినచో నీకు అహితము కలుగదు."

పండిత, పురాణ, శ్రుతి సమ్మతమగు వచనములచే విభీషణుడు నీతిని బోధించెను. ఆ వచనములను దశాననుడు విన్నాడు. వెంటనే రోషమున లేచినాడు. "ఖలుడా, నీకు మృత్యువు దగ్గర పడినదిరా ఇప్పుడు - శఠుడా, నా సోమ్ముతిని బ్రతుకుచున్నావు. శత్రుపక్షమే నీకు రుచించుచున్నది, దుష్టుడా, చెప్పవేమిరా? నా భుజబలముచే నేను జయించనివాడు ఈ జగత్తున ఎవడున్నాడురా? మూర్ఖుడా, నీ కాపురము నా పురములో నీ ప్రేమ ఆ తాపసులయందు! పొమ్ము. వారివద్దకే పొమ్ము, వారికే నీ నీతిని బోధింపుము" అనిపలికి అతడు కాలితో విభీషణుని తన్నెను. ఐనను విభీషణుడు అన్న పాదములనే పట్టుకొని ఉన్నాడు.

ఉమా, సత్పురుషుల ఘనత ఇదియే, తమకు చెడిచేసినవారికే వారు మంచి కావింతురు,

"నీవు నా తండ్రికి సముడవు. నన్ను కొట్టి, నాకు మేలును చేసితివి. కాని ప్రభూ, రాముని భజించుటయందే నీకు మేలు కలదు" అని విభీషణుడు పలికెను. తన సచివులను వెంటతీసికొని అతడు నభోమార్గమున,

"రాముడు సత్యసంకల్పుడు. ప్రభుడు, నీ సభ కాలవశమయ్యెను. ఇప్పుడు నేను రఘువీరుని శరణు వేడపోవుచున్నాను. నన్ను నిందింపకుము" అని అనుచు వెడలెను. అతడు సభనువిడిచి వెంటనే అందరు ఆయువిహీనులైరి,

భవానీ, సాధువులను అవమానించినచో అఖిల కల్యాణమునకు సత్వరమే హాని కలుగును

విభీషణుని త్యజించినక్షణముననే రావణుడు వైభవహీనుడయ్యెను. సంతోషమున విభీషణుడు-అనేక మనోరథములను సృజించుకొనుచ రఘునాయకునివద్దకు వెడలెను.

"రామునివద్దకు అరుగుదును. సేవకసుఖదములు, స్పర్శమాత్రమున ఋషి పత్నిని తరింపజేసినవియు, దండకకాననమును పావనమొనర్చినట్టివి అగు ఆతని అరుణ చరణములను సందర్శించును.

వెడలి, జనకసుత తనహృదయమున ధరించిన ఆపాదములను, మాయా మృగముకొరకై ధరపై పరుగిడిన ఆ పాదములను. హరుని హృదయసరోవరమున విరాజిల్లు చరణములను నేడు నేను దర్శింతును. అహో ఏమి నా భాగ్యము!

ఆచరణ పాదుకలను, తన మనమున భరతుడు పదిలపరచెను. ఆచరణములను ఇప్పుడే నేను వెడలి ఈనాకన్నులార కనుగొందును.

అని ఇట్లు ప్రేమసహితముగా చింతించుచు విభీషణుడు సముద్రుప ఈవలి ఒడ్డున చేరెను.

అతనిరాకను కవులు కనుగొనిరి. ఎవడో శత్రువుల ప్రత్యేకదూత వచ్చుచున్నాడని అనుకొనిరి. అతనిని ఆపి వారు సుగ్రీవునివద్దకు తీసికొనిపోయిరి. వృత్తాంతమును తెలిపిరి.

"రఘానాథా, దశాననును సోదరుడు నిన్ను కలసికొనుటకు వచ్చినాడు"అని సుగ్రీవుడు రామునికి నివేదించెను.

"సఖుడా. నీ భావమేమి?" అని ప్రభువు ప్రశ్నించెను.

" రాక్షసులమాయలు తెలియరావు. నరనాథా, ఈ కామరూపధారి ఏకారణమున వచ్చినాడో తెలియదు" మన రహస్యములను తెలిసికొనుటకై ఈ మూర్ఖుడు వచ్చి ఉండును. కనుక ఇతనిని బంధించిఉంచుట ఉచితమని నా భావము" అని సుగ్రీవుడు సమాధానమిచ్చెను.

"సఖుడా, నీవు బాగుగనే నీతిని విచారించితివి. కాని శరణాగతుల భయమును తొలగించుట నా వ్రతము" అని రాముడు నుడివెను.

ప్రభుని పలుకులువిని హనుమంతుడు "భగవానుడు ఎంతటి శరణాగతవత్సలుడు!" అని హర్షించెను.

"శరణాగతుడై వచ్చినవానిని తమకు అహితుడని త్యజించువారు పామరులు; పాపమయులు; అట్టి వారిని చూచిననే పాపము. కోటిమంది బ్రాహ్మణులను వధించిన వానినై నను శరణన్నవానిని నేను త్యజింపను. నా సమ్ముఖమునకు వచ్చినవాని కోటి జన్మల పాపము నశించిపోవును. పాపులకు నా భజన రుచించదు. ఇదివారి సహజగుణము. ఇతడు నిజముగా దుష్టహృదయుడే అయినచో నా సమ్ముఖమునకు రాగలడా?

నిర్మలమానసుడే నన్ను పొందును. కపటి మోసకాడు నన్ను పొందజాలడు. మనరహస్యమును కనుగొనుటకే ఇతడు దశాననుచే పంపబడినవాడైనను- కపీశ్వరా, మనకు భయములేదు. హానియునులేదు. లోకమున ఎందరు నిశాచరులున్ను సరే వారినందరను నిమిషములో లక్ష్మణుడు సంహరింపగలడు. భయభీతుడై ఈ రాక్షసుడు శరణాగతుడై వచ్చిఉన్నచో నా ప్రాణమునువలె నేను అతనిని రక్షింతును "ఏమైనను అతనిని తీసికొనిరండు"అని ఆ కృపానికేతనుడు నవ్వుచు పలికెను. 'జయము కృపాళూ' అనుచు అంగద, హనుమంతసహితుడైనసుగ్రీవుడు వెడలెను. సాదరముగా విభీషణుని తమముందు ఉంచుకొని కరుణాకరుడగు రఘుపతివద్దకు వానరులు వచ్చిరి. నయనానంద దాయకులగు ఇరివురు సోదరులను విభీషణుడు దూరము నుండియే వీక్షించెను.

సుందరమూర్తి అగు రాముని తదేకదీక్షతో చూచుచూ అనిమీలితనేత్రుడై అతడు తటాలున నిలచెను. విశాలభుజుడు, అరుణ కమల సమనేత్రుడు, శ్యామలగాత్రుడు, ప్రణత భయవిమోచనుడు, సింహకంధరుడు. విశాలవక్షస్థలుడు. శోభాననుడు. అమిత మదన మనమోహనుడు అగు రాముని మూర్తినిచూచి విభీషణుని నేత్రములు జలభరితములయ్యెను., శరీరము అత్యంత పులకితమయ్యెను. మనమున ధైర్యమువహించి అతడు, "నాథా, నేను దశాననుని తమ్ముడను. సురరక్షకా, నిశాచరకులమున జనించితిని. ఉల్లూకమునకు అంధకారమనిన ప్రేమ ఉండునట్లు స్వభావముచే నేను పాపప్రియుడను. తామసదేహుడను. నీ సత్కీర్తిని చెవులారవిని వచ్చితిని. ఆర్తిహరుడవు. భవభయహరుడవు, రఘువీరా, రక్షింపుము, రక్షింపుము, శరణన్నవారికి ఆనందప్రదుడవు"అని మృదువచనములు పలికెను. సాష్టాంగ దండప్రణామము చేసెను. విభీషణుని కనుగొని ప్రభువు అపారమగు ఆనందమును పొందెను. వెంటనే అతడు లేచెను. విభీషణుని దీనవచనములనువిని మనసున సంతసించెను. విశాలభుజములతో విభీషణుని తన హృదయమునకు హత్తుకొనెను అనుజ సహితుడై అతనిని కౌగిలించుకొనెను. తనవద్దకూర్చుండపెట్టుకొనెను. భక్తుల భయమును హరించు వచనములను ఇట్లు పలికెను:_ లంకేశ్వరా, నీ కుశలము, నీ కుటుంబక్షేమము తెలియచేయుము. నీ నివాసము అనుచితమగు ప్రదేశమున! రేయింబవళ్ళు దుష్టసమాజమునందే నీ నివాసము! సుఖుడా, నీ ధర్మమెట్లు నిర్వహింపబడుచున్నది? నీనడవడిక అంతయు నాకు తెలియును. అతి నీతినిపుణుడవు అనినీతి నీకు గిట్టదు. నరకవాసము మిక్కిలి మంచిది కాని దుస్సాంగత్యముమాత్రము విధాత ఎన్నడు ప్రసాదించకుండుగాక! " అని రాముడు పలికెను. "రఘురాయా, నీ పాదసందర్శనమున నేను కుశలమే నీ సేవకుడనని నీవు నాపై కృప చూపితివి. శోకనిల యమగు కామమును త్యజించి రాముని భజించనంతవరకు జీవునికి కుశలము లేదు. కలలోనైనను అతని మనస్సునకు విశ్రాంతిలేదు.

