Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

తొమ్మిదవయధ్యాము - హేమచూడుని విశ్రాంతి

హేమచూడుఁడు ప్రియురాలిమాటలను విని మిగుల హర్షము నొంది ఇట్లనెను. ''ఆహా! నీవు ధన్యురాలవు! ఏమి నీజ్ఞానవైభవము! కథారూపమున విషయము నంతయు చాల నిపుణముగా చెప్పితిని. ఇట్టి దొకవృత్తాంతము నాకు కూడ కల దని యిప్పటివఱకును నాకు తెలియదు. ఇప్పుడు నీమాటలవలన నావృత్తాంతమును కూడ, చేతిలోని యుసిరిక పండువలె, స్పష్టముగా జరిగినదానిని స్మరించుచున్నాను; జరుగుచున్నదానిని అనుభవించుచున్నాను. పరమ చైతన్యరూపిణియైన యాజనని యవరు? ఆమెనుండి మన మెట్లు జన్మించితిమి? మనము ఎవరు? మన స్వరూప మేమి? చెప్పుము.''

అప్పుడామె ఇట్లనెను. ''నాథా! ఇది గూఢమైన విషయము. నీస్వరూపమును నీవే అత్యంతనిర్మలమైన బుద్ధితో విచారించుకొనుము. ఆత్మస్వరూపము చూపుటకు ఒకదృశ్యము కాదు; చెప్పుటకు మాటలకు అందునది కాదు. కావున ఎట్లు చెప్పఁగలను? నీకు నీస్వరూపము తెలసినచో ఆతల్లిని కూడ తెలిసికొనఁగలవు. తన్ను తాను తెలిసికొనునప్పుడు ఏయుపదేశము ఉండదు; ఉపదేశించువాండుఁను ఉండఁడు. శుద్ధమైన బుద్ధితో నీస్వరూపమును తెలిసికొనుము. దేవతలు మొదలుగా పశుపక్షాదులవఱకు సకల ప్రాణులయందు వాని కన్నింటికి స్వరూపముగా అది భాసించుచునే యున్నది. లౌకికములైన శాస్త్రజ్ఞానములకు, ఆజ్ఞానములకు సాధనములైన ప్రత్యక్షాదిప్రమాణములకు అది గోచరింపక అంతటను ఎల్లప్పుడు భాసించుచునే యున్నది. ఎక్కడైనను ఎప్పుడైనను ఎవనిచేత నైనను అది లేశమాత్రముగా నైనను ఎట్లు నిరూపింపఁబడును? నాస్వరూపమును తెలుపుము అని నీవు అడుగుట నాకంటికి నాకు చూపు మని అడుగుటవలె నున్నది. ఎంత నిపుణుఁడైన గొప్పయాచార్యుఁడైనను నీకంటిని తెచ్చి నీకెట్లు చూపఁగలఁడు? నీకంటిని నీవు గ్రహించుటకు ఆయన యుపాయమును మాత్రమ చెప్పగలఁడు. కావున నేను కూడ ఉపాయమును చెప్పెదను; శ్రద్ధతో వినుము. ''ఇది నాది, ఇదినాది'' అని ఎంతవఱకు బుద్ధియందు విషయములు భాషించుచుండునో అంతవఱకు ఆవిషయమలు నీస్వరూపము కాదు, 'నాకు ఏది గోచరించుచున్నదో అది నేను కాదు' అని నీవు ఆవిషయముల నన్నింటిని త్రోసివేసిన తరువాత, అట్లు వానిని త్రోసివేయుచున్నట్టిది, త్రోసివేయుటకు వీలులేనిది యైన నీస్వరూపము గోచరించును. కావున ఏకాంతమునందు కూర్చుండి బుద్ధియందు ''నాది'' అని గోచరించు ప్రతివిషయమును త్రోసివేయుచుండుము. ''ఈమె నా భార్య'' అనినన్నుగూర్చి తలంచుచున్నావు కదా! భార్యసంబంధముచేత నేను నీకు ఆత్మీయురాల నైనను నీస్వరూపములో నేను లేను కదా! అట్లే ''నాది'' అని గోచరించు సర్వమును త్యజించి దేనిని త్యజించుటకు శక్యము కాదో అట్టి నీస్వరూపమును తెలిసికొని పరమశ్రేయస్సును పొందుము.''

వెంటనే హేమచూడుఁడు అటనుండి లేచి గుఱ్ఱముపై నెక్కి నగరము వెలుపలన్న యుద్యానవనమునందున్న సౌధమునందు ప్రవేశించెను. అనుచరుల నందఱను పొమ్మని చెప్పి ద్వారపాలకులను పిలిచి, ''నేను ఇచ్చట ఏకాంతముగా నుందును. నేను మీకు ఆజ్ఞఇచ్చువఱకును మంత్రులు గురువులు మొదలుగా ఎవ్వరిని లోనికి రానీయవలదు'' అని శాసించెను. పిమ్మట అతఁడు ఆసౌధములోని తొమ్మిదవయంతస్తులోకిని పోయి మెత్తనితూలికలు గలయాసనముపై కూర్చుండి ఏకాగ్రతతో ఇట్లు ఆలోచింపఁజొచ్చెను. ''ఈజనులు ఎట్లు ఈవిధముగా మోహము నొందుచున్నారు? ఒక్కఁడైనను తన్ను గూర్చి రవ్వంతయు తెలసికొనుట లేదు. ఎల్లరును సుఖము కావలయు నని ఏమేమో చేయుచున్నారు. కొందఱ వేదశాస్త్రాదులను నిత్యము పఠించుచున్నారు. కొందఱు ధనము నార్జించుచుండఁగా మఱికొందఱు భూమిని పాలించుచున్నారు. కొంతమంది శత్రువులతో పోరాడుచుండఁగా కొందఱు భోగములయందు ఆసక్తులై యున్నారు. ఇది యంతయు స్వార్థముగనే వారు తలంచుచున్నారు. కాని ఈవిషయములలో తమస్వరూపమైన దేది అని ఒక్కఁడును విచారించుట లేదు. ఈ భ్రాంతి ఎందు వలన వీరికి కలుగుచున్నది? ఆత్మను తెలిసికోనంత వఱకు ఎంత ఘనకార్యమును సాధించినను అది యంతయు, స్వప్నములో జరిగినకార్యమువలె, వ్యర్థము కావున ఇంక ఆత్మను గూర్చియే విమర్శింతును. గృహము ధాన్యము రాజ్యము భార్యమొదలగునవి యన్నియు నాకన్న భిన్నముగా నుండుటచే నాస్వరూపముకావు. ''నేను'' అన్నప్పుడు ఈదేహమను గ్రహించుచున్నాను. కావున దేహమే నాస్వూరూపము. దీనిచేతనే నేను క్షత్రియుఁడును బంగారువర్ణము కలవాఁడును అగుచున్నాను. కావున సందేహము లేదు; దేహమే నాస్వరూపము. ఇతరులు కూడ ''నేను'' అని చెప్పునప్పుడు దేహమునే గ్రహించుచున్నారు.''

ఇట్లు అనుకొని ఆరాజుకుమారుఁడు దేహమునుగూర్చి ఆలోచించపఁజొచ్చెను. ఆలోచించినకొలఁది అతనికి దేహము ఆత్మ అనుటసమంజసముగా తోఁచలేదు. అప్పుడు అతఁడు ఇట్లు అనుకొనెను. ''నాయిల్లు, నారాజ్యము అన్నట్లే నాదేహము అని చెప్పుచున్నాను. ఇల్లు రాజ్యమ నాస్వరూపము కానట్లే ఈశరీము కూడ నాస్వరూపము కాదు. రక్తము అస్థికలు మొదలగువాని సముదాయముతో ఏర్పడి ప్రతిక్షణము వికారమున పొందుచున్న యీ శరీరము నే నెట్టగుదును? దీని నుండి హస్తమో పాదమో ఛేదింపఁబడినచో అది కట్టెవలె మట్టి పెడ్డవలె కన్పించుచున్నది. మఱియును స్వప్నమునందు వేఱొక దేహము కన్పించుచున్నది. ఈదేహమును ఆదేహమును గుర్తించుచున్న నేను దేహ మగుట కుదురదు.

ఇట్లే నాప్రాణములు నామనస్సు నాబుద్ధి అని వానిని గుర్తించుచున్నాను. కావున నాచే గుర్తింపఁబడుచున్నప్రాణము మొదలగునని నాస్వరూపము కావు. గాఢ నిద్రయందు నాది యని ఏదియు స్ఫురించుట లేదు. ఆశూన్యము నాస్వరూప మగునా? కాని ''నేను లేను'' అనుట ఎప్పుడును లేదు. నేను ఎప్పుడును భాసించుచునే యున్నాను. పంశములేదు. అయినను నాస్వరూపము ఎందువలన నాకు స్పష్టముగా గోచరించుట లేదు? దేనిచేత నాస్వరూపము నాక స్పష్టముగా గోచరింపఁగలదు? సౌధము సంగీతము మొదలగు విషయములు కన్ను చెవి మొదలగువానిచోత భాసించుచున్నవి. చర్మమునందలి ఉష్ణస్పర్శచేత ప్రాణము గ్రహింపఁబడుచున్నది. విషయముల జ్ఞాననములచేత వానిని గ్రహించుచున్న మనస్సు ఉన్నదని ఊహింపఁబడుచున్నది. అట్లే బుద్ధియు ఉన్నదని ఊహించుచున్నాను. కాని నాస్వరూపము దేనిచేత భాసించునో తెలియుట లేదు. లేక, అసలు ఇవి యున్నవి నిరంతరముగా భాసించుచుండుటచేతనే నాస్వరూపము భాసించుట లేదేమో; అట్లయినచో వీనిగూర్చి అనుకొనుటయే మానుకొందును. అప్పుడు నాస్వరూపము గోచరించును.''

ఇట్లు నిశ్చయించుకొని యతఁడు మనస్సులోనికి ఏవిషయము రాకుండునట్లు చేసికొనెను. అతనికి తదక్షిణమే గాఢమైన యంధకారము కన్పించెను. 'ఇదియే నాస్వరూప' మని తలంచుచు అతఁడు సంతోషించెను. కాని ఆసంతోషము నిలువ లేదు. ఇది కూడ నాచేత చూడఁబడుచున్నది కదా, నాస్వరూప మెట్లగును''? అని తలంచుచు నతఁడు ''మనస్సునందు దేనిని గ్రహింపకుందును గాక'' అని దృఢమైన సంకల్పముతో మనస్సుయొక్క వృత్తిని నిరోధించెను. మనస్సు నిరుద్ధమైనంతనే క్షణమాత్రమున ఆదియు అంతమును లేనితేజస్సు అతనికి గోచరించెను. వెంటనే అతఁడు మనస్సుయొక్క నిరోధమును వదలి ఆశ్చర్యముతో ''ఇది యేమి? ఇందాక చీఁకటిగా ఇప్పుడ తేజస్సుగా నాస్వరూపము భిన్నభిన్నముగా గోచరించుచున్నదే! మరల చూతను'' అని తలంచి మరల మనస్సును నిరోధించెను అప్పుడు అతనిమనస్సు నిద్రయందు చాలసేవు లీనమయ్యెను. ఆ నిద్రయందు ఆతఁడు విచిత్రములైన స్వప్నములనుచూచెను. మేల్కొన్న తరువాత అతనికి పెద్దచింత కలిగెను. ''నిద్రచేత ఆవరింపఁబడి స్వప్నములను చూచుచన్నా నేమిటి? ఇంతకు పూర్వము తమస్సును తేజస్సును చూచితిని. అవికూడ స్వప్నములే అగునా ఏమి? మఱిస్వప్నము కూడ మనస్సుయొక్క వ్యవహారమే కదా! దీనిని తొలఁగించుకొనుట ఎట్లు? మరల మనస్సును నిగ్రహించి చూతును'' అని తలంచి అతఁడు దృఢముగా మనస్సును నిరోధించెను అది అప్పుడు కొంచెము స్థిరముగా నుండెను. అప్పుడు అతఁడు ఆనందసముద్రమున మునిఁగినవానివలె అయ్యెను. కాని మరల మనస్సు చలించి నంతనే ఆయానందస్థితి తొలఁగిపోయెను. అప్పుడాతఁడు ఇట్లు తలంచెను. ఇది యేమి స్వప్నమా లేక చిత్త విభ్రమమా? లేక సత్యమే యగునా? ఇది ఏమో నాయాలోచనకు అందుట లేదు. నే నేమియు కాలేదు. అయినను నాకు సుఖ మెట్లు కలిగినది? ఈసుఖమునకు కారణమేదియు కన్నించుటచ లేదు. కారణము లేకుండ సుఖ మెట్లు కలుగును? ఆత్మను తెలిసికోవయునని పూనుకొంటిని. అది తెలియలేదు. ఏదేదో కన్పించుచున్నది. నాస్వరూపము ప్రకాశమా అంధకారమా సుఖమా లేక మఱియొకటియా? లేక వీనియొక్క పరంపరయా? నాకు ఏమియు నిశ్చయము కలుగుట లేదు. హేమలేఖనే మరల అడుగవలె.'' వెంటనే అతఁడు ద్వారపాలకున పిలిచి ఆమెను తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.

