Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

దత్తాత్రేయ సందర్శనము

పరశురాముఁడు దత్తాత్రేయుని సందర్శించుటకై బయలుదేరి మార్గమధ్యమున లోకవ్యవహారమునుగూర్చి ఆలోచించుచు ఇట్లనుకొనెను. "అయ్యో! నేను ఇంతవఱకును దేనినిగూర్చి ఆలోచింపవలయునో ఆముఖ్యవిషయమునుగూర్చి ఆలోచింపకుంటిని. ప్రవాహమునఁబడి కొట్టుకొనిపోవుచున్నవానివలె ఎటుపోవుచున్నానో ఎందులకు పోవుచున్నానో తెలియకయే అందఱతోపాటు నేనును వ్యవహారము చేయుచున్నాను. గ్రుడ్డివాని వెంటఁబోవు గ్రుడ్డివారివలె జనులందఱును ఒకరిని జూచి మఱియొకరుగా వ్యవహారములలో మునిఁగి పోవుచున్నారు. తాముచేయుచున్నపనికి పర్యవసానము ఎట్లుండునో తెలిసి కొనకయే జనులు వ్యవహరించుచున్నారు. ఎవనికైన ఒకనికి ఏదో కొంచెము ఫలము దైవికముగా సంభవించుట చూచి తమకును అట్టిఫలమే అంతకన్నను అధికముగాలభించునను పేరాసతో శక్తికి మించిన పనులకుపూనుకొని ఆపదలను కూడ పొందుచున్నారు. ఇది యంతయు ఎరను చూచి దాని కొఱకు గాలమున చిక్కుకొనుచున్న చేపయొక్క వర్తనమువలెనే యున్నది. అట్లుకాక యీదిక్కు మాలిన సంసారమునందు సుఖ మేమున్నది?

దేవతలనుండి క్రిమికీటకములవఱకు అందఱును సుఖము పొందవలయు ననియే మిగుల పూనికతో వ్యవహరించుచున్నారు. నాలుక వలన కలుగురునచి మైధునము వలన సుఖము క్రిమికీటకములతో సమానముగానే త్రిలోకాధిపతికిని కలుగుచున్నది. భౌతికమైన యీదేహము కొఱకే సర్వము కోరఁబడుచున్నది. ఇది మలమూత్రమాంసాది పూర్ణమై కుత్సితమై దుఃఖమూలమై యున్నది. దీనిమూలముననే పుత్రమిత్రకళత్రరూపమైన సంసార మేర్పడుచున్నది. ఇట్టిదేహమునే తన్నుగా భావించుచు దీనికొఱకై పామరుఁడు పండితుఁడు కూడ నింద్యకృత్యమునకు పాల్పడుచున్నాఁడు. దేహము రోగగ్రస్తమై ముసలితనమునందు కృశించి హేయ మగుచుండుట ఇతరులయందు చూచుచుండియు ప్రతివ్యక్తి "నాశరీరము మాత్రము అట్టిబాధలకు లోను గాదు" అన్నట్లు వ్యవహరించుచున్నాఁడు. ఈకుత్సితమైన దేహమునందే స్త్రీలు పురషులు సౌందర్యమును భావించుచు భోగలంపటు లగుచున్నారు. నాలుకయొక్క రుచికి మైధునసుఖమునకు లోఁబడి మానవులు ఎల్లప్పుడు దాపుననే యుండు మృత్యువును గమనింపకున్నారు.

తమజీవితము ఎంత అల్పమైనచో గుర్తింపక ఈమానవులు దీర్ఘకాలమున ఎప్పటికో లభించునట్టి ఫలములను కోరి నిరంతరము పాటుపడుచున్నారు. స్వార్థముకొఱకై వీరు ఇతరులను చంపుటకు కూడ వెనుదీయరు. ఇట్లు కామక్రోధపరాయణులై వీరు పొందు సుఖమేమి? అల్పసుఖమునకై వీరు అధికదుఃఖమునే పొందుచున్నారు. వీరి యాశలకు అంత మెక్కడ? ఆశ యున్నంతవఱకు సుఖ మెక్కడ? మనస్సు కామహత మగుటయే మహాదుఃఖము. సర్వసంపదలతో సామ్రాజ్యము లభించినవానికైనను సుఖ మెక్కడిది? వానిని ఇంకను పెంపొందించుకోవలె ననునాశవలన, శత్రువులు హరింతు రేమో అనుభయమువలన సమ్రాట్టులకు కూడ ఎల్లప్పుడు దుఃఖమే కలుగుచున్నది. ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుచున్నారు. వానికొఱకే మిత్రులు శత్రువు లగుచున్నారు; పుత్రలు తండ్రులపై తిరుగఁబడుచున్నారు; ప్రియురాలు ప్రియునకు ద్రోహ మొనర్చుచున్నది. భార్యాపుత్రులు కూడ ధనవంతునకు మృత్యువును కోరుచున్నారు. అట్లు మృత్యువులో సమానమైన ధనమును కోరుచు మానవులు కుటుంబమును తమచుట్టు గూడువలె అల్లు కొని అందులో చిక్కువడి వెలుపలికి రాలేక తన్నుకొనుచున్నారు.

ఎవఁడు ఏకుటుంబముతో ఎట్టి సంబంధమును ఎంతకాలము కలిగియున్నను ఒకప్పటికి వియోగము పొందక తప్పదు. కాని దారాపుత్రులతో సంబంధము అత్యంతస్థిర మైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని మనుష్యులు తుదకు మహాదుఃఖమును పొందుచున్నారు. ధనములు జనములు మొదలుగా సర్వము అత్యంతబలిష్ఠమైన మృత్యువుచేత ఆక్రమింపఁబడి యున్నది కావున మనశ్శాంతిని కోరునట్టి బుద్ధిమంతుఁడెవఁడును వానియందు ఆసక్తి నొందరాదు. ఏది ప్రాప్తించినచో భయమే యుండదో అట్టిపదమునే మతిమంతుఁడు కోరుకొనవలె. కావున అభయము నొసంగు విజ్ఞానముకొఱకు నేను మహానీయుఁడైన దత్తాత్రేయునే ఆశ్రయించెదను."

ఇట్లు ఆలోచించుకొనుచు పరశురాముఁడు గంధమాదనమునకు పోయి అచ్చట ఒక పర్ణశాలను చూచి యదియే దత్తాత్రేయూని నివాసస్థానమై యుండు నని దానిసమీపమునకు పోయెను. అక్కడ ద్వారమునందు ఒకబ్రాహ్మణుఁడు ధ్యాననిమగ్నుఁడై యుండెను. ఆయనకు భంగము కలుగకుండ భార్గవుఁడు కొంతసేపు దూరమున నిలిచి, ఆయన కనులు తెఱచినతరువాత సమీపించి నమస్కరించి, "దత్తాత్రేయగురువర్యునియాశ్రమ మెక్కడ నున్నదో దయతో చెప్పుము" అని అడిగెను.ఆయన "శ్రీదత్త గురువులయనుగ్రహముచేత-నీవు వచ్చినపని నాకు తెలియును. వారు లోపలనే యున్నారు. పొమ్ము" అని పలికెను.

అంతట పరశురాముఁడు లోనికిపోయి మహాయోగులచే పరిమృతుఁడై యున్నదత్తాత్రేయుని చూచి సాష్టాంగముగ ప్రణమిల్లి లేచి కృతాంజలియై కొంచెము దూరమున నిలచి ఆయనను పరికింపఁజొచ్చెను. ఆయన పరమసుందరమైన రూపముతో సర్వలోకమనో హరుఁడై యుండెను. లక్ష్మీసమానురాలైన యొకసుందరి ఆయనను కౌఁగిలించుకొని యుండెను. ఆయన యెదుట మద్యపూర్ణమైనకుంభ ముండెను. ఆదృశ్యమును చూచి పరశురాముఁడు విస్మయము నొంది, "ఇది చిత్రముగా నున్నది. వీరందఱు పరమసాత్త్వికులుగా నున్నారు. ఈయన ఏమో యిట్లన్నాఁడు. ఇది తనస్వరూపమును మఱుఁగు పఱచుటకై ఈమహాయోగి కల్పించిన దృశ్యమైన యుండును. మాహానుభావుఁడైన సంవర్తుఁడు యోగీశ్వరుఁడు కానివానిని గురువునుగా నిర్దేశింపఁడు. ఏమయినను ఈయనయే నాకు గురువు" అని నిశ్చయించుకొని నిలిచియుండెను.

అప్పుడు దత్తాత్రేయుఁడు పరసురాముని చూచి ఇట్లనెను "ధార్గవా! నీకు స్వాగతము. కుశలముగా నున్నావా? స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నముగా సాగుచున్నావా? నీవు తపస్సుచేత పుణ్యలోకములను జయించితివి. భార్గవవంశమునకు ప్రతిష్ఠ కలిగించితివి. నీవు బ్రహ్మచర్యవ్రతనిష్ఠుఁడవు. ధన్యుఁడవు. నిజముగా ఇంద్రియములను జయించుటయే పురుషార్థము. వానిని జయింపలేనివారు బ్రతికి యుండియు చచ్చినవారితో సమానమే. పూర్వము నేను వైరాగ్యము వలన కర్మానుష్ఠానమును వదలితిని. కాని జిహ్వాచాపల్యమును స్త్రీ భోగమును వదలఁజాలనైతిని. అయ్యా! ఆత్మశత్రువులలో ఈరెండే బలిష్ఠములైనవి. వీనిచేతనే ఎంతోమంది పతనమును పొందినారు ఎవఁడు వీనిని జయించునో వాఁడు సర్వమును జయించినట్లే. బుద్ధి భ్రంశమును కలిగించు కల్లును వారయువతిని నేను వదలకుండుటను చూచి చాలమంది సజ్జనులు నాసహవాసమును వీడి తొలగిఁపోయినారు ఇట్టి నాయొద్దకు నీవేల వచ్చితివి? నిజము చెప్పుము."

అప్పుడు పరశురాముఁడు సంవర్తుఁడు చెప్పిన విషయమును స్మరించి, "ఈయన నన్ను పరీక్షించుటకై ఇట్లు మాటాడుచున్నాఁడు" అని గ్రహించి వినయముతో ఇట్లనెను. "భగవానుండా! నేను శరణా గతుఁడును. నన్ను నీవుశంకింప వలదు. నేను నీమహిమ నెఱుంగుదును. ఆత్మాజ్ఞానము నొసంగుగురువే సాక్షాత్తుగా శివుఁడు. ఇతర గురువులతో నాకు పనిలేదు. సంసారదావాలనముచేత దహింపఁబడుచున్న నాకు దయతో చిత్త శాంతిని అనుగ్రహింపుము."

దత్తాత్రేయుఁడు ప్రసన్నుఁడై ఇట్లనెను. "వత్సా! భార్గవా! ఆత్మపదమును తెలిసికోవలయు ననునీతలంపు చాల మెచ్చఁదగినది. లోకములో జనులందఱు సుఖభోగమునుగూర్చియే ఆలోచింతురు. ఆత్మసంగతి ఎవరికి కావలసియున్నది? సరే! ఇంతకును నీకు ఏమి కావలయును?" పరశురాముఁడు, "అయ్యా! ఈలోకమున మానవుల నుండి దేవతలవఱకు ఎల్లరును ఆశాజ్వాలలతో తపించుచున్నారు. నేను తమయొక్క అనుగ్రహముచేత ఆతాపమునుండి విముక్తుఁడనై గంగాప్రవాహమున చల్లఁగా హాయిగా ఓలలాడు మదగజమువలె సుఖమును పొందఁగోరుచున్నాను. అట్టి శాంతి సుఖము దేనివలన కలుగునో ఆవిజ్ఞానమును నాకు బోధింపుఁడు" అని పలికెను.

ఆమాటలకు సంతోషించి దత్తాత్రేయుఁడిట్లు చెప్పను. "భార్గవా! నీవు శ్రేయస్సునకు మూలమైనదానినే కోరుచున్నావు. పరమేశ్వరియొక్క కృప నీయందు ప్రసరించినది. లేకున్నచో నీకిట్టి తలంపు కలుగదు. ఇంక వినుము. పరమశివుఁడే సకల ప్రాణులకు ఆత్మ. ఆపరమాత్మను గుర్తించినచో సంసారమోహము నశించి తాపము పోయి శాంతిసుఖము కలుగును. ఆజ్ఞానము పరమేశ్వరి యొక్క కృపవలన తప్ప మఱియొక విధముగా కలుగదు. ఆమెను భక్తితో సేవించినచో ఆమెకృప కలుగును. ఆమెయందు గాఢమైన భక్తి కలుగవలయు నన్నచో ఆమె మాహాత్మ్యమునువినుచు కీర్తించు చుండవలయును. ఆశ్రద్ధవలననే నీయభీష్టము సిద్దించును"

పరశురాముఁడిట్లనెను. "అయ్యా! తమరు చెప్పుచున్నయాత్రి పురాదేవి ఎవరు? ఆమె ఎట్లుండున? ఆమె స్వభావమెట్టిది? ఆమె దేనిని ఆశ్రయించి యుండును? ఇది యంతయు నాకు వివరముగా చెప్పుము"

అప్పుడు దత్తాత్రేయుఁడు ఆపరమేశ్వరిని స్మరించి నమస్కరించి ఇట్లు చెప్పెను. "రామా! ఆమె యిట్టిదని చెప్పుటకు ఎవరికిని శక్యము కాదు. శాస్త్రములు మొదలగు ప్రమాణములచేత సర్వమును తెలిసికొనుచున్న చిచ్ఛక్తియే ఆమె. జీవులయందు స్ఫురించుచున్న "నేను" అను స్ఫురణచేతనే ఆమె గుర్తింపఁదగియున్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుఁడు మహావిష్ణువును సేవించుచుండగా ఇంద్రాదిదేవతలు కలహించుకొనుచు వచ్చి, "మాలో అధికుఁడెవరో నిశ్చయింపు" మని విష్ణువు నడిగిరి. వారు తనమాటను విశ్వసింప రని ఆయన శివుని స్మరించెను. శివుఁడు సాక్షాత్కరించి ఆవివాదమును పరిష్కరించుటకై పరమేశ్వరిని ప్రార్థించెను. ఆమె భయంకరమైన శబ్దముతో కోటిసూర్యసమానకాంతితో సాక్షాత్కరించెను. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆమెకు ప్రణమిల్లి బహువిధముల స్తుతించిరి. దేవత లందఱుమూర్ఛిల్లిరి. ఆమె వారి ననుగ్రహించుటకై లోకోత్తరమైన సౌందర్యముతో త్రిపురసుందరీరూపమును పొంది ఆ దేవతలపై కరుణావలోకనమును ప్రసరింపఁజేసెను. అప్పుడు వారందఱు నిద్రనుండి మేల్కొన్నట్లుగా లేచిరి.

ఇంద్రుఁడు "ఆమె ఎవరో కనుఁగొని రండు" అని అగ్ని మొదలగువారిని ఒక్కొక్కరిని పంపెను. అగ్ని ఆమెయొద్దకు పోయి "ఓకుమారి! ఎవరు నీవు? ఏమి నీశక్తి?" అని గద్దించెను. ఆమె ఒకగడ్డిపఱకును చూపి, "చేతనైనచో దీనిని కాల్చుము" అని పలికెను. అగ్ని దానిని కొంచెము కూడ కాల్చలేక సిగ్గుపడి తిరిగివచ్చెను. వాయువు కూడ దానిని కదలింపలేక మరలివచ్చెను. ఇట్లు అనేకులు భంగపడిరి. తుదకు ఇంద్రుడు వజ్రాయుధమును గైకొని బయలుదేరెను. ఆమె వానివంక చిఱునవ్వుతో చూచెను. తక్షణమే ఇంద్రుడు స్తంభించి పోయెను. దేవత లందఱు భయపడి పెద్దగా ఆక్రోశించిరి. అప్పుడు ఇంద్రుఁడు భయపడి బృహస్పతినిస్మరించెను బృహ్సపతి వ్చచి ఆమెను స్తవమొనరించెను. ఆమె ప్రసన్నురాలై ఇంద్రునకు స్వస్థతను కలిగించి దేవతలస్తోత్రములకు సంతోషించి ఇట్లు చెప్పెను. "మీరు గర్వమును వీడుఁడు. మీరు ఎవ్వరును అధికులు కారు. ఈజగత్తు అంతయు నాశక్తివలననే జన్మస్థితిలయములను పొందుచున్నది. నేనే బ్రహ్మవిష్ణుమహేశ్వరులను సృష్టించి జగత్కార్యమునందు నియోగించితిని. కావున మీరందఱు ఆత్రిమూర్తులకు లోఁబడి నాశాసనము ననుసరించి భక్తితో జగత్తుయొక్క కార్యమును నిర్వహింపుఁడు."

ఇట్లు పలికి ఆపరమేశ్వరి అంతర్ధానము నొందెను. ఇంద్రాదులు త్రిమూర్తులకు ప్రణమిల్లి ఆమెను స్తుతించుచు తమస్థానములకు పోయిరి. భార్గవా! ఆమె ఈవిధముగా దేవతలకు కలిగినమోహమును నశింపఁజేసెను."

బాలప్రియ

ఇచ్చటికి వచ్చునప్పుడు పరశురాముఁడు మార్గమున లోకమును గూర్చి విమర్శించుకొనుచు జిహ్వాచాపల్యము స్త్రీసుఖము అనునవియే పతనకారణము లని తలంచుచుండెను. ఆదోషములకే తాను లోఁబడి యున్నట్లుగా దత్తాత్రేయుఁడు పరశురామునకు గోచిరంచుటయే కాక పరుశురామునియొక్క ఇంద్రియజయమును పొగడి తాను ఇంద్రియములను జయింపలేదని చెప్పెను. అయినను పరసురామునియందు "నేను ఇంద్రియములను జయించితిని" అనునభిమానము పైకి రాలేదు. అనఁగా అప్పటికి ఆయనయందు వీరత్వాభిమానముతోపాటు "నేను బ్రహ్మచర్యవ్రతధుర్యుఁడను; చాల పవిత్రుఁడను" అనునభిమానము కూడ తొలఁగిపోయిన దన్నమాట. అందువలననే దత్తాత్రేయుని మరల పరీక్షింపబూనుకొనక సంవర్తునిమాటపై పూర్ణవిశ్వాస ముంచి దత్తాత్రేయునకు శరణాగతి గావించెను. అట్లు శరణాగతుఁడై శిష్యుఁడైన తరువాతనే పరశురామునకు దత్తగురువు బోధింప నారంభించెను.

దత్తాత్రేయుఁడు కుశలప్రశ్నలు వేయునప్పుడు "స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నముగా సాగుచున్నవా?" అని ప్రశ్నించుగ గమనింపఁదగియున్నది. యథార్థముగా తత్త్వము నెఱింగినవారు సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచారముల నిరసింపరు. అవి చిత్త శుద్ధికి సాధనములు, అందువలన తమయొద్దకు ఎవరైనను తత్త్వము తెలిసికొనుటకే వచ్చినను, మహాత్ములు, "అనుష్ఠానములు, ఆచారములు ముఖ్యము కాదు. విచారమే ముఖ్యము" అని తత్‌క్షణమే వారికి జ్ఞానబోధ చేయుటకు పూనుకొనరు. అంతేకాదు. ఉపనిషత్తులలో జిజ్ఞానువులు, మహర్షులను తత్త్వమును తెలుపుఁడని ప్రార్థించినపుడు ఆమహర్షులు "ఇచట బ్రహ్మచర్యవ్రతము నాచరించుచు కొంతకాలముండుఁడు. తరువాత మీప్రశ్నలకు సమాధానములు చెప్పఁబడును" అని నియమములను విధించినసందర్భములును అనేకములు కలవు, కావున శిష్యులను వారి వర్ణములకు ఆశ్రమములకు తగినయాచారము లందు ప్రవర్తింపఁజేయుట సరియైనయాచార్యునకు ముఖ్యలక్షణము.

బ్రహ్మము మహాభూతముగా గోచరించి అగ్నికి వాయువునకు గర్వభంగ మొనర్చుట కేనోపనిషత్తనందు కలదు. ఇంద్రుడు సమీపించినపుడు ఆభూతము అదృశ్యమైన కన్యరూపమున హైమవతిగా గోచరించి 'అభూతము బ్రహ్మ' అని చెప్పెను. ఆకథయే యిందువిశే షముగా వర్ణింపఁబడనది.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters