Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

అక్షమాల

అరవభాషలో కొన్ని కావ్యాలను పంచకావ్యా లని అంటారు. ఆ భాషలో కావ్యం అనే పదానికి కాప్పియం తద్భవం. ఈ అయిదిటిలో జైనులు చెప్పినవి మూడు. తక్కిన రెండూ బౌద్ధమతాన్ని అనుసరించి ఉంటవి. తెలుగు భాషలోనూ పంచకావ్యాలు ఉన్నవి. ఈ వాడుక సంస్కృత భాషనుబట్టి దేశీయాలయిన భాషలలోనికి వచ్చినటులుఉన్నది. అన్ని భాషలలోన్నూ మేలయిన కాప్పియాలు, కబ్బాలుఉంటై. కాని వానిలో మేలుతరాలయిన కొన్నింటికి మాత్రం పంచకావ్యాలనే వాడుక వస్తుంది.

సంస్కృతంలో మాఘం అనేదొక కావ్యం. మాఘుడనే కవి దీనిని రచించాడు. ఈ కావ్యానికి అసలు పేరు శిశుపాలవధ. శిశుపాలుడు శ్రీకృష్ణులకు శత్రువు. అన్ని వేళలలోనూ అన్ని అవస్థలలోనూ అతడు భగవంతుని నిందిస్తూనే ఉండేవాడు. ఆ వైరానికి ఫలితమే ఈ కావ్యంలో వర్ణింపబడింది.

ఏ కవి అయినా ఎన్ని కావ్యాలు వ్రాసినా అతని కబ్బాలలో ఏ ఒకటికో ఏ రెంటికో పేరు వస్తుంది. ఇట్టి కబ్బాలలో కావ్యవస్తువు అతిసహజంగా ఉన్న దున్నట్టు వర్ణింపబడి ఉంటుంది. కబ్బ మల్లినవారు కాలగర్భంలో కలిసిపోయినా వారి కీర్తిమాత్రం కావ్యరూపంగా కలకాలమూ నిలిచి ఉంటుంది. వర్ణనలు కనులకు కట్టినటులుండడాన అట్టి కావ్యాలకు శాశ్వతంగా ఉండిపోతుంది కీర్తి.

మాఘంలో మొదటిదృశ్యం : శ్రీకృష్ణపరమాత్మ ద్వారకలో వెలుపల ఒక సింహాసనమ్మీద కూర్చుండి ఉంటాడు. ఆ సమయలోనే ఆకాశమార్గాన వీణాగాన ప్రియుడైన నారదుడు వస్తూవుంటాడు? శ్రీకృష్ణులపరివారంలోనివారూ అలా ఆకాశమార్గాన వస్తూవున్న కాంతిపుంజం ఏమయి ఉంటుందని ఒకరినొకరు ప్రశ్నిస్తూవుంటారు. చాలా దూరంగా ఉండడంచేత ఇదమిత్థమని వారెవరూ నిర్ణయింప లేకుండా ఉంటారు. ఆ వెలుగు మెలమెలగా సమీపించిన కొలదీ ఒకవ్యక్తి రూపమాత్రంగా గోచరిస్తుంది. కాని ఆడదో మగవాడో అనే భేదం తెలియడంలేదు. మరికొంత దగ్గరకురాగా మగవాడని తేలింది. ''ఎవరీ మనిషి?'' అని మరింత కుతూహలముతో చూడగా ఆమనిషి నారదుడని తెలిసిందట.

చయస్త్విషా మిత్యవధారితం పురా

తతః శరీరీతి విభావితాకృతిమ్‌,

విభు ర్విభక్తావయవం పుమానితి

క్రమా దముం నారద ఇత్యబోధి సః.

చయ్సః(వెలుగుల) మొత్తము. మొట్టమొదట ఏదోవెలుగు, మొత్తముగా కనబడినది. ''తతః శరీరీతి విభావితాకృతిమ్‌''. తరువాత ఏదో కొంచెం ఆకారం తాలిచినట్లు కనబడిందిట! 'విభు ర్విభక్తావయవం పుమానితి'. మరింత దాపులకురాగా ఆకృతి స్పష్టంకాగా ఒకపురుషుడులాగా తోచిందిట. 'క్రమాదముం నారద ఇత్యబోధిసః'. నారదుడే వస్తున్నాడని పిదప తెలిసింది. ఈ రీతి స్వభావసిద్ధంగా సృష్టించడం మహాకవులకు పరిపాటి. ఆ కాలంలో ఈలాంటి కావ్యాలెన్ని వ్రాయబడినవో అవి అన్ని నశించిపోకుండా ఇప్పటికి ఉన్నవని చెప్పలేము.

అటుపిమ్మట నారదుని వేషం వర్ణిస్తాడు కవి :

అజస్ర మాస్ఫాలిక వల్లకీ గుణ

క్షతోఙ్జ్యలాంగుష్ఠ నఖాం శు భిన్నయా,

పురః ప్రవాళై రివ ఫూరితార్థయా

విభాంత మచ్ఛస్ఫటి కాక్షమాలయా.

నారదుడు వీణతీగెలను ఎల్లపుడూ మీటుతూనే ఉంటాడు. ఆజస్రమ్స్‌ఎల్లప్పుడు. వల్లక్సీవీణ, గుణ్సతీగెలు. ఆస్ఫాలిత్సమీటుబడిన వీణ నెపుడునూ వాచుటచేత బొటనవ్రేలు ఎఱ్ఱగా ఉన్నది. గోళ్ళుమాత్రం తెల్లగా ఉన్నవి.

నారదుడు వీణమీటడముచేత బొటనవ్రేలికి నొప్పికలుగగా వీణవదలి జపమాల పట్టుకొంటాడు. మాలను తిప్పడములో ఆయన బొటనవ్రేలి యెరుపుచాయలు 'మాలలోని స్ఫటికాలను ఎఱ్ఱదనమును ఎక్కుదించి జపమాలను సగము పగడాల దండగా చేసినటులు తోస్తూందిట. 'పురఃప్రవాళై రివ పూరితార్ధయా విభాంత మచ్ఛస్ఫటికాక్షమాలయా.' 'మాలను తిప్పేటప్పుడు మాధవుని నామము గురుతు రావాలి. విభూతి రాచికొనినపుడు శివస్మరణ కలుగవలెను. కొందరు సూర్యునిచూచి కనులు మూసికొని దైవమును స్మరిస్తారు. ఇవి ఏవీ లేకపోతే భగవన్నామస్మరణాని కెడ మను మాటే ఉండదు. (కొందరకు)

మాఘ మహాకవి నారదునిచేతిలోని స్ఫటికాక్షమాల సగము పగడాల దండవలె ఉన్నదని చమత్కరించాడు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే నా వద్ద నున్న స్ఫటికమాలలోని మేరువు పగడము. నేను వీణవాయిస్తానా యేమి! ఈ మాల ప్రవాళస్థగితమై ఉంది? అని అనుకొన్నాను. అపుడు మాఘుని కావ్యం నాకు గురుతు తగిలింది.

'ప్రవాళ' అనే సంస్కృతపదమునుండి 'పగడము' అనే తెలుగు పదమున్నూ 'పవళము' అనే తమిళ పదమున్నూ పుట్టినవి. పశ్చిమకన్నడదేశంలో 'హవళము' కూడా ప్రవాళపదభవమే. సంస్కృతపదానికి కన్నడపదానికి ఇంచుమించు పోలిక ఉన్నది. తమిళములోని 'ళ' కారము తెలుగులో డకారంగా ఉచ్చరింప బడుతుంది. తమిళంలో పుగళ్‌ అనే పదం ఉంది. తెలుగన అది 'పొగడు'ట. కన్నడములో 'హొగళు' లేక ''పొగళు''. ఇట్లాటి మార్పునకు వేదములో ఏమయినా ఆధారం ఉన్నదా అని చూచాను.

పడమటిదేశంలోనూ కర్ణాటమహారాష్ట్రదేశాలలోనూ ఋగ్వేదం ఎక్కువ. తూరుపు సముద్రతీరములో యజుర్వేదం ఎక్కువ. కాని అచట నచట ఋగ్వేదముగూడా లేకపోలేదు. ఆంధ్రదేశంలో నూటికి నూటికి తొంబది యెనిమిదవ వంతు యజుర్వేదులు. తమిళనాడులో ఎనభైపాళ్ళు యజుర్వేదులు. తెలుగునాడులో సామవేదం లేదు. తమిళనాడులో 15 శాతం సామవేదం ఉంది. ఋగ్వేదం 5 శాతం ఉండవచ్చు. పడమట అనగా బొంబాయి, నాసికనుండి కన్యాకుమారి వరకు ఋగ్వేదమే అధికం అయినప్పటికీ పురాతన కాలంలో తమిళనాడులో సామవేదులు అధికముగా ఉన్నారని తలచడాని కాధారాలు ఉన్నవి. శాఖ అంటే కొమ్మ. ఒకొక వేదానికి పెక్కుకొమ్మలు. సామవేదానికి వేయిశాఖలు. ఒకొక కుటుంబానికి శాఖ అని చెప్పుట వాడుక. తమిళనాడులో సామవేదం చెప్పుకున్నవి వేయి కుటుంబాలు ఉండేవని చెప్పడం వాడుక. 'అయిరశాకై ఉడైయాన్‌' అని తేవారంలో కొన్నిచోట్ల ఈశ్వరుని వర్ణించారు. ''సహస్ర శాఖలస్వామి'' అని దానికి అర్థం.

ఇపుడు తమిళనాడులో ఎక్కువగా ఉండేది సామవేదపు కౌథుమశాఖ. శ్రోత్రీయులలో కొందరు సామవేదులు జైమిని శాఖకు లేక తలవకారశాఖకు చెందినవారు. మలయాళ##దేశంలోని నంబూదిరీలుకూడా తలవకార శాఖకు చెందినవారే. తిరునల్వేలి చుట్టుప్రక్కలనున్న శ్రోత్రియులుకూడా తలవకార శాఖకు చెందినవారే. ఉత్తరాదినుండి వచ్చినవారిలో సామవేదులదే కౌథుమశాఖ. ఉత్తరాదివారని అనడాన వీరు తెలుగునాడునుండి వలసవచ్చినవారై ఉండాలి. లేదా సంధ్యావందనంలో ''నర్మదాయై నమః, నర్మదాయై నమోనిశి, నమో7స్తు నర్మదే తుభ్యమ్‌'' అని ఒకశ్లోకం చెప్పడంచేత వీరు నర్మదానీరవాసులయి యుండాలి.

దక్షిణదేశంలో 'నాయన్‌ మార్‌' అని వ్యవహరింప బడేవారిలో ''సోమయాజి మోరర్‌'' అనేవారొకరు ఉన్నారు. వారు తలవకారశాఖీయులు. వీరొకపరి యాగం చేశారు. అగ్ని ముఖంగా ఇచ్చే ఆహుతులను పరమేశ్వరుడే స్వయంగా గ్రహిస్తాడని ఒక ఐతిహ్యం. కాని ఆపరమేశ్వరుని ఎలారప్పించడం? తిరువారూరులోని సుందరమూర్తి పరమేశ్వరునికి పరమ సన్నిహితుడుట? ఆయనగారు జవ్వాదిని మేన అలదికొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఎల్లపుడూ మాటలాడే చొరవగలవా డని ఎవరో సోమయాజులకు చెప్పారు. ఈ భక్తునికి ఈశ్వరుడు దౌత్యంకూడా చేశాడుట. ఆ సుందరమూర్తిని ఎట్లాగయినా యాగానికి పిలిస్తే ఆయనగారు 'ఈశ్వరుడే హవిస్సు గ్రహించే టటులు చేస్తాడని ఎవరో చెప్పారు. అంతటితో సోమయాజి తిరువారూరికి పయనం కట్టాడు. తిరువారూరులో 'విరల్‌ మీలిడ నయనార్‌' అనే మరొక భక్తుడుగూడా ఉన్నాడు. ఆయనకు ఈశ్వరుని మీదనే కోపం. నడత సరిగ్గాలేని సుందరునిమీద శివునికి ఇంత మమత మెందుకు? 'ఈ సుందరమూర్తికినీ ఆలయము ముంగిటికికూడా వచ్చే అర్హత లేదే!' అని అత డీశ్వరునితో వాదులాడాడు. కాని ఈశ్వరుడొక్క మాటకూడా చెవిని పెట్టుకొనినటులు తోచలేదు. 'పూలదండలు వేసుకుని చందనం అలదుకొని ఘుమఘుమలాడుతూ ప్రతిరోజూ బోగముదాని యింటికిపోయే సుందరునితో సాంగత్య ముంచుకొన్న ఈశ్వరు డెటువంటివాడు' అని విరల్‌ మీండనయ నారుకు కోపం. అతడు ఇటువంటి ఆక్రోశంతో ఇక తిరువారూరిలోనే కాలుపెట్టగూడదని తీర్మానించుకున్నాడు. ఇలా తీర్మానించుకొని అతడు తిరువారూరునుండి బయలుదేరి ఊరి బయటి ఎల్లలో మకాం వేశాడు. తిరువారూరివా రెవరు వచ్చినా వారికాళ్ళు కొడవలితో నరకడం సాగించాడు. ఇతని అనన్య భక్తి నెరిగిన యీశ్వరుడు ఒకనాడు మారువేషంతో వచ్చాడు. అతిథి పాదాలు కడుగుతూ నయనారు 'తమ దేయూరు?' అని అడిగాడు. మాది తిరువారూరు అని ఆయన బదులు పలికారు. అది విన్నంతనే నాయనారు కొడవలి తీశాడు. ఈశ్వరుడు ముందు నయనారు వెనుక, పరుగెత్తసాగారు. ఈశ్వరుడు పరుగుతీయగా నయనారు వెంబడింపగా ఈశ్వరుడు నయనారుని తిరువారూరి యెల్లలోనికి ఎలయించుకుని పోయాడు. ఇట్లా వెళ్ళిన తరువాత ఈశ్వరుడు వెనుదిరిగి, 'ఏమయ్యా! తిరువారూరి యెల్లలోనికే రానంటివే! ఇపు డెట్లా వచ్చావ్‌? అని నయనారును ప్రశ్నించాడు. నయానారుకు తన తప్పిదం తెలిసింది. వెనువెంటనే అతడు తానెత్తిన కొడవలికి తన కాళ్ళనే గురిచేసి తెగవేసి కొన్నాడట. 'అటుపయిని ఈశ్వరుడు నయనారును తనలో ఐక్యం చేసికొన్నాడు' అని పెద్దలు చెపుతారు. నయనారు ఎల్లదాటిన చోటును 'వండాం పాలై' అని అంటారు.

సోమయాజి మోరర్‌ సుందరమూర్తిని వెతకికొంటూ తిరువారూరు వచ్చారు. 'సుందరమూర్తితో నెయ్యము చేయడమెట్లా?' అనే ఆలోచనలో 'ఇది చేయవచ్చు, ఇది చేయరాదు' అనే ముందు వెనుకలు లేక 'తూదు విళంగీరై' అనే ఒక ఆకుకూరను ప్రతి దినమూ సుందరమూర్తి చెలిమినెరపే వేశ్యయింట్లో ఇచ్చి దానిని సుందరమూర్తికి వండిపెట్టించమని వేశ్యను బతిమిలాడాడు. ఆ దాసికూడా ''ఏదియో బ్రాహ్మ డిస్తున్నాడుగా' అని దానిని వండి సుందరమూర్తికి పెట్టే ఏర్పాటు చేసింది.

'తూదువిళంగీరై' అనే ఆకుకూర తింటే జ్ఞానం వృద్ధి అవుతుందని అంటారు. ప్రతిదినమూ సోమయాజి ఆ ఆకుకూర కోసి తీసికొనిపోయి ఆ వేశ్యకు ఇస్తూవచ్చాడు. ఇట్లా కొన్నాళ్ళు పోగా పోగా నదిలో వరదలు రావడం మొదలుపెట్టి నాలుగయిదు నాళులదాకా తగ్గు చూపలేదు. అందుచేత సోమయాజికి ఆకూర దొరకలేదు. వేశ్యకు ఈయలేదు. ప్రతిదినమూ విస్తరిలో కనబడే కూర కనబడకపోవడాన సుందరమూర్తి దాసిని పిలిచి ''తూదు విళంగీరై'' లేదేమి? అని అడిగాడట. ఈ కూరను ఎవరో ఒకాయన తెచ్చి ప్రతిదినమూ వండిపెడుతూవుండు, అని నన్ను వేడుకొన్నాడు. నాలుగయిదునాళ్ళనుండీ ఆయన రావడం లేదు. అందుచేత వండిపెట్టడానికి లేకపోయింది. అని దాసి విన్నవించుకొంది. అపుడు ఆ సుందరమూర్తికి 'ఆ బ్రాహ్మణు డెవరు చెపుమా', అని తెలిసికొవలెనని కుతూహలం కలిగింది.

వరదలు తగ్గిపోయెయ్‌. కూర మళ్ళాతీసికో రావడానికి వీలు చిక్కింది. సోమయాజి మోరర్‌ ఆకూర వేశ్యయింటికి తీసికొని వెళ్ళాడు.

సుందరమూర్తి కనిపట్టుకొనే ఉన్నాడు. ఆ సోమయాజి మోరర్‌ కనబడగానే సుందరమూర్తి-మీ రెవరు స్వామీ? రోజూ ఇంత శ్రమపడి ఈకూర తెచ్చియిస్తున్నారు. ఎందుకు? అని అడిగాడు.

ఆవిషయం తమతో ఏకాంతంలో విన్నవించుకోవాలి. నాకు తమవలన కావలసిన ఉపకారం ఒకటి ఉంది. మీ అనుగ్రహంకోసం ఈకైంకర్యం చేస్తున్నాను, అని మోరర్‌ అన్నాడు.

''నాకు సాధ్యంకాని పని అయితే?''

'మీకు సాధ్యంకాని పని అంటూ ఒకటుందా?'

సోమయాజి ఏకాంతంగా తనకోరికను సుందరమూర్తితో చెప్పికొన్నాడు.

''యాగంలో స్వామియే ప్రత్యక్షంగా హవిస్సు గ్రహించడమంటే అది స్వల్పకార్యమా? మన టాఠాలు అక్కడ సాగుతయ్యా?

తమకు సాధ్యంకాకపోతే ఇంకొకరికి సాధ్యమా స్వామీ?' అని మోరర్‌ సుందరమూర్తి కాళ్ళావేళ్ళా బడ్డాడు.

'అయినా మీకోసం స్వామిని అడిగిచూస్తా' అని చెప్పి సుందరమూర్తి గుడికి వెళ్ళాడు.

ఈశ్వరుడు సుందరమూర్తి విన్నపం ఆలకించాడు. నాకు నీవు భక్తుడవు, నీకు అతడు భక్తుడు. ''అతనిసేవ నీవు చేయవలెనని'' నాకు నీవు చెబుతున్నావు. సరే, కానీ, నే నతడిచ్చే హవిస్సు గ్రహిస్తాను కాని ''నేనేరూపంలో వచ్చినప్పటికీ అతడు హవిస్సు ఇచ్చితీరాలి. ఈ సంగతి మాత్రం నీ వతనికీ తేటతెల్లం చేయాలి'' అని ఈశ్వరుడన్నాడు. సుందరమూర్తి ఈ సంగతి మోరర్‌కు చెప్పగా అతడానందిస్తూ తన గ్రామానికి వెళ్ళి యాగానికి ఉపక్రమించాడు.

యాగం జరుగుతూంది. ఈశ్వరుడు చండాలవేషం వేశాడు. అంబికగూడా చండాలి వేషం వేసికొంది. నెత్తి మీద ఒక కల్లుకడవ పెట్టుకొంది. నాలుగు వేదాలూ నాలుగు కుక్కలై వెంట వచ్చినై. భూతగణాలన్నీ మాలవేషాలతో కల్లుముంతలతో బిలబిలామంటూ యజ్ఞవాటికలోకి వచ్చింది. సోమయాజిమాత్రం కదలలేదు, మెదలలేదు, ఆనందంగా కూచుని ఉన్నాడు. తక్కిన బ్రహ్మణలు యజ్ఞం కాస్తామైలపడ్డదని నాలగువయిపులకూ దూసుకొనిపోయారు. సోమయాజి సుందరమూర్తి ఎచ్చరికను గుర్తు ఉంచుకొని చండాలునకు హవిస్సు అర్పణ చేశాడు. ఈశ్వరుడు అతని హవిస్సు గ్రహించి అనుగ్రమించా డని ఒక కథ. అందులకే సోమయాజి 'అరువత్తు మువ్వురు' అనే శివభక్తుల చరిత్రలో ఒకడుగా చేరాడు.

ఆ కాలములో ఈ మాదిరిగా నడచిన యాగాలు చాలా ఉన్నవి. సామవేదులలోకూడా తలవకారశాఖ మలయాళ##దేశంలో అధికం. చోళ##దేశస్థులలోగూడా తలవకారశాఖ ఉన్నదని చెప్పడానికే సోమయాజి కథ చెప్పుకో వచ్చాను. ఉత్తరాదిలో శుక్లయజుర్వేదానికి చేరిన మాధ్యం దినశాఖ అధికం. ఈ శాఖవారి వ్యాకరణంలో ఇతర వేదాలలో కనిపించే 'య' కారానికి బదులు జకారం ఉచ్చరించే నియమం ఒకటి ఉన్నది. దానిచేతనే యమునకు జమున అనిన్నీ యోగికి జోగి అనిన్నీ వ్యవహారంలోకూడా వేదాన్ని అనుసరించి యకారాన్ని జకారాన్ని ఉచ్చరిస్తారు.

పాలస్తీనము మొదలయిన సెమిటిక్‌ దేశాలలో (జూదులు, అరబ్బులు ఉండే ప్రాంతాలు) గూడా మిత్రుడూ వరణుడూ మొదలయిన వైదిక దేవతల ప్రశంస ఉన్నట్లు క్రీ.పూ.1400 సం|| లకు చెందిన శిలాశాసనంవలన తెలుస్తుంది. ఇందుచేత ఆ కాలంలో ఆ దేశాలలో వేదాలు వ్యాప్తిలో ఉన్నటులు గుర్తింపవచ్చు. ఉత్తరహిందూ స్థానములోవలెనే ఆ దేశంలోగూడా 'యహోవాను' 'జహోవా' అనిన్నీ 'యూసఫ్‌'ను 'జోసఫ్‌' అనిన్నీ యకారాన్ని జకారంగా ఉచ్చరిస్తారు. అందుచేత అక్కడగూడా శుక్లయజుర్వేదానికి చెందిన మాధ్యందిన శాఖీయులు ఉండి ఉండాలని ఊహించవలసి ఉంది. దీనివల్ల వేదంలోని ఏ అక్షరం ఏ ప్రదేశంలో ఏలాగు ఉచ్చరించబడుతూందో అలాగే చాలా భాషలలోనూ మాటలోనూ వాడుకలోకి వచ్చిందని తెలియవస్తుంది.

అరవంలో 'మార్గత్తంగళ్‌' అనే మాటను తెలుగు నాడు వైష్ణవులు 'మార్గడిత్తంగళ్‌' అని అంటారు. 'మృగశీం్షము' అనే మాటను 'మార్గశీర్‌ డము' అని చెపుతారు.

'స్ఫటికాక్షమాలయా' అనే దానిలో 'అక్షమాల' అనే పదం ఉంది. అకారం మొదలు 'క్ష' కారం వరకూ యాభై యొక్క అక్షరాలు ఉన్నయ్‌. 'క్ష' అనేది మేరువు. మాల జపసంఖ్యను తెలిపే సాధనం. 'క్ష' అనే అక్షరమును వదలి తక్కిన అక్షరాలు జపిస్తే యాభ్తే అక్షరాలు 'క్ష' అనే మేరువును దాటిపోరాదు. 'సూర్యుడు వేరువును దాటడు' అనే సంప్రదాయం అనుసరించి 'క్షకార మనే మేరువు వరకూ జపమాల లెక్కించి దాని దాటక మళ్లా అట్లే వెనుకకు తిప్పాలి.' ఇట్లా ఒక్కమారు మేరువు వరకూ జపమాల తిప్పి తిరిగి మొదటివరకు తిప్పితే నూరు అవుతుంది. పదిమాలలు జపిస్తే వేయి అవుతుంది. అక్షఅనగా అకారాది క్షకారాంతం. స్ఫటికాక్షమాల అంటే స్ఫటికాలతో చేసిన అకారాది క్షకారాంతం ఉన్న మాల అని అర్థం. రుద్రాక్షమాల అన్నా ఇంతే.

స్ఫటికం ఈశ్వరునివలె తెల్లగా స్వచ్ఛంగా ఉండేది. హిందీలోని 'అచ్ఛా' అనే పదం 'స్వచ్ఛ' అనే (స్శుఅచ్ఛ) పదంలోంచే వచ్చిందే అని అనిపిస్తుంది. అకారాదులయిన అక్షరాలను ఆంగ్లంలో 'ఆల్‌ ఫ బెట్‌' అని అంటారు. గ్రీకు భాషలో 'ఆల్‌ ఫా' అనేది మొదటి అక్షరం. 'బీటా' అనేది రెండో అక్షరం. అరబ్బీభాషలోనూ 'అలీఫ్‌, బే, పే, తే' అనియే అక్షరాలు ఆరంభమవుతవి. రెంటనూ మొదటి అక్షరము 'అల్‌' అనియే మొదలవుతుంది. అన్ని భాషలకూ మూలం 'సంస్కృతం' అని అభిప్రాయపడితే సంస్కృతంలో గూడా 'అల్‌' అనే అక్షరం ఉండాలి.

చిదంబరంలో నటరాజు తాండవం చివర ఉదయించిన పదునాలుగు శబ్దాలూ పదునాలుగు సూత్రాలుగా ఏర్పడినవి. వీనికి మహేశ్వరసూత్రా లని పేరు. వీనిని మూలంగా ఉంచుకొని పాణిని వ్యాకరణ సూత్రాల రచన చేశాడు.

మనస్సు వాక్కు కాయము అనే మూడు త్రికరణాలు (త్స్రిమూడు, కరణాల్సుఇంద్రియాలు) పతంజలి మహం
నటరాజు డక్కవాయిస్తూ నర్తనం చేసే సమయంలో ఆ ఝల్లరినుంచి-

అ ఇ ఉ ణ్‌, ఋ ఈ బుూ క్‌, ఏ ఓ జ్‌, ఐ ఔ, చ్‌, హ య వ ర ట్‌, ల ణ్‌, ఞ మ ఙ ణ న మ్‌, ఝ భ ఞ్‌, ఘ ఢ ధ ష్‌, జ బ గ డ ద శ్‌, ఖ ఫ, ఛ ఠ థ చ ట త వ్‌, క ప య్‌, శ ష స ర్‌, హ ల్‌.

అనే సూత్రాలు ఏర్పడినవి.

ఈ పద్నాలుగు సూత్రాలూ 'హల్‌' అనే సూత్రంతో ముగిసినవి. ఇవి చాలామందికి తెలిసి వుండవచ్చు. శ్రావణ పూర్ణిమనాడు దీనిని వేడుకగా చెపుతారు. పరమేశ్వరుడు ఉడుక వాయిస్తూ గిఱ్ఱున తిరిగేటప్పుడు ఈ శబ్దాలు ఏర్పడినవిట.

ఒక్క చిన్న సంజ్ఞతో కొన్ని అక్షరాల మొత్తాన్ని సంగ్రహించడానికి పాణిని ఈ శబ్దాలు ఉపయోగించుకొన్నాడు. ఈ పదునాలుగు సూత్రాలలో ఒక సూత్రపు మొదటి అక్షరంతోనో లేక ఇంకో అక్షరంతోనో తరువాతి సూత్రాలలో ఉండే కడపటి అక్షరం మాత్రం చేరిస్తే నడుమనున్న అక్షరాలకుగూడా అర్థమవుతుంది. 'హయవరట్‌' అనే సూత్రంలో మొదటి అక్షరం 'హ' 'హల్‌' అనే సూత్రంలో చివరి అక్షరం 'ల్‌'. ఈ రెంటినీ కలిపితే 'హల్‌' అనే సూత్రంలో చివరి అక్షరం 'ల్‌'. ఈ రెంటినీ కలిపితే 'హల్‌' అని అవుతుంది. ఇది ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞకు 'హయవరట్‌' సూత్రంలోని హకారం లగాయతు, కడపట ఉన్న 'హల్‌' సూత్రంలోని ల్‌ కారం వరకూ నడుమనున్న సూత్రాలలోని ముఖ్యాక్షరాలన్నీ అర్థం. (ప్రతిసూత్రంలోని చిర పొల్లులన్నీ పొల్లులే ఈరీతిగా 'అ ఇ ఉ ణ్‌' లోని మొదటి అక్షరమునూ హల్‌ సూత్రంలోని ల్‌కారమునూ చేరిచి పలికితే 'అల్‌' అని అవుతుంది. (ఈలాగే 'అచ్‌' అంటే 'ఐ ఔ చ్‌' లో చకారం వరకూ ఉన్న అక్షరాలకూ సంజ్ఞ. తెలియకయే మనం కొందరం ఆకారాదిగా చకారాంతంగా ఉన్న నడిమి ముఖ్యాక్షరాలను అచ్చులనిన్నీ హకారాది లకారాంతంగా ఉన్న మధ్యాక్షరాల నన్నీ హల్లునుగానూ వ్యవహరిస్తున్నాము) అల్‌ అంటే అచ్చులనిన్నీ హల్లులనిన్నీ ఏర్పడిన అన్ని అక్షరాలకూ సంజ్ఞ అయింది.

వ్యాకరణంలో 'అ లోంత్యస్య' అనే సూత్రం ఒకటి ఉంది. ఇందలి 'అల్‌'కు అక్షరం అని అర్థం. మాహేశ్వర సూత్రాల ననుసరించి పాణిని 'అష్టాధ్యాయిని' రచించినాడు. 'అష్టాధ్యాయ్సిఎనిమిది అధ్యాయాల సముదాయం. ఒకొక అధ్యాయానికి నాలుగేసి పాదాలు. ఈ యెనిమిది అధ్యాయాలు వెరసి వ్యాకరణసూత్రాలు)

ఇట్లా అన్ని భాషలలోని అక్షరాలకూ అది అకారంగా ఉన్నది. హిందూస్థానీలో అలీఫ్‌ అనే మొదటి అక్షరమూ గ్రీకుభాషలోని అల్‌ ఫా అనే మొదటి అక్షరమూ ఈ రెండూ 'ఆల్‌' ప్రత్యాహారానికి అర్థమయిన అక్షరమునుండి వచ్చినవి. ఆల్ఫబెట్‌ అనే ఇంగ్లీషుపదంకూడా 'అల్‌' అనే ప్రత్యహారానికి అర్థమయిన అక్షరభవమే అని నాఅభిప్రాయం.

వ్యారణశాస్త్రంలో అక్షరాన్ని అల్‌ అనియే వ్యవరిస్తారు. నటరాజు ఝల్లరినుండి ఈసంజ్ఞలు బయలువెడలినవి. వానికి సూత్రాలు వ్రాసినది పాణిని. పాణి అనగా చేయి. భగవానుని పాణ్శినినాదము పాణినినాదముగా మారింది. నారదుడు జపమాల ధరించినటుల మాఘుడు వ్రాసిన వైనం గుర్తు తవిలింది. దానినుండి స్ఫటికాక్షమాల పగడాల మాలగా మారిందనే ప్రస్తావనలో ఒకదాని కొకటి అనుబంధముగా శబ్దశాస్త్ర చర్చలోకి దిగింది.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page