హేమలేఖ అచ్చటికి వచ్చి శాంతముగా నిశ్చలముగానిర్వికారముగనున్న భర్తను చూచి ప్రక్కన కూర్చుండెను. ఆతఁడు కనులు విప్పి తన్ను చూచినంతనే ఆమె వానిని ప్రేమతో కౌఁగిలించుకొని మధురముగా ''నాథా! నన్నేల పిలిపించితివి? శరీరమునందు ఆనారోగ్యము ఏమియు లేదు కదా! నావలన ఏదైన పని యున్నదా?'' అని యడిగెను. ఆతఁడిట్లునెను. ''ప్రియురాలా! నీవు చెప్పనట్లుగా నేను ఏకాంతమునందు స్వరూపమును తెలిసికొనుటకై వవిచారించుచుంటిని. అది అనేకవిధములు చిత్రముగ గోచరింపఁజొచ్చినది. ఆత్మనాస్వరూపమే కావున అది సదా నాకు ప్రాప్తించినదే అయి సదా భాసించునది కూడ అయి యుండవలె. కాని ఇతర పదార్థములు ఏవో ఎప్పుడును భాసించుచుండుటవలన ఆత్మ చక్కఁగా భాసించుటలేదు అని తలంచి మనస్సునందు విషయము లేవియు భాసింపకుండునట్లు నిరోధించితిని. అప్పుడు మొదట అంధకారము తరువాత ప్రకాశము పిమ్మట మహాసుఖము గోచరించెను. ఇది యేమో చెప్పుము. ఆత్మ యొక్క రూపము ఇదియేనా? ఇంకైదైనఁగలదా? వివరించి చెప్పుము. దానిని తెలిసి కొందును?

హేమలేఖ ఇట్లనెను. ''బాహ్యవిషయములు మనస్సులోనిక రాకుండ నీవుకావించిన చిత్తనిరోధము ఆత్మవేత్తల కందఱకు సమ్మతము శుభప్రదమునైన ముఖ్యసాధనము. చిత్తనిరోధము లేకుండ ఆత్మను ఎవఁడును ఎప్పుడును ఎచ్చటను పొందలేదు. కాని ఆత్మమనస్వరూపము అగుటచే మనకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నది. కావున దానిని పొందుటకు చిత్త నిరోధము కారణము కాదు. ఏది మనచేత వేఱోకపదార్థమువలె పొందఁబడునో అదిమనస్వరూప మెట్లగును? కావున ఆత్మ ఎప్పుడను పొందఁదగినది కాదు? దానిని పొందుట యన్నది లేనేలేదు. ఆత్మ మనకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నను. దానియొక్క జ్ఞానము మాత్రము అంతఱకు ఉండుట లేదు. ఇంతకు పూర్వములేని యాజ్ఞానము ఇప్పుడు కలుగుచున్నది. అయినను చిత్తనిరోదము గాని యీయాత్మజ్ఞానము కాని ఆత్మను మనకుతెచ్చి యిచ్చుట లేదు. దీని కొకనిదర్శనము చూడుము. ఒక వస్తువు చీఁకటిలో నుండి కన్పించుట లేదు. దీపమును తెచ్చి చీఁకటిని నిరోధించినపుడు అంతకు పూర్వము అక్కడ ఉన్నవస్తువే మనకు ప్రాప్తించుచున్నది. దీపకాంతి చీఁకటినిమాత్రమే తొలఁగిచినది కాని వస్తువును తెచ్చిపెటలేదు. అట్లే ఒకఁడు ఏదో విషయమునుగూర్చి తీవ్రముగ ఆలోచించుచు ఉత్తరీయములో ముడిచియుంచిన బంగారు నాణమును మఱచే ననుకొనుము. అప్పడు వాఁడు దానికొఱకు వెదుక నారంభించెను. కొంతసేపైన తరువాత వాఁడు ఇతరాలోచనములను నిరోధించి నాణము తనయొద్దనే యున్నదని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అప్పడు వాని కది క్రొత్తగా ప్పాప్తించినట్లే యుండును. కాని నిజమునకు అది వానికి ఇందివఱకే ప్రాప్తిమై యున్నది. కావున ఇతరాలోచనములను నిరోధించుట ఆనాణముయొక్క ప్రాప్తికి కారణము కాదు. ఆనాణ మిదివఱకే వానికి ప్రాప్తమైన యున్నది కదా! అట్లే ఆత్మకూడ మనకు స్వరూపము ఎల్లప్పుడు ప్రాప్తించియే యుడుటవలన చిత్త నిరోధము దానియొక్క ప్రాప్తికి కారణము కాదు. అట్లయినచో మనకు ప్రాప్తించియేయున్న యాత్మ ఏల గోచరించుట లేదు అన్నచో వినుము. దానయొక్క పరిజ్ఞానము మనకు లేకుండుటచే దానిని మనము గుర్తింపలేకున్నాము. ''దీపకాంతివలన వస్తువులు ప్రకాశించును'' అని కాంతియొక్క జ్ఞానము లేనివాఁడు రాత్రిపూట రాజ సభకు పోయినప్పుడు అక్కడ సభ్యులను దీపములను కూడ చూచుచు ఆశ్చర్యము నొందును దీపములకాంతియే సభ్యులను దీపములను కూడ ప్రకాశింపఁజేయుచున్న దని వానికి తేలియదు.

నీవు చిత్తమును నిరోధించితివి. ఆనిరోధముయొక్క అంతమునందు నీకు అంధకారము కన్పించినది. ఆయంధకారమునకు పూర్వము ఏదియును గోచరింపలేదు. అప్పడు దృశ్యమేదియును లేక జ్ఞానము మాత్రమే యున్నది. అదియే మరమానందదాయకమైన మన స్వరూపము. దానినే ఎల్లప్పుడు భావించుచుండుము. ఈవిషయమున బహిర్ముఖలైనవారు. ఎచ్చటనో ఆత్మ యున్న దనుమహామోహమునకు లోనగుచు, దానిని వెదకి వెదకి ఈభావమును సైతము పొందఁజాలకున్నారు. శాస్త్రమునుతెలసికొన్నవారు. విన్నదానిని చక్కఁగా తర్కముతో మననము చేసికొనఁకలిగినవారు కూడ కేవలచిత్తనిరోధమువలన స్వరూపమును తెలిసికొనలేక రాత్రింబవళ్ళు దుఃఖించుచున్నారు. శాస్త్రమునందలి శబ్దములయొక్క అర్థముల యొక్క ఆందమును గ్రహించిచనంతమాత్రమున స్వరూపముయొక్క అనుభవము కలుగదు. ఎంతవఱకు అన్వేషణమువిచారము జరుగుచుండునో అంతవఱకు ఆత్మయొక్క అనుభవము ప్రాప్తింపదు. ఎందువల్ల ననఁగా అది బుద్ధిచేత గ్రహింపఁదగినది కాదు. ఇంద్రియము లను ఎంత దూరము ప్రసరింపఁజేసిననుఅది యొక బాహ్యపదార్థము కాకపోవుటడచే వానిచేత గ్రహింపఁబడదు. ఇంద్రియములను నిగ్రహించినప్పుడు అది మనయందే సిద్ధమై యుండుటచే గోచరించును. అట్లే విచార మొనర్చుచున్నను అది తెలియఁబడదు. ఆవిచారమును నిలిపి మనస్సును నిరోధించినప్పుడు అది ప్రకాశించును. అనఁగా ఇంద్రియములను మనస్సును నిరోధించినప్పుడే అది భాసించును. ఇది తప్ప ఇంక ఏపని చేసినను ఎవఁడును స్వరూమును గ్రహింపలేఁడు. ఎవఁడు ఎంతదూరము పరువెత్తినను తన నీడను తాను గ్రహింపలేఁడు. స్వచ్చముగానున్న యద్దమునందు బాలుడు ఎన్ని ప్రతిబింబములను చూచుచున్నను ఆప్రతింబములకు ఆధారముగానున్న యద్దమును గ్రహింపలేఁడు. అట్లే జను లందఱును తమయొక్క ఆత్మయను అద్దమునందు ప్రతిబింబముగానున్న జగత్తును చూచుచు తమ యాత్మను గ్రహింపలేకున్నారు. వారికి ఆత్మయొక్క పరిజ్ఞానము లేకుంéడుటయే అందువలకు కారణము. ఆకాశమునుగూర్చి తెలియని వాఁడు దానియందున్న జగత్తును చూచుచు దానికి ఆశ్రయమైనయున్న యాకశమును గుర్తింపఁజాలఁడు. అట్లే జనలు సర్వమును చూచుచుదానికి ఆశ్రయమైయున్న తమయాత్మను గుర్తింపలేకున్నారు.

ఒకవ్యక్తి యొక్క పరిచయము లేకున్నచో ఆవ్యక్తి మనకు కన్పించుచున్నను ''ఇతండు ఫలానావాఁడు'' అని ఎట్లు గుర్తింపలేమో, అట్లే చితక్త నిరోధమున స్వరూపము గోచరించుచున్నను, దానిని గూర్చి పరిచయము లేకున్నచో, ''ఇది నాస్వరూపము'' అని గూర్తుంచుట సాధ్యముకాదు. కావున ఆత్మస్వరూపమునుగూర్చి చెప్పెదను వినుము. సూక్ష్మముగా చూచినచో జగత్తు అంతయు జ్ఞానము జ్ఞేయము అని రెండు విధములుగా నున్నది. ఆత్మవిషయమున జ్ఞానము స్వతస్సధ్ధము అనఁగా ''నే నున్నాను'' అని గ్రహించుటకు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు ఏవియు అక్కఱలేదు. మఱియును ఆద్దము లేకున్నచో ప్రతిబింబము లేనట్లు, ఆత్మ లేకున్నచో ఏదియును లేదు. ప్రమాణములు లోకమున జ్ఞానమును కలిగించుటకు సాధనములు జ్ఞానము కావసినవానికి అవి ఆవశ్యకములగును. కాని వాఁడు తన్నుగూర్చి తాను తెలిసికొనునప్పుడు ఆప్రమాణములు ఉపయోగింపవు. స్వరూపము స్వతసిద్ధమగుటచే దానిని గ్రహించుటకు ప్రమాణములతో పనిలేదు. సూర్యుని చూపుటచకు దీపములతో నెట్లు పనిలేదో అట్లే ఆత్మన గ్రహించుటకు ప్రమాణములతో పనిలేదు. కావున ఆత్మ ఏసాధనముచేతను సిద్ధించునది కాదు. అట్టిజ్ఞానరూపమైన యాత్మ ఎక్కడ ఉన్నదని ఆక్షేపించువానికి ప్రశ్న సమాధానము రెండును కుదురువు. ఎవఁడైనను ఆత్మలేదన్నచో వాఁడును లేనివాఁడు అగును. ఉన్నవాఁడు ప్రశ్నింపఁగలఁడు గాన లేనివాఁడు ఎట్లుప్రశ్నించును? అట్లే ఆత్మలేనిచో సమాధానము చేప్పువాఁడును ఉండుఁడు. ఇంక సమాధానము ఎట్లు పుట్టును? కావున ప్రతిబింబములకు అధారమైయున్న యుద్దము లేదని చెప్పుటకు ఎట్లు వీలు లేదో అట్లే సకలజగత్తుయొక్క ప్రతిబింబమునకు ఆధారమై జ్ఞానరూపముగా పెద్దయుద్దమువలె ఎల్లరయందును ప్రకాశించుచున్నయాత్మ లేదని చెప్పుటకు వీలు లేదు. దేశకాలముచేత కూడ దానియందు విభాగములు ఏర్పడుట లేదు. ఎందువల్ల నఁనగా అవికూడ దానియందలి ప్రతిబింబములే. మహాకాశమునందు అనేకవిభాగములతో వివిధపదార్థములు గోచరించుచున్నట్లు ఆత్మయందు జగత్తు వివిధపదార్థములుగా గోచరించుచున్నది. దేశకాలములు నామరూపములు మొదలగువానివలన కన్పించుచున్న భేదము లన్నియు జగత్తునకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధింపవు. అట్లు జగత్తునకు ఆధారమైయున్న యాత్మయే నీకును స్వరూపము. వెండిచెంబు వెండికంచము మొదలగు విశేషనామరూపముల కన్నింటికిని వెండి సామాన్యపదార్థము. అది ఆ నామరూపములకు అతీతము. సామాన్యమైన వెండియందు చెంబు కంచము మొదలుగా పెక్కుపదార్థమలు ఎట్లున్నవో అట్లే సామాన్యచైతన్యమునందు జగత్తులోని పదార్థము లన్నియు ప్రాకశించుచున్నవి. జగత్తునకు ఆధారమైన దానికి ఉనికిన (Existence) ప్రకాశమును (Appearence) కలిగించుచున్న యాసామాన్యచైతన్యమును తనస్వరూపమునుగా, "ఆచైతన్యమే నేను" అని గ్రహించి యాస్థితిలో నిలిచిన వానికి పరమేశ్వరత్వము సిద్ధించును.

ఆచైతన్యమును గుర్తించుటకు అనువైనస్థానమును చెప్పెదను వినుము విషయములతో సంబంధమును పొందక కేవలముగా (Absolute) నుండుజ్ఞానమే సామాన్యచైతన్యము. దానిని మనము నిద్రకు జాగ్రత్తునకు మధ్యలో గ్రహింపవచ్చును మనస్సు వివిధ పదార్థములను గ్రహించుచుండుట జాగ్రత్తు. అది తమస్సుచేత కప్పఁబడియుండట నిద్ర. జాగ్రత్తును వదలి తమస్సులో లీన మగుటకు ముందు మనస్సు క్షణకాలము పదార్థములయొక్క రూపములను పొందక కేవలచైతన్యముగా (Absolute Consciousness) ఉండును. అట్లే జాగ్రత్తులో కూడ మనస్సు ఒకపదార్థముయొక్క జ్ఞానమును వదలి మఱియొక పదార్థముయొక్క జ్ఞానమును పొందుటకు ముందు క్షణకాలము విషయరహితముగా కేవలచైతన్యముగా నుండును. చెట్టును దానిపైనున్న పక్షిని చూచునప్పుడు చెట్టుయొక్క జ్ఞానమునకు పక్షి యొక్క జ్ఞానమునకు నడుమ కొంచెము అంతర ముండును. వెండి యందు చెంబుయొక్క ఆకార ముండగా కంచముయొక్క ఆకారముండదు. చెంబు యొక్క రూపమును తొలఁగించి కంచముయొక్క ఆకారమును ఏర్పరచుటకు ముందు మధ్యలో వెండి సామాన్యముగా ఎట్లుండునో అట్లే మనస్సు ఒకపదార్థముయొక్క జ్ఞానము వదలి మఱియొక పదార్థముయొక్క జ్ఞానమును పొందుటకు ముందు సామాన్య చైతన్యముగా నుండును. కావున ఇట్లు జాగ్రత్తునకు నిద్రకు మధ్యలో ఒక విషయజ్ఞానమునకు మఱియొకవిషయ జ్ఞానమునకు మధ్యలోనుండు కేవల జ్ఞానమును సూక్ష్మబుద్ధితో గుర్తింపుము. అదియే నీస్వరూము. దీనిని ఎఱుంగకపోవుటవలననే ఈజగత్తు ఇట్లు తోఁచుచున్నది. ఈస్వరూపమునందు రసము గంధము స్పర్శము శబ్దము సుఖము దుఃఖము గ్రహించునది గ్రిహంపఁబడునది ఏదియును లేదు. ప్రతిబింబములకు అద్దమువలె ఇదియే సకల జగత్తునకు ఆధారమైనప్పటికి ఇది ఎప్పుడును అద్దమువలె నిరాకారమే. ఇదియే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుఁడు సదాశివుఁడు సర్వేశ్వరుఁడు.

మనస్సును నిద్రలోనికి పోకుండ నిలిపి, విషయములపై ప్రసరింపకుండ ఆపి, కేవలజ్ఞానమైన స్వరూపమును చూడము. "నాస్వరూపమును చూచుచున్నాను" అను తలంపుకూడ లేకుండ, గ్రుడ్డివానివలె మనస్సుయొక్క వ్యాపారమును నిలిపి యూరకుండము. అదియే స్వరూపస్థితి. దానిని వెంటనే పొందుము"

అది విని హేమచూడుఁడు ఆమె చెప్పినట్లే స్వరూపస్థితినిఁగని అందు చాలసేపు విశ్రాంతి నొంది బహిఃప్రపంచము విస్మరించెను.

ఇది జ్ఞానఖండమునందు హేమచూడునివిశ్రాంతి యన్నది నవమాధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters