Sri Ramacharitha    Chapters   

తృతీయ సోపానము

అరణ్యకాండము

[ధర్మవృక్షమునకు మూలము, వివేక సాగరమునకు ఆనందప్రదుడగు పూర్ణ చంద్రుడు, వైరాగ్యకమలమునకు భాస్కరుడు, పాపమును ఘోరాంధకార విధ్వంసకుడు, తాపత్రయహరుడు, మోహరూప మేఘజాలమును విచ్ఛిన్నమొనర్చి గగనమున ఉద్భవించిన పవనస్వరూపుడు, బ్రహ్మకుల సంజాతుడు, కళంకనాశకుడు. శ్రీరామ భూపాలుని ప్రియమిత్రుడు అగు శంకరునికి వందనము కావింతును.

జలభరిత మేఘసమాన సుందర శ్యామశరీరుడు, సీతాంబరధరుడు, బాణశరాసనపాణి, వరతూణీరభారమున వరలు కటియుతుడు, రాజీవాయతలోచనుడు, జటాజూటధారి, అత్యంత శోభితుడు, సీతాలక్ష్మణ సహితుడు, ఆనందప్రదుడు. పథికుడు అగు రాముని భజింతును.]

ఉమా, రాముని గుణములు నిగూఢములు, పండితులు, మునులు వానిని తెలిసికొని విరాగులగుదురు. హరి విముఖులగు, ధర్మనిరతి హీనులగు మహామూఢులకు మోహమే ప్రాప్తించును.

పురజనుల, భరతునియొక్క అనుపమ, సుందర ప్రేమను నా బుద్ధిని అనుసరించి వర్ణించితిని. వనములయందు సుర, నర, ముని మనముల ప్రకాశింపచేసిన ప్రభుని అతిపావన చరితను ఇక వినుము.

ఒకానొక సమయమున రాముడు చక్కనిపూలను ఏరి స్వహస్తములతో పలుతీరులగు మాలలను కూర్చెను. ఒక రమణీయ స్ఫటికశిలపై కూర్చుండి ఆ మాలలను అతడు సీతకు అలంకించెను. సురపతియొక్క సుతుడు. శఠుడు, ఒక కాకిరూపమును ధరించి రఘుపతియొక్క బలమును పరీక్షింపకోరెను. అతి మందమతి అగు చీమఒకటి మహాసముద్రపు లోతును కనుగొనవలెననుకొనెనట! మూఢుడు, మందమతి అగుటచే ఇంద్రతనయుడు సీతయొక్క పాదములను తనముక్కుతో పొడిచి పారిపోయెను. సీతయొక్క చరణములనుండి రక్తము స్రవించుచున్నట్లు రఘునాయకుడు కనుగొని ఒక గడ్డిపోచనుతీసి దానిని తన ధనువున సంధించెను.

రఘునాయకుడు అతి కృపాళుడు. అతనికి దీనులపై సదాప్రేమ, అట్టివానిపై ఆ అవగుణ నిధి, మూర్ఖుడు జిత్తును ప్రయోగించినాడు! మంత్ర ప్రేరితమై రాముడు విడిచిన ఆ బ్రహ్మాస్త్రము పరుగిడెను. కాకి భయపడి పారిపోయెను. తన నిజరూపమును ధరించి తండ్రిని చేరెను. రామవిముఖుడని తెలిసికొని ఇంద్రుడు అతనిని రక్షింపలేదు. జయంతుడు నిరాశ##చెందును. దూర్వాసుడు చక్రమువలన భయపడినట్లు జయంతుడు భీతిల్లి బ్రహ్మధామమునకు చనెను. శివపురిని చేరెను. ఇక ఎన్ని చోట్లకో వెడలెను. అలసి, వ్యాకులుడై అతడు పరుగెత్తుచునే ఉండెను. అతనిని కూర్చుండుమనియైనను ఎవ్వరు అనలేదు. రామద్రోహిని ఎవరు రక్షింపగలరు? వినుము. గరుడా, అట్టివానికి తల్లిమృత్యు సమానమగును. మిత్రుడు నూరుమంది శత్రువులవలె చరించును. గంగానది వైతరణిఅగును. సోదరా, వినుము రఘువీరుని ఎడల విముఖుడగు వానికి జగమంతయు నిప్పుకంటె ఎక్కువ వేడిగాఉండును.

కలవరపడిఉన్న జయంతుని నారదుడు చూచెను. ఆతనికి జాలికటిగెను. భక్తులు కోమలచిత్తులు వెంటనే నారదుడు రామునివద్దకు జయంతుని పంపెను. జయంతుడు వెడలి, ''ప్రణతార్త హితకరా, పాహి, పాహి'' అనెను. ఆతురుడై భయమున భీతిల్లిఉన్న జయంతుడు రాముని చరణములను పట్టుకొనెను.

''దయాళూ, రఘునాథా, రక్షింపుము - రక్షింపుము, అనన్యమగు నీ బలమును, సామర్ధ్యమును - మందబుద్ధినగు నేను తెలిసికొనజాలకపోతిని. స్వయంకృత కర్మజనిత ఫలమును అనుభవించితిని. ప్రభూ, నన్ను రక్షింపుము. నీ శరణుకోరి వచ్చితిని'' అని వేడెను.

భవానీ, కృపాళుడగు రాముడు జయంతుని మహా ఆర్తరవమును విని, వానిని ఒంటికంటివానిని చేసి వదలివైచెను. మోహవశమున జయంతుడు ద్రోహము కావించెను. వధార్హుడైనను వానియందు దయతలచి ప్రభువు వానిని వదలివైచెను.

రఘువీరునికి సాటి అగు కృపాళు డెవడున్నాడు?

రఘుపతి చిత్రకూటమున వసించి నానాచరిత్రలను సృష్టించెను. ఆ చరిత్రలుసర్వము వీనులకు అమృతము.

కొంతకాలము గడచెను : ''నన్ను ఇచ్చట అందురు తెలిసికొన్నారు. ఇక తండోప తండములు ఏతెంతురు'' అని రాముడు తలచెను. మును లెల్లరివద్ద శెలవు తీసికొని సీతాసహితులై సోదరు లిరువురు అచ్చటినుండి వెడలిరి.

వారెల్లరు అత్రిమునియొక్క ఆశ్రమమునకు అరుదెంచిరి. వారి రాకను విని ఆ ముని సంతసించెను. ఆతని తనువు పులకించెను. అతడు లేచి పరుగెత్తెను. వడివడిగా వచ్చుచున్నమునిని కని రాముడు మరింతవేగముగా నడచివచ్చెను. సాష్టాంగ దండ ప్రణామముచేయుచున్న రామలక్ష్మలణును కని ముని వారిని తమ ఉరమునకు హత్తుకొనెను. ప్రేమబాష్పములతో అతడు రామలక్ష్మణులను ముంచెను.

రాముని లావణ్యమునుచూచి అత్రిమునియొక్క నేత్రములు ప్రశాంతిచెందెను. సాదరముగా సీతారామలక్ష్మణులను అత్రి తన ఆశ్రమమునకు తోడ్కోనిచనెను. వారిని పూజించెను. మృదుమధుర వచనములను పలికెను. కందమూల ఫలములను వారికి సమర్పించెను. వానిని ఆరగించి ప్రభునిమనస్సు ఉప్పొంగెను.

ప్రభువు ఆసనమున విరాజిల్లుచుండెను. కన్నులార ఆతని శోభను కనుగొని పరమ ప్రవీణుడు. మునివరుడు కరములుజోడించి ఇట్లు స్తుతింప మొదలిడెను :-

''భక్తవత్సలా, కృపాళూ, కోమలస్వభావా, నీకు నమస్కారము. నిష్కాములకు నీ నిజధామమును ప్రసాదించు నీ పదాంబుజములను భజింతును.

నితాంత సుందరాశ్యామా. సంసారసాగరమును మధించుటకు మందర పర్వత స్వరూపుడవునీవు. వికసిత కమలలోచనా, మదాది దోష విమోచకా ప్రభూ, నీ దీర్ఘ బాహు పరాక్రమము, నీ వైభవము అపారమైనవి. ధనుర్బాణధరుడవగు నీవు త్రిలోకనాయకుడవు.

దినేశ వంశభూషణా, మహేశ చాపఖండనా, మునీంద్ర భక్తరంజనా, సురారి బృంద భంజనా, మనోజవైరివందితా, అజాది దేవసేవితా, విశుద్ధబోధ విగ్రహా, సమస్తదోషహరా, నీకు నమస్కరింతును. ఇందిరాపతీ, సుఖనిలయా, సాధుసజ్జనులకు గతినీవే. నీకిదే నా నమస్కారము. ఇంద్రుని ప్రియ అనుజా, సీతాలక్ష్మణ సహితుడవగు నిన్ను భజింతును. మత్సర రహితులై నీ సేవచేయునరులు తర్క వితర్క సంకులమగు సంసారసాగరమున పడరు. ఏకాంతవాసులు ముక్తికొరకై ఇంద్రియదులను నిగ్రహించి నిన్ను సదా భజింతురు. నీ స్వరూపమును పొందుదురు.

అద్వితీయుడవు, అద్భుత ప్రభుడవు. ఇచ్ఛారహితుడవు. ఈశ్వరుడవు. విభుడవు, జగద్గురుడవు, సనాతనుడవు, త్రిగుణాతీతుడవు. కేవలుడవు. భావవల్లభుడవు, కుయోగులకు అత్యంత దుర్లభుడవు, భక్తులపాలిటి కల్పవృక్షమవు, సముడవు, సదా సంసేవ్యుడవు. అట్టి నిన్ను భజింతును.

అనుపమ రూపవతుడవు, భూపతివి, భూసుతపతిని అగు నీకు నమస్కరింతును. నాయందు ప్రసన్నుడవుకమ్ము. నీకివే నా ప్రణతులు. నీ పదాంబుజములయందు భక్తిని నాకు ప్రసాదింపుము.

ఈస్తవమును సాదరముగా పఠించువారు నీ భక్తియుక్తులై నీ పరమ పదమును పొందుదురు. ఇందు సందేహములేదు.'' ఇట్లు వినతి యొనర్చి, శిరమువంచి, కరములు మోడ్చి ''ప్రభూ, నామతి ఎన్నడూ నీ చరణ సరోరుహములను విడువక ఉండునట్లు అనుగ్రహింపుము'' అని ముని వేడెను.

సుశీల, వినయవతిఅగుసీత అనసూయయొక్క చరణములనుగ్రహించి ఆమోను ఆలింగనము చేసికొనెను. ఋషిపత్నియొక్క మనమున మహా ఆనందము కలిగెను. ఆమె సీతను ఆశీర్వదించి తనవద్ద కూర్చుండపెట్టుకొనెను.

నిత్యనూతన, నిర్మల, సుందర, దివ్యవస్త్రములను ఆ భూషణములను ఆమె సీతకు అలంకరించెను. సరస, మృదువాణితో ఆమె నారీ ధర్మములను ఇట్లు సీతకు ఉపదేశించును.

''అమ్మా, రాకుమారీ, వినుము, స్త్రీలకు తల్లి, తండ్రి సోదరుడు అందరు హితకరులే. కాని వీరందరు కొంతవరకే హితముచేతురు. అమిత సుఖప్రదుడు భర్తఒక్కడే. అట్టి పతిని సేవించనినారి అధమ. ధైర్యము, ధర్మము, మిత్రుడు, నారి, ఈ నలుగురిని ఆపత్కాలమందే పరీక్షింపగలము. వృద్ధుడు, రోగి, మూర్ఖుడు. ధనహీనుడు, అంధుడు, బధిరుడు, క్రోధి, అతిదీనుడు, అగు పతిని అవమానించు స్త్రీ పలు విధములగు దుఃఖములను యమపురియందు పొందును. మనోవాక్‌ కాయములతో పతియొక్క చరణ సేవచేయుటయే స్త్రీయొక్క ఏకైక ధర్మము. ఏకైకవ్రతము, ఏకైక నియమము.

లోకమున తచుర్విధములగు పతివ్రతలున్నారు. వేదములు, పురాణములు, భక్తులు, అందరు నుడువునదియే ఇది.

ఉత్తమశ్రేణి పతివ్రత తన పతికంటె జగమున మరి ఒక పురుషుడు కలడని కలలోనైనను తలచదు.

పరపతిని తన సోదరునివలె, తండ్రివలె, పుత్రునివలె భావించునది మధ్యమ.

ధర్మమును విచారించి, తన కులమర్యాదను తెలిసికొని, కేవలము ధర్మము కొరకే తన పాతివ్రత్యమును కాపాడునది నికృష్టశ్రేణి స్త్రీ. ఇట్లని శ్రుతులు నిర్వచించినది.

అవకాశము లభింపకనో, భయమువలననో పతివ్రతయై ఉండు స్త్రీ అధమశ్రేణిది.

పతిని వంచించి, పరపతితో రమించు నారి నూరు కల్పములవరకు రౌరవ నరకమున పడిఉండును. క్షణ సౌఖ్యమునకై శతకోటి జన్మల దుఃఖమును తెలిసికొనలేని స్త్రీకి సాటి అగు దుష్టు లెవ్వరున్నారు? కపటము విడిచి పతివ్రతా ధర్మములను అనుసరించు నారి శ్రమపడకనే పరమగతిని పొందును. పతికి ప్రతి కూలముగా నడచు స్త్రీ ఎక్కడ జన్మ ఎత్తినను తరుణవయసునందే వితంతువగును. సహజముగ అపవిత్ర అగు స్త్రీ పతిని సేవించి సద్గతిని పొందును. ఈ నాటికి సహితము తులసి శ్రీహరికి ప్రియురాలు. నాలుగు వేదములు ఆమెను కొని యాడుచున్నవి.

సీతా, వినుము, రాముడు నీ ప్రాణప్రియుడు. నీ నామమును స్మరించి స్త్రీలు పతివ్రతలగుదురు. లోకహితమునకై ఈ విషయమును నీకు వచించితిని.''

అనసూయ చెప్పినది అంతయు విని జానకి పరమానందము పొందెను. సాదరముగా ఆమె అనసూయయొక్క చరణములపై తన తల ఉంచి ప్రణమిల్లెను.

పిదప కృపానిధి అగు రాముడు ''ఆజ్ఞ ఐనచో ఇక నేను వేరొక వనమునకు వెడలుదును నాపై నిరంతరము కృప చూపుము. నేను నీ సేవకుడనని తలంచుము. నన్ను విడనాడకుము'' అని మునిని వేడెను.

ధర్మ ధురంధరుడగు ప్రభుని పలుకులను విని జ్ఞాని అగు ముని ప్రేమ పూర్వకముగా ఇట్లు నుడివెను :-

''బ్రహ్మ, శివ, సనకాది పరమార్థ వాదులెల్లరు ఎవని కృపను వాంఛింతురో అట్టి రామా, నిష్కాముల, దీనుల బాంధవుడవు నీవు ఇట్టి కోమల వచనములను వచింతువు. దేవతలందరిని త్రోసిపుచ్చి నిన్ను భజించు ఆ లక్ష్మి యొక్క చాతుర్య మును ఇప్పుడు నేను తెలిసికొంటిని, నీకు సముడెవ్వడున్నాడు? నీ కంటె అధికుడెవడున్నాడు? అట్టి నీ శీలము వేరు విధముగా ఎట్లుండును?

''స్వామీ, నీవు వెడలుము'' అని నే నెట్లు వచింపగలను? నీవే తెలపుము. అంతర్యామివి నీవు.''

ఇట్లు నుడివి ధీరుడగు ఆ ముని ప్రభుని విలోకించెను. ఆతని కన్నులనుండి నీరు ప్రవహించెను. శరీరము పులకితమయ్యెను. తనువు పులకరింప అత్యంత ప్రేమభరితుడైన ఆ మునియొక్క నేత్రములు రాముని ముఖ పంకజమున లగ్నమయ్యెను.

''ఎట్టి తప మొనర్చితినో నేను! ఏ జపము చేసితినో మనో, జ్ఞాన, గుణ ఇంద్రియాతీతుడగు ప్రభుని దర్శనము నాకు లభించెను !'' అని అత్రిముని తలంచెను.

జప, యోగ, ధర్మజాలములచే నరుడు అనుపమమగు భక్తిని ఆర్జించును. రఘువీరునియొక్క పావనచరితను తులసీదాసు రాత్రింబవళ్లు గానము చేయును. రాముని సత్కీర్తి కలియుగ పాపములను నాశన మొనర్చును. మనసును స్వాధీన పరచును. పరమానందమునకు అది మూలము. సాదరముగా దీనిని వినువారియెడ రాముడు ప్రసన్నుడగును.

కఠినమగు ఈ కలికాలము పాపకోశము. దీనిలో ధర్మములేదు, జ్ఞానములేదు. యోగములేదు. జపములేదు. ఇతర ఆశలను అన్నిటిని విడిచి రాముని భజించు వారే ఈ కాలమున చతురులు.

సురల, నరుల, మునుల ఈశ్వరుడగు రాముడు ఆ ముని పద కమలములపై తల వాల్చి నమస్కరించి వనములకు పయనము సాగించెను. ముందు రాముడు ఆతని వెనుక అనుజుడు లక్ష్మణుడు - మునివరుల వేషమున వారిరువురు అతి శోభాయుతులై ఉన్నారు.

ఆ ఇరువురి మధ్య సీత-పర బ్రహ్మమునకు జీవాత్మకు మధ్య మాయవలె వెలుగొందుచున్నది. నదులు, వనములు, గిరులు, దుర్గమమగు కొండలోయలు - అన్నియు తమ ప్రభువును గుర్తించినవి. ఆయనకు చక్కని మార్గమును సమకూర్చినవి. రఘురాయ భగవానుడు కాలిడిన అన్నిచోటుల ఆకాశమున మేఘములు క్రమ్మెను. మార్గమున విరాధుడను రాక్షసుడు వారికి కనుపించెను. ఆ రాక్షసుడు ఎదురుగా రాగానే రఘువీరుడు వెంటనే వానిని సంహరించెను. రాక్షసుడు ఒక దివ్య శరీరమును ధరించెను. దుఃఖితుడై ఉన్న ఆతనిని స్వామి తన నిజధామమునకు పంపెను. సుందరులగు అనుజ, జానకీ సహితుడై రాముడు అనంతరము శరభంగముని ఆశ్రమమునకు అరుదెంచెను. రాముని ముఖపంకజమును కనుగొని శరభంగుని లోచన భృంగములు సాదరముగా వాని మకరందరసమును ఆస్వాదించినవి. శరభంగుని జన్మ అతి ధన్యమయ్యెను.

''రఘువీరా, కృపాళూ, శంకరమానస రాజమరాళమా, అవధరింపుము - నేను విరించి ధామమునకు వెడలుచుండగా ''రాముడు వనములకు రానున్నాడని'' వింటిని. ఆనాటినుండియు రాత్రింబవళ్ళు నీకై నిరీక్షించుచుంటిని. నేడు ప్రభుని వీక్షించి నా హృదయమున సంతృప్తి కలిగినది. నాథా, నేను సాధనహీనుడను. నేను దీనజనుడనని తెలిసికొని నీవే నాపై కృప చూసితిని. దేవా, ఇది నా ఒక్కనిపై నీవు చూపు అనుగ్రహమే కాదు. భక్త చిత్త చోరా, నాపై కృపచూపి నీ ప్రతిజ్ఞను నిలుపుకొంటివి. నేను నాతనువును త్యజించి నీలో ఐక్యమగు నంతవరకు నీవు నాఎదుట నిలువుము,'' అని శరభంగుడు ప్రార్థించెను.

తాను కావించిన యోగ, యజ్ఞ, జప, తవ, వ్రతములు - అన్నిటిని శరభంగముని ప్రభునికి సమర్పణచేసి ప్రభునివద్ద భక్తిని వరము పొందెను. చితిని పేర్చి నిస్సంగహృదయుడై ఆతడు దానిపై ఎక్కి కూర్చుండెను.

''నీలమేఘ శ్యామశరీరా, సగుణరూపా, శ్రీరామా, సీతాలక్ష్మణ సమేతుడవై నిరంతరము నా హృదయమున వసింపుము.'' అని పలికి ఆ ముని యోగాగ్నిచే తన తనువును దహించి వైచికొనెను. రామకృపచే వైకుంఠమునకు చనెను. ప్రథముననే శరభంగముని భేదభక్తిని వరముగా పొందెను. కనుక ఆతడు శ్రీ హరియందు లీనము కాలేదు.

ఋషినికాయములు శరభంగముని వరుని ఉత్తమగతిని కనుగొని హృదయానందమును పొందిరి.

''ప్రణత హితకారికి, కరుణానిధికి జయము'' అని సకలముని బృందములు రాముని స్తుతించిరి.

పిదప రఘునాథుడు ముందుకు పయనము సాగించెను, మునివర సమాజములు - పెక్కు ఆయనవెంట నడచిరి. దారిలో ఒకచోట అస్థి సమూహమును చూచి రఘునాథునికి దయకలిగి ''ఇవి ఎవరివి?'' అని ఆతడు మునులను ప్రశ్నించెను.

''స్వామీ, నీవు సర్వ ద్రష్టపు - సర్వ అంతర్యామివి. తెలిసియు మమ్ము ఎట్లు ప్రశ్నించుచున్నావు ! నిశాచర సమూహములు మునులనందరను కబళించెను.'' అని మునులనిరి. ఈ పలుకులు విని రఘువీరుని కన్నుల నీరు క్రమ్మెను.

''ఈ మహీతలమును నిశాచరవిహీనము కావింతును'' అని ఆతడు తన చేతులు పైకెత్తి ప్రతిన చేసెను. ఆతడు సకలమునుల ఆశ్రమములను వరుసగా దర్శించి మునులకు ఆనందము ప్రసాదించెను.

అగస్త్యమునికి జ్ఞాని అగు ఒక శిష్యుడు కలడు. ఆతని పేరు సుతీక్షుణడు. భగవత్ర్పేమ కలవాడు అతడు. మనోవాక్‌ కర్మలయందు రామపాద సేవకుడు. స్వప్నముననైనను ఇతర దైవములను అతడు నమ్మడు. ప్రభునిరాక ఆతని చెవుల పడినవెంటనే ఆతడు నానావిధ మనోరథములతో ఆతురతతో పరుగెత్తి వచ్చెను.

''ఓవిధీ, దీనబంధుడగు రఘునాథుడు నా వంటి దుష్టులయందునూ దయచూపునా ? అనుజ సహితుడై రాముడు నన్ను తన సేవకునిగాఎంచి ఆదరించునా? దీనిని గురించి నా హృదయమున దృఢమగు నమ్మకము కలుగుటలేదు. నాకు భక్తిలేదు. వైరాగ్యములేదు. జ్ఞానములేదు. సత్సంగములేదు. యోగము, జపములులేవు. యజ్ఞమునై నను చేయలేదు నేను. స్వామియొక్క చరణకమలములయందు నాకు దృఢమగు అనురాగమైననులేదు. ''వేరొకగతిలేనివాడు నాకు ప్రియుడు'' అను కరుణానిధిఅగు ప్రభునిపలుకే నాకుగతి.

అహో, భవవిమోచన కరుడగు భగవానుని వదనపంకజమును కనుగొని నేడు నా కన్నులు పావనమగును !'' అని సుతీక్షుణడు తలచెను.

భవానీ, జ్ఞానిఅగు ఆ ముని పరిపూర్ణప్రేమ నిమగ్నుడయ్యెను. అతని స్థితిని వర్ణింపలేము. దిశలు. విదిశలు మార్గములు అతనికి కనుపించుటలేదు. తాను ఎవ్వడో, ఎక్కడికి పోవుచున్నాడో కూడా అతనికి తెలియుటలేదు. కొంతతడవు అతడు వెనుకకు పోవును. మరికొంతసేపు ముందుకుపోవును. ఇక కొంతసేపు ప్రభుని గుణగానముచేయుచు నృత్యముచేయును.

అవిరళమగు ప్రేమభక్తి ఆ మునికి సంప్రాప్తించెను. చెట్టుచాటునదాగి రఘువీరుడు అతనిని వీక్షించినాడు. భవభయనాశకుడగు స్వామి ఆ మునియుక్క హృదయమున సాక్షాత్కరించినాడు. మార్గమధ్యమున సుతీక్షుణడు కదలలేక అచలుడై కూర్చుండెను. అతని శరీరముపులకించి పనసపండువలె అయ్యెను.

అంతట రఘునాథుడు మునిని సమీపించెను. తనభక్తుని స్థితినిచూచి ప్రభుని మనస్సు ప్రసన్నమయ్యెను. మునిని రాముడు పలువిధముల మేల్కొలిపెను. కానిముని మేలుకొనడాయె. ధ్యానజనితమగు ఆనందము అతనికి సంప్రాప్తించెను. తనరాజరూపమును రాముడు మఱగుపరచెను. సుతీక్షుణని హృదయమున ఆతడు చతుర్భుజ రూపమున సాక్షాత్కరించెను. శ్రేష్ఠమగు ఒకసర్పము మణిలేక వ్యాకులపడునట్లు ముని ఆందోళనచెందెను. అతడు లేచినిలచెను. శ్యామశరీరుడై, సీతాలక్ష్మణ సహితుడై సుఖధాముడైన రాముని ఆ ముని కనుగొనెను. కడు భాగ్యవంతుడగు ఆ మునివరుడు ప్రేమమగ్నుడై కట్టెవలె రాముని పాదములపై పడెను. తన విశాల బాహువులతో రాముడు పరమ ప్రీతితో అతనిని లేవనెత్తి హృదయమునకు హత్తుకొనెను. కృపాళుడగు రాముడు మునిని ఆలింగనము చేసికొనినపుడు కనక తరువును తమాల వృక్షము కౌగలించుకొనినట్లు శోభిల్లినది. రాముని వదనమును విలోకించుచు ముని కదలక నిలచెను. చిత్రించిన బొమ్మవలె అతడున్నాడు. కొంత తడవునకు ముని తన హృదయమున ధైర్యమువహించి పదేపదే రామపాదములను స్పృశించెను. తన ఆశ్రమమునకు రామునితోడ్కొనివెడలి సుతీక్షుణడు ఆతనిని వివిధ విధములపూజించి ఇట్లు స్తుతించెను.

''ప్రభూ, నా వినతిని అవధరింపుము. నేను ఏవిధిని నిన్ను స్తుతింపగలను? నీ మహిమ అపారము. సూర్యునిముందు మిణుగురు పురుగుయొక్క కాంతివలె నా బుద్ధి అల్పము.

నీలకమల మాలవలె శ్యామలశరీరుడవై, మకుటమున జటాజూటమును ధరించి మునివల్కలధారివై, కరమున శరచాపములను పట్టి, కటిని తూణీరమును కట్టి, నా ఎదుట ప్రత్యక్షమైన రఘువీరా, ప్రభూ, నీకు నిరంతరము వందనమొనర్తును.

మోహమను ఘనవనమునకు కృశానుడు, భక్తులను కమల వనమును వికసింపచేయు భానుడు. నిశాచరులనబడు గజయూథమును భంజించు మృగరాజు, భవరూపపక్షులకు డేగ, అగుప్రభువు నన్ను సదా రక్షించుగాక !

అరుణ కమలసమ నయనుడు, సుందరవేషధరుడు, సీతానయన చకోరచంద్రుడు, హరుని హృదయమానస బాలహంస, విశాల హృదయుడు, దీర్ఘబాహుడు అగు రామునికి నేను నమస్కరింతున.

సంశయమను సర్పమును కబళించు గరుడుడు, అతి కఠోరతర్కజనిత విషాదహరుడు, భవవంజనుడు, సురయూథములకు ఆనందప్రదుడు కృపారాశి సదా నన్ను రక్షించుగాత.

నిర్గుణ, సగుణ, విషమ, సమరూపుడు, జ్ఞానమునకు, వాక్కునకు, ఇంద్రియములకు అతీతుడు, అనుపముడు, అమలుడు, దోషరహితుడు, అపారుడు, మహీభారభంజకుడు అగు రామునికి నమస్కరింతును.

భక్తులపాలిటి కల్పవృక్షవనము, కామక్రోధ, మద, లోభభంజనుడు, అతి చతురుడు, భవసాగరమును తరించుటకు నావ - అగు దినకర కులకేతువు రాముడు నన్ను సదా రక్షించుగాత !

అనన్య భుజ పరాక్రమశాలి, బలధాముడు, కలియుగవిపుల పాపవిధ్వంసకుడను బిరుదువహించినవాడు, ధర్మసంరక్షకుడు, నిజగుణజాలములచే ఆనందము నిచ్చువాడు, శ్రీరాముడు సంతతము నాకు శుభ ప్రదుడుగాక.

ఖరారీ, నీవు నిర్మలుడవు. సర్వ వ్యాపకుడవు. అవినాశివి. నిరంతర సకల హృదయనివాసివి. ఐనను శ్రీదేవీ లక్ష్మణసమేతుడవై, అడవులలో విహరించు రూపమున నా మానసమున నివసింపుము.

నీవు సగుణుడవని, నిర్గుణడువని, అంతర్యామివని తెలిసినవారు అట్లే తెలిపి కొందురుగాక. కోసలపతి, రాజీవనయనుడు రాముడు నా హృదయమును తన నిలయము కావించుగాక !

'నేను సేవకుడను. రఘుపతి నా స్వామి' అను అభిమానము ఎన్నడూ నన్ను విడువక ఉండుగాక !''

మునియొక్క వచనములనువిని రామునిమనము మిక్కిలి ఉప్పొంగెను. హర్షమున రాముడు మునివరుని తన ఉరమునకు హత్తుకొనెను.

''నేను అత్యంత ప్రసన్నుడనైతినని గ్రహించుము. మునీ, నీవు కోరినవరము ప్రసాదింతును'' అని ఆతడనెను.

''ఎన్నడూ ఏ వరమును నేను కోరలేదు. ఏది సత్యమో, ఏది అసత్యమో, నాకు తెలియదు.

రఘుపతీ, దాసులకు నీకు సుఖప్రదుడవు. నీకు మంచిదని తోచినదానిని నాకు అనుగ్రహింపుము'' అని సుతీక్షుణముని సమాధాన మిడెను.

''అవిరళ భక్తి, వైరాగ్య, విజ్ఞాన, సకలగుణ, జ్ఞాననిధిని కమ్ము'' అని రాముడు ఆ మునికి వరమొసగెను.

''ప్రభువు ప్రసాదించిన వరమును స్వీకరించితిని. ఇక నేను కోరువరమును అనుగ్రహించుము'' అని ముని కోరెను.

''అనుజ, జానకీ సమేతుడవై ప్రభూ, చాప, బాణధరుడవై, రామా, గగనమున చందురునివలె నా హృదయమున, సదా స్థిరముగా నివసింపుము'' అని వరమును ఆ ముని వేడెను.

'తథాస్తు' అనివచించి రమానివాసుడు సంతోషమున కుంభ సంభవ ఋషివద్దకు పయన మయ్యెను.

''నాగురుని దర్శించి ఈ ఆశ్రమమునకు వచ్చి చాలా దినములైనది. నే నును ప్రభునివెంట నా గురునివద్దకు ఇప్పుడు వత్తును.స్వామీ, ఇందువలన నీకు భారమేదియు కలుగదు'' అని సుతీక్షుణడు వచించెను. మునియొక్క చాతుర్యమును కనుగొని కృపానిధి అగు రాముడు అతనిని తనవెంట తోడ్కొని వెడలెను. సోదరులిరువురు చిరునవ్వు నవ్విరి. మార్గమున - తనయందలి అనుపమ భక్తిని గురించి వర్ణించుచు సురభూపాలుడు అగస్త్యమునియొక్క ఆశ్రమమును చేరెను. వెంటనే సుతీక్షుణడు తన గురుని సమీపించి, సాష్టాంగ దండప్రణామముచేసి ''దేవా, రాత్రింబవళ్లు ఎవనికొరకై నీవు జపించుచుంటివో ఆ కోసలాధీశకుమారుడు, జగదాధారుడు, రాముడు అనుజ, వైదేహీ సహితుడై నిన్నుచూచుటకై ఏతెంచినాడు'' అని నుడివెను.

ఈ మాటలు వినినవెంటనే అగస్త్యుడు లేచి పరుగెత్తెను. హరిని విలోకించినంతనే ఆతని కన్నులు జలభరితములయ్యెను. సోదరు లిద్దరు మునియొక్క పాదకమలములపై పడిరి. అతి ప్రేమతో ఋషి వారిని లేవనెత్తి తన హృదయమునకు హత్తుకొనెను. జ్ఞాని అగు ఆ ముని సాదరముగా వారిని కుశలప్రశ్న లడిగి, ఉచిత ఆసనముల ఆసీనుల చేసెను. అనేక విధముల ప్రభుని పూజించి ''నా వంటి భాగ్యవంతుడు ఇంకెవ్వడూ లేడు నేడు'' అని అనెను. అచ్చట ఉన్న ఇతర మునిగణము లెల్లరు ఆనందనిలయుడగు రాముని విలోకించి సంతసించిరి. మునులకు అభిముఖుడై రాముడు కూర్చుండెను. చకోరసమూహము శరచ్చంద్రుని వంక చూచుచున్నట్లున్నది !

''ప్రభూ, నీ వద్ద దాపరిక మేమున్నది? నేను వచ్చిన కారణము నీకు తెలియనే తెలియును. కనుక తండ్రీ, ఏమియు నీకు నేను చెప్పలేదు. మునిద్రోహులను ఎట్లు నేను సంహరింపగలనో ఆ ఉపాయము నాకు తెలుపుము'' అని రఘువీరుడు అగస్త్యుని కోరెను. స్వామియొక్క మాటలను విని ముని మందహాసము చేసెను.

''ప్రభూ, నాకు ఏమి తెలియునని నన్నిట్లు ప్రశ్నించితివి ? పాపవిధ్వంసకా. నీ భజన ప్రభావమువలన నీ మహిమను ఏదో కొంత తెలిసికొంటిని. విస్తరించిన మేడిచెట్టువంటిది నీ మాయ. అనేక బ్రహ్మాండ సమూహములు దానియొక్క పండ్లు, చరాచర జీవములన్నియు మేడిపండులో నివసించుచు ఇతర లోకమును ఎఱుగని క్రిముల వంటివి. ఆ ఫలములను భక్షించువాడు కఠినుడు, కరాళుడు అగు కాలుడు. ఆతడు సహితము నిరంతరము నీ వనిన భయపడుచునే ఉండును.

సకలలోక పాలకులకు ఈశ్వరుడవు నీవు. ఒక మనుష్యునివలె నన్ను ప్రశ్నించితివి. కృపానిలయా, ఒక్క ఈ వరమును కోరుకొందును. సీతాలక్ష్మణ సమేతుడవై నా హృదయమున వసియింపుము. అవిరళభక్తిని, వైరాగ్యమును, సత్సంగమును, నీ చరణ కమలములయందు దృఢభక్తిని నాకు సంప్రాప్తింపచేయుము. అఖండుడవు. అనంతుడవు అగు బ్రహ్మవు నీవు. భక్తజనులచే భజింపబడు నీవు అంతర్‌ జ్ఞానమువలననే తెలియబడుదువు : ఇట్టి నీ రూపమును తెలిసియు, వర్ణించియు, మరల మరల సగుణ బ్రహ్మమునందే నాకు ప్రీతి కలుగుచున్నది. నీ దాసులకు సదా నీవు మహిమను ఆపాదింతువు. రఘునాథా, కనుకనే నన్ను ప్రశ్నించితివి. ప్రభూ, పరమ మనోహరము, పవిత్రము అగు ఒక స్థలము కలదు. పంచవటి అని దాని పేరు. స్వామీ, నీవు దండకవనమును పావనము చేయుము. మునివరుని ఉగ్రశాపమునుండి దానికి విముక్తి ప్రసాదించుము. రఘుకులపతీ, అచ్చట నివసించి సకల మునులపై కృప చూపుము'' అని అగస్త్యముని రాముని ప్రార్థించెను.

ఆ మునియొక్క ఆనతిని కొని రాముడు పయనము సాగించెను. శీఘ్రమే పంచవటిని చేరెను. అచ్చట గృధ్రరాజు జటాయువును ఆతడు కలసికొనెను. నానా విధముల ఆతనితో మైత్రిని వృద్ధి కావించుకొని ప్రభువు గోదావరికి సమీపమున ఒక పర్ణకుటీరము నిర్మించి నివసింప మొదలిడెను.

రాముడు అచ్చట నివాసము ఏర్పరచుకొనిన నాటినుండియు అచ్చటి మునులెల్లరు భయరహితులై ఉండిరి. గిరులు, వనములు, నదులు, తటాకములు నిత్యనూతనశోభను పొందుచున్నవి. ఖగ, మృగ సమూహములు అన్నియు ఆనందమును అనుభవించుచుండెను. తుమ్మెదలు మధుర నిస్వనములు కావించుచు చెవులకు ఇంపుకలిగించుచుండెను. రఘువరుడు ప్రత్యక్షముగా ప్రకాశించుచున్న ఆ వనమునకు ఫణిరాజైనను వర్ణింపజాలడు.

ఒకానొక దినమున ప్రభువు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ సమయమున లక్ష్మణుడు అతనితో కపటరహిత వచనములను ఇట్లు వేడెను.

''సుర, నర, ముని, చరాచర గణములకు ప్రభువగు స్వామీ, నిన్ను వేడుదును. దేవా, నాకు ఉపదేశింపుము. సర్వమును త్యజించి నేను నీ చరణరజసేవను చేయు మార్గమేది ? జ్ఞానమును, వైరాగ్యమును, మాయను వర్ణించి తెలుపుము. నీ కృపా వీక్షణములను పొందగల భక్తి ఏది ? స్వామీ, ఈశ్వరునికి, జీవునికి కలభేదమేదియో వచింపుము. నీచరణములయందు నాకు భక్తి ఉండునట్లును. నేను శోక, మోహ, భ్రమ రహితుడ నగునట్లును వివరించి, బోధించుము.''

అంతట శ్రీరాముడు ఇట్లు ఉపదేశించెను :- ''నాయనా, సర్వము క్లుప్తముగా తెలియచేతును. నీ మనస్సును, చిత్తమును, బుద్ధిని లగ్నముచేసి వినుము. ''నేను, నాది''. ''నీవు - నీది'' అనునదియే మాయ. సకల జీవులను ఇదియే వశము చేసికొనును. ఇంద్రియములకు, మనస్సునకు గోచరమగునది సర్వము 'మాయయే' అని గ్రహించుము. మాయయందలి భేదములను వినుము. సోదరా, విద్య, అవిద్య అని మాయ రెండు విధములు. అవిద్య దోషయుతమైనది. అత్యంత దుఃఖరూపమైనదియును. అవిద్యావశులై జీవులు భవకూపమున పడిఉందురు.

ఇక విద్య, గుణములు దీనివశ##మై ఉండును. ఇదియే జగత్తును సృష్టించునది. దీనిప్రేరకుడు ప్రభువు. దీనికి స్వీయబలములేదు. అభిమానము మొదలగు దోషములు ఏ ఒక్కటియు ఎందు లేవో ఎయ్యది సమానరూపమున అంతటా బ్రహ్మమును చూచునో అదియే జ్ఞానము.

సర్వసిద్ధులను, త్రిగుణములను, తృణప్రాయముగా చూచువాడే పరమవిరాగి అని తెలియవలెను. తమ్ముడా, మాయను, ఈశ్వరుని, తన స్వస్వరూపమును తెలియనివాడే జీవుడు అనబడును.

బంధనములను తొలగించి, మోక్షమును ప్రసాదించువాడు, సకలమునకు అతీతుడు, మాయా ప్రేరకుడు - ఈశ్వరుడు - శివుడు.

ధర్మాచరణచే వైరాగ్యము జనించును. యోగమువలన జ్ఞానము కలుగును. మోక్షమునుఇచ్చునది జ్ఞానము. ఇట్లని శ్రుతులు వచించును. కాని, సోదరా, భక్తియే నన్ను శీఘ్రముగా ప్రసన్నునిచేయును. భక్తులకు ఆనందమునిచ్చునది నా భక్తి. భక్తి స్వతంత్రమైనది. ఇతర సాధనములయొక్క సహాయము దానికిఅక్కరలేదు. జ్ఞానము, విజ్ఞానము భక్తిపైననే ఆధారపడి ఉండును. నాయనా, భక్తి సాటిలేనిది. సుఖమునకు అది మూలము. సాధుసజ్జన మహాత్ముల అనుగ్రహము ఉన్నప్పుడే భక్తి సంప్రాప్తించును.

ఇక భక్తిసాధనములను వివరింతును. జీవులు నన్ను పొందుటకు సుగమమగు మార్గము భక్తియే. మొట్టమొదటి సాధనము విప్రచరణములయందు అత్యంతమగు భక్తి ఉండుట. రెండవది వేదవిధిని, వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి స్వకర్మనిరతుడై ఉండుట. విషయ సుఖములయందు వైరాగ్యము జనించుటయే దీనిఫలితము. అంతట భగవద్ధర్మములయందు ప్రేమ ఉత్పన్నమగును. పిదప శ్రవణము, [స్మరణము, అర్చనము, కీర్తనము, పాదసేవ, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదన] అను నవవిధ భక్తులు దృఢమగును. మనస్సున నా లీలలయందు అత్యంతప్రేమ ఏర్పడును. మహాత్ముల చరణ కమలములయందు మిక్కుటమగు ప్రేమ నా భక్తునికి జనించును. మనోవాక్కర్మలయందు భజనయందు దృఢనియమము ఆతనికి కలుగును. నన్నే గురువుగా, తల్లిగా, తండ్రిగా, సోదరునిగా, పతిగా, దేవునిగా ఎంచి అతడు దృఢమగు సేవచేయును.

నా గుణగానము కావించునపుడు ఎవని శరీరము పులకించునో, ఎవనిమాట గద్గదమగునో, ఎవని కన్నులు నీరుకారునో, కామ, మద, దంభములు ఎవనికి ఉండవో-సోదరా, అట్టివాని వశుడనై నేను ఉందును.

మనో, వాక్‌, కర్మలయందు ఎవనికి నేనేగతియో నిష్కామభావమున ఎవడు నన్ను భజించునో, అట్టివాని హృదయకమలమున నేను సదా విశ్రమింతును.''

ఈ భక్తియోగమునువిని లక్ష్మణుడు మహా ఆనందమును పొందెను. ప్రభునిచరణములపై అతడు తలవంచి వందనముచేసెను. ఇట్లు వైరాగ్య జ్ఞాన ధర్మ గుణములను గురించి, నీతిని గురించి రాముడు బోధించుచుండెను.

కొంతకాలము గడచెను

రావణునికి శూర్పణఖఅను సోదరికలదు. సర్పమునకువలె దాని హృదయము దుష్టమైనది. దారుణమైనది. ఒకదినమున అది పంచవటికి వచ్చెను. రాకుమారులను ఇద్దరిని చూచెను. కలవరపడెను.

గరుడా, మనోహరుడగు పురుషునిచూచి, అతడు సోదరుడైనను, తండ్రియైనను, పుత్రుడైనను సరే - సూర్యునిచూచి సూర్యకాంతమణి ద్రవించునట్లు దుష్ట స్త్రీ వ్యాకులపడును. మనస్సును ఆమె నిరోధించుకొన జాలదు. శూర్పణఖ ఒక సుందర రూపమును ధరించి ప్రభుని సమీపించెను. చిరునవ్వు నవ్వుచు:-

''నీవంటి పురుషుడు ఎవ్వడూలేడు. నన్ను పోలిన స్త్రీయునూలేదు. మన ఈ సంయోగము ఎంతో యోచించి విధాత సృజించినాడు. ముల్లోకములు గాలించితిని. నాకు తగినపురుషుడు జగమున ఎవ్వడూ లేనేలేడు. కనుకనే ఇంతవరకు నేను కుమారినై ఉంటివి. నేడు నిన్ను కనుగొంటిని. నా మనసు కుదుటపడినది'' అని అది పలికెను.

సీతవంకచూచి రాముడు ''నా తమ్ముడు కుమారుడు'' అనెను. ఆ రాక్షసి వెంటనే లక్ష్మణునివద్దకు చనెను. అది తమ శత్రువుయొక్క సోదరి అని లక్ష్మణుడు తెలిసికొనెను. ప్రభుని విలోకించుచు అతడు మృదువాణితో.

''సుందరీ, వినుము. నేను ఆయన దాసుడను. పరాధీనుడను. నా వలన నీకు సుఖము ఉండదు. ఈ ప్రభువు సమర్థుడు, కోసలాధీశుడు. ఆతడు ఏమిచేసినను రాణించును. సుఖమును కోరుసేవకుడు, సన్మానమును ఆశించు బిచ్చగాడు. ధనమును కోరువ్యసనుడు, సద్గతిని అభిలషించు వ్యభిచారి, యశమును కావలెననుకొనులోభి, ధర్మ, అర్థ, కామ, మోక్షములను కాంక్షించు దురభిమానియు ఊహా ప్రపంచమున జీవించువారు. ఆకసమునుండి పాలుపితికి తెచ్చుకొన గోరుదురువీరు'' అనెను.

శూర్పణఖ తిరిగి రామునివద్దకు వచ్చినది. ప్రభువు ఆమెను మరల లక్ష్మణుని వద్దకు పంపెను.

''సిగ్గును విడిచిపెట్టినవాడే నీకు పతికాతగును'' అని లక్ష్మణుడు దానితోఅనెను. వెంటనే అది క్రుద్ధురాలై రామునివద్దకు చనెను. తన భయంకర రూపమును ప్రకటించెను.

సీత భయపడుచున్నట్లు కనుగొని రఘునాథుడు లక్ష్మణునికి సంజ్ఞచేసెను. ఆ రక్కసి రావణునివద్దకు చని, యుద్ధమునకు పొమ్మని అతనిని పురికొల్పుటకో అనునట్లు, లక్ష్మణుడు దాని ముక్కు చెవులను అతి లాఘవమున కోసి వై చెను. ముక్కు, చెవులను కోల్పోయి శూర్పణఖ భయంకరాకారి అయ్యెను. పర్వతమునుండి ఎఱ్ఱని నీటిధార ప్రవహించుచున్నట్లున్నది అది ! విలపించుచు ఆదిపోయి ఖరదూషణులవద్ద చేరినది.

''అన్నలారా, ఛీ, ఛీ ఎందుకురా మీ పౌరుషము ? ఎందుకురా మీ బలము ?'' అని ఆమె అనినది.

''ఏమి జరిగినదే?'' అని వారు దానిని ప్రశ్నించిరి. జరిగినదంతయు శూర్పణఖ వివరించెను. అంతయు విని రాక్షసులు సేనను సిద్ధము కావించిరి. తండోప తండములుగా నిశాచర సముదాయములు పరుగెత్తివచ్చినవి. రెక్కలున్న, కాటుకవంటి పర్వతసమూహములో అన్నట్లున్నవి అవి. రాక్షసులు అనేకవాహనములపై ఎక్కిరి. పలువిధములగు ఆకారములను తాల్చిరి. అపారసంఖ్యలలో ఉన్న - వారు అనేక విధములగు, అగణిత, భయంకర ఆయుధములను ధరించిరి.

ముక్కు చెవులు లేనిది. అశుభస్వరూపిణిఅగు శూర్పణఖను వారు తమముందు నిలిపిరి. భయంకరమగు అపశకునములు అనేకములు కనుపించెను. కాని, మృత్యువశులై రక్కసులు వానిని లెక్కచేయరైరి. రాక్షసులు గర్జించిరి, కవ్వించిరి, ఆకసమున ఎగిరిరి. యోధులనుకాంచి ఆ సైన్యము అత్యంత హర్షము కాంచెను.

''ఆ ఇద్దరు అన్నదమ్ములను సజీవులనుగా పట్టుకొనుడు ! పట్టుకొని వారిని చంపుడు. ఆ స్త్రీని ఈడ్చుకొనిరండు'' అని కొందరు కేకలువేసిరి. నభోమండలము అంతయు ధూళితో నిండెను.

రాముడు తమ్ముని పిలచెను. ''నిశాచరుల భయానకసేన వచ్చినది. జానకిని తోడ్కొని నీవు గిరిగుహలోనికి చనుము. జాగ్రతగా ఉండుము'' అని హెచ్చరించెను.

ప్రభుని మాటలువిని లక్ష్మణుడు ధనుర్భాణములను ధరించి సీతను వెంటనిడుకొని వెడలెను.

శత్రుసేనలు సమీపించుటనుచూచి రాముడు నవ్వెను. కఠినమగు కోదండమును ఎక్కుపెట్టెను. శిరమున జటాజూటమును బంధించి ఎట్లున్నాడు ప్రభువు? మరకత మణిశైలమున రెండు సర్పములు కోటి విద్యుల్లతలతో పోరాడుచున్నట్లు? ఆతడు నడుమున అమ్ములపొదిని బిగించెను. విశాలమగు కరములలో ధనువును పట్టెను. బాణమును సరిచేసెను. రాక్షసులవంక మదించిన గజరాజ సమూహమును కాంచి మృగరాజు పొంచి ఉండునట్లు అవలోకించెను.

''పట్టుకొనుడు - పట్టుకొనుడు'' అని కేకలువేయుచు రక్కసభటులు వడివడిగా పరుగెత్తివచ్చిరి. ఒంటరియైఉన్న బాలభానుని కనుగొని దనుజులు చుట్టుముట్టిన రీతిని ఉన్నది అ దృశ్యము.

ప్రభుని వీక్షించి రజనీచరసేన కదలజాలక నిలచెను. ఆతనిపై రాక్షసులు బాణములను ప్రయోగింపజాలక పోయిరి. ఖరుడు, దూషణుడు తమ మంత్రులను పిలచిరి. ''ఈ రాకుమారుడు ఎవడో నరభూషణుడు ! నాగ, అసుర, సుర, నరముని బృందములలో ఎందరిని మనము చూచితిమో, ఎందరిని జయించితిమో, ఎందరిని సంహరించితిమో ! మన జన్మలో ఇట్టి సుందరుని ఎన్నడూ ఎక్కడా చూడలేదు. సోదరులారా, మా చెల్లెలిని కురూపిని చేసినవాడే కానిండు. ఈ సాటిలేని పురుషుడు చంపతగినవాడు కాడు. ఆతని వద్దకు చని ''నీవు దాచిన ఆ స్త్రీని మాకు సమర్పించి మీ ఇరువురు సోదరులు ప్రాణములతో తిరిగిపొండు!'' అని మా మాటలుగా తెలుపుడు. అతడు ఏమి చెప్పునో వెంటనే వచ్చి మాకు వివరింపుడు.'' అని ఖరదూషణులు చెప్పిరి. దూతలు వెడలి ఆ సందేశమును రామునికి వినిపించిరి. రాముడు మందహాసము చేసెను.

''మేము క్షత్రియులము. అడవులలో వేటాడుదుము. మీ వంటి దుష్టమృగములను వెదకుచు తిరుగుచున్నాము. బలవంతులగు శత్రువులను చూచి మేము భయపడము. ఒక్కుమ్మడి కాలునితోనైనను మేము పోరాడగలము. మనుజులమే అయినను మేము దైత్యకులాంతకులము. ముని పాలకులము. బాలకులమే మేము. కాని దుష్టులను శిక్షించువారము. మీకు శక్తిలేనిచో మీరే ఇంటికి మరలిపొండు. యుద్ధమున వెన్నిచ్చువారిని ఎవనినీ నేను సంహరింపను.

రణమునకు దండెత్తివచ్చి మోసము కావించుట, శత్రువులపై కృప చూపుట - మిక్కిలి పిరికితనము.'' అని అతడు నుడివెను.

దూతలు మరలిరి. జరిగినదంతయు ఖర, దూషణులకు వివరించిరి. ఖరదూషణులు వినిరి. వారి హృదయములు భగ్గుమనెను. ''వారిని పట్టుకొనుడు'' అని వారు ఆరచిరి. ధనుర్బాణములను, తోమారములను, శక్తులను, శూలములను, కృపాణములను, పరిఘలను, పరశువులను - భయానకులగు రాక్షసయోధులు ధరించిరి. కఠోర, ఘోర, భయావహమగు ధనుష్టంకారమును ప్రభువు మొదట కావించెను. దానిని విని రాక్షసులు చెవిటివారై కలత చెందిరి. ఆ సమయమున రాక్షసులకు చైతన్యమేలేదు.

శత్రువు బలవంతుడే అని వారు తెలిసికొనిరి. తెప్పరిల్లి, దాడిచేసి రామునిపై పలువిధములగు అస్త్రములను, శస్త్రములను ప్రయోగించిరి. వారి ఆయుధముల నన్నిటిని రఘువీరుడు ఖండించి పిండి పిండి చేసివైచెను. ఆతడు వింటినారిని ఆకర్ణాంతము సంధించెను. శరములను ప్రయోగించెను. బుసకొట్టు పాములు పరుగిడిపోవుచున్నవో అనునట్లు భీకరశరములు పరుగెత్తినని. శ్రీరాముడు సమరమున కోపోద్రిక్తుడై అతి నిశితమగు శరములను ప్రయోగించెను. వానిని కనుగొని నిశాచరవీరులు తోకలు ముడిచి, వెనుతిరిగి పారిపోయిరి.

ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు - ముగ్గురు అన్నదమ్ములు క్రుద్ధులైరి. ''యుద్ధభూమినుండి పారిపోవువారిని మా చేతులతో మేము సంహరింతుము'' అని వారు కేకలు వేసిరి.

''మనకు ఎట్లయిన చావు తప్పద''నుకొని రాక్షసులు తిరిగి యుద్ధభూమికి వచ్చిరి. వివిధ విధములగు ఆయుధములచే రాముని ఎదుట నిలిచి అతనిని ఎదుర్కొనిరి.

శత్రువులు అత్యంత కుపితులై నారని తెలిసికొని ప్రభువు ధనువున శరములను సంధించెను. అనేక నారాచములను ప్రయోగించెను. అవి పరుగిడి ఆ రక్కసులను ఖండించ మొదలిడెను. రాక్షసుల మొండెములు, తలలు, భుజములు, చేతులు, కాళ్లు ఎక్కడివి అక్కడ నేలపై రాలుచున్నవి. బాణములు తగిలి రక్కసులు ఘీంకరించు చున్నారు. కొండలవలె కూలి పడుచున్నారు. రాక్షసభటుల శరీరములు తెగి వందల కొలది ముక్కలగుచున్నవి. వెంటనే మయాచే అవి లేచుచున్నవి. ఎన్నో చేతులు, తలలు ఎగురుచున్నవి. తలలు లేకనే కొన్ని పరుగెత్తుచున్నవి. కాకులు, గ్రద్దలు. నక్కలు, భయంకర కఠోర శబ్దములు చేయుచున్నవి. జంబూకములు తమ పండ్లను కొరకుచున్నవి. భూత, ప్రేత, పిశాచములు కపాలములను ప్రోగు చేసికొనుచున్నవి. వీరవైతాళికులు కపాలములతో తాళములు వాయించుచున్నారు. యోగినులు నృత్యము చేయుచున్నారు. రఘువీరుని ప్రచండశరములు రాక్షసభటులు వక్షస్థలములను, భుజములను, శిరములను ముక్కలు ముక్కలు చేసి వేయుచున్నవి. పడినచోట్లనుండి ఆ ముక్కలు తిరిగి లేచుచున్నవి. మరల పోరుచున్నవి. ''పట్టుకొనుడు పట్టుకొనుడు'' అను భయంకర నినాదములు చేయుచున్నవి. శవముల ప్రేగులను పీకికొని గ్రద్దలు ఎగురుచున్నవి. మరికొన్ని ముక్కలను పిశాచములు తమ చేతులతో పట్టుకొని పారిపోవుచున్నవి. సంగ్రామ పురవాసులగు పెక్కురు బాలురు గాలిపటములు ఎగురవేయుచున్నారో అనునట్లున్నది. అనేకమంది భటులు - గాయపడినవారు - క్రిందపడినవారు - గుండెలు చీల్చబడినవారు - నేలపై బాధతో ఏడ్చుచున్నారు. తమ సైన్యము కలవరపడిఉన్నట్లు కనుగొని త్రిశిర, ఖర, దూషణులు రామునివైపు వచ్చిరి. అసంఖ్యాకులగు నిశాచరులు క్రుద్ధులై - శరములను, శక్తిని, తోమారములను, పరశువులను, శూలములను, కృపాణములను, ఒక్క పెట్టున శ్రీరఘువీరునిపై ప్రయోగింప మొదలిడిరి. నిమిషమాత్రమున ప్రభువు శత్రు శరములను ఖండించి వేసెను. కయ్యమునకు కవ్వించుచు వారిపై శరములను ప్రయోగించెను. ఒక్కొక్క నిశాచర నాయకుని హృదయమున పదేసి బాణములు రాముడు ప్రయోగించెను. రాక్షసయోధులు నేలపై పడిరి. లేచిరి. తిరిగి ఢీ కొనిరి. కాని చచ్చుటలేదు. అనేక మాయలను ప్రయోగించు చున్నారు. పదునాలుగువేల రాక్షసులు ! అయోధ్యాధిపతి ఒక్కడు ! దీనిని చూచి దేవతలు భయపడిరి - సురలు మునులు భయపడుటను ప్రభువు కనుగొనెను. మాయానాథుడగు అతడు ఒక మహా వినోదము కావించెను. దానిచే - శత్రుసేనలో ఒకరినొకరు రామునివలె కనుపించిరి. వారిలో వారు కొట్టుకొని చచ్చిరి. రాక్షసులు అందరు ''రామ రామ'' అనుచు తనువులను త్యజించి నిర్వాణ పదమునకు పోయిరి. కృపానిధానుడు ఈ ఉపాయము చేసి క్షణములో రిపులను సంహరించెను.

దేవతలు సంతోషించి, పూలవాన కురిపించిరి. నభమున నగారాలు మ్రోగినవి. స్తుతి కావించి పలు విమానములపై సుశోభితులై సురలు వెడలిరి. రఘునాథుడు యుద్ధమున శత్రువులను జయించి, సుర, నర, మును లెల్లరి భయము తొలగిన పిదప సీతను వెంటబెట్టుకొని లక్ష్మణుడు వచ్చెను. అతడు రాముని చరణములపై పడగానే ప్రభువు అతనిని లేవనెత్తి తన హృదయమునకు హత్తుకొనెను.

శ్యామల, కోమల శరీరుడగు రాముని సీత పరమ ప్రేమతో వీక్షించెను. ఆమె నేత్రములకు సంతృప్తియేలేదు.

పంచవటిలో వసియించుచు శ్రీరఘునాయకుడు సురలకు మునులకు సుఖదాయకములగు అనేక కృత్యములను కావించుచుండెను.

ఖరదూషణుల నిర్మూలనమును చూచి శూర్పణఖ రావణుని వద్దకు చనినది. అమిత కోపముతో ఆమె ''నీ దేశమును కోశమును కూడ నీవు మరచిపోతివి. త్రాగి రాత్రింబవళ్ళు నిద్రపోవుచున్నావు. శత్రువు నీ నెత్తిమీద నిలుచున్నాడని నీకు స్పృహయే లేదు.

నీతిలేని రాజ్యము, ధర్మములేని ధనప్రాప్తి హరికి సమర్పించని సత్కర్మాచరణ. వివేకము కలిగించని విద్యాభ్యాసము - ఫలితము ఆ రాజునకు, ధనికి, కర్మాచరణ చేయువానికి, విద్యార్థికి శ్రమయే.

విషయాశక్తిచే సన్యాసి, దుష్టమంత్రాంగముచే రాజు, త్రాగుడుచే సిగ్గు, నమ్రత లేకుండుటచే వివేకము, అహంకారముచే జ్ఞానము, గర్వముచే బుద్ధి, ప్రతిఫలముచే మైత్రి నశించునని నీతివేత్తలు చెప్పగా వింటిని. అగ్నిని, శత్రువును, రోగమును, పాపమును, ప్రభువును, పామును - చిన్నవని ఎన్నడును తలంపరాదు.'' అని రావణునికి చెప్పి అనేక విధముల విలపించి ఏడువసాగినది శూర్పనఖ. రావణుని కొలువుమధ్య ఆమె కలవరమున పడిపోయినది. బహురీతుల రోదనము చేసినది. ''ఓరీ దశకంథరా, నీవు బ్రతికివుండగానే నాకు ఈ గతి పట్టవలయునురా?'' అని ఏడ్చుచు కేకలు వైచినది.

శూర్పణఖయొక్క రోదనవిని సభాసదులందరు విహ్వలురై లేచి నిలచిరి. ఆమె చేతులు పట్టుకొని లేవదీసిరి. ఓదార్చిరి. ''నీ విషయమేదో చెప్పవే - నీ ముక్కు చెవులు కోసిన వాడెవడే?'' అని లంకేశుడు ఆమెను ప్రశ్నించెను.

''అయోధ్యాపతిఅగు దశరథుని కొడుకులు పురుష సింహములు. వేట కై అడవులకు వచ్చిరట. వారు ధరణిని నిశాచర రహితముగా చేతురని నాకు తోచుచున్నది.

దశాననా, వారి భుజబలమును చూచుకొనియే మునులు అడవులలో నిర్భయులై తిరుగ మొదలిడినారు. చూచుటకు వారు బాలకులే - కాని కాలునికి సములు. ధీరాతి ధీరులు, ధనుర్ధరులు, నానా గుణసంపన్నులు. ఆ ఇద్దరు అన్నదమ్ముల బలప్రతాపములు సాటిలేనివి. దుష్టులను వధించుటయందును, సురలకు మునులకు సుఖమును ప్రసాదించుటయందును వారు నిమగ్నులై ఉన్నారు. శోభానిలయుడు ఒకడు. అతని పేరు రాముడు. ఆతనితో ఒక సుందర నారియును కలదు. శతకోటి రతులైనను ఆమె ముందు దిగదుడుపే. ఆ నారిని అంతటి సౌందర్యరాశిగా విధాత సృష్టించినాడు. ఆ రాముని తమ్ముడే నా చెవులను ముక్కును కోసినది. నేను నీ సోదరినని తెలిసికొని అతడు నన్ను పరిహసించినాడు. నా కేకలు విని ఖరదూషణులు నాకు సహాయపడవచ్చిరి. కాని, ఆ రాముడు ఒక్కక్షణములోనే ఆ సేననంతను సంహరించెను.'' అని శూర్పణఖ వివరించినది.

ఖరదూషణులు, త్రిశిరుడు వధింపబడినారని విని దశాననుని శరీరమంతయు భగ్గుమనెను. అతడు శూర్పణఖను ఓదార్చినాడు. బహురీతుల తన బలమును వర్ణించినాడు. అతి చింతావశుడైనాడు. తన భవనమునకు చనినాడు. ఆ రాత్రి అతనికి నిదుర లేనే లేదు.

''సుర, నర, అసుర, నాగ, ఖగములలో ఎవ్వరూ నా అనుచరులను ఎదిరించగలవారు లేరు. ఖరదూషణులు నా అంతటి బలవంతులు. భగవంతుడు తప్ప ఇంకెవరు వారిని చంపగలరు? సురరంజనుడు, మహీభారభంజనుడు అగు భగవంతుడే అవతరించి ఉన్నచో నేను చని ఆయనను ఎదిరింతును. ఆయనతో పోరాడుదును. ప్రభుని శరముల పాలబడి నా ప్రాణమును త్యజింతును. భవసాగరమును తరింతును. ఈ తామస దేహముతో భజనచేయ వలనుపడదు. కనుక మనోవాక్‌ కర్మలయందు ఇదే నా దృఢనిశ్చయము. ఒకవేళ వారిద్దరూ నరులగు రాజకుమారులే అగుచో ఆ ఇద్దరిని రణమున జయింతును. వారి వనితను హరింతును.'' అని దశాననుడు అనుకొనెను. ఆతడు రథమును ఎక్కెను. సముద్రతటమున మారీచుడు నివసించు చోటికి ఒంటరియై అరిగెను.

ఉమా, ఇచ్చట రాముడు ఎట్టియుక్తిని చేసెనో మనోహరమగు ఆ కథను వినుము.

కందమూలములను, ఫలములను తెచ్చుటకు అడవిలోనికి లక్ష్మణుడు ఏగెను.

కృపా సుఖనిలయుడగు శ్రీ రాముడు జనకసుతనుచూచి నవ్వుచు:-

''ప్రియా, పాతివ్రత్య ధర్మపాలనమొనర్చు సుశీలా, వినుము. లలితమగు ఒక మానవలీలను ఇప్పుడు నేను కావింతున. నిశాచరులను నేను నాశనము చేయునంత వరకు నీవు అగ్నిలో నివసింపుము'' అని నుడివెను.

రాముడు ఇట్లు చెప్పగానే సీత ప్రభుని పాదములను తన హృదయమున ధరించి అగ్నిలో ప్రవేశించినది. తన ప్రతిబింబము రామునివద్ద నిలిపినది. ఆ బింబము సీతను పోలిన రూపముకలది. సీతవలెనే అణకువకలది. భగవానుడు కావించిన ఈ మర్మము లక్ష్మణునకుకూడా తెలియదు. స్వార్థపరాయణుడు, నీచుడు అగు దశముఖుడు మారీచునివద్దకు పోయెను. వానికి తలవంచి నమస్కరించెను. నీచుని వినయము అతి దుఃఖదాయకము. అంకుశము, ధనువు, సర్పము, మార్జాలము, వంగి వచ్చుట వంటిదే అదియును. అకాలములో పూయు పూవులవలెనే, భవానీ, ఖలుని తీయని పలుకులు భయదాయకములు.

మారీచుడు రావణుని పూజించినాడు. ''ఒంటరిగా వచ్చితివి. నాయనా, నీ మనస్సుకడు వ్యాకులపడిఉన్నది. కారణమేమి?'' అని వచ్చినసంగతినిగురించి సాదరముగా ప్రశ్నించినాడు.

అభాగ్యుడగు దశాననుడు కథ అంతయు అభిమానసహితముగా వివరించినాడు. ''ఆ నృపనారిని ఉపాయముచే నేను హరించి తెచ్చునట్లు నీవు ఒక కపటమృగవేషము ధరింపుము'' అని మారీచుని కోరినాడు.

''దశాననా - నామాట వినుము. ఆతడు నరరూపమున చరించు చరాచర నాథుడు, తండ్రీ, ఆతనితో వైరము వలదు. ప్రాణప్రదాత ఆతడే. లయకారకుడు ఆతడే. ఆనాడు ముని యాగమును రక్షించుటకై ఈ కుమారుడే వచ్చెను. ములికి లేని ఒక్క బాణము రఘుపతి నాపై విడచెను. ఒక్కక్షణములో ఆ దెబ్బతో నేను నూరుయోజనములదూరము పోయిపడితిని. ఆతనితో వైరము మంచిదికాదు. నాగతి ఒక తుమ్మెదపురుగువలె అయ్యెను. ఎక్కడ చూచినను నాకు ఆ సోదరులిద్దరే కనుపించుచున్నారు. వారు నరులే కావచ్చును. కాని, నాయనా, అతి శూరులు. వారితో విరోధముచే నీకు శుభము కలుగనేరదు.

తాటకను, సుబాహుని హతమార్చి, హరుని కోదండమును విరచి, ఖరదూషణులను, త్రిశిరుని వధించిన ప్రచండబలవంతుడు సామాన్యమనుష్యుడగునా ? కనుక- నీ వంశ##క్షేమమును విచారించుము. ఇంటికి తిరిగిపొమ్ము'' అని మారీచుడు దశకంఠునికి బోధించినాడు. రావణుడు విని మండిపడి మారీచుని ఎంతో దూషించినాడు.

''మూఢుడా, గురువువలె నాకు బోధ చేయుచున్నావురా? చెప్పుము. ఈ జగమున నాతో సమానుడగు యోధుడెవడురా?'' అని బెదరించినాడు.

''శస్త్రధారి, తన మర్మమెరిగినవాడు, స్వామి, మూర్ఖుడు, ధనవంతుడు, వైద్యుడు, వందిమాగధుడు, కవి, వంటవాడు - అను ఈ తొమ్మిదిమందితో విరోధము ఎవ్వరికినీ శుభప్రదము కాదు'' అని మారీచుడు తనలో అనుకొనెను. ఏవిధమున నైనను తనకు చావు తప్పదని తెలిసికొనెను. ''రఘునాయకుని శరణు వేడుటయే మంచిది'' అని తలచెను. ''ప్రత్యుత్తరము చెప్పగానే ఈ అభాగ్యుడు నన్ను చంపివేయును. రఘుపతియొక్క శరముతోనే ఏల నేను చావరాదు?'' అని అనుకొనెను. దశాననునివెంట మారీచుడు చనెను. రామపాదములయందు అతనికి అఖండమగు భక్తి. 'నేడు నా పరమప్రియుని కనుగొందు'నను అమిత సంతోషముతో ఉన్నది. ఆతని మనస్సు. కాని ఆ ఆనందమును అతడు రావణునికి కనుపరచలేదు.

''నా పరమ ప్రియతముని చూతును. నాలోచనములను సఫలముచేసి, సుఖమును పొందుదును. శ్రీ సహితుడైన, అనుజసమేతుడైన కృపానికేతనుని పాదములను నా మనమున లగ్నము చేసికొందును. ఎవనియొక్క క్రోధము సహితము నిర్వాణము నిచ్చునో, ఎవనియందలి భక్తి అవశులను సహితము వశము కావించుకొనునో అట్టి సుఖసాగరుడగు శ్రీహరి తన స్వహస్తములతో శరమును సంధించి నన్ను వధించును. బాణ శరాసనములను ధరించి నావెనుక నేలపై పరుగిడుచువచ్చు ప్రభుని నేను వెనుతిరిగి వీక్షింతును. ఆహా, నావంటిధన్యుడు వేరెవ్వడు లేడు'' అని ఆతడు తలచెను.

దశాననుడు ఆ వనమును సమీపించెను. వెంటనే మారీచుడు ఒక కపటమృగముగా మారెను. ఆ మృగము అతి విచిత్రముగా ఉన్నది. దానిని వర్ణింపతరము కాదు. మణులతో పొదగబడిన బంగారుశరీరము దానిది. రమ్యమగు ఆ మృగమును సీత చూచెను. ఆ ఇఱ్ఱియొక్క అవయవములన్నియు అత్యంతశోభతో మనోహరములై ఉన్నవి.

''దేవా, కృపాళూ, రఘువీరా, ఆలకింపుము. ఈ లేడిచర్మము కడు రమణీయముగా ఉన్నది. సత్యసంధుడవగు స్వామీ, లేడిని వధించి దీనచర్మమును నాకు తెచ్చి ఇమ్ము'' అని వైదేహి రాముని కోరెను. ఆ కోర్కెకు కారణము సర్వము రఘుపతికి తెలియును. దేవతకార్యమును సఫలమొనర్చుటకై ఆతడు హర్షమున లేచెను.

రాముడు లేడిని చూచెను. తన నడుము బిగించెను. ధనువును చేపట్టెను. బలమగు ఒక్క శరమును మృగముపై సంధించెను. ''తమ్ముడా, అడవిలో అనేక మంది నిశాచరులు తిరుగుచు ఉందురు. బుద్ధి వివేకము, బలము, సమయములను విచారించి సీతను నీవు కాపాడుము'' అని అతడు లక్ష్మణునితో వచించెను.

ప్రభునిచూచి మృగము పరుగెత్తుచున్నది. శరాసనములను ఎక్కుపెట్టి రాముడు దానిని వెంటాడుచున్నాడు. 'నేతి-నేతి' అని వేదములు ఎవనినిగురించి వచించునో ధ్యానమున శివుడు ఎవనిని పొందజాలడో - అట్టి ఆతడు ఒక మాయగ లేడివెంట పరుగెత్తుచున్నాడు? ఆ మృగము ఒకప్పుడు దగ్గరకు వచ్చును. తిరిగి దూరముగా పారిపోవును? ఒకప్పుడు కనుపించును. ఇంకొకప్పుడు దాగును. కనుపించుచు, మాయమగుచు మోసగించుచు అది ప్రభువును దూరముగా తీసికొనిపోవయెను. అంతట రాముడు గురిపెట్టి ఒక కఠోరబాణమును దానిపై ప్రయోగించెను. ఘోరశబ్దమును కావించుచు అది నేలపై రాలెను. మొదట లక్ష్మణుని పేరు పిలచి, పిదప రాముని అదితన మనమున స్మరించెను. ప్రాణములు విడచుసమయమున అది తన నిజదేహమును ప్రకటించెను. దాని హృదయమునఉన్న భక్తిని సర్వజ్ఞుడగు రాముడు గుర్తించెను. మునులకు సహితము దుర్లభమగు తన పరమపదమును దానికి ప్రసాదించెను.

సురలు విరివి అగు విరులవానను కురిపించిరి. ప్రభునియొక్క గుణగాథలను గానము చేసిరి. రఘునాథుడు ఎట్టి దీనబాంధవుడో ! రాక్షసులకుకూడా నిజపదమును ప్రసాదించినాడు ;

దుష్టుని, మారీచుని వధించి రఘువీరుడు వెంటనే తిరిగివచ్చెను. ఆతనికరమున ధనువు, నడుమున తూణీరము - కడు శోభిల్లుచున్నది.

R-25

మారీచుని ఆర్తనాదమును వినినంతనే సీత మిక్కిలి భయపడెను.

''వేగమే వెడలుము. నీ అన్న భయంకరమగు ఆపదలో ఉన్నాడు.'' అని ఆమె లక్ష్మణునితో చెప్పెను. లక్ష్మణుడు నవ్వి.

''అమ్మా, వినుము, ఎవని భ్రుకుటీవిలాస మాత్రమున సృష్టియేలయము చెందునో, అట్టివాడు కలయందైనను సంకటములలో పడునా?'' అనెను.

సీత మర్మవచనములను హృదయమును ఛేదించువానిని కొన్నిటిని పలికెను. వారియొక్క ప్రేరణచే లక్ష్మణుని మనస్సు చలించెను. ఆతడు సీతను వనదేవతకు, దిగ్దేవతలకు అప్పగించి, రావణుడను చంద్రునికి రాహువగు రామునివద్దకు వెడలెను.

సీతవద్ద ఎవ్వరూలేని అవకాశమును కనుగొని దశకంధరుడు యతివేషము ధరించి ఆమెను సమీపించెను. ఎవని యందలి భయముచే సురలు, అసురులు, భయపడి, రాత్రి నిదురపోరో, పగలు తిండితినరో, అట్టి దశాననుడు ఒక కుక్కవలె అటు ఇటు తేరి పారచూచుచు, చౌర్యమునకు బయలుదేరినాడు !

దుర్మార్గమున కాలిడిన వానికి - ఖగేశ్వరా శరీరమున తేజము, బుద్ధి, బలము లేశ##మైనను మిగులవు దశాననుడు నానా విధముల మనోహరమగు కథలనుచెప్పి రాజనీతిని వచించి, భయమునుచూపి, ప్రేమను ప్రదర్శించెను.

''స్వామీ, యతీ, దుష్టునివలె పలుకుచున్నావు. అని సీతనుడివెను. వెంటనే రావణుడు తన నిజరూపమును ప్రకటించెను. అతడు తన పేరుచెప్పగానే సీతభీతిల్లెను. మహాధైర్యము వహించి ఆమె ''దుష్టుడా, నిలువుము. ప్రభువు వచ్చెను. ఆడుసింహమును, క్షుద్రమగు చిన్నకుందేలు వాంఛించినట్లు ఓడీ నిశాచరనాథా, కాలుని వశమున పడితివి నీవు'' అనెను

ఈ మాటలే విపగాపూ దశకంఠునికి క్రోధము జనించెను. తన మనస్సున అతడు సీతయొక్క పాదములకు వందనముచేసి - ఆనందము పొందెను. అంతట క్రుద్ధుడై రావణుడు జానకిని తన రథమున కూర్చుండపెట్టుకొని అతి వేగమున గగనమార్గమున చనెను. భయముచే అతడు రథమును తోలలేకున్నాడు !

''హా జగదేకవీరా, రఘునాథా, నేను ఏ అపరాధమును చేసితినని నాపై దయ మాలితివి? ఆర్తిహరణా, శరణాగత సుఖదాయకా, హా, రఘుకుల సరోజ దినకరా, హా లక్ష్మణా, నీ యందు ఏ దోషమూలేదు. నా రోషమునకు తగిన ఫలము పొందితివి.'' అని నానా విధముల వైదేహి విలపించుచున్నది.

''ప్రభుని కృప అపారము. కాని ఆతడు కడు దూరమైనాడు. నా విపత్తును ఎవరు స్వామికి తెలియచేతురు? యజ్ఞ పురోడాశవమును ఒక గాడిద తినగోరుచున్నది!'' అని ఆమె ఆక్రోశించుచున్నది. సీతయొక్క దుర్భర విలాపమును విని చరాచర జీవములన్నియు దుఃఖించెను.

గృధ్రరాజగు జటాయువు సీతయొక్క ఆర్తనాదమును విని ఆమె రఘుకుల తిలకుని పత్ని అని గుర్తించెను. కపిలగోవు వ్లుెచ్ఛునివశ##మై పోవునట్లు అధమనిశాచరుడు సీతను తోడ్కొని పోవుచున్నాడని తెలిసికొనెను.

''పుత్రీ, సీతా, భయపడకుము. ఈ రాక్షసుని నేను నాశనముచేతును'' అని అనుచు పక్షిరాజు క్రుద్ధుడై పర్వతముపైకి విసరిన పిడుగువలె పరుగెత్తెను.

''ఓరీ దుష్టా, నిలువవేమిరా ? నిర్భయుడవై పోవుచుంటివేమిరా? ఎఱుగవా నన్ను?'' అని అతడు కేకలు వైచెను. యమునివలె వచ్చుచున్న జటాయువును చూచి దశకంఠుడు:-

'ఇతడు మైనాకుడా ? ఖగపతియా? పక్షిరాజే అయినచో అతనికి అతని స్వామికి నా బలము తెలియునే!'' అని అనుకొనెను. జటాయువు తనను సమీపించగానే ''ఇతడు ఆ ముదుసలి జటాయువు! ''నా బాహుతీర్థమువద్ద తన తనువును త్యజింపనున్నాడు!'' అని అనుకొనెను. క్రోధాతురుడై గృధ్రరాజు రావణుని సమీపించి ''రావణా, నా ఉపదేశమును వినుము. జానకిని విడిచి క్షేమముగా ఇంటికి పొమ్ము. లేనిచో - ఓరీ బహుబాహుడా, ఏమగునో తెలియునా? రామునియొక్క రోషమను అతి భయానకమగు అగ్నిలో నీ వంశము సర్వము శలభ##మైపోవును అనెను.

యోధుడగు దశాననుడు ఏమియు ప్రత్యుత్తర మీయలేదు. జటాయువు క్రోధమున అతనిపైకి ఉరికెను. రావణుని జట్టుపట్టుకొని రథమునుండి క్రిందికిలాగి వానిని విరథుని చేసెను. రావణుడు నేలపై పడిపోయెను. సీతను ఒకచోట కూర్చుండపెట్టి జటాయువు తిరిగి వచ్చెను. అతడు తన ముక్కుతో రావణుని శరీరమును అంతయు పొడిచి చీల్చీవైచెను. కొంతతడవు రావణుడు మూర్ఛిల్లి, వెంటనేలేచి, కుపితుడై, అతి భయానకమగు కఠోర ఖడ్గమును తీసెను. జటాయువుయొక్క రెక్కలను ఖండించెను. అద్భుతచర్యను కావించి, రామునియొక్క లీలలను స్మరించుచు పక్షిరాజు నేలపై ఒరిగెను. సీతను మరల రథమున ఎక్కించుకొని అతివేగమున రావణుడు వెడలెను. అతని భయము ఇంతంత అనరాదు. నభోమార్గమున విలపించుచు సీత వేటకానివశమున భీతిల్లిఉన్న లేడివలె వెడలుచున్నది.

పర్వతముమీద కూర్చుండిఉన్న కవులను ఆమె చూచినది. హరినామమును స్మరించుచు ఆమె తన వస్త్రమును ఒకటి క్రింద పడవైచినది.

ఇట్లు రావణుడు సీతను హరించి, తోడ్కొనివెడలి అశోకవనమున ఉంచెను. అనేకవిధముల భయమును, ప్రేమను అతడు ఆమెకు ప్రదర్శించెను. కాని విఫలుడయ్యెను. అతని సర్వప్రయత్నములు వృథా అయ్యెను. పిదప ఆమెను అతడు అశోకవృక్షచ్ఛాయను జాగ్రత్తగా ఉంచెను.

కపట కురంగమును వెంటాడుచు శ్రీరాముడు పరుగిడిన సుందరదృశ్యమునే తన హృదయఫలకమున నిలుపుకొని హరినామమును స్మరించుచు సీత అశోకవనమున ఉన్నది.

తమ్మునిరాకను రఘుపతి చూచెను. చింతించుచున్నట్లు అతడు బయటికి కనుపించుచుండెను. ''సోదరా, జనకసుతను ఒంటరిగావిడిచి, నా ఆజ్ఞను ఉల్లంఘించి ఇట్లు ఏలవచ్చితివి? నిశాచరనికరములు అడవులలో తిరుగుచున్నారు. సీత ఆశ్రమమున లేదేమో అని నా మనస్సునకు అనుమానము తోచుచున్నది'' అని అతడు తమ్మునితో అనెను. లక్ష్మణుడు రాముని పాదములను పట్టుకొనెను. పిదప తన చేతులుజోడించి ''ప్రభూ, నా దోషము ఇసుమంతయు లేదు'' అని ప్రత్యుత్తరమిడెను.

గోదావరీ తటమునఉన్న తమ ఆశ్రమమునకు అనుజసమేతుడై ప్రభువు అరిగెను. జానకిలేని ఆశ్రమమునుచూచి అతడు సామాన్య మానవునివలె దీనుడై, వ్యాకులడయ్యెను.

''హా, గుణఖనీ, జానకీ, సీతా, రూపశీల, వ్రత, నియమ పునీతా'' అని అతడు విలపించెను. లక్ష్మణుడు అతనిని బహువిధముల ఓదార్చెను.

''ఓ ఖగములారా, మృగములారా, మధుకర శ్రేణులారా, మృగనయని అగుసీతను మీరుచూచితిరా?'' అని లతాతరు సమూహములను ప్రశ్నించుచు రాముడు నడచుచున్నాడు. కాటుకపిట్టలు, శుకములు, కపోతములు, హరిణములు, మీనములు, మధుపములు, ప్రవీణులగు కోకిలలు, మల్లెమొగ్గలు, దానిమ్మపూవులు, మెరపుతీగెలు కమలములు, శరశ్చంద్రుడు, నాగినులు, వరుణపాశము, మనోజునిధనువు, హంసలు, ఏనుగులు, సింహములు, అన్నియు నేడు తమనుగురించిన ప్రశంసలను వినుచున్నవి.

''శ్రీ, సువర్ణ, కదళీఫలములు నేడు ఆనందించుచు శంకలేక, నిస్సంకోచమున ఉన్నవి. జానకీ, వినుము. నీవు లేనందున నేడు ఇవి అన్నియు, ఒక సామ్రాజ్యమును సంపాదించినట్లు సంతసించుచున్నవి. వారి ఈర్ష్యతోకూడిన ఆనందమును నీవు ఎట్లు సహింపగలవు? ప్రియా, వేగమే ఏల కనుపించవు?'' అని ఇట్లు స్వామి, మహావిరహిఅగు కామివలె సీతను వెదకుచు, విలపించుచున్నాడు !

పూర్ణకాముడు, ఆనందరాశి, అజుడు, అవినాశిఅగు రాముడు ఒక మానవునివలె నటించుచున్నాడు !

కొంతదూరము వెడలినపిదప నేలపై పడిఉన్న గృధ్రరాజు జటాయువును రామలక్ష్మణులు చూచిరి. రామచరణములను, అచరణ చిహ్నములను స్మరించుచున్నాడు జటాయువు. కృపాసాగరుడగు రఘువీరుడు తన కరకమలములతో పక్షిరాజుయొక్క శిరమును స్పృశించెను. లావణ్యనిలయమగు రాముని వదనమును కనుగొనినంత పక్షి రాజుయొక్క బాధలన్నియు పటాపంచలయ్యెను.

అంతట ధైర్యమువహించి జటాయువు ''రామా, భవభయభంజనా, ప్రభూ, ఆలకింపుము. దశాననుడు నన్ను ఈగతికి తెచ్చినాడు. ఆ ఖలుడే జనకసుతనుహరించెను. స్వామీ, వాడు ఆమెను దక్షిణదిశకు కొనిపోయెను. క్రౌంచపక్షివలె సీత విలపించుచున్నది. ప్రభూ, నీ దర్శనమునకై నా ప్రాణములను నిలుపుకొంటివి. కృపానిధీ ఇక ఈ ప్రాణములు పోనున్నవి.'' అనెను. రాముడు ఈ మాటలనువిని ''తండ్రీ, నీ తనువును రక్షించుకొనుము'' అని నుడివెను. మందహాస వదనముతో జటాయువు:

''ప్రభూ, అంత్యసమయమున నోటివెంట ఎవని నామము ఉచ్చరించుటచే అధముడైనను ముక్తుడగునని వేదములు వచించునో, అట్టి నీవు నాకన్నులఎదుట సాక్షాత్కరించితివి. నా ఎదుట నిలచితివి. ఇక ఏమి సాధించవలెనని ఈ దేహమును రక్షించుకొనవలె?'' అని ప్రత్యుత్తరమిచ్చెను.

రఘునాథుని నేత్రములు జలభరితములయ్యెను. ''తండ్రీ, నీవు కావించిన సత్కర్మలవలననే నీవు ఉత్తమగతిని ఆర్జించితివి. పరహితరతులకు జగమున దుర్లభమగునది ఏదియూలేదు. నాయనా, తనువు త్యజించి నాధామమునకు చనుము. నీవు పరిపూర్ణకాముడవు. నేను నీకేమి ప్రసాదింతును? అచ్చటికి ఏగినపిదప - తండ్రీ, సీతాపహరణ వృత్తాంతమును మాత్రము నీవు మా తండ్రికి తెలుపకుము. నేనే రాముడనైనచో దశాననుడే అక్కడకు స్వయముగా, కుటుంబ సహితముగా వచ్చి ఆయనకు నివేదించును'' అని ఆతడు అనెను.

జటాయువు గృధ్రదేహమును త్యజించెను. శ్రీహరియొక్క రూపమును ధరించెను. అనుపమములగు బహుభూషణములను అలంకరించుకొని, పేతాంబరధారి, శ్యామశరీరుడు. విశాల చతుర్భుజుడు. బాష్పపూరిత నయనుడై అతడు ఇట్లు రాముని స్తుతించెను.

''రామా, నీకు జయము. అనుపమరూపుడవు, నిర్గుణుడవు, సగుణుడవు, గుణప్రేరకుడవు అగు నీకు జయము.

దశాననుని ప్రచండ బాహువులను ఖండ ఖండములను కావించుటకై ప్రచండశరములను ధరింతువు. మహీతలమును సుశోభితము కావించితివి. పయోదగాత్రా, రాజీ వాయతలోచనా, సరోజవదనా, విశాలబాహు భవభయమోచనా, దయాళు, రామా, నీకు నిత్యము నమస్కరింతును.

నీవు అమిత బలవంతుడవు. అనాదిపురుషుడవు. అజన్ముడవు. నిరాకారుడవు. ఏక మాత్రుడవు. అగోచరుడవు. గోవిందుడవు. ఇంద్రియాతీతుడవు. ద్వంద్వహరుడవు. విజ్ఞానఘనుడవు. ధరణికి ఆధారుడవు. రామ మంత్రమును జపించుభక్తుల మానసములను రంజింపచేతువు. నిష్కామ ప్రియుడవు. కామాది దుష్టదశ వినాశకుడవు. అట్టి రామా, నీకు నిత్యము ప్రణమిల్లుదును.

శ్రుతులు ఎవనిని నిరంజనుడని, బ్రహ్మఅని, సర్వవ్యాపకుడని, నిర్వికారుడని, జన్మరహితుడని ప్రశంసించునో మునులు ఎవనిని ధ్యాన, జ్ఞాన, వైరాగ్య, యోగాది అనేక సాధనములచే పొందుదురో, అట్టి కరుణకు మూలమైనవాడు. శోభానిలయుడు. స్వయముగా సాక్షాత్కరించి చేతనాచేతనమగు సకల జగమును మోహపరచుచున్నాడు. నా హృదయకమల భ్రమర రూపుడగు నీ ప్రతి అంగమునను అనేక అనంగుల లావణ్యము శోభిల్లుచున్నది.

అగముడవు. సుగముడవు. నిర్మలస్వభావుడవు. అసముడవు. సముడవు. సదా శీతలుడవు. శాంతుడవు. అత్యంత సాధనచేసి, తమ మనస్సులను, ఇంద్రియములను సదా వశమున ఉంచుకొని యోగులు నిన్ను దర్శింతురు. నీవు త్రిభువననాథుడవు. రమానివాసుడవు. రాముడవు. సంతతము దాసవశుడవు. పావనమగు నీ యశము జన్మరాహిత్యము కలిగించును.

అట్టి నీవు నా హృదయమున వసియింపుము. అని ఇట్లు స్తుతించి అవిరళభక్తిని వరముకోరి జటాయువు హరిధామమునకు చనెను. రాముడు స్వహస్తములతో యథోచితమగు అంత్యక్రియలను జటాయువునకు జరిపెను.

రఘునాథుడు అతి కోమలచిత్తుడు. దీనదయాళుడు. నిర్హేతుక కృపాళుడు. పక్షులలో అధమమైనది గ్రద్ధ, మాంసాహారి. అట్టిదానికే ఆతడు - యోగిజనులు యాచించు సద్గతిని ప్రసాదించెను.

ఉమా, వినుము, హరినివీడి, విషయాసక్తులగు వారు అభాగ్యులు.

అన్నదమ్ములు ఇద్దరు తిరిగి సీతను వెదకుచు వనశోభను తిలకించుచు ముందుకు సాగిరి. సంకులమగు ఆ వనము లతలతో, వృక్షములతో నిండిఉన్నది. అనేక పక్షులు, మృగములు, ఏనుగులు, సింహములు అందుకలవు.

మార్గమున రాముడు కబంధుని సంహరించెను. స్వీయచరిత్ర అంతయు కబంధుడు స్వామికి వివరించెను.

''దుర్వాసుడు నాకు శాపమిచ్చెను. ప్రభుని పాదములను దర్శించినంతనే నేడు ఆ శాపవిమోచనమయ్యెను.'' అని అతడు వచించెను.

''గంధర్వా, నా పలుకులను వినుము. బ్రహ్మణకులద్రోహులు నాకు ప్రీతి కలిగింపరు. మనోవాక్‌ కర్మలచే కపటమునువిడిచి భూసురులను సేవించువారికి - నేనే కాదు - విరించి, శివుడు, ఇతరదేవతలెల్లరు, వశులగుదురు. విప్రుడు శాపమిచ్చినను, కొట్టినను, పరుషవాక్యములు పలికినను పూజనీయుడు. ఇట్లని మహాత్ములు వచింతురు. శీల, గుణహీనుడైనను విప్రుడు పూజనీయుడు. గుణగణ, జ్ఞానప్రవీణుడైనను శూద్రుడు అట్లు కాడు.'' ఇట్లు తన ధర్మమును రాముడు కబంధునికి నిర్వచించెను. తన పాదములయందు ఆతనికి కలభక్తిని కనుగొని మనమున ఆనందించెను.

రఘుపతియొక్క చరణకమలములపై తన తలనువంచి నమస్కరించి కబంధుడు గంధర్వరూపమును పొంది గగనమార్గమున చనెను. ఉదారుడగు రాముడు గంధర్వునికి సద్గతిని ప్రసాదించి శబరియొక్క ఆశ్రమమునకు విచ్చేసెను. తన నివాసమునకు రాముడు ఏతెంచుచున్నాడని శబరి కనుగొనెను. మతంగముని తనకు తెలిపిన విషయమును ఆమె గుర్తునకు తెచ్చికొనెను. ఆమె మనస్సు ఉప్పొంగెను.

సరసిజలోచనులు, విశాలబాహులు, శిరముల జటాజూటములు, ఉరముల వనమాలలు శ్యామసుందరుడు-గౌరవర్ణుడు అగు ఇరువురు సోదరులనుచూచి శబరి వారి చరణములపై పడెను. ఆమె వారి పాదములను కౌగలించుకొనెను. ప్రేమ మగ్నయైన ఆమె నోట మాటవచ్చుటలేదు. పదేపదే ఆమె వారి పాదసరోజములకు తన శిరము వాల్చి వందనము కావించుచున్నది. ఆమె సాదరముగా నీరు తెచ్చినది. రామ లక్ష్మణుల చరణములను కడిగినది. సుందరమగు ఆసనములపై వారిని ఆసీనులను చేసినది. అతి రసవంతములగు కందమూల ఫలములను తెచ్చి రామునికి సమర్పించినది. వానిని పదేపదే ప్రశంసించుచు ప్రభువు ప్రేమ సహితముగ ఆరగించెను.

చేతులు జోడించి శబరి రాముని ఎదుటనిలచినది. ప్రభుని విలోకించినది. ఆమె భక్తి అత్యధికమయ్యెను.

''ప్రభూ, పాపవినాశకా నిన్ను ఎట్లు స్తుతింతును. అధమజాతి దానను నేను. మూఢమతిని. అధములయందు అధమను, అతి నీచురాలిని. అందునను స్త్రీని. వారి యందునూ మందమతిని'' అని ఆమె వచించినది.

అంతట రఘుపతి ఇట్లు నుడివెను:-

''భామినీ, నా వచనములను ఆలకింపుము. భక్తిఒక్కటే నాకు పరమప్రీతికరము. జాతి, కోవ, కులము, ధర్మము, ఆధిక్యత, ధనము, బలము, కుటుంబము, గుణము, చతురత ఇవి అన్నియు కలిగిఉండియు భక్తిహీనుడగు నరుడు జలహీనమగు మేఘము వంటివాడు.

నవవిధములగు భక్తిని నీకు వివరింతును. సావధానముగా విని నీ మనమున ధరింపుము.

మొదటిది:-సత్సంగము.

రెండవది:-నా కథాప్రసంగములయందు ప్రేమ.

మూడవది:-అభిమానము విడిచి గురు పదకమలములను సేవించుట.

నాలుగవది:-కపటమును విడిచి నా గుణగానము కావించుట.

ఐదవది:-నా యందు దృఢవిశ్వాసము కలిగి నా మంత్రజలము చేయుట - ఇది వేద ప్రసిద్ధమైనది.

ఆరవది:-ఇంద్రియ నిగ్రహము, సచ్ఛీలము, బహుకర్మలయందు వైరాగ్యము, నిరంతరము సాధుసజ్జనులకు విధింపబడిన ధర్మాచరణములయందు నిమగ్నులగుట

ఏడవది:-జగమంతటను సమభావమున నన్నే చూచుట, నా భక్తులను నా కంటే అధికముగా భావించుట.

ఎనిమిదవది:-లభించిన దానితో సంతృప్తిచెందుట, స్వప్నముననైనను ఇతరులలో దోషములను ఎంచకుండుట.

తొమ్మిదవది:-సరళత కలిగి కపటరహితులై ఎల్లరితో ప్రవర్తించుట.

హృదయమున తమ భారము నాపై ఉంచుట. ఎట్టి పరిస్థితులలోనైనను హర్షముకాని దైన్యముకాని లేక ఉండుట.

ఈ నవవిద భక్తులలో ఏ ఒక్కటి కలిగి ఉన్నవారైనను స్త్రీలు, పురుషులు, జడము, చేతనమైనను సరే - వారే నాకు అత్యంత ప్రియులు. భామినీ, నీ యందు ఈ అన్నివిధములగు భక్తియు దృఢముగా ఉన్నది.

యోగులకు సహితము దుర్లభమగు సద్గతి నీకు నేడు సులభ##మైనది. నా దర్శనమున వలన కలుగుఫలము అసామాన్యము. దానివలన జీవుడు తన సహజ స్వరూపమును పొందును''. ఇట్లు వచించి రాముడు, ''భామినీ, కరివరగామిని అగు జనకసుతజాడ తెలిసినచో నాకు తెలుపుము.'' అని శబరిని అడిగెను.

రాముని పలుకులు విని శబరి ''రఘునాథా, పంపా సరోవరమునకు వెడలుము. అచ్చట సుగ్రీవునితో నీకు మైత్రి కలుగును. రఘువీరా, దేవా, అతడు అన్ని విషయములు నీకు చెప్పగలడు. ధీరమతీ, అన్నియు తెలిసియు నన్ను ప్రశ్నింతువే!'' అని నుడివెను. ప్రభుని పాదములకు పదేపదే శబరి శిరమువంచి మ్రొక్కి భక్తి సహితముగా తన కథ అంతయు వివరించెను.

ఆత్మకథ అంతయు నుడివి శబరి హరిముఖమును విలోకించెను. ఆతని పాదపంకజములను తన హృదయమున ధరించెను. యోగాగ్నిలో తన శరీరమును త్యజించి ఆమె పునరావృత్తి రహితమగు హరిపదమున లీనమయ్యెను.

''వివిధ కర్మలు, అధర్మములు నానా మతములు. అన్నియు శోకప్రదములే ! వీనినన్నిటిని త్యజింపుడు. విశ్వాసముతో శ్రీరామ పాదములయందు, నరులారా! భక్తికలిగి ఉండుడు'' అని తులసీదాసుని బోధ.

హీనజాతియందు పాపియై జన్మించిన ఆడుదానికిసహితము మోక్షమును ప్రసాదించిన ఆ ప్రభుని విస్మరించి మహా మందమానసమా, సుఖమును కోరుదునా?

రాముడు ఆవనమును సహితము విడిచి ముందుకుసాగెను. ఇరువురు సోదరులు అతులిత బలులు, మానవ సింహములు, విరహతాపము అనుభవించు వానివలె ప్రభువు విషాదమును పొందుచు అనేక కథలను సంవాదములను తెలుపుచున్నాడు.

''లక్ష్మణా, ఈ విపినము ఎంత శోభావంతముగా ఉన్నదో! దీనినిచూచి ఎవని మనసు కలత చెందదు? పశుపక్షి సమూహములు అన్నియు నారీ సహితములై ఉన్నవి. అవి అన్నియు నన్ను నిందించుచున్నవేమో అనిపించును. మనలనుచూచి మగలేళ్ళు పారిపోవ ప్రయత్నించుచున్నవి. ఆడలేళ్ళు వానితో 'మీకు భయములేదు. ఆనందముగా ఉండుడు. సామాన్య మృగములేకదా మీరు! ఆతడు వచ్చినది కాంచన మృగములను వెదకుటకై !'' అని అనుచున్నవి.

మగ ఏనుగులు ఆడ ఏనుగులను తోడ్కొని పోవుచున్నవి. ఇవి నాకు బుద్ధిచెప్పుచున్నట్లున్నది. చక్కగా చదివిన శాస్త్రములనుకూడా మరల మరల చదువుచుండవలెను. ఎంత గొప్ప సేవ చేసినను రాజు తన వశుడని తలచరాదు. ఎంత హృదయమిచ్చినను సరే శాస్త్రమును, రాజులనువలెనే స్త్రీని వశము చేసికొనలేము. తమ్ముడా, ఈ వసంత సౌందర్యమును తిలకింపుము. ప్రియావిహీనుడనగు నాలో ఇవి భయమును జనింపచేయుచున్నవి. నేను విరహముచే వ్యాకులడనైతినని. అశక్తుడనని. ఒంటరినని తెలిసి మదనుడు ఈ వనమును మధుకరములను, పక్షులను సైన్యముగా వెంటగొని నాపై దండయాత్రకు వచ్చినాడు. కాని నేను తమ్మునితో కలసిఉన్నానని ఆ మదనుని దూత కనుగొనినాడు. దూతమాట విని మనసిజుడు తన సేనను నిలిపి నన్ను ముట్టడించినాడు.

విశాల వృక్షములచుట్టు లతలు అల్లుకొని ఆకసమున మదనుని అనేక విధములగు నివాసములవలె నున్నవి. అరటిచెట్లు, తాడిచెట్లు, కాముని సుందరధ్వజా పతాకమువలె ఉన్నవి. ధీరుడు మాత్రమే వీనినిచూచి మోహితుడు కాజాలడు. వివిధ వృక్షములు నానావిధములగు పూలుపూచి పలువిధ బాణములను ధరించిన విలుకాండ్రవలె చూపట్టుచున్నవి. అక్కడక్కడ సుందర వృక్షములు. యోధులు ప్రత్యేక శిబిరములు నిర్మించుకొని ఉన్నారో అన్నట్లు శోభిల్లుచున్నవి. కోయిలల కుహూస్వరములు మదనుని మత్తేభముల ఘీంకారములవలె ఉన్నవి. పక్షులు, కొంగలు, కోకిలలు, అతని ఒంటెల వలెను కంచరగాడిదలవలెను ఉన్నవి. మయూరములు. చకోరములు, చిలుకలు, పావురములు, హంసలు, అన్నియు మనోజుని సుందర ఉత్తమాశ్వములో అన్నట్లున్నవి. తీతువు పిట్టలు. ఇతరపక్షులు ఆతని పాదచారులగు యోధులో అన్నట్లున్నవి. మనోజుని సైనికదళము వర్ణింపశక్యముకాదు. గిరులు ఆతని రథములవలె, జలపాతములు నగారాలవలె ఉన్నవి. చాతక పక్షులు. గుణగణములను వర్ణించువంది మాగధులవలె ఉన్నవి. తుమ్మెదల రొద భేరీ సన్నాయిల మేళమువలె ఉన్నది. దౌత్యమునకై వచ్చినట్లు త్రివిధ వాయువులు వీచుచున్నవి. ఇట్లు చతురంగ బలములను వెంటనిడుకొని మన్మథుడు ప్రతివానితో పందెమువేయుచు విహరించుచున్నాడో అన్నట్లున్నది.

లక్ష్మణా, కామదేవుని సేననుచూచి ధీరుడై నిలచువాడు జగత్ర్పసిద్ధ వీరుడే. కామదేవుని మహాబలమంతయు స్త్రీయే. దానినుండి రక్షించుకొనువాడే మహాయోధుడు.

సోదరా, అతిప్రబల దుష్టశక్తులు- కామ క్రోధ లోభములనునవి మూడు, విజ్ఞానధాములగు మునుల మనములనుకూడా ఇవి నిముషమున కలతపెట్టును. లోభమునకు ఇచ్ఛ, దంభములు ఆయుధములు. కామమునకు కేవలము స్త్రీయే బలము. క్రోధమునకు పరుష వచనములే ఆయుధములు. మునివరులు యోచించి ఇట్లని తెలిపిరి.

''ఉమా, రాముడు గుణాతీతుడు, చరాచరానాథుడు, సర్వాంతర్యామి. ఇట్లు ఆతడు కామకులదీనతను చూపెను. ధీరుల మనస్సులలో వైరాగ్యమును దృఢపరచెను. కామ. క్రోధ, లోభ, మదములు, మాయలు - ఇవి అన్నియు రాముని దయచే విడివడిపోవును. ఆ నటుడు ఎవనియందు ప్రసన్నుడగునో అట్టివాడు మాయ అను ఇంద్రజాలములో పడడు. ఉమా, నా అనుభవమును తెలుపుదును. హరిభజనయే సత్యము. జగమంతయు స్వప్నము.'' [అని శంభుడు వచించెను.]

పిదప ప్రభువు పంప అను సుందర గంభీర సరోవర తీరమునకు వెడలెను. పంపాజలము భక్తుల హృదయమువలె నిర్మలమైనది. మనోహరము. సుందరము అగు మెట్లు దాని నాలుగువైపుల ఉన్నవి. ఎల్లచోట్లను, వివిధమృగములు, ఉదారుల గృహములవద్ద యాచకులగుంపు మూగునట్లు చేరి నీరు త్రాగును. మాయచే కప్పబడినందున నిర్గుణబ్రహ్మ కనుపించనట్లు ఆ సరోవరమున దట్టమైన కమలపత్రములచే కప్పబడిన నీరు వెంటనే కనుపించదు. ధర్మశీలురకు దినములన్నియు సుఖముగా గడచి పోవునట్లు ఆ సరోవరములోని అత్యంత అగాధమగు నీటిలో చేపలు ఎల్లపుడు సుఖముగా నివసించును. రంగు రంగుల కమలములు ఆ సరోవరమున వికసించి ఉన్నవి. ఎన్నో తుమ్మెదలు మధుర స్వరముతో జుం జుం అని రొద చేయుచున్నవి. జల కుక్కుటములు. కలహంసలు ప్రభునివీక్షించి ఆయనను ప్రశంసించుచున్నవో అన్నట్లు పలుకుచున్నవి. చక్రవాకములు బకములు మొదలగు పక్షిసముదాయములను చూడవలసినదే కాని వానిని వర్ణింప శక్యముకాదు. బాటసారులను ఆహ్వానించుచున్నవో అనునట్లు సుందరమగు పక్షుల కిలకిలా రావములు కడు మనోహరముగా ఉన్నవి.

ఆ సరోవర సమీపమున మునులు పర్ణశాలలను నిర్మించుకొనిరి. వానికి నాలుగు వైపుల సుందరములగు వన వృక్షములున్నవి. చంపక, వకుళ, కదంబ, తమాల, పాటల, పనస, పరాస, రసాల మొదలగు అనేక వృక్షములు నానావిధములగు తరులునవ పల్లవములను చిగిరించినవి. పుష్పించినవి. వానిపై తుమ్మెదగుంపులు రొదచేయుచున్నవి. సహజశీతల, మంద, సుగంధ వాయువులు మనోహరమై సంతతము వీచుచున్నవి.

కోయిలలు కుహు కుహూ శబ్దములు చేయుచున్నవి. వాని సరస రవమును విని మునుల ధ్యానములు భంగమగుచున్నవి! పరోపకారులగు పురుషులు సుసంపదను పొంది అణగి ఉండునట్లు ఫలభారముచే వృక్షములన్నియు వంగి నేలపై పడుచున్నవి.

ఆ అతి సుందర సరోవరమునుచూచి రాముడు దానిలో స్నానముచేసెను. పరమానందమును పొందెను. సుందరమగు ఒక వృక్షచ్ఛాయను కనుగొని రఘునాథుడు అనుజసహితుడై అచ్చట కూర్చుండెను.

ఆ ప్రదేశమునకు సకల దేవతలు మరి ఒకమారు వచ్చిరి. రాముని స్తుతించి తమతమ ధామములకు వెడలిరి. కృపాళుడగు రాముడు అతి ప్రసన్నుడై కూర్చుండెను. రసవత్తరమగు కథలను తమ్మునికి చెప్పుచుండెను. విరహవంతుడగు భగవంతుని చూచి నారదుని మనమున కడు విచారము కలిగెను.

''నా శాపమును అంగీకరించికదా - రాముడు నానా దుఃఖములను అనుభవించుచున్నాడు. వెడలి అట్టి ప్రభుని దర్శింతును. తిరిగి ఇట్టి అవకాశమురాదు.''

అని తలచి ఆ ముని వీణను చేతపట్టి ప్రభువు సుఖాసీనుడై ఉన్నచోటికి వచ్చెను. మృదువాణితో - భక్తితో బహురీతుల రామచరితను గానముచేయుచు అతడు రామునికి సాష్టాంగ ప్రణామము చేసెను. ప్రభువు అతనిని లేవనెత్తి - చాల తడవు తన హృదయమునకు హత్తుకొనెను. కుశలప్రశ్నల పిదప తన సమీపమున కూర్చుండ పెట్టుకొనెను. లక్ష్మణుడు సాదరముగా ముని చరణములు కడిగెను.

అనేకవిధుల వినతి కావించి, ప్రభువు ప్రసన్నుడైనాడని నారదుడు తెలిసికొనెను. తన పాణి సరోరుహములను జోడించి ఆ ముని -

''రఘునాయకా, నీవు సహజ ఉదారుడవు ఆలకింపుము. రమణీయ. ఆగమ, సుగమ, వరప్రదాతవు. నేను ఒక్కవరమును కోరుదును. దానిని కరుణించుము. నీవు అంతర్యామివి. సర్వమునీకు తెలియనే తెలియును.'' అని ప్రార్థించెను.

''ముని, నా స్వభావమును నీకు తెలియును. నా భక్తులకు ఎన్నడైన దేనినైన నేను దాచిఉంతునా? మునివరా, నీవు కోరరాని వస్తువు నాకు ప్రియమగునది ఏమున్నది? నా భక్తులకు నేను ఈయరానిది ఏదియులేదు. నాయందు ఈ విశ్వాసము ఎన్నడును పొరపాటుననైనను విడువకుము'' అని శ్రీరాముడు నుడివెను.

అంతట నారదుడు ఆనందించి ''నేను కోరదలచినవరము ఇది. సాహసించి అడుగుచున్నాను. స్వామికి అనేక నామములున్నవి. వానిలో ఒకదానికంటె మరిఒకటి మహత్తరమని శ్రుతులు పలుకుచున్నవి. అయిననూ, ప్రభూ, రామనామము సకల నామములకంటె అధికమగుగాక! పాపరూప పక్షి గణములకు అది వేటకాని వంటిది అగుగాక! నీయందలి భక్తి పున్నమిరేయియై, రామనామము రాకా పూర్ణచంద్రుడై ఇతర నామములన్నియు భక్తుల హృదయము లనబడు విమల ఆకాశమున తారాగణములై, నివసించుగాత!'' అని వేడెను.

కృపాసాగరుడగు రఘునాథుడు ''అట్లే అగుగాక'' అని మునితో అనెను. పిదప నారదుడు మనస్సున అత్యంతముగా ఆనందించి, ప్రభుని పాదములపై తన మస్తకము వంచి ప్రణమిల్లెను. రఘునాథుడు కడు ప్రసన్నుడైనాడని నారదుడు కనుగొనెను. మృదువాణితో ఆ ముని మరల ఇట్లు ప్రశ్నించెను. ''రామా, రఘురాయా, నీవు నీ మాయను ప్రేరేపించి నన్ను మోహితుని చేసినప్పుడు నేను వివాహము చేసి కొనవలెనని కోరితిని. కాని ప్రభూ, నా కోర్కెను సఫలమొనర్చుకొన నీయవైతివి? కారణమేమి?

ఆ ప్రశ్నవిని శ్రీరాముడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ''మునీ, వినుము. సంతోషముతో నీకు తెలుపుదును. అన్ని ఇతర ఆశలను, విశ్వాసములను విడిచి నన్నే భజించువారిని - తల్లి బాలకుని రక్షించునట్లు, సదా నేనే రక్షింతును.

నిప్పునో, పామునో పట్టుకొనుటకై శిశువు పరుగెత్తుకొని పోవును. అప్పుడు వెంటనే తల్లి ఆ శిశువు చేతులనులాగి దానిని కాపాడును. ఆ బిడ్డడు పెరిగి పెద్దవాడై నప్పుడు అతనిపై తల్లికి ప్రేమ మాత్రము ఉండును. కాని పూర్వమువలె ఉండదు.

జ్ఞానులు నాకు ప్రౌఢులగు తనయుల వంటివారు, భక్తులు తమ శక్తిని పరిగణించుకొనరు. వారు సేవకులు. వారు నా పసిపిల్లలవంటివారు. నా సేవకునికి కేవలము నా బలమే. అండ, జ్ఞానికి స్వీయ బలము కలదు. కామక్రోధాది శత్రువులు ఇరువురికి ఉన్నారు. దీనిని యోచించి బుద్ధిమంతులు నన్నే భజింతురు. జ్ఞానము ప్రాప్తించిన పిదప సహితము వారు భక్తిని త్యజించరు. కామము, క్రోధము, లోభము, మదముమొదలగునవి. మోహముయొక్క ప్రబలసేనలు. వీనియందు మాయారూపిణిఅగు స్త్రీ అతి దారుణ దుఃఖమును కలుగచేయును.

మునీ, వినుము, మోహమను విపినమునకు స్త్రీ - వసంతఋతువు వంటిదని పురాణములు, వేదములు నుడువుచున్నవి. జప, తప, నియమములు అనబడు జలాశ్రయములను స్త్రీ గ్రీష్మఋతువై పూర్తిగా ఎండించి వైచును.

కామ క్రోధ మద మత్సరములు అను కప్పలకు వర్షర్తువువలె సంతోషమును ఇచ్చునది ఒక్క స్త్రీయే. దుర్వాసనలు అనునవి కుముదసముదాయములు. వానికి నిరంతరము సుఖము నిచ్చునది స్త్రీయే. సకల ధర్మములు సరసీరుహ బృందములు. నీచసుఖములను ఇచ్చుస్త్రీ హిమఋతువై, వానినన్నిటిని దహించివేయును.

ఇక మమత అను బ్రహ్మదొండ మొక్కలు స్త్రీ రూపమగు శిశిరఋతువున పచ్చగా పెరుగును. పాపరూపమగు గుడ్లగూబల సమూహమునకు ఆనందముఇచ్చుఘోర అంధకారమయమగు రాత్రి - స్త్రీ. బుద్ధి, బలము, శీలము, సత్యము ఇవి అన్నియు చేపలు కాగా వానికి గాలము వంటిది స్త్రీ. ప్రవీణుల వచనములివి. అవగుణములకు మూలము ప్రమద. పీడాకారి ఆమె. సకల దుఃఖములకు గని. మునీ, నా మనస్సున వీనిని అన్నిటిని తెలిసికొని - నిన్ను వివాహమాడ వలదంటిని.''

రఘుపతి పలికిన మధురవచనములను విని మునియొక్క తనువు పులకరించెను. అతని కన్నులు నీరు నిండెను. సేవకునిపై ఇంత మమత. ఇంతప్రేమ కలిగిన స్వామి ఇంకెవ్వడున్నాడని నారదముని తలచెను.

భ్రమనువీడి, ఇట్టి ప్రభుని భజింపనివాడు జ్ఞానహీనుడు-మందుడు-అభాగ్యుడు.

అంతట నారదముని సాదరముగా:-

''విజ్ఞాన విశారదా, రామా, ఆలకింపుము. రఘువీరా, భవభయ వినాశకా, దయచేసి - ప్రభూ, సాధు, సజ్జనులయొక్క లక్షణములను తెలియచేయుము'' అని రాముని వేడెను.

''నన్ను తమవశము కావించుకొనిన సాధు, సజ్జన, పుణ్యాత్ములయొక్క లక్షణములను వివరింతును.'' అని ఇట్లు రాముడు నుడవుసాగెను.

''సాధు, సత్పురుషులు - మహాత్ములు - కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములను షడ్వికారములను జయించి, పాపరహితులై నిష్కాములై, నిశ్చలులై, అకించనులై, శుచులై, సుఖనిలయులై, అమితజ్ఞానులై, ఇచ్ఛారహితులై, మితాహారులై, సత్యనిష్ఠాపరులై, కవులై, విద్వాంసులై, యోగులై, సావధానులై, పరులకు గౌరవప్రదులై, అభిమానరహితులై, ధైర్యవంతులై, ధర్మజ్ఞానమున, ధర్మాచరణమున పరమ ప్రవీణులై, గుణాగారములై, సంసార దుఃఖరహితులై, విగత సందేహులై ఉందురు. నా చరణ సరోజముల యందే తప్ప వారికి తమ దేహము సందు కాని గేహమునందు కాని ప్రేమ ఉండదు.

తమ గుణములను గురించిన పొగడ్తలను వినుటకు వారు సిగ్గుపడుదురు. పరుల సద్గుణములను గురించి వినుటయందువారికి హర్షము, స్థిరబుద్ధికలవారై, న్యాయమును ఎన్నడు వారు విడువరు. వారి స్వభావము సరళము. అందరియందునూ వారికి ప్రేమ. జప, తప, వ్రత, దమ, నియమరతులు వారు. గురు, గోవింద, విప్రచరణ ములయందు వారికి ప్రేమ. శ్రద్ధ, క్షమ, మైత్రి, కరుణ, ప్రసన్నత. నా చరణముల యందు నిష్కపటమగు ప్రేమ వారికి.

వైరాగ్య, వివేక, వియ, విజ్ఞాన, వేద, పురాణములయందు వారికి యథార్థజ్ఞానముండును. దంభ, అభిమాన, మదములు వారికి ఎన్నడూ ఉండువు. పొరపాటున నైను వారు చెడుదారిని కాలు పెట్టరు. వారు సదా నా లీలలను వర్ణింతురు. శ్రవణముచేతురు. నిర్హేతుకముగనే వారు పరహితరతులై ఉందురు. మునీ, సజ్జనుల, మహాత్ములయొక్క గుణములను శారదష శ్రుతులైనను వివరింపజాలరు.

''వారి గుణములను శారదయు నుడువజాలరు'' అని రాముడు చెప్పగానే విని నారదుడు రామునియొక్క పాదపంకజములను గ్రహించెను.

దీనబాంధవుడు, దయాళుడు, ప్రభువు ఇట్లు స్వయముగా తన భక్తులయొక్క గుణములను వర్ణించెను.

పదేపదే రాముని చరణములపై తలవాల్చి, మ్రొక్కి, నారదుడు బ్రహ్మలోకమునకు ఏగెను.

''ఆశలన్నియు విడిచి హరి భక్తియందు నిమగ్నులగువారే ధన్యులు'' అని తులసి ప్రవచనము, రావణారిఅగు రాముని పవిత్రయశమును కీర్తించువారు, వినువారు, వైరాగ్యము, జపము, యోగములు అక్కరలేకయే శ్రీరాముని యందు దృఢమగు భక్తిని ఆర్జింతురు.

యువతియొక్క శరీరము దీపశిఖ వంటిది, ఓ మానసమా, నీవు దానిలో శలభము కాబోకుము, కామమును మదమును త్యజింపుము, రాముని భజింపుము, సదా సత్పంగము కావింపుము.

Sri Ramacharitha    Chapters