చాపబాణధరుడగు రఘునాథుడు హృదయమున నివసించనంతవరకు వివిధ లోభ, మోహ, మత్సర, మద, అభిమానాదులే అందు వసించును.

ప్రపంచమున మమత (స్వార్థము) రాగద్వేషములను ఉల్లూకములకు సుఖము నిచ్చు ఒక మహాంధకార నిశ. నీ ప్రతాపభానుడు ఉదయించినంతరకు అది జీవుని మనస్సున వసించుచునే ఉండును. నీ పాదకములములను దర్శించి ఇప్పుడు నేనురామా, కుశలుడను. నా భీతి, తొలగినది. కృపాళూ. ఎవనియందు నీవు అనుకూలుడవో అట్టివానికి త్రివిధ భవబాధలు ఉండవు.

నేను అత్యంత నీచస్వభావముకల నిశాచరుడును. ఎన్నడూ మంచినడవడిక కలిగిన వాడనుకాను. ధ్యానముచేనై నను మునులకు గోచరించని ప్రభువు సంప్రీతుడై నన్ను తనహృదయమున చేర్చుకొన్నాడు!

అహో నా అపారభాగ్యము! కృపా సుఖ నిలయుడవగు రామా, శివ, విరించి సేవిత పాదపద్మయుగళమును నా నయనములతో కనుగొంటిని!" అని విభీషణుడు పలికెను.

"సఖుడా, వినుము. నా నిజస్వభావమును తెలపుదును. దీనిని భుశుండి శివ, పార్వతులు ఎఱుగుదురు.

చరాచరద్రోహి అగు నరుడైనను సరే భయభీతుడై నా శరణుకోరి మద, మోహ, నానావిధకపటములను త్యజించినచో, అట్టివానిని నేను శీఘ్రమే సాధుసమానుని కావింతును.

జననీ, జనక, భ్రాతృ, సుత, దారా, తను, ధన, గృహ, మిత్ర, పరివారములు అను మమతారూపబంధమనములు సర్వము దారములవంటివి. పవిత్రహృదయయులు వీనిని ఒకచోట ప్రోగుచేసి ఒకత్రాడుగా పేని దానితో తమ మనస్సును నాచరణములకు బంధించివైతురు. అట్టివారు సమదర్శులు వారికి ఏ కోర్కెలు ఉండవు వారి మనస్సులలో హర్షము. శోకము భయము ఉండవు, అట్టి సాధుసజ్జనులు లోభివద్ద ధనమువలె నా హృదయమున వసింతురు.

నీ వంటి సాధుజనులుమాత్రమే నాకు ప్రియులు ఏ ఇతరులకొరకు నేను దేహము ధరించనేరను. సుగణోపాసకులు పరహితనిరతులు. నీతి, నియమదృఢవ్రతులు, బ్రాహ్మచరణరతులు నాకు ప్రాణసమానప్రియులు. లంకేశా, వినుము. ఈ గుణములన్నియు నీలో ఉన్నవి. కనుకనే నీవు నాకు అత్యంతప్రియుడవు" అని రాముడు వచించెను.

రాముని వచనములు విని వానరయోధులందరు 'కృపారాశి అగు రాముని జయము' అని అఱచిరి.

