Maa Swami    Chapters   

8. హిందీ భాగవతము

స్వాములవారు కడపలో ఉన్నపుడు, చాలకాలంనుండి శ్రీవారిని దర్శించవలెనని కుతూహలంతో ఉన్న వారణాసి రామమూర్తిగారు, మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులతో కూడా శ్రీవారిని దర్శించారు. శ్రీ వారణాసి రామమూర్తిగారు (రేణు) హైదరాబాదు రేడియో కేంద్రములో హిందీ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.

శ్రీ స్వాములవారు:- మీరు హిందీలో చేస్తున్న ప్రోగ్రాములు తెనుగు దేశమునకు మాత్రమేనా?

శ్రీరామమూర్తి:- లేదు. ఉత్తర హిందూస్థానానికీ అవి ప్రసరింపబడుతవి. ఉత్తరదేశపువారికి దాక్షిణాత్య సంస్కృతిని పరిచయం చేయటంలో ఈశాఖ ఎంతో ఉపయోగపడుతున్నది.

శ్రీవారు:- ఔత్తరాహులకూ, దాక్షిణాత్యులకూ, సమరసం కల్పించటంలో ఇవి తోడ్పడటం సంతోషకరమైన విషయం. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు?

శ్రీపుట్టపర్తి:- రామమూర్తిగారు ప్రస్తుతం పోతనగాని భాగవతం హిందీలోనికి పద్యకావ్యంగా అనువదిస్తున్నారు. ఉత్తర హిందూస్థానంలో బాగా పరిచయమున్న దాక్షిణాత్య హిందీ కవులలో రామమూర్తిగారు అగ్రగణ్యులు.

శ్రీవారు:- చాల సంతోషము. పోతనగారి భాగవతము కేవలం మూలానుసారియేనా?

శ్రీపుట్టపర్తి:- లేదు. కొంత స్వకపోల కల్పితంకూడ ఉన్నది. ముఖ్యంగా దశమస్కంధములో పోతనగారి స్వీయరచన లెక్కువ. గోపికా గీతములు, రాసక్రీడ వర్ణన- ఒకటేమిటి, భక్తిప్రసంగం వచ్చినపుడంతా పోతన స్వతంత్రముగా వ్రాసేవారు.

శ్రీవారు:- రామమూర్తిగారూ- మీరు ఇపుడు ఏ భాగవతమును పరివర్తిస్తున్నారు?

రామమూర్తిగారు:- ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు వామనచరిత్ర, గజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర, అంబరీషోపాఖ్యానముల పరివర్తనము ప్రచురించారు.

శ్రీవారు:- తెలుగు భాగవతమునకూ, వ్యాసులవారి రచనకూ కథావర్ణనలో ఏమైనా భేదములున్నవా? ఏకాదశ స్కంధములో బలరాముని తీర్థయాత్ర మొదలైనవి యథాతథంగా పరివర్తింపబడ్డవా?

శ్రీ పుట్టపర్తి:- లేదు. పోతనగారి భాగవతం ఖిలమైపోయింది. ఒకరాజు దానిని భూస్థాపితం చేశాడనీ, తరువాత ఖిలభాగమును ఇతరులు పూరించారనీ ప్రతీతి. వారు పోతనవంటి సమర్ధులుకారు.

శ్రీవారు:- ఔను. ఆ కథ తెలిసే అడుగుతున్నా.

శ్రీరామమూర్తి:- పోతన ఋషి. ద్రష్ట. భాగవత రచనారంభంలోనే ఈ విషయాన్ని ఈ క్రింది పద్యంలో ఆయన ధ్వనింప చేశారు.

''భాగవతము తెలిసి పలుకుట కష్టంబు,

శూలికైన తమ్మి చూలికైన

విబుధజనుల వలన విన్నంత కన్నంత

తెలియ వచ్చినంత తేటబరతు.''

ఇందులో 'కన్నంత' అన్న శబ్దప్రయోగం, వారికి భగవల్లీలాదర్శనం కల్గిందనటానికి సూచన. ఇందుకు ప్రబలమైన తార్కాణాలు వామనచరిత్రలోని విశ్వరూప వర్ణనలోనూ, గజేంద్రమోక్షంలోని, 'అలవైకుంఠ పురంబులో' అన్న పదంలోనూ కనబడుతుంది.

శ్రీవారు:- గజేంద్రమోక్షణ ఘట్టం చదవండి.

రామమూర్తిగారు:- రామమూర్తిగారు చదువసాగారు. 'తనవెంటన్‌ సిరి లచ్చి వెంట' అనే పద్యానువాదం విని శ్రీవారు ఇట్లా అన్నారు.

శ్రీవారు:- బాగు బాగు, ఇదేరీతి, ఒక ఆభాణకం సంస్కృతంలో ఉన్నది. కవిపేరు జ్ఞాపకం లేదు. అందుచేత కాలము తెలియదు. ఈఆభాణకం పోతనగారి కాలమునకు ముందైనచో, ఆయన చూచియే వుండవలె.

శ్రీ పుట్టపర్తి:- ఆ ఆభాణకము గూర్చి నేను వినలేదు. దయచేసి చెప్పండి.

ఈ ప్రశ్నతో శ్రీవారు రెండునిముషములు ఆగి ఇట్లా అన్నారు.

''లీలాలోలతమాం రమా మగణయన్‌

నీలా మనాలోకయన్‌

ముంచన్‌ కించ మహీం, అహీశ్వరమయం

మంచం హఠాద్వంచయన్‌,

ఆకరన్‌ ద్విజరాజమప్యతి జవాత్‌

హా హంత సంరక్షితుం

శ్రీగోవింద ఉదిత్వర త్వర ఉదైత్‌

గ్రాహ గ్రాహార్తం గజం.''

శ్రీ పుట్టపర్తి:- బాగున్నది. కవి భూనీళాదేవులను కూడ చేర్చుకొన్నాడు. కాని 'అభ్రగపతిం బన్నింపడని' పోతన మరొక్క అడుగు ముందుకు వేసినాడు.

శ్రీవారు:- మరొక్క ఘట్టం చదవండి.

శ్రీరామమూర్తి గారు వామనకథలో విశ్వరూపఘట్టం చదువసాగినారు. శ్రీవారు శ్రద్ధగా ఆలకిస్తూ ఒకచోట అసురశబ్దం విని-

శ్రీవారు:- అసురు లనగా నేమి?

రామమూర్తి:- రాక్షసులకు పర్యాయంగా వాడబడిన పదం.

శ్రీవారు:- అది సరి. సామాన్యంగా సాహిత్యంలో అందరూ అట్లాగే వాడుతారు. రాక్షసులు అనగా పులస్త్య వంశజులు. రావణకుంభకర్ణాదులు. వారికి భూమి నివాసస్థానం. అసురులు దితి సంతానం. వారలకు పాతాళం నివాసం. బలిచక్రవర్తి అసురుడు. దేవతలు స్వర్గవాసులు.

శ్రీ పుటపర్తి:- అవునవును, అందుకే రావణుడు పాతాళవాసులపైకి కూడ దండెత్తి వెళ్ళినాడు. శ్రీరామమూర్తిగారు ఈ నడుమ త్యాగరాజును గూర్చి ఒకరూపకం తయారుచేశారు. మొన్న హైదరాబాదు వెళ్ళినపుడు విన్నాను. బాగా ఉన్నది.

శ్రీవారు:- మీరు ఎన్ని రూపకములు తయారుచేశారు?

శ్రీరామమూర్తిగారు:- దక్షిణదేశము నందలి పుణ్యక్షేత్రములను గూర్చి ఎన్నో రూపకములు హిందీలో తయారుచేసినాను. అహోబిలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం మొదలైన వానిని గూర్చి- అట్లే త్యాగరాజు, రామదాసు, నారాయణతీర్ధుల లీలాతరంగిణి వ్యాఖ్యాత చక్రవర్తి మల్లినాథ సూరి, పూర్ణకుంభం మొదలైన విషయాలపై కూడ రూపకములు తయారుచేశాను. త్యాగరాజుపై వ్రాసిన రూపకమునకు నాదయోగి అని పేరు పెట్టాను.

శ్రీవారు:- పేరు చాల బాగుగా ఉన్నది. నిజముగా వారు నాదయోగులే.

శ్రీవారు రెండు మూడు త్యాగరాజకృతులను పాడుట కారంభించారు. ఆ గానము సంప్రదాయ బద్ధమై, కర్ణాటక సంగీతములో వారికిగల అభినివేశము వెల్లడించింది.

శ్రీ పుట్టపర్తి:- శ్రీవారికి- సంగీతాభ్యాసం ఉన్నట్లున్నది.

శ్రీవారు:- లేదు. నాది వినికిడి సంగీతం. పూర్వాశ్రమంలో మా తండ్రిగారు శాస్త్రీయంగా సంగీతం పాడేవారు. వారివద్ద చాలపర్యాయాలు విన్నాను.

శ్రీరామమూర్తి:- భాగవతం దశమస్కంధం ప్రారంభించవలసి ఉన్నది. శ్రీవారి అనుగ్రహం అర్ధిస్తున్నా.

శ్రీవారు:- మంచిది. ద్వాదశాక్షరి పండ్రెండువేలు జపంచేసి, రచన కారంభించండి. కార్యం సఫలమైతుంది. మాఘమాసంలో జపం ప్రారంభించవచ్చును.

శ్రీరామమూర్తి:- చిత్తం. ఆజ్ఞానుసారమే చేస్తాను.

తర్వాత శ్రీవారు కుంకుమాక్షతల నిచ్చి, రామమూర్తిగారిని ఆశీర్వదించి పంపారు.

Maa Swami    Chapters