Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

నాల్గవయధ్యాయము - సత్సంగఫలము

కంఠమును కౌగిలించుకొని ఇట్లు పలుకుచున్న భర్తను చూచి హేమలేఖ దరహాసముతో నిట్లనెను. ''నాథ! నామాట వినుము. నేను నీయందు విరక్తురాలను కాను. కాని లోకమున ఏది చాల ప్రియము. ఏది ఆప్రియము అని ఆలోచించుచున్నాను. ఏదియు నిశ్చయింప లేక స్త్రీ స్వభావమువలన దానిని గూర్చియే చింతించుచున్నాను. ఇందు తత్త్వమేదియో నీవు చెప్పవలె''. హేమచూడుఁడు పకపక నవ్వి యిట్లనెను. స్త్రీలు మూఢబుద్ధులనుట నిజము. సందియము లేదు. పశువుల పక్షులు కూడ తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలిసికొనుచున్నవి. అవి తమకు ప్రియమైనవానిని సమీపించుచు, అప్రియమైన వానినుండి దూరముగా తొలఁగిపోవుచున్నవి. దేవివలన సుఖము కలుగునో అది ప్రియము. దేనివలన దుఃఖము కలుగునో అది అప్రియము. ఇందులో ఇంత ఆలోచింపవలసిన దేమున్నది?'' అప్పుడు హేమలేఖ ఇట్లనెను. ''స్త్రీలకు విమర్శనజ్ఞాన ముండ దనుట నిజము. కావుననే నీవు చక్కఁగా విమర్శించి నాకు బోధింపవలె. నీవు చక్కఁగా బోధించినచో నేను కూడ ఈచింతనువదలి నీతోఁ గూడి నిరంతరము భోగముల ననుభవింతును. సుఖము నిచ్చునది ప్రియము, దుఃఖమును కలిగించునది ఆప్రియము అని సూక్ష్మముగా విమర్శించి చెప్పితివి. కాని ఒకపదార్థమే ఒక ప్రదేశమునందు ఒకసమయమునందు ప్రియముగా ఉన్నను అదియే ఇంకొక ప్రదేశమున వేఱొక సమయమున అప్రియ మగుచున్నది. ఇదియే ప్రియము. ఇదియే అప్రియము, అని దేనినిగూర్చి నిశ్చితముగా చెప్ప వీలగును? చలికాలమున ఇష్టమైన నిప్పుసెగ, ఎండలకాలమున ప్రియ మగుట లేదు. అట్లే చలిదేశములలో సుఖముగా నుండునెండ ఉష్ణదేశములలో తాపమును కలిగించుచున్నది. పరిమాణభేదముచేత ఒకపదార్థమే ప్రియము అప్రియము కూడ అగుచున్నది. కుంపటిలో నున్ననిప్పును ఎవరైనను ఉపయోగించుకొందురు గాని కార్చిచ్చును ఎవ్వరును కోరరు. ధనము భార్య పుత్రులు రాజ్యము మొదలగునవి యన్నియు ఇట్టివే. ఏదియును ఎల్లప్పుడు ప్రియము కాదు. ధనము భార్యలు పుత్రులు రాజ్యము పుష్కలముగా ఉండికూడ మహారాజు ప్రతిదినము ఏదో నొక సమస్యతో చింతించుచునే యుండును. అవియేవియు లేనివాఁడు నిశ్చింతగా నుండుటయు మనము చూచుచునే యున్నాము. సుఖము కొఱకు మనము కోరుచున్న భోగములు కూడ అనంతములుగా నున్నవి. ఎవడును సకల భోగములను పొంది సుఖించుట లేదు. కొంచెము భోగము కలిగినచో సుఖము కలుగదా అని అందువేమో. వినుము. దుఃఖముతో కూడిన సుఖము సుఖమే కాదు. దుఃఖము రెండు విధములుగా నున్నది. శరీరమునందు వ్యాధివలన కలుగుదుఃఖము బాహ్యము. కోరికలవలన మనస్సులో కలుగునది ఆంతరము. మానసికమైన దుఃఖము బలవత్తరమైనది. అదియే యీలోకము నంతను మ్రింగుచున్నది. కోరికయే దుఃఖమను వృక్షమునకు గట్టివిత్తనము. కోరికలకు దాసులైకదా ఇంద్రాదులైన దేవతలుకూడ నిత్యము కార్యనిమగ్ను లగుచున్నారు. కోరిక తీరుచు అందు కొంచెమే మిగిలి యున్నను అప్పుడు కలుగు సుఖము దుఃఖమువంటిదే యగును. అంత కన్నను పశుపక్ష్యాదులకు కలుగుచున్న సుఖమే మేలు. వందలకొలఁది కోరికలు గలమానవునకు ఏదో కొంచెము లభించినప్పుడు సుఖము కలుగు నన్నచో ఇక సుఖము లేనివాఁ డెవఁ డుండును? అట్లు సుఖముండు నన్నచో శరీరమంతయు దగ్ధ మగుచుండఁగా గంధపు నీటిబిందువుచేతనే వానికి దేహము చల్లఁబడి హాయి కలుగునని చెప్పవలసియుండును. ప్రియురాలియొక్క కౌఁగిలివలన మానవుఁడు సుఖమును పొందుచున్నాఁడు. అప్పుడు సంభవించునట్టి శరీరముయొక్కవైషమ్యమువలన సంభోగముయొక్క పరిశ్రమమువలన తుదకు దుఃఖమే కలుగుచున్నది. నాడీసంఘట్టనమువలన కొంచెము సుఖము కలుగుచున్నచో అంతమాత్రపుసుఖము కుక్కలకు లేదా? వానియుందు లేనిసౌందర్యవిశేషము మనుష్యులయం దున్నది? ఆసౌందర్యమును గ్రహించుటవలన మనకు విశేష మైనయానందము కలుగుచున్న దనియందువేని, అదియును అభిమానమువలన కలుగుచున్నదే ఒకఁడు మెచ్చిన సౌందర్యమును మఱియొకఁడు మెచ్చఁడు. పదిమందికి వికృతముగా కన్పించు పురుషుఁడు ఒకానొక స్త్రీకి ప్రియుడు కావచ్చును.

పూర్వము ఒకరాజకుమారుఁ డుండెను. అతఁడు మన్మథుని మించినయందగాఁడు. ఆతనిభార్య కూడ చాల సౌందర్యవతి. అతఁడు ఆమెయందు అత్యంతము ఆసక్తుఁడై యుండెను. ఆమె మాత్రము ఒకభృత్యునియందు ఆసక్తురాలై యుండెను. వాఁడు ఆరాజపుత్రునకు ఎక్కువమోతాదులో మద్యము నొసంగుచు వానికి బాగుగా మత్తు కలిగినతరువాత కురూపిణియైన యొకచేటికను రాజకుమారునియొద్దకు పంపి తాను ఆసుందరితో భోగించుచుండెను. అతిలోకసౌందర్యవతియైన భార్యతో సుఖించుచున్నానని ఆరాజపుత్రుఁడు అనుకొనుచు ధన్యుఁడ నైతి నని తనతో ఎవఁడును సమానుఁడు కాదని తలంచుచుండెను. ఇట్లు చాలకాలము జరిగెను. ఒకనాఁడు దైవయోగమున ఆభృత్యుఁడు పానపాత్రను రాజపుత్రునియొద్ద నుంచి వేఱొకపనిమీఁద త్వరగా పోవలసివచ్చెను. రాజకుమారుఁడు దానిని ఎక్కువగా త్రాగలేదు. కాని వెంటనే పోయి శయనమందిరమునందున్న చేటికతో రమించెను. అతనికి త్వరలోనే మత్తు వదలి పోయెను; వెనుకటివలె నిద్రముంచుకొని రాలేదు. అందువలన శయ్యపై వికృతాకారముతో నున్న చేటికను చూచి, ఇది యేమి అని విభ్రాంతుఁడై, ''నాప్రియురా లెక్కడ?'' అని ప్రశ్నించెను. అది భయముతో గడగడ వణుఁకుచు మాటాడక నిలిచియుండెను. జరిగిన మోసమును గ్రహించి అతఁడు కోపముతో కనులెఱ్ఱబడుచుండఁగా దానిజుట్టు పట్టుకొని కత్తి జళిపించుచు, ''నిజము చెప్పుము. లేకున్నచో నిన్నిప్పుడే నఱకెదను'' అని బెదరించెను. అది ప్రాణభీతితో యథార్థమును చెప్పి భృత్యునితో కూడియున్న యతని భార్యను చూపించెను.

ఒకచోట నేలమీఁద చాపపై మలినదేహుఁడు వికృతమైన ముఖము కలవాఁడు నల్లగా మొరటుగా నున్నభృత్యుఁడు ఒడలుమఱచి నిద్రించుచుండెను. వానిని గాఢముగ కౌఁగిలించుకొని సౌందర్యవతి యైన రాజకుమారునిభార్య నిద్రించుచుండెను. వారిని అట్లు చూచి నంతనే రాజకుమారునకు మూర్ఛ వచ్చినట్లయ్యెను. ఆతఁడు కొంతసేపటికి తన్ను తాను నిగ్రహించుకొని ఏమనుకొనెనో వినుము. ''ఛీ! సురాపానమత్తుఁడ నైననే నెంతమూఢుఁడను! ఛీ! స్త్రీలయందు అత్యాసక్తులగు పురుషులు ఎంత అధములు! ఒకగోరువంక ఒకచెట్టునే ఆశ్రయించియుండదు. అట్లే స్త్రీలును ఒక్కపురుషునే ఆశ్రయించియుండరు. నేను ఎంతగా దున్నపోతువంటివాఁడను కాకున్నచో దీనిని ప్రాణముల కన్న ప్రియురాలినిగా తలంతునా? శరత్కాలమునందలి మేఘము కన్నను స్త్రీలచిత్తవృత్తి చంచలము. ఎవఁడు స్త్రీలను నమ్ముకొని యుండునో వాఁడు నిజముగా అడవిగాడిదయే. స్త్రీస్వభావము ఇట్టిదని ఇప్పటివఱకును తెలిసికొనకుండితిని. కావుననే ఇది నన్ను వదలికురూపుఁడైన భృత్యునితో కూడి కులుకుచు నాయందు ఎంతో భక్తిని నటించుచున్నది. నేను సురాపానమత్తుఁడనై దీనిస్వభావమును రవ్వంతయు గ్రహింపలేక వంచితుఁడనై ఘోరమైన యాకారముగలదానితో క్రీడించుచుంటిని. నిజముగా ఈజగత్తులో నాకన్న మూఢుఁడెవఁడున్నాఁడు? ఇంత వికృతముగానున్న యీనీచభృత్యునియందు ఈదుష్టరాలు ఏమి సౌందర్యమును చూచి తనయందు అత్యంత ఆసక్తుఁడనై యున్న నన్ను వీడి వీనిని గూడుచున్నది?''

ఇట్లు అనేక విధముల విలపించి ఆరాజపుత్రుఁడు అత్యంతము నిర్వేదము నొంది సర్వసంగములను వీడి వనములకు పోయెను. కావున సౌందర్య మన్నది మనస్సులో పుట్టునట్టిది. నేను సుందరినని నీవు నాయందు ఎంత ఆనందమును పొందుచున్నావో అంతకన్న అధికముగా కూడ కొందఱు వికృతముగా నుండు స్త్రీలయందు పొందుచున్నారు. ఇచ్చట నొకవిషయమును శ్రద్ధగా గమనింపుము. పురుషుడు స్త్రీని చూచునప్పుడు ఆమె వానికి వెలుపలనే యుండును. వెలుపల నున్న యామెయొక్క రూపమును అతఁడు తన మనస్సులో చిత్రించుకొనును. ఆరూపమునే అతఁడు మాటిమాటికి భావించుకొనుచు కోరికలను పెంచుకొనుచుండును. ఆకోరికలయొక్క వేగము చేత ఇంద్రియములు క్షోభించుచుండగా ఆమెను కూడి సుఖించుచున్నాఁడు.అట్లు ఇంద్రియుములక్షోభను పొందనివాఁడు ఏసుందరియుందును వాంఛను రతిని పొందుటలేదు. ఇంద్రియక్షోభకు మూలము వాంఛ. వాంఛకు మూలము మనస్సులో ఒక యాకారమును చిత్రించుకొనుట. కావుననే బాలురకు యోగులకు ఎంత సౌందర్యవతిని చూచినను ఇంద్రియక్షోభము కలుగుట లేదు. కావున అందము అన్నది మనస్సులోనే పుట్టుచున్నది. వెలుపలి వస్తువు అందులకు నిమిత్తమాత్రమే. ఏస్త్రీయందు పురుషుఁడు రతిని పొందుచున్నాఁడో ఆమె అందముగా నున్నను లేక మనదృష్టిలో వికారముగా నున్నను వాఁడు ఆమెయందు సౌందర్యమునే భావించుచున్నాఁడు. అత్యంత బీభత్సములైన యాకారములు గలస్త్రీలును పురుషులనుగూడి బిడ్డలను పొందుచున్నారు. ఆస్త్రీలు అందముగా నున్నా రని తోఁచకపోయినచో లేదా చాల వికారముగ నున్నా రని తోఁచినచో ఆపురుషులకు వారియందు రతి యెట్లు సంభవించును?

కావున రాజపుత్ర! వినుము. పురుషునకు స్త్రీయందు ఏర్పడుచున్నయభిమానమే అతనికి సుఖహేతు వగుచున్నది కాని ఆమె సౌందర్యముకాదు. తేనెయొక్క తీపివలె దేహమునందు సౌందర్యము సహజమే అయినచో బాలబాలికలకు ఏల అనుభవమునకు వచ్చుట లేదు? దేశ##భేదములనుబట్టి మనుష్యులు వివిధములైన యాకారములను గలిగియున్నారు. ఒంటికాలు, ఒంటికన్ను, చట్టిముక్కు, మిట్టపండ్లు మొదలగు వికారములు కలవారును పెక్కుమంది కలరు. నీవు నా వలన ఎట్లు సుఖించుచున్నావో వారును అట్లే తమస్త్రీలవలన సుఖించుచున్నారు. స్త్రీశరీరము పురుషులకు, పురుషశరీరము స్త్రీలకు ముఖ్యమైన సుఖసాధనముగా నున్నది. ఈశరీరముయొక్క వాస్తవస్థితి ఎట్టిదో విచారింపుము. ఇది యస్థిపంజరము. ఇది నాడీసముదాయములయల్లికతో రక్తమాంసముల పూతతో చర్మముతో కప్పఁబడి గాదెవలె మలమూత్రములతో నిండియున్నది. ఇది శుక్రశోణితములవలన స్త్రీయొక్క గర్భమునందు ఏర్పడి మూత్రద్వార సమీపమునుండి వెలికివచ్చుచున్నది. ఆహా! ఇట్టి శరీరము కదా ప్రియముగా భావింపఁబడుచున్నది. ఈశరీరమును కోరు చున్నావు కదా! దీనిలోని రక్తమాంసాది భాగములలో ఏది నీకు ప్రియయో చెప్పుము? ఇట్టి బీభత్సమైన శరీరమునందు మనుష్యులు ఆసక్తు లగుచున్నా రన్నచో మలము పైకి ప్రాకుచున్న క్రిములకును వీరికిని భేద మేమున్నది? ఇట్టి వస్తుస్థితియందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎట్లు నిశ్చయింపవచ్చునో చెప్పుము?''

ఈమాటలను విని యాతఁడు ఆశ్చర్యము నొంది ఆలోచించుచు భోగములందు విరక్తుఁ డయ్యెను. పిమ్మట నతఁడు క్రమక్రమముగా ఆమెను ప్రశ్నించుచు తనయందు చిత్స్వరూపిణి యైనపరదేవతను తెలిసికొని అఖిలప్రపంచమును తనస్వరూపముగానే చూచుచు జీవన్ముక్తుఁ డయ్యెను. అతనివలన తత్త్వమును తెలిసికొని తమ్ముఁడు మణిచూడుఁడు, తండ్రి ముక్తాచూడుఁడును జ్ఞానులైరి. ముక్తాచూడుని భార్యయు కోడలివలన జ్ఞానమును పొందెను. మహారాజువలన రాజపుత్రుల వలన ఉపదేశము నొంది మంత్రులు పౌరులు కూడ జ్ఞానవంతులైరి. క్రమముగా ఆనగరమున తత్త్వజ్ఞుఁడు కాని వాఁడెవఁడును లేకుండెను. విశాలమైన యానగరమునందు సంసారవాసనలు శమించి అది బ్రహ్మపురము అను ప్రఖ్యాతి నొంది జగత్తునందు అత్యుత్తమ మైనదిగా ప్రకాశించెను. అచ్చట చిలుకలు గోరువంకలు కూడ పంజరములలో నుండి ఇట్లు పఠించుచుండెను.

''దృశ్యమును వదలి దృక్స్వరూపమైన మీయాత్మను పొందుఁడు. దర్పణమునందు ప్రతిబింబమువలె దృక్కుకన్న అన్యముగా దృశ్యములేదు. దృక్కే దృశ్యముగా నున్నది. నేనును దృక్కే. చరాచరమైన దంతయు దృక్కే సర్వమునకు దృక్కు స్వరూపము అగుటచేతనే సర్వమును భాంసిచుచున్నది. దృక్కు మాత్రము స్వతంత్రముగా ప్రకాశించుచున్నది. కావున జనులందఱును భ్రాంతిని వీడి దృక్కును మాత్రమే గ్రహించుచు సర్వమునకు ఆశ్రయమై భాసించుచున్నదృక్కునే భజింపుఁడు''.

వాసుదేవుఁడు మొదలైన బ్రాహ్మణు లొకసారి అచ్చటికి వచ్చి ఆచిలుకలు పలుకుచున్నవాక్యమును విని, ''ఇందు పక్షులు కూడ విద్యా ప్రసంగమును చేయుచున్నవి. కావున ఇది విద్యానగరమే'' అని పలికిరి. అప్పటినుండి అది విద్యానగరముగా ప్రసిద్ధ మయ్యెను.

కావున రామా! సర్వశుభములు కలుగుటకు సత్సంగమే మూలము. హేమలేఖయొక్క సంగమమువలననే ఆనగరములోని వారందరఱు తత్త్వవేత్తలైరి. అందువలన శ్రేయస్సునకు శ్రేష్ఠమైన సాధనము సత్సంగమే యని తెలిసికొనుము.''

ఇది జ్ఞానఖండమునందు హేమచూడోపాఖ్యానమున సత్సంగ ఫలమున్నది చతుర్థాధ్యాయము.

బాలప్రియ

హేమలేఖ భర్తకు తత్త్వమును బోధంచినది. ఆమెవలన అత్తగారును తత్త్వమును తెలిసికొనెను. హేమచూడునివలన తండ్రి. అన్న మొదలగు పెద్దవారు తత్త్వమును తెలిసికొనిరి. అందువలన చిన్నవారివలన, స్త్రీలవలన కూడ తత్త్వమును తెలిసికొనవచ్చు నని వ్యక్తమగు చున్నది.

హేమలేఖ తత్త్వమును బోధింపఁచూచినప్పుడు తనజ్ఞానమును ప్రకాశింపఁజేయలేదు. ఆమె ప్రియము ఆప్రియము అనువానినిగూర్చి చర్చ మొదలుపెట్టి హేమచూడుఁడు లోకవ్యవహారమునుగూర్చి ఆలోచించునట్లుచేసినది. అతనికి జిజ్ఞాస కలిగి ప్రశ్నించుట మొదలుపెట్టిన తరువాత సమాధానములు చెప్పుచు తత్త్వమును బోధింప మొదలు పెట్టినది. భార్యభర్తృభావమునందు వర్తనమునందును ఆమె ఎట్టి భేదమును పొందలేదు. మఱియును స్త్రీలకు స్త్రీలు. పురుషులకు పురుషులు తత్త్వమును బోధించియుండుట గమనింపఁదగియున్నది.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters