Maa Swami    Chapters   

11. కనకాభిషేకము

కాంచీపురము ఒక పుణ్యక్షేత్రము. పరమేశ్వరుడు ఆమ్రతరు మూలములో ఏకామ్రనాథుడన్న పేరిట కూర్చుని ఉన్నాడు. ఒకే ఒక్క పండును పండించటంవల్ల దీనిని ఏకామ్రమనీ దానిక్రింద ప్రతిష్ఠుడైన స్వామిని ఏకామ్రేశ్వరుడనీ పిలుస్తున్నారు. ఆయన హృదయము రసాలఫల సదృశ మాధుర్యంతో కూడినది. ఆ చెట్టు పండించే ఏక ఫలమేమి? అదే జ్ఞానం. కాంచీ నగరంలో పెద్దకంచి లేక శివకంచి చిన్నకంచి లేక విష్ణుకంచి అని రెండు భాగాలున్నవి. ఒకే మూర్తిని హరిహరుడనీ శంకరనారాయణుడనీ వ్యవహరించే విధంగా ఉత్తమోత్తమమైన ఈ క్షేత్రంలో అర్ధభాగాన్ని విష్ణుకంచి అనీ, తక్కిన అర్ధభాగాన్ని శివకంచి అనీ పిలుస్తున్నారు. విష్ణువు ప్రపంచాన్నంతా పాలిస్తూ అందరినీ పోషిస్తున్న ప్రభువు. రాజాధిరాజు. ఈ క్షేత్రంలో ఆయనకు వరదరాజని పేరు.అనగా వరాలను ఇచ్చేవాడని అర్ధం. ఏ యోగ్యతాలేని మనకు ఈ కృపాసింధువు దానబంధువు వరదానంకోసం వరదరాజుగ ఆలయంలో ఆవిర్భవించి ఉన్నాడు.

మొత్తానికి కంచిలో 108 శివలింగాలు, 18 విష్ణుఆలయాలు ఉన్నవి.

ఇన్ని గుళ్ళలోనూ బ్రహ్మోత్సవం చేస్తుంటారు. ఈ ఉత్సవాలలో ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను బయటకు తీసుకొని వస్తుంటారు. విష్ణుసంబంధమైన మూర్తులు, శివ సంబంధమైన మూర్తులు రెండూ రాజవీధులలో ప్రదక్షణంగా వస్తుంటే మనము వెళ్ళి నమస్కరిస్తుంటాము. ఈ రెండు మూర్తులూ శివ విష్ణు భేదం లేక మరొక్క మూర్తికి ప్రదక్షణం చేయటం ఇక్కడ అలవాటు. ఆ మూర్తియే కామకోటి పీఠాధీశ్వరి, రాజరాజేశ్వరి కంచి కామాక్షి. ఈ క్షేత్రానికి నాలుగు దిక్కులలో నాలుగు గోపురములున్నవి. ఈ నగరమే ఒక పెద్ద ఆలయంగాను మధ్యలో- కాంచీ ప్రదేశంలో- కామాక్షి ముఖ్య దేవతగానూ అమరియున్నది.

మనదేశంలో ఎన్నో శక్తిక్షేత్రాలున్నవి. వానిలో చాల చోట్లలో శ్రీచక్ర ప్రతిష్ట చేసియున్నారు. సాధారణంగా చూపుకందని విధంగా మూలస్థానమూర్తి అధోభాగంలో శ్రీచక్రాన్ని నిక్షిప్తంచేసి వుంటారు. కొన్ని చొట్లలో బహిరంగంగా యంత్రస్థాపనలూ కద్దు. కాని కామకోట్యములోని శ్రీచక్రము మాత్రము చాల ప్రసిద్ధిగా, అమ్మవారి సన్నిధిలోనే స్థాపింపబడి యున్నది. అర్చనలన్నీ యంత్రరాజమైన శ్రీచక్రమునకే. మథురలో మీనాక్షి, జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి, కన్యాకునారిలో కన్యకాపరమేశ్వరి పరమసాన్నిధ్యముగా ఉండుట వాస్తవమే. కాని శ్రీవిద్యాధిదేవతగ, లలితా త్రిపురసుందరి, రాజరాజేశ్వరి అన్న సురుచిరాభిధానములతో, చంద్రకలావతంసయై పాంశాం కుశ ధనుర్భాణ పాణియై ఉన్న జగన్మాత కామాక్షియే. తనచుట్టూ నాలుగు గోపురములుండగా ఈశ్వరుని సన్నిధిలో ఏదో ఒక మూలగాక మధ్యస్థమై కాంచీనగరపు కాంచీభాగంలో (కాంచి అనగా కటిప్రదేశము)- దేహంలో మధ్యభాగము- అనుగ్రహమూర్తియై విలసిల్లేది కంచికామాక్షియే.

కామాక్షీదేవి మనకు ప్రసాదించే విశేనుగ్రహమేమి? అంటే ఆమె మనకు మేధను ఇస్తుంది. మేధ అనగా బుద్ధిచాతుర్యం. ఈ కాలంలో మేధను జీనియస్‌ అని అంటారేమో? జీనియస్‌ ఎప్పుడూ మంచిగా వుంటుందనడానికి వీలులేదు. అది విపరీతమార్గాలలోను పోవచ్చు. కాని మేధ విషయం అట్లాకుదరదు. తైత్తిరీయంలో సంపదను కోరుకొనే దానికి ముందు దానిని సద్వినియోగంచేసే బుద్ధినికూడ ఇవ్వమని- మేధాదానం చేయమని- ప్రథమం ప్రార్థించాలని చెప్పబడింది.

అట్టి మేధా ప్రదానంచేసి మూకకవిని అనుగ్రహించినది కామాక్షియే. ఒక మూగ కామాక్షి ఆలయంలో కూర్చున్నాడు. పుట్టుకనుండి మూగ. అతని ప్రక్కనే మరొక వ్యక్తి మహత్తరమైన తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు అనుగ్రహించిన రమణీయమైన కవిత్వంతో ఆమెనే స్తుతించి ఆమెను మెప్పించాలి. తాను ప్రేయస్సూ, శ్రేయస్సూ రెండూ పొందాలి. ఇదీ అతని ధ్యేయం. దానికై అతడు తపస్సు చేస్తున్నాడు. కాని అతనికి ఆమె అనుగ్రహం పొందదగిన పక్వస్థితి ఇంకా ఏర్పడలేదు. దానికి ఇంకా కాలమున్నది. కాని అతడు చేస్తున్నది మాత్రం ఉగ్రమైన తపస్సు. అందుచేత అతనికి దర్శనం ఇవ్వవలసినదే. వరప్రదానకాలం మాత్రం ఇంకా రాలేదు. సాధారణులకు ఇది సంకటం కలిగించే సందిగ్ధావస్త. కాని కామాక్షికి కాదు!

ధ్యానంలో కూరుచున్నవాడు కళ్ళు తెరవగానే అమ్మవారు కనబడి నోరు తెరవమని అతనిని ఆజ్ఞాపించింది. సకల శబ్దప్రపంచమునకు మూలమైన శ్రీకరమైన అమ్మవారి తాంబూలోచ్ఛిష్ఠము ఎవనికైనా లభించిందంటే, సంగీత సాహిత్య సరసవిద్యలు ఒక్క తృటిలో లభిస్తవి. కాని అందరికీ ఆ ప్రసాదం అంత సులభంగా దొరుకుతుందా? అందుచేత అతనికి బుద్ధి మందగించింది. తపస్వియైన తాను ఒక స్త్రీ ఉచ్చిష్ఠమును గ్రహించుటా? ఏమి వెఱ్ఱితనము? తన శౌచమునకు భంగముకదా! ఈ ఆలోచన అతనిలో ఒకవిధమైన జుగుప్సను రేకెత్తించింది. 'నీ వెవరవో ఒక స్త్రీ. నా తపస్సు భంగం చేయాలనీ, నా శౌచం మంటగలపాలనీ నీవు తీర్మానించినట్లున్నది. నా ముందునుంచి వెళ్ళిపో!' అని అన్నాడు.

అతని ప్రక్కనే ఉన్న మూగవాడు అంతా వినినాడు. తన రొట్టె విరిగి నేతిలో పడిందనుకొన్నాడు. వానికి తపోనిరతీ శాస్త్రజ్ఞానమూ ఇలాంటివి ఏవీ లేవు. సాధారణవ్యక్తి. తపస్వి ఉచ్చిష్ఠ నిరాకరణ చేయగానే ఇపుడు తన నోటిని విశాలంగా తెఱచినాడు. అవ్యాజ కరుణామూర్తియైన అమ్మవారు అతని నోట తాంబూల రసమును ఉమిసినది. అంతే ఆ క్షణంలో ఆ మూగ మహాకవిగా మారపోయినాడు. అమ్మవారి ప్రభావాన్ని ఆర్యాశతకంగా విరచించాడు. కండ్లు పాదారవిందములపై వ్రాలగా వెంటనే పాదారవింద శతకమును పాడినాడు. కామాక్షి కృపావిలాసాన్ని స్తుతి శతకంగా చెప్పినాడు. ఆమె కటాక్షమును చూచి కటాక్షశతకం చేశాడు. ఆ మూగవాని అనర్గళ కవితాసౌందర్యలహరిలో ఆనందంగా తేలుతున్న అమ్మవారి చిరునవ్వుపై మందస్మిత శతకం గడగడా చదివినాడు. అట్లా ఆశువుగా చదివిన సుందరకావ్యమే మూకపంచశతి!

మూకపంచశతిలో లేనిది లేదు. కావ్యరసము, భక్తి మరందము, జ్ఞాన ప్రసూన సౌరభములు, మంత్రము, తంత్రము ఒక్కటేమి? ఏది కావలిస్తే అది దానిలో ఉన్నది. కర్పూర తాంబూల ఖండోత్కరియొక్క ఉచ్ఛిష్ఠంలో పుట్టిన ఉచ్ఛిష్ఠకావ్యం మూకపంచశతి అద్భతముగా వుండుటమే కాక అనుగ్రహప్రదంగానూ ఉన్నది. దానిని పారాయణ చేస్తే ఆ పుణ్యకార్యం మనలను కూడ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులుగా చేస్తుందనుటలో సందేహమేమీ లేదు.

మానవమాత్రులమైన మనం ఏ కార్యాన్ని గానీ వదలక చేస్తుంటే, అలసట ఆలస్యం మొదలైనవి ఏర్పడుతవి. త్రిభువనజనని అయిన అమ్మవారు విసుగూ విరామమూ లేకుండా చేసే ఒక కార్యాన్నిగూర్చి మూకకవి ఇలా వ్రాస్తాడు.

ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ

శుండిరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశన్తీ

తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రీ

చండీదేవీ కలయతి రతిం చంద్రచూడాల చూలీ

ఈ శ్లోకంలో ప్రాతిభశ్రీ అన్న పదప్రయోగం చేయబడింది. అంటే విసుగూ విరామమూ లేక ఆమె పాదములను నమ్ముకొన్నవారి స్వాభావికములైన పాపములను తొలగించి, (ఖండీకృత్య ప్రకృతికుటిలం) పాపక్షయంచేసి ప్రతిభను, మేధను ప్రసాదించి, కనకధారను తుండీర నామక పుణ్య మండలంలో చండీదేవి కురిపిస్తుందట !

'తుండీరాఖ్యే మహతి విషయే'- తొండ మండలమునకే తుండీరదేశమని పేరు. దీనికి ఉత్తర భాగంలో శ్రీకాళహస్తి క్షేత్రమున్నది.అక్కడ ప్రవహిస్తున్న నది పేరు స్వర్ణముఖి. తమిళంలో దీనిని పొన్‌ముగలి అని అంటారు. పొన్ను అంటే బంగారు. పేరులోనే బంగారమున్నది. దక్షిణదిశలో పెన్నారు. తమిళంలో 'ఆరు అంటే ఏరు. పెన్నై x ఆరు = పెన్నారు. పినాకిని అన్నపదం పెన్నగా మారింది. పరమేశ్వరుడు తన పినాకంతో భూమిపై ఒక రేఖను గీయగానే పెన్నారేర్పడింది అని పురాణం. తూర్పుభాగంలో బంగాళాఖాతం. పడమర ఉత్తర ఆర్కాటుజిల్లాలో ఉన్న విరించిపురం (అప్పయ దీక్షితులవారి జన్మస్థలము)- ఈ నాలుగూ తొండమండలపు టెల్లలు. సంస్కృతంలో దీనిపేరు తుండీరదేశం. మూకకవి తుండీరాఖ్యే మహతివిషయే- అని ఈ ప్రదేశాన్నే వర్ణించాడు.

స్వర్గసృష్టి కురిసిన తుండీరదేశంలో ఇప్పుడు కరువు. వర్షాలు సరిగ్గా పడకపోతే కరువు. వర్షాలు ఎందుకు పడటంలేదు. అదే సూర్యుడు, అదే భూమి అదే సముద్రం. ఒకప్పుడు వర్షం పడటమేమి? మరొకపుడు పడకపోవటమేమి? అంటే జనుల జీవితములు క్రమబద్ధంగా ఉండకపోవటం చేతనే. అన్యాయం ఎక్కువకావటం వలననే సకాలంలో వర్షాలు పడటంలేదని చెప్పవలసి వస్తుంది. మనంచేసే పాపాలు ఇతరులకు హింసాకారణంగా వున్నవని ఈ క్షామమును చూస్తేనే తెలుస్తుంది. దేశమును క్షామం ఆవరించిందంటే దేశంలోని సత్పురుషులతో సహా జనులందరూ బాధపడవలసి వస్తున్నది. ఒకడు చేసిన పాపం ఊరినంతా బాధిస్తున్నది. తొండమండలవాసుల అవస్థచూచి అమ్మవారికి జాలి వేసింది. తానిచ్చిన దండన చాలనిపించింది. ప్రజలకు ప్రస్తుతం కావలసినది ఆహారం. మేధ కాదు. కాని ధాన్యసమృద్ధి వెంటనే ఏలా లభిస్తుంది? డబ్బుంటే ఇరుగు పొరుగు దేశాలకు వెళ్ళి ధాన్యం కొనుక్కొవచ్చును. అందుచేత ఆమె తొండమండలంలో కనకవర్షం కురిసేటట్లు అనుగ్రహించింది.

ఈ విధంగా కనకవర్షమును కురిపించిన కామాక్షిని తమ జీవిత చరమదశలో భాగవత్పాదులవారు వచ్చి ఆశ్రయించారంటే అది భవ్యంగానే వున్నది. ఏమంటే ఆచార్యులవారి వదనారవింద గళిత మధుధారకదా కనక ధారాస్తోత్రము! వటవృక్ష చ్ఛాయలో భద్రాసనాసీనుడైన దక్షిణామూర్తి మౌన మునకు స్వస్తిచెప్పి వాగ్వర్శం కురిపించడానికి ఆచార్యులుగా అవతరించారు. రామేశ్వరం మొదలు బదరీనాధ్‌వరకూ, ఆసేతు శీతనగ పర్యంతం, యాత్రలుచేసి అద్వైతస్ధాపన గావించారు. కట్టకడపట కాంచీపురంలోని అంబిక చరణాలను ఆశ్రయించారు. అమ్మవారి ఉగ్రకళను శమింపజేసి శ్రీచక్రప్రతిష్ఠనుచేసి శాంతమూర్తిగ చేశారు. ఆమె పీఠంలోవుంటూ షణ్మతస్థాపన చేశారు. ఇవన్నీ వారు కడపటి కాలంలో చేసిన కార్యాలు. తర్వాత సర్వజ్ఞపీఠారోహణ గావించారు. వారు కనకధారాస్తోత్రం ప్రపథమం చదవటమూ ఈ తుండీరమండలంలో కనకవృష్టికీ ఒక సంబంధమున్నది. కనకవృష్టి కురిపించిన కామాక్షి, కనకవృష్టిని కురిపించేటట్లు చేసిన భగవత్పాదులు- వీరిరువురి విశేష సాన్నిధ్యము కాంచీపురములో ఉన్నదనుటకే ఈ ఉదంతాన్ని చెప్పాను.

ఒక బీద గృహస్థురాలింటిలో కనకధారను ఆచార్యులవారు కురిపించగా తొండమండలంలో కనక వృష్టిని కామాక్షి కురిపించినదనీ ఈ ఇరువురూ నెలకొనియున్న ఈపుణ్యక్షేత్రంలో మీరు నాకు ఈ కనకాభిషేకం తలపెట్టారు.

దీనిని నేనెందుకు ఒప్పుకొన్నాను?

ఒక వృద్ధ బ్రహ్మణుడు- ఆయనకు ఎనభై ఏళ్ళుంటాయి. 'మీకు కనకాభిషేకంచేసి ఆ దివ్య దృశ్యాన్ని చూడాలని చాల ఆశపడుతున్నా- మీరు తప్పక ఒప్పుకోవాలి' అని తొందరపెట్టుతూ వచ్చారు. నేను ఏమీ బదులు చెప్పక ఊరకున్నాను. ''నాకూ వయస్సు ఔతున్నది. ఏదో కళ్ళు మూసే ముందే ఈ కనకాభిషేకాన్ని చూస్తే చాలు'' అని ఆయన వచ్చినప్పుడల్లా అడుగుతూ వుండేవారు. ఒక వ్యక్తికి, భక్తీ, అభిమానమూ ఉంటే ఈలాటి ఆలోచనలన్నీ కలుగుతుంటవి. అందులకే ఆయన అడగటం వదలలేదు. నేనూ నా బిగింపు వదలలేదు. అటుపిదప ఆయనకు చూపు క్షీణిస్తూ వచ్చి, పూర్తిగా కండ్లుపోయినవి. ఆయనకు దృష్టిపోవటంకూడా ఒకవిధంగా మంచిదే అనుకొన్నాను. 'కనకాభిషేకం కన్నులారా చూడాలని అన్నారు కదా? ఇప్పుడేమో మీకు చూపులేదు. ఇంక మీరు మీ ఆశను వదులుకోవచ్చు' అని అన్నాను. దీనితో విషయం పరిష్కారమైనట్లు. కాని ఆయన వదలే మనిషికాదు. 'కంటికి నేను చికిత్స చేసుకొంటాను. కనకాభిషేకం జరగాల్సిందే' అంటూ చికిత్సకు బయలుదేరారు. ఆయన సంకల్పబలం ఎలాంటిదో, ఆయనకు కళ్ళు బాగై చూపు మళ్ళా సిద్ధించింది. 'నాకు కళ్ళు మళ్ళా వచ్చినవి కాబట్టి కనకాభిషేక మెప్పుడు?' అని ఆయన మళ్ళా నా దగ్గరకు వచ్చారు. ఆయన కొరికను నిరాకరించే శక్తి నాకు లేకపోయింది. వేరు గతిలేక సరే అని అన్నాను.

ఈ కనాకాభిషేకం చేసుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు. కాలపరిస్థితులను గమనించినా ఇది యుక్తంగా కనపడలేదు. కాని ఈ వృద్ధబ్రహ్మణుని పట్టుదల, ఆసక్తీ, అభిమానమూ, మరికొందరి కోరికమేరకు దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కాదనడానికి వీలులేకపోయింది.

ఇట్లు కనకాభిషేకం చేయడానికి మీరందఱు పూనుకున్నారు. స్వర్ణోత్సవం వేరే చేయాలని సంకల్పించారు. నన్ను మీరు ఇట్లు గౌరవిస్తూ వుంటే, నేనూ నా గౌరవాన్నీ, భక్తినీ ఇద్దరికి తెలుపుకోవాలని కలవై గ్రామానికి వెళ్ళాను. కలవైలో నాయొక్క గురువు, పరమగురువుల అధిష్ఠానములున్నవి. గురువుయొక్క గురువును పరమగురువని అంటారు. పరమగురువుయొక్క గురువు పరమేష్టి గురువు. పరమేష్ఠి యొక్క గురువు పరాపర గురువు. నన్ను గురువుగా భావించి మీరందఱు నాకు నమస్కారం చేస్తున్నారు. కనుక నేనూ, నాయొక్క గురువు, పరమగురువులను నమస్కరించి మిమ్ములనూ వారికి నమస్కారము చేయమనిచెప్పి, వారిని గూర్చి కొంత వివరిస్తాను.

కలవై అనగా తమిళములో 'కలయిక' అని అర్థము. నా గురువు, పరమగురువు ఈ చోట సిద్ధిపొందిరి కనుక ఈ పేరు యుక్తంగానే వున్నది.ద్వైతభావము వదలి ఏకత్వమొందుట కలయిక- కలవై. నది సముద్రములో నామరూపములు వదలి కలసిపోయినట్లు జీవాత్మ పరమాత్మలో కలసి పోవటం కలవై. కలవై అన్న పేరు పొందికగానే ఉంది.

