Maa Swami    Chapters   

6.ఘటికాస్థానాలు

దాక్షిణాత్య నలందా తక్షశిలలు

దక్షణదేశములో అధర్వణవేదము సంపూర్ణముగా విస్మృతమై పోయినదని జనసామాన్యమునందే కాక పండితులయందు కూడ ఒక అభిప్రాయము ఉన్నట్లు కనిపిస్తుంది. కాని మనము ద్రావిడ వాజ్మయమును తరచిచూస్తే 'తలవకారము' అనే వేదశాఖ ఒకటి ఉండేదని, ఈ తలవకారముతోబాటు అధర్వణవేదమును కూడ దక్షిణదేశములో అధ్యయనము చేసేవారని, ఆ కాలపు మహారాజులు ఈ అధ్యయనవ్యాప్తికి ప్రోత్సాహము, ఆర్థిక సదుపాయము కల్పించేవారని తెలుస్తుంది.

దాదాపు రెండువేలయేండ్ల క్రితం, దక్షిణదేశమునందు, మరికొన్ని ఇతర పట్టణములయందు కీర్తియందు, విద్యావ్యాసంగమునందు ప్రపంచ ప్రఖ్యాతములైన 'తక్షశిల' 'నలందా' విశ్వవిద్యాలయాలకు తీసిపోని విద్యాస్థానాలు ఉండేవని తెలుస్తూఉన్నది. ఈ మధ్య మద్రాసులోని ఒరియంటల్‌ మాన్యుస్క్రిప్తు లైబ్రెరీవారు 'ఆభోగము' అనే పుస్తకం ఒకటి ప్రచురించారు. ఇది శ్రీ లక్ష్మీనరసింహకృతమైన వ్యాఖ్యానము. ఈ వ్యాఖ్యకు మూలము 'కల్పతరువు'. కల్పతురువును అమలానందులు రచించారు. అది వాచస్పతిమిశ్రులు రచించిన 'భామతి'కి వ్యాఖ్యానం. ఈ భామతి కూడ వ్యాఖ్యానగ్రంధమే. భామతి శంకరభగవత్పాదులు వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యమునకు వివరణ.

బ్రహ్మసూత్రములను (3-4-20) వివరిస్తూ కల్పతరువులో అమలానందులు-

''యేతు శిఖాయజ్ఞోపవీత త్యాగరూప పారమహంస్య వృత్తిం నమన్యన్తే, తేన పశ్యన్తి ప్రత్యక్షఘటికాస్థానేషు పఠ్యమాన అధర్వణీం శ్రుతిం- సశిఖం పవనం కృత్వా బహిస్సూత్రం త్యజేద్బుధః''

అనగా సన్యాసికి శిరోముండనము, యజ్ఞోపవీత త్యాగము కూడదని చెప్పేవారు- ''ఘటికాస్థానాలలో అధ్యయనము చేయబడుతూ ఉన్న అధర్వణశ్రుతిని వినలేదన్నమాట!'' అని వ్రాసినారు.

అయితే 'ఘటికాస్థానము' అంటే ఏమిటి? షిమోగా జిల్లాలో శిఖర్‌పూర్‌ తాలూకాలో 'తలగుండ' అనేచోట ప్రణవేశ్వరస్వామి ఆలయములో కకుత్‌స్థవర్మ కాలమునకు చెదిన శిలాశాసనము ఒకటి ఉన్నది. కకుస్థవర్మకు పూర్వికుడైన మయూరవర్మ (క్రీ.శ. 305-307) తన గురువైన వీరశర్మతో శాస్త్రములను అన్నిటిని క్షుణ్ణముగా అభ్యసించుటకై కాంచీపురములోని ఘటికాస్థానమునకు వెళ్ళినాడని- ఈ క్రింది శాసనము చెపుతున్నది.

''యః ప్రయామ పల్లవేంద్రపురీం

గురుణా సమం వీరశర్మణా,

అధిజగమిషు ప్రవచం నిఖిలం

''ఘటికాం'' వివేశ సుతారుకుకః''

ఈ శాసనము వలన, కల్పతరువులోని పై వాక్యమువలన శాస్త్రాభ్యాసము చేయబడే విద్యాస్థానాలే 'ఘటికాస్థానాలు' అని అర్ధం అవుతూ ఉన్నది. అప్పటికే కొలదిగనో, గొప్పగనో గురువువద్ద చదివిఉన్న మయూరవర్మ ఆ గురువుతోబాటు కాంచీపురానికి వెళ్ళినాడంటే- ఆ ఘటికాస్థానము యొక్క ప్రసిద్ధి, అక్కడ చేయబడే విద్యాబోధయొక్క ప్రాశస్త్యము వెల్లడి అవుతుంది.

దక్షిణ ఆర్కాటు జిల్లాలో 'అర్కోణం' అనే ఊరికి ఏడుమైళ్ళ దూరములో ఉన్న 'వేలూరు పాళియం' అనే చోట మూడవ 'విజయనందివర్మ' కాలమునకు చెందిన శిలాశాసనము ఒకటి ఉన్నది. అందు-

''స్కంద శిష్యస్తతో భ##వేత్‌ ద్విజానాం

ఘటికాం రాజ్ఞ స్సత్యసేనా జ్జహార యః''

కాంచీపురాన్ని పాలిస్తూ ఉన్న పల్లవరాజు స్కందశిష్యుడు (క్రీ.శ. 4 శతాబ్ది మొదట) సత్యసేనరాజుయొక్క అధీనమునందున్న 'ఘటికను' జయించినట్లు వ్రాయబడినది.ఆ సత్యసేనుడూ అశోకుని శాసనాలలో పేర్కొనబడిన సత్యపుత్తుడూ ఒకరే కావచ్చును. అశోకుని శాసనాలు ఆయన సామ్రాజ్యముయొక్క ఎల్లలను పేర్కొంటూ- 'సత్యపుత్తము, కేరళపుత్తము'- అనే రెండు ప్రదేశాలను సూచించాయి. ప్రస్తుత కేరళ##దేశ##మే శాసనములోని 'కేరళపుత్తము' అయి ఉండాలి. ఇక 'సత్యపుత్తము'- అంటే బహుశః కంచీపురము రాజధానిగాకల తొండమండలమై ఉండవచ్చునని తోస్తూఉన్నది. కాంచీనగరమును 'సత్యవ్రతక్షేత్రము' అని అంటారు. కంచిలో 'తిరునేరి కరైక్కాడు' అనే చోటు ఒకటి ఉన్నది. దీనినే స్థలపురాణాలు 'సత్యవ్రతము' అని వ్యవహరిస్తూ ఉన్నాయి. 'నేరి' అనగా సత్యవ్రతము.'పుగళేంది' అనేఅరవకవి- తొండమండలములోని జనులు సమస్త ప్రపంచమును దానముగా ఇచ్చినప్పటికీ అసత్యము పలుకరు- అని వారి నిజాయితీని గురించి ప్రశంసించాడు. తొండమండలమునకు ఉత్తరంగా 'సత్యవేడు' అనే గ్రామం ఉన్నది. ఇవన్నీచూస్తే అశోకశాసనములలో పేర్కొనబడిన 'సత్యపుత్రము' తొండమండలమే అయి ఉంటుందని తోస్తూఉన్నది.

వేలురి పాళ్యమునకు చెందిన శాసనము--

''తత్పుత్రసూసు ర్నరసింహవర్మ

పునర్వ్యధాత్‌ యో ఘటికాం ద్విజానాం

శిలామయం వేశ్మ శశాంకమౌళేః

కైలాస కల్ఫం చ మహేంద్ర కల్పః''

నరసింహవర్మ కాంచీపురములో ఒక ఘటికను స్థాపించి కైలాసనాథాలయమును నిర్మించినాడని తెలుపుతూ ఉన్నది.

ఒకప్పుడు కంచికి రాజు లేకపోగా ఊరి పెద్దలందరు చేరి పల్లవుడైన హిరణ్యవర్మయొక్క ఆస్థానానికి- అతని కుమారుడైన పరమేశ్వరవర్మను కంచికి రాజుగా చేయవలసినదిగా కోరుతూ ఒక రాయబారము పంపినారట. దానికి హిరణ్యవర్మ అంగీకరించగా కంచిలోనివారు పరమేశ్వరవర్మకు 'నందివర్మ పల్లవుడు' అనే బిరుదమిచ్చి పట్టాభిషేకం చేసినారట. ఈ రాయబారమునందు, పట్టాభిషేకోత్సవమునందు కంచిలోని ఘటికాస్థానాలలో ఉన్న ప్రజ పాల్గొన్నారట. కంచిలోని వైకుంఠనాథ పెరుమాళ్ళయొక్క ఆలయములోని శాసనం ఈవిషయాన్ని చెపుతూ ఉన్నది. నందివర్మకాలం క్రీ.శ.710 నుండి 755 వరకు అని నిర్ణయింపబడినది.

కంచి కైలాసనాథాలయములో మహామండపానికి పశ్చిమంగా ఉన్న స్తంభాలపై ఉన్న శాసనాలు విక్రమాదిత్య సత్యాశ్రయుని కాలానికి చెందినవి. (క్రీ.శ. 533-545) వీనివలన ఆ కాలంలో కంచి ఘటికాస్థానాలలోని వారిని 'మహాజనులు' అని గౌరవంగా పిలుస్తూ ఉండేవారని తెలుస్తూ ఉన్నది. ఘటికాస్థానాలను నాశనం చేస్తే మహాజనులను హత్య చేయుటవలన కలిగే పాపం సంభవిస్తుందని ఈ శాసనాలలో వ్రాయబడినది.

దక్షిణ ఆర్కాటులో గుడియాత్తం తాలూకా 'తిరువల్ల' అనే గ్రామానికి దగ్గర 'నీవా' నదిలోని శాసనంలో- ఈ ధర్మాన్ని నాశం చేసినవారిని 'ఘటిక'లోని ఏడువేలమంది జనంయొక్క హత్యాపాపం చుట్టుకొంటుంది- అని వ్రాయబడింది.ఇవన్నీ చూస్తే ఘటికలలో చాలమంది (ఒకానొక ఘటికలో 7000 మంది) చదివేవారని, ఆకాలపు రాజులకు ఘటికాస్థానాలపై చాల ఆదరాభిమానాలు ఉండేవని వ్యక్తం అవుతూ ఉన్నది. ఇంకా-

''దేవబ్రహ్మణ సత్కృతాత్మ విభవః

యః క్షాత్ర చూడామణిః,

చాతుర్వేద్య మనీవృధాత్య

ఘటికాం భూదేవతా భక్తితః.''

అని ఒకచోట,

''యస్మా త్పభృ త్యల మవర్థత ధర్మకర్మ

దేవద్విజన్మ విషయం ఘటికా శ్చధాతుః.''

అని వేరొకచోట ఉన్నది.

ఘటికలు కంచియందే కాక ఇతరస్థలాలలో కూడ ఉండేవి. గోదావరిజిల్లా సిక్కుల అగ్రహారంలో 'అటికావాణి' అనే తటాకం త్రవ్వుతూ ఉన్నపుడు విష్ణుకుండిన వంశమునకు చేరిన రెండవ విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 525) కాలపు తామ్రశాసనం ఒకటి లభించింది. అందు- 'యధావిధి వినిర్వాపిత ఘటికావాప్త పుణ్యసంచయస్య'- అని వ్రాయబడి ఉన్నది. అనగా యధాశాస్త్రముగా ఘటికాస్థాపనచేసి పుణ్యం సంపాదించుకొన్నాడు అని అర్థం. 11,12 శతాబ్దాల శాసనాలు, ఆ తరువాతి శాసనాలు చూస్తే మైసూరురాష్ట్రంలో కూడ ఆ కాలంలో 'ఘటికాస్థానాలు' ఉండేవని ఋజువు అవుతూ ఉన్నది. (క్రీ.శ. 1442) కు చెందిన శిలాశాసనం ఒకటి చెన్నరాయ పట్టణములో దొరికింది. అందులో-

'దుందుభౌ హాయనే భాద్రపదే మాసి శుభదినే

ఉత్తంగోక్త్యా సామవేదే వ్యధత్త ఘటికాశ్రమం'.

'దుందుభి సంవత్సర భాద్రపద మాసములో ఉత్తంగుని ఆజ్ఞచేత సామవేదాధ్యయమునకై ఒక ఘటిక నిర్మింపబడినది'- అని ఉన్నది. ఈ ఘటికలు అన్నీ కాంచీపురంలోని ఘటికాస్థానాలవలెనే పేరొందిన విద్యాలయాలై ఉండాలి.

ఈ శాసనాలలో కొన్ని- ఘటికలలో చదివేవారి సంఖ్యను నిరూపిస్తూ ఉన్నాయి. మైసూరు రాష్ట్రములో 'మాండ్య' తాలూకాకు చేరిన 'హలేకెరే' గ్రామంలో దొరికిన శాసనంవలన 'పృథ్వీ కొంకణ మహారాజు శివకుమారుడు'- ఘటికలో అధ్యయనం చేస్తూ ఉన్న వేయిమందిలో ఒకరికి భూమిని దానం చేసినట్లు తెలుస్తూ ఉన్నది.

