Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

పందొమ్మిదవయధ్యాయము -

జ్ఞానులస్థితి భేదములు

భార్గవుఁడు మరల దత్తాత్రేయు నిట్లు ప్రశ్నించెను. "భగవానుఁడా! ఆత్మను గోచరింపఁజేసికొనుటకు ఉపాయమైన జ్ఞానము అందఱకును ఒకటియే కదా. దానివలన కలుగుమోక్షము కూడ ఒకవిధము గానే యుండును. అట్టియెడల బుద్ధియొక్క భేదములనుబట్టి జ్ఞానముయొక్క పరిపక్వతయందు భేదము ఎట్లు కలుగును? జ్ఞానముయొక్కసాధనములందు భేద మున్నదా? వివరింపుము."

దయానిధియైన దత్తాత్రేయుఁడిట్లు చెప్పెను. "రామా! ఇది ఉత్తమమైన రహస్యము. చెప్పెదను. వినుము. జ్ఞానమునందు భేదములు లేవు. సాధనములయొక్క తారతమ్యములవలననే ఫలప్రాప్తియందు భేదము లేర్పడుచున్నవి. సాధన పూర్తియైనంతనే, చక్కఁగా పండినపండు పైనుండి రాలి యొడిలో పడినట్లుగా, జ్ఞానము అనాయాసముగా సిద్దించును. సాధనయొక్క అపూర్ణతయందలి తారతమ్యము చేత శ్రమయందును (Effort) తారతమ్యము కలుగుచున్నది. జ్ఞానము స్వప్రకాశ##మై ఎప్పుడును సిద్ధమైన యున్న దగుటచే, నిజమునకు, దానిని పొందుటకు ఏసాధనయు అక్కఱలేదు. ఎల్లప్పుడును భాసించుచున్న స్వరూపమును పొందుటకు సాధనములతో పని యేమున్నది? దానిని ఆవరించియున్న వాసనమాలిన్యమును తొలఁగించుటకే సాధనములన్నియు ఉపయోగపడుచున్నవి. అనంతములైన వాసనలు అనుబురదయందు మునిఁగియుండుటచేత స్వరూపము గోచరించుట లేదు. చిత్తమును నిరోధించుట అను జలముల చేత ఆవాసనాపంకమును చక్కఁగా కడిగివేయవలయును. అనాదికాలముగా "దేహేంద్రియములే నేను" అను గాఢమైన భావనతో చిత్తము రూపొందియున్నది. తత్త్వవిచారము అను తీక్షణమైన యంత్రముచేత, మననముతో కూడిన శ్రవణము అను ఉపాయముచేత పెట్టెవలె నున్నచిత్తమును తెఱచినచో తత్‌క్షణమే మణివలె స్వరూపచైతన్యము గోచరించును. కావున సాధనలన్నియు వాసనలను తొలఁగించుటకే ఏర్పడియున్నవి. పూర్వజన్మపుణ్యమునుబట్టి చిత్తములయందు వాసనలు కొందఱకు అధికముగా మఱికొందఱకు తక్కువగా నుండును. ఈభేదములనుబట్టి బుద్ధియందు భేదములు కలుగుచున్నవి. ఎంతవఱకు వాసనలయొక్క సమూహము బుద్ధిని ఆవరంచియుండునో అంతవరకును సాధన ఆవశ్యకమే.

వాసనలు అనేకవిధములు. వానిలో ముఖ్యమైనవానినిచెప్పెదను వినుము. అపరాధము కర్మ కామము అని వాసన మూఁడువిధములుగా నున్నది. అశ్రద్ధయే అపరాధము. వినాశమును కలిగించుటలో ఇది ముఖ్యమైనది. శాస్త్రము ఆచార్యుఁడు వచెప్పచున్నవిషయము సర్వథా సత్యము అను దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అట్టి విశ్వాసము లేకుండుట అశ్రద్ధ. దీనివలననే విపరీతగ్రహణము సంభవించుచున్నది ఉన్నదానిని ఉన్నట్లు గ్రహింపలేక విరుద్ధముగా గ్రహించుట విపరీతగ్రహణము. కళలు శాస్త్రములు యోగములు మొదలుగు వానియందు నిపుణులైనవారు కూడ సత్పురుషులతోడి సహవాసమును కలిగియుండియు అశ్రద్ధవలననే విపరీతగ్రహణమునకు లోనై తత్త్వమును తెలిసికొనలేకపోవుచున్నారు. వీరు అనేకవిధములుగా ఉన్నారు. కొందఱు నిర్విశేషమైన పరతత్త్వమే లేదని చెప్పుదురు. అట్టిదొకటి యున్నను దానిని తెలిసికొనుట ఎవనికిని ఎచ్చటను శక్యము కాదు అని మఱికొందరు చెప్పుదురు. నిదిధ్యాసనముచేత ఆత్మజ్ఞానమును పొందిన వారు కూడ కొందఱు "ఇది పరతత్త్వము కాదు. దీనికి మించినదియు కలదు" అని తలంచుచుందురు. మఱికొందఱు ఈయాత్మజ్ఞానమువలన మోక్ష మెట్లు కలుగునని వాదించుచుందురు. ఇదికాక శాస్త్రాచార్యవాక్యములను సంశయించుట కూడ విపరీతగ్రహణమే. యగును. శాస్త్రములయందు నిపుణులైనవారు వందలకొలఁదిగా వేలకొలఁదిగా ఈ యపరాధవాసనచేతనే సంసారమున పడిపోవుచున్నారు.

పూర్వజన్మలయందును చేసిన దుష్కర్మలయొక్క సంస్కారము బుద్ధియందు మాలిన్యముగా నుండును. ఆమాలిన్యము గురువు ఉపదేశించుచున్న విషయమును గ్రహించుటకు ప్రతిబంధకమగును. అట్టి వారు గురువు ఎంత చక్కఁగా చెప్పుచున్నను గ్రహింపఁజాలరు. దీనిని కర్మవాసన యందురు. ప్రాణాయామాదులచేత కూడ దీనిని జయించుట సాధ్యముకాదు.

"కర్తవ్యము ఇంకను నాకుమిగిలియున్నది." అని అనుకొనుటయే కామవాసన దీనిక అనేకశాఖలు కలవు ఇది అనంతము. సముద్రములో తరంగములను గాని భూమిలో రేణువులను గాని ఎవఁడైనను లెక్క పెట్టవచ్చునేమో గాని, ఒకవ్యక్తి యొక్క కామముల నైనను లెక్కపెట్టుట సాధ్యము కాదు. ఆశాపిశాచముగా చెప్పఁబడుచున్నయీకామవాసన ఆకాశముకన్న విశాలము, పర్వతముకన్నను స్థిరము. దీని చేతనే లోకమున ప్రతివ్యక్తియుఉన్మత్తునివలె అగుచున్నాఁడు. దీని చేతనే దహింపఁబడుచు జనులు ఆక్రందించుచున్నారు. పరమవైరాగ్యమును పొంది ధన్యులైనవారు ఎవరో కొందఱు మాత్రమే ఈయాశఅనుదావానలమునకు దూరులై చల్లఁగా నుందురు.

ఈమూఁడు వాసనలు మనస్సును ఆక్రమించియుండుటచేతనే తత్త్వము భాసించుట లేదు. కావున సర్వసాధనములకు ఈవాసనలను నశింపఁజేయుటయే ఫలము.

"అశ్రద్ధారూపమైన యీయపరాధమువలననే నాకు జ్ఞానము కలుగుటలేదు." అని తెలిసికొని శాస్త్రాచార్యులవాక్యములందు శ్రద్ధను పొందుటవలన మొదటివాసన తొలఁగిపోవును. రెండవదియైన కర్మవాసన ఈశ్వరానుగ్రహముచేతనే తొలఁగవలె. ఇతరములైన కోట్లకొలఁదియుపాయములచేత కూడ అది తొలఁగదు. ఈశ్వరారాధనము చేయుచున్నచో ఆకర్మవాసన అల్పముగా నున్నచో ఈజన్మమునందే ఈశ్వరానుగ్రహము కలిగి అదినశించును. అది ప్రబలముగా నున్నచో అనేక జన్మలలో ఈశ్వరారాధనము చేయుచుండుటవలన నశించును. ప్రబలమైనవ్యాధి తొలఁగిపోవుట బహుకాలము ఔషధమును సేవించుట ఆవశ్యకమే కదా! ఇక మూఁడవదియైన కామవాసన వైరాగ్యాది సాధనమువలనన నశించును. సంసారసుఖములయందలి దోషమును నిరంతరము చూచుచుండుటవలననే వైరాగ్యము కలుగును. మఱియొక్క విధముగా అది కలుగనే కలుగదు.

ఈవాసనలయొక్క అల్పత్వమునుబట్టి ప్రబలత్వమునుబట్టి వైరాగ్యాదిసాధనములను కూడ అల్పముగా ప్రబలముగా అవలంబింపవలనసియుండును. వీనిలో సర్వసాధనములకు మూలము ముక్తికావలయునను గాఢమైనతపన. ఒకనిని నీటిలోముంచినప్పుడు వానిని ఊపిరాడక నీటిలోనుండి బయటపడవలయునని ఎట్లు గిలగిల తన్నుకొనుచుండునో ఆవిధముగా సంసారమునుండి బయటపడవలయు నని మొకానొకనికి కలుగు తపనయే ముముక్షుత్వము. అది లేకున్నచో శ్రవణమననాదులు పాండిత్యసంపదగా పరిణమించునేగాని ముఖ్యఫలము నొసంగవు. ఆ పాండిత్యమంతయు శవమునకు కావించినయలంకారమువలె వ్యర్థము. ముముక్షుత్వము కొద్దికా ఉన్నను ఉపయోగములేదు. వ్రతములయొక్క ఫలశ్రుతిని వినునప్పుడు ఆవ్రతమును చేసి ఆఫలమును పొందవలయుననుకోరిక సామాన్యముగా చాలమందికి కలుగును. అంతమాత్రమైన కోరికతో అందఱు ప్రయత్నమును చేయరు; ఫలమును పొందరు కావున తీవ్రత లేని ముముక్షుత్వమువలన ఉపయోగము లేదు. ఎవనికి ముముక్షుత్వము ఎంత తీవ్రముగా నుండునో వానికి ఫలము కూడ అంతవేగముగనే సిద్ధించును. ముముక్షుత్వము కలవాఁడే అన్నింటిని వదలుకొని ఆత్మజ్ఞానమునందే తత్పరత్వము కలవాఁడగును. దేహమంతయు తాపముతో ఉడికిపోవుచున్నప్పుడు ఎవ్వఁడును చల్లఁదనము తప్ప దేనినికోరఁడు. అట్లే "ముక్తి తప్ప నాకేమియు వలదు" అని తీవ్రమైనకోరిక కలిగినవానికి ఫలముకూడ త్వరగా లభించును. విముక్తి తప్ప తక్కినవన్నియు దుష్టములు అను దృష్టివలననే విముక్తియందు తీవ్రమైనకోరిక కలుగును. దోషదృష్టివలన విషయసుఖములయందు ప్రీతి నశించి వైరాగ్యము కలుగును. వైరాగ్యమువలన విముక్తి కావలయు ననుకోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణమననాదుల యందు తీవ్రమైన ప్రవృత్తి కలుగును. దానివలన త్వరగా ఫలము లభించును."

భార్గవుఁడు ఇదివిని మరల ప్రశ్నించెను. "అయ్యా! సత్సంగము ఈశ్వరానుగ్రము దోషదృష్టి ముక్తిని కలిగించుటకు మూలకారణము లని చెప్పితిరి. వీనిలో ముఖ్యమైన ఆదికారణమేది? అది ఎట్లు ప్రాప్తించును? నిష్కారణముగా ఏదియు సంభవింప దని కదా పెద్దల నిశ్చయము! కావున ఆయాదికారణ మైనను నిర్హేతుకముగ ఎట్లు కలుగుచ్నది? ఇది వివరించి చెప్పుము."

దత్తాత్రేయుఁడు ఇట్లు చెప్పెను "భార్గవా! శ్రేయస్సునకు ఆదికారణమును చెప్పుచున్నాను. వినుము. కేవలచిద్రూపిణియైన యాదేవితనయొక్క స్వాతంత్ర్యవైభవముచేత, అద్దమునందు ప్రతిబింబము వలె, తనయందు జగత్తు అనుచిత్రమును భాసింపఁజేయుచున్నది. అనాదియైన యజ్ఞానముచేత కప్పఁబడియున్న జీవులయొక్క హితమును కోరుచు ఆమెయే హిరణ్యగర్భశరీరముతో కోరికల నన్నింటిని తీర్చునట్టి వేదసముద్రమును ప్రకాశింపఁజేసెను. 'స్వభావముచేత జీవులు విచిత్రములైన కామవాసనలు కలవారు. వీరికి ఎట్లు శుభము కలుగును?' అని యాబ్రహ్మదేవుఁడు ఆలోచించి విచిత్రములైన ఫలములను కలిగించునట్టి వివిధకర్మలను సృష్టించెను. మనుష్యుడు సహజముగా మంచినో చెడునో చేయుచునే యుండును. దానిచేత పశుపక్ష్యాదిజాతులలో పెక్కుపర్యాయములు జన్మించుచు జీవుఁడు ఏదో ఒకకర్మయొక్క పరిపాకముచేత మనుష్యశరీరమును పొందును. అప్పుడు అతఁడు పెక్కుకోరికలు కలవాఁడై "స్వర్గమును కోరువాఁడు యజ్ఞమును చేయవలయును" అని మొదలుగా వేదశాస్త్రములయందు చెప్పఁబడియున్న కర్మలనుగూర్చి విని వానిని చేయుటకు పూనుకొనును. ఆకర్మలలో రవ్వంత లోపము కలిగినను ఫలము కలుగ దని గ్రహించి దుఃఖితుఁడై, 'ఇప్పుడేమి చేయఁదగు' నని యొకానొక సత్పురుషుని ఆశ్రయించును. అప్పుడు ప్రసంగవశమున మహేశ్వరునియొక్క మహాత్మ్యమును అతఁడు వినును. అంతట పూర్వపుణ్యవశమున ఆ సత్పురుషునియొక్క అనుగ్రహముచేత ఈశ్వరుని ఆరాధింపవలయునను తలంపు కలుగును. కావున పూర్వపుణ్య పరిపాకమువలననే శ్రేయస్సు అనుసౌధముయొక్క సోపానపంక్తిలో ఒకమెట్టుగా సత్సంగమును పొందును. శ్రేయస్సు చాలవఱకు సత్సంగమువలననే సంభవించుచున్నది. ఒకానొకచోట చాల గొప్ప పుణ్యముచేతఁగాని తీవ్రమైన తపస్సుచేతఁగాని శ్రేయస్సు కలుగుటయు కలదు. అట్టియెడల ఒకప్పుడు పైనుండి రాలి పండు పడినట్లుగా ఆకస్మికముగా శ్రేయస్సు ప్రాప్తించుటయు కలదు కావున కారణములయొక్క వైచిత్య్రమును బట్టి శ్రేయస్సుయొక్క ప్రాప్తియందు కూడ చిత్రములైన భేదములు కన్పించుచున్నవి.

అట్లే బుద్ధియందలిభేదములచేత వాసనయొక్క తారతమ్యము వలన సాధనములయందలి విశేషములనుబట్టి జ్ఞానులయొక్క స్థితియందును వైచిత్ర్యము కన్పించుచున్నది. సహజముగా ఎవనియొక్క బుద్ధి యందు వాసనలు తక్కువగా నుండునో వానికి అల్పమైనసాధనచేతనే జ్ఞానము సిద్ధించును. ఎవనియొక్క బుద్ధియందు వాసనలు దట్టముగా నుండునో వానికి జ్ఞానము కలిగినను అది మేఘముచేత కప్పఁబడిన సూర్యబింబమువలెనే యుండును. వాఁడు చిరకాలము నిదిధ్యాసనము కావించుచున్నచో వానికి జ్ఞానము నిర్మలముగా భాసించును. ఈకారణముచేత జ్ఞానులయొక్క స్థితి అనేకవిధములుగా కన్పించుచున్నది. జ్ఞానులకు పరస్పరము స్థితిభేదము ఎట్లుండునోచూడుము. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు స్వభావముచేత జ్ఞానులే! వారియొక్క జ్ఞానమునందు మాలిన్యము ఉండు నని చెప్పుటకు వీలులేదు. కాని స్వభావమువలన కలుగుచున్న గుణములచేత వారిస్థితియందు కలుగుచున్న భేదములను చూడము. గుణములయొక్క భేదమునుబట్టి తెల్లగానున్న జ్ఞానియొక్క శరీరము నల్లదనమును ఎట్లు పొందుటలేదో అట్లే ఆయనయొక్క చిత్తస్వభావము కూడ మార్పునొందఁదు. జ్ఞానులముగా అత్రికుమారులను మమ్మేచూడుము. దుర్వాసుఁడు చంద్రుఁడు నేనును భిన్నస్థితులయందున్నాము. దుర్వాసుఁడు కోపము కలవాఁడుగా, చంద్రుఁడు కామము కలవాఁడుగా నుండగా నేను వర్ణశ్రమాది చిహ్నములను అన్నింటిని వదలియున్నాను. వసిష్ఠుఁడు కర్మిష్ఠుడై యుండగా సనకాదులు సన్యాసులై యున్నారు. నారదుఁడు భక్తి పరుఁడుకాఁగా శుక్రుఁడు కవిత్వముచెప్పుచు దైత్యుల నాశ్రయించి యుండఁగా బృహస్పతి దేవతలకు గురువై యున్నాడు. వ్యాసుఁడుశాస్త్రనిర్మాణపరాయణుఁడు కాఁగా జనకుఁడు రాజ్యము చేయుచున్నాఁడు. జడభరతుఁడు సర్వసంగ పరి త్యాగి యయ్యెను.

ఈస్థితిభేదములకు కారణము వినుము. అపరాధము కామము అనువాసనలకన్న కర్మవాసన బలిష్ఠము. అది ఎవరియందు పూర్తిగా నశించునో వారు మేధావులని చెప్పఁబడుచున్నారు. వారికి అపరాధవాసన యుండనే యుండదు. ఇంక కామాదివాసన లున్నను అవి జ్ఞానమునకు ప్రతిబంధకములు కావు. అట్టివారికి వైరాగ్యము మననము సమాధి మొదలగువానితో పనిలేదు. వారు ఒక్కసారి తత్త్వమునువిన్నంతనే అప్పుడే కొంచెము మననధ్యానములు చేసికొని నిస్సందేహముగా ఆత్మను తెలిసికొని జనకాదులవలె జీవన్ముక్తు లగుచున్నారు. వారు అంతకు పూర్వము వైరాగ్యాదులను అభ్యసించి కామాదివాసనలను పోఁగొట్టుకొనియుండలేదు. అందువలన ఆవాసనలు వారియందు పూర్వమువలెనే పైకివచ్చుచుండును. వారికి ఆవాసనల వలన ఏసందర్భమునందును బుద్ధికి మాలిన్యము కలుగదు; వారు స్వరూపమునుండి తొలఁగుటయు సంభవింపదు. వీరిని ఉత్తమజ్ఞాను లని విద్వాంసులు చెప్పుదురు. ఇంక కర్మవాసనచేత మూఢమైనచిత్తము కలవారికి సాక్షాత్తుగా ఈశ్వరుఁడు బోధించినను జ్ఞానము కలుగదు. దృఢమైన యపరాధవాసన కలవారికి కూడ జ్ఞానము కలుగదు. ఎవరికి అపరాధకర్మ వాసనలు అల్పముగా నుండి కామవాసనలు అధికముగా నుండునో అట్టివారికి అనేకపర్యాయములు శ్రవణమనననిదిధ్యాసనములు సలుపుటవలన చాలకష్టముతో చిరకాలమునకు జ్ఞానము కలుగును. వీరికి వ్యవహారము స్వల్పముగా నుండును. వీరు ఎక్కువకాలము సమాధియందే గడుపుచుందురు. మనననిదిధ్యాసనాదుల యభ్యాసముయొక్క అతిశయమువలన వీరికి మనస్సు ఇంచుమించుగా నశించినట్లే యగును. ఇట్లు నష్టప్రాయమైన మనస్సుకల జ్ఞానులు మధ్యములని చెప్పఁబడుదురు. వీరిలో కొందఱకు మనననిదిధ్యాసనముల యభ్యాసము దృఢముగా నుండకపోవుటచే వాసనలు క్షీణింపవు; మనస్సు నశింపదు. వీరికి శ్రవణమువలన జ్ఞానము కలిగినను అది కామక్రోధాదివాసనలచేత మాటిమాటికి కప్పఁబడుచుండును. ఇట్టివారిని సమనస్కులని మందజ్ఞానులని అధమజ్ఞానులని చెప్పుదురు. ఉత్తములు మధ్యములు అయిన వారు మాత్రమే జీవన్ముక్తులని చెప్పఁబడుదురు.

అధములైన కేవలజ్ఞానులు ప్రారబ్ధమునకు అధీనులై సుఖదుఃఖముల ననుభవించుచు దేహాంతమునందు ముక్తిని పొందుదురు. మధ్యమజ్ఞానులు ప్రారబ్ధమును జయింతురు. మనస్సు అనుభూమిలో ప్రారబ్ధ మనుబీజము భోగరూపమున అంకురించును. కాని వీరికి మనస్సు నశించిపోవుటచేత ఆప్రారబ్ధబీజములు గాదెలో అడుగున పడియుండు ధాన్యనపుగింజలవలె మొలకెత్తక క్రమముగా నశించిపోవును.

