Maa Swami    Chapters   

9. స్వామి పూజావిధానం

శ్రీ జమ్మలమడక మాధవరాయశర్మ

ఇదేమిటో లోకానికి అందించాలని ఇది వ్రాస్తున్నాను. శ్రీకామకోటి వైభవాన్ని నేను

వర్ణించగలనా? నేను ప్రస్తుతం గుర్తించినంతమాత్రం వర్ణిస్తాను. చాలాకాలంనుంచీ ఈ విధంగానే పూజ జరుగుతున్నది. అయినా ఈనాటిది నవీనము. రేపటిది ఇంకా నవీనము. ఇంకా జరిగేదంతా నిత్య నవీనము. అందరూ ఈ వైభవం దర్శింపగలరు. నాకన్న వివేకులు ఇంకా దర్శింపగలరు. వారూ ఈ విధంగానే గుర్తించి వ్రాస్తే అవన్నీ ఒకచోట చేర్చి సంభావించు కోవచ్చు.

గుంటూరు విజయంచేసిన మహాస్వామిపాదులు నియంతగా సర్వకాలములలో పూజచేస్తున్నారు. శ్రీచంద్రమౌళీశ్వర పూజలు చేస్తున్నారు. వారు మహామహస్సును పూజిస్తున్నారు. ఇదంతా మహా భాగ్యం. ఈ మహాభాగ్యం మనకు ప్రత్యక్షమౌతున్నది. పాదపూజ్యులైన మహాస్వామి పూజ్యపాదులు, మహాపూజ నిర్వర్తిస్తూవుంటే, చూస్తూ భావిస్తూ ఉన్న మన మహాభాగ్యమును ఏమని వర్ణించాలి? ఇదంతా మన 'అహోభాగ్యం!'

పూజాసమయానికి కొన్ని వేలమంది స్త్రీలు, పురుషులు వచ్చారు. వచ్చిన వారందరికీ తగిన చల్లని పందిళ్ళు నిర్వహణవీరులు చక్కగా వేయించారు. ఈ పందిళ్ళలోకి జనం ఏకభావంతో వచ్చారు. సువాసినీదేవతలంతా కామాక్షీదేవతలవలె ఆసీనులయ్యారు. కొందరు లలితాపారాయణం చేస్తున్నారు. కొందరు విష్ణుసహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఇంకాకొందరు కామాక్షీస్తుతి శ్లోకాలను పఠిస్తున్నారు. చాలమంది శ్రోత్రియులు వేదవిదులు. శాస్త్ర హృదయులు, మంత్రచింతకులు, యెగాసక్తులు, బహుశ్రుతులు అనేకులున్నారు. చిరకాలం క్రిందటి ఆశ్రమాలలోని వైభవం గుర్తుకు వచ్చి తీరాలి.

వీరంతా ఏ ఆశలతో వచ్చారు? ఏమయినా ఆశ##పెట్టితే ఇంతమంది వచ్చి ఈవిధంగా ఉంటారా? వీరంతా ఒక్క ఆశతో వచ్చారు. అది ఆత్మాశ. వీరి అందరి ఆత్మను, మహాస్వామి మహర్షిగా చూపిస్తున్నారు. కామాక్షీవల్లభత్మకమయిన ఆత్మనిదర్శనానికై వచ్చారు. వచ్చినేర్చిన వేదవచనాలను పల్కుతున్నారు. తాము చిరకాలంగా చేసిన వేదాధ్యయనానికి మంచిసమయ వినియోగం సంపాదించుకొన్నారు. శాస్త్రవిదులు శాస్త్రలక్ష్యమును భావిస్తున్నారు. యోగులు యోగ గమ్యమును గుర్తిస్తున్నారు. కొందరు మౌనంగా, అవకానంగా మూకపంచశతి పారాయణ చేస్తున్నారు. ఆమూల కొందరు రామాయణ పారాయణ పరాయణులై ఉన్నారు. కొందరు చండీసప్తశతి మంత్రచింతనంతో ఉన్నారు. కొందరు దేవీమంత్రచింతన చైతన్యం అందుకొంటున్నారు. వీరందరికీ తగిన స్థానం లభిస్తుంది. లభిస్తుందేమిటి? లభించింది. చాలమంది ధనవంతులు, ఉద్యోగులు, అధికారులు సభకు వచ్చారు. వచ్చినవారందరూ ఈ వేదపండితులకు, శాస్త్రజీవనులకు అగ్రస్థానం ఇచ్చి తాము దూరంగా ఉండి ఆనందం అనుభవిస్తున్నారు. తమ జీవిత చర్యలలో ఇటువంటి మంచిపని చేయగలిగినామని సంతోషిస్తున్నారు. ఇంతటి విశేషం. ఎట్లాకలిగింది. మహాస్వామి సంకల్పాన కలిగింది.

కామాక్షీదేవి మందిరంలో దీపకాంతులు గోచరిస్తున్నవి. తెర తొలగింది. దీపజ్వాలలు జాజ్వల్య మానంగా ఉన్నవి. విద్యుద్దీపాలు పెట్టితే ఇలాంటి భావపవిత్రత కలుగుతుందా? దేవీమందిరంలో చీకటిలేదు. శ్రీచక్రం ఉన్నది. పూర్ణకలశం ఉన్నది. స్వామిశిష్యులు శివపరివారంలోని ప్రమధుల వలె పూజపరికరములు నన్నిటిని యథాక్రమంగా సమకూరుస్తున్నారు. సభలో కన్యలు గీతాగానం చేస్తున్నారు. 'కామకోటి పీఠాధివాసిని! కామకళాత్మికే! కామాక్షి!' అంటున్నారు. ఆ గీతాలు దేవి విన్నది. ఒక చిరునవ్వు తెల్లగా నవ్వింది.

వేదిక దగ్గర ఉన్న బుట్టలలో తట్టలలో భక్తులందరూ పుష్పాలను, ఫలాలనూ ఉంచారు- గోక్షీరములు తెచ్చి అర్పించారు. మహాస్వామి ఆ గోక్షీరంతో సమంత్రకంగా అభిషేకం చేస్తూ వున్నారు. ప్రతిదినమూ మూడుకడపలపాలైనా ఉండాలి. అని భక్తులకు తెలిసింది. మహాస్వామి పూజకై వస్తున్నారని అచేతనమయిన ఘంట సచేతనంగా మ్రోగింది. యతులుకొందరు అనుసేవనంచేస్తూ దేవిసన్నిధిలో సంచరించారు. మంత్రదీక్షితులైన పరిచారకులు సమంత్రకంగా పరిచర్యలు చేస్తూ పరికరాలను ఉంచవలసినచోట ఉంచుతున్నారు. ఈ సమయంలో కొందరు ద్రవిడదేశవనితలు, ఎక్కడ నుంచి వచ్చారో, కామాక్షీదేవతలవలె వచ్చారు. ఆరూపంతో కామాక్షి వచ్చిందని కొందరయినా అనుకొని ఉండాలి.

బ్రహ్మాండమంతా శ్రీచక్రాకృతి. మన హృదయమే శ్రీచక్రం. సర్వమూ శ్రీచక్రస్వభావము. ఈ విషయాన్ని కొందరు కొందరే గుర్తిస్తారు. భగవత్పాదులు కామకోటి సన్నివేశస్థలాన్నికూడా శ్రీచక్రాకృతిగా గుర్తించారు. నేనొకసారి శ్రీశైలం వెళ్ళి ఒక స్థలంలో కూర్చుని పారాయణ చేస్తూ అటుగా చూచాను. శ్రీశైలం శిఖరాగ్రాన గాయత్రీతేజోబ్రహ్మ సూర్యభగవానుడు కనిపించగా శ్రీచక్రబిందు పీఠశివభావం భాసించింది. 'శ్రీశైల శిఖరం దృష్ట్వా' అని అనుకొన్నాను.

