Maa Swami    Chapters   

8.ఆత్మాన్వేషణ

పెద్ద పెద్ద కవులు తమ రచనలను నవరసభరితంగా వ్రాస్తారు. శృంగార, హాస్య, కరుణ, వీర, అద్భుత, భయానక, రౌద్ర, భీభత్స, శాంతములని అలంకారికుల ప్రకారము, తొమ్మిది రసములున్నవి. ఈ రసాలు సాహిత్యంలోనే కాదు, మనస్సులోనూ వుంటాయి. ఏదైనా ఆపద కలిగితే మనం దుఃఖిస్తాం. మంచి విషయం సంభవించినపుడు సంతోషిస్తాం. మన ముఖాలు నవ్వుతూ వుంటాయి. ఒక పామో, మరేదైనా క్రూరమృగమో కనపడితే భయంతో వణికిపోతాం. ఏదైనా అన్యాయంకానీ, అత్యాచారంగానీ మనకళ్ళ ఎదుట జరిగితే కోపగ్రస్తుల మవుతున్నాం. ఏదన్నా విచిత్రమైన అకట వికటపు దృశ్యంచూచి విరగబడినవ్వుతాం. భగవంతుని దర్శించినపుడు శాంతంగా కదలక మెదలక నిలుచుంటాం. జీవితంలో మనకి రసాలన్నీ అనుభవంలో ఉన్నవే. మనస్సుకు ఒక్కొక్కపుడు భావోద్రేకం కల్గుతుంది. కలవరం, అలజడి లేనపుడు, ఆనందంగాను, శాంతంగానూ ఉంటాం. మనస్సు ఆయాగుణాలకు అనుగుణంగా స్పందిస్తుంది.

రసాలున్నట్టే రంగులుకూడా విబ్‌గార్‌ అని ఏడురంగులున్నవి. వైలెట్‌, నారింజ, నీలం, పచ్చ, పసుపు, ఎరుపు మొదలైన ఏడు రంగులున్నవి. వీనిలో ఒకదానితో మరొకటి కలుపుతూ పోతే ఎన్నో రంగులను సృష్టించవచ్చును. నవరసాలతో కవి కావ్యం వ్రాసినట్లే చిత్రకారుడు తన కుంచెతో వర్ణములను వివిధ రీతులలో కలిపి చక్కని వర్ణచిత్రం గీస్తాడు. దానిని వందలు వేలుపెట్టి కొని జనులు ఆనందిస్తారు. అదే విధంగా సరిగమపదని- అనే సప్తస్వరములతో ప్రతిభావంతుడైన గాయకుడు శ్రోతలను గానలహరిలో పరవసించేటట్లు చేస్తున్నాడు. చిత్రం, శిల్పం, సంగీతం- అన్నీ ఆనందం కలిగించేవే.

ఒక చక్కని చిత్రంచూచినా, సంగీతంవిన్నా, కావ్యం, నాటకం చదివినా, మనస్సుకు ఒక ఆనందం, ఉల్లాసం కలుగుతూవుంది. ఆ సమయంలో మనస్సు అటూ ఇటూ పోక, ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఆ రంగుల కలయిక లేకపోయినా, స్వరమేళనం సరిగాలేకపోయినా, రసౌచితి లేకపోయినా, చిత్తానికి శాంతీ, ఆనందము కలుగదు. మనస్సు వ్యగ్రం ఔతుంది. ఆ పరిస్థితిని సంగీతంలో అపశ్రుతి అని అంటారు. సాహిత్యంలో రసాభాసం అని అంటారు. కనుక వీటన్నిలోనూ ఔచిత్యం సంయమనం అత్యవసరం.

జీవితంలోనూ ఒడిదుడుకులకు లొంగిపోని శాంతత మనం అలవరచుకోవాలి. కామ మోహాదులకు చలించని స్థితి మనం పొందాలి. మనలో ఒక సామెత ఉన్నది. 'నవ్వుతూ చేసిన తప్పును, ఏడుస్తూ అనుభవించాలి' అని. అయితే ఆ నవ్వటం ఏడవటం ఎలా జరుగుతుంది? మనం చేసే మంచికానీ, చెడ్డకానీ, వాని స్వరూపంపై ఆధారపడియుండదు. వానికి గల కారణాలను బట్టి వుంటుంది. కామంతో క్రోథంతో చేస్తే ఆ పనులుతప్పు. కామం కలింగించే పని అయినా, కామభావం మనస్సులోనికి రానీయకుండా చేస్తే అది ఉత్తమకార్యం అవుతుంది. ద్వేషం క్రోధం మనస్సులోనికి రాకుండా ద్వేషక్రోధాలు కలిగించే పనులుచేసినా అవి తప్పుకావు. అనగా మన మనస్సును ఒక్కశాతం మినహాగా, ఇతర ఎనిమిది భావాలపై పోనీక, మనం ప్రపంచంలో ఏ పనిచేసినా, అది ఉత్తమకార్యమే ఔతుంది. ఆ ఎనిమిదీ లేనిచోట శాంతమే మిగులుతుంది. ఆ శాంతమే మనస్సును ఆవరించుకుంటుంది. ఆ స్థితిలో ఏపనిచేసినా, అది లోకహితాన్నే కలిగిస్తుంది.

సాధువులు, మహానుభావులు, అయిన పెద్దలను గురించి, ''శాంతో మహాంతో నివసంతి సంతః, వసంతవ ల్లోకహితం చరంతః'' అని చెబుతారు. మన మనస్సూ ఆస్థితికి వచ్చినపుడే జన్మసాఫల్యం. అంటే కామంక్రోదం, ద్వేషం, భయం, జుగుప్స మొదలైన భావాలను రెచ్చగొట్టే పరిస్థితులనూ అటువంటి పనుల చేయవలసి వచ్చినపుడూ మనమనస్సు ఒకేవిధంగా వుండాలి.

కృష్ణపరమాత్మ గీతలో, అర్జునునితో, సుహృన్మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థుల, పట్లనూ, ద్వేషి, బంధువు, సాధువు, పాపిష్టుల, ఎడలనూ ఒకేరకంగా వుండాలని అంటాడు. 'సమబుద్ధిర్వి శిష్యతే'- వీరందరిపట్లా సమబుద్ధి, సమానమైన భావం ఉండాలని అంటాడు. ఆ సమబుద్ధి, సమత్వమే బ్రహ్మ. సమత్వం అంటే దోషంలేకుండా వుండటం అన్నమాట. శత్రువుపట్లా, మిత్రునిపట్లా సమత్వం అంటే ఏకభావం వుంటే అక్కడ భావానికి ఏదోషం అంటుకోలేదని ఆర్ధం. అలాంటి నిర్దుష్టమైన సమత్వమే బ్రహ్మ స్వరూపం. ఆ విషయాన్నే 'నిర్దోషంహిసమం బ్రహ్మ' అంటూ, అలాంటి బుద్ధిని సంపాదించడమే జీవితలక్ష్యం కావాలని అంటాడు.

గీతలో కృష్ణుడు చెప్పేమాటలు చిత్రంగా వుంటాయి. ఒకదానికొకటి పొందికలేనట్లు ఉంటుంది. ఒకవైపు అందరిపట్ల సమంగా వుండమంటూ, యుద్ధం చేయమంటాడు. శత్రువులను చంపమంటాడు. అందరూ సమానులైనపుడు ఒకరిని చంపడమెందుకు? మరొకరిని చంపకుండా ఉండటమెందుకు? అంతా అయోమయంగా వుంటుంది. ఇందులో ఏది కర్తవ్యం? అందుకే అర్జునుడు, మనలాగే మతిభ్రమచెంది, మళ్ళీ మళ్ళీ విషయాన్ని స్పష్టం చేయమని అడుగుతూ వుంటాడు. పరమాత్మా భక్తునికి వివరిస్తూ వుంటాడు.

సామాన్యంగా గీతోపదేశప్రకరణం మనం కథగా ఎప్పుడో భారతకాలమున జరిగినట్లు భావిస్తాం. ఆనాడు అర్జునుడికి కలిగిన సందేహాలు, ఈనాడు నిత్యజీవితంలో మనకూ కలుగుతూనే ఉంటాయి. అందులో అర్జునుడితో నీవు చేసే ప్రతిపనీ భగవదర్పితం చేయమంటాడు. అపుడు ఏపని చేసినా అది ఉత్తమ కార్యమే అవుతుంది. అట్లా భగవదర్పితమైన మనస్సుతో మారణకార్యం చేసినా, అది పుణ్యమే. దానివలన ఉత్తమలోకాలు కల్గుతవని అంటాడు.

నిత్యజీవితంలో భగవదర్పితమైన మనస్సుతో కర్మలు ఎలాచేయటం? ఈ సమత్వబుద్ధి దైనందిన జీవితంలో ఎంతవరకు సాధ్యమౌతుంది? స్వధర్మం చేయాలి. చేతులు ముడుచుకొని కూచోరాదు. అన్ని పనులూ చేయాలి. ఒక పని చేయాలంటే దానిపై ఆసక్తి లేక ఎలాచేయటం? శత్రువును ద్వేషం, క్రోధం లేక ప్రహరించగలమా? ఆ భావాలకు లోనుగాకుండా మనం ఈ పనులను చేయజాలకపోతే అవి అనుచితములుకదా?అది కూడదని ఊరక కూచున్నామంటే అది అధర్మమే. తూష్ణీంభావముతో ఒకపని చేయుటకు ప్రధానకారణమైన భావమును మనస్సులో రానీక ఆ పనిచేయటం ఎలాసాధ్యం? ఈ పరస్పర విరుద్ధ విషయావళిని సమన్వయం చేయడం ఎలా?

మనమేదో ఒక మహత్కార్యాన్ని తలపెట్టినాం. ఒక పెద్దగోపురము నిర్మించాలని అనుకొన్నాం. ఆ నిర్మాణం పూర్తి అయ్యేలోగా ఎన్నో సంఘటనలు, మంచివీ చెడ్డవీ కలుగుతాయి. ఆనందం కలుగుతుంది. ప్రయత్నం భంగమైనపుడు విషాదమూ, చీకాకూ కలుగుతుంది. ఆ దశలన్నీ గడచిన పిదప గోపురనిర్మాణం పూర్తి ఔతుంది. సర్వాంగసుందరమైన ఆ గోపురాన్ని చూచినపుడు మనస్సుకు శాంతీ, ఆనందం కలుగుతుంది. నిర్మాణదశలో కలిగిన క్రోధమోహాదులను మరచిపోతాం. లేదా వానితో సమాధానపడుతాం. వానిని అనుభవించినట్లే వుండదు.

ఒక సాధువు ఉన్నాడనుకొందాం. వాని జీవితలక్ష్యం- 'చార్‌ధామ్‌కీ యాత్రా'- బదరి, రామేశ్వరం, పూరీ జగన్నాథ్‌, ద్వారక్‌ మొదలైన పుణ్యక్షేత్రాలున్నవి. ఇవన్నీ చూడటానికి ఎన్నో ఏండ్లు పడుతుంది. ఎన్నో అనుభవాలు, ఆనందం, విషాదం, క్రోధం, ఆశ్చర్యం, ఏవగింపు- ఈలాంటి భావాలన్నీ యాత్రా సందర్భంలో అతనికి కలుగుతవి. కానీ అతనిలక్ష్యం ఒకటేకనుక, దీనిని అంతా అతడు లెక్కచేయడు. సహజస్థైర్యంతో ఈ ఆటంకాలన్నీ అధిగమిస్తాడు. తాను తలపెట్టిన ఘనకార్యం నెరవేరినపిదప, అతనికి చిత్తశాంతీ, ఆనందమూ కలుగుతుంది. అతని లక్ష్యసిద్ధి పూర్తికాగానే కామక్రోధాది భావాలు సమసిపోయి, చివరకు సమత, శాంతీ, అతనిని ఆవహిస్తుంది. అన్నీ శాంతిలోనే పర్యవసించాలి.