వీరికి పూర్వమున్న ఆచార్యులు నాకు పరమేష్ఠి గురువు. ఈయన సిద్ధిపొందినది పుదుక్కోట సమీపాన ఉన్న ఇలయాట్రంగుడి. రామనాధపురం జిల్లాలోనిది. దీని పేరూ పొందికగానే వున్నది. పరమేష్ఠి గురువులు రామేశ్వరం వెళ్ళి తిరిగి వస్తున్నారు.త్రోవలో ఇలయాట్రంగుడి వచ్చి చేరారు. ఆ వూరుచుట్టూ అడవీ, ముళ్ళపొదలూ. ఏ కారణంచేతనో వారు ఆవూరు చేరారు. ఒక బిల్వవృక్షం క్రింద విడిదిచేశారు. తమ అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకొని రాత్రి ఒంటిగంటవరకూ సమాధినిష్ఠలో వుండి అట్లే సిద్ధిపొందారు. వారిని ఆ చోటనే సమాధిచేసి, శివలింగ ప్రతిష్ఠ చేసి ఒక కోవెల కట్టినారు. సన్యాసిని సమాధిచేసి, ఆ స్థలంలో తులసినాటితే దానిన బృందావనమంటారు. శివలింగం ప్రతిష్ఠిస్తే అధిష్ఠానమని అంటారు. కలవై గ్రామములో గురువుకూ, పరమ గురువుకూ బృందావనములున్నవి. ఇలయాట్రం గుడిలో పరమేష్ఠి గురువుకు అధిష్ఠాన మున్నది. చెట్టినాడులో ఉన్న తొమ్మిది శివాలయములలో ఇలయాట్రంగుడి ప్రధానమైనది.

ఈచోట వారు సిద్ధిపొందటం, ఈ వూరిపేరూ పొందికగా వున్నది. 'ఇలయాట్రం గుడి' వారికి 'ఇళ్ళెప్పెరుం గుడి'గా మారినది. తమిళమున 'ఇళ్ళెప్పెరువదు' అనగా విశ్రమించుట. నిరంతర విశ్రాంతికి వారు ఈ చోటును ఎన్నుకొన్నారు కాబోలు. గురువు పరమగురువు, కలవైలో పరమాత్మతో కలిసిపోగా,పరమేష్ఠిగురువు ఇళయాట్రంగుడిలో విరతినొంది శివైక్యమయ్యారన్నమాట!

పరమేష్ఠి గురువుయొక్క గురువు పరాపర గురువు. వారూ విస్తారంగా సంచారమూ, దిగ్విజయ యాత్రలూ చేసినవారలు. వారు తిరువానైక్కాపు అనే జంబుకేశ్వరము వెళ్ళారు. ఈ క్షేత్రము తిరుచ్చినాపల్లిలో వున్నది. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. కాంచీనగరంలో భగవత్పాదా చార్యులు శిలారూపంలో శ్రీచక్రమును ప్రతిష్ఠించారు. కాని జంబుకేశ్వరంలో శ్రీచక్రముతోపాటు శివచక్రముకూడ వారు ప్రతిష్ఠించుట ఒక విశేషము. మరొక విశేష మేమనగా ఈ రెండు చక్రములనూ తాటంక రూపమున నిర్మించి అఖిలాండేశ్వరి అర్పణ గావించారు. అమ్మవారి ఉగ్రకళను, చక్రములలోనికి ఆకర్షించి, ఆమెకే ఆభరణములుగా సమర్పించారు. వీనిని అప్పుడప్పుడూ పరమ్మత్తుచేసి పునఃప్రతిష్ఠ చేయుట కద్దు. అట్లు తాటంక ప్రతిష్ఠ చేసినవారిలో పరాపర గురువు ఒకరు. వారు అట్లు తాటంక ప్రతిష్ఠచేసి కుంభకోణమునకు వస్తున్నపుడు జరిగిన సంఘటనకు, నేను ధరించిన ఈ శాలువకూ ఒక సంబంధమున్నది.

వారు తాటంక ప్రతిష్ఠ చేసినపుడు తంజావూరు, మహారాష్ట్ర రాజుల పరిపాలనలో వుండేది. శివాజీ స్థాపించిన సామ్రాజ్యం చీలిపోగా తంజావూరు స్వతంత్ర రాష్ట్రమైంది. ఆ సమయంలో తంజావురును పాలిస్తున్న ప్రభువు పేరున్నూశివాజియే. ఆయన ఆచార్యులు వారిని ఆహ్వానించి ఘనతరమైన ఉపచారము చేయాలని సంకల్పించారు. మార్గమధ్యముననే స్వాములవారి పరివారాన్నీ, బండ్లను తంజావూరికి తరలించుకొని రావలసినదని సిబ్బందికి పురమాయించారు. ఆచార్యులను పరమాదరంతో భక్తి శ్రద్దలతో ఆహ్వానించి కనకాభిషేకం చేసి, నేను ప్రస్తుతం ధరించివున్న ఈ శాలువను ఆయనకు సమర్పించారు. మీరు కనకాభిషేకం తలపెట్టగానే ఈ శాలువ జ్ఞప్తికి వచ్చింది.

దీనిని మఠంలో ఒక పెట్టిలో చాల రోజులుగ భద్రపరచి కాపాడుతూ వున్నారు. ఈ సందర్భంలో దీనిని నేను ధరించుటే నిజమైన కనకాభిషేకం. నా పరాపర గురువు యొక్క అనుగ్రహ వస్త్రాన్ని ఆచ్ఛాదించుకోవడం కంటే వేరే కనకాభిషేక మేమున్నది? చాల పురాతనమైన వలువ, కొంచెం కదిలితేచాలు శిథిలమై రాలిపోతున్నది. ఇందులోని జరిగ మంచి బంగారు జరిగ. దాని ధూళి, స్వర్ణరజస్సు- నేను కదిలితేచాలు, గానిలోకలసి మీపైన కూడ పడుతున్నది. అంటే నేను మీకున్నూ కనకాభిషేకం చేస్తున్నానన్నమాట! ఈ ఒక్క శాలువ ఇంతమందికి కనకాభిషేకం చేస్తున్నది!! ఈ గురుప్రసాదమును మన మందరమూ భావిస్తున్నాము. కనుక ఆ మనోభావమే కనకవృష్టిగ కురుస్తున్నది!!!

ఈ కాలంలో ధరలన్నీ పెరిగిపోయినవి. బంగారుమాట చెప్పనక్కరలేదు. ఇంత వెలవేసి కనకాభిషేకం చేయవలసిన పనేలేదు. మీ అందఱి ప్రేమామృత సీకరములే నాకు కనకధారలు. ఈ ఉత్సవ కార్యనిర్వాహకులు చేసిన కనకాభిషేకము ఇంతకుముందు శివాజీ మహారాజుచేత కనకాభాషేకం చేసుకొన్న పరాపర గురువుల కృప- వారికి ముందు కనకధారను కురిపించిన భగవత్పాదుల కరుణ, అంతకుమునుపు ఈ తుండీర మండలంలో స్వర్ణవృష్టి కురిపించిన జగదంబ కామాక్షి కరుణాకటాక్ష సాంద్రవృష్టి- అన్నీ కలపి నాకు పెద్ద కనకాభిషేకమై పోయింది.

నేను జగన్మాతను ఆది శంకరులను, పూర్వాచార్యులను స్మరించేటట్లు ఈ కనకాభిషేకం చేసినది. తుండీర దేశంలోని జీవరాసులన్నీ క్షేమంగా ఉండాలని అమ్మవారు స్వర్ణవృష్టిని కురిపించింది. ఒక పేద గృహస్థురాలి దారిద్ర్యం తొలగాలని ఆచార్యులవారు కనకధారను కురిపించారు. ఈ స్మరణ మన హృదయ సీమలలో జీవకారుణ్యం ఉత్పాదింపచేయాలి. లోకమంతా క్షేమంగా వుండాలంటే వ్యాధులూ దుర్భిక్షములూ ఉండరాదు. అది పాపరహిత జీవనం వలననే సాధ్యమౌతుంది. స్వాభావికములైన పాపములన్నీ పోగొట్టి అందరికీ మేధాశ్రీలను ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అందరూ శాంతిగా క్షేమంగా ఉండాలని గురుమూర్తులను కోరుకొంటున్నాను.

Maa Swami    Chapters