Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

సృష్టిక్రమమునుగూర్చి భార్గవుని సందేహములు

పరశురాముఁడు అద్భుతమైన కుమారీ దేవీచరిత్రమును వినివిస్మయము నొంది ప్రాంజలియై దత్తాత్రేయునితో నిట్లనెను. "భగవానుఁడా! మీరుచెప్పిన యీకథ చాల ఆశ్చర్యకరముగా నున్నది, మహోన్నతమైన త్రిపురాదేవియొక్క మహిమను నేనింతకుపూర్వము వినలేదు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు జననియై వారిచే పూజింపఁబడి స్తుతింపఁబడిన దన్నచో ఆమె అందఱకన్నను మిన్న యని స్పష్టమగుచున్నది. మీచేత అనుగ్రహింపఁబడి నేను ధన్యుఁడ నైతిని. ఈకతామృతమును ఎంత త్రావుచున్నను నాకు దప్పి తీఱుట లేదు. కావున శ్రీత్రిపురాంభాదేవియొక్క లీలలను వైభవమును ఇంకను వినఁగోరుచున్నాను. కృపతో చెప్పుడు.''

దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పెను. ''రామా! వినుము. త్రిపుర అని చెప్పఁబడుచున్న యాదేవికి పరమాకాశ##మే రూపము. ఆమె యందే ఈవిశ్వ మంతయు వివిధపదార్థతములుగా విభజింపఁబడి యున్నది. చిదానందము అద్వయమును అయినయాత్మయే ఆమెకు రూపము. ఆమె వాక్కులకు ఇంద్రియములకు మనస్సునకు అందక వానికి సాక్షిణియై సకలమునకు ఆధారమై యున్నది. భక్తులయందలి దయచేత ఆమె ఎన్నో రూపములను దాల్చును పెక్కు లీలలను ప్రకటించుచున్నది. వాని నన్నింటిని లెక్కించి చెప్పుటకు ఆదిశేషునకు కూడ అసాధ్యము. కావున ఆమెయొక్క ప్రధానరూపములను కొన్నింటిని చెప్పెదను. కుమారి త్రిరూప లక్ష్మి సరస్వతి గౌరి కాళి చండిక దుర్గ కాత్యాయని లలిత అనురూపములు పేర్కొనఁబడుచున్నవి. వీనిలో లలిత శ్రీమహారాజ్ఞి; ఆరూపము పూర్ణతమము. ఇందు కుమారీచరిత్రమును చెప్పితిని. ఇంక తక్కిన చరిత్రములను క్రమముగా చెప్పెదను.

కుమారిదేవియే మూఁడు రూపములతో మూర్తీ భవించి త్రిరూపగా ఆవిర్భవించినది. పూర్వముసృష్టియొక్క అరంభమునందు త్రిపురాదేవి చైతన్యమే రూపముగా ప్రకాశించుచుండెను. అప్పుడు ఆమె ఒక్కతయే యుండెను. ఇతర మేదియు లేదు. అట్లున్న యాశక్తి తన స్వాతంత్ర్యముచేత సృష్టిచేయుటకు ఉన్ముఖురాలు కాఁగానే ఇచ్ఛ కలిగెను. దానిచేతజ్ఞానము, దానివలన క్రియ సంభవించెను. ఆమె వానివైపు చూచినంతనే వానినుండి ఇచ్ఛామయుఁడై ఈశ్వరుఁడు, జ్ఞానమయుఁడై విష్ణువు, క్రియాత్మకుఁడై బ్రహ్మజనించిరి. పుట్టుకచేతనే మహావీర్యులు సత్యసంకల్పులు అయినవారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించుకొని గొప్ప తపస్సు చేసిరి. అప్పుడు రాత్రి పగలు సూర్యుఁడు నక్షత్రములు భూమి జలము తేజస్సు వాయువు దిక్కులు నిమేషము యుగము మొదలుగా ఏదియు లేదు. అంతయు అకాశమయముగా నుండెను. స్వయముగా ప్రకాశించుచున్న యాముగ్గురును ఆకాశ##మే ఆశ్రయముగా మహాతపస్సుచేత సమాధియందు నిశ్చలముగానుండిరి. అనేకయుగముల కాలముగడచిన తరువాత ఆదేవి బ్రహ్మతో ఇట్లనెను "వత్సా! లెమ్ము, నీవు తపస్సు చేత ఏమి చేయఁగోరుచున్నావు? భువనములతో కూడ లోకములను సృష్టింపుము. అందులకే నిన్ను పుట్టించితిని."

ఇట్లు పరాశక్తిచే ఆదేశింపఁబడిన బ్రహ్మ జగత్తును సృష్టింపఁదలఁచి, "ఎక్కడ సృజింతును?" అని చింతించుచు చుట్టును చూచెను. అప్పుడాయనకు సర్వశూన్యము అమలము అయిన మహాకాశము కన్పించెను. దానికి ఆదియు అంతము గోచరింపలేదు "నాకు సృష్టికి అవకాశ మున్నది"అని తలంచి ఆయన శరీరమును కొంచెము కదలించి స్పర్శను పొందెను. ఆయనయొక్క అంగచలనమువలన కలిగిన స్పర్శవలననే వాయువు విజృంభించెను. వాయువుయొక్క వేగమువలన వేడిమి పుట్టెను. ఆయన చూచుచుండఁగా ఆవేడిమి అగ్నిగా రూపొందెను. పిమ్మట అగ్నినుండి చల్లనిస్పర్శనతో రసవంతమైన జలము ఆవిర్భవించెను. దానియందు గంధముతో (వాసనతో) పృథివి కన్పించెను, అది కఠనమై దేనినైనను ధరించుటకు సమర్థమై యుండుట చూచి బ్రహ్మ 'దీనియందు నానావిధములైన శరీరములతో విచిత్రమాన భువనమును సృష్టింతును. ఇది నాసృష్టిని ధరింపఁగలదు' అని తలంచి దానియందు సృష్టిని గావించెను.

ఇది విని పరశురాముఁడు సంశయము నొంది దత్తాత్రేయునితో ఇట్లనెను "భగవానుఁడా! నీవు చెప్పునది చాల విచిత్రముగ నున్నది. అందువలన నాకు ఏదియు నిశ్చితముగా తెలియుట లేదు. బ్రహ్మ యొక్క చూపువలన సిద్ధములై యున్నట్లుగా ఆకాశాదిభూతములు పైకి వచ్చినవి. అచ్చట మఱియొక కర్త ఎవఁడును లేఁడు. మఱి ఆ భూతములు కర్త లేకయే ఉద్భవించె నని తోఁచుచున్నది. అవి అంతకు పూర్వమే సిద్ధములై యున్నచో, అవి యున్నట్లు ఆసృష్టికర్తకు ఏల తెలియలేదు? దేవి బ్రహ్మతో మాటాడినది! పంచ భూతములు పుట్టకపూర్వమే శబ్ద మెట్లు వచ్చినది? అట్లే భూతములు పుట్టకముందే బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు శరీరము లెట్లు కటిగినవి? ఈసంశయములను తీర్చుట మీకు తప్ప ఇతరునకు ఎవనికి సాధ్యము కాదు. దయాళువులైన తమవంటి గురువులు శిష్యుఁడు అడుగకున్నను చెప్పుదురు."

దత్తాత్రేయుఁడు ప్రశ్నకు సంతోషించి మధురముగా నిట్లనెను. "రామా! నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు. నీప్రశ్న చాల నిపుణమైనది. అది మూఁడు విధములుగ నున్నది. దానికి సమాధానము తగిన సమయమున చెప్పెదను. ఇప్పుడే దానిని తెలిసికొనుట శక్యముకాదు. అప్పటివఱకు స్థిరముగా వేచియుండుము. తగని సమయమున శిష్యనకు చెప్పుట లోకజ్ఞానములేని గురువయొక్క లక్షణము. అట్లు చెప్పుటవలన విరుద్ధమైన ఫలము ఏర్పుడును. సరిగా గ్రహింపఁజాలనిదశయందు విన్నశిష్యుఁడు చాపలు తయారుచేయువానివలె నశించును. "భార్గవుఁడు ఆమాట విని. "అయ్యా! ఆచాపలవాఁడు ఎట్టివాఁడు? వానికేమి జరిగినది? ఏకారణముచేత వాఁడు నశించెనో చెప్పుఁడు" అని ప్రార్థించెను.

ఆయన ఇట్లు చెప్పెను. "కళింగదేశమున కువలుండు అను చాపలల్లువాఁడుండెను. వాఁడు ఆవృత్తి యందు చాల నిపుణుఁడు. వాఁడొకప్పుడు చిత్రవిచిత్రములైన చాపలను అల్లి రాజునకు సమర్పించెను. ఆయన వానియొక్క నైపుణ్యమును మెచ్చి చాలధనము నొసంగెను. సంపన్నుఁడైన యాకటకారుఁడు పురాణములయందు బ్రహ్మణప్రశంసను విని బ్రహ్మణులను ఆరాధింప మొదలిడెను. ఒకప్పుడు డితండు పుణ్యకథలు వినుచుండగా సందర్భవశమున అధ్యాత్మప్రసంగము వచ్చెను. ఆ ప్రసంగము నాతఁడు మరల మరల వినెను. అది మిగుల సూక్ష్మమగుటచే అతనికి ఏమియు తెలియలేదు. తరువాత ఒకచోట ఏకాంతమునందు ఆప్తుఁడైన యాపౌరాణికుఁడు కన్పింపంఁగా కువలుడు "స్వామీ! తమరు చెప్పిన యధ్యాత్మవిషయము చాల గంభీరముగ నున్నది. మరల విన్నను నా కది బుద్ధియందు నిలుచుట లేదు. కావున కరుణించి దానియొక్క సారమును సంగ్రహించి నేను సులభముగా గ్రహించుటకు వీలగునట్లుగా చెప్పుఁడు." అని ప్రార్థించెను ఆబ్రాహ్మణుఁడు ఇట్లు చెప్పెను. "కువల! అధ్యాత్మవిద్యయొక్క సారమును సంగ్రహముగా చెప్పుచున్నాను వినుము. మానవుఁడు ఇంద్రియవిషయములనుండి విముఖుఁడై శాంతుఁడై దృశ్యము నంతను దృక్కుగా గ్రహించుచు సర్వము సమ మని తెలిసికొనవలెను. పిదప వచ్చినదానినిత్యజింపక రానిదానిని కోరక ఎల్లప్పుడు సంతుష్టుఁడై సంగరహితుఁడై నిర్భయుఁడై సంచరింపవలయును."

ఆ మాటలు వినికువలుఁడు అజ్ఞానముచేత మోహితుఁడై వానియర్థమును సరిగా గ్రహింపలేకపోయెను. సర్వము సమ మనఁగా మనుష్యులందఱు సమానులే అని తలంచి కువలుఁడు బ్రాహ్మణులయందు భక్తిని వీడి దేవపూజలను పాపభయమును త్యజించి భోగముల ననుభవించుచు నాస్తికప్రాయుఁడై అధమగతి నొందెను. కావున భార్గవా! తగని సమయమున చేయుబోధ దోషమునకు త్రోవ తీయును."

బాలప్రియ

పరశురామునకు కలిగిన సందేహములు సమంజసములే. కావుననే దత్తాత్రేయుఁడు ప్రీతి నొందెను. శిష్యునకు సందేహములు కలిగిన వన్నచో అతఁడు గురువు చెప్పిన విషయమును శ్రద్ధతో వినుచు అర్థము చేసికొనుటకు ప్రయత్నించుచున్నాఁడన్నమాట పరశురాముని ప్రశ్న మూఁడువిధములుగా నున్నది. బ్రహ్మకు పూర్వము మఱియొక సృష్టికర్త లేఁడు. ఆయన సృష్టి చేయఁదలఁచుచున్నాఁడే కాని ఇంకను దేనిని సృష్టింపలేదు. అట్టియెడల ఆయనయొక్క వీక్షణమాత్రముననే భూతములు పైకి వచ్చె నన్నచో అవి యంతకు పూర్వమే సిద్ధములై యుండవలె. అవి కర్త లేకుండ ఎట్లు సిద్ధమైనవి? ఇది మొదటి సందేహము. ఆయన మొదట చుట్టును చూచినప్పుడు ఆకాశము సర్వశూన్యముగా గోచరించినది. సిద్ధములైన యీపంచభూతములు అప్పుడు ఆయనకు ఏల గోచరింప లేదు? ఇది రెండవ సందేహము. పంచభూతములు పుట్టుటకు పూర్వమే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పుట్టిరి. వారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించి తపస్సుచేసరి. త్రిపురాదేవి సృష్టి చేయుమని బ్రహ్మతో చెప్పెను. బ్రహ్మతన శరీరమున కదలింపఁగా వాయువు విజృంభించెను. అప్పుడు వారికి భౌతికశరీరములు ఉండియుండవలె. లేకున్నచో వారు తపస్సు చేయుట, దావి చెప్పుట బ్రహ్మ వినుట, ఆయన తనదేహమున కదలించుట సంభవింపవు. శబ్దము ఆకాశ భూతమునకు గుణము. శరీరములు పంటచభూతములవలన ఏర్పుడును. మఱి భూతములే పుట్టక పూర్వము భౌతికములైన శబ్దములు శరీరములు ఎట్లు పుట్టినవి? ఇది మూఁడవ సందేహము.

é పరశురాముఁడు మఱియొక ప్రశ్న కూడ అడిగియుండవచ్చును ఎందువలననో ఆయన అడుగలేదు. మొదట త్రిపురాదేవి ఒక్కతయే యున్నది. ఆమె రూపము చైతన్యము. అనఁగా చైతన్యము మాత్రమే యున్నది. చైతన్యములోనుండి ఇచ్ఛ ఎట్లు పుట్టినది? రెండవదియే లేనప్పుడు ఒక్కవస్తువులోనుండి ఇంకొకవస్తువు ఎట్లు పుట్టును? ఆమెయొక్క స్వాతంత్ర్యమువలన ఆమె నుండి ఇచ్ఛకలిగిన దని చెప్పఁబడినది. ఇద్దఱు ఉన్నప్పుడే ఒకఁడు స్వతంత్రుఁడు, మఱియొకఁడు పరతంత్రుఁడు కావచ్చును. రెండవదియే లేక చైతన్యము ఒక్కటియే యున్నప్పుడు దానికి స్వాతంత్ర్యము ఉండెననుటకు అర్థ మేమి?

ఈ ప్రశ్న లన్నియు సమంజసములే. వీని కన్నింటికిని దత్తాత్రేయుఁడు చెప్పినట్లుగా తగిన సమయమున అనఁగా ఆయన బోధింపఁబోవుచున్న తత్త్వజ్ఞానము కలిగినప్పుడు సమాధానములు సహజము గనే లభించును.

ఆకాలమున కువలునకు పౌరాణికుఁడు అధ్యాత్మవిషయమును బోధించుటవలన అతఁడు దానినిసరిగా గ్రహింపక పతన మొందెనని, కావున ఆకాలమున శిష్యునకు ఆధ్యాత్మతత్త్వము బోధింపరాదని దత్తాత్రేయుఁడు నిరూపించెను. కాని సంవర్తుఁడు ఈతత్త్వమునే ముందు భార్గవునకు చెప్పెను గదా. అది అప్పడు పరశురామునకు బోధపడలేదు. అట్లు ఆయన చెప్పవచ్చునా? ఈరెండు బోధలలో భేద మేమి? భేదము చాల కలదు. రెండింటికి సంబంధమే లేదు. సంవర్తుఁడు ఆరంభముననే "సంసారమునందు విరక్తుఁడవై గురువు నాశ్రయించి ఆయన చెప్పిన పద్ధితిలో త్రిపురాదేవి నాశ్రయించి ఆమె కృపావేశమువలన ఆత్మభావమును పొందుము" అని చెప్పెను. అట్లే చివరను కూడ "సంసారమునందు దోషమును భావించి వైరాగ్యమును పొందును. తరువాత సన్మార్గలక్షణము సంభవించును. నేను చెప్పిన యీసారమును ఎల్లప్పుడు అభ్యసించువాఁడు అచిరకాలముననే శుభ మార్గమును పొందును." అని చెప్పెను. నామాటలు విన్నంతనే నీకు జ్ఞానము సిద్ధించు నని ఆయన చెప్పలేదు. అంతే కాదు. గురువు నాశ్రయించి ఆయన ఉపదేశించు పద్ధతిలో త్రిపురాదేవిని ఆరాధించినచో జ్ఞానమును పొందఁగల వని ఆయన పరశురాముని గురువునొద్దకు పంపించెను. అంతేకాదు. తాను చెప్పిన యధ్యాత్మవిద్యాసారమును పరశురాముఁడు కువలునివలె అపార్థముగ గ్రహించుటకు అవకాశు లేకుండ, "మలినబుద్ధులకు ఇది గోచరము కాదు. గురుసేవ వలన తప్ప ఇది బోధపడదు. కావున వెంటనే గురువునొద్దకు పొమ్ము" అని దృఢముగ చెప్పెను. పరశురాముఁడు సొంతముగ తాను చెప్పిన ఆధ్యాత్మసారమును గ్రహించుటకు ఆయన అవకాశ##మే ఈయలేదు.

మఱి పౌరాణికుఁడు చేసినబోధ యిట్లున్నదా? కేవలము విరుద్ధమాగా నున్నది. కువలుఁడు, "నేను సులభముగా గ్రహించుటకు వీలగునట్లుగా అధ్యాత్మవిద్యాసారమును చెప్పుఁడు" అని ప్రార్థింపఁగా అపౌరాణికుఁడు అట్లే యని దానిని సంక్షేపముగాచెప్పి పంపించెను. అంతే కాని, "ఇది సంసారమార్గమందున్న మలినబుద్ధులకు గోచరింపదు. గురువు నాశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో దేవతను ఉపాసించననే తప్ప చిత్త శుద్ధి కలుగదు. నేను సంక్షేపముగా చెప్పి నంతమాత్రమున నీకు బోధపడదు. గురువును ఆశ్రయించి దీనిని అభ్యసింపుము" అని ఆపౌరాణికుఁడు చెప్పలేదు. అందువలన కువలుఁడు ఆయన చెప్పినదానితో తనకు తోఁచినదే పరమార్థముగా గ్రహించి, అజ్ఞానము లేశ మైనను తొలఁగకుండుటచే దానిప్రభావము వలన సంసారమునందే మునిఁగిపోయెను.

శిష్యులవిషయమున ప్రాజ్ఞులై నగురువులు ఎంత శ్రద్ధవహింతురో సంవర్త దత్తాత్రేయులవలన మనము గ్రహింపవలసి యున్నది. ఇరువురును పరశురామునియందు వాత్సల్యమునే చూపిరి. ఆయన ప్రశ్నించి నప్పుడు మాత్రమే "ఇది నీకు ఇప్పుడు తెలియదు" అని నిష్కర్షగానే చెప్పిరి. ఆయనను దేవియొక్క ఉపాసనామార్గమున ప్రవేశ##పెట్టి ఆయన చిత్తనైర్మల్యమును సంపాదించునట్లుగా ప్రోత్సహించిరి. పరశురాముని సందేహములకు వెంటనే సమాధానము చెప్పకుండ దత్తాత్రేయుఁడు, "తరువాత చెప్పుదురు. అంతవఱకు స్థిరముగా నుండుము (స్థిరోభవ)" అని హెచ్చరించుట గమనింపఁదగియున్నది. అడిగిన వెంటనే సంవర్తుఁడు చెప్పలేదు. దత్తాత్రేయుఁడు కూడ చెప్పలేదు. అది తనకు అవమానముగా పరశురాముఁడు తలంపవచ్చును. అంతే కాదు ఆసందేహములను గూర్చియే ఆలోచించుచు ఆతఁడు గురువు చెప్పుచున్నదానియందు మనస్సును నిలుపక పోవచ్చును. కావున అట్లు మనస్సునకు చాంచల్యము కలుగకుండ మనస్సును స్థిరముగ నిలుపుకొను మని దత్తాత్రేయుఁడు హెచ్చరిక గావించెను. సంసారము రోగమువంటిది. గురువుయొక్క బోధ మందువంటిది, మందు ఇచ్చినంతమాత్రముననే వైద్యునకు రోగివిషయమున బాధ్యత తీఱదు. అది ఒక్కొక్క రోగియందు ఒక్కొక్క విధమున పని చేయుచుండును. కావున వైద్యుఁడు రోగియొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుచు, అవశ్యకమగుచో, మందును మార్చుచు పథ్యము చక్కఁగా జరుగునట్లు చూడవలెను. రోగికి సంపూర్ణమైన యారోగ్యము కలుగువఱకు వైద్యుని బాధ్యత తీరదు. అట్లే గురువు కూడ ఒక్కొక్క శిష్యుని పురీక్షించి తగిన విధముగ బోధించుచు వానియందు కలుగుచున్న మార్పులను గమనించు చుండవలయును. రోగికి పథ్య మెట్టిదో సాధకునకు కర్మానుష్ఠానము ఉపాసన మొదలగునవి యట్టివి. శిష్యుని స్థితి ననుసరించి కర్మనో, ఉపాసననో వాని చేత చేయించి వానికి చిత్తశుద్ధి కలుగునట్లుచేయవలె. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాననము కలుగును. కావున, కువలుని విషయమున పౌరాణికుఁడు చేసినట్లు తత్త్వసారమును నాలుగు మాటలలో చెప్పి అది వానికి అర్థమైనదా లేదా అని గమనింపక వదలివేయుట అక్రమము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters