Maa Swami    Chapters   

3. ధ్యానమేవ ఉపాసనమ్‌

'హాజీమే నాకమూర' టోకియో విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసరు. 'మియామొటే' అదే విశ్వవిద్యాలయములో ఫ్రెంచిభాషను నేర్పే ప్రోఫెసరు.

'ప్రొఫెసరు నాకమూర' శంకరుల బ్రహ్మసూత్ర భాష్యమును జపానీభాషలో అనువదించుటయ కాక శంకరులకు పూర్వముఉన్న కొన్ని వేదాంత గ్రంథములనుకూడ అనువదించినారు. 'మియా మొటో' ఫ్రెంచినుండి జపానీభాషలోనికి 'రామకృష్ణ పరమహంస వివేకానందుల' జీవితచరిత్రలను అనువదించారు. ఈ ఇరువురుభారతదేశమునకు వచ్చిన సందర్భములో కామకోటి శంకరాచార్యుల వారిని కలుసుకొన్నారు.

ప్రొఫెసరు నాకమూర గౌడపదీయ మూండ్యూకకారిక, వాక్పదీయము చదువుటయేకాక బోధాయనులు, ద్రావిడాచార్యులు మండనులు వ్రాసిన గ్రంథములు కూడ పరిశీలించినవారు. భారత దర్శనములను చైనా, టిబెట్‌ దేశములలోకూడ కొంత సంగ్రహించి నాలుగు పుస్తకములుగ తయారు చేశారు. జపానులో ఒక్క శాంకరీయ గ్రంథములనేకాక ఇతర సంస్కృత గ్రంథములను కూడా చాల ఆసక్తితో చదువుతున్నారని, ఐనప్పటికి 'ఖండన ఖాద్యము' వంటి గ్రంథములు కొరకు వడుట కష్టంగా ఉన్నదని స్వామివారితో 'నాకమూర' అన్నారు. ఆయన తాము బ్రహ్మనూత్ర భాష్యమును పూర్తిగా అనువదించినా అట్టి గ్రంథములను ప్రచురించుట కష్టసాధ్యముగా ఉన్నదని అన్నారు.

తరువాత స్వాములవారికి 'నాకమూర' గారికి యీక్రింది విధముగా సంభాషణ జరిగింది.

ప్రశ్న:- శంకరులు వ్రాసిన పుస్తకములలో 'ఉపాసన' అన్నపదము తరచువస్తూ ఉన్నదికదా! 'ఉపాసన' అంటే ఏమిటి? అటువంటి ప్రత్యేకసాధన ఏదైనా మఠములో వాడుకలో ఉన్నదా?

స్వామి:- 'ధ్యానమేవ ఉపాసనమ్‌' 'ఉపాసన' అంటే ధ్యానమే. ధ్యానము అన్నమాట వచ్చినపుడు ఒక రూపకల్పన అవసరం అవుతుంది. ఉదాహరణకు రెండు చేతులుకల దైవమునో లేక ఎనిమిది చేతులు కలిగిన దైవమునో ధ్యానము చేయవచ్చును. కాని సత్యమైనది ఒక్కటే. దానిలోమార్పు లేదు. అంతిమ సత్యమైన ఆ రూపము నిరాకారమైనది. మనము ఏ రూపమును కల్పించుకొని ధ్యానము చేస్తామో ఆమూర్తివలన ఒక ప్రత్యేకమైన ప్రయోజనము వుంటుంది. రెండుచేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం ఒకటి. ఎనిమిది చేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం మరియొకటి. ఏ యే మూర్తులను ఏయే విధముగా ఉపాసించాలో తెలిపేవి శాస్త్రాలు. ఉపాసనలలో వైవిధ్యము ఉన్నా ప్రయోజనం ఒక్కటే. ఏదైనా అంతిమసత్యమును తెలుసుకొనుటయే. ఉపాసనలన్నీ మనుస్సు ఏకాగ్రం చేయుటకు సాధనాలు.

ప్రశ్న:- మఠములో ఏదైనా ఉపాసన చేస్తున్నారా? ఐతే ఆ ఉపాసన ఏది?

స్వామి:- శాస్త్రములు ఎన్నో రకములైన ఉపాసనలను చెపుతూ ఉన్నాయి. ఆ ఉపాసనలను అన్నిటిని అనుసరించుట సాధ్యముకాదు; అవసరమూకాదు. అందుచేత ఇష్టమైన ఒకటి రెండు ఉపాసనా మార్గములను స్వీకరించి వానిని నిర్దిష్ట సమయాలలో చేస్తూ ఉంటారు. ఉపాసన వ్యక్తి గతమైనది. సామూహికమైనదికాదు. ఉపాసన క్రమానుగతముగా వచ్చిన దానిని అనుసరించియో, గురువు ప్రసాదించిన దీక్షను అనుసరించియో ఉంటుంది.

ప్రశ్న:- అద్వైత సిద్ధాంతమును చక్కగా అర్ధము చేసుకొనవలె నంటే ఏ గ్రంథము చదువవలెనని మీరు సలహా ఇస్తారు?

స్వామి:- మొదట 'వివేకచూడామణి' ని పిదప 'అపరోక్షానుభూతి' ని చదువవచ్చు.

నాకమూర:- నేను విద్యారణ్యుల గ్రంథములనుకూడ చదివినాను. అందులో 'పంచదశి' ఒకటి కాని సురేశ్వరాచార్యుల వార్తికము చాల విస్తృతముగా ఉన్నది.

స్వామి:- ఔను! బృహదారణ్యమును శంకరుల భాష్యముతో చదువునప్పుడు సురేశ్వరుల వార్తికమును వివరణకొరకు వాడుతూ ఉంటారు. దాని తరువాత ధర్మరాజుల వేదాంత పరిభాష, సదానందుల వేదాంతసారము వచ్చినవి. మీరు 'భజగోవిందస్తోత్రము' చదివినారా?

నాకమూర:- లేదు.

స్వామి:- ఆచార్యులవారి స్తోత్రములలో అన్నిటికంటె 'భజగోవిందము'నకు ప్రచారము ఎక్కువ. అసలు ఆచార్యులవారి పేరు ఎత్తుకొంటే జ్ఞాపకము వచ్చేది 'భజగోవిందస్తోత్రమే' శైవులైనా, వైష్ణవులైనా అందరకు ఈ స్తోత్రం అంటే చాల ప్రీతి. ఇందులో నీతి, పరమార్ధము రెండూ కలసి వున్నాయి.

నాకమూర:- నేను శంకరుల బ్రహ్మసూత్రభాష్యము, గీతాభాష్యము రెండూ చదివినాను.అందులో ఎక్కడచూచినా విష్ణుప్రశంసయే కాని శివుని ప్రసక్తి కనబడుటలేదు. కాని శాంకరీయులందరు శైవులుగా ఉన్నారు. దీనిని చూస్తే నాకు ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది.

స్వామి:- శంకరాను యాయులందరు శైవులని మీరు తలచుటకు కారణం?

నాకమూర:- వారందరు శివారాధన, భస్మధారణ చేస్తారు కనుక.

స్వామి:- మీరడిగిన ప్రశ్న మంచిదే! మీకు తృప్తికరముగా సమాధానము చెప్పవలెనంటే కొన్ని చారిత్రిక విషయాలను కూడ చెప్పాలి. శంకరులకు పూర్వము భారతదేశములో రెండేమతాలు ఉండేవి. ఒకటి సనాతన ధర్మము లేక స్మార్తమంతం. రెండవది బౌద్ధము. ఒక్క భారతదేశము నందేకాక 'నయాము' 'కంబోడియా' దేశములలో కూడ ఇంతే. జపానులో ''గణపతి, ఇంద్రుడు, సరస్వతి''- వీరి విగ్రహములు కనబడుటచేత జపానులో కూడ ఒకప్పుడు సనాతనధర్మము ఉండి ఉండాలని తీర్మానించవలసి వస్తూ ఉన్నది.

నాకమూర:- జపానులో బౌద్ధమునకు ముందు 'షింటోయిసం' ఉండేది. ''షింటోయిసం'' అంటే బ్రాహ్మణమతమే.

స్వామి:- బౌద్ధము భారతదేశమునుండి చైనా-జపానులకు ప్రాకినది. తరువాత భారతదేశములో వేద ప్రామాణ్యమును నిలువబెట్టుటకై 'కుమారిలభట్టు' పూనుకొన్నాడు. బౌద్ధమతము నిరీశ్వరత్వ మువంక మొగ్గుట చూచి 'ఉదయానాచార్యులు' దానిని ఖండించుటకు పాటుపడ్డారు. అటుపిదప శంకరభగవత్పాదులవారు వేదప్రమాణముతోబాటు ఈశ్వరభక్తినికూడ బోధిస్తూ- సర్వము బ్రహ్మమే అన్న ప్రాతిపదికతో కూడిన జీవాత్మ పరమాత్మల ఏకత్వమును అద్వైత సిద్ధాంతముద్వారా నిరూపించినారు. భారతదేశమునందు అద్వైత సిద్ధాంతము తలయెత్తగనే బౌద్ధము క్రమక్రమముగా క్షీణించసాగింది. అందరూ భగవత్పాదులు బౌద్ధమతాన్ని హిందూదేశమునుండి వెళ్ళగొట్టినారని అనుకొంటారు- కాని శంకరుల భాష్యాలను చూస్తే అందులో బౌద్ధమతఖండన చాల అరుదుగా కానవస్తుంది. ఆయన ఖండనమంతా మీమాంసమీద, సాంఖ్యముమీద సాగింది. తార్కికముగా బౌద్ధమును కుమారిలభట్టు, ఉదయానాచార్యులు ఖండించారు. అద్వైతమతవ్యాప్తికి వీరి కృషి ఎంతయో తోడ్పడింది.

ఇక ఉపాసన విషయము ఎత్తుకొంటే ప్రజలు కులాచారమును పాటిస్తూ విష్ణువును, శక్తిని ఉపాసించేవారు. భగవత్పాదులవారు కూడ వైదికవిధానములో కులాచారముగా వచ్చిన పూజలనే చేయమన్నారు. ఆయనవరకు ఆయన అద్వైతి. అద్వైత సిద్ధాంతానుసారము పరమాత్మ ఒక్కడే. శక్తి, శివుడు, విష్ణువు- అంతా ఆ పరమాత్మయే. వైష్ణవులలో కొందరు తీవ్రవైష్ణవులు శివాలయములోనికి తొంగిచూడకపోయిన అద్వైతానుయాయులుగా ఉండేవారు. వారికి భస్మధారణ లేదు. వారందరు త్రిపుండ్రాంకితులైన విష్ణుభక్తులే. కాని శంకరమతమును పాటిస్తూ అద్వైతులై ఉండేవారు. భస్మధారణచేత శైవులలోకూడ శంకరులను అనుసరించిన అద్వైతులు ఉండేవారు. కాని ఇప్పుడు వైష్ణవులలో అద్వైతుల సంఖ్య తక్కువ. అందుచేతనే అద్వైతులందరు శైవులే అన్నభావం నెలకొన్నది.

శంకరులకు పిదప వైష్ణవాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్యులు వచ్చుటతో అద్వైతులైన వైష్ణవులు వీరి మతాలలో ఏదో ఒకదానిని అనుసరించుటకు ఆరంభించారు. శంకరులను అనుసరిస్తూ మిగిలినవారు దాదాపు శైవులే అయినారు. ఇప్పటికి కూడ వైష్ణవులలో కొందరు అద్వైతులు ఉన్నారు. వారు శివాలయాలకు వెళ్ళకపోయినా నన్ను శంకరాచార్యులని గౌరవిస్తారు. వీరికి అద్వైతమును పాటించని వైష్ణవులకంటె శివునియెడ విముఖత యెక్కువ. అద్వైతులలో ఎక్కువమంది శైవులనుటకు పైన చెప్పినదే కారణము.

ఇక మఠవిషయము ఎత్తుకొంటే మఠమునుండి ఏ శ్రీముఖము జారీచేసినా, కడపట 'నారాయణ స్మృతిః' అని విష్ణుస్మరణతో అంతము అవుతుంది. కాని నేను భస్మమును అలదుకొని శివపూజ చేస్తూవుంటాను. ఎవరైనా నాకు సమస్కరిస్తే 'నారాయణ - నారాయణ' అని నారాయణ స్మరణ చేస్తాను.

(సంభాషణలో వచ్చిన బోధాయనుల ప్రసక్తి జ్ఞప్తికి తెచ్చుకొని) బోధాయనుల వ్రాతప్రతులు మీకు ఏమైనా లభించినవా?

నాకమూర:- ఆ! నావద్ద కొన్ని వార్తికములున్నాయి. అవి ఉపవర్షులు వ్రాసినవి. ఉపవర్షులనే బోధాయనులుగా పరిగణిస్తున్నారు. నేను ఆత్రేయబ్రహ్మనంది కృతులను, ద్రావిడాచార్యుల గ్రంథాలను చూచాను. వైష్ణవ గ్రంథాలు 'ద్రామిడాచార్యులనియు' అద్వైత గ్రంథములు 'ద్రావిడాచార్యులు' అనియు వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణము ఏమిటి?

స్వామి:- 'ద్రావిడము, ద్రామిడము' అన్నవి పర్యాయపదములు.కాని ఔత్తరాహులు 'ద్రావిడము' నకు బదులు 'ద్రామిడము' అనియే వాడుతూ ఉంటారు.

నాకమూర:- భారతదేశములో ఇంత పరమత సహనము ఉండుటకు కారణము అద్వైతమే అని అనుకొంటాను. మీరేమంటారు?

స్వాములవారు:- వాస్తవమే.

నాకమూర:- భారతదేశంలో పండితులలో అధిక సంఖ్యాకులు అద్వైతము పఠిస్తారని అనుకొంటాను. ఔనా!

స్వామి:- అదికూడ నిజమే! అవును, జపానులో సంస్కృత భాషాభ్యాసము ఎలా ప్రారంభ##మైనది?

నాకమూర:- బౌద్ధమతవ్యాప్తితో బౌద్ధులకు సంస్కృతము నేర్చుకొనవలసిన అవసరము కలిగినది. సంస్కృతముపై ఆసక్తి పుట్టుకొని వచ్చినది. డెబ్బది ఎనుబది యేండ్లక్రితం జపానునుండి కొందరు 'ఆక్సుఫర్డు' విద్యాలయానికి వెళ్ళారు. అక్కడ 'మాక్సమూలర్‌' మరియు ఇతర ప్రాచ్యభాషా ప్రవీణులవద్ద సంస్కృతము అభ్యసించి జపానులో దానికి ప్రవేశము కలిగించారు. మరికొందరు 'జర్మనీ'లో సంస్కృతము నేర్చుకొన్నారు. జపానులో బౌద్ధ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులకు సంస్కృతములో కొంచమైనా ప్రవేశము ఉండవలెనని నిబంధిస్తున్నారు.

స్వామి:- జపానులో ఎంతమంది 'రామాయణము' వంటి కావ్యాలను సంస్కృతములో చదివి అర్ధము చేసుకొనగలరు?

నాకమూర:- దాదాపు ఇన్నూరుమంది ఉండవచ్చు. వారిని 'టోకియో' లోనో 'క్యోటో' లోనో చూడగలము.

స్వాములవారు:- జపానులో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?

నాకమూర:- దాదాపు రెండువందలు ఉండవచ్చును. జపానులో ప్రతికళాశాల ఒక విశ్వవిద్యాలయమే. అవి స్వతంత్రముగా పరీక్షలు పెట్టి పట్టాలను ఇస్తాయి.

స్వామి:- జపానీయ వర్ణసమామ్నాయము(అక్షరములు) సంస్కృతమును అనుసరించి ఉంటుందా? లేక చైనా భాషను అనుసరించి ఉంటుందా?

నాకమూర:- సంస్కృతమునే అనుసరిస్తుంది. మొదట అచ్చులు తరువాత హల్లులు వస్తాయి. ప్రతి అక్షరము. 'అచ్చు-హల్లుల' కలయికగా ఉంటుంది. కొన్ని చైనా అక్షరాలనుకూడ వాడుతాము.

స్వామి:- ఈ అక్షర విధానము, ఇతర చారిత్రక ఆధారాలు చూస్తే భారతదేశము, జపాను, సయాము, కంబోడియా మొదలైన దేశాలలో ఒకేమతము ఒకప్పుడు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చైనా అక్షరవిధానాన్ని వదలి సంస్కృత అక్షరవిధానము ఎందుకు మీ దేశములో పాటింపబడినది?

నాకమూర:- చైనా విధానము కూడ జపానుభాషకు ఉపకరించింది. కాని సంస్కృతవిధానము సులభము. సంస్కృత భాషాజ్ఞానము ఏ కొద్దిమంది బౌద్ధభిక్షువులకు మాత్రమో వుండేది. కాని ప్రస్తుతము వాడుకలోవున్న అక్షరసమామ్నాయము జపానీయుల సృష్టి అనియే చెప్పాలి.

స్వామి:- ఎన్నిచోట్ల హైందవ దార్శనికశాస్త్ర పఠనకు ఏర్పాట్లు వున్నాయి.

నాకమూర:- జాతీయ విశ్వవిద్యాలయాలు పది. ఇరువది చోట్ల ఈ ఏర్పాట్లు వున్నాయి.

స్వామి:- బౌద్ధమతానికి ఎన్నిచోట్ల ఏర్పాట్లువున్నాయి?

నాకమూర:- బౌద్ధమునకు అవకాశములు ఎక్కువ.

స్వామి:- బౌద్ధమతమును ఏ భాషలో నేర్పతూవున్నారు?

నాకమూర:- బౌద్ధమత గ్రంథములు చదువుటకు కొంత సంస్కృతభాషా పరిచయము కావాలి. కారణం- కొన్ని ముఖ్యగ్రంథాలు సంస్కృతమునందుడుట. కాని శిక్షణ జపానీభాషలోనే జరుగుతుంది.

స్వామి:- జపానులో ఎక్కడనైనా శివలింగము కనబడినదా?

నాకమూర:- లేదు. శివలింగాలుకాని, విష్ణువిగ్రహాలుకాని కనిపించవు. గణపతి, సరస్వతి, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలవిగ్రహములు కనబడతాయి.మొసలిరూపములోవున్న శిల్పములుకూడవున్నాయి. మొసలి గంగకు వాహనమని అచ్చటివారి విశ్వాసము.గణపతి, ఇంద్రుడు, సరస్వతి, వరణుడు వీరిని జపానీభాషలో వరుసగా ఆర్యదేవ,శుక్రదేవ, వాగ్దేవతా, జలదేవత అని వ్యవహరిస్తారు.

స్వాములవారు:- (మొదట చర్చిస్తువున్న విషయము అందుకొని) జ్ఞానమువేరు ఉపాసనవేరు. ఉపాసనలో మానసికకర్మ ఉన్నది. కాని జ్ఞానము మానసిక భూమికకు చేరినదైనప్పటికి అందులో కర్మలేదు. ఒక విధిని అనుసరించి చేయబడినదే కర్మ. జ్ఞానోదయముతో మనస్సు దానిలోనే నిలిచిపోయి ఏ విధినీ అనుసరించదు. ఆ విధి బాహ్యమైనను సరే! ఇంద్రియ ప్రేరణవలన ఏర్పడిన దైనను సరే! ఒక చిన్న ఉదాహరణతో కర్మతత్త్వము చెప్పవచ్చును. ఇక్కడ పచ్చని అరటిపండ్లు ఉన్నాయి. నేను 'ఈ పండ్లు పచ్చన' అని అంటే మీరు అంగీకరించి ఊరకొంటారు. అది నేను 'ఎఱ్ఱగా ఉన్నవనియో నల్లగా వున్నవనియో అంటే' తత్‌క్షణమే 'కాదు! అవి పచ్చగా ఉన్నాయి' అని అంటారు. కాని నేను 'ఈ పండ్లు ఎఱ్ఱగా ఉన్నాయి అని అనుకొనండి' అని అంటే మరల మీరు ఊరకొంటారు. దీనికి కారణము ఆ విధిమీకు అర్ధం అవుతూ ఉండుట. అందుచేత కర్మ ఏదైనా విధిని అనుసరించి ఉంటుంది. ఈ విధముగా ఉపాసన మానసిక కర్మయే అవుతుంది. మొదట భగవంతుడు ఈ విధముగా ఉంటాడని, ఆ విధముగా ఉంటాడని ఊహించుకొని జ్ఞానోదయ మైనంతనే యథాతథముగా అర్ధము చేసుకొంటారు. అటుపిమ్మట ''ఈ మూర్తిని ఉపాసించు, ఆ మూర్తిని ఉపాసించు'' అనే విధులను పాటింపక పోవచ్చును.

తరువాత ప్రొఫెసర్లు ఇద్దరు స్వాములవారికి తమ ధన్యవాదములను అర్పించి సెలవు తీసుకొన్నారు.

Maa Swami    Chapters