Sri Ramacharitha    Chapters   

చతుర్థ సోపానము

కిష్కింధాకాండము

మల్లెపూవువలె, నీలకమలమువలె నుందరులు, అతిబలులు, విజ్ఞానధాములు, శోభాఢ్యులు, వరధనుర్ధారులు, వేదసన్నుతులు, గోబ్రాహ్మణప్రియులు, మాయామానుషరూపధారులై, సద్ధర్మకవచ స్వరూపులై, లోకహితులై, పీతాన్వేషణ తత్పరులై పథికులైన, రామలక్ష్మణు లిరువురు మాకు భక్తిని ప్రసాదింతురుగాక !

వేదములనబడు జలధిలో జనించి, సర్వ కలికలుష విధ్వంసకరమై, అవ్యయమై, శ్రీశంభుని సుందర, వరముఖ చందురునియందు సర్వదా సుశోభితమై భవరోగమునకు ఔషధమై, సుఖరమై, శ్రీ జానకీ జీవన స్వరూపమైన శ్రీ రామనామా మృతమును సతతము గ్రోలువారై ధన్యులు, వారే పుణ్యాత్యులు.

భవానీ--శంభుల నివాసస్థలము, ముక్తికి జన్మభూమి, జ్ఞానమునకు గని, పాప వినాశని--కాశీ అని తెలిసియు దానిని ఏల సేవించరయ్యా?

భయంకరమగు హాలాహల గరళముచే దేవతలెల్లరు మ్రగ్గిపోవుచుండగా-- ఆ విషమును తానే స్వయముగా పానముచేసిన -- శంకరుని -- ఏల భజింపవుమందబుద్ధీ? ఆతనివంటికృపాళు డెవడున్నాడు?

రఘునాథుడు ముందుకు పయనము సాగించెను, ఋష్యమూక పర్వతమును సమీపించెను, సచివసహితుడై సుగ్రీవుడు అచ్చట నివసించుచుండెను. అనన్యబల నిలయులగు రామలక్ష్మణుల రాకను కనుగొని సుగ్రీవుడు అతి భయభీతుడయ్యెను.

''హనుమా - వినుము - బలరూపనిధులు ఆ వచ్చుచున్న ఇరువురు పురుషులు, వటురూపమును ధరించి నీవువెడలి, వారిని కలసికొనుము. వారి యథార్థ విషయము తెలిసికొనుము. సంజ్ఞలతో నాకు తెలియచేయుము. మలిన మానసుడగు వాలియే వారియే వారిని పంపిఉన్నచో వెంటనే నేను ఈ పర్వతమునువదలి పారిపోదును.'' అని హనుమంతునితో అతడు చెప్పెను.

విప్రరూపమును ధరించి కపి వెడలెను. శిరమువంచుకొని రామలక్ష్మణులను ఇట్లు ప్రశ్నించెను:-

''క్షత్రియ రూపమున వనమున చరించు వీరులారా, శ్యామల గౌరశరీరులు మీ రెవ్వరు? కఠినమగు నేలపై కోమలమగు పాదములతో తిరిగాడు మీరు ఏల ఇట్లు, వనచరులైతిరి, స్వాములారా, మనోహరులు సుందర, కోమలశరీరులు, మీరు వనమునదుస్సహ - వాతాతపములను సహించుచున్నారేల? త్రిమూర్తులలోని వారామీరు? లేక నరనారాయణులా మీరిరువురు? లేక ధరణీభారమును హరించుటకు, భవసాగరము నుండి మనుజులను తరింపచేయుటకు మనుజావతారమును ధరించిన అఖిల భువనపతులా?''

అంతట రాము డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను:-

''కోసలేశుడగు దశరథుని కుమారులము మేము. తండ్రి ఆజ్ఞను తలదాల్చివనములకు వచ్చితిమి. రామలక్ష్యణులని మాపేర్లు. మేము అన్నదమ్ములము. సుకుమారియు, సుందరియు, అగు ఒకనారి మావెంట ఉన్నది. ఈ అడవిలో నిశాచరుడు వైదేహిని హరించెను. ఆమెను వేదకుచు, విప్రోత్తమా, తిరుగుచున్నాము. మా చరిత్రను తెలిపితిమి - నీ చరిత్రను వివరముగా తెలియచేయుము.''

ప్రభుని హనుమంతుడు గుర్తించెను. స్వామి పాదములపై అతడు వ్రాలెను. ఆ చరణములను గ్రహించెను.

''ఉమా, ఆ ఆనందము వర్ణింప నలవికానిది. హనుమ పులకిత శరీరుడయ్యెను. ప్రభుని సుందర వేషమును అతడు తిలకించెను. అతని నోట మాటవచ్చుట లేదు. ధైర్యముపూని ఆతడు ప్రభుని స్తుతించెను. తన స్వామిని కనుగొనుటచే అతని హృదయము ఆనందభరితమయ్యెను.'' ''ప్రభూ, నేను ప్రశ్నించుట న్యాయమే. కాని మనుష్యునివలె అహో?! నన్ను నీవెట్లు ప్రశ్నించుచున్నావు? నీ మాయావశుడనై, తండ్రీ, నిన్ను నేను గుర్తించలేనైతిని. మందుడను. మోహవశుడను. కుటిల హృదయుడను నేను. అజ్ఞానిని. కాని, ప్రభూ. దీనబంధూ, భగవానుడా, నీవును నన్ను మరచితివే! నా యందు ఎన్నియో దుర్గుణములుండవచ్చును. ఐనను స్వామి నన్ను మరువరాదు. నాథా, జీవుడు నీ మాయచే మోహితుడగును. నీ కృపచేతనే ముక్తిని పొందును. ఇంతేకాక రఘువీరా, నీపై శపథముచేసి చెప్పుచున్నాను. భజన సాధనము నా కేమియు తెలియదు. స్వామిపై సేవకుడు, తల్లిపై తనయుడు, భారమును ఉంచి నిశ్చింతగా ఉందురు. సేవకునికి ప్రభువే అండ'' అని ఇట్లుపలికి హనుమంతుడు వ్యాకులుడై వెంటనే రాముని చరణములపై పడెను. తన నిజరూపమును ప్రకటించెను. అతని హృదయము ప్రేమ సంభరితమయ్యెను. రఘుపతి ఆతనిని లేననెత్తి తన హృదయమునకు హత్తుకొనెను. భాష్పజలముతో మారుతి శరీరమును ముంచివైచి అతనిని శాంతపరచెను.

R-26

''కపీ, నీ మనస్సున గ్లాని పొందకుము. లక్ష్మణుని కంటె నీయందు నాకు ద్విగుణీకృత ప్రేమ. నేను సమదర్శినని ఎల్లరు నుడువుదురు. కాని, సేవకుడే కడు ప్రియుడు నాకు, నా సేవకునికి వేరుగతి లేదు!'' హనుమంతా, ''చరా చర జగమంతయు నా స్వామి అగు భగవానుని రూపమే - నే నాతని సేవకుడను అను అచంచల బుద్ధికలిగినవాడే నా అనన్యభక్తుడు'' అని రాముడు వచించెను.

ప్రభువు ప్రసన్నుడైనాడని పవనసుతుడు కనుగొనెను. హృదయమున అతడు కడు సంతసించెను. ఆతని దుఃఖములన్నియు దూరమయ్యెను.

''నాథా, ఈ కొండపై కపిపతి సుగ్రీవుడు ఉన్నాడు. అతడు నీ దాసుడు. అతనితో మైత్రి కావింపుము. దీనుడగు ఆతనికి అభయమిమ్ము. కోట్లాది వానరులను అన్నిదిశలకు పంపి అతడు సీతాన్వేషణ చేయించును.'' అని వృత్తాంతమంతయు ఇట్లు వివరించి మారుతి ఇరువురు సోదరులను తనవీపుపై ఎక్కించుకొని తీసికొని వెడలెను.

సుగ్రీవుడు రాముని వీక్షించి తన జన్మ అత్యంత ధన్యమయ్యెనని తలచెను. రాముని చరణములపై తన తలవాల్చి సాదరముగా అతడు మ్రొక్కెను. అనుజసహితుడై రఘునాథుడు సుగ్రీవుని కౌగలించుకొనెను. ''ఓయీ, భగవంతుడా నాపై కరుణింతురా వీరు?'' అని సుగ్రీవుడు అనుకొనెను.

అంతట ఇరుపక్షముల చరిత్రను సర్వము హనుమంతుడు వివరించెను. అగ్ని సాక్షిగా అతడు వారికి దృఢమైత్రి కావించెను. హృదయపూర్వకముగా మైత్రి కుదిరినది. వారి హృదయములయందు ఏ అరమరయు లేదు. రామచరితము సర్వము లక్ష్మణుడు వివరించెను. సుగ్రీవుని కన్నులు నీరు క్రమ్మెను. ''నాథా, మిథిలేశకుమారి లభించును. ఒకనాడు మంత్రులతో నేను ఇక్కడ కూర్చుండి ఏదో యోచించుచుంటిని. శత్రువశమున ఉండి కడువిలపించుచు గగన మార్గమున తీసికొని పోవబడుచున్న ఆమెను చూచితిని. ''రామా, రామా, హా రామా'' అని ఆమె కేకలు వేయుచూ ఒక వస్త్రమును క్రింద పడవైచినది. అని అతడు నుడివెను. ''ఏది ఆ వస్త్రమని'' రాము డడిగెను. సుగ్రీవుడు దానిని తెచ్చెను. రాముడు దానిని తన హృదయమునకు హత్తుకొని విచారింపసాగెను.

''రఘువీరా, వినుము. విచారము విడువుము. మనస్సున ధైర్యముపూనుము.

జానకి తిరిగి నిన్ను కలియునట్లు అన్నివిధములసేవ నీకు చేయుదును'' అని సుగ్రీవుడు నుడివెను. కృపాపింధువు, ఆనన్యబలుడు, రాఘువుడు సఖుని పలుకులువిని, సంతపించెను.

''సుగ్రీవా, నీవు వనమున ఉండుటకు కారణమేమో తెలుపుము'' అని ప్రభువు ప్రశ్నించెను.

''నాథా, వాలియు నేనును ఇరువురము అన్నదమ్ములము. మా ప్రేమ వర్ణనాతీతము. ప్రభూ, మయుడను రాక్షసుని పుత్రుడు మయావి అను పేరుగలవాడు మా గ్రామమునకు ఒకసారి వచ్చెను. అది అర్ధరాత్రి, పురద్వారము వద్దకువచ్చి వాడు కేకలు వేయ సాగినాడు. శత్రు బలమును వాలి సహింపలేక పరుగిడి వెళ్లినాడు. వాలినిచూచి మాయావి పారిపోయినాడు. మా అన్నవెంటనే నేనును ఉంటిని. మాయావి ఒక గుహలోదూరెను. ''ఒక పక్షము దినములవరకు నా రాకకై నిరీక్షింపుము. అంతకూ నేను రానిచో నేను సంహరింపబడితిననియే తలచుము'' అని వాలి నాతో చెప్పెను. నెల దినములవరకు, ఖరారీ, నేను అక్కడే ఉంటిని. గుహనుండి విపరీతమగు రక్తధారలు బయటకు ప్రవహించినవి. '' ఆ రాక్షుసుడు వాలిని చంపివైచెను. ఇక వచ్చినన్నును చంపునని'' నేను అనుకొంటిని. గుహద్వారమువద్ద ఒక రాతినిపెట్టి నేను పారిపోతిని. పాలకుడులేని పురమునుచూచి మంత్రులు బలవంతముగా నన్ను రాజును చేసిరి, ఇంతలో ఆ రాక్షసునిచంపి వాలి ఇంటికి వచ్చెను, సింహాసనముపై ఉన్న నన్నుచూచెను. హృదయమున నాపై కక్షకట్టెను. విరోధినివలె నన్ను ఘోరముగా కొట్టెను, నా సర్వస్వమును, స్త్రీనికూడా హరించెను, కృపాళూ, రఘువీరా, వాలి యందలి భయముచే వ్యాకులముతో నేను భువనమంతయు తిరుగాడితిని. శాపమువలన అతడు ఈ ప్రదేశమునకు రాడు. ఐనను భయముతో నేను ఇక్కడ ఉన్నాను.'' అని సుగ్రీవుడు వివరించెను.

భక్తుని దుఃఖమును విని దీనదయాళుని విశాల భుజములు రెండును కంపించెను.

''ఇదిగో సుగ్రీవా, వినుము. ఒకేఒక బాణముతో నేను వాలిని సంహరింతును. బ్రహ్మరుద్రులను శరణుచొచ్చినను వాని ప్రాణములు దక్కవు. మిత్రుని దుఃఖము వలన తాను దుఃఖితుడు కాని వానిని చూచిన నే పాపము. తమ దుఃఖములను పర్వతములవంటి వానిని సైతము రజోకణమువలెను. మిత్రుని దుఃఖము ధూళివంటిదైనను మేరు సమానముగా ఎంచవలెను. అట్టి సహజ ప్రకృతిలేని మూర్ఖులు అందరితో మైత్రిచేయగలమని వృథాగాభావింతురు. చెడ్డదారినుండి తన అనుచరువి తప్పించి మంచి దారిని నడపించుట మిత్రుని ధర్మము. మిత్రుని సద్గుణములను ప్రకటించి, దుర్గుణములను గోప్యముగా ఉంచుట. ఇచ్చి పుచ్చుకొనుటలో శంకలు లేకుండట, తన శక్తినను సరించి మిత్రునికి సదా హితముచేయుట, విపత్తికాలమున స్నేహితుని నూరురెట్లు అధికముగా ప్రేమించుట-ఇవి శ్రేష్ఠుడగు స్నేహితుని లక్షణములని శ్రుతులు వచించుచున్నవి.

ఎదుట ఉన్నప్పుడు మృదువచనములు, వెనుక ఉన్నప్పుడు అహిత వచనములు పలికి, మనస్సులో కుటిలత కలవానిని, పామువలె వంకర నడకవానిని, వక్రబుద్ధి, దుష్టుడుఅగు మిత్రుని త్యజించుటయే మేలు.

మూర్ఖుడగు సేవకుడు, లోభిఅగు రాజు, కులటఅగు స్త్రీ, కపటిఅగు మిత్రుడు- ఈ నలుగురు శూలసములు, సఖా, చింత విడువుము. నన్ను నమ్ముము. సర్వవిధముల నీ కార్యసాధనలో నా శక్తికొలది సాయము చేతును'' అని రాముడు నుడివెను,

''రఘువీరా. ఆలకింపుము, వాలి మహాబలుడు. అతి రణధీరుడు,'' అని సుగ్రీవుడు పలికి దుందుభియొక్క ఎముకలను, తాడి చెట్లను రామునికి చూపించెను. రఘునాథుడు వానిని అవలీలగా కూలద్రోసెను. రఘువరుని అమితబలమును కనుగొని సుగ్రీవుని ఆనందము ఇనుమడించెను. ''వాలిని ఈతడు తప్పక సంహరించగలడ''ను విశ్వాసము అతనికి కలిగెను. పదేపదే అతడు రాముని పాదములకు శిరమువంచి నమస్కరించెను. ప్రభుని గుర్తించి కపీశుని హృదయము సంతసించెను. సుగ్రీవునికి జ్ఞానోదయమైనది. ''నాథా, నీ కృపవలన నా మనస్సు కుదుటపడినది. సుఖము. సంపద, సంసారము, దర్పము, అన్నిటిని విడిచి నీ సేవనే చేతును. ఇవి అన్నియు రామభక్తికి విరోధులని నీ చరణారాధకులు వచింతురు. జగత్తున ఉన్న ఈ శత్రులు, మిత్రులు, సుఖము, దుఃఖము, అన్నియు మాయాకృతములు, వాస్తవములు కావు. వాలి నా పరమహితకారి అయ్యెను. ఆతని ప్రసాదమువలననే, రామా, విషాద విచ్చేదకుడవు నీవు నన్ను కలిసికొంటివి. కలలో ఒకనితొ పోరాడి. మెలకువ వచ్చిన తర్వాత ఎందుకు కలలోనైనను వానితో పోరితినా అని సిగ్గు కలుగును.