శంకరభగవత్పాదుల బిందుపీఠవాసిని శ్రీకామాక్షి దేవిని కంచికామకోటిస్థలంలో గుర్తించి గుర్తింపజేశారు. శివుడు ఉగ్రరూపుడు, శాంతరూపుడున్నూ. అదే విధంగా శ్రీకామాక్షికూడా. ఆ దేవీ ఉగ్రరూపమును, శాంతాత్మకంగా శంకరులు మనకందించారు. మహాస్వామి ఆదేవిని అర్చిస్తున్నారు. ఆ ప్రక్కనే మహాకామకామేశ్వరుడైన శ్రీ చంద్రమౌళీశ్వరుడుకూడా యోగలింగ రూపంగా ఉన్నాడు. సభలో ఉన్న వేదవిదులదృష్టి అటు ప్రసరించింది. విద్యారణ్య భాస్కరులూ, అద్వైత సిద్ధిదర్శనులూ వచ్చారు. వేదానువచనం జరుగుతూ వుంది. పూజాసంభారాలు తెచ్చియిస్తున్నారు. దీక్షిత పరిచారకులు అన్నీ సావధానంగా అందిస్తున్నారు. పూజాపీఠం వద్ద సూచనాత్మకంగా దీక్షిత పరిచారకులు అన్నీ సావధానంగా అందిస్తున్నారు. పూజాపీఠం వద్ద సూచనాత్మకంగా ఘంటానాదం వినవచ్చింది. ఆనాదాను నాదములు ప్రసరించినవి. అల్లంత దూరమున సన్నాయి రాగాలాపనం వినబడుతున్నది. అనుగుణమైన వాద్యం, శంఖధ్వని, ఘంటానాదం. సభలో ఎవరూ మాట్లాడటం లేదు. ఈనాదంలో నాదాంతం అందుకొంటున్నారు. ఒక ద్రావిడ కామాక్షి వేదిక దగ్గర పుష్పమాలికనుంచింది. స్వామి పీఠసన్నిథానంలో పూజాభాజనం కూర్చారు. కొందరు లలితా పారాయణం చేస్తున్నారు. ఆంధ్రకామాక్షులు నిమీలితనేత్రలై కామాక్షిని దర్శిస్తున్నారు.

భిక్షావందనం చేయదలచుకొన్నవారు, తమ పరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చారు. శ్రీచరణులు వచ్చారు. ఒక ప్రక్కగా కూర్చున్నారు. భిక్షావందనం చేస్తే 'నారాయణ' అన్నారు. జనుల ఆనందం కోలాహలంగా వుంది. జనులు స్వామిప్రభావం కీర్తించుకొంటూ ఉన్నారు. మహాగజం వచ్చింది. నియతంగా ఫలాలను అందించారు. పిల్లలు, ఆ ఫలాలను ఆస్వాదించడమును సంతోషముగా చూచారు.

శ్రీచరణులు పూజ ఆరంభించారు. ప్రాణాయామం చేస్తున్న ఆమూర్తిని చూడాలి. అది సగర్భ ప్రాణాయామరీతి. చూపరులకు కనిపించే దేహాన్ని అమృతీకరించేరీతి, కుండలినీ చాలనం చేసేరీతి, దేహమంతా దేవతాత్మకం చేశారు. గోరు తగలకుండా ముక్కు విరగకుండా జాగ్రత్తగా సిద్ధపరచిన అక్షతలతో న్యాసం చేశారు. దండవిన్యాసంతో ఏమో ఏమో చేశారు. అది మహాస్వామి ప్రక్రియ. నిత్య సన్నిహిత యతులకు తెలుస్తుంది. అక్షతలతో అక్షర న్యాసంచేసి మాతృకాభావనంచేసి, అంతర్ముఖ సమారాధ్య అయిన శ్రీకామాక్షిని సాక్షాత్కరింప చేసుకొన్నారు. వారి రూపంగా మనకున్నూ ఆదేవి గోచరించింది.

శ్రీదృష్టి ప్రసరంతో శ్రీవారు అనిమేషులై భావిస్తున్నారు. పూర్ణకుంభార్చనం చేశారు. అన్ని కళలూ ఆవహింపచేశారు. అదిగో! అక్కడ దక్షిణావర్తశంఖం ఉంది. సమయనియతంగా పాత్రాసాదన చేశారు. అంతటా సంప్రోక్షణం చేశారు. విశ్వమే ఆపావితమైంది. విఘ్నాపసారణం చేశారు. పీఠదేవతలను అర్చించారు. పరివార దేవతలను అర్చించారు.

ఇక కామాక్షిని ఆరాధించాలి. అదిగో! ప్రాణాయామం చేస్తున్నారు. చిత్కళను ఆవేశింపచేశారు. ప్రతిష్ఠామంత్రాలు పఠించి వుంటారు. అమృతీకరణానికి, సకలీకరణానికీ తగినట్లుగా సర్వతీర్ధావాహనం చేశారుకూడా. సూర్యమండలంనుంచి సర్వతీర్ధములను మంత్రబలంతో అంకుశముద్రతో ఆకర్షించి, సంపాదించారుకదా! చంద్రమౌళీశ్వరుని అభిషేకం చేస్తున్నారు. అందరు తెచ్చిన గోక్షీరాలకు వినియోగం వచ్చింది.

అవనికాభ్యంతరములో మహాభిషేకం జరుగుతున్నది. సభలో రుద్రానువాకాలు పఠిస్తున్నారు. వయోధారలతో అభిషేకం చేస్తున్నారు. సువర్ణపాత్రలో గోక్షీరంవుంచి ధారాభిషేకం చేస్తున్నారు. శ్రీచక్రంపై చందనాభాషేకం చేస్తారు. అవనికలో ఇంకా ఇంకా ఆచారనియతములైన అభిషేకాలు చేస్తారు. అభ్యంతరములో శివార్చన జరుగుతున్నది. ఇటుగా భగవత్పాద పాదుకార్చన జరుగుతున్నది. అభిషేకం అయినది. 'అభిషేక ప్రియః శివః' అందరకూ కనబడేటట్లు ఇపుడు పూజచేస్తున్నారు.

అభిషేకం చేసేటపుడు పూజచేసేటపుడు శ్రీవారిని చూడాలి. చూడకలిగి చూడాలి. ఉగ్రశాంత రూప పూజ చేశారు. పుష్పవిశేషాలతో పూజచేస్తున్నారు. శ్రీవారు తమ హృదయ కుసుమాలతో పూజిస్తున్నారు. పరాను సంధానంచేస్తూ. వశ్యంతీనాదం అందుకొంటూ, మధ్యమాను సంధానంతో అర్చిస్తున్నారు. సంపూర్ణ వామభావంతో అర్చిస్తున్నారు. జపాకుసుమంచేత పట్టి తెల్లని పుష్పాలూ తెల్లనిపుష్పాలా పట్టి రక్తశుక్ల ప్రభామిశ్రమైన ప్రకాశ విమర్శాత్మక మయిన దేవీదేవులను ఆరాధించారు. అవనిక వేశారు.

ఇక నైవేద్యం సర్వఫలనివేదనం చేశారు. సాంప్రదాయకంగా సిద్ధపరచిన సమయాచార దక్షిణాచార సమ్మత పదార్ధములను నివేదించారు. ఇంత ఏమిటి. అమృతనైవేద్యం అర్పించారు. సాంప్రదాయిక ముద్రాప్రదర్శనం చేశారు. సర్వహృదయార్పణం చేశారు. ఈ నైవేద్య సమయంలో నానావాద్యాలూ మ్రోగుతున్నవి. కామాక్షి ఆరగిస్తున్నది. చంద్రమౌళీశ్వరుడు ఆస్వాదిస్తున్నాడు. అందరూ సావధానంగా ఉన్నారు. పందిరిపై ఎండవుంది. కానీ చల్లగాలి వీచింది.

దేవీదేవుల ఆరగింపు సమయంలో దేవతలంతా వీచోపులు వేస్తున్నారు. నివేదనాస్వాదపర్యతం యవనికి ఉంటుంది. అదిగో యవనిక తొలగింది. దీపజ్వాలలు కనిపిస్తున్నవి. మహాదీపం మళ్ళీదీపం ఘంటావాదనంతో స్వామి నవధాదీపం చూపారు. దీప దీపమునకూ దీపం చూపారు. అదేమి? దివ్యగంధం ప్రసరిస్తున్నది. అదే కామాక్షీపూజా పరమార్ధం.

స్వామి ప్రసన్నదృష్ఠితో చూచి అనుగ్రహించారు. ఈ సమయంలో సానుగ్రహదృష్టికై సాధకులు యత్నించండి. ఛత్రం చామరం అన్నీ సమర్పించారు. విద్యాగోష్టీ నివేదనం చేశారు. సర్వార్పణం చేశారు. శాంత్యుదకం సంప్రోక్షించారు. ఆ ఉదకం మన అందరిపై ప్రసరించినట్లే. ఇదే సామయికార్చనం. దండం చే ధరించి స్వామిపాదులు ప్రదక్షిణం చేశారు. ఇటు చూచారు. ఆ చూపు మనకు రక్ష-

ఆ త్మ భి క్ష.

Maa Swami    Chapters