ప్రభుని పలుకులువిని చెవులకు వానిని అమృతస్రాయముగ భావించిన విభీషణనిని తృప్తి కలుగలేదు. పదేపదే అతడు రాముని పాదపంకజములను పట్టుకొనెను అపారమగు ప్రేమను అతడు హృదయమున ఇముడ్చుకొనలేకపోయెను.

"దేవా, సచరాచరనాథా, శరణాగతరక్షకా, సకల హృదయాంతర్యామీ, వినుము. నా హృదయమున కొన్ని పూర్వవాసనలు ఉండెడివి. ప్రభుని పదభక్తి అను నదిలో అని అన్నియు కొట్టుకొనిపోయినవి. కృపాళూ, శివుని మనస్సునకు సదా ప్రియకరమగు నీ పవిత్రభక్తిని నాకు దయచేయము" అని విభీషణుడు ప్రార్థించెను.

"అటే అగుగాక" అనెను రణధీరుడగు ప్రభువు. వెంటనే ఆతడు సముద్రజలమును తెప్పించెను. "సఖా ఇచ్ఛ నీకు లేకున్నను- జగత్తున నా దర్శనము అమోఘము" అని రాముడు విభీషణుని నుదుట తిలకముంచెను. ఆకసమునుండి ఆపారమగు సుమనవృష్టి కురిసెను.

విభీషణుని వచనములనబడు ప్రచండవాయువుచే ప్రజ్వలింపబడుచున్న రావణుని క్రోధాగ్నియందు మాడిపోకుండా ప్రభువు విభీషణుని రక్షించెను. అతనికి ప్రభువు అఖండరాజ్యమును ప్రసాదించెను.

పదితలలు బలి ఇచ్చి శివునినుండి రావణుడు పొందిన సంపందను రఘునాథుడు విభీషణునికి సులభముగా ప్రసాదించెను.

అట్టి ప్రభుని విడిచి అన్యులను భజించునరుల తోకలు, కొమ్ములులేని పశువులు, విభీషణుడు తనవాడని తెలికొని ప్రభువు అతనిని తనసేవకునిగా చేసికొనెను. ప్రభుని స్వభావము కపికులమనమునకు ఆనందదాయకమయ్యెను. [అంతట] సర్వజ్ఞుడు, సర్వహృదయస్థితుడు, సర్వరూపుడు, సర్వరహితుడు, ఉదాసీనుడు రాక్షసకుల నిర్మూలనకై కారణజన్ముడు అగు రాముడు నీతి ప్రతిపాలన వాక్యములను ఇట్లు వచించెను:-

"కపీశ్వరా, లంకేశ్వరా, వినుము, గంభీరమగు ఈ జలనిధిని దాటుట ఎట్లు? నానావిధ మకర, ఉరగ, మత్స్యములతోనిండి అతి అగాధమైన దీనిని దాటుట అన్ని విధముల కఠినమైనది." లంకేశ్వరుడు విభీషణుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను:-

"రఘునాయకా, అవధరింపుము. నీ శరము ఒక్కటియే కోటిసముద్రములను ఎండింపగలదు. ఐనను వెడలి సముద్రుని ప్రార్థించట సముచితము ప్రభూ. సాగరుడు మీ పూర్వుడు. అతడే ఏదో ఉపాయమును యోచించి తెలుపగలడు. ప్రయాస లేకనే సకల వానర, భల్లూకసేనలు అప్పడు సాగరమును దాటగలవు."

అంతటరాముడు "సఖా, మంచిఉపాయమును చెప్పితివి. దైవము సహాయపడుచో అట్లే చేయుదము" అనెను.

ఈ సూచన లక్ష్మణునికి రుచింపలేదు. రాముని వచములను విని అతడు కడుదుఃఖించెను.

"ప్రభూ, ప్రారబ్ధముపై ఎందులకీ ఆశ? విశ్వాసము? క్రుద్ధుడవుకమ్ము. సముద్రుమును ఎండింపుము. ఈ ప్రారబ్ధము పిరికివాని మనసునకు ఒక ఆశ్రమయము. దైవము, దైవము అని సోమరులు కేకలు వేతురు" అని అతడు అనెను

ఈమాటలువిని రఘువీరుడు నవ్వెను. "అట్లే చేతము - ధైర్యము పూనుము" అని అతడు తమ్ముని శాంతపరచెను. సాగరతీరమును సమీపించెను. ప్రథమమున తాను శిరమువంచి ప్రణామము చేసెను. తీరమున దర్భలను పరచెను. దానిపై ఆసీనుడయ్యెను.

విభీషణుడు రామునివద్దకు రాగానే రావణుడు అతనివెటం గూఢచారులను పంపించెను. వారు కపట వానర రూపములను ధరించిరి. విషములన్నియు గ్రహించిరి. ప్రభుని గుణగణములను. శరణాగతులైప ఆయనకు కులప్రేమను వారు లోలోపల ప్రశంసింపసాగిరి. రాముని స్వాభావమును ప్రేమతో బహిరంగముగనే వారు పొగడమొదలిడినంత తమ కపటమేషములనే వారు మరచిరి. వేగులవారు వచ్చినారని కపులు కనుగొనిరి. వారినందరిని బంధించిరి. కపీశ్వరకునివద్దకు తెచ్చిరి. "వానురులెల్లరు వినుడు. ఈ నిశాచరుల అంగంభంగము కావించి పంపివేయుడు" అని సుగ్రీవుడు ఆనతి ఇచ్చెను. సుగ్రీవుడు పలుకులువిని కవులందరు పరుగెత్తివెళ్ళిరి. గుఢచారులను కట్టిరి. తమ శిభిరమున వారిని త్రిప్పిరి. బహుప్రకారముల కొట్టిరి. గూఢచారులు దీనులై మొరపెట్టుకొనిరి. కాని వానరులు వారిని విడువలేదు. తుదకు "మా ముక్కు చెవులు కోసినచో కోసలాధీసునిపై ఆన!" అని ఆ కొటికాండ్రు అఱచిరి. ఆ అరుపులు విని లక్ష్మణుడు వారినందరను తనవద్దకు పిలిపించినాడు. అతనికి దయ కలిగినది. నవ్వుచు అతడు వారిని విడిపించెను.

"రావణునిచేతికి ఈ లేఖను ఇచ్చి -ఓరీ కులఘాతుకుడా, నా సందేశమును చదువుకొమ్ము అని చెప్పితిననుడు. రాముని సందర్శించి సీతను సమర్పించుము లేనిచో నీకాలము దాపురించినది. అని ఈ నాఉదారసందేశమును ఆ మూర్ఖునకు స్వయముగా చెప్పడు" అని లక్ష్మణుడు నుడివెను.

లక్ష్మణునిపాదములపై తమ శిరములుంచి రాముని గుణాగాథలను వర్ణించుచు గూఢాచారులు శీఘ్రమే చనిరి. రాముని కీర్తిని పొగడుకొనుచువారు లంకను చేరిరి. రావణుని పాదములకు తమ శిరములతో మ్రొక్కిరి. దశాననుడు నవ్వి.

"శుకా, నీ కుశలము చెప్పవేమి! విభీషణునివిషయ మెట్లున్నది.? వానికి చావు దగ్గర పడినదిలే. ఆ మూర్ఖుడు రాజ్యముచేయ లంకనే త్యజించినాడు. అభాగ్యుడు. బియ్యములోని పురుగువలె పిండి అగునులె. ఆ వానరభల్లూకసేనలు ఎట్లున్నవి? కఠిన కాలప్రేరణచే అవి వచ్చినవి. మృదుచిత్తుడగు సముద్రుడు-పాపము-వారి ప్రాణరక్షకుడైనాడు. మరి - నేననిన తమ హృదయములలో అత్యంత భీతిచెందు ఆ తాపసుల విషయము తెలుపుము. వారిని కలసికొంటివా? లేకా నా సత్కీర్తి చెవుల పడగానే వారు పలాయనమైనారా? రిపుదళబలమునుగురించి పలుకవేమి? అతి చకితుడవై ఉన్నావేమి?" అని అతడు ప్రశ్నించినాడు.

"నాథా, కృపతో ఎట్లు ప్రశ్నించితివో అట్లే క్రోధమువిడిచి నేను చెప్పునది ఆలింపుము. మన్నింపుము. నీ అనుజుడు రామునివద్దకువెడలి అతనిని కలసెనో. లేదో వెంటనే రాముడు అతనిని రాజ్యాభిషిక్తుని కావించెను.

మేము రావణుని దూతలమనివిని వానరులు మమ్ములను బంధించిరి, నానా దుఃఖములను కలుగచేసిరి. మా ముక్కు చెవులను కోయ మొదలిడిరి. "రామునిపై ఆన"అని మేమంటిమి. వారు విడచిరి.