ఉత్తమజ్ఞానులకు బహుమానసు లనియు పేరు కలదు. ఎవరికి యొక్క మనస్సు ఆత్మరూపమై బాహ్యవిషయములందు ప్రసరించుచు ఆయావస్తువులయొక్క రూపమును పొందుచున్నను ఆత్మరూపమును కోల్పోవదో వారు బహుమానసులు. ఒక మనస్సు ఇన్ని రూపములతో ఎట్లుండు నని శంకిపవలదు. మిగుల మేధావి యైనవాఁడు ఒక్కొక్కప్పుడు ఏకకాలమునందే అయిదాఱుకార్యములను, దేనియందును తొట్రుపడక, నిర్వహించుచున్నాఁడు ఒకఁడు నడచుచు మాటాడుచు పని కూడ చేయుచుండును. ఒక్కగురువు శిష్యులనేకులు వేదములు వల్లెవుయుచున్నప్పుడు వారిలో సంభవించు అపశబ్దములను వర్ణస్వరభేదములను గుర్తించుచున్నాఁడు. నీవు సహస్రబాహుఁడగు కార్తవీర్యుని జయించితివి గదా! అతఁడు ఏకకాలముననే అనేకవిధములైన యాయుధములను అనేకబాహువులతో గైకొని ఏయాయుధముయొక్క ప్రయోగమునందును పొరపాటుపడక యుద్ధము చేయుచుండుటను నీవు చూచియే యుంటివి. అట్టివారియొక్క మనస్సు వారు నిర్వహించుచున్న కార్యములపద్ధతి ననుసరించి అనకవిధములుగా రూపొంది ఆయాకార్యములను ఏకకాలమునందే నిర్వహించుచున్నది. అట్లే ఉత్తమజ్ఞానుల యొక్క మనస్సు కూడ బాహ్యమున పెక్కుపదార్థముల రూపములను పొందుచున్నను ఎల్లప్పుడు ఆత్మస్వరూపమునకు విరుద్ధము కాకుండ నుండును, అనఁగా వారికి స్వరూపవిస్మృతి ఎప్పుడును ఉండదన్న మాట, వారినే బహుమానసులందురు. వారియొక్క మనస్సునందు ప్రారబ్ధబీజములు సుఖరూపముననో దుఃఖరూపముననో అంకురించుచుండగనే జ్ఞానము అనునగ్ని వానిని దగ్ధమొనర్చుచుండును. మొలకయే నశించినప్పుడు చెట్టుఉండదు; ఫలమసలే యుండదు. సుఖదుఃఖములు అనునంకురములకు హర్షశోకములు ఫలములు. సుఖమో దుఃఖమో తోఁచుచున్నంతనే "ఇది నాస్వరూపముకాదు" అని త్రోసివేయుచున్నచో సుఖమువలన హర్షము కాని దుఃఖమువలన శోకము కాని కలుగదు. అనఁగా సుఖదుఃఖములు భాసించుచనే కాని అవి ఫల మొసంగవు లక్షరూప్యముల బహుమతి వచ్చిన దని తెలియుట సుఖము, అది కలిగినంతనే బంధుమిత్రులకు చెప్పి విందులతో వినోదములతో ప్రసంగములతో సంతోషించుట హర్షము. లక్షరూప్యములు నష్టము వచ్చిన దని తెలియుట దుఃఖము. అది కలిగనంతనే పదిమందితో చెప్పుకొని విలపించుచు దిగులుపడి యుండుట శోకము. పామరులకు సుఖమువలన హర్షము, దుఃఖమువలన శోకము కలుగుచుండఁగా జ్ఞానికి సుఖదుఃఖములు పుట్టినవెంటనే నశించును; అందువలన హర్ష శోకములు కలుగవు. మఱి లోకమున జనులు సుఖమును పెంపొందించుకొనుటకు దుఃఖమును తొలఁగించుకొనుటకు వ్యవహార మొనర్చు చున్నారు. సుఖదుఃఖములు పుట్టినవెంటనే నశించుచున్నచో జ్ఞానికి లోకమున వ్యవహారమెట్లు జరుగుచున్నది? వారు ఇతరులతో వ్యవహరించునప్పుడు ఆవ్యవహారమునకు ఆవశ్యకములైన భావములను కల్పించుకొనుచుందురు. పెద్దవాఁడు చిన్నపిల్లవానితో చేరి యాడునప్పుడు గెలిచనపుడు హర్షము ఓడిపోయినపుడు శోకమును ఎట్లు ప్రదర్శించునో అట్లే జ్ఞాని కూడ ఆయావ్యవహారములకు తగిన భావములను ప్రదర్శించుడునే కాని యథార్థముగా హర్షశోకములను పొందఁడు. చదరంగమున ఏనుగులు గుఱ్ఱములు పోయి ఓటమి కలుగుచున్నప్పుడు పిల్లవాఁడు అది అంతయు సత్యమైనట్లే విషాదము నొందును. పిల్లవాని వినోదముకొఱకు ఆడుచున్న పెద్దవానికి ఇదియంతయు అసత్యము వినోదమాత్రము అని రూఢిగ తేలిలయుటచే విషాదము కలుగనేకలుగదు. ప్రపంచము సత్యమను భావము దృఢముగ నుండుటచే ఆవ్యవహారమునందు పామరులు హర్షశోకములు పొందుచున్నారు. 'ప్రపంచము అసత్యము. వ్యవహారము వినోదమాత్రము' అను భావము దృఢముగ నుండుటచే జ్ఞానులకు హర్షశోకములుకలుగవు. అట్లే వారు ఇతరుల కష్టసుఖములయందు సానుభూతిని చూపునప్పుడు విషాదమును సంతోషమును ప్రకటించుచుందురే కాని మనస్సునందు ఏభావమును కలిగియుండరు. ఈవిధముగా వారు వ్యవహారమునందు ఇతరుల విషయములలో వలె తమవిషయములందు ఆసక్తి లేకుండ నుందురు.

మేధావులైన జ్ఞానులు వాసనలను నశింపఁజేసికొనుటకై మనోనిరోధము మొదలగుసాధనలను అవలంభించియుండుకపోవుటచే ఆవాసనలు వినాశము నొందవు. అందువలన వారు పూర్వవాసనలను అను సరించియే వ్యవహరించుచుందురు. ఆకారణముచేతనే కొందఱు కర్మనిష్ఠులుగా, కొందఱు కాముకులుగా, మఱికొందఱు కోపము కలవారుగా కన్పించుచుందురు. పెక్కు విధములైన వర్తనములు వారియందు కన్పించుచుండును.

మనస్సు నశింపక మందజ్ఞానులై యున్నవారు కూడ దృశ్యమంతయు అసత్యమే యని నిశ్చయజ్ఞానమును కలిగియుందురు. సమాధిస్థితియందు వారికి స్వరూపముతప్ప ఇంకఏదియు భాసింపదు. తెంపులేకుండ స్వరూపమును స్మరించుచుండుటయే సమాధి. హఠయోగులు సాధించుస్థితి సమాధికాదు. మఱి హఠయోగులకు కూడ చితక్త నిరోధము వలన జ్ఞానులకువలె నిర్వికల్పమైన యాత్మతత్త్వమే భాసించును. కదా, వారిస్థితిని సమాధి అని ఏల చెప్పరాదు? నిర్వికల్పమైన యాత్మస్వరూపము సర్వమునకు ఆశ్రయమై ఎల్లప్పుడు ఎల్లరకును స్ఫురించుచునే యున్నది. అది స్ఫురింపకపోయినచో ఏదియును భాసింపదు. మఱియును అది వికల్పరహితముగా జాగ్రత్తునుండి నిద్రలోనికి జాఱునపుడు, నిద్రను వదలి జాగ్రద్ధశలోనికి ప్రవేశించుటకు ముందుండుస్థితి మొదలుగా వెనుకఁజెప్పఁబడిన దశలయందు భాసించుచునే యున్నది. అంతమాత్రమున ఎల్లరకును సమాధి కలుగుచున్న దని చెప్పుట లేదు కదా! హఠయోగులకు నిరోధసమయమునందు సమాధి యున్నదన్నచో తక్కినవారికిని పైనచెప్పినదశలలో అది యున్నది. కావున నిర్వికల్పమైన యాత్మతత్త్వవిజ్ఞానము కలవారు విమర్శపూర్వకముగా స్వరూపానుసంధానము చేయునపుడు చిత్తమునకు కలుగు విశ్రాంతినే విద్వాంసులు సమాధి అని చెప్పుచున్నారు. ఇక్కడ ఈవిషయమును గమనింపుము. శ్రవణాదులచేత నిర్వకల్పమైన యాత్మతత్త్వమును ఎఱుంగని హఠయోగులు రెండువిధములుగా నుందురు. కొందఱు పాతంజలయోగమున చెప్పఁబడినయష్టాంగములయొక్క సాధనచేత సిద్ధిని పొందుదురు. మఱికొందఱు ప్రాణామాయముయొక్క అతిశయముచేత కుండలిని సుషమ్న మొదలగువానిని భేదించుచు సిద్దిని పొందుదురు. ఇరువురికిని సమాధిస్థితియందు నిద్రలోవలె సుఖానుభవము ఉండును. ఆస్థితియందు వారికి అజ్ఞానముయొక్క విక్షేపశక్తి తొలఁగి పోవునే గాని ఆవరణశక్తి నశింపదు. జ్ఞానులకు సమాధియందు విక్షేపము ఆవరణము అను రెండును వుండవు. మఱి హఠయోగియొక్క సమాధిస్థితికిని నిద్రకును భేదమేమి? నిద్రయందు మనస్సు తమస్సు యొక్క పరిణామముచేత అమావాశ్యయొక్క చీఁకటియందువలె మూఢమైయుండును. హఠయోగికి సమాధియందు మనస్సు సత్త్వము యొక్క పరిణామముచేత ప్రకాశించుచున్నను ఆత్మతత్త్వము అవిద్యచే ఆవరింపఁబడుటచే, మేఘములచేత ఆవరింపఁబడిన సూర్యునివలె చక్కఁగా ప్రకాశింపదు. మఱిజ్ఞానులకు అవిద్యయొక్క ఆవరణము ఉండదు. అందువలన సమాధియందు వారిమనస్సు సత్త్వపరిణామమును పొందినప్పుడు ఆత్మత్తత్వము, మబ్బులు తొలఁగిపోయిన తరువాత సూర్యునివలె ప్రకాశించును.

ఉత్తమజ్ఞానులు వ్యవహారపరులై యున్నప్పుడు కూడ వారి జ్ఞానము వేద్యములైన విషయములకు సంబంధింపక శుద్ధమై యుండును. సమాధి యనఁగా విషయసంబంధరహితమైన జ్ఞానస్థితియే కదా! కావున వారికి సమాధి సహజముగా నుండును. ఆకాశమునకు నల్లఁదనము అసత్య మని తెలసికొన్నవానియొక్క జ్ఞానము {ఆకాశవిషయమున ఎప్పుడును నల్లఁదనమును పొందదు. అట్లు కానిచో ఆకాశము నకు నల్లఁదనము లేదని తెలసికొన్నవానికి, తెలిసికొననివానికి భేదమే యుండదు. ఎండమావులను తెలిసికొన్నవానికి కూడ అచ్చట నీరున్నట్లే కన్పించుచుండును. అయినను తెలియనివాఁడు ఆనీటికొఱకు పరువెత్తినట్లు తెలిసినవాఁడు పరువెత్తఁడు. అట్లే జ్ఞాని కూడ పదార్థములు అజ్ఞానివలె కన్పించుచున్నను. వానియందు అతనికి సత్యత్వబుద్ధి యుండదు. అందువలన వానిని సంపాదించి సుఖింపవలయు నని అజ్ఞాని తాపత్రయము నొందుచుడఁగా జ్ఞాని వానివిషయమును అసలు పట్టించుకొనఁడు అందువలన ఎండమావులలో నీరువలె వానికిప్రపంచము గోచరించుచున్నను అది అసత్యమని వానికి రూఢిగా తెలియును. కావున వానిజ్ఞానము శుద్ధముగానే యుండును. మనస్సు నష్టమైనజ్ఞానికి వేద్యసంబందము ఉండనే యుండదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆస్థితిని ఉన్మనీదశ అని చెప్పుదురు. విషయములు సత్యములు అనుభావముతో వానిపై ప్రసరించుటయే మనస్సునకు చలనము. మధ్యమజ్ఞానులకు మనోవ్యాపారమే యుండదు. ఉత్తమజ్ఞానులకు వ్యవహారము జరుగుచున్నప్పుడు వారిమనస్సు అసత్యముగా నిశ్చితమైయున్న ప్రపంచమునందు చలించుచున్నట్లు కన్పించుచున్నను అది అత్యంతము నిశ్చలముగానే యుండును. అదియే వారి బహుమానసత్వము. మనస్సులోని యొకభాగముచేత వారు వ్యవహారమును నిర్వహించుచున్నను మఱియొకభాగముచేత నిశ్చలముగా నుందురు. ఆ నిశ్చలస్థితిచేత వారికి సమాధి ఎప్పుడును సహజమై యుండును. ఇది నీవడిగిన జ్ఞానుల యొక్క స్థితిభేదములు.

ఇది జ్ఞానఖండమున జ్ఞానులస్థితిభేదములు అన్నది పందొమ్మిదవయధ్యాయము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters