Maa Swami    Chapters   

12. నా సంచలనానికి కారణం

హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగార్‌

కొన్ని ఏళ్ళక్రితం నేను నా స్నేహితుణ్ణి చూడటానికి ఢిల్లీ వెళ్ళాను. అతడు పెద్ద

ఉద్యోగి. మాటవరసలో అతనిభార్యను గూర్చి నేనడిగాను. ఆమెనుగూర్చి నాకు ఎక్కువ తెలియదు. ఏదో మర్యాదకోసం అడిగాను. అంతే. ఆమె శ్రీమంతుల కుటుంబంలో నుంచే వచ్చినదనీ, ఆమె తండ్రి పేరెక్కిన బ్యారిష్టరనీ, భోగభాగ్యాలమధ్య పెరిగినదనీ, మేనరికంలో నా స్నేహితుణ్ణి పెళ్ళాడినదనీ నాకు తెలుసు.

ఆ రోజులలో బ్రిటిష్‌వారి పాలనా ప్రభావం ఎక్కువగా వుండేది. నా స్నేహితుడు ఐ.పి.యస్‌. అతడు మద్రాసులోనూ, ఆక్స్‌ఫర్డ్‌లోనూ చదువుకొన్నాడు. ఆమె విదేశ పర్యటనల వలనా, పెద్దవాళ్ళ గోష్టిలో మెలగటంవలనా చాల నాజూకుగానూ, నాగరికతతోనూ వుండేది. వారి పిల్లలు అందంగానూ, చురుకుదనంతోనూ వుండేవారు. వాళ్ళు ఢిల్లీలోనే కాదు, దేశంలోనే చాల అదృష్టవంతమైన కుటుంబంగా పరిగణింపబడేవారు. వాళ్ళకు అన్నీ వున్నాయి; అందమూ, చదువూ, హోదా, పలుకుబడీ, శీలమూ, ధనమూ, సంతతీ. వేరే ఇంకేమికావాలి?

నా స్నేహితుడు తన భార్య ఋషీకేశానికి, ఒక ఆశ్రమంలో కొన్నిరోజులు వుండాలని వెళ్ళిందని చెప్పగా నాకు ఆశ్చర్యంవేసింది. ఆమెను నేను ఒక నిరాడంబరమయిన ఆశ్రమంలో వుండటం ఊహించుకోలేకపోయాను. నేనేమి బదులు చెప్పలేదు. మర్యాదగా వుండదు కనుక.

నేను హఠాత్తుగా ఋషీకేశం వెళ్ళాల్సిన ప్రమేయం ఏర్పడ్డది. నా స్నేహితుని భార్యవున్న ఆశ్రమం దాపులోనే వున్నది. ఆమె ఆ ఆశ్రమంలో ఎలా వుందో చూద్దామని ఒక కౌతుకం కలిగింది. ఆ ఆశ్రమం స్వామినీ చుద్దామని అనిపించింది. నాకు ఆధ్యాత్మికంగా అంత ఆసక్తి లేదు. నేను అదివరకు ఏ స్వాములవారిని దర్శించినదీ లేదు. నాకు స్వాములంటే ప్రత్యేకమైన గౌరవమూ సాధారణంగా లేదు.

మేము పోయినపుడు ఆశ్రమంలో ప్రార్ధనా సమయం. ఆమెను అక్కడ చూచినపుడు నేను గుర్తుపట్టలేకపోయాను. ఆభరణాలు, విలువగల చీర ఏమీలేవు. సాధారణమైన చీర ధరించి వుంది. నిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నమై కూర్చునివుంది. ప్రార్దనానంతరం మమ్ములను చూచింది. చిరు నవ్వు నవ్వి మమ్ములను స్వామికి పరిచయం చేస్తానని చెప్పింది.

ఆ ఆశ్రమంలోని స్వామితో పరిచయం చేసింది. ఆయన స్నేహంగానూ, మర్యాదతోనూ మాతో మాట్లాడినారు. కానీ ఆయనలో నాకు ఆధ్యాత్మికతకానీ, దైవానుగ్రహంకానీ ఎంత ప్రయత్నించినా కనపడలేదు. ఆయన ఎన్నో పుస్తకాలుకూడ చదవమని ఇచ్చాడు. నేను శ్రమపడి చదివానుకూడా. కానీ ఆ పుస్తకాలు నాలో ఏ విధమైన సంచలనమూ కలిగించలేకపోయాయి. ఇందులో బహుశా ఆ స్వామి దోషమేమీలేదు. దోషణ నాలోనే వుండి వుండాలి. దాని తర్వాత నేను ఒకరిద్దరు స్వాములను చూచాను. కాని నాలో ఏ విధమైన పరివర్తన కలగలేదు.

ఇట్లుంటే ఒకరోజు నాకు ఒక టెలిఫోను వార్త అందినది. కామకోటి శంకరాచార్యులు తన్ను చూడటానికి నన్ను రమ్మన్నారని. నాకు చాల ఆశ్చర్యం వేసింది. నేను ఆయనను గూర్చి చాల విన్నాను. కాని వారిని కలుసుకోడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించినదిలేదు. స్వాములు అంటేనే నాకు బిడియమూ, సంకోచమూ. చాలమంది శ్రమపడి ఆయన దర్శనంచేస్తుంటే, నన్ను వారే పిలుస్తున్నారు మరి!

స్వాములవారి సందేశం అందినపుడు నేను మద్రాసు విడిచి పనిమీద వెళ్ళుతున్నాను. రెండవమారు పిలుపు వచ్చినపుడు నాకు దేహంలో అస్వస్థతగా వుండినది. మూడోమారు పిలుపు వచ్చినపుడు అదృష్టవశాత్తు నాకు ఏ విధమైన ఆటంకమూ లేదు. వారిని వెళ్ళి చూడటానికి తీర్మానించాను. ఇంతకూ వారు నన్నెందుకు రమ్మంటున్నారు?

నన్ను చూడగానే వారు; 'నీవు నీతల్లిపై వ్రాసిన వ్యాసం చూచాను. దానిని చదవగానే నిన్ను చూడాలనిపించింది' అని అన్నారు.

ఆ మాటలతో తెరతీసినట్లైంది. నేను చాల సంవత్సరాలు పెద్ద ఉద్యోగాలు చేశాను. ఎన్నో వ్యాసాలు వ్రాసాను. ఉపన్యాసాలు ఇచ్చాను. ఇవేమీ శంకరాచార్యులవారికి కాబట్టలేదు. నేను ఏదో ఒక సంచికకు మా అమ్మనుగూర్చి వ్రాస్తూ ఆమె గుణగణాలు ఏకరువు పెట్టగా దానిని చదివి, నన్ను చూడాలని వారికి అనిపించటం నాకు ఆశ్చర్యంవేసింది.

నేను మా అమ్మను గూర్చి వ్రాసిన ఆ గుణాలేవి? అదృశ్యమైన ఒక దైవశక్తిపై అచంచలవిశ్వాసం. ఆ విశ్వాసం ఎటువంటిదంటే, ఎంతకష్టం వచ్చినా ఎదుర్కోగల ధైర్యం, ఆత్మశక్తీ, భూతదయ, భావశుద్ధికల ధర్మాచరణం. చిన్నతనంలో శ్రీమంతుల పుత్రిక అయినా, అత్తగారి ఇంట్లో దారిద్ర్యం, కష్టాలు ఎలావున్నా మనస్సు చెదరిపోని ఆత్మవిశ్వాసంకల మా అమ్మనుగూర్చి ఆనందవికటన్‌ అనే తమిళ దీపావళి సంచికలో నేను వ్రాసినది స్వాములవారిని అంతగా ఆకర్షించింది.

నేను స్వాములవారితో చెప్పాను. నాకు మత విషయంగా ఎక్కువ జ్ఞానంకానీ, ఆసక్తికానీ లేదని. గుళ్ళకుపోయే అలవాటుకానీ, ఇంట్లో కర్మానుష్ఠానంచేసే వాడుకకానీ నాకులేదని ఆయనతో చెప్పాను. కానీ వారు దీనిని ఏదీ లెక్కపెట్టలేదు. నా వ్యాసం చూచిన పిదప నాకు హిందూమతంలో ఉండవలసిన విశ్వాసం వున్నదని ఆయనకు అనిపించిందట. సమాజంలో ఉన్నతపదవులలో వున్నందువలన నాబోటి వారు హిందూ మతప్రచారానికి పాటుపడవలెననీ, యువతరంవారికి ఉదాహరణగానూ, ఉత్సహకరంగానూ వుండవలసిన విధి ఎంతైనా వుందనీ వారు నాతో అన్నారు. ఇట్టి ప్రచారణా ప్రణాళికలలో ముఖ్యంగా వుండవలసినది సహనము, దయ- అని వారన్నారు.

చిక్కిశల్యంగా వున్న ఆ మూర్తిని చూడగానే నాలో ఏదో తెలియని సంచలనం కలిగింది. ఆ సంచలనానికి కారణం వారి మాటలుకానీ, వ్యక్తిత్వంకానీ కాదు కారణం. వారి పరిసరాలుకూడ కాదు. కాని వారిని చూడగానే దైవానుగ్రహం వారిలో మూర్తీభవించి వుండినట్లు అనిపించింది. ఆయన ముందు నిశ్శబ్దంగా, మౌనంగా కూచొనవలెననిపించింది.

వారు చెప్పిన విధంగా హిందూమత ప్రచారానికి నేను కానీ, నా స్నేహితులుకానీ ఏ విధంగాను పూనుకోకపోవటం వేరే విషయం. అది వారి తప్పుకాదు!

Maa Swami    Chapters