ప్రభూ. రాముని సేనలనుగురించి ప్రశ్నించితివి. శతకోటినోళ్ళతోనైనను వానిని వర్ణింప తరముకాదు. వికటాననులు. విశాలకాయులు. భయంకరులు, అనేక వర్ణములుకల భల్లూక వానరసేనలు ఉన్నవి.

నీ నగరమును తగులబెట్టి, నీకుమానిచంపిన ఆ వానరునిశక్తి ఆ సేనయందు అతిస్వల్పము. అనేక పేర్లు కలిగిన కఠిన, భయంకరరూపులు అగు భటులు అసేనలో కలరు. అమిత గజబలులు, విపుల విశాలబలులు ఉన్నారు.

ద్వివిదుడు, మయందుడు, నీలుడు, నలుడు, అంగదుడు, గదుడు, వికటాస్యుడు. దధిముఖుడు. కేసరి, నిశఠుడు, శఠుడు. జాంబవంతుడు, అందరు బలరాసులు! ఈ కపులెల్లరు. సుగ్రీవునితో సమానబలులే. ఇట్టివారు కోట్ల కొలది కలరు! వారిని లెక్కింప ఎవరితరము? రామునికృపచే వారికి అనన్యబలమున్నది. ముల్లోకములను వారు గడ్డి పరకతో సమానముగా చూతురు. దశకంధరా. పదునెనిమిదిపద్మముల వానరయోధులున్నారట! నా చెవులార వింటిని! యుద్ధములో నిన్ను జయించలేని వానరుడు ఒక్క డటైను ఆ సేనలో లేడు. అందరు క్రోధులై చేతులు కొట్టుకొనుచున్నారు. కాని రఘునాథుడు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు.

"ఈ సముద్రమును -దీనిలోని చేపలతో, పాములతో సహా ఎండించివేతుము, లేనిచో పెద్ద పెద్ద పర్వతములతో దీనిని పూడ్చివేతుము. రావణుని పిండిపిండిచేసి మట్టిలో కలిపివేతుము" అని వానరులందరి అనుచున్నారు. వారందరు సహజసాహసులే!లంకనంతటిని మ్రింగివేయుదురో అన్నట్లు బెదరించుచున్నారు. వారు!

వానరులు, భల్లూకములు, సహజశూరులు, పైగా వారిపై రామప్రభువు కలడు రావణా, కోటిమంది కాలులనైనను వారు జయింపగలరు.

శత సహస్ర శేషులైననురాముని తేజమును, బలమును, బుద్ధివిశేషమును వర్ణింపజాలరు. ఒకేఒక్క బాణముచే ఆతడు శతసాగరమును ఎండింపగలడు నీతి నిపుణుడు కనుక ఆతడు నీ తమ్ముని అభిప్రాయమును తెలసికొనివాడు. అతని మాటలువిని దయాళుడగు రాముడు సముద్రుని త్రోవ ఇమ్మని కోరుచున్నాడు."

ఆ మాటలువిని దశకంఠుడు నవ్వినాడు. "అతని తెలివి అంతంత మాత్రము కనుకనే కోతుల మూకతో సఖ్యముచేసికొన్మాడు. సహజ భీరుడగు విభీషణుని ఉపదేశమునమ్మి ఆ రాముడు సముద్రమును బ్రతిమాలుచున్నాడు! మూఢుడా, అతని మహిమను గురించి ఏలరా ఈ అసత్య ప్రలాపములు? శత్రువులబుద్ధి బలముల లోతును తెలిసకొంటిని. సరే విభీషణుని వంటి పిరికివాడు మంత్రియైన వానికి జగత్తున విజయము, ఐశ్వర్యము ఎక్కడివి?" అని అతడు నుడివినాడు.

ఆ ఖలుని వచనములు విని గూఢచారికి క్రోధము కలిగినది. సమయము చిక్కి నదని తలచి అతడు తన వద్దఉన్న లేఖను తీసెను. "ప్రభూ, రామానుజుడు ఇచ్చిన పత్రమిది. దానిని చదివి హృదయమున శాంతి చేకూర్చికొనుము" అని దానిని ఇచ్చెను. రావణుడు నవ్వెను. ఎడమచేత దానిని తీసికొనెను. మంత్రిని పిలిపించి చదివించుకొనసాగెను. "మూర్ఖుడా, కేవలము మాటలతోనే సంతోషించి నీ కులమును నాశనము కావింపకుము. రామునితో విరోధము పెట్టుకొని నీవు విష్ణు, బ్రహ్మ మహేశ్వరులను శరణువేడినను వారు నిన్ను రక్షింపలేరు. గర్వమును విడచి, నీ తమ్మునివలె నీవును రామచరణ పంకజ భ్రమరము కమ్ము. లేనిచే ఖలుడా, రాముని శరానలములో నీవు. నీ వంశము మిడుతలవలె ఆహుతి అగుదురు." అని ఆ లేఖ.

దానిని వినగానే దశగ్రీవుడు మనస్సున భయభీతి చెందెను. కాని పైకి నవ్వుచు, అందరు వినునట్లు "నేలపైపడి ఒకడు చేతితో ఆకాశమును పట్టుకొనవలెను ప్రయత్నముచ చేసినట్లున్నది. ఈ బాల తాపసుని వాగ్విలాసము!" అని పలికెను.

"నాథా, నీ అభిమాన ప్రకృతిని విడచిపెట్టుము. లేఖలోనివిషయమంతయు సత్యమని తెలిసికొనుము. క్రోధము విడువుము నా మాటలు వినుము. రామునియందు విరోధము మానుము.

అఖిలలోక ప్రభువైనను రఘువీరుడు అతికోమల స్వభావుడు. అతనిని నీవు కలసికొన్న వెంటనే నీపై అతడు కృపచూపును నీ అపరాధములను తన మనస్సులోఉంచుకొనుడు. జానకి రఘునాథునికి తిరిగి సమర్పించుము. ఇంతవరకైనను నా మాట వినుము!" అని శుకుడు నుడివెను.

"వైదేహిని రాముని అర్పించు"మను పలుకులు తన చెవుల పడెనోలేదో ఆ దుష్టుడు రావణుడు కాలితో శుకుని తన్నెను. శుకుడు రావణుని చరణములకు మ్రొక్కి కృపాసముద్రుడగు రఘునాయకుడు ఉన్నచోటికి వెడలెను. రఘునాయకునికి ప్రణామము చేసెను. తన కథను వినిపించెను. రాముని కృపచే తన పూర్వ గతిని పొందెను.

భవానీ, శుకుడు పూర్వము జ్ఞానిఅగు ముని ఆగస్త్యఋషియొక్క శాపము వలన అతడు రాక్షసుడయ్యెను. అనేక పర్యాయములు రాముని పాదములకు వందనము చేసి ఆ ముని తన ఆశ్రమమునకు చనెను.

మూడు దినములు గడచినవి. జడుడగు సముద్రుడు రాముని వినయమును మన్నించ లేదు.

"భయము కలిగించనిదే మైత్రి ఉండదు. లక్ష్మణా, బాణశరాశనములను తెమ్ము. వారిధిని నా అగ్నిభాణముచే ఎండింతును. మూర్ఖునివద్ద వినయము కుటిలు నితో స్నేహము, సహజ కుత్సితునివద్ద మహానీతి బోధలు, స్వార్థ పరునివద్ద జ్ఞానమును గురించి ప్రసంగములు అతిలోభివద్ద వైరాగ్యమును గురించిన ప్రవచనములు క్రోధివద్ద మనస్సును స్వాధీనము చేయుటనుగూర్చి ఉపన్యాసములు కామివద్ద హరికథా సంభాషణలు . ఇవి అన్నియు ఊసరక్షేత్రములో విత్తనములు చల్లుట వంటివే" అని నుడివి రఘుపతి ధనువును ఎక్కు పెట్టెను. ఈ చర్య లక్ష్మణుని మనస్సునకు రుచించెను. ప్రభువు భయానకమగు అగ్నిబాణము సంధించినాడు. దానితో జలధియొక్క హృదయాంతరాళము నుండి అగ్నిజ్వాలలు బయలు వెడలినవి. మరక, ఉరగ, ఝుష, గణములు వ్యాకులత చెందినవి. తనలోని జంతు జాలములు దహింపబడు చున్నవని. జలనిధికి తెలసినది. వెంటనే ఒక బంగారు పళ్ళెరములో నానావిధమణులను నింపి, గర్వము త్యజించి బ్రాహ్మణరూపమును ధరించి అతడు బయలుదేరి ఏతెంచెను.

గరుడా, వినుము. ఎన్నివిధముల నీరుపెట్టు తడిపినను సరే అరటిచెట్టు కత్తిరించిన తర్వాతనే ఫలించును. నీచులు వినయముచే లొంగరు. బెదరింపులతోనే వారు దారికి వత్తురు.

సముద్రుడు భయభీతుడయ్యెను. ప్రభుని పాదములను వట్టెను." ప్రభూ, నా దోషము లన్నిటిని మన్నించుము. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి-వీనికి స్వభావముచే చైతన్యములేదు. నీ ప్రేరణచే సృష్టికొరకై మాయ వీనిని ఉత్పన్నము చేసినదని సకల గ్రంథములు ఘోషించుచున్నవి. ఏకార్యము కొరకై ప్రభువు ఏ ఆజ్ఞ ఇచ్చునో ఆ ప్రకారము జీవించుటలోనే వీనికి సుఖము కలుగును. ప్రభువు నాకు బుద్ధిచెప్పి మంచిపని చేసినాడు. జీవుల స్వభావము సహితము నీ సృష్టియేకదా! డోలు, మూర్ఖుడు, క్షుద్రుడు, పశువు, స్త్రీ, ఇవి అన్నియు దండనకు తగినవి.

ప్రభుని ప్రతాపముచే నేను ఎండిపోదును. సేనలు దాటిపోగలవు. దీనిలో నా మహిమ ఏమియులేదు. ప్రభుని ఆజ్ఞ అనుల్లంఘనీయము. శ్రుతులు అట్లు నుడువుచున్నవి. నీకు ఏది ఆనందమ నిచ్చునో శీఘ్రమే దానినే నేను ఆచరింతును.",

సముద్రుని అతివినయ వచనములను విని కృపాళుడు చిరునవ్వునవ్వి, "తండ్రీ, వానరసేన నిన్ను దాటకలుగు ఉపాయమును నీవే తెలుపుము" అని కోరెను.

"నీలుడు నలుడు అను ఇరువురు కపి సోదరులు కలరు. ప్రభూ, బాల్యమున వారు ఒక ఋషియొక్క ఆశీర్వాదమును పొందిరి. వారు స్పృశించిన మాత్రముననే బరువగు గిరులు సహితము, నీ ప్రతాపమున జలధిపై తేలియాడును. నేనును ప్రభుని ప్రతాపమును నా మనమున ధరించి నా శక్త్యానుసారము సహాయము చేతును. ఇట్లు సముద్రమును బంధింపుము. నీ సత్కీర్తి ముల్లోకములలో కీర్తింపబడును.

నీ ఈ బాణమునే నా ఉత్తర తీరమున నివసించుచున్న పాపరాసులగు దుర్జనులను హతమార్చుము." అని సముద్రుడు నుడివెను.

కృపాళుడు రణధీరుడుఅగు రాముడు సాగరుని మనస్సునందలి బాధనువిని ఆ దుష్టులను సంహరించెను.

రాముని అమోఘ బల, పౌరుషములను కనుగొని సాగరుడు సంతసించెను. ఆ దుర్మార్గులచరిత్ర అంతయు ప్రభునికి నివేదించెను. రాముని చరణములకు వందన మొనర్చి పయోనిధి నిజభవనమునకు చనియెను. సాగరుని సూచన మంచిదని రాముడు తలచెను.

ఈ చరిత, కలి దోషాపహారి - తులసీదాసు దీనిని తన శక్తిననుసరించి గానము చేసినాడు.

రఘుపతియొక్క గుణగణములు సుఖనిలయములు, సంశయ వినాశకరములు. విషాద నిర్మూలకములు.

మూర్ఖబుద్ధీ, ప్రాపంచిక ఆశలను మనోరథములను అన్నిటిని త్యజించుము. సంతతము రఘవరుని గుణగణములనే గానము చేయుము. శ్రవణము చేయుము.

రఘునాయకుని గుణగానము సకళమంగళప్రదము. సాదరముగా దీనిని వినువారు ఎట్టి నావయొక్క సహాయము లేకనే భవసారమును తరింతురు.

Sri Ramacharitha    Chapters