Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

మూఁడవయధ్యాయము - సత్సంగమాహాత్మ్యము

భార్గవరాముఁడు మిగుల కుతూహలముతో దత్తాత్రేయు నిట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా తమరు చెప్పినది నిజము అవిచారమువలననే జను లన్నివిధముల నశించుచున్నారు. విచారమువలన శేయస్సు కలుగు ననియు తమరు నిరూపించినారు. కాని యిందు నాకొక పెద్దసందేహము కలుగుచున్నది. ఆవిచారమును పొందుట యెట్లు? దానికి సాధన మేమి? అది సహజమే యైనచో ఎల్లరును దానిని గూర్చి ఏల వినుట లేదు? నా కైనను అది యొప్పటివఱకు ఏల కలుగలేదు? నాకన్నను అధికమైన దుఃఖముకు పొందినవారు జీవితములో అడుగడుగున ఆపదలు పొందినవారు అనేకు లున్నారు? వారందఱును ఈవిచార మనుసాధనమును ఎందులకు పొందుట లేదు? దయతో చెప్పుఁడు.''

అప్పుడు మరల దత్తాత్రేయుఁడు సంతోషించి యిట్లనెను. ''నాయనా! వినుము. సత్పురుషులతో సమాగమమే సకల దుఃఖములను తొలఁగించి శ్రేయస్సునకు మూలకారణ మగును. పరమార్థ మనుఫలము లభించుటకు సత్సంగమే బీజ మని చెప్పుదురు. నీవు కూడ మహాత్ముఁడైన సంవర్తునియొక్క సమాగమమువలననే శ్రేయస్సునకు మూలమైన యీదశను పొందితివి? సత్పురుషులు సమీపమునకు వచ్చినంత మాత్రముననే మనకు పరమసుఖమును కలిగింతురు. సత్పురుషులతో సహవాసములేకుండ ఎవఁడు ఎప్పుడు పరమశ్రేయస్సును పొందినాఁడు? లోకమునందు ఎవఁడు ఎట్టివానితో కూడి యుండునో వాఁడు నిస్సంశయముగా అట్టిఫలమునే పొందును. ఈవిషయమున ఒకకథను చెప్పెదను వినుము.

పూర్వము దశార్ణ దేశమును ముక్తాచూడుఁడనురాజు పాలించుచుండెను. అతనికి హేమచూడుఁడు మణిచూడుఁడు అని యిరువురు పుత్రులుండిరి. రూపవంతులు విద్యావంతులు గుణవంతులు అయిన వారిరువురు ఒకనాఁడు సేనలతో కూడ వేటకొఱకు సింహవ్యాఘ్రాదులతో భయంకరమైన సహ్యపర్వతముయొక్క వనమునకు పోయిరి. వారు అచ్చట వాడియైన బాణములతో మృగములను సంహరించుచుండఁగా పెద్దగాలి బయలుదేరి ఇసుకను ఱాలను కర్షమువలె కురియఁజొచ్చెను. ఆకాశము దుమ్ముతో నిండిపోయి అమావాస్య రాత్రివలెనయ్యెను. ఆమహాంధకారమున సైన్యమంతయు చెల్లాచెదరయ్యెను. రాజపుత్రులును చెరియొకదిక్కుగా పరువెత్తిరి.

హేమచూడుఁడు ఒకతాపసాశ్రమమును చేరెను. సుందరమైన యా యాశ్రమమున అతఁడు బంగారువర్ణమున అగ్నిశిఖవలె ప్రకాశించుచున్న యొకకన్యను చూచెను. ఆసుందరిని చూచి అతఁడు నవ్వుచు ''ఎవరు నీవు? నిర్జనమైన భయంకరమైన యీవనమునందు ఎట్లు నివసించుచున్నావు? ఇచ్చట మీవా రెవరున్నారు? ఒంటరిగా ఎట్లుందువు?'' అని యడిగెను. ఆమె యిట్లనెను. ''రాజపుత్రా! నీకు స్వాగతము. ఈయాసనముపై కూర్చుండుము. అతిథులను పూజించుట తపస్వులకు ధర్మము. నీవు తీవ్రమైనగాలిచే బడలియున్నావు. గుఱ్ఱమును ఖర్జూరవృక్షమునకు కట్టివేసి కొంచెము విశ్రమింపుము. తరువాత నావృత్తాంతమును విన్పింతును.

హేమచూడుఁడు అట్లే గావించిన పిమ్మట ఆమె అతనికి ఫలములతో రసములతో ఆతిథ్య మొసంగెను. అతఁడు విశ్రాంతి నొంది సుఖాసీనుఁడై నతరువాత ఆమె మధురముగా ఇట్లు చెప్పెను. ''రాజకుమారా! శివభక్తుఁడైన వ్యాఘ్రపాదుఁ డనుమునివర్యునకు నేను ధర్మముచేత పుత్రికను. నాపేరు హేమలేఖ. ఆయన తపోబలము చేత పుణ్యతమములైన లోకములను ఆర్జించి మునినాయకులచే పూజింపఁబడుచుండెను. ఒకనాఁడు విద్యత్ర్పభ అనువిద్యాధరి ఇక్కడ నున్న వేణానదియందు స్నానమొనరింప వచ్చెను. అప్పుడే సుషేణుఁడు అను వంగదేశపురాజు కూడ అచ్చటికి వచ్చి స్నానము చేయుచున్నయామెను చూచి మన్మథవశుఁడయ్యెను. పిదప అతఁ డామెను తన్ను వరింప ప్రార్థించెను. ఆమెయు వానిసౌందర్యమునకు మోహితయై వానితో సంగమించెచు. అతఁడు వెడలిపోయిన తరువాత జరిగిన యపచారమును గ్రహించి, భర్తను తలంచి ఆమె యత్యంతభీతయై సద్యోగర్భమున జన్మించిననన్ను ఇచ్చటనే వదలి వెడలిపోయెను. సంధ్య నుపాసించుటకై నదికి వచ్చిన వ్యాఘ్రపాదుఁడు నన్ను చూచి కరుణించి తెచ్చి పెంచెను. నేను ఆయనకు ధర్మపుత్రికనై పితృసేవాపరాయణనై యున్నాను. ఆయనయొక్క మహిమవలన దుష్టుబుద్ధులైనచో దేవదానవులుకూడ ఈయాశ్రమమును ప్రవేశింపఁజాలరు. ఎట్లేని ప్రవేశించి రేని నశింతురు. కావున నాకు భయ మేమియు లేదు. ఇది నావృత్తాంతము. కొంచెము సేపుండుము. మాతండ్రి రాగలఁడు. ఆయనను దర్శించి ప్రణమిల్లి అభీష్టమును పొంది రేపు ఉదయము పోవచ్చును.''

ఆమెమాటలను విని సౌందర్యమోహితుఁ డయ్యును అతఁడు మాటాడలేకుండెను. అతనియవస్థను గ్రహించి ఆమె ''రాజపుత్రా! ధైర్యమును వహింపుము. ఆయన ఇప్పుడే రాఁగలఁడు. వెంటనే నీయభీష్టమును తెలిపి ప్రార్థింపుము'' అని పలికెను. ఇంతలో పత్ర పుష్పాదులను గైకొని వ్యాఘ్రపాదుఁడు చనుదెంచెను. హేమచూడుఁడు లేచి ఆయనకు ప్రణమిల్లి పేరు చెప్పకొని ఆయన కూర్చుండు మనఁగా కూర్చుండెను. ఆయన యోగదృష్టితో వానివృత్తాంతమును అభిలాషను గ్రహించి యోగ్యుఁడే అని నిశ్చయించి ఆమెను అతనికి పత్నిగా నొసంగెను. హేమచూడుఁడు చాల సంతోషము నొంది ఆమెను గైకొని నగరమునకు పోయెను. ముక్తాచూడుఁడు హేమలేఖను చూచి చాల సంతోషించి గొప్పవైభవముతో విధియుక్తముగా వివాహమును జరిపించెను.

అంతట హేమచూడుఁడు ఆమెతో కూడి సౌధములందు వనములందు నదీతీరములందు భోగపరుఁడై క్రీడింపఁజొచ్చెను. ఆమె ఆతనివలె భోగములందు ఆసక్తి నొందకుండెను. ఆమె ఎల్లప్పుడును ఉదాసీనురాలుగా నుండుటను గమనించుచు హేమచూడుఁడొకనాఁడు ఏకాంతమునందు ఆమెతో నిట్లనెను. ''నేను నీయందు అత్యంతము అనురాగము కలిగియున్నాను. కాని నీకు నాయందు అనురాగము లేదా? ఏల భోగములయందు ఎప్పుడును ఆసక్తిని పొందకున్నావు? నీకు అభీష్టములైన భోగములు ఇచ్చట లేవా? చాల శ్రేష్ఠములైన భోగములయందు కూడ నీవు అనాసక్తితోనే వర్తించుచున్నావు. నీవు అనాసక్తవుగా ఉన్నచో భోగములందు నాకు మాత్రము ఆనందమెట్లు కలుగును? నేను నీయందు ఎంతఆసక్తి కలిగియున్నను నీవు నాయందు మనస్సు లేనిదానవుగా నున్నావు. నేను పలకరించినను నీవు వినిపించుకొనవు. నేను నిన్ను గాఢముగా కౌఁగిలించుకొని చాలసేపైనను ''మీరు ఎప్పుడు వచ్చితిరి?'' అని అడుగుచున్నావు. ఇట్టి దాంపత్యమునందు కొయ్యబొమ్మతోడి సాంగత్యమునందువలె సుఖమెట్లుండునో చెప్పుము. నీయభిప్రాయ మేమో తెలుపుము. నిజము చెప్పవేని నామీఁద ఒట్టు.''

ఇది జ్ఞానఖండమున సత్సంగమాహాత్మ్యమను తృతీయాధ్యాయము.

బాలప్రియ

&#హేమలేఖ తల్లియగు విద్యుత్ర్పభ కన్యకాదు. ఆమెకు భర్త యున్నాఁడు. అందువలననే ఆమె సుషేణునితో సంగమించిన తరువాత భయపడుచు పుట్టినబిడ్డను వదలి భర్తయొద్దకు వెడలిపోయినది. తన తల్లి యొక్క వ్యభిచారమును, అందులో కూడ తనపుట్టుకకు కారణమైన వృత్తాంతమును హేమలేఖ హేమచూడునకు నిస్సంకోచముగ తెలిపినది. దీనివలన ఆమెయొక్క సత్యపరత్వము ఎంత గొప్పదో, హృదయము ఎంత నిర్మలమో వ్యక్తమగుచున్నది. సకల ధర్మములలో సత్యము శ్రేష్ఠము. సకల జీవులలో సత్యపరాయణులు ఉత్తములు. కావుననే హేమచూడుఁడు మాత్రమే కాక ముక్తాచూడుఁడు మొదలగువారు కూడ ఆమెను మిగుల ఆదరించిరి.

హేమలేఖ జీవన్ముక్తురాలు. ఆమెకు సంసారాభిలాష లేదు. వ్యాఘ్రపాదుఁడు కూడ హేమచూడునియందు హేమలేఖపై వాంఛయున్నట్లు గమనించెనే కాని హేమలేఖ యభిప్రాయమును గమనింపలేదు. హేమలేఖ కూడ వివాహమును నిరాకరింప లేదు. ఆమెకు వివాహ మొనర్చి భర్తయొద్దకు పంపవలసిన బాధ్యత వ్యాఘ్రపాదునకు ఏర్పడినది. లేకున్నచో ఆమెసౌందర్యమును చూచి ఎవరైనను ఆమెను కోరవచ్చును. అప్పుడు వారితో సంఘర్షణ తప్పదు. ఆమెకు వివాహ మొనర్చినచో ఆయనకు ఒకపెద్ద బాధ్యత తీరినట్లగును. ఇది గమనించియే ఆమె తనకు సంసారము అక్కఱ లేకున్నను వివాహమునకు అంగీకరించినది. మఱియును జీవన్ముక్తులు వ్యవహారమును ఆత్మకన్న అన్యముగా చూడరు. అందువలన వ్యవహారముచేత వారికి బంధముకలుగదు.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters