Maa Swami    Chapters   

2.కంచి - కామకోటి పీఠం

మోక్షదాయకములైన క్షేత్రములు ఏడు-

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వార వతీ చైవ సపై#్తతే మోక్ష దాయికాః

అవంతిక అనగా ఉజ్జయిని. అందు మహా కాళేశ్వరుడున్నాడు. కాశిలో విశ్వనాథుడు. ఇవి రెండు శివ క్షేత్రాలు. అయోధ్యా, మధుర, మాయద్వారక, కాంచి తక్కినవి. అయోధ్య, మధుర, ద్వారకవిష్ణు క్షేత్రములు. మాయ (హరిచాపము), కంచి, శక్తి క్షేత్రములు.

'నారీషురంభానగరేషు కాంచీ' అన్న నానుడికి పాత్రమైన నరగం కంచి. ఇది శ్రీచక్రాకృతిని పోలిన పట్టణం. కాంచీనగరమే శ్రీచక్రమైతే, బిందు స్థానములో కూర్చున్నది కామాక్షి. ఆమె బ్రహ్మవిద్యా స్వరూపిణి. కామదుఘ, కామకేళీ, కామకోటి కామాక్షి అని ఆమె కీర్తింపబడినది.

ఈ అనాదిసిద్ధమైన క్షేత్రంలో శ్రీ శంకర భగవత్పాదులవారు ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి, వైదిక ధర్మాన్నీ అద్వైత సిద్ధాంతాన్నీ ప్రతిష్ఠించి, కైలాసంనుంచి తెచ్చిన పంచస్ఫటికలింగములలో ఒక్కటైన యోగలింగమును శ్రీ మేరువును శారదామఠమున ఉంచి అర్చిస్తూ శిష్య పరంపరతో ఇక్కడ వాసంచేస్తూ ఆమోక్ష పురిలోనే కామాక్షీ ఆలయంలో విదేహ ముక్తి నందినారు.

ఈ విషయాన్ని కేరళీయ శంకరవిజయం ఇలా గ్రంధస్థం చేసింది.

ఇతి నిశ్చిత్య మనసా శ్రీమాన్‌ శంకర దేశికః

మఠేశ్రీ శారదాభిఖ్యే సర్వజ్ఞం న్యనధాన్మునిం

సురేశ్వరం వృత్తికృతిం అంతికస్థం సదాదరాత్‌

సమం సంస్థాప్య తసై#్మస్వం వక్తుం భాష్యం సమన్వశాత్‌

స్వశిష్య పారంపర్యేణ లింగం స్వం యోగనామకం

సేవయేనం కామకోటిపీఠే సార్ధం వసేతిచ

కామాక్షీ నికటేజాతు సన్నివిశ్వ జగద్గురుః

దేహేభిర్దు ర్భజం భేజౌ దేహం తత్రైవ సంత్యజన్‌

అఖండ జ్యోతిరానందం అక్షరం పరమంపదం

సఏవ శంకరాచార్యో గురుర్ముక్తి ప్రదస్యతాం||

బృహచ్ఛంకరవిజయంలో చిత్సుఖాచార్యులు,

వాణీంవిజిత్యచ వియద్విశ దాభ##దేహం

సర్వజ్ఞపీఠమధిరుహ్యచ తత్రకాంచ్యాం

విద్వ ద్వరార్చిత పదో యతి సార్వభౌమౌ

దేవ్యాఃపురే పరతరే పురుషే విలిల్యే

అని వ్రాయగా, ప్రాచీన శంకర విజయం-

సర్వజ్ఞ పీఠమధి రుహ్య తదస్తదగ్రే

మిశ్రాన్‌ విజిత్య సహనోప నతాన్‌ ప్రయోగాత్‌

అధ్యాస్త కాంచిమభిమండిత కామకోటి

పీఠో నిజ మవాప్య స శారదా ఖ్యామ్‌-

అని చెప్పుచున్నది.

ఇంతేకాదు. రాజచూడామణి మఖి తన శంకరాభ్యుదయ కావ్యంలో-

కంపాతీర నివాసినీ మనుదినం కామేశ్వరీ మర్చయన్‌

బ్రహ్మానందమవింద తత్రిజగతాంక్షేమంకరశ్శంకరః

అని ఉద్ఘాటించారు.

ఇట్లు భగవత్పాదుల వారు స్థాపించిన కామకోటిపీఠం తదామ్నాయశక్తి కామాక్షి- వరదరాజు, ఏకామ్రేశ్వరుడు విరాజిల్లే మోక్షపురి కాంచీనగరం. ఇక్కడ ఒక్కరోజు వాసంచేసినా చాలు. నరుడు ముక్తి భాజుడౌతాడు. కంచి కలుషశోధిని. పాపనాశిని. ముక్తి ప్రదాయిని.

ఇక్షుకోదండ పుష్పేషుపాశాంకుశకరోజ్వలాం

ఉద్యత్సూర్యనిభాం వందే మహాత్రిపురసుందరీం.

అందరికీ, దరీ, దారీ చూపే సుందరి త్రిపురసుందరి, లలితా పరా భట్టారిక- కామాక్షి.

ఆమెను-

శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా

సుమేరు శృంగమధ్యస్థా శ్రీమన్నగరనాయికా

చింతామణి గృహాం తస్థా పంచబ్రహ్మాసనస్థితా

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ

సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామ దాయినీ

ఓడ్యానపీఠనిలయా బిందుమండల వాసినీ

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణీ

శ్రీచక్ర రాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ

అని లలితా సహస్ర నామములు కీర్తిస్తున్నవి.

'కామకోటి నిలయాయైనమః' అని లలితాత్రిశతి,

కామకోటి మహాపీఠ మధ్యస్థాయై నమః అని

లలితా అష్టోత్తరశతనామావళి పేర్కొన్నవి. అట్టి త్రిపురసుందరి వెలసిన శివ జిత్‌క్షేత్రం కంచి.

శివుడు తన చిచ్చఱకన్నుతో చూచిన కారణంగా పంచశరుడైన మన్మథుడు అనంగుడై పోయాడు. ప్రత్యక్ష అంగాభిలాషియై అతడు కామకోష్టమునకు వెళ్ళి కామాక్షినుద్దేశించి దుష్కరమైన తపస్సులో మునిగిపోయాడు. కామాక్షి అతని తపస్సుకు తుష్టి చెందింది. ప్రసన్నురాలైనది. కటాక్ష వ్యాక్షేప మాత్రమున కామునికి దివ్యాంగమును ప్రసాదించింది. ఆమె అనుగ్రహ స్రవంతి అంతటితో ఆగలేదు. శివుని జయించే శక్తికూడ అతనికి కామాక్షి ప్రసాదించినది.

ఇతర శివక్షేత్రములలోని శక్తులనన్నిటినీ కంచికామాక్షి ఆలయములోని బిలాకాశములోనికి ఆకర్షించివేసినది. బ్రహ్మ కైలాసం వెళ్ళగా అక్కడ శక్తిసాన్నిధ్యంలేదు. భూమండలంలో ఏ శివాలయానికి వెళ్ళినా శక్తిలేని శివుడే కనుపించినాడు. జ్ఞానదృష్టిచేత చతురుడైన చతురాననుడు ఇదంతా కామాక్షీ చిత్రమని గ్రహించినాడు.

ఆ ఆ ఆలయములలో దేవీసాన్నిధ్యం లేకపోతే ఎట్లు? అతడు కంచికి వెళ్ళి పండ్రెండు ఏళ్ళు ఉగ్రమైన తపస్సు చేసినాడు. భక్తకామదయైన కామాక్షి ప్రసన్నమై- ఇకమీదట- శివజిత్‌క్షేత్రమైన ఈ క్షేత్రములో తప్ప- మిగత అన్ని క్షేత్రములలోనూ నా సాన్నిధ్యముంటుంది- అని అనుగ్రహించింది.

బిలాకాశములలో శక్త్యాకర్షణ చేసినందువల్ల కంచిలోమాత్రం శివాలయములో ప్రత్యేకమైన దేవీ సన్నిధి లేకపోయింది.

కకారమనగా బ్రహ్మ. అందులోని అకారము విష్ణువు. మకారము రుద్రుడు. కాముడు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర మూర్తిత్రయ సమిష్టిరూపము. యుగయుగములోనూ ఈ మూడు మూర్తులు కోటిమారులు, ఏ బిలాకాశమునుంచీ ఉద్భవిస్తూ ఉంటారో ఆ చిదాకాశ##మే కామకోటి; కామాక్షి. పరబ్రహ్మమహిషి-

ఆమె క్షేత్రమే కంచి.

పంచభూత క్షేత్రములని ప్రసిద్ధిచెందిన క్షేత్రములు ఐదున్నవి. అందు ఆకాశ##క్షేత్రం చిదంబరం. అట్లే పంచభూతములకూ శక్తిపీఠములున్నవి. అందు ఆకాశశక్తి పీఠమని ప్రఖ్యాతి చెందినదే కంచి. చిదంబరములో ఆకాశము కనక సభయందు మాత్రము కలదు. కాని కంచి మొత్తమూ ఆకాశ##క్షేత్రమే.

కాశీక్షేత్రంలో స్పర్శదోషంలేదు; కంచిలోనూ లేదు.

అగ్నిమధ్యగతం వస్తు తన్మయం స్యాద్యధాక్షణాత్‌

ఏవం కాంచీం ప్రలిష్టాయే మన్మయాస్స్యుర్న సంశయః

తస్మాదత్ర నృణాం సంఘే శ్వపచానా నాన్న సూతకమ్‌

చండాలానా మపిహరేః స్పృష్ట్వా కాంచ్యాన్నసూతకమ్‌.

(44.10-11. కాంచీ మహాత్మం)

శ్రేష్ఠములైన పదునెనిమిది శక్తిపీఠములలో మూడు ముఖ్యమైనవి.

పంజాబులో జలంధర్‌లో జ్వాలాముఖీపీఠం. అస్సాంలో కామరూప పీఠం. కంచిలో కామరాజపీఠం. జ్వాలాముఖిలో భృగుమహర్షి అర్చించినాడు. కామరూపంలో వ్యాసులవారు. కామకోటి హయగ్రీవార్చితం.

నాస్తికాంచీ సమక్షేత్రం సర్వసిద్ధి ప్రదంభువి

సర్వతీర్ధ సమంతీర్ధం నాస్తి పావనిబర్హణమ్‌.

(కా.మా. 50 అధ్యాయం)

కాంచ్యాం సంచరణాన్ముక్తిః

కామాక్షీ సదృశాదేవీ నాస్తి మంగళ##దేవతా-

మోక్షమనే ఏకామ్రఫలం- ఇచ్చేదాత ఏకామ్రనాధుడు!

కామాక్షీకుచ కుంభ చూచుక కనచ్ఛ్రీకంకణాంకోజ్వలో

భక్తానేక మనోరధారమణి భిర్లోకైక రక్షామణిః

సేవా నమ్ర రమేశముఖ్య దివషత్కోటీర రత్నప్రభా

ప్రాగ్భారాంచిత చూతమూల వసతిః పాయా దపాయాచ్చివః

కామాక్షిని మూకకవి, ఆదిమపురుషస్యనయన పీయూషమని వర్ణించినాడు.

కంచిలో నయనపీయూషమూర్తి మరొక్కటున్నది. ఆ మూర్తి ఆధ్యాత్మిక ఆధి భౌతిక ఆది దైవిక . తాపత్రయములను పోగొట్టే అవ్యాజకరుణామూర్తి కామకోటి పీఠాధిపులు శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వాములవారు.

అందరూ ఆయనను మాస్వామి అని వ్యవహరిస్తారు. అందరికీ ఆయన స్వంతమే. సర్వతంత్రస్వతంత్రుడు. కాని భక్తుల గాఢప్రేమవల్లరిలో చిక్కుకున్న అస్వతంత్రుడు. ఆయన చరిత్రయే 'మాస్వామి'.

Maa Swami    Chapters