Maa Swami    Chapters   

 

4.వేదవేత్తలు ఈశ్వరస్వరూపులు

''ఈశ్వరుడు వేదస్వరూపుడు. యజ్ఞం త్రివేదీరూపం త్రివేదీరూపమైన యజ్ఞానికి ఈశ్వరుడు నేత్రంవంటివాడు యజ్ఞఫలం ప్రజాశేయస్సు, యజ్ఞఫలదాత ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరునికి నమస్కరిద్దాం'' అని నాల్గవ అఖిలభారతసర్వశాఖావేద సమ్మేళనాన్ని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు.

కొన్ని మంత్రములతోకూడినవి వేదములు. ఈ మంత్రాక్షరముల ఉచ్చారణవల్ల, మంత్రాధిష్టానములైన దేవతలను ధ్యానించటంవల్ల కలిగే ప్రభావాన్ని భవుతిక ప్రయోజనానికి ఆధ్యాత్మిక ఉన్నతికీ కూడ వినియోగించుకోవచ్చు. అందువల్ల మంత్రార్ధము తెలిసి, తెలియకపోయినా వేదపారాయణవల్ల వ్యక్తికేకాక ప్రపంచానికే శుభం కలుగుతుంది. మంత్రార్ధంతెలిసి పారాయణచేస్తే అది మరీ శక్తివంతమైన ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. మహాఋషులచే సంరక్షింపబడిన వేదాలు గురుశిష్యపరంగా సాంప్రదాయంగా తరతరాలుగా అందజేయబడి నేటికి నామమాత్రంగానైనా నిలిచివున్నాయి.

అనేకమంది త్యాగంచేసి వేదాలను తమ పవిత్ర స్వరూపంలో సంరక్షించినారు. వేదాధ్యయనం చేస్తూ, యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ, వేదమాతను ఆరాధిస్తూ ప్రపంచ సౌభాగ్యానికి దోహదం చేశారు.

ద్వాపరయుగాంతములో వేదవ్యాసమహార్షి వేదమును నాలుగు విభాగాలుగా వివిధ శాఖలుగా విభజించి నలుగురు ఋషులు సుమంతు, వైశంపాయన, జైమిని, వైల అనువారికి నిర్వహణాధికారం యిచ్చారు అని ప్రతీతి. అప్పటికి 1131 శాఖలు ఉన్నాయని, సాంప్రదాయజ్ఞుల ద్వారా తెలుస్తోంది. ఈ 1131 శాఖలలో, 21 ఋగ్వేదశాఖలు, 101 యజుర్వేదశాఖలు, 1000 సామవేదశాఖలు, 9 అధర్వణ వేదశాఖలు వున్నాయట.

అయితే గత 100 సంవత్సరాలుగా వేదేతరమైన విద్య మాత్రమే ప్రజలకు అన్నవస్త్రాల ప్రసాదించగలదని వేదవిద్యకు నిలయాలైన కుటుంబాలలోనే ప్రచారం అయింది. దాని ఫలితంగా వేదాధ్యయనం చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. తఱచు అనేక అనుష్ఠానాలకు అవసరమవుతున్న పురోహితుల సంఖ్యకూడా సన్నగిల్లుతోంది.

ఇప్పుడు ఆ 1131 శాఖలలో 10 శాఖలుకూడా వుండటం అరుదై పోయింది. వేదాధ్యాపకులు, విద్యార్ధుల సంఖ్య వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. వారికి సంఘములో తగిన గౌరవం, పోషణ లేకపోతోంది. వారికి ఆర్ధిక భవిష్యత్తు శూన్యమైంది.

ఇప్పటికి మూడు అఖిలభారతసమ్మేళనాలు జరిగాయి. 1962లో ఢిల్లీలో, 1965లో మద్రాసులో, 1966లో తిరుపతిలో జరిగాయి. వాటిద్వారా తెలియవచ్చిందేమంటే, ప్రస్తుత భారతదేశంలో వేదాధ్యయనం చేసే విద్యార్ధులు 850 మంది మాత్రమే వున్నారు. వేదాధ్యయనం నిర్వహించే కేంద్రాలు దేశంలో 128 మాత్రమే. మద్రాసు రాష్ట్రంలో నిర్వహింపబడే 45 పాఠశాలల్లో 305 మంది విద్యార్ధులున్నారు. ఆంధ్రలో 99 మంది మాత్రమే విద్యార్ధులు వేదాధ్యయనం చేస్తున్నారు.

అందువల్ల ఇప్పుడున్న వేదాలనన్నిటిని సంరక్షించుకొనే వేదాధ్యయనపరులకు సంఘములో గౌరవం, పోషణ కల్పించే ఆశీర్వాదాన్ని పొందటానికి యిటువంటి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది అని ఈ సందర్భంలో నివేదింపబడినది. కృష్ణపుష్కర సందర్భంలో నాలుగు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనంవల్ల పరమప్రయోజనం లభించగలదని ఆశిస్తున్నారు.

శ్రీ స్వామివారు సభకు ఆశీర్వచనం చేశారు. స్వామివారు మూడుశ్లాకాలు చదివి వాటిని సంస్కృతంలో వ్యాఖ్యానం చేశారు.

''విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేదీ యజ్ఞచక్షుషే,

శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమస్సోమార్ధ ధారిణ''

అని ఈశ్వరుని ధ్యానించి,

''షడ్భిరంగై రుపేతాయ వివిధై రవ్యయైరపి,

శాశ్వతాయ నమస్తుభ్యం వేదాయ చ భవాయచ''

అని వేదస్వరూపులగు పండితులకు నమస్కరించి-

''త్యక్తవ్యో మమకారః బ్రహ్మణ యది నశక్యత్త్యక్తుం,

కర్తవ్యో మమ కారః కిం తు న సర్వత్ర కర్తవ్యం.''

శ్రీ స్వామివారు తమ వ్యాఖ్యానంలో- త్రివేదస్వరూపమైనది యజ్ఞం. మూడువేదములు అనేకాక యజ్ఞానికి మూడు వేదులుంటాయి కనుక, యజ్ఞం త్రివేద స్వరూపమైనది. అటువంటి యజ్ఞానికి విశుద్ధజ్ఞాన దేహుడైన ఈశ్వరుడు నేత్రం వంటివాడు. సకల శ్రేయః ప్రాప్తికొరకు సోమార్ధిధారి అయిన పరమేశ్వరునికి ముందుగా నమస్కరిద్దాం. సోమార్ధధారిణ అంటే యజ్ఞములో సోమలత ఫలరూపం. సోమం అనగా చంద్రకళావతంసుడు ఈశ్వరుడు అని అర్ధం. సామూహిక స్వరూపమైనది యజ్ఞం. ఈ యజ్ఞాన్ని శ్రేయస్సుకొరకు నిర్వహిస్తున్నాం.అయితే ఎవరి శ్రేయస్సు? యజ్ఞం నిర్వహించే యజమాని శ్రేయస్సేకాదు. సకల ప్రాణికోటికి శ్రేయస్సు కాంక్షించే యజ్ఞం నిర్వహింపబడుతుంది.

''పరస్పరం భావయన్తః'' అన్నట్లు మనంచేసే యజ్ఞయాగాదులద్వారా దేవతలను సంభావిస్తున్నాం. ఆ దేవతలు మనకు శుభాలను ప్రసాదిస్తారు. కాబట్టి మనం చేసే సార్వజనీన ప్రతినిధిరూమైన యజ్ఞం సకలజనులకు సమస్తప్రాణికోటికి శుభం చేకూర్చగలదు అని స్వామివారు స్పష్టం చేశారు.

ఈశ్వరుడు వేదస్వరూపుడు. కుమారిలభట్టు సుబ్రహ్మణ్యస్వరూపం. ఈయన కుమారస్వామి అవతారం. ఈశ్వరుడు వేద స్వరూపుడు. ఈశ్వరుని కుమారుడు వేదాలను ఉద్ధరించాడు. శంకర భగవత్పాదుల తాత్పర్యాన్ని వివరించిన వారిలో నాఢీభూతులైన వారు ''భామతీ'' కారులు.

రెండవ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రీ స్వామివారు ''ఈశ్వరుడున్నంతవరకు వేదములుంటవి. వేదములకు, పరమేశ్వరునకు పరస్పర శాశ్వత సంబంధముంది. ఈశ్వరుడు ఆరు అంగములతో కూడిన వేదస్వరూపుడు. శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేవి ఈ ఆరు అంగాలు. అంతేకాక పరమేశ్వరుడు 10 అన్వయాలతో కూడినవాడు. ఆన్వయమనగా వ్యాకరణ సంబంధమైనది కాదు. శబ్దాలకు కాదు అన్వయం, గుణాలే అన్వయమైనవి.అన్వయాలు ఏవంటే జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, తపస్సు, సత్యం, క్షమ, ధృతి, స్రష్ఠుత్వం, ఆత్మసంబోధం, అధిష్ఠాతృత్వం అనునవి. ఈ 10 అన్వయాలు ఈశ్వరునకు నిత్యం ఉంటాయి. ఈ ఈశ్వరుని నిశ్వాసస్వరూపములే వేదములు. అట్టి వేదస్వరూపులే పండితులైన మీరందరు, వేదములే మీనిశ్వాస రూపం పొందినవి. మీరెల్లరు పరమేశ్వరుని స్వరూపులు. కనుక మీవల్ల దేశానికి శుభం కలగాలి. త్యాగంచేతనే అమృతత్వం లభిస్తుంది, అని వివరించారు.

మూడవశ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రీ స్వామివారు ''మమకారాన్ని విడిచిపెట్టాలి. '' ఒకవేళ మమకారాన్ని విడిచిపెట్టడం సాధ్యం కాకపోతే దాన్ని ఆచరించవలసిందే. అయితే ఆ మమకారాన్ని కేవలం మనము మనకుటుంబంవరకే పరిమితం చేయక సమాజపరం చేయాలి. సమిష్టి మమకారంగా పరిణామం పొందాలి; సర్వం పరబ్రహ్మ స్వరూపం కనుక సమిష్టిరూపమైన మమకారం పరమేశ్వర అనుగ్రహానికి ప్రాప్తం కాగలదు.

Maa Swami    Chapters