'ఘటికా సహస్రాయ హరితసగోత్రాయ మాధవ శర్మణ'- అని అందులోని వాక్యం.

ఉత్తరార్కాటు జిల్లాలో 'చెయ్యూరు' తాలూకాలో 'బ్రహ్మదేశం' అని ఒక గ్రామము ఉన్నది. అక్కడ చంద్రమౌళీశ్వరాలయంలోని ఉత్తరభాగంలో- గోడపై ద్రావిడభాషలో- 'త్రైరాజ్య ఘటికామధ్యస్థ మూవాయిరవర్‌'- అని మూడువేల మంది ఘటికలో ఉన్నట్లు వ్రాయబడింది. మరికొన్నిచోట్ల 'ఘటికై ఏళా ఇరవర్‌'- ఘటికాసహస్రము అని ఉన్నది. అరవములో 'ఆయిరం' అనగా వేయి అని అర్ధం. ఇలా ఒక్కొక్క ఘటికయందు వేలకొలది జనం అధ్యయనం చేస్తూ ఉండేవారని తెలుస్తూ ఉన్నది. ఇది కేవలం సాంప్రదాయంగా చెప్పుకునే మాటకాదు. వేదపురీశ్వరాలయంలోని రాజేంద్రచోళుని కాలపు శాసనము వలన (క్రీ.శ. 1021) తంజావూరులో వెప్పతూరు అనేచోట 'సోమయాజులు, భట్టరులు' అచ్చటి ఘటికలో అధ్యయనం చేసేవారని తెలుస్తూ ఉన్నది.

అయితే ఈ విద్యాస్థానాలను 'ఘటికలు' అని ఎందులకు పేర్కొన్నారో పరిశీలింపవలసి ఉన్నది.

పూర్వమీమాంసకు కుమారిలభట్టు వ్రాసిన తంత్ర వార్తికములో- 'అనయోగేషు వేదానాం ఘటికామాత్ర వృత్తిషు, న కల్పసూత్రహీనానాం లభ్యతే కృత్స్నవేదతా' (1-3-6) దీనిని వివరిస్తూ భట్టసోమేశ్వరులు ఈక్రింది విధంగా వ్రాశారు.

''వేదకౌశల జిజ్ఞాసార్ధం తత్తద్‌ వేదభాగ చిహ్న లేఖాయాని ఘటికాయాం కుంభకాయాం నిక్షిప్య తత్తద్వేద భాగ పరీక్షాకాలే తాన్యాకృష్య అకృష్టలేఖాచిహ్నితం వేదపాఠం పఠ ఇత్యధ్యేతారః అనుయుజ్యన్తే ఇతి ఘటికా మార్గవర్తినో అనుయోగః.''

అనగా- ''వేదంలో ఒక్కొక్క భాగమునుండి ఒక్కొక్క పదమో వాక్యమో ఒక కాగితముమీద వ్రాసి అట్టి కాగితములను ఆ వేదమునకై నిర్ణయించిన ఘటికలలో- కుంభములలో పడవైచి, విద్యార్థుల అధ్యయన ప్రావీణ్యతను పరీక్షించుటకై ఆ కాగితములలో ఒకదానిని తీసి అందలి పదవాక్యములాధారముగా ఆ వేదభాగము తడుముకొనకుండ అప్పగించుమని ఆదేశించేవారట!''

ఇందువలన 'ఘటము' లేక 'ఘటికల'లో పడవేసిన వేదభాగ చిహ్నితములైన లేఖలద్వారా విద్యార్ధులను పరీక్షించే విద్యాస్థానములను 'ఘటికాస్థానములు' అని పిలిచేవారని తెలియుచున్నది. శాసనాలలో కనిపించే 'ఘటిక' అనే పదమును తంత్రవార్తికములోని 'ఘటికాస్థానము' అనే పదమును జోడిస్తే కాని వీని వివరం తెలియలేదు. 'సశిఖరం పవనం కృత్వా బహిస్సూత్రం త్యజే ద్బుధః' అన్నది అథర్వణవేదములో ఉన్నది. అందులకే కల్పసూత్రకారుడు ఘటికాస్థానాలలో అధ్యయనము చేయబడే అధర్వణంలో ఈ విషయం ఉన్నది. మీరు వినలేదా? అని ప్రశ్నిస్తూ ఉన్నాడు.

ఇంతేకాక 'ఘటికలు' అనేపేరు లేకపోయినా అథర్వణ వేదము అధ్యయనము చేయబడే ఇతర విద్యాస్థానాలుకూడా దక్షిణదేశంలో ఉండేవి. కడలూరుకు పుదుచ్చేరికి మధ్య 'బాహూరు' అనేచోట క్రీ.శ. 868 దాపున అట్టి విద్యాస్థానం ఒకటి ఉండేదని, విజయనృపతుంగుని మంత్రి ఈ బాహురుతో మూడుగ్రామాలు అవిద్యాస్థానానికి దానం ఇచ్చినాడని శాసనంవల్ల తెలుస్తూఉన్నది. ఈ విద్యాస్థానంలో చతుర్దశవిద్యలు అనగా వేదములునాలుగు, వేదాంగములారు, పురాణము, మీమాంస, న్యాయధర్మ శాస్త్రములు నేర్పేవారట.

తిండివనమునకు విల్లుపురమునకు మధ్య 'రాజరాజచతుర్వేది మంగళం' (ఎన్నాయిరం) అనేచోట 340 మంది విద్యార్ధులు 14 మంది అధ్యాపకులు ఉండేవారు. క్రింది తరగతిలో 270 మంది విద్యార్ధులు, పై తరగతిలో 70 మంది విద్యార్ధులు చదువుతూ ఉండేవారు. వీరిలో క్రింది తరగతిలోని వారిలో 75మంది ఋగ్వేదము, 75 మంది యజుర్వేదము, 20మంది ఛాందోగ్యసామము, 20 మంది తలవకారసామము, 20మంది వాజసనేయము, 10మంది అధర్వము, 10మంది బోధాయన గృహ్యకల్పము, 40 మంది రూపావతారము (వ్యాకరణము) చదివేవారట. పై తరగతిలో 25మంది వ్యాకరణము, 35 మంది ప్రభాకర మీమాంస, వేదాంతము 10మంది అభ్యసించేవారట. ఈ ఎన్నాయిరమునకు చేరిన మరియొక శాసనములో 506 మంది బ్రాహ్మణులకు భోజనవసతులు కల్పించినట్లు, వారిలో వైదికులు, శ్రీవైష్ణవులు, ఇతరులు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది.

బాహూరుకు సమీపంలోనే 'త్రిభువనం' అనేచోట వేరొక విద్యాస్థానం ఉండేది. ఈ విషయం వరదరాజపెరుమాళ్ళ ఆలయశాసనాలద్వారా తెలుస్తూఉన్నది. ఈ శాసనాలకాలం క్రీ.శ. 1048 అని తేల్చినారు. (రాజాధిరాజు క్రీ.శ. 1018-1050) ఈ శాసనాల మూలముగా ఋగ్వేదమునకు ముగ్గురు, యజుర్వేదమునకు ముగ్గురు, ఛాందోగ్యసామము, తలవకారసామము, అపూర్వము, వాజసనేయము, బోధాయనము, సత్యాషాఢము వీనికి ఒక్కొక్కరు, మొత్తము పండ్రెండుగురు అధ్యాపకులు ఉండేవారట. వీరితోబాటు ప్రత్యేకము ''వేదాంతము, వ్యాకరణము, మహాభారతము, రామాయణము, మనుధర్మశాస్త్రము, వైఖానసము'' వీనిని చెప్పుటకు ఒక్కొక్క అధ్యాపకుడు ఉండేవాడట. ఋగ్వేదము చదువు విద్యార్ధులు 60 మంది, యజుర్వేదము చదువువారు 60 మంది, ఛాందోగ్యసామము చదువువారు 20 మంది, ఇతర శాస్త్రములు చదువువారు 50 మంది, మొత్తము 190 మంది విద్యార్ధులు ఉండేవారట. 70 మంది వేదాంతము, వ్యాకరణము- రూపావతారము చదివేవారట. ఈ విద్యాస్థానములలో విద్యార్థులకుగాని, అధ్యాపకులకుగాని విద్యతప్ప ఇతర వ్యాసంగము ఏదీ ఉండరాదని ఒక (గమనించదగినది) నియమం ఉండేది.

పదకొండవ శతాబ్దానికి చెందిన వీరరాజేంద్రదేవుని కాలపు శిలాశాసనం (క్రీ.శ. 1067) పాలార్‌ నదీతీరములో తిరుముక్కూడల్‌ అనే గ్రామములోని విష్ణ్వాలయంలో ఉన్నది. ఈ ఆలయానికి వచ్చే ఆదాయముద్వారా ఒక చికిత్సాలయము, ఒక విద్యాస్థానము నడుపబడేవి. ఈ విద్యాస్థానములో ఋగ్వేదము, యజుర్వేదము, వ్యాకరణము, రూపావతారము బోధించేవారు. అరవైమందిలో పదిమంది ఋగ్వేదము, పదిమంది యజుర్వేదము, ఇరవైమంది వ్యాకరణము, పదిమంది 'సహాపంచరాత్రము' చదువుకొనేవారు.వీరితోబాటు ముగ్గురు శైవబ్రాహ్మణులు, ఏడుగురు వైఖానసబ్రాహ్మణులు, ఇతరులు ఇద్దరు ఉండేవారట.

పైన చెప్పిన శాసనాలవలన దక్షిణదేశంలో అథర్వణ వేదం అధ్యయనం చేయబడుతూ ఉండేదని తేటతెల్లం అవుతూ ఉన్నది. ఎన్నాయిరం అనే ఊరికి సమీపంలో ఉన్న 'సనైయావరం' అనే చోటగల శాసనంవల్ల ఏబదిమంది బ్రాహ్మణులకు, పదిమంది శివయోగులకు అన్నవసతి కల్పించినట్లు తెలుస్తూఉన్నది. బ్రాహ్మణులతోబాటు శ్రీవైష్ణవులను శివయోగులను ఈ శాసనాలు పేర్కొనుట గమనించదగినది.ఈ రోజులలో విష్ణ్వాలయాలలో ఏదో ప్రసాదం ఇవ్వడం తప్ప శ్రీవైష్ణవులకు ప్రత్యేకములైన అన్నవసతు లేవీ ఉండుటలేదు. కేరళ##దేశంలో ప్రత్యేకంగా 'అగ్రములు' అని బ్రాహ్మణులకు ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ ఆచారం దక్షిణదేశం నుండే కేరళ##దేశానికి వెళ్ళివుండాలి. విష్ణ్వాలయాలలో శివాగమాలు, పాంచరాత్రాలయములలో వైఖానసాగమములు చదివేవాడుక ఉండేది.

పైన చెప్పినది పరిశీలిస్తే దక్షిణదేశంలో వున్న ఘటికాస్థానాలు, అత్యుత్తమ విశ్వ విద్యాలయాలని,ఆయా ఘటికలలో వేదాధ్యయనమే కాక- స్మృతి,పురాణ, మీమాంసా,వ్యాకరణ శాస్త్రాలు నేర్పేవారని తేలుతుంది. కాని ప్రస్తుతం మనం ఘటికాస్థానం అంటే అర్ధం కూడ తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇవన్నీ కొన్ని శతాబ్దాలకు వెనుకనే విస్మృతం అయినందువలన ఘటికాస్థానాలంటేనే దురవగాహమయ్యే స్థితి యేర్పడింది.

ఏడవ శతాబ్దమునకు చెందిన శివభక్తుడైన అప్పరు, కంచిని- 'కలనియల్‌ కరై ఇల్లార్‌ కాచ్చిమానాగర్‌'- అని వర్ణించాడు. కాంచీనగరంలో విద్యకు అవధులు లేవట. తొమ్మిదవ శతాబ్దమునకు చెందిన సుందరులు జగన్మాత కంచి కామకోటి కామాక్షిని- 'కాచ్చి ముదూర్‌ కామకోటమ్‌' అని ప్రశంసించారు. 1965 ఫిబ్రవరి 24 నుండి 29 వరకు మద్రాసులో జరిగిన అఖిలభారత వైదిక సమ్మేళనంలో ఇతరులతోపాటు తలవరశాఖను అధర్వణవేదమును అధ్యయనం చేసినవారుకూడ పాల్గొన్నారు. శ్రీ ఎస్‌.కె. చటర్జీగారు అధ్యక్షత వహించిన సంస్కృత కమీషనుయొక్క సలహాలను భారతప్రభుత్వం అంగీకరించింది. వేదములలో వుండవలసిన 1131 శాఖలలో పదిమాత్రమే మిగిలి వున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఈ మిగిలిన శాఖలనైనా జారవిడుచుకోక రక్షించుకొనవలసిన బాధ్యత భారతప్రభుత్వం మీద, ఆస్తికవర్గం మీద ఉన్నది. ఆ కర్తవ్యం విస్మరించక అనుసరిస్తే సనాతని అయిన వేదమాత శ్రుతిరూపంలో మానవానీకానికి మార్గదర్శియై మనజాతిని చైతన్యవంతం చేస్తుందనుటలో సందేహంలేదు.

Maa Swami    Chapters