Maa Swami    Chapters   

17. కామకోటి ఆచార్యపరంపర

కామకోటిపీఠ ప్రతిష్ఠాపనం నుంచీ నేటివరకూ వచ్చిన ఆచార్యపాదులను గూర్చి తెలుసుకొందాము.

1. ఆదిశంకరులు బి.సి. 482 - 476

2. సురేశ్వరాచార్యులు బి.సి. 476 - 406

3. సర్వజ్ఞాత్మ బి.సి. 406 - 364

వీరి పూర్వాశ్రమంలోని పేరే మహాదేవ. వర్ధనుడు తండ్రిపేరు.చాల చిన్నతనంలోనే సన్యాసదీక్ష తీసుకున్నారు. సురేశ్వరులవర్ధ అధ్యయనం చేశారు. సంక్షేప శారీరకమనే గ్రంధమును వ్రాసారు. కంచిలో నళ సంవత్సరం వైశాఖ బహుళ చతుర్ధశి సిద్ధి పొందారు.

4. సత్యబోధ బి.సి. 364 - 268 : వీరు ద్రావిడులు. చేరదేశంలో అమరావతీ తీరంలో జననం. వీరి రచన పదకశతకం. ఇది జైన బౌద్ధమత ఖండన చేసిన కావ్యం. అద్వైత ప్రతిపాదకము. వీరు కంచిలోనే వైశాఖ బహుళ అష్టమినాడు సిద్ధి పొందారు.

5. జ్ఞానానందులు బి.సి. 268 - 205 : తండ్రిపేరు నాగేశుడు. ద్రావిడ బ్రాహ్మణులు. పూర్వాశ్రమ నామం జ్ఞానోత్తముడు. చోళమండలములో మంగళమనే గ్రామంలోనివారు. సుర్వేశ్వరుల నైష్కర్మ్యసిద్ధికి చంద్రిక అనే వివరణ వ్రాసారు. మన్మధ వర్షము మార్గశీర్ష శుక్ల సప్తమినాడు కంచిలో సిద్ధి పొందారు.

6. శుద్ధానందులు బి.సి. 205 124 : వీరు ద్రావిడులు. పూర్వాశ్రమ నామం విశ్వనాథుడు. అవతరణ వేదారణ్యం. కంచిలో నళసంవత్సరం జ్యేష్టశుద్ధ షష్ఠినాడు సిద్ధి పొందారు.

7. అనుతానందులు బి.సి. 124 - 55 : వీరి ఆంధ్రులు. పూర్వాశ్రమ నామం చిన్నయ్య. బేరనాటికి చేరినవారు. శంకరభాష్యములకు, సురేశ్వరుల వార్తికమునకు ఈయన వ్యాఖ్యలు వ్రాసారు. శ్రీశైలంలో క్రోధన వైశాఖకృష్ణ నవమి సిద్ధి పొందారు.

8. కైవల్యానందులు బి.సి. 55 - 28 ఎ.డి. : పూర్వాశ్రమ నామం మంకన్న. తిరుపతిలో జననం. ఆంధ్రులు. కైవల్యయోగి యని పలువురు వీరిని పిలుస్తూ వుండేవారు. సర్వధారి సంవత్సరం మకరమాసం ప్రతివత్‌నాడు పరమపదించారు. కంచిలో మండనమిశ్ర ఆగ్రహారంలో సిద్ధి.

9. కృపాశంకరులు ఆంధ్రులు. పూర్వాశ్వమ నామము గంగయ్య. వీరు షణ్మతస్థాపనాచార్యులు. తమ శిష్యులైన సుభట విశ్వరూపులను శృంగేరి ఆచార్యులుగా నియమించారు. మధుమాంస ద్రవ్యములతోచేయు తాంత్రికపూజను ఖండించి వైదిక సమయాచార విధులను వీరు నెలకొల్పారు. వింధ్య ప్రదేశాలలో విభవసంవత్సరం కార్తిక బహుళ తృతీయనాడు సిద్ధి పొందారు.

10. సురేశ్వరులు క్రీ.శ. 69 - 127 : మహారాష్ట్ర దేశంలో జననం. పూర్వాశ్రమ నామం మహేశ్వరుడు. తండ్రి ఈశ్వర పండితుడు. కాంచీ నగరంలో అక్షయ ఆషాఢ పూర్ణిమనాడు వీరు సిద్ధి పొందారు.

11. శివానందచిర్ఘనులు. క్రీశ. 127 -172 : వీరి పుట్టుక కర్ణాటక దేశం. పూర్వాశ్రమంలో వీరిని ఈశ్వరపటువు అని పిలిచేవారు. వీరు వృద్ధాచలంలో విరోధికృత్‌ వర్షము జ్యేష్టకృష్ణ దశమి సిద్ధి పొందారు.

12. చంద్రశేఖరులు. I క్రీ.శ. 172 - 235 : ద్రావిడ బ్రహ్మణులు. పూర్వాశ్వమ నామం హరి. పాలార్‌ నదీతీరంలో వాసం చేసేవారు. శేషాచలమనే పర్వతములోని ఒక గుహలో ఆనందసంవత్సరం ఆషాఢశుద్ధ నవమినాడు అదృశ్యులైపోయారు.

13. సచ్చిద్ఘనులు. క్రీ.శ. 235 - 272 : గడిలానదీతీరవాసి. ద్రావిడులు. పూర్వాశ్రమ నామధేయం శేషాద్యులు. వీరున్నూ తమ గురువులవలెనే శిష్యునకు పీఠం ఒప్పచెప్పి, మౌనిగ అవధూతగా కంచి పరిసరాలలో తిరిగేవారు. ఖర సంవత్సరం మార్గశిరశుద్ధ పాడ్యమినాడు కంచిలో ఒక ఆలయంలో శివలింగాకృతి నొందారు.ఈ ఆలయం ఈనాటికీ కాయారోహణాలయం అని ప్రసిద్ధిచెందియున్నది.

14. విద్యాఘనులు I క్రీ.శ. 272 - 317 : ఆంధ్రప్రదేశంలో వీరిని నాయన అని పిలిచేవారు. శ్రీ బాపన్న సోమయాజిగారు తండ్రి. మలయాచల ప్రాంతంలో ఒక భైరవమూర్తియొక్క ఉగ్రకళను శాంతింపజేసిరి. అగస్త్యపర్వతంలో ధాత సంవత్సరం మార్గశిర అమావాస్యనాడు సిద్ధి పొందారు.

15. గీష్పతి గంగాధులు. క్రీ.శ. 317 - 329 : వీరు ఆంధ్రులు. ఈయన తమ గురువు సంచరిస్తున్న మలయాచల ప్రాంతంలో సంచరిస్తూ అగస్త్యుల దర్శనముపొంది వారిచే పంచదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందారు. సర్వధారి చైత్రశుద్ధ ప్రధమనాడు అగస్త్యపర్వతంలోనే సమాధి చెందిరి.

16. ఉజ్వల శంకరులు. వీరిది తపతీనదీ తీరప్రాంత మహారాష్ట్ర దేశము. పూర్వాశ్రమ నామం అచ్యుతకేశవులు. వీరు దిగ్విజయయాత్ర చేశారు. జైనమతాన్ని ఖండించారు. కాశ్మీరంవెళ్ళి అక్షయవర్షం వైశాఖశుద్ధ అష్టమినాడు కళాపురిలో సిద్ధి పొందారు. ఆ ఊరిని ఉజ్జ్వల శంకరపురిని ఇపుడూ పిలుస్తారు.

17. గౌడసదాశివులు. క్రీ.శ. 367 - 375 : వీరిని బాలగురువులని పిలిచేవారు. వీరి తండ్రి దేవమిశ్ర. కాశ్మీరదేశపు రాజుకు మంత్రి. తండ్రి జైనుడు. కాని కొమరుడు బాల్యంలోనే ఉజ్జ్వల శంకరులకు శిష్యులయ్యారు. కాశ్మీరవాసులు ఈయనకొక బంగారు పల్లకినిచ్చారు. ఆ పల్లకిలో దిగ్విజయయాత్ర చేస్తూ సహస్ర బ్రాహ్మణ సంతర్పణ చేసేవారు. వీరు త్ర్యంబక క్షేత్రములకు వెళ్ళి అచట భవసంవత్సరం జ్యేష్టశుద్ధ దశమినాడు సిద్ధి పొందారు.

18. యోగతిలకసురులు. క్రీ.శ 375 - 385 : వీరిది మహారాష్ట్ర దేశం. పూర్వాశ్రమ నామం మహాదేవుడు. చార్వాకమతస్థుల నెదిరించి వాదములో గెలిచారు. తారణ మార్గశిర శుక్ల ప్రధమ దివసమున ఉజ్జయినిలో సిద్ధి పొందారు.

19. మార్తాండ విద్యాఘనులు క్రీ.శ. 385 - 398 : మహారాష్ట్రులు. పూర్వాశ్రమ నామం శ్రీకంఠుడు. వీరికి చర్మవ్యాధి ఉన్నందున ప్రతిదినమూ 1008 సూర్య నమస్కారములు చేసి వ్యాధి నివారణ చేసుకున్నారు. అందుచే వీరికి సూర్యదాస స్మామి అని కూడ పేరు. ఉత్తరదేశ యాత్రలుచేస్తూ గోదావరీ తీరంలో హేవిలంబి నామ సంవత్సరం భాద్రపద కృష్ణనవమి సిద్ధి పొందినారు.

20. మూక శంకరులు క్రీ.శ. 398 - 437 : జన్మతః వీరు మూగలు. విధ్మాఘనుల అనుగ్రహంచేత వీరికి వాక్శుద్ధి లభించినది. వీరు మూక పంచశతి ఏనే కామాక్షీదేవిపై ఒక మధురమైన స్త్రోత్రం, ప్రాచీన శంకరవిజయమూ వ్రాసారు. వారు గోదావరీ తీరంలో ధాత సంవత్సరం శ్రావణపూర్ణిమనాడు సిద్ధి పొందారు.

21. సార్వభౌమ చంద్రశేఖరులు. క్రీ.శ. 437 - 447 : వీరు కొంకణదేశపు వారు. మాతృగుప్తులని పూర్వాశ్రమనామం. కాశీలో శ్రావణకృష్ణాష్టమి వ్యయ సంవత్సరం సిద్ధి పొందారు.

22. పరిపూర్ణబోధులు. క్రీ.శ. 447 - 481 : వీరు మహారాష్ట్ర దేశంలో రత్నగిరిలో జన్మించారు. మంత్ర శాస్త్ర నిపుణులు. వైద్యశాస్త్ర నిష్ణాతులు. రౌద్రి సంవత్సరం కార్తికశుద్ద నవమినాడు జగన్నాధక్షేత్ర సమీపంలో సిద్ధి పొందారు.

23. సచ్చిత్సుఖులు. క్రీ.శ. 481 - 512 : వీరు ఆంధ్రులు. శ్రీకాకుళం వీరి గ్రామం. తండ్రిపేరు సోమనార్యుడు. నాస్తికుడైన ఆర్యభట్టును వాదంలో జయించి ఆస్తికునిగ చేశారు. జ్యోతిశ్శాస్త్రజ్ఞులు. వీరు ఖర సంవత్సరం వైశాఖశుద్ధ సప్తమినాడు జగన్నాధక్షేత్ర సమీపం లో సిద్ధి పొందారు.

24. చిత్సుఖులు. క్రీ.శ. 512 - 527 : కొంకణదేశ బ్రహ్మణుడు. పూర్వాశ్రమ నామము శివశర్మ. పరాభవ సంవత్సరం శ్రావణశుక్ల నవమినాడు రత్నగిరి సమీపంలో సిద్ధి పొందారు.

25. సచ్చితానంద ఘనులు. క్రీ.శ. 527 - 548 : భూవరాహక్షేత్రమైన శ్రీముష్ణంలో శివ శర్మ నామధేయులైన ద్రావిడులు. పలుమారులు విజయయాత్ర చేశారు. గోకర్ణక్షేత్రంలో ప్రభవ సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యమినాడు సిద్ధి పొందాడు.

మందభట్టు అనే కవి సిద్ధవిజయమనే కావ్యంలో వీరి చరితను గ్రంధస్థం చేశారు.

26. ప్రజ్ఞాన ఘనులు. క్రీ.శ. 548 - 564 : వీరి పుట్టుక పినాకినీ తీరంలో ఒక గ్రామం. పూర్వాశ్రమ నామం శోణగిరి. స్వభాను సంవత్సరం వైశాఖశుద్ధ అష్టమినాడు కంచిలో సిద్ధిపొందారు.

27. చిద్విలాసులు. క్రీ. శ. 564 - 577 : వీరి పుట్టుక వాస్తగిరి. ఆంధ్రులు. పూర్వాశ్రమ నామం హరికేశవులు. దుర్ముఖి సంవత్సరం సంవత్సరాదిలో కంచిలో సిద్ధి పొందారు.

28. మహాదేవులు I క్రీ.శ. 577 - 601 : వీరి జననం భద్రాచలం. వీరి పూర్వాశ్రమ నామం శేషనారాయణుడు. మైథిలీ బ్రాహ్మణులు. ఆంధ్రలోనికి వలస వచ్చినవారు. కంచిలో రౌద్రి సంవత్సరం అశ్వినికృష్ణ దశమినాడు సిద్ధి పొందారు.

29. పూర్ణబోధులు I క్రీ.శ. 601 - 618 : వీరు ఆంధ్రులు. పూర్వాశ్రమ నామం కృష్ణుడు. కంచిలో ఈశ్వర సంవత్సరం శ్రావణశుద్ధ దశమినాడు సిద్ధి పొందారు.

30. బోధేంద్రసరస్వతి. క్రీ.శ. 618 - 655 : వీరు ఆంధ్రులు. పూర్వాశ్రమ నామధేయము బాలయ్య. కాళహస్తి వీరి ఊరు. కంచిలో ఆనంద వైశాఖ కృష్ణచతుర్ధినాడు పరమపదించారు.

31. బ్రహ్మానంద ఘనులు. I క్రీ.శ. 655 - 668 : వీరి పుట్టుక గడిలం నదీతీరంలోని గ్రామం. పూర్వాశ్రమ నామం శీలనిధి. షద్దర్శన పారంగతులు. కాశ్మీర ప్రభువు లలితాదిత్యుడు వీరిని దర్శించి ఆశీస్సులను పొందెను. భవభూతి ఈయన సమకాలీనుడు. కంచిలోనే ప్రభవ సంవత్సరం జ్యేష్ఠశుద్ధ ద్వాదశినాడు సిద్ధి పొందారు.

32. చిదానందఘనులు II క్రీ.శ. 668 - 672 : పూర్వాశ్రమ నామము పద్మనాభుడు. ఆంధ్రులు. లంబికాయోగ సిద్ధులు. పండుటాకులు మాత్రం ఆహారంగా స్వీకరించిన మహాతపస్వి. కంచిలో ప్రజోత్పత్తి మార్గశీర్ష శుద్ధషష్ఠినాడు సిద్ధి నందినారు.

33. సచ్చితానందులు II క్రీ.శ. 672 - 692 : పుట్టుక చంద్రభాగ నదీతీరములో. అనేక భాషలలో వీరికి పరిచయముండుటచేత భాషాపరమేష్ఠి అన్న బిరుదు ఉన్నది. ఖర సంవత్సరం భాద్రపద కృష్ణషష్ఠినాడు కంచిలో సిద్ధి పొందారు.

34. చంద్రశేఖరులు II క్రీ.శ. 692 - 710 : వేగవతీ తీరంలో వీరి జననము. ద్రావిడులు. పూర్వాశ్రమ నామము శంభు. వీరు సంచారం చేస్తున్నపుడు అడవిలో అగ్నిజ్వాలమధ్య దొరకున్న ఒక బాలుని సాహసంతో రక్షించారు. కాశ్మీరదేశపు రాజు లలితాదిత్యుని మంత్రి, బౌద్ధమతస్థుడు చంకుణుడిని వాదంలో ఓడించారు. వీరు కంచిలో సౌమ్య సంవత్సరం మార్గశీర్ష అమావాస్యనాడు సిద్ధి పొందారు.

35. బహురూపచిత్సఖులు II క్రీ.శ. 710 - 737 : వీరి జననం వేదాచలం. ఆంధ్రులు. పూర్వాశ్రన నామం సుశీల కమలాక్షుడు. సహ్య పర్వతములలోని కావేరముని గుహలో చాలకాలం తపస్సు చేశారు. అక్కడనే ధాత సంవత్సరం ఆషాఢశుద్ధ షష్ఠినాడు సిద్ధి పొందారు.

36. చిత్సుఖానందులు క్రీ.శ. 737 - 758 : వీరి అవతరణ పాలారొనదీ తీరంలో. వీరిని చిదానందులనీ పిలిచేవారు. పూర్వాశ్రమ నామం సర్వేశ్వరులు. ద్రావిడ బ్రాహ్మణులు. కంచిలోనే హేవిళంచి సంవత్సరం ఆశ్వయుజ పూర్ణమినాడు సిద్ధి పొందారు.

37. విద్యాఘనులు II 758 - 788 : ద్రావిడ బ్రాహ్మణులు. ఆర్యనారాయణ నామముతో వీరిని వ్యవహరించేవారు. ధర్మరక్షణకు విశేష పరిశ్రమ చేశారు. చిదంబరక్షేత్రంలో ప్రభవనామ సంవత్పరం పుష్యశుద్ధ ద్వితీయనాడు సిద్ధి పొందారు.

38. అభినవశంకరులు క్రీ.శ. 788 - 840 : వీరి తండ్రిపేరు విశిష్ట. మాతృగర్భంలో ఉన్నపుడే తండ్రి చనిపోయారు. అవతరణ చిదంబరం సమీపంలో ఉన్న తిల్లైవనం.వ్యాఘ్రపాద ఋషిదంపతులు వీరిని పెంచి ఐదవ ఏట ఉపవీతులను చేశారు. విజయయాత్ర చేస్తున్న కామకోటి పీఠాధిపులు విద్యాఘనులు చిదంబరం రావటం తటస్ఠించినది. అచట అభినవ శంకరులను తమ తర్వాత పీఠాధిపులుగా వచ్చుటకు ఎన్నుకొన్నారు.

వీరున్నూ కాశ్మీరంలోని శారదాదేవిని అర్చించారు. వాక్పతిభట్టును ఓడించి సర్వజ్ఞపీఠమును అధిష్టించారు. వీరికిని శంకర భగవత్పాదులకున్నూ చరిత్ర సామ్యమున్నందున వీరే వారని అపోహపడుటకు కారణమయినది. అందుచేత శంకరులు చిదంబరంలో జన్మించినారనీ- తండ్రి విశ్వజిత్తనీ వ్రాయుట సంభవించింది.

వీరు కట్ట కడపట హిమాలయంలోని ఆత్రేయ పర్వతంలో దత్తాత్రేయ గుహలో సిద్ధార్ది సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్యనాడు ప్రవేశించారు.

39. సచ్చిద్విలాసులు. క్రీ.శ. 840 - 873 : వీరి పుట్టుక కన్యాకుబ్జం. పూర్వాశ్రమ నామము శ్రీపతి. తండ్రిపేరు కమలేశ్వరుడు. కాశ్మీరంలో అవంతివర్మను ఆశ్రయించివున్న ఆనందవర్ధనుడు ఈయనను ప్రశంసించి వ్రాసినాడు. అతడు ధ్వనిగ్రంధకర్త. వీరు కంచిలో నందన సంవత్సరం వైశాఖపూర్ణిమనాడు సిద్ధి పొందారు.

40. శోభన మహాదేవులు. క్రీ.శ. 873 - 915 : వీరు కర్ణాటక దేశస్థులు. శివరామభట్టు అని వీరి పూర్వాశ్రమ నామము. వీరు అంద సౌష్టవములతో ఉన్నందున 'శోభన, ఉజ్వల' అన్న నామములు కలిపి వీరిని వ్యవహరించేవారు. వీరు భవ సంవత్సరం వైశాఖశుద్ధ షష్ఠినాడు సిద్ధి పొందారు.

41. గంగాధరులు II క్రీ.శ. 915 - 950 : వీరి పుట్టుక భీమా నదీతీరం. కర్ణాటక బ్రాహ్మణులు. పూర్వాశ్రమమున వీరిపేరు అప్పన్న. సౌమ్య సంవత్సరం శ్రావణశుద్ధపాడ్యమి కంచిలో సిద్ధిపొందారు.

కవియు ప్రభువు అయిన రాజశేఖరుడు అంధుడుగా ఉన్నపుడు వీరు వారికి దృష్టి ప్రసాదించిరి.

42. బ్రహ్మనందఘనులు క్రీ.శ. 950 - 978 : పూర్వాశ్రమ నామము నరసింహభట్టు. వీరు కంచిలో ఈశ్వర సంవత్సరం కార్తికశుక్ల అష్టమినాడు సిద్ధి పొందారు.

43. ఆనందఘనులు. క్రీ.శ. 978 - 1014 : జననము తుంగభద్రా నదీతీరము. పూర్వాశ్రమ నామము శంకరపండితులు. వీరు కంచిలో ప్రమాదీచ సంవత్సరం చైత్రశుక్ల నవమినాడు సిద్ధి పొందిరి.

44. పూర్ణబోధులు క్రీ.శ. 1014 - 1040 : జననము కర్ణాటక దేశం. పూర్వాశ్రమ నామము హరి. కంచిలో ప్రమాది సంవత్సరము భాద్రపద బహుళ త్రయోదశినాడు సిద్ధి పొందిరి.

45. పరమశివులు. క్రీ.శ. 1040 - 1061 : పూర్వాశ్రమ నామం శ్రీకంఠుడు. వీరు సహ్యపర్వత గుహలో ఉండేవారు. ఆయనవద్ద సోమదేవుడనే శిష్యుడుమాత్రం వీరివద్ద ఉండెను. వీరు కంచిలో శార్వరి ఆశ్విన శుద్ధ సప్తమినాడు సిద్ధి పొందిరి.

46. సాంద్రానుదబోధులు. క్రీ.శ. 1061 - 1098 : పూర్వాశ్రమ నామము సోమదేవుడు. వీరు కథా సరిత్సాగరం వ్రాసారు. ధారానగర చక్రవర్తి ఈయనకొక ముత్యాలపల్లకిని సమర్పించాడు. కాశ్మీరదేశపు రాజు సహాయమున, మహ్మదీయుల దండయాత్రనుండి కంచిని ఈయన రక్షించారు. వీరు అరుణాచల క్షేత్రంలో ఈశ్వర సంవత్సరం ఆషాఢ అమావాస్యనాడు సిద్ధి పొందారు.

47. చంద్రశేఖరులు III క్రీ.శ. 1098 - 1166 : పూర్వాశ్రమ నామము శ్రీకంఠులు. వీరిని చంద్రచూడులనీ పిలిచేవారు. జైనుడైన- హేమాచార్యుని శాస్త్రచర్చలో జయించారు. హేమాచార్యుడు కుమారపాల చరిత్ర అనే గ్రంధాన్ని వ్రాసాడు.

ప్రసన్నరాఘవం, చంద్రాలోకం,భక్తికల్పలతిక వ్రాసిన జయదేవకవి- భక్తి కల్పలతలో ఈ విధంగా వ్రాసాడు.

శ్రీచంద్రచూడ చరణాంఛ్రిత కంచీపీఠాన్‌

సర్వజ్ఞ శేఖర మణీన్‌ సతతంశ్రయామ

యద్వాగనర్గల గలత్సరసోక్తి వర్షైః

ఆచార హేమదవ వహ్ని రపి వ్యరంసీత్‌

వీరు అరుణాచల క్షేత్రంలో పార్దివ చైత్ర అమావాస్యనాడు సిద్ధి పొందిరి.

48. అద్వైతానందబోధులు. క్రీ.శ. 1166 - 1200 : వీరి పుట్టుక పినాకినీ నదీతీరం. పూర్వాశ్రమ నామం సీతాపతి. శ్రీహర్షుని, అభినవగుప్తుని శాస్త్ర చర్చలలో ఓడించారు. వీరిని చిద్విలాసేంద్రసరస్వతి అనికూడ పిలిచేవారు. బ్రహ్మవిద్యాభరణం, శాంతి, వివరణ, గురుప్రదీపిక, శంకరవిజయం అనే గ్రంథములను వ్రాసారు. సిద్ధార్థి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ నవమినాడు చిదంబరంలో సిద్ధి పొందారు.

49. మహాదేవులు II క్రీ.శ. 1200 - 1247 : పుట్టుక తంజావూరు జిల్లా ఛాయావనం. పూర్వాశ్రమ నామం గురుమూర్తి. వీరు గాదిలతీరంలో పరాభవ సంవత్సరం శ్రావణబహుళ అష్టమినాడు సిద్ధి పొందారు.

50. చంద్రచూడులు II క్రీ.శ. 1247 - 1297 : తండ్రిపేరు అరుణగిరి. పూర్వాశ్రమ నామము గంగేశుడు. హోమములను కోటిసంఖ్యలో చేశారు. పరాశక్తి ఉపాసకులు. దుర్ముఖి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ షష్ఠినాడు గాదిల నదీతీరంలో సిద్ధి పొందారు.

51. విద్యాతీర్ధ. క్రీ.శ. 1297 - 1385 : తండ్రిపేరు సారంగపాణి- పూర్వాశ్రమనామము సర్వజ్ఞవిష్ణు. పుట్టుక- బిల్వారణ్యం. సాయనాచార్యులు విద్యారణ్యులకు వీరు గురువులు. వీరినే విద్యాశంకరులనీ, విద్యానాధులనీ పిలిచేవారు.వీరు ఎనిమిది మఠములను స్థాపించి క్రైస్తవ ఇస్లాముమత ప్రచారములను నిరోధించారు. హిమాచలములో రక్తాక్షి మాఘశుద్ధపాడ్యమినాడు సిద్ధిపొందారు.

52. శంకరానందులు. క్రీ.శ. 1385 - 1417 : పుట్టుక మధ్యార్జునం . పూర్వాశ్రమ నామము మహేశుడు. ఈశ, కేన, ప్రశ్న, బృహదారణ్య ఉపనిషత్తులకు దీపిక వ్రాసారు. విద్యారణ్యులకు సన్యాసదీక్షనిచ్చి, స్థాపింపబడిన 8 మఠముల విషయములలో కృషి చేశారు. కాంచీనగరంలో దుర్మఖినామ సంవత్సరం వైశాఖశుద్ధ పాడ్యమినాడు సిద్ది పొందారు.

53. పూర్ణానందసదాశివులు. క్రీ.శ. 1417 - 1498 : పుట్టుక నాగారణ్యం. వీరు విజయయాత్రలో నేపాలంవరకు వెళ్ళి అచట రాజుచేత సత్కరింపబడ్డారు. వీరు కంచిలో పింగళ జ్యేష్ఠశుద్ధ దశమి సిద్ధి పొందారు.

54. వ్యాసాచల మహాదేవులు. క్రీ.శ. 1498 - 1507 : అవతరణ కంచి, పూర్వాశ్రమ నామము కుప్పణి. వ్యాసాచలంలో తపస్సు చేసుకొనుచు అక్కడే అక్షయ ఆషాఢ బహుళ పాడ్యమినాడు సిద్ధి పొందారు. వ్యాసాచవీయ శంకరవిజయమును వ్రాసిన వారు వీరే.

55. చంద్రచూడులు II క్రీ.శ. 1507 - 1524 : పుట్టుక మణిముక్తా నదీతీరంలోని అస్మాచలంలో. పూర్వాశ్రమ నామం అరుణగిరి.

56. సర్వజ్ఞ సదాశివబోధులు క్రీ.శ. 1524 - 1539 : పూర్వాశ్రమ నామము బోధేశ్వరులు. ఉత్తర పెన్నారు తీరవాసి. స్వాత్మరూపణ, పుణ్యశ్లోకమంజరి అనే గ్రంథమును వ్రాసిరి. రామేశ్వరమున విలంబినామ సంవత్సరము చైత్రశుద్ధ అష్టమినాడు సిద్ధి పొందిరి.

57. పరమశివేంద్రులు II క్రీ.శ. 1539 - 1586 : పూర్వాశ్రమ నామము శివరామ కృష్ణులు. పుట్టుక పంపాతీరం. ఆంధ్ర బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞాని. సదాశివ బ్రహ్మేంద్రులకు వీరు గురువులు. తమ ఆత్మవిద్యా విలాసంలో వీరిని సదాశివ బ్రహ్మేంద్రులు కీర్తించారు. పరమశివేంద్రులు శివగీతకొక వ్యాఖ్య వ్రాసారా. శ్వేతారణ్యంలో పార్థివ శ్రావణ శుక్లదశమి సిద్ధి పొందారు. ఆత్మ విద్యావిలాసంలో వీరిని గూర్చి వ్రాసిన శ్లోకమిది;

నిరవధి సంస్కృతి నీరధినిపతిత జనతారణ స్ఫురన్నౌకామ్‌

పరమత భేదనఘటికాం పరమశివేం ద్రార్య పాదుకాంనౌమి

58. విశ్వాధిక ఆత్మబోదేంద్రసరస్వతి. క్రీ.శ. 1586 - 1638 : జననం వృద్ధాచలం. తండ్రిపేరు విశ్వముఖి. విశ్వేశ్వరుడు పూర్వాశ్రమనామం. అసేతు హిమాచలం యాత్రచేశారు. ఈ రుద్రభాష్యం వ్రాసారు. ఈశ్వర సంవత్సరం, తులామాసంలో బహుళ అష్టమి సిద్ధి పొందారు.

59. భగవన్నామ బోధేంద్రలు. క్రీ.శ. 1638 - 1692 : పుట్టుక కంచిలో మండనమిశ్ర అగ్రహారం. పూర్వాశ్రమ నామము పురుషోత్తముడు. తండ్రి కేశవ పాండురంగడు. నామస్మరణ ప్రాధాన్యాన్ని వీరు చాటారు. నామామృత రసాయనం, నామామృత రసోదయం అనే గ్రంధములు వ్రాసారు. దీనిని గూర్చి ఒక శ్లోకమున్నది.

భగవన్నామ సామ్రాజ్యలక్ష్మీ సర్వ స్వవిగ్రహః

శ్రీమద్బోధేంద్ర యోగీంద్ర దేశికేంద్ర ముపాస్మహే-

యస్య స్మరణమాత్రేణ నమభక్తిః ప్రజాయతే

తన్నమామి యతిశ్రేష్ఠం బోధేంద్రం జగతాంగురుమ్‌.

వీరు రామేశ్వరంవెళ్ళి తిరిగివస్తూ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరికి తాటంకప్రతిష్ఠ చేశాడు. కంచికివస్తూ కుంభకోణం సమీపమున గోవిందపురంలో ప్రజోత్పత్తి భాద్రపద పౌర్ణమి దేహము చాలించారు. వీరి ఆరాధన నేటికిని వేలకొలది భక్తులు భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు.

60. అధ్యాత్మప్రకాశులు. క్రీ.శ. 1692 - 1704 : జననం వశిష్ఠా నదీతీరం. వీరు చాలకాలం గోవిందపురంలోనే ఉన్నారు. తంజావూరు ప్రభువు షాజీ ఈయనను శ్రద్ధా విశేషములతో సేవించినాడు. స్వభానుచైత్ర బహుళవిదియ వీరు సిద్ధినొందిన దినము.

61. మహాదేవులు III క్రీ.శ. 1704 - 1746 : రూప్వాశ్రమ నామము నారాయణుడు. పరమయోగులు. మద్రాసు సమీపముననున్న తిరువత్తియూరులో క్రోధన జ్యేష్ఠశుద్ధ నవమి సిద్ధి పొందారు.

62. చంద్రశేఖరేంద్రసరస్వతి IV క్రీ.శ. 1746 - 1783 : ఈయన కాలంలోనే కంచినుంచి కామకోటి పీఠము కర్ణాటకయుద్ధ కారణంగా కుభకోణమునకు తరలింపబడినది. బంగరు కామాక్షి తంజావూరులో ప్రతిష్ఠ చేయబడినది. వీరు కుంభకోణములో శుభకృత్‌ సంవత్సరము పుష్య కృష్ణ ద్వితీయనాడు సిద్ధి పొందారు.

63. మహాదేవేంద్రసరస్వతి IV క్రీ.శ. 1783 - 1814 : వీరి పుట్టుక కుంభకోణం. పూర్వాశ్రమ నామం అన్నశౌత్రి. కర్ణాటక బ్రాహ్మణులు. గొప్పయోగులు. వీరు శ్రీముఖ ఆషాఢశుద్ధ ద్వాదశినాడు కుంభకోణంలో సిద్ధి పొందారు.

64. చంద్రశేఖరేంద్రులు V క్రీ.శ. 1814 - 1851 : వీరి పూర్వాశ్రమ నామము వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు. కుంభకోణ వాసులు. తంజావూరు ఆస్థానమంత్రి గోవింద దీక్షితుల వంశమునకు చేరినవారు. శ్రీవిద్యానిష్ఠాతులు. మంత్రశాస్త్ర పారంగులు.కంచికామాక్షీ ఆలయంలో యంత్రప్రతిష్ఠ, జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరీదేవికి తాటంక ప్రతిష్ఠ చేశారు. వీరు కుంభకోణంలో సాధారణ సంవత్సరము కార్తీక బహుళ ద్వితీయనాడు సిద్ధి పొందారు.

65. సుదర్శన మహాదేవేంద్రసరస్వతి V క్రీ.శ. 1851 - 1891 : పుట్టుక మధ్యార్జునం. పూర్వాశ్రమ నామం మహాలింగం. విశేషంగా విజయయాత్రలు చేసినారు. పుదుక్కోట, శివగంగ, కాళహస్తి, కార్వేటినగరం, వెంకటగిరి, విజయనగరం జమీందారులందరూ ఆయన ఎడ భక్తి శ్రద్ధలు కలిగినవారు. వీరు ఇలయాత్తంగుడిలో విరోధి ఫాల్గుణ అమావాస్య దినమున సిద్ధి పొందారు.

66. చంద్రశేఖరేంద్రసరస్వతి. క్రీ.శ. 1891 - 1907 : జననం చెంగల్పట్టు జిల్లాలోని ఉదయంబాక్కం. పూర్వాశ్రమనామం స్వామినాథుడు. వీరు కంచివద్ద కలువైలో పరాభవ మాఘ కృష్ణ అష్టమినాడు సిద్ధి పొందారు.

67. మహాదేవులు VI క్రీ.శ. 1907 - 1907 : వీరి పుట్టుక తిరులిశైనల్లూరు. తండ్రిపేరు నరసింహశాస్త్రి. పూర్వాశ్రమనామం లక్ష్మీ నరసింహం. కామకోటి పీఠంలో అధ్యయనం చేస్తూఉండగా సన్యాసదీక్ష పొందారు. పదునెనిమిదవ ఏట పీఠాధిపత్యం వహించి ఏడురోజులు మాత్రం ఉండి పరాభవ ఫాల్గుణశుక్ల ప్రతిపత్‌ దినమున సిద్ధిపొందారు. వీరిని పూర్వాశ్రమంలో లక్ష్మీకాంతమనీ పిలిచేవారు.

68. చంద్రశేఖరేంద్ర సరస్వతి 1907 -

69. జయేంద్రసరస్వతి ----

ϊ. శంకరవిజయేంద్ర సరస్వతి.

శంకరవిజయేంద్ర సరస్వతి డెబ్బదవ కామకోటి పీఠాధిపతిగా నియమింపబడ్డారు. ఆయన పూర్వాశ్రమనామము శంకరులు. వారి తండ్రి యమ్‌. కృష్ణమూర్తి శాస్త్రి. తల్లిపేరు అంచాలక్ష్మి. ఆయన కామకోటి మఠములో వేదాధ్యాపకులుగా ఉండిరి. వారి సంతతిలో శంకరులు నాలుగవవారు. వీరికి సన్యాసదీక్ష 25-5-83 ఇవ్వబడినది. అప్పటికి ఏడు ఏళ్ళుగా మఠములో ఋగ్వేదాధ్యయన మాయన చేయుచుండెను.

రాత్రియంతయు శంకరులు గాయత్రీ మంత్రజపము చేసిరి.ఉదయము 5-30 గంటలకు జయేంద్ర సరస్వతి వేలకొలది జనులు చూచుచుండగా ఆయనకు సన్యాసదీక్ష నిచ్చిరి.

వీరి పుట్టుక 13 మార్చి 1969.

ప్రస్తుతము వీరు శాస్త్ర వ్యాసంగములోనూ, జయేంద్ర సరస్వతులకు మఠ నిర్వహణలో సహాయకారులుగను యున్నారు.

Maa Swami    Chapters