ప్రభూ, సర్వసంగములను త్యజించి, రేయింబవళ్లు, నీ భజన చేయునట్లు ఇక నన్ను అనుగ్రహింపుము.'' అని సుగ్రీవుడు వేడెను. సుగ్రీవుని వైరాగ్య సంయుతములగు వచనములను విని ధనుష్పాణిఅగు రాముడు చిరునవ్వునవ్వెను. ''నీవు చెప్పిన దంతయు సత్యము. కాని సఖా, నా వచనములు మిథ్య కానేరవు'' అనెను.

గరుడా. ''నటుడు కోతిని అడించినట్లు రాముడు ఎల్లరను ఆడించును'' అని వేదవచనము.

పిదప సుగ్రీవుని వెంటతీసికొని, చాప బాణములను చేతధరించి రఘునాథుడు బయలుదేరెను.

రఘుపతి వాలివద్దకు సుగ్రీవుని పంపెను.

రామునియొక్క శక్తిచూచుకొని సుగ్రీవుడు వాలివద్దకు వెడలి గర్జించెను. ఆ గర్జన విని వాలి క్రోధాతురుడై బయలుదేరెను. అతని భార్య అతని చరణములను పట్టుకొన్నది. ''నాథా, వినుము. సుగ్రీవుడు సఖ్యము చేసికొనిన ఆ ఇద్దరు అన్నదమ్ములు పరాక్రమమునకు అవధులు, తేజోవంతులు, కోసలేశుని కుమారులు, రామలక్ష్మణులు. యుద్ధమున కాలుని సహితము జయింపగలరు.'' అని హెచ్చరించినది.

''భీరురాలా, ప్రియా, రఘునాథుడు సమదర్శి ఒక వేళ ఆతడు న్ను సంహరించినచో నేను సనాథుడనైనట్లే'' అని నుడివి మహా అభిమానిఅగు వాలి సుగ్రీవుని ఒక గడ్డిపరకగా ఎంచి వెడలెను. వాలి సుగ్రీవులు తలపడిరి.

సుగ్రీవునిపై వాలి తటాలున ఉరికెను. అతనిని గట్టిగా గ్రుద్దెను. మహాధ్వనితో గర్జించెను. సుగ్రీవుడు వ్యాకులుడై కాలికి బుద్ధిచెప్పెను. వాలియొక్క ముష్టిప్రహారములు అతనికి వజ్రపాతములవలె తగిలినవి.

రాముని వద్దకువచ్చి సుగ్రీవుడు ''నేను చెప్పనే చెప్పితిని. కృపాళూ, రఘువీరా, వాలి నా సోదరుడుకాడు. నా పాలిటి యముడు'' అనెను.

''అన్నదమ్ములు మీరిద్దరు ఒకే రూపమున నున్నారు. ఆ భ్రమచే అతనిని నేను వధింపలేదు.'' అని నుడివి రాముడు సుగ్రీవుని శరీరము తనచేతితో స్పృశించెను. సుగ్రీవుని శరీరము వజ్రతుల్యమయ్యెను. అతని బాధఅంతయు తొలగి పోయెను.

సుగ్రీవుని కంఠమున ఒక పుష్పమాలను రాముడు వేయించెను. అతనికి అనన్యమగు బలమును ప్రసాదించి పంపెను.

సోదరులిద్దరు తిరిగి పలువిధిముల పోరాడిరి. చెట్టుచాటునఉండి రఘునాథుడు తిలకించుచున్నాడు.

ఉపాయములన్నిటిని ఉపయోగించి సుగ్రీవుడు పోరాడెను. కాని భయపడి విరాశ##చెందెను. అంతట రాముడు బాణమును సంధించెను. దానిని వాలి హృదయమున ప్రయోగించెను. బాణము తగిలినది. వాలి వ్యాకులుడై నేలపై రాలెను. ఇంతలో తన ఎదుటఉన్న ప్రభునిచూచి వాలి లేచి కూర్చుండెను. శ్యామ శరీరము, శిరమున జటాజూటము, అరుణనయనములు, కరమున శరము సంధింపబడిన చాపము. మాటి మాటికి రాముని వీక్షించుచు వాలి తన మనస్సును రామచరణములపై లగ్నము చేసినాడు. ప్రభుని గుర్తించినాడు. తన జన్మము కృతకృత్యమయ్యెనని తలచినాడు. అతని హృదయమున భక్తి! వదనమునుండి పరుష వచనములు! రామునివంక చూచుచు ఆతడు "ధర్మరక్షణకై అవతరించినవాడవు! స్వామీ! వేటకానివలె నన్ను వధించితి వేల? నీకు నేను శత్రువును, సుగ్రీవుడు మిత్రుడునా? ప్రభూ, నాలో ఏ దోషమున్నదని నన్ను వధించితివి?'' అని ప్రశ్నించెను.

''మూర్ఖుడా, నినుము. అనుజుని భార్య, చెల్లెలు, కోడలు, కొమరిత ఈ నలుగురు సమానులు, వీరిని పాపదృష్టితో చూచువానిని వధించుటయందు ఏ పాపములేదు. మూఢుడా, అతిశయ అభిమానివై భార్య ఎంత చెప్పినను వినక పెడచెవిని పెట్టితివి. సుగ్రీవుడు నా భుజబలమును ఆశ్రయించినాడని తెలిసియు దురభిమానీ, అధముడా, అతనిని సంహరింప కోరితివి.'' అని రాముడు ప్రత్యుత్తరమిచ్చెను.

''రామా, నీ వద్ద నా చాతుర్యము వ్యర్థము. స్వామీ, అంత్యకాలమున నీ శరణు పొందియు నేను పాపినా ప్రభూ?'' అని వాలి నుడివెను.

వాలియొక్క అతి కోమల వచనములను విని రాముడు వాలి శిరమును తన చేతితో స్పృశించెను. ''నీ తనువును శాశ్వతము కావింతును. ప్రాణమును నిలుపుకొనుము'' అనెను.

''కృపానిధానమా, ఆలకింపుము. అనేకజన్మలలో మునిగణములు నానా రీతులసాధనలను కావింతురు. ఐనను అంత్యకాలమున రామనామము ఉచ్చరింపజాలరు. ఎవని నామబలముచే శంకరుడు కాశీలో ఎల్లరకు ముక్తిని ప్రసాదించునో, అట్టి ప్రభువు స్వయముగా నా కండ్లఎదుట సాక్షాత్కరించినాడు. ఇట్టి అవకాశము తిరిగి ఎన్నడైనను లభించునా?

''నేతి'' ''నేతి'' అని నిరంతరము శ్రుతులు ఎవనిని వర్ణించునో, మనస్సును జయించి, ప్రాణములను బంధించి, ఇంద్రియములను నిరసించి ధ్యానమగ్నులైనమునులకైనను ఎవని సాక్షాత్కారము దుస్సాధ్యమో అట్టి ప్రభుడవు నీవు నేడు స్వయముగా నా ఎదుట ప్రకటమైనావు.

నేను అత్యంత అభిమాన వశుడని గుర్తించి. నన్ను నీ శరీరమును రక్షించుకొను మంటివి. కల్ప వృక్షమును యత్నపూర్వకముగా ఖండించి దానితో తుమ్మచెట్టునకు కంచెవేయు మూర్ఖుడు ఎవ్వడైనా ఉండునా?

ప్రభూ, నాపై కరుణాదృష్టి ప్రసరించుము. నేను కోరు వరమును ప్రసాదించుము. కర్మవశమున ఏ యోనియందు నేను జన్మించినను రామచరణములపై నాకు భక్తి ఉండునట్లు అనుగ్రహింపుము. ప్రభూ, కళ్యాణప్రదా, ఇతడు నా తనయుడు అంగదుడు. వినయమునను, బలమునను, నా అంతవాడు. ఇతనిని స్వీకరింపుము. సుర, నరనాథా, ఇతనిని అనుగ్రహింపుము. నీ దాసునిగా చేసికొనుము'' అని వాలి వేడెను.

తన కంఠమునుండి పూలమాల జారి క్రింద పడిపోవుట ఏనుగునకు తెలియనట్లు రామచరణములయందు భక్తిని దృఢపరచుకొనుచు వాలి తనువును త్యజించెను.

వాలిని రాముడు తన ధామమునకు పంపివైచెను. పురజనులెల్లరు వ్యాకులురై పరుగిడిరి. వాలి భార్యయగు తార అనేక ప్రకారముల విలపించినది. ఆమె కేశములు చిందర వందర అయ్యెను. దేహము దుర్భరమయ్యెను.

తారయొక్క వ్యాకులతను రఘునాథుడు తిలకించి ఆమెకు జ్ఞానమును ప్రసాదించినాడు. ఆమెయొక్క ఆజ్ఞానమును తొలగించినాడు. ''పృథివి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు అను ఈ పంచ తత్త్వములచే సృజింపబడిన ఈ శరీరము అత్యంత అధమమైనది. ఆ శరీరము నీ ఎదుటనే ఉన్నదికదా! జీవుడో, నిత్యుడు. ఇక ఎవరికొరకు నీవు దుఃఖింతువు?'' అని రాముడు తారను ప్రశ్నించినాడు.

తారకు జ్ఞానోదయమయ్యెను. ఆమె రాముని చరణములను పట్టుకొనెను. ''పరమ భక్తిని ప్రసాదించు'' మని రాముని వరము వేడెను.

ఉమా, కొయ్యబొమ్మలనువలె అందరిని రామస్వామి నాట్యమాడించును. అనంతరము రాముడు సుగ్రీవునికి ఆజ్ఞఇచ్చెను. విధిపూర్వకముగా అంత్యక్రియలను వాలికి సుగ్రీవుడు కావించెను.

''నీవు వెడలి సుగ్రీవుని రాజ్యాభిషేకము కావించిరమ్మని'' అనుజునికి రాముడు ఆజ్ఞఇచ్చెను. రఘుపతియొక్క ఆనతిచే అందరు ఆయన చరణములపై శిరములుంచి మ్రొక్కి వెడలిరి.

వెంటనే లక్ష్మణుడు పురజనులను, విప్రులను అందరిని పిలిపించి సమావేశ పరచెను. వారి ఎదుట సుగ్రీవునికి రాజపదవిని, అంగదునకు యువరాజు పదవిని ప్రసాదించెను.

ఉమా, రామునివంటి హితకారి, గురువు, జనకుడు, జనని, సోదురుడు, స్వామి జగత్తున లేడుసుమా. సురలు, నరులు, మునులు, స్వార్థము కొరకై ప్రీతి కావింతురు. ఇది వారిరీతి. రేయింబవళ్ళు వాలియందలి భయముచే వ్యాకులుడై శరీరమంతయు గాయములై, ఆందోళనాగ్నిచే సదా దహింపబడు హృదయముతో ఉన్న సుగ్రీవుని వానర రాజుని కావించినాడు. అత్యంత కరుణాస్వభావుడు రఘువీరుడు! అట్టి వాడని తెలిసియు ఆ ప్రభుని విడనాడువారు విపత్తిజాలమున చిక్కుకొనరా? తిరిగి సుగ్రీవుని పిలిపించి రాముడు బహువిధముల రాజనీతిని అతనికి ఇట్లు ఉపదేశించెను:-

''కపీశ్వరా, సుగ్రీవా, పదునాలుగు సంవత్సరములవరకు నేను పురములలో ప్రవేశించను. గ్రీష్మఋతువు గడచినది. వర్షర్తువు వచ్చినది. ఈ సమీపమునఉన్న పర్వతము మీద నేను నివసింతుడు. అంగదునితో కలసి నీవు రాజ్యము పాలించుము. నా కార్యమును సంతతము నీ హృదయమున గుర్తుంచుకొనుము.''

సుగ్రీవుడు తన భవనమునకు చనెను. ప్రవర్షణగిరిపై రాముడు నివాసముచేయ వెడలెను. ఆ పర్వతమున సుందరమగు ఒక గుహను అంతకుముందే దేవతలు ఏర్పాటుచేసి ఉంచిరి. కృపానిధిఅగు రాముడు కొంతకాలము దానియందు నివసించునని వారికి తెలియును.

రమ్యమగు ఆ వనము పూలతో అతి శోభాయమానముగ ఉన్నది. తేనెయందలి ప్రలోభముచే తేనెటీగల సమూహములు రొద సేయుచున్నవి. ప్రభువు అచటకు చేరగానే అడవిలో సుందరమగు కందమూలములు, ఫలములు, పత్రములు వృద్ధిచెందసాగినవి.

మనోహరము అనుపమముఅగు ఆ శైలమును తిలకించి సురభూపతి అనుజసహితుడై అచ్చట నివసించెను. మధకర, ఖగ, మృగ శరీరములను ధరించి దేవతలు, సిద్దులు, మునులు ప్రభుని సేవించుచుండిరి.

రమాపతి నివాసముచేయ మొదలిడిన నాటినుండియు ఆ వనము మంగళనిలయ మయ్యెను. అత్యంత ఉజ్జ్వలమగు ఒక సుందర, స్ఫటికి మణిశిలపై ఇరువురు సోదరులు సుఖముగా ఒకనాడు ఆసీనులైరి.

భక్తి, వైరాగ్య, రాజనీతి, జ్ఞానములను బోధించు అనేక కథలను రాముడు నుడివెను. వర్షాకాలపు మేఘములు ఆకాశమున విహరించుచు గర్జించుచు, మనోహరముగా ఉన్నవి. రాముడు అనుజునితో ఇట్లు పలికెను:-''లక్ష్మణా, అవిగో కనుగొనుము, వైరాగ్యరహితుడగు గృహస్థుడు విష్ణుభక్తునిచూచి నాట్యమాడునట్లు, ఆనెమళ్లగుంపు మేఘములను కాంచి నాట్యముచేయుచున్నవి. కారుమబ్బులు నభమున దట్టముగ వ్యాపించి ఘోరమగు గర్జనచేయుచున్నవి. ప్రియా విహీనుడనగు నా మనస్సు భయము చెందుచున్నది. దుష్టునియొక్క ప్రేమ స్థిరముగా ఉండనట్లు మెఱపులతళుకు మబ్బులలో నిలచుటలేదు.

పండితులు విద్యను ఆర్జించి నమ్రులగునట్లు మేఘములు భూమిని సమీపించివర్షించుచున్నవి.

దుష్టుని దుర్భాషలు సజ్జనులు సహించునట్లు పర్వతములు వానదెబ్బను సహించుచున్నవి. అల్పధనము అబ్బినంతనే దుష్టులవలె చిన్ననదులుపొంగి గట్లు త్రెంచుకొనుచున్నవి.

శుదజీవులను మాయ ఆవరించునట్లు భూమిపై పడగానే నీరు కల్మషమై పోవుచున్నది.

సద్గుణములు సజ్జనునివద్దకు చేరునట్లు చుట్టుప్రక్కలనుండి నీరు చెరువులనుచేరి వానిని నింపివైచినది. శ్రీహరిని చేరిన జీవులవలె నదీజలము జలనిధినిచేరి స్థిరనివాసము చేయుచున్నది.

పాషండ మత ప్రచారముచే స్రద్గంథములు మఱుగుపడినట్లు, భూమిఅంతయు గడ్డిచే ఆవరింపబడి పచ్చనై దారి కనుపించుటలేదు.

వటు సముదాయపు వేదపఠనమో అన్నట్లు నాలుగు దెసలను కప్పల బెకబెక ధ్వని మనోహరముగా ఉన్నది. వివేకము సంప్రాప్తించిన సాధుకుని మనస్సువలె అనేక వృక్షములు నవపల్లవములను తాల్చినవి.

సురాజ్యములో ఖలుల ఉద్యమము నేలరాలునట్లు జిల్లేడు, బ్రహ్మదండి మొక్కల ఆకులు రాలిపోయినవి. క్రోధమున్నచోట ధర్మము ఉండనట్లు ఎచ్చట వెదకినను ధూళి కనుపించుటలేదు.

ఉపకారము చేయువారి సంపత్తివలె పృథ్విసస్య పంపన్నయై శోభిల్లుచున్నది. దాంభిక జనసమాజమువలె రాత్రివేళ గాఢంధకారమున మిణుగురు పురుగులు వెలుగుచున్నవి.

స్వతంత్రురాలగు స్త్రీ భ్రష్టురాలై పోవునట్లు భరింపరాని వర్షముచే పొలముల గట్లు తెగిపోయినవి. విద్వాంసులు మోహ, మద, మానములను త్యజించునట్లు నిపుణులగు కృషీవలులు పొలములనుండి కలుపుగడ్డిని తీసి పారవేయుచున్నారు.

కలియుగము ప్రవేశించగానే ధర్మము పారిపోవునట్లు చక్రవాకపక్షి అదృశ్యమైపోయినది. హరిభక్తుల హృదయములలో కామము ఉత్పన్నము కానట్లు ఊసరక్షేత్రములలో గడ్డిమొలుచుటలేదు.

సురాజ్యమును పొంది ప్రజలు వృద్ధిపొందునట్లు పృథ్వి వివిధ జంతుజాలముచే విరాజిల్లు చున్నది. జ్ఞానోదయమైన పిదప ఇంద్రియములవలె అక్కడక్కడ బాటసారులు అలసి నిలచినారు.

కుపుత్రుని జననమువలన ఉత్తమ కులధర్మములన్నియు నశించునట్లు అక్కడక్కడ గాలి వేగముగావీచి మేఘములు ఎక్కడివక్కడ మాయమగుచున్నవి.

దుర్జన సాంగత్యముచే జ్ఞానము నాశనమగునట్లు సత్సంగమముచే జ్ఞానోద్భవమైనట్లు పగలే కటికచీకటి ఒకప్పుడు వ్యాపించుచున్నది. మరి ఒకప్పుడు సూర్యుడు కనుపించుచున్నాడు

వర్షాకాలము గడచినది. లక్ష్మణా, చూడుము. అతి మనోహరమగు శరదృతువు వచ్చినది. వర్షర్తువు తన వృద్ధాప్యమును ప్రకచింటినదో అన్నట్లు పూచిన రెల్లుగడ్డి భూమి నంతటను క్రమ్ముకొన్నది. సంతృప్తి లోభమును శుష్కింప చేయునట్లు అగస్త్యనక్షత్రము ఉదయించి దారిలోని నీటిని ఎండగొట్టినది. మద మోహరహితులగు సజ్జనుల హృదయములవలె నదులు నిర్మల జలముచే శోభిల్లుచున్నవి.

జ్ఞానులు మమతను త్యజించునట్లు నదుల, తటాకములలోని నీరు మెల్లమెల్లగా ఎండిపోవుచున్నది. శరదృతువు వచ్చెనని తెలిసికొని కాటుకపిట్టలు సకాలమున సుందర సుకృత ఫలములవలె కానవచ్చుచున్నవి. బురద, దుమ్మ లేక భూమి నిర్మలమై నీతి నిపుణుడగు రాజుయొక్క పరిపాలనవలె ప్రకాశించుచున్నది.

మూర్ఖులగు గృహస్థులు ధనములేక వ్యాకుల పడునట్లు నీరులేక చేపలు వ్యాకులపడుచున్నవి.

ఆశలన్నియు త్యజించిన హరిభక్తులవలె మేఘ విహీనమై నిర్మలమై ఆకాశము ప్రకాశించుచున్నది. అరుదుగా ఏ ఒక్కనికో నా భక్తి సంప్రాప్తించునట్లు శరదృతువున అక్కడక్కడ వర్షము కురియుచున్నది. హరిభక్తిన ఆర్జించి నాలుగు వర్ణముల వారు శ్రమను త్యజించునట్లు రాజులు, తాపసులు, వ్యాపారులు, భిక్షకులు నగరమును ఆనందముతో విడచి పోవుచున్నారు.

హరి శరణ్యము పొందినవారికి ఎట్టి బాధము ఉండనట్లు లోతైన నీటిలో చేపలు సుఖముగా ఉన్నవి. నిర్గుణ బ్రహ్మసగుణ బ్రహ్మయైనపుడు శోభించునట్లు వికపించిన కమలములతో తటాకము ఎంతో మనోహరముగా ఉన్నది. తుమ్మెదలు అనుపమమగు శబ్దములతో జుంజుం అనుచున్నవి పక్షులు నానా విధములగు మధుర శబ్దములు కావించుచున్నవి. పరుల సంపత్తిని చూచిన దుష్టునివలె రాత్రిని కనుగొని చక్రవాకముల మనములు దుఃఖించుచున్నవి.

శంకరద్రోహికి సుఖము కలుగనట్లు చాతకపక్షికి దాహము తీరుటలేదు. భక్తసందర్శనముచే పాపము దూరమగునట్లు రాత్రి చంద్రుడు శరత్కాలపు ఎండను అవహరించుచున్నాడు.

శ్రీహరి దర్శనము సంప్రాప్తించినపుడు హరిజనులు తదేక దృష్టితో ఆతనిని వీక్షించునట్లు చకోర సముదాయముల చంద్రుని రెప్పవాల్చక చూచుచున్నవి.

ద్విజులతో వైరమువలన కులము నాశనమై పోయినట్లు దోమలు, జోరీగలు చలిబాధచే నశించి పోయినవి.

సద్గురువు సంప్రాప్తించినచో సంశయ భ్రమజాలములు నశించిపోవునట్లు శరదృతువు ప్రవేశింపగనే భూమిపైఉన్న పురుగులు నశించి పోయినవి.

వర్షాకాలము గడచినది. నిర్మల శరదృతువు వచ్చినది. కాని, తమ్ముడా, ఇంతవరకు సీతజాడ ఏదియు తెలియలేదు. ఒక్కసారి నాకు ఆమెజాడ తెలిసెనా, కాలుని నైనను జయించి నిమిషములో ఆమెను తెత్తును. ఆమె ఎక్కడ ఉన్నను సరే. జీవించి ఉన్నచోసరి - ప్రయత్నించి తప్పక ఆమెను తీసుకొనివత్తును. సుగ్రీవుడు నా విషయమే మఱచినాడు. రాజ్యము, ధనాగారము, నగరము, నారి సంప్రాప్తించినవికదా అతనికి!

వాలిని వధించిన బాణముతో రేపే ఆ మూఢుని సంహరింతును.''

ఉమా, ఎవని కృపచే మద మోహములు తొలగి పోవునో అట్టివానికి కలలో నైనను క్రోధము కలుగునా?

రఘువీరుని చరణములయందు భక్తికలిగిన జ్ఞానులగు మునులకు మాత్రమే ఈ లీల తెలియును. ప్రభువు క్రోధమూర్తియైనట్లు లక్ష్మణుడు తెలిసికొనెను. ఆతడు ధనువును సంధించి శరములను చేపట్టెను.

''సుగ్రీవుడు మన సఖుడు. భయముచూపి అతనిని తీసుకొని రమ్ము'' అని కరుణా సముద్రుడగు రఘుపతి లక్ష్మణునికి చెప్పెను.

రామకార్యమును సుగ్రీవుడు మఱచినాడని ఇక్కడ కిష్కింధలో పవనసుతుడు మనమున విచారించుచుండెను. ఆతడు సుగ్రీవుని సమీపించి, తన శీరమువంచి, అతని చరణములకు నమస్కరించెను. సామ, దాన, భేద, దండోపాయములను చతుర్విధ ఉపాయములను ప్రయోగించి అతనిని హెచ్చరింప జూచెను. మారుతియొక్క పలుకులను విని సుగ్రీవుడు కడు భయపడెను.

''విషయ సుఖములు నా జ్ఞానమును హరించినవి. పవనసుతా, వానర యూఢములున్న ఎల్లచోట్లకు దూత సమూహములను పంపుము. ఒక పక్షము దినములలో రానివారికి నా చేతిలో చావు తప్పదని తెలియచేయుము.'' అని హనుమంతునితో అతడు నుడివెను.

హనుమంతుడు వెంటనే దూతలను పిలిపించినాడు. అందరికి భయమును ప్రీతిని, నీతిని చూపించి వారిని సన్మానించి బహువిధముల బోధించినాడు. వానరు లెల్లరు హనుమంతుని చరణములకు శిరములువంచి నమస్కరించి పయనమయ్యిరి.

ఆ సమయమున లక్ష్మణుడు నగరమును ప్రవేశించెను. అతని క్రోధమును కనుగొని కవులు అటు ఇటు పారిపోయిరి.

లక్ష్మణుడు ధనువును సంధించెను. ''ఈ నగరమును భస్మముచేసివైతు'' నని పలికెను. నగరమంతయు కలవరపడుటనుచూచి వాలిపుత్రుడు వచ్చెను. లక్ష్మణుని చరణములపై తలవాల్చి అంగదుడు వినతి కావించెను.

లక్ష్మణుడు అంగదునికి అభయమిచ్చెను.

లక్ష్మణుడు క్రోధ యుక్తుడై ఉన్నాడని సుగ్రీవుడు విని భీతిచే కడు వ్యాకులుడయ్యెను. ''హనుమంతా, తారను తీసికొని నీవు వెడలి వినతిచేసి లక్ష్మణుని శాంతపరచుము'' అని అతడు హనుమంతుని కోరెను.

తారాసహితుడై హనుమానుడువచ్చి లక్ష్మణుని పాదములకు వందనముచేసెను. ప్రభుని సుయశమును పొగడసాగెను. వినతికావించి లక్ష్మణుని రాజమందిరమునకు తోడి తెచ్చెను. లక్ష్మణుని చరణములను కడిగెను. ఆయనను ఒక పట్టిమంచముపై ఆసీనుని చేసెను. కపీళుడు సుగ్రీవుడు లక్ష్మణుని చరణములపై శిరమువంచి నమస్కరించెను.

లక్ష్మణుడు సుగ్రీవుని చేయిపట్టుకొని ఆతనిని కౌగలించుకొనెను. ''ప్రభూ, విషయ సుఖమువంటి మదము ఇంకొకటిలేదు. క్షణములో అది మునుల మనములలో కూడా మోహము జనింపచేయును.'' అని సుగ్రీవుడు నుడివెను.

సుగ్రీవుని వినయ వచనములను విని లక్ష్మణుడు సంతోషించి బహువిధముల అతనిని శాంతపరచెను. అన్నివైపులకు దూతసమూహములు ఎట్లు వెడలినవో వివరములన్నియు పవన తనయుడు సుగ్రీవునికి తెలిపెను.

అనంతరము అంగదాది కవులను వెంటతీసుకొని రామానుజుని తమ ముందిడు కొని సుగ్రీవుడు హర్షముతో రఘునాథుని వద్దకు వచ్చెను.

రఘునాథుని చరణములపై తన శిరమునుంచి చేతులుజోడించి అతడు ''స్వామీ, నా దోషమేదియలేదు, నీ మాయ అతి ప్రబలమైనది. దేవా, నీవు దయచూపినపుడే దానినుండి విముక్తి కలుగును. స్వామీ, సురలు, నరులు, మునులు, అందరు విషయపశులే. ఇకనేనో పామర పశువును. అతి కాముకుడగు కపిని.

నారీనయన శరములు తగులనివాడు, భయంకర క్రోధమను చీకటి రాత్రి యందు సహితము మేల్కొనియే ఉండువాడు, లోభపాశమున చిక్కుపడని నరుడు, రఘురాయా, నీతో సమానుడే, ఈ సద్గుణము సాధనమాత్రము సంప్రాప్తించదు. ఏ ఒక్కనికో నీ కృపవలన మాత్రమే ఇది సంప్రాప్తించును.'' అని నుడివెను.

రఘుపతి చిరునవ్వు నవ్వెను. ''భరతుని వలెనే నీవు నాకు ప్రీతిపాత్రుడవు. సోదరా, సీతజాడను తెలిసికొనుటకు ఉపాయమును బాగుగా ఆలోచించుము'' అని ఆతడు పలికెను.

ఇట్లు సంభాషణ జరుగుచున్నంతలో వానర యూధములు వచ్చినవి. అనేక రంగులు కల కపిసేనలు అన్నిదిశలను కనుపించసాగినవి.

ఉమా, ఆ వానరసేనను నేను చూచితిని. దానిని లెక్కింప పలెననుకను వాడు మూర్ఖుడు, వానరులందరు వచ్చిరి. రామ పాదములకు తలలువంచి నమస్కరించిరి. రాముని దర్శించి సనాథులమైతిమని తలంచిరి.

స్వయముగా రాముడు కుశల ప్రశ్నములు అడుగని ఏ ఒక్కకపియు ఆ సేనలో లేడు. ఇందు మహావిచిత్రమేమున్నది? రఘునాథుడు విశ్వరూపి, సర్వవ్యాపకుడు!

ఆనతినిపొంది వానరులు తమతమ స్థానములలో నిలచిరి. ''వానర సమూహములారా, ఇది రామకార్యము. నా ప్రార్థన, ఆనతియు, మీరు నలుదిశలకు పొండు. జనకసుతను అన్వేషించుడు. సోదరులారా, ఒక నెలదినములలో మీరు తిరిగి రావలయునుసుమా. గడువులో జాడ తెలిసికొనకనే ఎవరైన తిరిగి వచ్చితిరో వారికి చావు నా చేతిలో తప్పదు.'' అని సుగ్రీవుడు హెచ్చరించెను.

ఆ పలుకులు వినిన వెంటనే వానరులందరు అన్నివైపులకు పయనమైవెడలిరి. అంతట అంగద, నల, హనుమంతులను సుగ్రీవుడు పిలిపించి, వారితో:- ''ధీరమతు లారా, నీల, అంగద, హనుమంత, జాంబవంతులారా, ఇదిగో వినుడు, సుభటులగు మీరు అందరుకలసి దక్షిణదిశగా పయనించుడు, సీతయొక్క జాడను గురించి ఎల్లరను ప్రశ్నించుడు, మనో, వాక్‌, కర్మలచే ఉపాయమును యోచింపుడు. ఎదుటనుండి అగ్నికి, వెనుకకు తిరిగి రవికి సేవచేయ వలయును. కాని స్వామిసేవ కపటము విడిచి కావింపవలయును. మాయను త్యజించి పరలోకసౌఖ్యమునకై సేవించినచో భవసంభవ దుఃఖములు నశించును.

నిష్కామబుద్ధితో రాముని భజించుటయే దేహధారణవలన కలుగుఫలము. రఘురాముని చరణానురాగియే గుణవంతుడు. వాడే భాగ్యవంతుడు.'' అని ఆతడు మడివెను.

సెలవుపొంది వానరులందరు రఘునాథుని చరణములపై తమ శిరములు వంచి నమస్కరించిరి. ఆయనను స్మరించుచు ఆనంద పరవశులై పయనమైరి.

చిట్ట చివరకు పవన తనయుడు శిరమువంచి రామునికి వందనముచేసెను. కార్యభారము విచారించి అతనిని ప్రభువు దగ్గరకు పిలచెను. తన కరకమలములచే అతని శిరమును స్పృశించెను. తన కరముద్రికను తీసి అతనికి ఇచ్చెను.

''బహురీతుల సీతకు తెలుపుము. నా బలమును, విరహమును, ఆమెకు వివరించి వేగముగా తిరిగి రమ్ము'' అనెను. తన జన్మసఫలమయ్యెనని హనుమ తలచెను. కృపానిధానుని హృదయమున ధరించి పయనించెను.

సకల విషయములు ప్రభునికి తెలియును. ఐనను రాజనీతిని పరిరక్షించుచున్నాడు.

అడవులు, నదులు, చెరువులు, గిరులు, గుహలు వెదకుచు వానరులెల్లరు పయనించుచున్నారు. వారి మనస్సులు రామకార్యమున నిమగ్నమైన ఉన్నవి. తమ శరీరములనే వారు మరచిపోయిరి.

ఎవ్వడైన ఒక విశాచరుడు ఎక్కడైన కనుపించెనో ఒక్క చెంపదెబ్బతోనే వాని ప్రాణములు తీతురు. కాననములలో గిరులలో అనేక విధములవారు అన్వేషించుచున్నారు. ముని ఎవరైన కనుపించినచో జాడ తెలిసికొనుటకు ఆయనకు చుట్టుముటుచున్నారు.

ఇంతలో వారికి దాహమువేసినది. దానితో వారు కడు వ్యాకుల పడిరి. కాని జలము ఎచ్చటను కనుపించలేదు. దట్టమగు ఆ అడవిలో వారు దారితప్పిరి. ''నీరు త్రాగనిచో మన అందరికి చావుతప్పదు'' అని హనుమంతుడు తలచెను.

అతడు ఒక కొండ శిఖరముపైకి ఎక్కెను. నాలుగు దిశలను పరికించెను. భూమిలో ఒక గుహలో ఒక విచిత్ర దృశ్యము కనుపించినది. ఆ గుహపై చక్రవాక పక్షులు, కొంగలు, హంసలు ఎగురుచున్నవి. ఎన్నో పక్షులు ఆ గుహను ప్రవేశించుచున్నవి.

పవనసుతుడు ఆ గిరిపై నుండి దిగి అందరిని తీసుకొనివచ్చి గుహను చూపించెను. వారందరు హనుమంతుని తమముందు ఉంచుకొని వెంటనే గుహలో చొచ్చిరి. పోగా, పోగా, ఆ గుహలో ఒక ఉత్తమ ఉపవనము, తటాకము కనుపించినవి. తటాక మంతయు వికసించిన కమలములు అనేకము కలవు. అక్కడనే రమ్యమగు ఒక మందిరమున్నది. ఆ మందిరములో తపోమూర్తి ఒక స్త్రీ కూర్చుండి ఉన్నది. దూరము నుండియే వారు అందరు ఆమెకు తలవంచి ప్రణమిల్లిరి. తమ వృత్తాంతము ఆమెకు నివేదించిరి.

''నీటిని సేవించుడు. సురస, సుందరములగు నానా ఫలములను ఆరగింపుడు'' అని ఆమె పలికినది.

అందరు స్నానము చేసిరి. మధుర ఫలములను ఆరగించి ఆమెవద్ద చేరిరి. ఆమె తన వృత్తాంతమును వినిపించినది. ''ఇప్పుడే నేను రఘునాథుని వద్దకు వెడలి ఆతనిని దర్శింతును. మీరందరు కండ్లు మూసికొనుడు. గుహను విడిచి బయటకు రండు. నిరాశ చెందకుడు. సీతజాడ తెలిసికొనగలరు'' అని ఆమె నుడివినది.

వారు కండ్లు మూసికొన్నారు. కండ్లు తెరువగానే ఆ వీరులెల్లరు సముద్రతీరమున ఉన్నారు.

ఆమె రఘునాథుడున్న చోటికి చనినది. ఆతని చరమ కమలకు శిరమువంచి నమస్కరించినది. అనేకరీతుల వినతి కావించినది. ప్రభువు ఆమెకు సుస్థిర భక్తిని ప్రసాదించెను. ప్రభుని ఆజ్ఞను ఆమె శిరసా వహించినది. ఆజుడు, రుద్రుడు సహితము వందనముచేయు రామ చరణ యుగళమును హృదయమున ధరించి ఆమె బదరి కాశ్రమమునకు వెడలినది.

ఇక్కడ వానరులు తమ మనస్సులలో విచారించుచున్నారు. ''గడవుకాలము గడచినది. కర్తవ్యము నెరవేరలేదాయె'' అని పరస్పరము సంభాషించుకొన్నారు. సీతజాడ తెలిసికొనకయే తిరిగిపోయి, సోదరులారా, ఏమి చేయుదము? అనుకొన్నారు.

''రెండు విధములను మనకు మరణమే. ఇక్కడ సీతజాడ తెలియలేదు! అక్కడకు వెళ్ళినచో కపిరాజు మనలను చంపివేయును! నా తండ్రిని వధించిననాడే అతడు నన్ను చంపవలసినది. రాముడు నన్ను రక్షించినాడు. అందు సుగ్రీవుని దయ ఏదియు లేదు.'' అని అంగదుడు కన్నీరు కార్చుచు నుడివెను. ''మనకు చావు వచ్చినది. సంశయము ఏమాత్రము లేదు'' అని అతడు పదేపదే అందరితో అనుచుండెను.

వానరవీరులు అంగదుని పలుకులు వినుచున్నారు. కాని ఏమియు చెప్పలేకున్నారు. అందరు కన్నీరుకార్చుచున్నారు. ఒక క్షణము మాత్రము అందరు ఆలోచనలోపడిరి. ''ప్రవీణుడవగు యువరాజా, సీతజాడ తెలిసికొనక మనము తిరిగిపోవలదు'' అని వారెల్లరు పలికిరి. కపులెల్లరు లవణసాగర తీరమునకు వెడలిరి. దర్భలను పఱచిరి. వానిపై ఆసీనులైరి.

అంగదుని దుఃఖముచూచి జాంబవంతుడు అనేక ఉపదేశ భరితములగు కథలను చెప్పెను. ''నాయనా, రాముడు నరుడని తలపకుము. అతడు నిర్గుణబ్రహ్మ, అజేయుడు, అజుడు, అని తెలిసికొనుము. సేవకులమగు మనమందరము అత్యంత భాగ్యవంతులము. సంతతము సగుణ బ్రహ్మయందు అనురాగులమైతిమి. గో, భూ, బ్రాహ్మణ, సురహితార్థము ప్రభువు తన నిజేచ్ఛనే అవతరించును. సగుణోపాసకులు సర్వవిధములగు మోక్షమును త్యజించి ఆయనను సేవించుచు ఆయనవెంట ఉందురు.'' అని ఇట్లు అనేక కథలను జాంబవంతుడు చెప్పెను. ఈ మాటలన్నియు గిరి గుహలో ఉన్న సంపాతి విని బయటకు వచ్చెను. వానరులను పెక్కురను కనుగొనెను. ''జగదీశుడు నాకు ఆహారము పంపినా'' డనుకొనెను. ''వీటినన్నిటిని నేడు తినివైతును, బహుదినములనుండి తిండిలేక చచ్చిపోవుచున్నాను. కడుపునిండ ఆహారము ఎన్నడునులభించదు. విధి నేడు ఒక్కసారి ఇంత ఆహారము ప్రసాదించినాడు'' అనెను. గృధ్రవచనములు చెవులపడినంతనే కపులు అందరు భయపడిరి. ''నిజముగానే చావువచ్చినది. ఇది మనలను కనుగొన్నది'' అని తలచిరి. గృధ్రమునుచూచి కపులెల్లరు లేచి నిలచిరి -

జాంబవంతుని మనస్సున మరింత చింతకలిగెను. అంగదుడు మనమున విచారించి ''అహో! జటాయువునకు నముడగు ధన్యుడు ఎవ్వడూలేడు. రామ కార్యార్థమై తనువు త్యజించి హరిపురమునకు చనినాడు! మహా భాగ్యవంతుడు అతడు!'' అని అతడు పలికెను.

హర్ష, శోకయుతములగు ఆ మాటలు విని నంపాతి కపులను సమీపించెను. వానరులు భయపడిరి. సంపాతి వారికి అభయమిచ్చి. వారివద్దకు వచ్చి, జటాయువును గురించిన వృత్తాంతమును ప్రశ్నించెను. ఆ వృత్తాంతమంతుయ నాకు వినిపించిరి.

సోదరుని కృత్యములను విని సంపాతి రఘుపతియొక్క మహిమను పొగడినది.

''సింధు తటమునకు నన్ను తీసుకొని పొండు. జటాయువునకు తిలాంజలి సమర్పింతును. మీకు నేను వాక్సహాయము చేయగలను. మీరు వెదకునది లభించును'' అని సంపాతి కపులను కోరెను.

సాగరతీరమున అనుజునికి సంపాతి శ్రాద్ధక్రియను జరిపెను. తన కథను ఇట్లు వివరింప సాగెను:-

''వీరవానరులారా, వినుడు. తరుణ వయస్సులో మేము సోదరులము ఇద్దరము ఒకసారి గగనమునకు ఎగిరితిమి. రవిని సమీపించితిమి. నా సోదరుడు ఆ తేజమును భరింపలేక తిరిగివచ్చెను. నేను అహంకారమున సూర్యుని సమీపించితిని. అత్యంత అపారమగు ఆ వేడిచే నా రెక్కలు కాలిపోయినవి బిగ్గరగా కేకలువేసి నేను భూమిమీద పడిపోతిని. అక్కడ చంద్రముడను ఒక ముని కలడు. నన్నుచూచి ఆయనకు దయకలిగెను. ఆయన నాకు బహువిధముల జ్ఞానమును బోధించి, దేహజనితమగు నా అభిమానమును పోగొట్టెను.

''త్రేతాయుగమున పరబ్రహ్మ మానవ శరీరమును ధరించును. ఆయన పత్నిని రాక్షసరాజు అపహరించును. ఆమెను అన్వేషించుటకై ప్రభువు దూతలను పంపును. వారిని కలసికొని నీవు పునీతుడవగుదువు. నీ రెక్కలు తిరిగి వచ్చును. చింతింపకుము. వారికి సీతఉన్న ప్రదేశమును చూపించుము'' అని ఆ ముని నాతో చెప్పినాడు. ఆ ముని చెప్పినది నేడు నిజమయ్యెను. నా మాటలు విని మీరు ప్రభుని కార్యమును సఫలము కావించుడు. త్రికూటగిరిపై లంకఉన్నది. సహజ నిర్భయుడగు రావణుడు అక్కడ నివసించును. అక్కడ అశోకమను ఉపవనమున్నది. దానియందు సీత ఆలోచనా నిమగ్నయై కూర్చుండి ఉన్నది. అదిగో నేను ఆమెను చూడకలుగుచున్నాను. మీరు చూడలేరు. మాగృధ్రముల దృష్టి అపారమైనది. నేను వృద్ధుడనైపోతిని లేనిచో మీకు కొంత సహాయము చేసిఉందును. శత యోజనముల సాగరమును దాటగల వివేకనిలయుడు రామకార్యమును సాధింపగలడు. నన్ను చూడుడు. ధైర్యము వహించుడు. రామకృపచే ఇదే నా శరీరము ఎట్లు మారిపోయినదో! ఎవని నామస్మరణచే పాపియైనను అత్యంత అపారమగు భవసాగరమును దాటునో, అట్టివాని దూతలు మీరు. పిరికితనము విడువడు. రాముని మీ హృదయముల ధరింపుడు. ఉపాయమును యోచించుడు.''

గరుడా. ఇట్లుచెప్పి గృధ్రము వెడలెను. వానరులు తమ మనములయందు విస్మయమందిరి. వారందరు తమతమ బలమును వివరించిరి. సముద్రమును దాటు విషయమై వారెల్లరు సందేహమును వెలువరించిరి.

''ఇప్పుడు నేను వృద్ధుడనైపోతిని. శరీరమున పూర్వపుశక్తి లేశమాత్రమును లేదు. ఖరారి త్రివిక్రముడైననాడు నేను తరుణ వయస్కుడను. మహాబలశాలిని. బలిని బంధించినప్పుడు ప్రభువు వర్ణింప శక్యము కానంత మహాశరీరుడైనాడు. ఐనను, నేను రెండు గడియలలోనే పరుగెత్తి ఏడుమార్లు ఆయనకు ప్రదక్షిణ చేసితిని.'' అని జాంబవంతుడు నుడివెను.

''దాటుటయైనచో నేను దాటగలను. తిరిగి వచ్చువిషయమే కొంత సందేహము'' అని అంగదుడు వచించెను.

''సర్వవిధములు నీవు యోగ్యుడవే. కాని మా అందరికి నాయకుడవు నీవు. నిన్ను పంపుట ఎట్లు?'' అనెను జాంబవంతుడు. హనుమంతునితో అతడు''ఇదిగో హనుమంతా, బలవంతా వినుము. మాటాడక ఊరకున్నావేమిది? పవన తనయుడవు. బలమున పవన సమానుడవు. వివేకవిజ్ఞాన నిధానమవు. నీవు చేయలేని పని లోకమున ఏమికలదు తండ్రీ? రామకార్యార్థమైకదా నీవు అవతరించితివి!'' అని పలికెను.

ఈ మాటలు వినినంతనే హనుమంతుడు పర్వతాకారుడయ్యెను. బంగారు రంగుకలిగిన శరీరము. ఆ శరీరముపై విరాజిల్లు తేజము. అపరపర్వత రాజో అన్నట్లు ఉన్నాడు. మాటిమాటికి సింహనాదము సలుపుచున్నాడు మారుతి. ''ఈ లవణాంబుధిని అవలీలగా దాటకలను. రావణుని, వాని సహాయకులను సంహరించి, త్రికూట పర్వతమును పెల్లగించి ఇక్కడకు తెత్తును. జాంబవంతా, నిన్ను అడుగుచున్నాను. తగురీతిని నాకు కర్తవ్యమును బోధింపుము.'' అని హనుమంతుడు అడిగెను.

''తండ్రీ, నీవు వెడలి. సీతనుచూచి తిరిగిరమ్ము. ఆమెను గురించి తెలుపుము. ఇంతేచాలును. రాజీవనయనుడు రాముడు స్వీయబలముచే సర్వమును సలుపును. కౌతుకమునకు మాత్రము వానరసేనను తనవెంట తీసుకొనిపోవును. కపిసేనను వెంట నిడుకొని నిశాచరులను సంహరించి రాముడు సీతను తెచ్చును. దేవతలు, నారదాదిమునులు త్రిలోక పావనకరమగు ఆతని సుయశమును వర్ణింతురు. దానిని విను, కీర్తించు, వివరించు, గ్రహించు నరులు పరమపదమును పొందుదురు.

రఘువీరుని పాదకమల భ్రమరమగు తులసి దానిని గానముచేయును.

రఘునాథునికీర్తి భవరోగములకు ఔషధము. దీనిని విను స్త్రీ పురుషుల మనోరథమల నన్నిటిని త్రిశిరారి సఫలము చేయును.'' అని జాంబవంతుడు వచించెను.

నీలోత్పల శ్యామగాత్రుడు, కోటి మన్మథులనుమించిన అధిక శోభాసంపన్నుడు. పాపరూపమగు పక్షుల వేటకాడు రాముడు! అట్టి రాముని గుణగణములను వినుడు.

Sri Ramacharitha    Chapters