ఈ విషయాన్నే ఇంకా బాగా తెలుసుకొనేందుకు ప్రయత్నం చేద్దాం. ఒక తంత్రివున్నాడు. అతనికి మతిచలించిన పుత్రుడొకడున్నాడు. ఎన్ని మందులిచ్చినా వ్యాధి నయంకాలేదు. కడకు వానికి సంకెళ్ళువేసి తానే ఒకగదిలో బంధించి వుంచాడు. తన శతృవుకు చేయవలసిన పని పుత్రునికి చేస్తున్నాడు. ఆ స్థితిలో ఆ తండ్రికి తన కుమారునిపై ద్వేషం ఉన్నదని అనగలమా? న్యాయాధికారివద్ద, ఒక హంతకునిపై అభియోగం వస్తుంది. నేరం ఋజువౌతుంది. న్యాయాధికారి నిందితుడికి ఆజన్మకారాగార శిక్ష విధిస్తాడు. ఆ విధంగా ఎంతోమందికి శిక్షలు వేశాడు. అతనికి దోషులపై ద్వేషం ఉందని చెప్పగలమా? ద్వేషం మనకు అపకారంచేసిన వారిపైననే కలుగుతుంది. ఈ నేరస్తులు, న్యాయాధికారి పట్ల ఏ అపకారం చేయలేదు. అసలు వారెవరో కూడ అతనికి తెలియదు. అయినా కొందరిని శిక్షిస్తున్నాడు. మరికొందరిని వదిలేస్తున్నాడు. ద్వేషం కోపం లేకుండా ఈ కార్యం అతడు చేస్తున్నాడు. మన మనస్సులోనే ఎనిమిది రసాలకూ చోటు ఇవ్వకుండా మనం పనులుచేస్తే ఈ విధంగానే వుంటుంది. అట్లా చేసేకర్మలే ఉత్తమకర్మలు.

యస్య నాహం కృతో భావః

చిత్తం యస్య నలిప్యతే

హత్వాపి స ఇమాన్‌ లోకాన్‌

నాయం హంతి నహన్యతే

అన్న గీతాశ్లోకంలోని అంతర్యం ఇదే- అలాంటివాడు త్రిలోకాలను చంపినా, చంపినట్టివాడుకాదు. నిజానికిచేసే పనికాదు ప్రధానం. దాని వెనుక ఉన్న భావం ప్రధానం. పనికిగల కారణం ప్రధానం.

ఏ పనులు కర్తవ్యములు? ఏవి నిషిద్ధములు! తెలుసుకొనేటందుకు ప్రమాణాలు, శాస్త్రములు. 'తస్మాత్‌ శాస్త్రం ప్రమాణాం'. జీవితంలో మనం ఎదుర్కోవలసిన పరిస్థితులలో ఏది కర్తవ్యమో, శాస్త్రాలు చెబుతాయి. శాస్త్రం వేనిని విధిస్తుందో వానినే మనం అనుష్ఠించాలి. శాస్త్రకారణంగా చేసేపనికి కృతార్థత లభిస్తుంది. అట్లాకాక కామకారణంగా చేసేపనులు దుఃఖకారకము లవుతవి. సమత్వంతో, సమభావంతో దోషరహితమైన చిత్తవృత్తితో శాంతిప్రవృత్తితో యుద్ధం చేయాలి. జీవితమూ ఒక సంగ్రామమే. పిచ్చికొడుకు పట్ల వ్యవహరించే తండ్రివలె, నేరస్తుని శిక్షించే న్యాయాధికారివలె, మనంచేసే పనులకు కారణాలు ప్రేమ, సమత్వంగా వుండాలి. మన శీలంలో ఒడిదుడుకులులేని ప్రశాంతత ఉండాలి.

ఆదిశంకరులు ఉపనిషత్తులలో ప్రతిపాదించిన అద్వైతాన్ని గీతాభాష్యంలో సమన్వయించి చెప్పారు. వారు అద్వైతి. కాశ్మీరంనుంచి కన్యాకుమారిదాకా ముపై#్ఫరెండేళ్ళ అల్పవ్యవధిలో పాదయాత్రచేసి అద్వైతప్రచారం చేశారు. ఉపాసనా మార్గంలో ఏమూర్తినైనా పరమాత్మగా భావించవచ్చునని అన్నారు. జీవితలక్ష్యం ఆత్మసాక్షాత్కారం, ఆత్మానందం అన్నారు. ఈ ఆత్మానందం ఎక్కడ ఉన్నది.

ఆనందం అందరూ కోరుతారు. అందరకూ అది కావాలి? అయితే ఎక్కడవుంది? అదేదో బయటనుంచి రావాలా. జిహ్వకు ఆనందం కావాలంటే హోటళ్ళకు వెడుతున్నాం. చెవికి ఆనందం కావాలంటే మంచి సంగీతం వింటున్నాం. కంటికి తృప్తి, ఆనందం కావాలని ఈ కాలంలో సినిమాలకు పోతున్నారు. కొంతమంది గుర్రపుపందాలకు వెళ్ళి, ఆనందం కొనుక్కొంటున్నారు. ఈ ఆనందాలన్నీ బయటనుంచి వచ్చేవి. అయితే ఇది నిజంగా ఆనందంకాదు. పరిమితి మీరితే ఇవి దుఃఖాన్ని తెచ్చిపెట్టుతున్నాయి.

ఇవన్నీ అల్పకాలికములు. అజీర్తినో, రోగాన్నో స్పెకులేషన్‌ నష్టాన్నో, శీలహానినో తెచ్చిపెట్టుతున్నవి. హోటలులో ఫలహారం చేసినంతసేపు ఆనందం వుంటుంది. సంగీతం విని, సినిమా చూడగానే, ఆ ఆనందం తీరిపోతున్నది. గుర్రపుపందాలతో కొంపలే కూలిపోతున్నాయి. ఎలక్షన్‌లో నేడు గెలిస్తే, మరోమారు ఓడిపోతున్నారు. ఓడిన ప్రత్యర్థి కేసుపెట్టితే, ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌, మొదట గెలిచినవారు ఓడినట్లు ప్రకటించటమూ కద్దు. అపుడు దుఃఖమేకదా? కాబట్టి బయటనుంచి వచ్చేవి ఏవీ ఆనందాలుకావు. ఇవన్నీ తాత్కాలికాలు. ఈ విషయం ఎన్నో వందలేళ్ళ క్రితం ఆదిశంకరలు ప్రచారం చేశారు. వారికి వారసులుగా, వారిపేరుతో జీవిస్తున్న మేమూ అదే చెబుతున్నాం!

అయితే ఇంతకూ ఏది నిజమైన ఆనందం? అదెక్కడ వుంది? సూర్యుడున్నాడు. ఒక పందిట్లో మనం కూచునిఉన్నాం. ఆ పందిరి రంధ్రంగుండా సూర్యరశ్మి క్రిందపడుతుంది. ఆ రంధ్రం ఏ ఆకారంలో వుందో, సూర్యకాంతీ ఆ ఆకారంలోనే వుంది. రంధ్రంగుండ్రంగా వుంటే, గుండ్రంగానూ, కోలగావుంటే కోలగానూ వున్నది. అయితే సూర్యుని ప్రకాశపరిమితి అంతేనా? అది అనంతం. ఆ భూమిమీద కనిపించే కాంతికూడ ఆ రంధ్రంమీదనే ఎప్పుడూ ఆధారపడి వుంటుందా అంటే కాదు- సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఆ కాంతి అంతరిస్తున్నది. అనంతమైన ప్రకాశపుంజంలో అది లేశమాత్రం. ఆవిధంగానే పరమాత్మ ఆనందమయుడు. ఆద్యంతరహితుడు. దేశకాలావచ్ఛిన్నుడు. అంతటా నిండివున్న మహాజ్యోతి ఆయన. ఆయన ఆనందఘనము. ఆయనలోని లవలేశ##మే ప్రతి ప్రాణిలోనూ, 'నేను, నేను' అని జీవభావంతో వున్నది. ఆ మహానంద లవలేశములే మనం అపుడపుడూ అనుభవించే ఆనందము. ఇది జీవుల తరతమ స్థితులనుబట్టి, కొద్దిగానో గొప్పగానో ఉంటూ వుంటుంది. ఉపనిషత్తులలో, మానుషానందమనీ, ప్రజాపతి ఆనందమనీ, ఇంద్రుని ఆనందమనీ చెప్పబడినవి. ఇవన్నీ ఆ బ్రహ్మాండమైన ఆనందంలో పరమాత్మలో లేశాలు మాత్రమే.

మనం ఏదైనా వస్తువు చూడాలంటే అందుకు జ్యోతి, వెలుతురు కావాలి. చీకటిలో వస్తుదర్శనం చేయలేము. దీపమో, సూర్యరశ్మియో ఏదో ఒక వెలుగు అవసరం, వస్తువులను చూడటానికి.

అలాగే చూచేందుకు జ్యోతి కావాలి. మనం కంటితో చూస్తాం. అయితే కన్ను జ్యోతికాదు. గ్రుడ్డివారు కళ్ళువుండికూడా చూడలేరుకాబట్టి చూచేది జ్యోతి. గ్రుడ్డివానికి నేత్రజ్యోతి లేదంటాం. కాబట్టి వస్తువులు జ్యోతిలో కనుపిస్తవి. వస్తువులను చూచేందుకు జ్యోతి కావాలి. ఈ జ్యోతి, చూచేది లోపలవుంటుంది. అదే తెలివి, జ్ఞానం, ఆనందం. అదే పరమాత్మ స్వరూపం. 'జ్ఞానానందమయందేవం' అదే శాశ్వతమైన తెలివి. అదే సర్వమును చూచేదీ, చూపించేదీనూ. సర్వత్రానిండివున్న ఆ జ్యోతి, ఆ అఖండపరమాత్మ మన అంతఃకరణలలో, ఘటాదులలో సూర్యబింబంలాగు, పందిట్లో కనుపించే పరిమితమైన కాంతి బింబమువలె ప్రతిఫలిస్తూ వుంటాడు. అంధకారాన్ని పోగొట్టేశక్తి మనస్సుకు కొంతవరకూ వుంది. మనం ఒక అద్దం ఎండలోపెట్టి, దానిని ఒకకోణంలో ఒకచీకటి గదిలోకి ప్రసరింప చేసినపుడు అద్దంమీద పడిన సూర్యకాంతి ఆ గదిలో గోడమీద కొంత వెలుగును ఇస్తుంది. సూర్యకాంతి నేరుగా గదిలో పడకపోయినా, అద్దంద్వారా దానిని గదిలోనికి చీకట్లోనికి పంపినపుడు కొంత చీకటిని పోగొట్టుతున్నది. మనస్సుకుగల తమోనివారణశక్తికూడ ఇలాంటిదే. ఇదికాక లోపలనే పరమాత్మ ఉన్నాడన్న భావం కల్గినపుడు, అంటే మనస్సుమీద పరమాత్మ జ్యోతి ప్రసరించినపుడు, మనస్సు శాంతపడుతుంది. ఇలా అసలు పరంజ్యోతి లవంలోపల ఉన్నదనిపించినపుడు మనం దానిని తెలుసుకోవడానికి లోపలికి చూడవలసివుంటుంది. అంటే మనదృష్టీ, మనస్సు, అంతర్ముఖం కావాలి. లోపల ఉన్న తత్త్వాన్ని బయట వెదకటం మానేసి లోపలచూడాలి. అన్వేషించాలి. అది ముఖ్యం.

ఈ అన్వేషణ ఎప్పుడు చేయగలం? అందులకు మనకు చిత్తనిరోధం కావాలి. అంటే పైన చెప్పిన ఏనిమిదిరసాల నుంచీ చిత్తాన్నీ, మనస్సునూ మళ్ళించి సమత్వం, శాంతిమీద కేంద్రీకరించాలి. మనం జీవించడానికి అవసరం కనుక జీవించడానికి అవసరమైనంతవరకు మాత్రమే ఇంద్రియవ్యాపారాలను పరిమితం చేసుకోవాలి. అందుకు మించి వానికి స్వేచ్ఛ ఇస్తే దుఃఖమే. మనం జీవించేందుకు అన్నం తినాలి. అంతేకానీ తినేందుకు జీవించరాదుకదా? ఆత్మస్వరూపం తెలుసుకోవటం, ఆ ప్రకాశాన్ని ఆనందాన్ని అనుభవించడమే జీవితలక్ష్యం కావాలి. కనుక ఆ పరమలక్ష్యంతో లౌకిక భోగాలను క్రమంగా తగ్గించుకొంటూ సమస్వభావాన్ని పెంపొందించుకోవాలి. అపుడు మనకు శాంతం ఆనందం కలుగుతుంది. అది పోను పోను స్థిరంగా నిలిచిపుడు ఒకే అఖండమైన ఆనందానుభూతి నిలిచిపోతుంది. అలాంటి స్థిరమైన ఆనందమే పరమాత్మ. దానిని సాక్షాత్కారం చేసుకోవాలి. అపుడు మనం చేసే అన్నిపనులూ లోకానుగ్రహ కారకములే ఔతవి. ఒకడిని చంపినా మరొకడికి ఉపకారం చేసినా, రాగద్వేషరహితములై నందున ఆ రెండుపనులూ లోకానికి మంచినే చేస్తవి.

ద్వేషభావం లేకుండా, ప్రేమతో సద్భావంతో ఇతరులకు కష్టం కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు 10,12 నెలల శిశువున్నాడు. అజ్ఞానంచే పారాడుతూ చేతికి దొరికినదెల్లా వాడు నోటిలో పెట్టుకొంటాడు. మట్టి తింటాడు. అందువల్ల వానికి అజీర్తి కలుగుతుంది. అప్పుడు తల్లి శిశువు చేతులకు గుడ్డలు కట్టిగాని, గదిలో వేసికాని తన ఇంటిపనులు చూచుకొంటూ వుంటుంది. తల్లిచేసిన పనికి, శిశువుకు కోపం వస్తుంది. ఏడుస్తుంది. అంటే ఇక్కడ తల్లి సద్భావంతో చేసినపని బిడ్డకు బాధాకరంగా తోచింది. అయితే నిజానికి అందువల్ల బిడ్డకు మేలే కలుగుతుంది. కనుక, నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు తత్త్వతః చూస్తే కష్టాలేకావు. పైపెచ్చు, అవి మనకు క్షేమపాదకములే. అవన్నీ కలిగించే శక్తి ఒకటి ఉన్నది. అదే పరమాత్మ. తల్లివంటి పరమేశ్వరుడు పెట్టేకష్టాలు కష్టాలు కావు. మన మంచినికోరే భగవంతుడు మనకు కష్టాలనిస్తాడు. అందుచేత మనకు కలిగే సుఖదుఃఖాలన్నీ భగవత్ప్రేరితములుగానే మనం స్వీకరించాలి. పరమాత్మ అనేవాడు లోపలవుండి అన్నీ చూస్తున్నాడు. నేను నేననే జ్ఞానం తెలివీ తానుగా స్ఫురిస్తున్నది. తనంతట ఆవిర్భవిస్తున్నది. ఎన్నోరకాల బల్బులున్నాయి. కొన్ని ఎర్రగా, కొన్ని పచ్చగా, కొన్ని తెల్లగా, ఇవన్నీ వెలిగినపుడు వివిధకాంతులతో ప్రజ్వరిల్లుతాయి. అవి తమంతట తామే వెలుగవు. ఆ శక్తిని అనేక వర్ణములలో చూస్తున్నాం. కానీ ఆ శక్తకి ఆ రంగు ఉన్నదని అనగలమా?

వర్ణవైవిధ్య మంతా బాహ్య ఉపాధులనుబట్టి వచ్చింది. నిజానికి విద్యుచ్ఛక్తికి రంగులేదు. అన్ని బల్బులలోనూ ఒకే శక్తి తనకైతాను ప్రవేశిస్తున్నది. మన శరీరాలనే బల్బులలోకూడా ఒకే పరమాత్మ ఉంటున్నాడు. ఆ శక్తి రూపములో తనకైతాను ప్రవేశిస్తున్నది. మన శరీరాలనే బల్బులలోకూడా ఒకే పరమాత్మ ఉంటున్నాడు. ఆ శక్తి రూపములో తనకైతాను వెలుగుతాడు. లోపలవున్న శక్తివల్లనే బయటి ఉపాధికి, బల్బుకు కళాకాంతులు వస్తాయి. ఒక శరీరానికి ప్రాణమే చైతన్యమే ఆ విధంగా వస్తున్నపుడు ఇతర ఆనందాలు బయటనుంచి ఎలారాగలవు? అన్నిటికీ మూలమైన ఆ ఆత్మనుంచే అన్ని అనుభవాలూ ఆనందాలూ, రావాలి.

కనుక ఆనందంకోసం అన్వేషణ అంతర్ముఖంగా చేయాలి. ఆనందంగా కనిపించే ఆనందాభాసాలకు మనంవెళ్ళితే దుఃఖమే మిగులుతుంది. లోపలవుండే మహానంద ప్రవాహంలో అవగాహనం చేయాలి. పూర్ణజ్ఞానం తెలుసుకోవాలి. అందుకు ఇంద్రియాలను ఆపివేసి అంతర్ముఖదృష్టి అలవరచుకోవడం ఏకైకమార్గం. అదే ఆనందం, బ్రహ్మ, రసం. 'ఆనందంబ్రహ్మేతి వ్యజానత్‌' రసోలై సః- అని ఈ తత్త్వాన్నే అంటారు.

లోపలవున్న శక్తియొక్క అసలు రూపము తెలుసుకొనే సరికి బయట ఆవరణయొక్క కృత్రిమరూపం బోధపడుతుంది. మూలపదార్ధమేదో అర్ధమయిన పిదప వివిధ ఉపాధులలో వున్నది ఒకేచైతన్యమని తెలుసుకొంటాము. అదే ఆత్మసాక్షాత్కరం. అది కలిగినపుడు స్థూలమైన ఇంద్రియాలకు విషయంగా వుండే జడప్రకృతి నశ్వరమనీ, అదిలేని దానితో సమానమనీ, అనుభవానికి వస్తుంది. కాగా లోపలా బయటా ఒకే శక్తి ఉన్నదనీ, తద్వ్యతిరిక్తమైనదేదీ విశ్వంలో లేదనీ గ్రహిస్తాం. ఇదే అద్వైతానుభూతి. దీనినే ఆదిశంకరులు ప్రచారంచేశారు. ఆ అనుభూతిలో సమత్వం కలిగి దోషదృష్టి అంతరిస్తుంది. కేవలం బ్రహ్మభావమే మిగిలి 'నిర్దోషం హిసమం బ్రహ్మ' అనే జీవితలక్ష్యం సిద్ధిస్తుంది.

ఆదిశంకరులు ప్రచారంచేసిన ఈ విషయాన్నే ఆయన పేరు పెట్టుకొని చలామణి అవుతున్న మేమూ నెమరు వేసుకొంటూ, మీకు చెబుతున్నాం. ఇదేమీ మా బుద్ధికి తోచిన క్రొత్తవిషయం కాదు. ఆ భగవత్పాదుల బోధలను తెలుసుకొని, ఆచరిస్తే, మీకూ, సమస్త ప్రపంచానికీ క్షేమం, కల్యాణం కలుగుతుంది.

Maa Swami    Chapters